మూలం : మపాసా
అనువాదం : ఉమా నూతక్కి
రెండు సంవత్సరాల క్రితం ఒక వసంత వేళ మధ్యధరా సముద్ర తీరం వెంబడి నెమ్మదిగా నడుస్తున్నాను. ఏకాంతంగా నడుస్తూ ధ్యానంలోకి వెళ్ళడం కన్నా సౌఖ్యమేముంటుంది? కొండ పాదాల వద్ద, సముద్రపుటొడ్డున నెమ్మదిగా నడుస్తున్నప్పుడు, నులివెచ్చని శశి కిరణాలని, నెమ్మదిగా తట్టే చలి తెమ్మెరనీ అనుభవిస్తాం. ఆ రెండు గంటలూ నడిచే మనిషి కలల్లోకి ఆ కాసేపూ ఎన్ని ఊహలూ, ఎన్నెన్ని వింతలూ, ఏమేమి కవిత్వాలు… ఉల్లాసపరిచేవో, ఉలిక్కి పడేవో, ఎవేవో ఆశలు, నులివెచ్చని గాలితో కలిసి చొరబడతాయి. ఆ పిల్ల తెమ్మెరని అతను తన గుండెలనిండుగా పీల్చుకుంటాడు. అవి అతనిలో ఒక తృష్ణని రేపి నడకవల్ల కలిగిన ఆకలి వలే అది మరింత పెరగడానికి దోహదమవుతాయి. తీయని తలపులేవో పక్షుల రాగాల్లా అతని ఆత్మలో గానం చేస్తాయి.
సెయింట్ రఫెల్ నుంచి ఇటలీకి వెళ్ళే ఆ దారి వెంట నడుస్తున్నా, లేదా ఈ విశ్వంలోని ప్రేమకవితలన్నిటిని పరిచినట్లున్న అత్యద్భుతమైన దారిలో నా పయనం సాగుతోంది. అద్భుతమైన ఈ నీలాకాశం కింద, అందమైన ఈ గులాబీ, నారింజ తోటల మధ్యకి, వ్యయప్రయాసల కోర్చీ ఎవరన్నా వస్తారా..! ఒకవేళ వచ్చారంటే దానికి కారణం ఏవో తెలివైన సాకులు, పనికిమాలిన ప్రలోభాలే అనుకుంటాను. అదీ కాక మనిషి మనసు ఎంత అవివేకమైనదో, ఎంత సంకుచితమైనదో, ఎంత అహంకార పూరితమైనదో కదా అనుకుంటాను.
అత్యద్భుతమైన ఆ తీరాన నడుస్తూ అకస్త్మాత్తుగా ఒక మలుపులో ఉన్న నాలుగైదుకి మించని బంగళాల సముదాయం చూసాను. సముద్రానికి ఎదురుగా పర్వత పాదంలో ఉన్నట్లున్నాయవి. ఆ బంగళాల వెనుక రెండు లోయలున్నప్పటికీ అవి కనపడకుండా దట్టమైన దేవదారు వృక్షాలున్న అడవి కప్పేసి దారులేం లేవన్నట్లు చెప్తోంది. అలా వెళ్తున్న నేను పొదరిల్లు లాంటి బంగళా ముందు అప్రయత్నంగా ఆగిపోయాను. రాగి రంగు నగిషీలున్న అందమైన తెల్లని ఇంటి పైకప్పంతా గులాబీలతో కప్పి ఉంది. ఆ ఇంటి చుట్టూ ఉన్న తోటంతా కావాలనే నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల ఇష్టారాజ్యంగా పలు వన్నె చిన్నెల పూల మొక్కలు విరబూశాయి.
పూలశయ్యని పరచినట్లున్న ఆవరణ. వరండా మెట్ల మీద కుండీలో ఉన్న లతలు సాగి పైపైకి పోతున్నాయి. కిటికీల మీదుగా ఊదారంగు ద్రాక్షపండ్ల గుత్తులు వేలాడుతున్నాయి. అందమైన ఆ ఇంటి చుట్టూ ఉన్న రాతి ప్రహరీ చుట్టూ తీగలుగా అల్లుకుని నెత్తుటి చుక్కల్లా మెరుస్తున్న అగ్నిపూలు. ఇంటివెనుక పర్వత పాదం వరకు బారులు తీరి చెట్లు నిండా పూతతో ఉన్న నారింజ చెట్లు.
ఆ బంగళా వాకిటి తలుపు మీద మెరుస్తున్న బంగారం రంగులో చిన్న అక్షరాలున్నాయి. “పురామందిరం”. ఈ ఇల్లు ఏ భావకుడైన కవిదో, లేక ఏ దివ్య ప్రేమికురాలి నివాసమో అని నాలో నేను అనుకున్నాను. అనంతమైన పూల రాశుల మధ్య నుంచి వసంతానికి సాక్షాత్కరించిన ఈ స్వప్నసౌధాన్ని ఏ ఏకాంతుడు శోధించి కనుగొన్నాడో కదా.
ఆ ఇంటికి కాస్త దగ్గరలో రోడ్డు మీద రాళ్ళు కొడుతున్నాడో పనివాడు. ఈ అందమైన పొదరిల్లు ఎవరిదీ.. అనడిగానతన్ని. నిన్నటి తరపు నటీమణి, “జూలీ రొమైన్” ఇల్లు అన్నాడు.
జూలీ రొమైన్! బాగా పరిచయమున్న పేరది. నా చిన్నప్పుడు ఆమె గురించిన సంగతులు తెగ వినేవాణ్ణి. రచెల్ కి దీటుగా పేరొందిన గొప్ప తార. ఆరోజుల్లో అంత ప్రేమాస్పదురాలైన మహిళ, అంత కీర్తిని పొందిన మహిళ వేరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె ప్రేమని పొందాలని ఎంత పోటీ.. ఆమె కోసం ఎంతమంది పరస్పరం యుద్ధాలు చేసుకుని ఉంటారు.. ఎన్ని ఆత్మహత్యలు.. ఎన్నెన్ని సాహసాలు.. ఇప్పుడా వన్నెలాడి వయసు ఎంతో..? అరవై.. కాదు డబ్భై.. ఊహూ కచ్చితంగా డబ్భై ఐదేళ్ళు. అలనాటి అందాల తార జూలీ రోమైన్ ఈ వయసులో ఈ ఇంట్లోనా.. అప్పటికి నా వయసు పన్నెండేళ్ళు. ఆ రోజుల్లో ఆమె ఫ్రాన్స్ అంతటినీ ఒక ఊపు ఊపేది. అప్పటి సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నా. మొదటి ప్రేమికునితో గొడవలు రచ్చకెక్కాక, కవిగా ఉన్న ఇంకో ప్రేమికుడితో సిసిలీ కి లేచిపోవడం అప్పట్లో ఒక సంచలనం.
నాకిప్పటికీ గుర్తు. నాటకంలో తొలిరాత్రి అనుభవాన్ని ఆమె అభినయించిన తీరుకి ప్రేక్షకులు ఉన్మాదంగా “మరొక్కసారి” అంటూ పదకొండు సార్లు నటింపచేసిన రాత్రే ఆమె తన కొత్త ప్రియుడితో లేచిపోయింది. అప్పటి సాంప్రదాయం ప్రకారం రెండు గుర్రాలు లాగుతున్న బగ్గీలో ఆమె ఆ కవితో వెళ్ళిపోయింది. వాళ్ళలా సముద్రాన్ని దాటి పాలెర్మో పరిసరాల్లో నారింజ చెట్లతో నిండిన ఒక ప్రాచీన ద్వీపానికి చేరుకున్నారు. ఇట్నా అగ్నిపర్వతపు అంచుల్లో చెట్టాపట్టాలు వేసుకుని, చెక్కిళ్ళని రాసుకుంటూ ఆ అగాథానికి తమని తాము అర్పించుకోవడానికి అన్నట్లు పర్వతాన్ని అధిరోహించడం గురించి ఎన్నెన్ని పుకార్లో.
ఆమె ప్రియుడు గొప్ప కవి. అత్యంత ప్రభావశీలమైన కవిత్వాన్ని అందించిన అతనిప్పుడు లేడు. ఒక తరాన్ని విభ్రమానికి గురి చేసిన కవితలు, గాఢతతోనూ నిగూఢతతోనూ తోటి కవులకి నూతన ప్రపంచపు ద్వారాలను తెరిచిన కవితలని అందించిన ఆ కవి మరణించాడు. అమరత్వ సంగీతాన్ని ఆమె కోసం అందించి , గెలుపు ఓటముల పాటలను గానం చేస్తూ హృదయాల్ని బరువెక్కించే రాగాలు కట్టిన ఆమె మాజీ ప్రియుడు కూడా కన్ను మూసాడు.
చివరికి ఈ పొదరిల్లు లాంటి ఇంట్లోఆమె జీవించి ఉంది.
నేనేమాత్రం సందేహించకుండా తలుపు తట్టాను. మురికి దేహంతో బెరుగ్గా ఉన్న పద్దెనిమిదేళ్ళ కుర్రాడు, ఆ మురికి చేతుల్తోనే తలుపు తెరిచాడు. నా దగ్గర ఉన్న నా కార్డుని తీసి దాని వెనక ఒక అందమైన ప్రశంసనీ, ఆమెని కలవాలంటూ ఒక విన్నపాన్ని రాసి అతనికి ఇచ్చాను. బహుశా ఆమె నా పేరు వినే ఉంటుంది. కలవడానికి అభ్యంతరం ఉండక పోవచ్చు.
నా కార్డు తీసుకు వెళ్ళిన పనివాడు వెంటనే వెనక్కి వచ్చి తనతో రమ్మన్నాడు. అతనితో కలిసి ముందు గదిలోకి నడిచాను. అక్కడ ఎంతో భారీగా ఉన్న సామానంతా లూయీస్ ఫిలిప్పీ స్టైల్ లో అలంకరించి ఉంది. బలహీనంగా ఉన్న ఓ పదహారేళ్ళ అమ్మాయి మర్యాదగా నేను కూర్చునేందుకు వీలుగా కుర్చీని సర్దింది. నన్నక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు. ఆ గదిని పరిశీలనగా చూసాను. గోడలకి మూడు చిత్రపటాలు తగిలించి ఉన్నాయి. ఒకటి జూలీ రొమైన్ అలనాటి చిత్రపటం. మరోటి అప్పట్లో వేసుకునే కుచ్చుల చొక్కా, నడుము దగ్గర బిగుతుగా ఉన్న పొడవాటి కోటు వేసుకున్న ఆమె కవి ప్రియుడిది. ఇక మూడోది, పియానో ముందు కూర్చుని ఉన్న ఓ సంగీత కారుడిది. చిత్రంలో ఆమె రూపలావణ్యం తెల్లగా మెరుపులీనుతోంది. ఆమె అందం కళ్ళు చెదిరేలా ఉంది. కానీ అది అప్పటి రీతికి తగినట్లు ఉండడం వల్ల కొంచం భిన్నంగా ఉంది. ఆమె నీలికళ్ళ మీద చిరునవ్వు మెరుస్తుంటే ఆమె అధరాలు అమృతం చిందించేలా ఉన్నాయి. ఆ చిత్రకళా సౌందర్యం అత్యున్నత సృజన. మూడు చిత్రపటాల్లో ఉన్నవారు తమ తరాన్నుంచి తర్వాత తరం వారి హృదయాల్లోకి తొంగి చూస్తున్నట్లుంది. ఆ చిత్రాల పరిసరాలు గతపు సమీరంలో వర్తమానానికి మిగలని వారి వ్యక్తిత్వాలతో నిండినట్లు అనిపించింది.
ఇంతలో తలుపు దగ్గర శబ్దం. తలుపు తెరుచుకుని బాగా వయసు మళ్ళిన, కృంగిపోయిన, కనుబొమ్మలు కూడా నెరిసిపోయిన జుత్తుతో, తడబడుతూ వడివడిగా నడుస్తున్న ఒకామె వచ్చింది. ఆమెని చూస్తే తెల్లని చిట్టెలుక గుర్తొచ్చింది. నాతో చేయి కలుపుతూ అభిమానంగా, “రండి.. దయచేసి కూర్చోండి. ముసలితనం వెంటాడే నిన్నటి తరాల స్త్రీలని ఇప్పటి యువకులు తలచుకోవడం ఎంత గొప్ప విషయం” అందామె.
నేను నడుస్తున్న దారిలో ఈ ఇల్లు ఎంతగానో ఆకట్టుకుందనీ, ఈ ఇంటి యజమాని ఎవరా అని వాకబు చేసినప్పుడు అది ఆమె అని తెలిసాక ఇంక నిలవలేక తలుపు తట్టాననీ చెప్పాను.
“మీరు రావడం నాకెంతో సంతోషంగా ఉంది బాబూ. ఇలా జరగడం ఇదే మొదటిసారి. గొప్ప ప్రశంసని మోసుకొచ్చిన మీ కార్డు చూసి రెండు దశాబ్దాల కిందటి పాత స్నేహితుడు వచ్చాడనుకుని సంభ్రమానికి గురయ్యాను. ఈ లోకం నన్ను ఎప్పుడో మర్చిపోయింది. నిజంగానే నేనెవరికీ గుర్తులేను. ఇక ముందు నేను చనిపోయే రోజు తప్ప ఎవరూ నన్ను తల్చుకోరేమో. నేను పోయాక ఒక మూడు రోజులు పత్రికలన్నీ జూలి రొమైన్ ని తలుచుకుంటాయి. నా జీవిత విశేషాలని ప్రస్తావిస్తూ, అప్పటి జ్ఞాపకాలని తిరగ దోడుతూ అనేకానేక పొగడ్తలతో నాకు ముగింపు నిస్తాయి”
కొన్ని క్షణాలాగి మళ్ళీ మొదలుపెట్టింది.
“దీనికంతా ఎంతో దూరం లేదు. కొన్ని రోజులు, లేక కొన్ని నెలలు. ఈ నిర్భాగ్యురాలి అస్థిపంజరం తప్ప మరేం మిగిలి ఉండదు”
కృంగిపోయి ఉన్న ఇప్పటి ఆమె రూపాన్ని చూసి నవ్వుతున్నట్లు ఉన్న చిత్రపటాన్ని కళ్ళెత్తి చూసిందామె. ఆ పక్కన ఉన్న ఇద్దరు ప్రియులు- ఒక ఆడంబరపు కవి, ఇంకో అరాటపు సంగీత కారుడిని చూసింది. “ఈ శిధిల లావణ్యం మానుంచి ఏం కోరుకుంటోంది”, అని నిలదీసినట్లు అనిపించింది కాబోలు.
నీళ్ళలోకి జారిపోతున్న మనిషి శ్వాసకోసం గిలాగిలలాడినట్లు, జీవచ్ఛవాలుగా మిగిలి జ్ఞాపకాలలో పెనుగులాడే వారిని చుట్టేసే ఒకలాంటి ఆవేదన, ఒకలాంటి దుఃఖం ఆవరించింది నన్ను.
ఆ గదిలో కూర్చుని కిటికీలోంచి, నైన్ నుంచి మాంటెకర్లో కు వేగంగా వెళ్తున్న గుర్రపు బగ్గీల్ని చూస్తున్నా. అందులో తుళ్ళుతూ నవ్వుతూ వెళ్తున్న అందమైన, ఆనందమైన ధనవంతులైన మహిళలు, సంతృప్తిగా ఉన్న పురుషులూ కనిపిస్తున్నారు. నా భావాలు పసిగట్టినట్లు గొణిగింది ఆమె.”పొందగలిగి.. లేకుండా ఉండడం ఏకకాలంలో సాధ్యం కాదు.”
“ఎంత అందమైన జీవితం అయి ఉంటుంది మీది” అన్నాను.
గాఢంగా నిట్టూర్చిందామె. ” అవును, నిజమే అతిసుందరం, సుమధురం! దానిగురించే ఎప్పుడూ నా బాధ” అంది.
ఆమె తన గురించి చెప్పడానికి సిద్ధమైందని అర్ధమయ్యి గాయాన్ని తాకినంత సున్నితంగా జాగ్రత్తగా ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టాను. ఆమె తన విజయాల గురించి, మత్తులో ముంచిన ఆనందాలగురించి, స్నేహితుల గురించి, గెలుపు కథల్ని చెప్పుకొచ్చింది.
“నాటకరంగం వల్లనే కదా మీలో ఇంత గొప్ప సంతోషం, అవధులు లేని ఉత్సాహం” అని అడిగా.
“కాదు…” చప్పున అంది.
నవ్వాను; ఆమె విషాదంగా కళ్ళెత్తి ఆ చిత్రాలవేపు చూసి అంది,” అదంతా వారివల్ల”
“అందులో ఎవరివల్ల”, అడక్కుండా ఉండలేకపొయాను.
“ఇద్దరికీ ఋణపడే ఉన్నాను. నిజానికి వృద్ధాప్యం వల్ల చాలాసార్లు ఒకరికొకర్ని తారుమారు చేసేసుకుంటాను. ఆతర్వాత పశ్చాత్తాప పడతాను”.
“అయితే అమ్మా! మీరు ప్రేమభావనకే ఋణపడి పోయారేమో. వాళ్ళు కేవలం సాధనాలు మాత్రమే”.
‘‘అయుండొచ్చు. కానీ ఎంత అద్భుతమైన సాధనాలు”
“ఆ ఇద్దరి ప్రియుల వల్ల మీకు వదల్లేని ఇద్దరు శత్రువులు సంగీతం, కవిత్వంలా చేరువయ్యారు కదా…, ఒక సాధారణమైన మగవాడు తన మనసునీ, తన మొత్తం జీవితాన్ని, తన అస్తిత్వాన్ని, తన ప్రతీ ఆలోచననీ మీకే అర్పించి, మిమ్మల్ని ప్రేమించాల్సినంత తీవ్రంగా ప్రేమించలేదని మీరెప్పుడైనా అనుకున్నారా?”
ఆమె ఆ వయసులో కూడా నిత్యయవ్వనమైన స్వరంతో ఆక్రోశించింది. “లేదు బాబూ లేదు. ఒక సాధారణమైన మగాడు నన్ను ఎక్కువగానే ప్రేమించి ఉండేవాడేమో. కానీ, ఆ ఇద్దరూ ప్రేమించినంత స్థాయిలో అయితే కాదు.. ఈ విశ్వంలో ఇంకెవ్వరూ పాడనంత గొప్పగా ప్రేమగీతాన్ని పాడడం వారికే తెలుసు. ఎంత మైమరిపించారు నన్ను. అద్భుతమైన పదాలతో, సుస్వరాలతో వాళ్ళు వొడిసి పట్టినట్లుగా ప్రేమని వొడిసి పట్టడం ఎవరికైన సాధ్యమా.. ప్రేమలోకి కవిత్వాన్ని అంతా నింపేసి, భూమ్యాకాశాలని కమ్మేసిన సమస్త సంగీతాన్ని ప్రేమలో ఇమడ్చకపొతే ప్రేమించడం వృధా. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. తమ మాటలతో, పాటలతో చేతలతో ఒక స్త్రీని మోహ పారవశ్యపుటంచులకు తీసుకుపోవడం వాళ్ళకే తెలుసు. మా ప్రణయగాధలో వాస్తవాల కన్నా ఊహలే బలీయంగా ఉండవచ్చు కానీ, ఆ మాధుర్యాన్ని పంచే ఊహలే నిన్ను మేఘమాలికల్లోకి తీసుకెళ్తాయి. అవి వాస్తవాలైతే నేలమీదకి కుదేస్తాయి నిన్ను. నన్ను ఇతరులు కూడా ఇంతకన్నా అధికంగా ప్రేమించినా సరే, వారిద్దరి వల్ల మాత్రమే అపరిమితమైన ప్రేమని అందుకుని, అనుభూతి చెంది ఆరాధించగలిగాను.. ఇది సత్యం!”.
హఠాత్తుగా ఆమె మనసులో గడ్డకట్టిన దుఃఖం కన్నీరై నిశ్శబ్దంగా ధారకట్టడాన్ని గమనించనట్లుగా, కిటికీలోంచి ఎక్కడో కనిపించే దృశ్యాన్ని చూస్తుండిపోయాను. కొన్ని క్షణాల తర్వాత ఆమె మళ్ళీ సంభాషణ కొనసాగించింది.
“నీకు తెలుసా బాబూ? చాలా మందికి శరీరంతో పాటు మనసుకీ వయసు మళ్ళుతుంది కానీ, నా విషయంలో అలా జరగలేదు. వార్ధక్యంతో వడలిపోతున్న నా శరీరానికి 69 సంవత్సరాలు. కానీ నా మనసుకి మాత్రం ఇరవయ్యే. అందువల్లే నేనిలా పూలతోటల మధ్య నా స్వప్నాలతో ఒంటరిగా మిగిలాను.”
మా ఇద్దరి మధ్యా మళ్లీ కాసేపు మౌనపు నీడలు. తనని తాను సంబాళించుకుని చిరునవ్వుతో చెప్పిందిలా. “ఇప్పటికీ ఆహ్లాదకరమైన సాయంత్రాల్ని నేనెలా గడుపుతానో తెలిస్తే నవ్వుకుంటావు. నా వెర్రితనానికి నేనే సిగ్గుపడతాను. ఆ క్షణంలో నామీద నాకే అంతులేని జాలేస్తుంది కూడా”
ఆమె వెర్రితనమేమిటో అడగడం వృధా. ఆమె చెప్పదుగాక చెప్పదు. ఇక బయల్దేరడానికి లేచాను.
వెంటనే వారించిందామె.. “ఎందుకింత త్వరగా వెళిపోతారు”
మంటే కర్లోలో భోజనం చేయడానికి వెళ్తున్నానని చెప్పాను. కాస్త తటపటాయిస్తూ అందామె, “నాతో కలిసి భోజనం చేయడం ఇష్టం లేదా. నాకైతే అది చాలా సంతోషాన్నిస్తుంది.”
వెంటనే వప్పుకున్నాను. వెలిగిపోతున్న మొఖంతో, గంట మోగించి పనిపిల్లకు కొన్ని పనులు పురమాయించింది. ఇల్లంతా చూపించడానికి సంతోషంగా తీసుకెళ్ళింది.
వరండా చుట్టూ గాజు పరదాలు. మొత్తమంతా మొక్కలే. ఆచివరి నుంచి ఈ చివరి వరకూ చూడడానికి వీలుగా ఆ గది ద్వారాలు తెరిచున్నాయి. నారింజ చెట్లు బారులు తీరి పర్వత పాదాల వరకు కనిపిస్తున్నాయి. గుబురుగా ఉన్న పొదల మాటున మెత్తటి ఆసనం వంటి చోటు ప్రత్యేకంగా ఉంది. ఆమె తరచుగా అక్కడ కూర్చుంటుందని అర్ధమవుతోంది.
పూల అందాలను చూడడానికి తోటలోకి వెళ్ళాం. ఇహలోక పరవశ పరిమళాలు అన్నింటినీ మోసుకొస్తున్న నులివెచ్చని సాయంత్రమొకటి మృదువుగా ప్రవేశించింది. బాగా చీకటయ్యాక మేము భోజనాలకి కూర్చున్నాం. విందు అద్భుతంగా ఉంది. అక్కడే చాలా సమయం గడిపాం. ఆమె పట్ల గాఢమైన ఆపేక్ష మనసులో రూపుదిద్దుకుంది. రెండు గ్లాసుల వైన్ తాగాక ఆమె మరింత దగ్గరైంది.
మళ్ళీ మొదలెట్టిందామె, “పద అలా జాబిల్లిని చూసొద్దాం” అంది. ” ఈ చంద్రుడంటే నాకెంత ఇష్టమో తెలుసా. నా ఉత్సాహాలన్నిటికీ ఈ చందమామే ప్రత్యక్ష సాక్షి. నా మధురస్మృతులన్నీ ఇక్కడే పోగై ఉన్నాయనీ.. వాటిని తిరిగి తెచ్చుకోవాలంటే ఆ వెన్నెలరాశిని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది నాకు. ఎంతో అందమైన దృశ్యాన్ని నాకు నేనే కల్పించుకుంటాను. ఆహా వద్దులే.. చెప్పాననుకో.. నన్ను మరీ ఎగతాళి చేస్తావు. అందుకే నీకు చెప్పలేను. అస్సలు చెప్పలేను..”
ఆమె మాటలు నాకు మరింత ఆసక్తిని పెంచాయి.
“చెప్పండి.. ఇప్పుడే చెప్పండి. నేను నవ్వనంటే నవ్వను. ఒట్టు వేస్తున్నా. దయచేసి చెప్పండి” ఆమెను ప్రాధేయపడ్డాను.
ఆమె ఇంకా తటపటాయిస్తోంది. ఆ సమయంలోనే తన చల్లని, సన్నని, బలహీనమైన చేతుల్ని అపురూపంగా పట్టుకుని, ఆ రోజుల్లో ఆమె ప్రియులు చేసినట్లు ఒకటి తర్వాత మరొకటిగా పదే పదే ముద్దులు పెట్టాను. ఆమె కదిలిపోయింది. అయినా ఇంకా సంశయాలతోనే ఉంది.
“నవ్వనని ఒట్టేసావు”
“అవును, ఒట్టు..”
“సరే అయితే రా..” అంది. ఇద్దరం అక్కడ నుంచి లేచాం. ఆమె లేచాకా కుర్చీని వెనక్కి లాగి నుంచున్నా ఆ మురికి పనబ్బాయి చెవిలో చిన్నగా ఏదో చెప్పిందామె.
“అలాగేనమ్మా” జవాబిచ్చాడతను.
ఆమె నాచేతిని పట్టుకుని వరండా వైపు నడిచింది. నారింజ చెట్ల మధ్య దారి అద్భుతంగా ఉంది. ఆ చెట్ల వరసంతా చంద్రుడు పల్చని వెండి గీత గీస్తున్నాడు. చిక్కగా ఉన్న చెట్ల కొమ్మల మధ్య నుంచి ఒక సన్నని వెలుగు రేఖ పసుపురంగులో మెరుస్తున్న ఇసుక మీద పడింది. మంచి పూతమీదున్న చెట్ల పరిమళంతో గాలి నిండిపోయింది. ఆ నిశీధి పొదల్లో వేవేల మిణుగురులు ఆకాశంలోని నక్షత్రాల్లా కాంతిని చిమ్ముతున్నాయి.
“ప్రణయ సందర్భానికి ఎంత అనువైన సందర్భం..” ఉద్విగ్నంగా అన్నాను.
“కదా.. కదా… నువ్విప్పుడు చూస్తావ్” నవ్వుతూ అంది.
తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పడం మొదలెట్టింది.
అలాంటి ప్రణయ సన్నివేశాలను తలచుకుంటే ఏదో కోల్పోయిన దిగులు అలుముకుంటుంది. మీతరం.. ఇప్పటి మీతరం మగాళ్ళు ఇలాంటివి కలలో కూడా ఊహించలేరు. మీకు మాతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఒక దర్జీవాడి రశీదులోంచి ఊడిపడిన ఆర్ధిక లావాదేవిల్లా మారిపోయాయి. ఒకవేళ ఆ అమ్మాయికన్నా ఆ రశీదు ముఖ్యమనిపిస్తే మీరు అక్కడనుంచి పారిపోతారు. హ్మ్మ్మ్.. ఏం పద్ధతులు.. ఏం ప్రేమలు”
అలా అంటూనే నాచేతిని తన చేతిలోకి తీసుకుని అంది. “చూడు”
అటు చూసిన నాకు, అక్కడ కనిపించిన సమ్మోహన దృశ్యం సంభ్రమాశ్చార్యాలను కలిగించింది.
కింద చెట్ల వరసల దారి చివర వెన్నెల వెలుగులో నిండారా తడిసిపోతూ ఓ యువజంట తమ చేతుల్తో నడుములు పెనవేసుకుని నడుస్తోంది. అలా కనిపిస్తూనే కాసేపటికి ఆ జంట చీకట్లోకి మాయమయ్యింది. అంతలోనే తిరిగి మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. పద్దెనిమిదో శతాబ్దంలో ధరించే తెల్లటి మెత్తటి వస్త్రాల్లో ఆ యువకుడు ముస్తాబయ్యాడు. తలపై టోపీ దానిమీద ఉష్ట్రపక్షి ఈక చక్కగా అమరాయి. అతని పక్కన ఉన్న అమ్మాయి అందమైన పొడుగాటి గౌను వేసుకుంది. రాచరికపు రోజుల్లోని రాణులని తలపించేలా ఆమె తన జుత్తుని అలంకరించుకుంది.
అలా వస్తూ వస్తూ మాకొక వంద గజాల దూరంలో ఆగారు. చెట్లవరసల మధ్య ఆగి ఒకర్నొకరు ముద్దులు పెట్టుకుంటూ తమకంగా అల్లుకుపోతున్నారు.
నేను వారిని గుర్తుపట్టాను. అంతకు ముందు చూసిన పనివాళ్ళే వాళ్ళు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలి అనిపించింది. కానీ, నేను నవ్వలేదు. నవ్వుని ఆపుకోవడం కష్టమైంది. కాలు విరిగిన వ్యక్తి ఏడుపు ఆపుకోవడం ఎంతకష్టమో.. నేను నా నవ్వుని ఆపడం కూడా అంతే కష్టమైంది.
అప్పుడా ప్రేమ జంట వెనుతిరిగి తోట చివరికి వెళ్ళిపోయింది. వారు దూరం అవుతున్న కొద్దీ కనుమరుగైన ఆ దృశ్యానికి ప్రకృతి సోయగం తోడవుతోంది. వారు కనుమరుగయ్యాక నా కల మాయమయినట్లు ఆ ఒంటరిదారి విషాదపు నెలవుగా అనిపించింది.
మళ్ళీ చూడలేక శెలవు తీసుకుని వచ్చేసాను. అది మనిషిని మైమరిపించే కాల్పనికమైన గతం. కరిగిపోయిన ఆమె ప్రణయ నేపధ్యాన్ని మరల మరల జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఆ చిన్ని నాటకం అలా కొనసాగుతూనే ఉంటుంది.
LIC లో ఆఫీసర్ గా పనిచేస్తున్నా. చదవడం ఇష్టమైన విషయం. కొన్ని కథలు రాసాను. 25 వ గంట కథల సంపుటి వచ్చింది. మంకెన పువ్వు పేరుతో భూమిక లో మూడేళ్ల పాటు శీర్షిక రాసాను. కొన్ని అనువాదాలు కూడా. ఇప్పటికీ రాయడం కంటే చదవడమే ఇష్టం.
Discussion about this post