గుజరాతీ మూలం: హిమాంశీ శేలత్
అనువాదం: పాలెపు బుచ్చిరాజు
టెలిఫోనులో మాట్లాడుతూ ఉండగానే ఆమె శరీరం చల్లబడి పోయింది. పచ్చి కుండలో నీళ్ళు నింపుతే మట్టి కణకణాలుగా విడిపోయినట్టు, ఆమె అస్తిత్వం చిన్నాభిన్నమై ప్రచండమైన వేదనా స్రవంతిలో కొట్టుకుపోయింది. ఆఖరికి తనని ఇంతకాలంనుంచి వేధిస్తున్న అనుమానమే నిజమైంది. ప్రశాంత్ ఇక లేడు; తను ఎదురుగా లేదు. అయినప్పటికీ ప్రశాంత్ పోయాడు.
తనెప్పుడూ ప్రశాంత్ తో అంటూ ఉండేది. “నేను నీ సమక్షంలో లేనప్పుడు నాకు తెలియకుండా నీకేమైనా అవుతుందేమో నని నా భయం.” అని.
ప్రశాంత్ తేలిగ్గా నవ్వేసి, “ నువ్వు ఎదురుగా లేకుండా నా ప్రాణం కూడా పోదు. పోయే ముందు అది నీ అనుమతి తీసుకోవాలి కదా!” అనే వాడు.
“అయినా నాకు ఎప్పుడు అటువంటి ప్రమాదం సంభవించినా వెంటనే నీకు కబురు అందడం, నువ్వు పరుగెత్తుకు రావడం జరుగుతుంది. మనం ఒకరికొకరం ఏమంత దూరంగా ఉన్నామని?” అని ధైర్యం చెప్పేవాడు. కాని, అలాంటిదేమీ జరగలేదు. తనకి కబురు వచ్చేసరికే అంతా అయిపోయింది. నిన్న సాయంత్రమే తను ప్రశాంత్ తో గడిపింది.
ఈ రోజు తెల్లారే సరికల్లా…. ….. ….
ఎవరైనా తనకి వెంటనే కబురు చెప్పాల్సిన అగత్యం మాత్రం ఏముంది? వర్షా బహెన్ అయితే తనకి ఫోనే చేయదు. మిగిలిన బంధువులు మాత్రం ఎందుకు చేస్తారు? ప్రశాంత్ స్నేహితుడు ఒకాయన ఫోను చేసి చెప్పాడు. అదీ, ఈ ఉదయం పది గంటలకి. తానా సమయంలో ఆఫీసుకి వెళ్ళడానికి తయారౌతోంది. కాని, ఇంతలో…. ….
జీవితంలో మొట్టమొదటి సారిగా తనకి మృత్యువంటే భయం వేసింది. ఈ వాస్తవికత ఎంత భయంకరమైనది!! ఆమాట అందరికీ తెలుసు. కాని, ఏమీ తెలియనట్టు జీవిస్తూ ఉంటాము. ఏదో ఒక రోజున మృత్యువు వచ్చి తలవాకిలి నిలబడుతుందని తెలుసు. ఒక్క ప్రభంజనంతో అసంఖ్యాకమైన దీపాల్నిఆర్పేస్తుంది. తుపానులా చుట్టుముట్టేసి, తనకి కావాల్సిన వాళ్ళని ఎత్తుకు వెళ్లి పోతుంది. మనం దీనికి ఎప్పుడూ తయారుగా ఉండాలి. మన వెనకనే మన నీడ వెంబడిస్తున్నట్టు, వదిలి పెట్టకుండా మన ముందు, మృత్యువు కూడా నడుస్తూ ఉంటుంది.
పది, పదిహేను నిముషాల్లో కాస్త తేరుకుని, ప్రశాంత్ ఇంటికి వెళ్ళడానికి బయల్దేరింది తను. వీధి గుమ్మంలోకి వస్తూనే తెల్లగులాబి మొక్క పలకరించింది. అదంటే ప్రశాంత్ కి చాలా ఇష్టం. ఈ రోజు గులాబులు నిండుగా పూసి, అత్యంత శోభాయమానంగా ఉందది. చెంపల మీది నుంచి కారుతున్న కన్నీటిని తుడవకుండానే, తను కొన్ని పూలు కోసి, చేతిలోకి తీసుకుంది.
వీధిలోకి వచ్చి రిక్షా ఎక్కింది. అది తనకి బాగా పరిచయమైన దారి. వర్షా బహెన్ ఇంట్లో లేని రోజుల్లో ప్రశాంత్ ని తను చూస్తూ ఉండేది. అలాంటప్పుడు చాలాసేపు ఆ ఇంట్లోనే ఉండవలసి వచ్చేది. ఆఫీసు నుంచి ఇద్దరూ కలిసే ఇంటికి వచ్చేవారు. సాయంత్రం పూట వరండాలో కుర్చీల్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సమయం ఎలా గడిచిందో తెలిసేది కాదు.
రిక్షా ఎడం చేతివైపు తిరిగింది. పెద్ద గుల్మోహార్ చెట్టు దర్శనం ఇచ్చింది. ఇక్కడే! ఒకనాడు ప్రశాంత్ తో చిన్న తగాదా వచ్చింది. తను కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అక్కడి నుంచే! తరవాత రెండు రోజుల పాటు తను ప్రశాంత్ తో మాట్లాడ లేదు. అతను ఫోను చేస్తే రిసీవరు తీసి పెట్టేసింది.
ఇంటి దాకా వచ్చాక ఆమెలో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ప్రశాంత్ లేని ప్రశాంత్ ఇంట్లో తాను కాలు పెడుతోందన్న భావన తనను బాధించ సాగింది.
ఇంటి బయట కార్లూ, స్కూటర్లు ఆగి ఉన్నాయి. పరిచితులు, అపరిచితులు అయిన వ్యక్తులు వస్తున్నారు వెళ్తున్నారు. తను సంకోచిస్తూ ఒక మూలన నిలబడింది. అయినప్పటికీ ఎన్నో కళ్ళు తనను గమనిస్తూనే ఉన్నాయి. గదిలోంచి వస్తువులన్నీ బైటికి తీసేశారు. మధ్యలో నేల మీద ప్రశాంత్ పడుకుని ఉన్నాడు. పూలతో కప్పేశారు. తల మీద పల్చగా ఉన్న వెంట్రుకలు గాలికి అల్లాడుతున్నాయి. కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి. వాటి మీద చేయి వేసి తను అంటూ ఉండేది. “ఇక నెమ్మదిగా నీ జుట్టు అంతా తెల్లబడి పోతుంది.” ప్రశాంత్ తేలిగ్గా నవ్వేసి, “నీకు దగ్గరగా ఇంతకాలం గడుపుతూ ఉంటే తెల్లబడక ఏమవుతుంది?” అనేవాడు.
శరీరం మీద జల్లిన ఎర్ర గులాబీ రేకులు గాలికి కదులుతూ ఉంటే, ఆ కదలికకి, ప్రశాంత్ చేయి పైకెత్తాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తోంది. ఉన్నట్టుండి “ఆ(! నువ్వు వచ్చావా? ఈ రోజు ఆఫీసుకి వెళ్ళలేదా?” అని అడిగినట్టనిపించింది.
అలాగే నిశ్చలంగా పడుకుని ఉన్న ప్రశాంత్ ని కౌగలించుకుని గట్టిగా ఏడవాలని పిస్తోంది. మానమర్యాదల్ని పక్కన పెట్టేసి. అలాగయితే తప్ప ఈ వేదనకి అంతం లేదు. వర్షా బహెన్ అలాగే ఏడుస్తోంది కదా! ఎంత మంది స్త్రీలు ఆమెకు సాంత్వన వాక్యాలు పలుకుతున్నారు! ఆమె ప్రశాంత్ నుదుటి మీద చేయి వేసి, రాస్తూ, వెక్కి, వెక్కి ఏడుస్తోంది. అదే సమయంలో తమ ఇద్దరి చూపులు కలిశాయి. వెనువెంటనే ఆమె మళ్లి రోదించ సాగింది.
“వర్షా బహెన్! ఇక ఊరుకో! నువ్వు కాస్త ధైర్యం చిక్కబట్టుకోవాలి. ….”
“ప్రశాంత్ ఎంతో అదృష్టవంతుడు. ఇలాంటి మృత్యువు అందరికీ రాదు. కళ్ళు మూసి తెరిచేటంతలో అంతా అయిపోయింది. ఇంకా నిద్రపోతున్నట్టే ఆ ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో! …”
ఎవరెవరో ఏమేమిటో అంటున్నారు.
ప్రశాంత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నప్పుడు తనని జ్జాపకం చేసుకున్నాడో లేదో! ఆ సమయంలో తనాతని సమక్షంలో ఉంటే బాగుండేది. తానైతే ఆ సాయంత్రం వచ్చి, ప్రశాంత్ తో గడపబోయే మధుర క్షణాల గురించే ఆలోచించ గలిగింది. కాని, ప్రశాంత్ ఇలా అర్థాంతరంగా, తనతో చెప్పకుండా, తన అనుమతి తీసుకోకుండా, తనకేమాత్రం తెలియని మరో దిక్కుగా వెళ్లిపోతాడని ఊహించలేకపోయింది.
వర్షా బహెన్ ఏడుస్తూనే ఎవరితోనో చెప్పుతోంది. “రాత్రి సుమారు పది గంటలకి కాబోలు. కడుపులో ఏదో గాభరాగా ఉందని, గొంతు ఎండి పోతున్నట్టుందని అన్నాడు. నిమ్మకాయ రసం తెద్దామని నేనిలా వంటింట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంకేముంది? అంతా అయిపోయింది. డాక్టర్ని పిలిచే టైము కూడా లేదు. “
“అవును. అలాగే అవుతుంది. జరగవలసిందేదో జరిగిపోయింది. మనం ఎంత సేపు దేవుళ్ళాడినా పోయిన ప్రాణం తిరిగి రాదు. నీ నోరెండి పోతోంది. కాసిని మంచి నీళ్ళు తాగు. ఇంక ఊరుకో!” ఒక స్త్రీ ఆమెను ఓదారుస్తోంది.
తను అలా మూలనే నిశ్చేష్టురాలై నిలబడి ఉంది. రాత్రి పది గంటలకే అంతా అయిపోయిందన్న మాట. తనకి తెల్లారి పది గంటలకి కాని కబురు తెలియ లేదు. తెచ్చిన గులాబీలు చేతిలో అలానే ఉండి పోయాయి. ముందుకు వెళ్లి ప్రశాంత్ కి ఇష్టమైన ఆ తెల్ల గులాబీలు అతని భౌతిక కాయం మీద పెట్టే ధైర్యం చేయలేక పోయింది తాను. నిలువునా కూలబడి పోతానేమో నని భయపడింది.
బైట హడావుడి ఎక్కువైంది. కార్లూ, స్కూటర్లు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి. వెళ్తున్నాయి. బహుశా శవవాహిక కూడా వచ్చే ఉంటుంది. ఇంక ప్రశాంత్ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అంతిమ యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి. నీళ్ళతో నిండిన తన కళ్ళకి అవన్నీ అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రశాంత్ ని ఎత్తి పట్టుకున్నారు. వర్షా బహెన్ విరుచుకు పడిపోయింది. “నన్ను కూడా తీసుకు పొండి” ఏడుపు మధ్యలో ఆమె అంటున్న మాటలు తన చెవుల్ని తాకాయి.
ఒక్కసారి ప్రశాంత్ ముఖాన్ని చూడగలిగితే! ఒక్కసారి ఆ నుదుటి మీద చేయి వేసి రాయగలిగితే! తానంత దూరంగా కూడా లేదు. కేవలం అయిదారడుగులు మాత్రమే. కాని తను అడుగు ముందుకు వేయలేకపోయింది. తనని ఏదో అదృశ్య హస్తం ఆపు జేసింది. అయినా వర్షాబహెన్ ప్రశాంత్ శరీరాన్ని అంటిపెట్టుకుని వదలడం లేదు. కంపిస్తున్న చేతిలో గులాబులు కూడా కంపించసాగాయి. ప్రశాంత్ తనకి అతి సమీపంగానే నలుగురు మనుషుల భుజాల మీదుగా వెళ్లి పోయాడు.
కాసేపట్లో కాంపౌండు అంతా ఖాళి అయింది. వరండాలో మాధవీలతల పందిరి క్రింద రెండు కుర్చీలు ఖాళీగా పడి ఉన్నాయి. అక్కడే తామిద్దరూ కూర్చునేవారు. ఆడవాళ్ళంతా కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చారు. అక్కడ తానొకర్తె ఉందన్న విషయాన్ని కూడా విస్మరించి, అందరూ వర్షా బహెన్ చుట్టూ చేరారు. వారెవరూ తన ఉనికిని గుర్తించ లేదు. ఇక ఆమె అక్కడ నిలబడ లేకపోయింది.
ఏ సమయంలో నైనా తను స్పృహ తప్పి పడిపోవచ్చు. ఇక్కడి నుంచి తక్షణం నిష్క్రమించడం మంచిది. అసహాయురాలై రెండు చేతులు ఎత్తి, ఆ పైవాడికో నమస్కారం చేసి, ఇంటి బైటికి వచ్చింది. వర్షా బహెన్ తనను చూడను కూడా లేదు.
తనను ఉప్పుసముద్రంలాంటి కన్నీరు చుట్టుముట్టింది. వేదనా భరిత హృదయాన్ని తుపాను తనలోకి లాక్కుపోతోంది.
సరిగ్గా అదే సమయంలో ఎవరో తనకో చేయి అందించారు. తానాశ్చర్య పోయింది. కళ్ళు తుడుచుకుని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని పోల్చుకునేందుకు ప్రయత్నం చేసింది. కాని అలసిన కళ్ళు, ఉదాసీనమైన మనసు. బాధతో నిండిన హృదయం సహాయనిరాకరణం చేశాయి. తను అలానే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.
“నువ్వు…. నువ్వు….? శ్రద్దా వి కదూ? నేను మాలతిని. ప్రశాంత్ చెల్లెల్ని. అదే… … పెద్దనాన్న కూతుర్ని. మనం ఎప్పుడూ కలుసుకోలేదు. కాని నీ పేరుతో నిన్నెరుగుదును. నాలుగు సంవత్సరాల క్రితం నేను ఒకసారి వచ్చాను. కాని అప్పుడు నువ్వు ఊళ్ళో లేవు. నేను దూరంగా ఉండడం వల్ల అరుదుగా వస్తూ ఉంటాను. కాని నిన్ను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని నా కోరిక. ఈ సారి పది పదిహేను రోజులు ఉంటాను. తప్పక వస్తాను. ….”
తను ఎదురుగా నిలబడిన ఆ అజ్జాత వ్యక్తిని హఠాత్తుగా కౌగలించుకుంది.
స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.
Discussion about this post