ఆల్బేనియా మూలం : ఫత్‌మీర్ గజాత
అనువాదం: రంగనాథ రామచంద్రరావు
నాకు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చెవులు బ్రద్ధలయ్యేలాంటి విస్ఫోటనం వల్ల ఇల్లు ముక్కలు చెక్కలు అవుతుందని అనిపించింది. సూర్యోదయకాలపు గుచ్చుకునే వెలుతురుకు నా కళ్ళు సంకోచించాయి. జనాల కేకలు, ప్రేల్చుతున్న తూటాల శబ్దాలతో నా చెవులు నిండిపోయాయి. నేను చాలా ఆలస్యంగా, తెల్లవారటానికి మునుపు పడుకున్నాను. బాగా అలసిపోయాను. ఆ కారణంగా నిద్ర నుంచి లేవటానికి నాకు చాలా కష్టమైంది. ఆస్ట్రోవికా కొండ నుంచి దూరపు ప్రయాణాన్ని ముగించి నేను ఇప్పుడిప్పుడే వచ్చాను. అక్కడ దాయాదులకు సంబంధించిన ఒక పొట్లాటనో, అపరాధమో జరగబోతోంది. ఇరువైపులవారిని రాజీ చేయటానికి మా పార్టీ, సమితి మమ్మల్ని పంపింది. వేలాది అడ్డూ ఆటంకాలు ఎదురైనా చివరికి ఆ పనిని సాధించుకుని ఇంటికి వెనుతిరిగాం. ఆస్ట్రోవికా దారి సాధారణమైందికాదు. అది తీవ్రంగా ప్రవహించే ప్రమాదకరమైన జలపాతాలతో, లోతైన వాగులు, కాలువలతో కూడిన దుర్గమమైన దారి. ఇలాంటి దారితో రాత్రంతా ఎనిమిది గంటల కాలం నేను పెనుగులాడాను. అసలే వడగళ్ళతో కూడిన వాన. ఆ వానలో నేను ఇల్లు చేరే సమయానికి మా పుంజు వేకువజాము తొలికూత కూసింది. తరువాత ఒళ్ళు వేడెక్కటానికి ఒక లోటా ‘రాకి’ తాగి, మా గ్రామ విభాగానికి చెందిన కాపలాదారులు వారివారి స్థలాల్లో ఉన్నారని నిర్ధారించుకుని, వచ్చి పక్కమీద వాలే సమయానికి నా ఒళ్ళంతా పచ్చిపుండులా మారింది. ‘రాకి’ తాగటం వల్ల నిద్ర తొందరగా పట్టినప్పటికి అప్పుడప్పుడు మెలకువ వస్తోంది. నిప్పులగూడు (ఫైర్ ప్లేస్) మీద వెలుగు చిమ్ముతున్న కొవ్వొత్తి వెలుగు క్రమంగా తగ్గుతున్న విషయం నాకు తెలుస్తోంది. నిద్రవల్ల భారమైన కనురెప్పల సందులోంచి గోడమీది నీడల చలనాన్ని నేను గ్రహించగలిగేవాడిని. కొవ్వొత్తి పొగ గోడను తన మసితో పులుముతోంది. గోడ నల్లబారుతోంది. ఎవరో నా గదిలోకి వచ్చిపోయినట్టు అనిపించింది. అతను నా భుజం మీద గొర్రెచర్మంతో చేసిన మందపాటి దుప్పటిని కప్పి వెళ్ళినట్టు అనిపించింది. ఈ ఆలస్యపు తెరను చీల్చుతూ ఒక మనిషి నిట్టూర్పు, గుర్రం సకిలింపు శబ్దం, దూరం నుంచి తేలివస్తున్న ఒక పాటలోని పదాలు వినిపించాయి.
మళ్ళీ నిద్రలో ఒక కల; గుర్రాలు వస్తున్న అస్పష్టమైన శబ్దాలు. కాలిగిట్టల శబ్దాలు. ‘‘వచ్చారా?’’ అనే మాటలు. పార్టీ, సమితి గురించి ఒకటి రెండు మంచి మాటలు వినిపించాయి. అందరూ ఒకేసారి కలగాపులగంగా మాట్లాడుతున్నారు- మా వాళ్ళు పోట్లాడుకున్నవారు, రాజీ చేసినవారు-అందరూ. క్రమంగా మాటలు స్పష్టమయ్యాయి.
‘‘ఆస్ట్రోవికా స్నేహితులారా, ఈ పోరాటానికి మీకు ఆండదండలు ఉన్నాయా?’’
‘‘ఆఁ ఉంది’’
‘‘లేదు, మీ సహకారం లేదు. సోదరులను చంపే మీ ప్రవర్తనను చూస్తే, ఈ యుద్ధంలో మీరు ఓడిపోవటం కచ్చితం’’
‘‘లేదు, మేము ఓడిపోం’’
‘‘ఈ భ్రాతృహత్యలను ఆపకపోతే మీరు నిజంగానే ఓడిపోతారు’’
‘‘సరే, పార్టీ చెప్పినట్టు మేము రాజీపడతాం. సరైన మార్గానికి వస్తాం. మా వేళ్ళను కోసుకుని పరస్పరం రక్తం సాక్షిగా రాజీ చేసుకుంటాం’’.
‘‘పార్టీకి జయం కలగాలి’’
నేను నా పిస్తోలును బయటికి తీసి గాలిలో పేల్చి బిగ్గరగా అరిచాను-
‘‘మనందరిది ఒకే ప్రాణం, ఒకే ఆత్మ, ఒకే మాతృభూమి!’’
‘‘మనమంతా అన్నదమ్ములం. మనమంతా పార్టీకి చెందినవాళ్ళం’’
తరువాత మేమందరం సంతోషంతో పరస్పరం కౌగిలించుకుని మా మా పిస్తోళ్ళను బయటికి తీసి కిటికి నుంచి ఆకాశంలో గుళ్ళు పేల్చాం. మొత్తం కుటుంబాలనూ, లెక్కలేనంత మందిని బలి తీసుకున్న పాతవైరాల నుంచి, అనాగరిక సంప్రదాయపు భయం నుంచి విముక్తులైన మాకు చాలా సంతోషంగా ఉంది.
ఆ కారణంగా దేశమంతటా గంభీరమైన దుఃఖం ఉన్నప్పటికీ, ఈ రాజీవల్ల కలిగిన సంతోషం కోసం మేము పీకలదాకా ‘రాకి’ తాగాం. ఆడవాళ్ళు తెచ్చిన కాల్చిన మాంసం తిన్నాం. ఆడవాళ్ళందరికి తమ సంతోషాన్ని నిగ్రహించుకోవటం కష్టమైంది. తరువాత మేము ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నృత్యం చేశాం. పరస్పరం భుజాల మీద చేతులు వేసి పాటలు పాడాం. మాలో మాకు ఐకమత్యం, సోదర భావం ఉన్నంతవరకు మాకు ఎవరి భయమూ లేదు. యుద్ధం ప్రజ్వలించనీ, కొండమీది గాలి గర్జించనీ, దాని గర్జన అడవులలో ప్రతిధ్వనించనీ, కష్టాలతో నిండిన దారి ఎంత దీర్ఘమైనా కానీ, స్వాతంత్య్రపు విలువైన గుళ్ళు మా మీద వర్షించనీ, స్నేహపు దృఢమైన దారి మాది. ఇది ఆల్బేనియా వీరుల శపథం
నిద్రమబ్బులో ఈ సంఘటనలన్నీ నా స్మతిపటలం మీద కదిలిపోయాయి. ముక్కలు, ముక్కలుగా అయినా సజీవంగా, కొంచెం మారినట్టుగా ఉన్నా సత్యానికి సత్యంగా. అంతలో జనం కేకలు, మందుగుళ్ళ విస్ఫోటాల శబ్దాలు నన్ను తట్టి లేపాయి.
నేను వెంటనే లేచి కూర్చున్నాను. బట్టలు వేసుకునే అవసరమే లేదు. ఎందుకంటే నాజీలు దాడి చేసిన రోజు నుంచి ప్రతి రాత్రీ తొడుక్కున్న దుస్తులతో, వేసుకున్న బూట్లతోనే నేను పడుకుంటున్నాను. అందువల్ల లేవగానే పొడువైన నా బందూకును తీసుకున్నాను. తూటాలతో నిండిన బెల్టును నడుముకు బిగించాను. తన ప్రశాంతతకు భంగం కలగటంతో తన గూడు నుంచి బయటికి వచ్చిన ఏదో రాత్రి పక్షిలా ముంగిట్లోకి దూకాను.
బయట గాలి ఊళ పెడుతోంది.
పిండి కణాల్లాంటి వర్షపు జల్లు కురుస్తోంది.
ఇంటి చూరు నుంచి చుక్కలు చుక్కలుగా పడుతోంది.
ఆడవాళ్ళు తుప్పుపట్టిన ఇటాలియన్ హెల్మెట్‌లలో వర్షపు నీటిని సంగ్రహిస్తున్నారు.
ఈ నీళ్ళతో బట్టలను చక్కగా ఉతకవచ్చని వాళ్ళు అనేవారు.
డిసెంబర్ మాసంలోని తొలి రోజులు. కొండగుట్టలన్నీ దట్టమైన మంచు దుప్పట్లను కప్పుకున్నాయి. అతను స్పష్టంగా గుర్తుపట్టలేకపోతున్నాడు. చల్లటి గాలి, మండే పొయ్యి పక్కన తన ఒంటిని నాకుతూ కూర్చున్న పిల్లి. ఆకులు రాలిన చెట్లకాండాలు మరియు వణుకుతున్న నా శరీరం- ఇవన్నీ చలికాలం చాలా దగ్గరకొస్తోందని స్పష్టంగా సూచిస్తున్నాయి.
ముంగిట్లోకి పరుగున వచ్చి నేను బిగ్గరగా అరిచాను-
‘‘ఏమైంది? ఏమవుతోంది? ఎవరు పోట్లాడుకుంటున్నారు?’’
అక్కడ మనుష్యులు కానీ, జంతువులుకానీ కనిపించలేదు. వాతావరణమంతా మౌనం. కోళ్ళ కూతలు ఆ మౌనాన్ని చెదరగొట్టలేదు. పల్లె అంతటా నిశ్శబ్దంగా మూగబోయింది. పైన ఆకాశంలో వర్షాన్ని కురిపించే నల్లటి మబ్బు తునకలు కమ్ముకున్నాయి. కింద తడిచి ముద్దయిన నేల. ఇద్దరు కుర్రవాళ్ళు ఇంటి ముందు నుంచి దాటిపోయారు. ఒకడి చేతితో గొట్టం లేని చిన్న బందూకు. మరొకడి చేతిలో గొడ్డలి. వాళ్ళు జింక పిల్లల్లా పరుగులు పెడుతున్నారు.
వారి ముఖాలు చూడకుండా నేను అరిచాను.
‘‘ఏయ్, పిల్లలూ, ఏం జరుగుతోంది?’’
వాళ్ళు నా మాటలను విననే లేదు. జవాబు ఇవ్వలేదు. నేను ఇంటి గడపలోకి వచ్చే సమయానికే వాళ్ళు కనుమరుగయ్యారు. నాకు ఇంక వినటానికి, ఆలోచించటానికి సమయం లేదు. పల్లె దగ్గరలోని అడవిలోంచి గుళ్ళ శబ్దం వినిపిస్తోంది.
‘‘జర్మనులు’’ అని నాకు నేనే చెప్పుకున్నాను. ధ్వని అస్పష్టంగా ఉంది.
ఇక్కడిదాకా వాళ్ళు ఎలా వచ్చారు? మా కాపలావాళ్ళు ఏం చేస్తున్నారు? మా దళంలోని మిత్రులు ఎం చేస్తున్నారు? మాలాగే వాళ్ళూ నిద్రకు లొంగిపోయారా?
‘పదవయ్యా హోదో, ముందుకు పదా’ అని నాకు నేనే చెప్పుకుంటూ కొండెక్కి ఇతర మిత్రులు ఉన్న అడివి వైపు పరుగెత్తాను.
అడవి మా ఇంటి వెనుక నుంచే మొదలవుతుంది. నాకైతే ఆ అడవి అంటే మా ఇల్లు ఉన్నట్టే. చిన్నతనంలో నేను మేకలను మేపటానికి వెళుతున్నప్పుడు అడవి మూలమూలల్లోకి చొచ్చుకుని పోయేవాడిని. ఆ కారణంగా అక్కడ సులభంగా సంచరించే లోపలి మార్గాలు నాకు బాగా తెలుసు. చొక్కాలను చింపే, రక్తాన్ని చిందించే ముళ్ళ పొదలున్న స్థలాలు తెలుసు. అదే విధంగా చల్లటి స్వచ్ఛమైన నీటి బుగ్గలు ఎక్కడున్నాయో కూడా తెలుసు.
అప్పుడప్పుడే వెలుతురు పరుచుకుంటోంది. అడవి చెట్ల నీడలు ఇంకా పొడుగ్గా దట్టంగా వ్యాపించాయి. తూటాల శబ్దం నిలిచిపోయింది. ఆ దట్టమైన అడవి చెట్ల, పొదల సందులలో నేను పరుగెత్తాను. ఒక మట్టిదిబ్బ ముందు నిలుచున్నాను. దాని కింద స్వచ్చమైన నీటి చెలమ ఒకటి ఓక్ చెట్టు పండుటాకుల మధ్యన పొంగుతోంది. అక్కడి నుంచి కొంచెం కిందికి నేను వెళుతున్న కాలిదారి చివరన ఒక లోతైన కనుమ ఉంది. పురాతనమైన ఓక్ చెట్లతో ఆవరించబడిన ఈ లోతైన కనుమ రహస్యమయంగా ఉండి, భయం పుట్టించేలా ఉంది. ఏ గొర్రెల కాపరి కాలి అడుగూ ఆ నిగూఢ స్థలాన్ని తొక్కలేదు. అలాంటప్పుడు నేనూ అక్కడ అడుగు పెట్టలేదని చెప్పవలసిన అవసరం లేదు. ఈ కనుమ అంచులో ఇద్దరు నాజీలను చూశాను. వాళ్ళు చచ్చిపడివున్నారు.
ఉదయపు పొగమంచు నెమ్మదిగా కరుగుతోంది. లోతైన ప్రదేశాలలో, చల్లటి నీటి కొలను మూలల్లో, కనుమ గుహలలో గోడలకంతా వ్యాపించిన పొదలలో మాత్రం ఇంకా చీకటి రాజ్యం చేస్తూవుంది. విషాదంతో కూడినట్టున్న వర్షమూ ఆగింది. రైతుల గుంపొకటి అడవి నుంచి బయటికి వచ్చి చుట్టూ చెట్లతో ఆవరించిన పచ్చటి మైదానంలో కనిపించింది. అక్కడున్న ఆడ-మగ, కుర్రవాళ్ళు-అమ్మాయిలు అందరూ నాకు తెలుసు. వాళ్ళ ముఖాలు వాడిపోయివున్నాయి. నన్ను చూసి మాటలు ఆపారు. ఒక స్ట్రెచర్‌ను భుజాల మీద మోసుకుని నేరుగా నా దగ్గరికి వచ్చారు. అది వాళ్ళే తయారుచేసుకున్న స్ట్రెచర్. బలమైన చెట్టు కొమ్మలను కట్టగాకట్టి దాని మీద చొక్కాలను పరిచారు. వారి ముందు పల్లె దళం నాయకుడు హజ్‌దర్ నిలబడివున్నాడు. అతని ముఖం మందగుళ్ళ పొడిని అద్దుకున్నట్టు నేరెడుపండు రంగులో ఉంది. ‘‘చనిపోయింది ఎవరు?’’ అని వణికే కంఠంతో అడిగాను. పొంగుతున్న నా మనస్సులోని భావాలను అదిమిపెట్టుకుని నేను అడిగాను. వాళ్ళెవరూ జవాబివ్వలేదు. వాళ్ళు స్ట్రెచర్‌ను మట్టిదిబ్బ దగ్గర పొంగుతున్న స్వచ్చమైన నీటిబుగ్గ పక్కన దింపారు.హజరత్ ముఖం కోపంతో ఎర్రబారివుంది. చచ్చిపడివున్న జర్మనులను అతను చూశాడు. నీళ్ళలోకి దిగాడు. తలవంచి నీళ్ళు తాగాడు. అలాగే వంగి, నోటి చివరల నుంచి నీటి చుక్కలు కారుతుండగా అన్నాడు-
‘‘ఇంకా పైన మేము ఏడుమంది జర్మనుల శవాలను చూశాం. ఇక్కడున్నవాటితో కలిపితే మొత్తం తొమ్మిది. వీళ్ళు నాజీల గూఢచారుల దళానికి చెందినవాళ్ళు కావచ్చు. అయితే వాళ్ళు మరణించారు. మా దళం వాళ్ళను చంపేసింది…
దుఃఖాన్ని నాలోనే దాచుకుని నేను అడిగాను-
‘‘స్ట్రెచర్ మీద ఎవరు?’’
స్ట్రెచర్ మీద పొడవైన యువకుడు పడుకునివున్నాడు. అతని జుట్టు, కనుబొమలు, ఎండిన గడ్డిలాంటి మాసిపోయిన పచ్చటి రంగు. అతని కళ్ళు మూసుకుని ఉన్నాయి. పేలుడు పదార్థాల వల్ల అతని ముఖం మీద గాయాలు, బుగ్గల మీద నల్లటి మరకలు. ఈ మధ్యనే క్షవరం చేసుకోవటం మొదలుపెట్టిన లేతముఖం. చుబుకం కింద ముడివేసిన ఎర్రటి చేతిగుడ్డ మెడచుట్టూ ఉంది. వాళ్ళు అతని ఛాతీ మీద పెట్టిన టోపీ మీద ఎర్రటి నక్షత్రం మెరుస్తోంది. దీర్ఘ ప్రయాణం తరువాత నిద్రలో మైమరచినట్టు అతను కనిపిస్తున్నాడు. మీరు అతనితో మాట్లాడితే చాలు, వెంటనే లేచి, నిటారుగా నిల్చుని, బందూకుని సరిచేసుకుని, ‘నేను సిద్ధం కామ్రేడ్, కాస్త కునుకు పట్టింది’ అని చెబుతాడేమో అన్నట్టుగా కనిపిస్తున్నాడు.
వర్షంవల్ల భారమైన అతని జుట్టు నిమురుతూ నేను అడిగాను-
‘‘ఇతను మీకు ఎక్కడ దొరికాడు?’’
‘‘అడవిలో చనిపోయిన ఒక నాజి శవం మీద పడివున్నాడు. అతని చేతిలో పిస్తోలు వుంది. చివరి ఊపిరి తీసుకుంటున్నాడు. ప్రాణాలు వదలటానికి ముందు ఏదో చెప్పాడు. అయితే అది మాకు అర్థం కాలేదు. అతని గాయాలను వెతుకుతున్నట్టే మా చేతుల్లో ప్రాణాలు వదిలాడు’’ అని మేక చర్మపు పైకోటు చేతితో తన పెదవులను తుడుచుకుంటూ హజ్‌దర్ అన్నాడు.
ముళ్ళ చెట్టు గీరుకున్నట్టు నా ముఖం ఎర్రబారింది. నేను ఒకటి రెండు అడుగులు వెనక్కు వచ్చి మళ్ళీ ఆ స్ట్రెచర్‌ను చూశాను. ఆ తొందరలో నా బందూకునే చేజార్చుకుని నేను పడబోయాను. తరువాత అక్కడున్న రైతులలోని, మగవాళ్ళు, కుర్రవాళ్ళు స్ట్రెచర్ దగ్గరికి వచ్చారు. వాళ్ళల్లో ఎక్కువ మంది ఆయుధాలు ధరించారు. ఆప్పుడు ఉన్నట్టుండి మమ్మల్ని ఆవరించిన మౌనాన్ని ఓ ఆడమనిషి రోదన ధ్వని చెదరగొట్టింది.
ఆడవాళ్ళంతా స్ట్రెచర్‌కు కొద్దిదూరంలో గుంపుగా నిలబడ్డారు. దిబ్బమీద నిల్చున్నవారిని అడిగాను.
‘‘ఎవరు ఏడుస్తున్నారు?’’
ఆ ఏడుపు కొద్దిసేపు కొనసాగింది. అయితే మా చుట్టూ ఆవరించుకున్న దట్టమైన అడవి దాన్ని మింగిందేమో అన్నట్టు ఒక్కసారిగా ఆగిపోయింది.
‘‘ఎవరు ఏడుస్తున్నారు?’’ రెండోసారి నేను కాస్త బిగ్గరగానే అడిగాను.
అయితే చాలా రోజులనుంచి జుట్టు కత్తిరించుకోని నా జుట్టును చెదరగొడుతున్న గాలి గుసగుసలు ఆ మౌనంలో నాకు వినిపించాయి.
గాలి వేగం తగ్గింది.
అందరూ మూగబోయినట్టు అడవిలో నిగూఢమైన మౌనం ఆవరించింది.
స్ట్రెచర్ మీదున్న యువకుడిని చూస్తూ నేను హజ్‌దర్‌ను అడిగాను-
‘‘మనం ఎంతమంది నాజీలను చంపాం?’’
‘‘నలుగురిని హోదో’’
‘‘మిగతావారిని చంపింది ఎవరు?’’
చెకుముకి రాయితో నిప్పును వెలిగించటానికి ప్రయత్నిస్తూ హజ్‌దర్ జవాబిచ్చాడు:
‘‘వాళ్ళందరినీ ఇతను చంపాడు’’
‘‘నీకు ఎలా తెలుసు?’’
‘‘నాకు ఎలా తెలిసిందో బందూకును పరిశీలించి చూస్తే నీకే అర్థమవుతుంది’’
నేను యువకుడి బందూకును ఎత్తుకుని గొట్టాన్ని పరీక్షించాను. దాని చివరన అంటుకున్న కాలిన ప్రేలుడు పదార్థం మరక వల్ల, దాన్ని అప్పుడప్పుడే ఉపయోగించినట్టు అర్థమైంది. బందూకు నుంచి పేలుడు పదార్థాం వాసన వస్తోంది.
నేను ఆ యువకుడిని గతంలో ఎప్పుడూ చూడలేదు. నాకు కమాండర్లు, సమితి ప్రముఖులు, ఇతర సభ్యులు అందరూ తెలుసు. యుద్ధరంగంలోని వెనుకభాగంలో పనిచేస్తున్న యువకమ్యూనిస్టు కార్యకర్తలందరూ తెలుసు. ఉత్తర-దక్షిణాల ప్రతినిధులూ తెలుసు. మా ప్రాంతంలోని, కేంద్రంలోని సహచరులు కాకుండా, ప్రధానమైన సేనానాయకుల సహాయ మండలిలో ఉన్న స్నేహితులు కూడా తెలుసు. అయితే ఆ యువకుడిని నేను ఎన్నడూ చూడలేదు. ఫాసిస్ట్లు ఇటలీకి లాక్కునిపోయి అక్కడి జైలులో వేసిన దుల్కన్‌లా ఇతను కనిపిస్తున్నాడు. దుల్కన్ సన్నటి శరీరంతో పొట్టిగా ఉండేవాడు. అయితే ఇతని కాళ్ళు స్ట్రెచర్‌ను దాటుకుని బయటికి వచ్చాయి. ఈ యువకుడు ఎవరై ఉండొచ్చు. ఐదుమంది నాజీలను చంపిన ఇతను ఎక్కడి నుంచి వచ్చివుండొచ్చు. ఏ కార్యం నిమిత్తం వచ్చివుండొచ్చు అని ఆశ్చర్యంతో నేను ఆలోచించాను.
‘‘ఇతను దుస్తులు వెతికారా హజ్‌దర్?’’
‘‘ఊఁ’’ హజ్‌దర్ జవాబిచ్చాడు.
‘‘ఏమైనా దొరుకిందా?’’
‘‘అతని బందూకు, పిస్తోలు, తూటాలు, కొన్ని జొన్న రొట్టెలు దొరికాయి.’’
నేను మట్టిదిబ్బకు ఒరిగి అందరినీ అడిగాను.
‘‘ఈ యువకుడు మీలో ఎవరికైనా తెలుసా? ఇంతకు ముందు ఇతణ్ణి చూశారా?’’
నా స్వరం గట్టిగా వినిపించింది. దాని ప్రతిధ్వని లోయ నుంచి లోయకు , కొండ నుంచి కొండకు వ్యాపించిందే తప్ప ఎవరూ జవాబివ్వలేదు.
‘‘ఇతను ఎవరికైనా తెలుసా?’’ నేను మళ్ళీ అరిచాను.
దాని ప్రతిధ్వని మళ్ళీ కొండల్లో అణగిపోవటానికి మునుపు మరోసారి నాకు ఆల్బేనియా ఆడవాళ్ళ మనోవేదనతో కూడిన రోదన వినిపించింది.
‘‘దగ్గరికి వచ్చి బాగా చూడండి. బహుశా మీకు తెలిసివుండొచ్చు. మగవాళ్ళు ఒకరి తరువాత ఒకరు వచ్చి చూడండి… తరువాత ఆడవాళ్ళు చూడండి. దగ్గరికి… ఇంకా దగ్గరికి వచ్చి ఈ కుర్రవాడిని చూడండి… ఈ వీరయోధుడిని బాగా చూడండి’’
పర్వతప్రాంతాల ప్రజలకే ప్రత్యేమైన భారమైన అడుగులువేస్తూ మొదట పురుషులు గుంపుగా వచ్చారు. తమ తలల మీదున్న తెల్లటి టోపిలను తీసి, తల వంచి చాలాసేపు స్ట్రెచర్ దగ్గర నిలుచున్నారు. హజ్‌దర్ ఆ యువకుడి చొక్కా బొత్తాలను విప్పి సూర్యుడు చూడని తెల్లటి ఛాతీ మీద గాయాల గుర్తుల కోసం లేదా ఇతర చిహ్నాల కోసం వెతికాడు. అయితే అతని ఛాతికి ఎడమవైపున తూటా తగిలిన గుర్తు ఉంది. దాని కింద అతని పక్కటెముకలను దాటి ఒళ్ళంతా నిలువుగా, పల్చగా ప్రవహిస్తున్న రక్తపు చార.
జనం అతని ముందు నిలబడి గాఢమైన ఆలోచనలో తలూపారు. తరువాత దుఃఖం, ప్రేమ, ద్వేషాల వల్ల తమలో తాము గొణుగుతూ ఇతరులకు అవకాశం కల్పిస్తూ మౌనంగా పక్కకు జరిగారు.
వాళ్ళకు అతని పరిచయం లేదు. వాళ్ళు గతంలో ఎప్పుడూ అతన్ని చూడలేదు.
పల్లెలో అందరికన్నా వయస్సులో పెద్దవాడు, పండు ముసలివాడు మెత్సె స్ట్రెచర్ ముందు చాలాసేపు నిలబడ్డాడు. అతను కాస్త వీపు వంగివున్న పొట్టి మనిషి. అయినా అతని నడక మాత్రం చాలా దృఢంగా ఉంది. అతను కాగితం ముక్కలో పొగాకు నింపి దాన్ని చుట్టగా చుట్టి లావాటి ఒక సిగరెట్ తయారుచేశాడు. తరువాత దాన్ని వెలిగించాడు. అతను సరిగ్గా పొగ ఆడేవరకూ ఒకటి రెండుసార్లు కాల్చాడు. తరువాత దాన్ని స్ట్రెచర్ మీదున్న యువకుడి గాయపడని కుడిచేతి వేళ్ళ మధ్య పెట్టాడు.
అటు తరువాత ఒక్క మాటా మాట్లాడకుండా, తీవ్రమైన ఆలోచనతో, ఎలా వచ్చాడో అదే విధంగా వెనక్కి తప్పుకున్నాడు. ఆ ముసలివాడు మెత్సెకూ ఆ యువకుడు ఎవరో తెలియదు. అతను గతంలో ఎప్పుడూ ఆ యువకుడిని చూడలేదు.
తరువాత ఆడవాళ్ళ వంతు వచ్చింది. మొదట్లో వాళ్ళు అనుమానించారు. తరువాత ఒక అమ్మాయి పెద్దపెద్ద అంగలు వేస్తూ గుంపును చీల్చుకుని ముందుకు వచ్చింది. గుంపులో గుసగుసలు మొదలయ్యాయి. ఆమె అడుగులు వేసిన తీరులోనే ఆమె నా కూతురు హాజరీ అని అర్థమైంది. ఆమె నా చివరి కూతురు. ఇంకా పెళ్ళి కాలేదు. ఆమె ఆ యువకుడి పెద్దవుల మధ్య సువాసనలు వెదజల్లే తాజా పుష్పాన్ని పెట్టింది. దుఃఖంతో మట్టిదిబ్బ మీద నిలబడ్డ నా హృదయాన్ని అంతులేని బాధా వచ్చి గుచ్చుకున్నట్టు అయింది.
ఆడవాళ్ళ గుంపు నుంచి మళ్ళీ శోక విలాపం ప్రారంభమైంది. అది శబ్దరహితమైన మౌనంతో కూడిన విలాపం. అయితే హృదయవిదారకంగా ఉంది. అది నా గుండెను గెలికి, నన్ను మరింత దుఃఖతప్తుడిగా చేసింది.
నా హాజరీ ఆ యువకుడి ముందు నిలుచుంది. పిడికిలి బిగించి అతనికి నమస్కరించి, రోదన ఆగేవరకూ అక్కడే నిలుచుంది. తరువాత కన్నీళ్ళు నిండిన పెద్దకళ్ళను నా వైపు తిప్పి చెప్పింది-
‘‘నాకు ఇతనితో పరిచయం లేదు నాన్నా. నేను గతంలో ఎప్పుడూ ఇతన్ని చూడలేదు’’
ఒక్క క్షణం నాకు దిక్కుతోచనట్టయి ఏమి చేయాలో తోచలేదు. మా ముందు స్ట్రెచర్ మీద పడుకున్న ఈ అజ్ఞాత యోధుడు ఎవరు? ఐదుమంది శత్రువులను మట్టుపెట్టిన అతను మా ప్రదేశంలో, మా అడవిలో, మా పల్లెకు కాస్త దూరంలో హతుడయ్యాడు. అతని వేళ్ళ మధ్య సిగరెట్ పెట్టిన, మా అందరికన్నా పెద్దవాడైన, వందేళ్ళ మెత్సెకు కానీ, నా కూతురికి కానీ, హజ్‌దర్‌కు కానీ, నాకు కానీ అతను ఎవరో తెలియదు. నాకు ఏం చేయాలో తోచలేదు. నేనొకసారి ఆ యువకుడి ముఖం చూశాను. లేత బంగారు రంగు జుట్టు, విశాలమైన తెల్లటి ఛాతీ. ఆయుధాలు, మళ్ళీ అడిగాను:
‘‘మన పల్లెను కాపాడుతూ చనిపోయిన ఈ యువకుడు ఎవరికీ తెలియదంటే ఏమిటర్థం?’’
మరోసారి ఆడవాళ్ళ గుంపులో తీవ్రమైన రోదన వినిపించింది.
‘‘ఎవరు ఏడుస్తున్నారు?’’ నేను వెంటనే అడిగాను. హజ్‌దర్ నా మనస్థితి స్థిమితంగా లేదని అర్థం చేసుకున్నట్టు నా షర్టు లాగి, భారమైన కంఠంతో అన్నాడు-
‘‘హోదూ, ఇతను వీరయోధుడు. నువ్వు ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? అతను మన సహచరుడు. మన కుర్రవాడు. అతనికి గౌరవపూర్వకంగా అంత్యక్రియలు జరుపుదాం.
నాకు ఇష్టమైన సహచరులు చాలామంది హతులయ్యారు. వాళ్ళలో స్నేహితులు, బంధువులు ఉన్నారు. నా తమ్ముడు సాలి కూడా ఉన్నాడు. చావు ఎన్నో సార్లు నా సమీపంలో సంచరించింది. చావంటే నాకు భయం లేదు. అయితే స్ట్రెచర్ మీదున్న యువకుడిని చూసినపుడు నా గుండె బ్రద్ధలవుతూ ఉంది.
మా ప్రాంతంలో చాలాకాలం నుంచి పని చేస్తున్న, యుద్ధం చేస్తున్న మా కార్యాలయ సిబ్బంది మధ్యాహ్న సమయంలో వచ్చారు. వాళ్ళల్లో ఏ ఒక్కరికి ఇతనితో పరిచయం లేదు. వాళ్ళు ఇతడిని ఎప్పుడూ చూడలేదు.
దక్షిణ బ్రిగేడ్‌కు చెందిన ఒక సైనిక దళం కూడా ముందుకు సాగిపోయింది.
మరణించిన యువకుడి గౌరవార్థం తూటా పేల్చి, ‘ప్రతీకారం’ పాటను పాడి వాళ్ళు ముందుకు సాగారు.
వాళ్ళకూ తెలియదు. వాళ్ళు కూడా ఎన్నడూ అతడిని చూడలేదు.
చివరికి మేము ఒక నిర్ణయానికి వచ్చాం.
నా ముఖం వాడిపోయింది. చాలా దుఃఖంతో నేను అన్నాను:
‘‘సరే, ఇతను మన కుర్రవాడు. మన ఊరి కోసం ప్రాణత్యాగం చేశాడు. మనం ఇతడిని ఈ దిబ్బ మీద ఖననం చేద్దాం. ఈ నేల అతని దేహాన్ని తొందరగా పాడవ్వకుండా కాపాడుతుంది’’
నేను మట్టిదిబ్బ మీద కూర్చున్నాను. హజ్‌దర్ ఒక సిగరెట్ ఇచ్చాడు. దీర్ఘంగా పీల్చాను. పొగ ఎదగూడులో చేరుకున్నట్టు అనిపించింది. యువకులు గుంత తవ్వుతుండగా ఆడవాళ్ళు భావోద్వేగంతో ముందుకు తోసుకొచ్చారు. ముందుగా వచ్చింది దేవోల్ ఊరి ప్రోగర్. ఆమె హజ్‌దర్ భార్య. ప్రోగర్ పొడవైన నల్లటి అంగీ ధరించి, ఒక తెల్లటి శాలువాను తలకు చుట్టుకుంది.
ఆమె ఆ అజ్ఞాత యోధుడి మీద పడి రోదించసాగింది.
‘‘నా తండ్రి… నా బాబూ దుల్క… నా తండ్రి… దుల్క… నా వీరయోధుడా…’’ అప్పుడప్పుడు రోదిస్తున్న ఆడమనిషి ఈమేనని నాకు అప్పుడు అర్థమైంది. అయితే ఆమె స్వరాన్ని ఇంతకు ముందు గుర్తుపట్ట లేకపోయాను.
దేవోల్‌కు చెందిన ఈ ఆడమనిషి అందరికన్నా ముందుకు వచ్చి, ఆ బంగారు ఛాయ కలిగిన యువకుని కోసం, ప్రపంచమంతటి పురాతనమైన, పుత్రవియోగపు దుఃఖాన్ని ప్రకటించింది. ఇతరులు గందరగోళం చేయడానికి ఆమె అవకాశం ఇవ్వలేదు. అతని కోసం రోదిస్తూ, అతని చేతులకు, కళ్ళకు, ఛాతీమీది గాయానికి ఆమె ముద్దులు పెట్టింది. వర్షం వల్ల తడిచిపోయిన నక్షత్రఖచితమైన టోపి అతని తలకు పెట్టింది. అతని తూటాల నడుము పట్టీని సరిచేసింది. చొక్కా బొత్తాన్ని వేసి అతని శరీరం మీదంతా పువ్వులు చల్లింది.
‘‘దుల్క…ఓ నా దుల్క… వీరయోధుడైన దుల్క… ’’ అడవి అంతటా ఆ మాటలు ప్రతిధ్వనించాయి. ఆకాశమంతటా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అడవి రంగు నల్లబడుతూ పోయింది. అక్కడ ఒక విధమైన నిగూఢత ఆవరించింది. కొండలు, మబ్బులు తమ ముసుగును కిందికి లాక్కున్నాయి. సన్నగా వర్షం కురవసాగింది. మౌనంగా లోతైన కనుమలను ఆవరిస్తూ, ఏరు మీదంతా పరుచుకుని రాత్రిచీకటి సమీపించింది. ప్రకృతి తన పనిని చేసింది. వర్షం కురిసింది. ఆకులను రాల్చింది. మట్టిమీద పడి రాళ్ళను కరిగించింది…
హజ్‌దర్ మట్టిదిబ్బమీద నా దగ్గర కూర్చుని గంభీరంగా సిగరెట్ ముట్టించాడు. పండుముసలివాడు మెత్సె కూడా చప్పుడు లేకుండా పొగ పీలుస్తూ ఆలివ్ విత్తనాలతో చేసిన జపమాలలోని విత్తనాలను లెక్కపెడుతున్నాడు. నేనప్పుడు దుల్కన్‌ను జ్ఞాపకం చేసుకున్నాను. అతను హజ్‌దర్, ప్రోగర్ల వీర పుత్రుడు? దేశ విమోచనా సమితిని స్థాపించినపుడు అతను నా వార్తాహరుడిగా ఉండేవాడు. అయితే ఫాసిస్ట్లు అతన్ని ఒక దేశద్రోహి సహాయంతో పట్టుకుని తీవ్రంగా గాయపరిచారు. మొదట కోర్చాకు, తరువాత తిరనాకు తరలించారు. చివరికి ఇటలీలోని కారాగృహానికి పంపారు. 1943 సెప్టెంబర్‌లో ఇటలీ శరణాగతమైంది.అయితే దుల్కన్ మాత్రం వెనుతిరగి రాలేదు. ఇతర అనేక దేశభక్తులతోపాటు అతన్ని ఒక సామాన్య సమాధిలోకి విసిరేశారని అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చినవారు చెప్పారు. ఆ సమాధి సముద్రం పక్కనున్న పాడుబడిన ఒక ద్వీపంలో, అలల, తుఫానుల అంచులో ఉందని చెప్పేవారు.
మా దళంవారు మృతుడి గౌరవార్థం తూటా పేల్చినపుడు నేను వెంటనే ఈ ప్రపంచంలోకి వచ్చాను.
ఒక వీరుడి గొప్పదనానికి, గౌరవాలకు తగినట్టు ఆ యువకుడికి మావాళ్ళు అంత్యక్రియలు జరిపారు.
సమాధి దగ్గర మా యువకులు నాటిన శిలను కౌగిలించుకుని హజ్‌దర్ భార్య తగ్గుస్వరంతో రోదిస్తూవుంది.
‘‘నా తండ్రి, నా బాబూ, ఇక నీ జీవితాంతం నువ్విక్కడ పడుకునివుంటావు… ఈ నీటిబుగ్గ దగ్గర…. నీ తల్లి దగ్గర…’’
హజ్‌దర్ లేచి నిలుచున్నాడు.
పూర్తయిన సిగరెట్‌ను పారవేసి, భార్యను మెల్లగా పిలిచాడు.
ఆమె నా వైపు తిరిగింది.
కన్నీళ్ళతో నిండిన ఆమె కళ్ళు మందకాంతితో మెరుస్తున్నాయి.
పొంగుకొస్తున్న తన వెక్కిళ్ళను ఆపుకుంటూ ఆమె ఎంతో గర్వంతో అంది:
‘‘ఈ పిల్లవాడు దుల్కన్‌లాగే కనిపిస్తున్నాడు హోదో… ఒకవేళ అలా కనిపించక పోయినా ఇతను నా కొడుకే… ఏ తల్లి కొడుకైనా కానీ… నా జీవితమంతా ఇతని కోసం నేను కన్నీళ్ళు పెడతాను…’’
రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 14 అనువాద నవలలు, 17 అనువాద కథా సంకలనాలు, 5 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.
Discussion about this post