హిందీ మూలం: కవితా గుప్తా
తెలుగు అనువాదం : డా. వెన్నా వల్లభరావు
సీతా!
నీపై కవిత రాయమంటున్నారు
ఏదో ఒక కవిత
కానీ ఏం రాయను?
భూమి సుతవని
రాముని పత్నివని.
వనవాసం చేశావని
పాతివ్రత్య నిరూపణకు
అగ్నిలో దూకావని రాయనా?
అయినా రాముని ద్వారానే
మోసంతో అడవికి పంపివెయ్యబడ్డావని-
అందునా
నిండు గర్భవతిగా ఉన్న నువ్వు!
సీతా!
నీపై ఏమని రాయను కవిత?
పాతివ్రత్య ధర్మాన్ని పాటించావని
అయినా
ఒకానొక రోజున నువ్వు కూడా
మరల భూమాత ఒడినే చేరావని రాయనా?
సీతా!
ఇదంతా కవితవుతుందా…?
సీతా!
నువ్వు కూడా పిండంగా రూపుదాల్చి జన్మించిఉంటే
అల్ట్రా సౌండ్ నుండి తప్పించుకుని
అమ్మా నాన్నల తృణీకారపు పెంపకంలో
బిక్కుబిక్కుమంటూ పెరిగి ఉంటే
ఎవరో షేక్ కు అమ్మివేయబడి ఉంటేనో
మిసిమి వయసులోనే
లేక
వరకట్నపు వధ్యశిలపై నీ శిరస్సు ఉంచబడి ఉంటేనో
నీపై కవిత రాయగలిగి ఉండేదాన్ని.
సీతా!
నీపై ఎలా రాయను కవిత?
ఏమని రాయమంటావో నువ్వే చెప్పు!
ఉద్యోగం చేస్తూ
కుటుంబాన్ని పోషించే సంఘర్షణ
నువ్వు అనుభవించలేదే!
అయినవాళ్ళ ద్వారానే
తిరగలి రాళ్ళమధ్యకి నువ్వు వెట్టివెయ్యబడలేదే!
వాస్తవం ఏమిటంటే
‘భూమిలోపల’ నీకు
ఆత్మాభిమానపు పోరు సల్పాల్సిరాలేదు!.
నువ్వు పక్షిగా మారి
ఆకాశంలోకి ఎగిరిపోయుంటే ఎంతబాగుండేది!
సీతా!
అప్పుడు నేను
నీపై కవిత తప్పకుండా రాసుండేదాన్ని
నువ్వు నేటి యుగంలో పుట్టిఉంటే
తప్పకుండా రాసుండేదాన్ని నీపై కవిత!
తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి కథ, కవిత, నాటకం మొదలైన ప్రక్రియల్లో గత 4 దశాబ్దాలుగా అనువాదాలు. రెండు భాషల్లో స్వీయ రచనలు. ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడలో హిందీ శాఖాధ్యక్షునిగా 3 దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ. 20 పుస్తకాల ప్రచురణతో పాటు పలు పత్రికల్లో అనువాద రచనల ప్రచురణ. సుమారు 60 ఆకాశవాణి జాతీయ నాటకాలు (హిందీ-తెలుగు-హిందీ) అనువాదాలు ప్రసారం. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం.
Discussion about this post