మూలం : తెలియదు
అనుసృజన : చంద్ర ప్రతాప్ కంతేటి
పీటర్సన్ తమాషా మనిషి.
అతను చేసేది వడ్రంగం వ్యాపారం!
మంచాలు, కుర్చీలు, బల్లలు, అల్మరాలు, బీరువాలు ఎన్నో అతని షాపులోనే తయారు చేస్తుంటాడు. చివరికి శవపేటికలు కూడా! ఏ ఆర్డర్ నీ ఊరికే పోనీడు.. పక్కా వ్యాపారి!
ఒక రోజున అతని షాప్ కి వచ్చిన ఇద్దరు కష్టమర్లు పీటర్సన్ తో మెల్లగా “ఏంటో ఇక్కడ ఏదో మురికి వాసనగా ఉంది” అన్నారు.
పీటర్సన్ వాళ్ళకి కావలసిన ఫర్నిచర్ చూపిస్తూనే ముక్కు ఎగబీల్చి “అవును.. ఏ మూలో ఎలక చచ్చి ఉంటుంది” అన్నాడు తేలిగ్గా.
కస్టమర్స్ వాళ్ళకి కావలసినవి కొనుక్కుపోయారు. మర్నాడు వర్క్ షాపులో వాసన మరింత పెరిగింది.
పీటర్సన్ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ షాపుకు వచ్చినవాళ్లు ఇబ్బంది పడసాగారు.
కొంతమందికి పీటర్సన్ మీద అనుమానం వచ్చింది.
అంతేకాకుండా ఇంటి దగ్గర గాని, షాపులో గాని అప్పుడప్పుడు కనబడే వాళ్ళ నాన్న ఇటీవల ఎవరికీ కనిపించడం లేదు.
ఎలాగైతేనేo? ఈ వార్త పోలీసులకు చేరింది.
బిలబిలవారు షాప్ కి వచ్చారు.
వస్తూనే అక్కడి కుళ్ళు కంపు భరించలేక రుమాళ్లు ముక్కులకు అడ్డం పెట్టుకుని “వాట్ ఈజ్ దిస్ ?” అని అడిగారు.
“నథింగ్.. జస్ట్ బాడ్ స్మెల్” అన్నాడు పీటర్సన్.
ఈలోగా ఆ వీధివారంతా అక్కడ గుమికూడేరు.
నిజానికి మూడు రోజులుగా వారంతా పీటర్సన్ షాపులోంచి వస్తున్న కంపుకు అల్లాడుతున్నారు.
గట్టిగా అడుగుదామంటే పీటర్సన్ తిక్కలోడు.
ఎవరినైనా ఎంతమాటైనా అనేస్తాడు. అందుకే అతని నోటికి జడిసి ఎవ్వరూ ఏమీ అడగలేకపోతున్నారు. ఇప్పుడు పోలీసులు వచ్చారనేసరికి అందరూ ధైర్యంగా అక్కడికి చేరుకున్నారు
ఇన్స్పెక్టర్ షాప్ అంతా చెక్ చేయమని పోలీసులకు చెప్పి పీటర్సన్ తో –
“ఇటీవల మీ నాన్న కనిపించట్లేదు .. ఎక్కడికి వెళ్లాడు ?’ అని అడిగాడు.
“చచ్చిపోయాడు” కూల్ గా చెప్పాడు పీటర్సన్.
ఇన్స్పెక్టర్ తో సహా అక్కడ ఉన్న వారంతా ఆ జవాబుకు ఉలిక్కిపడ్డారు.
“ఎప్పుడు చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయాడు?” ఇన్స్పెక్టర్ గొంతు పెగుల్చుకుని అడిగాడు.
“నిన్ననో.. మొన్ననో పోయాడు.. ఎలా పోయాడంటే భూమ్మీద నూకలు నిండాయి కనుక!” అన్నాడు పీటర్సన్ నిర్లక్ష్యంగా.
ఇంతలోనే ఒక కానిస్టేబుల్ “సార్ ” అని గట్టిగా అరిచాడు.
అందరూ అటువైపు చూశారు.
అది మూడు అడుగుల శవపేటిక!
“కంపు ఇందులోంచే వస్తో o ది సార్” అన్నాడు కానిస్టేబుల్.
“స్క్రూలు విప్పండి ..మూత తీయండి” ఆదేశించాడు ఇన్స్పెక్టర్.
పోలీసులు స్క్రూలు తీసే సామాగ్రి కోసం వెతుకుతుంటే పీటర్సన్ చరచరా వెళ్లి తన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ తో మర మేకులు విప్పి, మూత తీశాడు.
ఒక్కసారిగా ఉప్పెనలా కుళ్ళుకంపు అక్కడ వ్యాపించింది.
ఆ పేటికలోని దృశ్యం చూసి అందరూ అవాక్కయ్యారు.
అందులో పీటర్సన్ తండ్రి శవం ఉంది. అది కూడా తొడల వరకే.. తొడల నుంచి పాదాల వరకు నరికిన కాళ్లు శవం పక్కన పెట్టెలోనే పెట్టి ఉన్నాయి.
ఆ దృశ్యం, ఆ కంపు చూసి ఇన్స్పెక్టర్ తో పాటు మరికొందరు వీధి జనులు పక్కకు వెళ్లి వాంతి చేసుకుని వచ్చారు.
కుడి చేత్తో స్క్రూ డ్రైవర్ ని పట్టుకొని ఎడమ అరచేతిలో కొట్టుకుంటూ నిర్లిప్తంగా నిలబడి ఉన్నాడు పీటర్సన్.
ఇన్స్పెక్టర్ తేరుకున్నాక-
“దుర్మార్గుడా మీ నాన్నని చంపేసావా?” అని కోపంగా అడిగాడు.
“నాకు వేరే పనేం లేదనుకున్నారా? నేను ఎందుకు చంపుతాను?” అన్నాడు పీటర్సన్.
“కాళ్లు తెగ నరికావు కదరా తండ్రి” అడిగాడు ఇన్స్పెక్టర్.
“ఆ మాట నిజమే శవ0 – పేటికలో పట్టకపోతే కాళ్లు నరికి పక్కన పెట్టాను.. అదీ తప్పేనా?”
“మరి ఎవరికి తెలియపరచలేదు? అదీగాక ఖననం చేయకుండా ఇక్కడ ఎందుకు పెట్టు కూర్చున్నావు?”
నిలదీశాడు ఇన్స్పెక్టర్.
“ఇవన్నీ చేయడానికి నాకు టైం ఎక్కడుంది? రోజు షాప్ తీస్తూనే బిలబిల కస్టమర్లు వస్తూన్నారు ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందిస్తున్నాను. ఖననం చేసే టైంగానీ ఎవరికైనా తెలియజేసే టైం గానీ ఏది నాకు?” అన్నాడు పెడసరంగా.
“సరే మరి ఆ మూడడుగుల పెట్టెలో పెట్టడం ఏంటి? మీ నాన్న ఆరడుగుల మనిషి కదా?”
“ఈ మూడు అడుగుల పెట్టే మా నాన్న తయారు చేసిందే..”
అంటూ తన తల్లి చెప్పిన విషయం ఇన్స్పెక్టర్ కి ఇలా వివరించి చెప్పాడు పీటర్సన్.
“… నేను పుట్టినప్పుడు చాలా అర్భకంగా పుట్టానట. బతకడనని చెప్పారట వైద్యులు. మా అమ్మ విపరీతంగా ఏడుస్తున్నా మా నాన్న పెద్దగా స్పందించలేదు. వీడు ఎలాగో పోయేవాడే ఏ క్షణంలో అవసరపడుతుందో అని నా కోసం ఈ మూడు అడుగులు శవపేటిక తయారుచేసి ఉంచాడు.
అదృష్టవశాత్తు కొన్నాళ్ళకి నేను రోగాలన్నీ తట్టుకుని దృఢంగా పెరిగాను. అప్పటినుంచి ఆ పెట్టే అలాగే ఖాళీగా పడుoది. దాన్ని ఎవరికీ అమ్మే అవసరం రాలేదు.. అందులోనూ పాతది.. మొన్న మా నాన్న చనిపోగానే అందులో పెట్టి ఖననం చేస్తే సరిపోతుందనుకున్నాను. కానీ పొడవైన మనిషి కనుక .. కాళ్లు నరికి అందులో పెట్టి మేకులు బిగించాను. కుదిరితే నేడో రేపో ఖననం చేయాలని ఆలోచిస్తున్నాను” అని చెప్పాడు.
“ఓరి నీ అసాధ్యం కూల! నీ దగ్గర పెద్దపేటికలు ఉన్నాయి కదా దాంట్లోనే పెట్టొచ్చు కదా నాన్న శవాన్ని? కాళ్లు నరకడం ఎందుకు?”
“ఆ ఎందుకు సార్ కొత్త పేటిక డబ్బు దండగ? ఎలాగో ఇది అమ్ముడుపోవడం లేదు.. పాతది! పైగా ఎవరూ కొనరు.. షాపులో కూడా స్థలం వృధా ! అందుకే ఇలా సరిపెట్టేసాను. ఇక కాళ్లు నరకడం అంటారా.. ప్రాణం పోయాక మనిషికి కాళ్లు నరికితే ఏంటి? తల నరికితే ఏంటి ? నేను చేసింది తప్పంటారా?”
అంటున్న పీటర్సన్ ను ఇన్స్పెక్టర్తో సహా అందరూ విస్తుపోతూ చూశారు.
విశ్లేషణ:
నాకు గుర్తు ఉన్నంతవరకు ఇది గైడీ మపాసా కథ!
కథలో విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మనకు సాధారణంగా అనిపిస్తుంది. లోతుగా ఆలోచిస్తే లేదా విచికిత్స చేసుకుంటే- వాచ్యంగా చెప్పని ఎన్నో సత్యాల్ని, అంశాల్ని పఠిత మనసులోకి ప్రవేశపెడుతుంది ఈ కథ. ఇటీవల ఈ కథ గురించి ఒక మిత్రుడితో చెబితే ” ఇది నాకు నచ్చలేదు .. బ్లాక్ కామెడీ” అని వ్యాఖ్యానించారు. పైపైన చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ వాస్తవం అది కాదు. గొప్ప ట్రాజెడీ! మరుగున పడుతున్న మానవతా విలువలు, క్షీణిస్తున్న కుటుంబ బంధాలు, అనుబంధాలు, పెరుగుతున్న వ్యాపార దృక్పథం అన్ని ఇందులో ఇమిడి ఉన్నాయి. డబ్బు ముందు మిగిలినవన్నీ చివరికి తండ్రి కొడుకుల బంధమైనా చిన్నవే అన్న సత్యాన్ని ఈ కథ వెల్లడిస్తుంది. కచ్చితంగా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా ఎప్పుడో వందేళ్ళ క్రితమే సదరు రచయిత కథ రాశాడు అంటే ఆయన దూర దృష్టిని కొనియాడక తప్పదు అందుకే వాళ్ళు మహా రచయితలు అయ్యారు.
తండ్రికి అంత్యక్రియలు చేయడానికి ఆ కొడుకుకి తీరుబడి లేదు. షాపు మూసేస్తే బోలెడంత ధన నష్టం. ‘చచ్చిన వాడు ఎలాగో చచ్చాడు రెండు రోజులయ్యాక అంత్యక్రియలు చేస్తే ఏం కొంపలు మునుగుతాయి?’ అన్న ధోరణి ఆ కొడుకులో కనబడుతుంది.
ఇప్పుడు అందరిలో కాకుండా కొందరు కొడుకులలో ఇలాంటి భావజాలమే బలపడుతోంది. ఒకప్పుడు blood is thicker than water అనేవారు. ఇప్పుడు money is more valuable than relationships or bondages అని చెప్పుకునే తరుణాన్ని ఎప్పుడో ఊహించిన రచయిత ‘ క్రాంత దర్శి’ అని మనం ఒప్పుకోక తప్పదు.
కృష్ణా జిల్లా తిరువూరు తాలూకా పాత రేపూడి గ్రామంలో జన్మించారు. ఎంఏ తెలుగు సాహిత్యం చదివారు. హైదరాబాదు ఈనాడులో మూడున్నర దశాబ్దాల పాటు పాత్రికేయవృత్తిలో కొనసాగారు. విపుల, చతుర పత్రికల సంపాదకుడిగా పదవీవిరమణ చేశారు. ‘ట్యాంక్ బండ్ కథలు’ కథా సంపుటి వెలువరించారు.
Discussion about this post