ఇంగ్లీషు మూలం: సర్ ఆర్థర్ కానన్ డాయల్
అనుసృజన: శొంఠి జయప్రకాష్
హైదరాబాద్ లో శస్త్రవైద్యుడిగా పేరుగడించిన వ్యక్తి డాక్టర్ డగ్లాస్ స్టోన్.
తానే అందరికంటే గొప్పవాడనే అహంకారం తలకెక్కించుకున్న వాడు.
తన అనైతిక ప్రవర్తనతో అపఖ్యాతిని మూటగట్టుగొన్న స్త్రీ- మిస్ట్రెస్స్ సానోక్ అతిలోకసుందరి. వారిద్దరూ ప్రముఖులే . వాళ్ళిద్దరిమధ్య అనైతికసంబంధం ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే.
ఆ కారణం వల్ల –లోకానికి తన ముఖం చూపించడానికి కించపడి, ‘ ఇకమీదటనుంచి తాను నిరంతరం ముసుగు ధరిస్తాన ’ ని ఒకనాడు ఆమె అకస్మాత్తుగా ప్రకటించింది. ఆమె అందమైన ముఖాన్ని చూసే అదృష్టం ఇక కలగబోదని జనం నిరాశచెందారు.
డాక్టర్ డగ్లాస్ స్టోన్ కూడా అందమైన వాడే. శస్త్రచికిత్స చేయటంలో ఘనుడు. అత్యంత సమర్థుడు. ఆ రంగంలో అతనికతనే సాటి. అతనికి ముప్పైతొమ్మిదేళ్ళ వయసు.
అతనికలవడిన దుర్గుణాలలో ప్రధానమైనది- స్త్రీ బలహీనత. లండన్ నగరం మొత్తానికి అందమైనదిగా పరిగణించబడే లేడీ సానోక్స్ పట్ల పిచ్చి వ్యామోహం పెంచుకొన్నాడు. అటువంటి సౌందర్య రాశి తన వశం కావడమతనికి గర్వకారణం. స్వభావరీత్యా ఆమె కూడా కొత్త కొత్త అనుభవాలను కోరుకునే మనస్తత్వం గల మగువ. అందుక్కారణం– ఆమె భర్త హమీద్ రూపం. ముప్పై ఏళ్ళవాడైనా, యాభైఏళ్ళ వృధ్ధుడిగా అగుపించడం అనేది – కొన్ని కారణాలలో ఒకటి.
హమీద్ – అమిత సంపన్నుడు. నెమ్మదస్తుడు. మితభాషి. వివాదరహితుడు. ఎప్పుడూ తోటపనులలోనూ, గృహసంబంధ విషయాలలోనూ నిమగ్నమై ఉంటాడు. అభినయకళ అతనికి ఇష్టమైన వ్యాపకం. లండన్ లో ఒక థియేటరును అద్దెకు తీసుకొని తన నటనాభిరుచిని తీర్చుకుంటూ ఉంటాడు. లేడీ సానోక్స్ తో పెళ్ళైన తరువాత ఆ వ్యాపకానికి గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం తోటపని చేయడంలోనే అతడు ఆనందాన్ని వెతుక్కుంటూంటాడు.
భార్య దుష్ప్రవర్తన గురించి నిజంగా అతనికి తెలియదా? లేక అతనిలో వివేకం నశించిందా? షండుడైపోయాడా? తెలిసీ ఆమెను క్షమించేశాడా?– అనే ప్రశ్నలకు జవాబు ఎవరికీ దొరకలేదు. అతనికున్నటువంటి సమస్య అర్థం కానిదిగా ఉండిపోయింది. కాఫీ హోటళ్ళలోనూ, క్లబ్బుల్లోనూ అతని వైఖరి గురించిన చర్చే ప్రధానాంశమైంది. విచిత్రమేమిటంటే హమీద్ మీద– సానోక్స్ కు ఏ మాత్రం అనుమానం కలుగ లేదు.
రాను రాను డగ్లాస్ స్టోన్ ప్రవర్తన హద్దులు దాటిపోయింది. ఆ కారణంగా ఉన్నట్టుండి ఒక ప్రతిష్టాత్మక సంస్థ అతన్ని ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించింది.
‘అత్యంత గౌరవప్రదమైన వైద్యవృత్తిలో ఉంటూ నీచమైన స్థాయికి దిగజారిన నీలాంటి వాడు మా సంస్థలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగడం మాకు అవమానం. ‘ అని అభిశంసించారు. అదేమీ పట్టించుకోకుండా డగ్లాస్ అదేరోజు- ఖరీదైన ఉంగరాన్ని కొని లేడీ సానోక్స్ ఇంటికెళ్ళాడు. అప్పటినుండి ఆమె ఇంటిలో రోజూ ఠంచనుగా హాజరయ్యేవాడు. ఆమె మధ్యాహ్న సమయంలో అతని కారులో విహారం చేస్తుండేది. వారిమధ్య కొనసాగుతున్న అనైతిక బంధాన్ని దాచడానికి వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. అయితే ఒకానొక చిన్న సంఘటన వారి అనుబంధానికి అంతరాయం కలిగిం చింది.
అదొక దుర్భరమైన చలిరాత్రి. చిరుజల్లు కూడా పడుతోంది. స్వెటర్ తొడుక్కుని డిన్నరు పూర్తిచేశాడు. అతని ముందున్న టేబుల్ మీద ఖరీదైన వైన్ తో నింపబడి ఉన్న గాజు గ్లాస్ ఉంది.
అతను తనలో తానే నవ్వుకుంటున్నాడు.
అతని తోటి వైద్యులు వొద్దువొద్దని వారిస్తున్నా, ఆ రోజు అతిక్లిష్టమైన ఒక శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించాడు. ఆ సంఘటనను తలచుకుంటుంటేనే అనిర్వచనీయ అనుభూతి సందడి చేస్తోందతని మదిలో. లండన్ నగరం మొత్తానికి ఏ డాక్టరుకూ అటువంటి ఆపరేషన్ చేసే నైపుణ్యం, గుండెధైర్యం లేదు. అందుకే డగ్లాస్ ఛాతీ ఉప్పొంగుతోంది.
ఆ రోజు సాయంత్రం 7:30 గంటలకొస్తానని, లేడీ సానోక్స్ కు మాట ఇచ్చి ఉన్నాడు. కారు గారేజ్ వద్దకు వెళ్లబోతుండగా …తలుపు తట్టిన శబ్దం, ఆ వెంటనే గదిలోపలికి వస్తున్న అడుగుల సవ్వడి వినబడ్డాయి. బట్లరు అతని ఎదుట నిలబడిఉన్నాడు వినయంగా.
” ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, సర్.” అని చెప్పాడు బట్లరు.
” అతడేనా పేషెంటు?”
” కాదు సర్. ఎవరో పేషెంటును చూడ్డానికి మిమ్మల్ని బయటకు పిలుచుకువెళ్ళాలని వచ్చాడట.”
” నో నో. ఇప్పుడు సమయం లేదు. నేను వేరే పనిమీద బయటికెళ్ళాలి.”
” ఇదుగోండి అతని విజిటింగ్ కార్డు.” చిన్న బంగారు ట్రేలో ఉంచబడిన ఒక కార్డు కేసి చూపించాడు. ఆ ట్రే ప్రధానమంత్రిచేత బహూకరించబడింది. చదివాడు.
‘ హామీల్ ఆలీ – స్నైరా ‘ అని రాసుంది. అతను నిట్టూర్చి,
” అతను టర్కీ దేశస్తుడై ఉండాలి.”
” అవును విదేశస్తుడి లాగానే కనిపిస్తున్నాడు. అతడు హడావుడిగా, ఉరుకులు పరుగులమీద వచ్చినట్లున్నాడు.”
” నేను వేరే పనిమీద తప్పక వెళ్ళి తీరాలి. సరే చూద్దాం. లోపలికి రమ్మను. ”
పీలగా, బలహీనంగా ఉన్న వ్యక్తి లోపలికి ప్రవేశించాడు.అతని వీపు వెనక్కి వంగిఉంది. ముఖం ముందుకు వంచి కళ్ళుమిటకరిస్తూ నడిచొచ్చాడు. విపరీతమైన హ్రస్వ దృష్టి పీడితుడైనట్టు కనబడుతున్నాడు. ముఖం,వెంట్రుకలు,గడ్డం కారునలుపుతో పోటీ పడుతున్నాయి. ఒక చేతిలో ఎరుపుగీతల తెల్లని తలపాగా పట్టుకొన్నాడు. మరొకచేతిలో చిన్న తోలుసంచి ఉంది.
” మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా?” అడిగాడు డగ్లాస్ .
” అవును. కొంచెం…కొంచెం…” అని బదులిచ్చాడు ఆ ఆగంతకుడు. తరువాత తాను వచ్చిన పనిచెప్పాడు. తన భార్యకు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, డాక్టరే బయటికి రావాలని అభ్యర్థించాడు.అందుకు డాక్టరు-
“నేను ఉదయం రాగలను. ఇప్పుడు వేరే అత్యవసరమైన పని తగిలింది. ఈ రాత్రికి రాలేను. ” అని స్థిరంగా చెప్పాడు డగ్లాస్ స్టోన్.
అప్పుడా టర్కీవాలా తన చేతిలోని తోలుసంచిని తెరచి, అందులోని బంగారు నాణాలను టేబుల్ పైన కుమ్మరించాడు.
” వందబంగారు నాణాలివి. మీరు ఒకే ఒక గంట సమయాన్ని వెచ్చిస్తే చాలు. బయట బండి సిధ్ధంగా ఉంది.” అని
చెప్పాడు.
డగ్లస్ స్టోన్ తన చేతి వాచీకేసి చూశాడు. ‘ నా ప్రేయసి సానోక్స్ ను కలవడానికి ఒక గంట ఆలశ్యమైతే మాత్రమేం? తనకు అందిన ఫీజు ఊహించనంత ఎక్కువ.ఈ మధ్య అప్పులిచ్చిన ఆసాములు చాలా ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి సువర్ణావకాశాన్ని వదులు కోవడం బుధ్ధితక్కువ. నేను ఈ కేసును తప్పక తీసుకొంటాను.’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
” ఏమిటి సమస్య? ” అడిగాడు హమీల్ ఆలీని.
” చాలా బాధాకరమైనది డాక్టర్. మీరు ‘ఆల్మోహడెస్ కత్తుల గురించి వినేఉంటారు.”
” లేదు.”
” అవి తూర్పుప్రాంతానికి సంబంధించిన అతి పురాతనమైన కత్తులు. దాని ఆకారం ప్రత్యేకంగా, మెలిదిరిగిఉంటుంది . నేను సదరు కత్తుల వ్యాపారం చేస్తుంటాను. ఆ నిమిత్తమే నేను స్మైరా నుండి ఇంగ్లాండ్ కొచ్చాను. అయితే వచ్చేవారమే తిరిగి వెళ్ళాలి. వ్యాపార నిమిత్తం వివిధరకాల వస్తువులను కొన్నాను. అందులో కొన్నే మిగిలాయి. వాటిలో ఈ కత్తులు చేరడమే విషాదకరం.”
” నేను అర్జెంటుగా ఒకచోటికెళ్ళాలి. దయచేసి అవసరమైన విషయాల్ని మాత్రమే చెప్పండి” అన్నాడు డాక్టరు అసహనంగా.
“అలాగే డాక్టరు గారూ! ఈ రోజు – ఏ గదిలోనైతే కత్తులు ఉంచానో అదే గదిలోనే నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో పొరబాటున ఒక కత్తి నా భార్యకు గుచ్చుకొని పెదవి కోసుకు పోయింది.”
“ఓహ్! అలాగా! ఆ పెదవికి తగిలిన గాయానికి కట్టుకట్టాలన్న మాట.”
“కాదు కాదు.”
“మరి?”
“ఆ కత్తులు విషపూరితమైనవి. వాటికి పూయబడిన విషమెటువంటిదో? దానికి చికిత్స ఏమిటో? ఎవ్వరూ చెప్పలేరు. ఈ కత్తుల వ్యాపారాన్ని మా తాతలకాలం నుంచీ చేస్తున్నాము. ఆ విషప్రభావం మూలాన దీర్ఘనిద్ర ఆవరిస్తుంది. ముప్పై గంటలలోపు మరణం సంభవిస్తుంది. ఏ మందు వల్లా నయం కాదు. కానీ కత్తి వల్లనే రోగం కుదరగలదు. ”
“ఎలా?”
“విషం నెమ్మదిగా పనిచేసుకుంటూ పోతుంది. విషప్రభావం కొన్నిగంటలపాటు ఉంటుంది. ఆ విషం పాముకాటుకన్నా ప్రమాదకరమైనది.”
“అంటే… గాయం తగిలిన భాగాన్ని కత్తితో కోసివేయాలన్నమాట?”
“ఔను. గాయం వేలిమీదుంటే వేలిని కత్తిరించాలి అని మా నాన్న చెప్పేవాడు. నా భార్యకు పెదవిమీద గాయమైంది.”
“అర్థమైంది. ప్రాణం పోగొట్టుకోవడం కన్నా …పెదవిపోగొట్టుకొవడం మంచిది కదా.”
“అవును డాక్టర్! మీరుసరిగ్గా చెప్పారు. తరువాత ఆమె అదృష్టమెలా ఉంటుందో?… ఫలితమేదైనా అనుభవించకతప్పదు కదా. బండి బయలుదేరడానికి సిధ్ధంగా ఉంది. ఒక నిండుప్రాణాన్ని కాపాడండి ప్లీస్.”
డగ్లస్ స్టోన్ సర్జికల్ కిట్ తీసుకున్నాడు. దూదిచుట్టను, బ్యాండేజి క్లాత్ ను జేబులో కూరుకున్నాడు. అలాగే ఒక ఆకుపచ్చని సీసాను కూడా కోటుజేబులో దూర్చాడు.
“బయట చాలా చలిగా ఉంది. కొంచెం వైన్ పుచ్చుకుంటారా?” అడిగాడు డగ్లస్ స్టోన్.
“క్షమించండి. నేను ముసల్మానని మీరు మర్చిపోతున్నారు. అలాంటి అలవాట్లు లేవు. అన్నట్టు, మీరింతకుముందు పచ్చని సీసాను జేబులో పెట్టుకొన్నారే. అందులో ఏముంది? ” అడిగాడు టర్కిష్.
“క్లోరోఫార్మ్.”
“అదీ వద్దు.అదికూడా నిషిధ్ధం.”
“అంటే మీ భార్యకు మత్తుమందివ్వకుండా ఆపరేషన్ చేయమంటారా?” ఆశ్చర్యం అడిగాడు డాక్టర్.
“ఔను. విషప్రభావమూలంగా ఆమె ఇప్పటికే దీర్ఘనిద్రలోనికి జారుకుంది. నేనిప్పటికే ఆమెకు నల్లమందు తినిపించాను. త్వరగా రండి సార్.”
వాళ్ళిద్దరూ ప్రయాణం సాగించారు.పదిగంటలకు గమ్యం చేరుకున్నారు.
పడకగది రెండో అంతస్తులో ఉంది. ముసలి నర్స్ వెంట నడిచాడు డగ్లస్ స్టోన్.ఒక మూలలో మంచం మీద ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆమె వేసుకొన్న దుస్తులు ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచాయి. ముఖానికి ముసుగు తొడగబడి ఉంది. ముఖం కింది భాగం మాత్రం కనిపిస్తూ ఉంది. ఆమె పెదవి ధనుస్సు ఆకారంలో గోచరమౌతూ,కత్తిగాటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
“ముఖం మీది ముసుగు తప్పనిసరిగా ఉండాలి. మీకు తెలుసు కదా తూర్పు దేశీయ స్త్రీల ఆచారాల గురించి.” చెప్పాడా టర్కీ మనిషి.
అటువంటి సందర్భంలో, డగ్లస్ స్టోన్ దృష్టికి ఆమె ఆడదానిగా కనబడదు. ఒక రోగిగా మాత్రమే కనిపిస్తుంది. అది తాను ఆపరేషన్ చేయాల్సిన కేసుకు సంబంధించిన విధి. కర్తవ్యం. వంగి గాయాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు.
“ఇప్పటికైతే ప్రమాదచిహ్నాలేవీ కనబడడం లేదు. కొంత సేపటివరకూ ఆపరేషన్ వాయిదా వేయొచ్చు.” డగ్లస్ స్టోన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఆ మాటలు వినడంతోటే టర్కీ దేశస్తుడు అసహనంగా అరిచాడు.
“లేదు లేదు. ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని నాకు తెలుసు. ఆపరేషన్ జరూరుగా చేయాలి. అప్పుడే ఆమె ప్రాణాలు నిలుస్తాయి.”
“అయినా కొద్దిసేపు వేచి ఉందాము.”
“వొద్దొద్దు. ప్రతినిముషం విలువైనదే.ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. నా భార్య నా కళ్ళెదుటే మరణించడం చూడలేను. మీరిక్కడిదాకా శ్రమ తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పరిస్థితి విషమించకముందే మరో డాక్టరును చూసుకుంటాను.”
ఆ మాటలతో డగ్లస్ స్టోన్ సందిగ్ధంలో పడిపోయాడు. ఆ కేసును వదులుకొంటే తాను తీసుకున్న నూరు బంగారు నాణాలు వాపసివ్వాల్సుంటుంది. అందుకతను సిధ్ధంగా లేడు. ప్రస్తుతం డబ్బు అతనికి తక్షణావసరం. ఆ టర్కీ వాలా మాటే నిజమై ఆమె చచ్చిపోతే తాను న్యాయస్థానం ముందు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
“మీకు ఇంతకుముందెప్పుడైనా ఈ రకమైన విషంతో అనుభవముందా?”
“అవును”
“ఆపరేషన్ చేసితీరాలా?”
” అవును డాక్టర్! తక్షణం ఆపరేషన్ చేస్తేనే నా భార్య బతుకుతుంది.”
” ఆపరేషన్ తరువాత ఆమె ముఖం పరమ వికారంగా మారిపోతుంది. మీకిష్టమేనా?”
” ఆ విషయం నాకు తెలుసు. ఆ పెదవులను ముద్దుపెట్టుకోవడానికేమాత్రం పనికిరావు. దయచేసి ఆపరేషన్ చేయండి.”
డగ్లస్ స్టోన్ అతని వైపు నిరసనగా, అసహ్యంగా చూశాడు.
ఆమె ముఖం దగ్గరగా ఉంచాడు లాంతరును. అతని రెండు నల్లని కళ్ళు ముసుగు రంధ్రాలనుండి రోగిని చూస్తున్నాయి.సదరురోగి కనుపాపలు మాత్రం కనబడుతున్నాయతనికి.
” నల్ల మందును మోతాదుకు మించి ఇచ్చినట్లున్నావామెకు.”
” అవును.”
మరొకమారు ఆమె కళ్లల్లోనికి చూశాడు. ఆ కళ్ళల్లో ఏదో కొత్త కాంతి కదలాడింది. పెదవులు వొణుకుతున్నాయి.
” ఆమెకు స్పృహ పూర్తిగా పోయినట్లు లేదు.”
” నొప్పి తెలుసుకోకముందే మెరుపువేగంతో కత్తికి పని చెప్పలేరా? ”
అదే ఆలోచనే డాక్టరుకూ వచ్చింది. వెంటనే అతను- ఆమె పెదవులను పటకారుతో పట్టుకొని వాటిని రెండు ముక్కలుగా కత్తిరించేశాడు. కనురెప్పపాటులో జరిగిపోయిందా కత్తిరింపు ప్రక్రియ.
మంచం మీదున్న స్త్రీ భయంకరమైన కేకవేస్తూ మంచం మీద ఎగిరిపడింది. అప్పుడు ఆమె ముఖం మీది ముసుగు చిరిగిపోయింది. ఇప్పుడామె ముఖం బయటికి కనపడింది.
అది డగ్లస్ కు తెలిసిన ముఖమే. రక్తంలో ఓలలాడిన ఆ ముఖాన్ని గుర్తుపట్టాడు
ఆ సమయంలో ఆ స్త్రీ బాధతో– ఆమె ముఖం వెయ్యి వంకర్లు తిరిగి వికృతంగా తయారైంది. అంతకంటే పరమ వికృతంగా మారి ఉంది–డగ్లస్ స్టోన్ ముఖం.
కలలో చూస్తున్నట్టుగానో, ఏదో నాటకంలోని దృశ్యం చూస్తున్నట్టుగానో ఉంది డగ్లస్ స్టోన్ కు.
అతని పక్కనే ఉన్న టర్కీ వాలా ధరించిన విగ్గు,కృత్రిమ గడ్డం ఊడిపోయి టేబుల్ మీద పడున్నాయి. టర్కీవాలా గోడకానుకొని నిలబడి చిద్విలాసంగా నవ్వుతున్నాడు.
ఆ సరికి కేకల శబ్దాలు అణగారిపోయాయి.బాధతో వంకర్లు తిరిగిన ఆ స్త్రీ తల– తలగడమీద వాలిపోయింది. డగ్లస్ స్టోన్ అచేతంగా కూర్చుండి పోయాడు. హామీల్ ఆలీ వేషాన్ని తొలగించిన ఆమె భర్త మిస్టర్ సానోక్స్- ప్రశాంతంగా లోలోపలనే నవ్వుకుంటున్నాడు.
డగ్లస్ స్టోన్ ముందుకు వంగి బెడ్ షీట్ అంచులతో ఆడుకుంటున్నాడు. చేతిలోని కత్తి కిందకు జారిపడి ఉంది. పటకారు మాత్రమే ఉంది అతని చేతిలో.
” నీకు గుణపాఠం చెప్పడానికోసమే నేనీ నాటకమాడాను. ఆమె పెదవులమీది గాయం కత్తులు గుచ్చుకోవడం వల్ల ఏర్పడింది కాదు. ఇదుగో నా వేలి ఉంగరంతో నేనే గాయపరిచాను.” చల్లగా చెప్పాడు –శ్రీమతి సానోక్స్ భర్త అయిన మిస్టర్ సానోక్స్– చేష్టలుడిగిన డగ్లస్ స్టోన్ వంక కౄరదృక్కులు ఎక్కుపెట్టాడు– జేబులోని రివాల్వర్ని తడుముకుంటూ.
డగ్లస్ స్టోన్ నవ్వసాగాడు.ఆ నవ్వు–క్రమంగా పెద్దది కాసాగింది.అలా నవ్వుతూనే ఉండిపోయాడు.
మిస్టర్ సానోక్స్ మనసులో ఒకరకమైన భయం ప్రవేశించింది. మెల్లగా గదిలోంచి బయటికి నడిచాడు.
వృధ్ధ నర్సు బయట వేచిఉంది.
” శ్రీమతి సానోక్స్ స్పృహనుండి తేరుకోగానే ఆమె సంగతి చూసుకో” అని పురమాయించాడు.
లార్డ్ సానోక్స్ ను చూడగానే డ్రైవరు తలమీది టోపీ తీసి వినయంగా నిలబడ్డాడు.
” జాన్! నువ్వు మొదట డాక్టరును అతనింటికి తీసుకెళ్ళి చేర్చు. అతను మెట్లు దిగలేడనుకుంటాను. ఒక కేసు విషయంలో అతను అస్వస్థతకు గురైనాడని ఇంట్లోని బట్లరుకు చెప్పు.”
” అలాగే సార్!”
” తరువాత- లేడీ సానోక్స్ ను ఆమె ఇంట్లో దిగివిడిచిరా”
” మరి మీ సంగతి?”
” నేను కొన్ని నెలలపాటు, వెనీస్ నగరంలో హోటల్ డీ రోమా లో బసచేస్తాను. పోస్ట్ లో వచ్చిన ఉత్తరాలు నేను చెప్పిన హోటల్ అడ్రస్ కు చేరవేస్తూ ఉండు.
M. Com. చదివారు. సిండికేట్ బ్యాంక్ లో క్లర్క్ గా చేరి 2012లో మేనేజర్ గా పదవీవిరమణ పొందారు. ప్రస్తుత నివాసం హిందూపురం. సాహిత్యం, సంగీత మంటే ఇష్టం. ప్రచురణ పొందిన మొదటి తెలుగు కథ కాగితపు పులి (ఆంధ్రప్రభ వీక్లీ). మొదటి అనువాద కథ పంజరం (విపుల). మూడు అనువాద కథా సంపుటాలు, ఒక్క తెలుగు కథా సంపుటం, రెండు నవలలు ప్రచురణ జరిగింది. ఒక నాటకం DTP లో ఉంది.
Discussion about this post