మూలకథ రచయిత : లియొనార్డో షాషా
తెలుగు అనువాదం : ఏవి రమణమూర్తి
చిక్కటి చీకటి పరుచుకుని ఉన్న రాత్రి వీళ్లందరి కోసమే సిద్ధమైనట్టుగా ఉంది. సముద్రపు ఘోషతో బాటు, పాదాల్ని తాకీ తాకగానే అంతమవుతున్న అలలు సముద్రపు భారమైన ఊపిరిలా భయం కలిగిస్తున్నాయి.
జెలా, లికాటా నగరాల మధ్యనున్న ఆ తీరప్రాంతంలో వాళ్ల అట్టపెట్టెలూ, మిగతా సామానుతో అక్కడున్న రాళ్లవరస మీద నిలుచుని ఉన్నారు వారంతా. సుదూరంగా ఉన్న పల్లెప్రాంతాలనుంచి ఎప్పుడో ఉదయాన ప్రయాణం ప్రారంభించి చీకటిపడే సమయానికి అక్కడికి చేరుకున్నారు. వాళ్లల్లో కొంతమందికైతే సముద్రాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఇటలీ లోని సిసిలీ ద్వీపపు ఈ అంచునుంచి ఈ సముద్రాన్నంతా ఓ రాత్రి వేళ దాటడం ప్రారంభించి, కొన్ని రాత్రుల అనంతరం అవతలి తీరాన్ని చేరడమనే ఊహే వాళ్లల్లో కలవరపాటుని కలిగిస్తోంది. తీసుకెళ్తానని హామీ ఇచ్చిన మనిషి చూడటానికి కబుర్లు అమ్ముకునేవాడిలా కనిపించినప్పటికీ మొహంలో కొంత నిజాయితీ ఉంది. అతను వీళ్లతో చేసిన ఒప్పందం ఇది: “రాత్రికి స్టీమర్ ఎక్కిస్తాను. అక్కడ దించడం కూడా రాత్రి వేళలోనే దించుతాను. నూజియొరసి బీచ్ దగ్గర దించుతాను- అది నూవయొర్క్ పక్కనే ఉంటుంది. అమెరికాలో బంధువులున్నవాళ్లు వాళ్లకి ఉత్తరాలు రాసుకోండి. మనం బయలుదేరిన పన్నెండు రోజుల తర్వాత వాళ్లని అక్కడ ట్రెంటన్ స్టేషన్‌లో మీకోసం వేచివుండమని చెప్పండి. కాకపోతే, ప్రయాణం సరీగ్గా ఇన్నిరోజులే పడుతుందని కచ్చితంగా చెప్పలేను. సముద్రం అల్లకల్లోలంగా ఉండవచ్చు. తీరప్రాంతంలో నిఘా ఎక్కువగా ఉండవచ్చు. మొత్తానికి ఓరోజు అటూయిటూ అవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ముఖ్యమైన లక్ష్యం – అమెరికాలో కాలుపెట్టడం.”
ఎప్పుడు, ఎలా అన్నది పక్కనపెడితే, అమెరికాలో కాలుపెట్టడం అన్నది వాళ్లందరికీ ముఖ్యమైన విషయమే. కొక్కిరిబిక్కిరి రాతల చిరునామాలతో వీళ్లు రాసిన ఉత్తరాలు వాళ్ల బంధువులకి సక్రమంగా చేరగలిగితే, వీళ్లు కూడా అక్కడికి చేరినట్టే లెక్క. నోరున్నవాళ్లదే రాజ్యం అన్నట్టు, అలాంటివారికే సముద్రాన్ని దాటడమూ సాధ్యం. అలాంటివాళ్లు మాత్రమే అమెరికా నేలనీ, భవంతుల్నీ, ఆహ్వానం పలుకుతున్న సోదరులు, మామయ్యలూ, బాబాయిలనీ, విభ్రాంతి కలిగించే ఇళ్లనీ, ఇళ్లంత కార్లనీ చూడగలరు.
మొత్తం రెండున్నర లక్షల లీరాల ఖర్చు. సగం మొత్తం ప్రయాణం ముందూ, మిగతా సగం ప్రయాణం పూర్తయ్యాక ఇవ్వాలి. ప్రయాణం అనంతరం ఇవ్వాల్సిన మొత్తాన్ని చొక్కాల లోపల దాచుకున్నారు వాళ్లు. ఈ డబ్బుని సమకూర్చుకోవడానికి ఉన్నదంతా అమ్ముకోవాల్సివచ్చింది- ఇళ్లూ, గాడిదలూ, కంచరగాడిదలూ, కుర్చీలూ బల్లలూ దుప్పట్లతో సహా. షావుకార్లు తరతరాలుగా చేస్తున్న దోపిడీకి ప్రతిగా ఒక్కసారైనా వాళ్లని మోసం చేయగల అవకాశం కోసం కొంతమంది తెలివైనవాళ్లు డబ్బుకోసం షావుకార్ల దగ్గర చేరారు. డబ్బులు ఎగ్గొట్టి పారిపోయామని తెలుసుకున్నాక, ఆ షావుకార్ల మొహాలు ఎలా ఉంటాయో ఊహించుకుని ఆనందపడ్డారు. “జలగ వెధవల్లారా, రండి, వచ్చి అమెరికాలో మేం ఎక్కడున్నామో పట్టుకోండి. ఒకవేళ చచ్చీచెడీ పట్టుకున్నా, వడ్డీ ఇవ్వంరోయ్” అని మనసుల్లో అనుకున్నారు. అమెరికన్ డాలర్లు ఊహల నిండా పరుచుకున్నాయి. ఇకమీదట చిరిగిపోయిన జేబుల్లోనో, చొక్కాల లోపల్నో డబ్బు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల బంధువులలాగా స్టైల్‌గా అలా పాంట్ జేబుల్లో పెట్టుకుని కావలసినంత మాత్రమే బయటకు తీయవచ్చు. ఎలాంటి బంధువులు వాళ్లు? అమెరికాకి వెళ్లే ముందు ఎండకి ఒళ్లూ, ఆకలికి కడుపూ కాల్చుకుని సన్నగా బలహీనంగా ఉన్నవాళ్లు ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత చిన్న ట్రిప్ మీద వచ్చినప్పుడు గులాబీ రంగులో ఉన్న నున్నటి బుగ్గలకీ, పైన తెల్లటి జుట్టుకీ మధ్య అందమైన వర్ణవైరుధ్యం సంతరించుకున్న బంధువులు వాళ్లంతా.
అప్పుడే పదకొండయ్యింది. ఎవరో లాంతరు వెలిగించారు, ఇక స్టీమర్ ఎక్కడానికి సిద్ధం అనడానికి సూచనగా. కొద్దిసేపటి తర్వాత లాంతరు ఆర్పేసాక, చీకటి మరింత చిక్కనైపోయి, ఆందోళనలని రెట్టింపు చేసేట్టుగా మారిపోయింది. కొద్ది నిముషాలలోనే, సముద్రపు నిరంతర శ్వాసఘోషల మధ్యనుంచి నీళ్ల శబ్దం వినిపించింది. గొంతులు కలగాపులగంగా వినిపించడం ప్రారంభమైంది. బోటు ఒడ్డుకి రావడం, ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన మెల్ఫా వారి మధ్యకి చేరుకోవడం జరిగిపోయింది.
“అందరూ వచ్చినట్టేనా,” అని అడిగాడు మెల్ఫా. టార్చ్ వెలిగించి తలలు లెక్కించాడు. ఇద్దరు రాలేదు. “సరే, వాళ్లు వద్దనుకున్నారేమో. లేదా మళ్లీ ఎప్పుడైనా వస్తారేమో. వాళ్ల ఖర్మ, వదిలేద్దాం. ఇప్పుడు వాళ్లకోసం ఎదురుచూసి, మనం ఇలా ఉండిపోవడం ఎందుకు?” అన్నాడు.
నిజమే, ఎదురుచూడడం అనవసరం అన్నారు అందరూ.
“ఇప్పుడే చెబుతున్నాను. ఇవ్వాల్సిన మిగతా సగం డబ్బు ఎవరైనా తెచ్చివుండకపోతే, ఇప్పుడే ఇంటికెళ్లిపోవడం మంచిది. ఎక్కాక చెబితే, అప్పుడేమీ చేయలేననుకుంటే పొరపాటు పడ్డట్టు. అలాంటిదేమైనా జరిగితే, అందర్నీ వెనక్కి తీసుకొచ్చేస్తాను. ఒక్కడి వల్ల అందరూ బాధపడాల్సి వస్తుంది. నేను కొట్టడమే కాదు, మిగతావాళ్లందరూ కూడా కొట్టి మరీ వాడి చేత డబ్బులు కక్కిస్తారు. అదృష్టవంతుడైతే తప్ప, కొన్నేళ్లకయినా ఆ అనుభవం మర్చిపోలేడు…”
డబ్బులన్నీ సరీగ్గానే ఉన్నాయని అందరూ హామీ ఇచ్చారు.
“అయితే ఎక్కండి,” అన్నాడు మెల్ఫా. ఒక్కసారిగా కదలిక తెచ్చుకున్న మనుషులు ఒక్కొక్కడూ ఆకారం లేని సామాన్ల మూటలాగా కదిలారు.
“దేవుడా! కిచెన్ సింక్ కూడా వెంట తెచ్చుకున్నార్రా నాయన్లారా?” అని మెల్ఫా తిట్లు లంకించుకున్నాడు. అందరూ ఎక్కి సామాను బోట్‌లోకి చేరేవరకూ అతని తిట్ల ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది. మెల్ఫాకి సంబంధించినంతవరకూ- మనిషికీ, సామానుకీ మధ్య తేడా చాలా చిన్నది. మనిషైతే వాడి చొక్కాలోపలో, కోటులోపలకి కుట్టేసో దాచుకున్న డబ్బులు లీరాల రూపంలో ఉంటాయి. ఈ మనుషులు అతనికి బాగా తెలుసు. సంస్కారం లేని, పల్లెటూరి అలగాజనం…
అనుకున్నన్ని రోజులు కూడా పట్టలేదు ప్రయాణానికి. బయలుదేరిన రాత్రితో కలిపి మొత్తం పదకొండు రాత్రులు మాత్రమే. పగళ్ల కంటే, రాత్రుళ్లనే లెక్కబెట్టడానికి కారణం- ఆ రాత్రుళ్ల తాలూకు ఊపిరిసలపనితనం. చేపల వాసనా, డీజిల్ వాసనా, కక్కుల వాసనా కలగలిసిపోయి, కిక్కిరిసిపోయిన గుంపు మధ్యన నల్లటి తారులో కూరుకుపోతున్నట్టు అనిపించిన దుర్భరమైన రాత్రులు అవి. అలసిపోయి, ఉదయాలలో డెక్ ఎక్కి కాస్త వెలుతురూ, ఊపిరీ నింపుకోవాల్సి వచ్చేది. వీచే గాలికి వచ్చే చిన్న చిన్న అలల మీద తేలియాడుతూ ఉండే పచ్చికమైదానం లాంటిదే సముద్రమంటే వాళ్ల ఊహల్లో నిర్మించుకున్న సముద్రం, నిజరూపంలో కళ్లముందు సాక్షాత్కరించినప్పుడు వాళ్లని భయభ్రాంతుల్ని చేసింది. కన్నుపొడుచుకున్నా కానరాని తీరం వైపుకి చూద్దామనుకున్నప్పుడు, కన్నుపొడుచుకోవడమే మిగిలింది. కానీ, పదకొండో రాత్రికి మాత్రం, మెల్ఫా అందరినీ డెక్ మీదకి రమ్మని పిలిచినప్పుడు, ఆశ్చర్యకరంగా కళ్లముందు అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రమండలం సముద్రం మీదికి వాలి కనిపించింది. కానీ, అవన్నీ నగరాల వెలుగులు. సంపన్నవంతమైన అమెరికా, ఆ రాత్రి వేళ వజ్రంలా ప్రకాశిస్తోంది. అసలా రాత్రి స్వరూపమే మారిపోయింది. ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉన్న రాత్రి. పలచగా ఉన్న మేఘాల మధ్య అర్ధచంద్రాకారంలో చంద్రుడు. ఊపిరితిత్తులు నిండిపోతున్నంత గాలి.
“ఇదీ అమెరికా,” అన్నాడు మెల్ఫా.
“ఇది అమెరికా కాకుండా మరేదయినా అయివుండే ప్రమాదమేమైనా ఉందా?” అని అడిగాడు ఒకడు. రోడ్లూ, బోర్డులూ లేని ఈ సువిశాల సముద్రం మీద, కేవలం ఆకాశం సముద్రాల మధ్య బోటుని పొరపాటు చేయకుండా నడుపుతూ అనుకున్న చోటుకి చేరుకోవడం అన్నది దైవసంకల్పం కూడా తోడైతే తప్ప సాధ్యపడేట్టు లేదని అనుకుంటూ వస్తున్నాడతను.
మెల్ఫా అతనివైపు జాలిగా చూసి, అందరికేసి తిరిగి అడిగాడు. “మీ అడవుల మధ్య ఇలాంటి ఆకాశాన్ని అసలెప్పుడైనా చూసారా? ఇక్కడ గాలికూడా వేరేలా ఉండటం మీకు తెలియడం లేదా? నగరాలు ఎలా వెలిగిపోతున్నాయో కనబడటం లేదా?”
నిజమేనని అందరూ ఒప్పుకున్నారు. అలాంటి మూర్ఖమైన ప్రశ్నని వేసినవాణ్ణి నిరసనతో నిండిన జాలితో చూసారు.
“సరే, ఇక మీరివ్వాల్సిన మిగిలిన డబ్బుల లెక్కలు చూద్దాం,” అన్నాడు మెల్ఫా.
అందరూ చొక్కాల లోపల వెతికి, డబ్బులు బయటికి తీసారు.
డబ్బులన్నీ జాగ్రత్త చేసుకొని, “ఇక మీ సామాన్లు సర్దుకుని సిద్ధంగా ఉండండి,” అన్నాడు మెల్ఫా.
తెచ్చుకున్న తిండి సామాన్లు దాదాపుగా ఖర్చయిపోవడంతో ఆ కాస్త సామాన్లు సర్దుకోవడానికి వాళ్లకి ఎక్కువ సమయం పట్టలేదు. మిగిలిందల్లా కాసిని బట్టలు, అమెరికాలోని బంధువుల కోసం తీసుకున్న బహుమతులు, ఇటాలియన్ ఛీజ్, ఏళ్ల తరబడి దాచివుంచిన వైన్, టేబుళ్ల మీదనో సోఫాల మీదనో కప్పడానికి ఎంబ్రాయిడరీ చేసిన కవర్లు. గాలిలో తేలిపోతున్నట్టుగా, వంట్లోని భారమంతా వదిలిపోయినట్టుగా, నవ్వుకుంటూ, తుళ్లుకుంటూ, పాడుకుంటూ, కులాసాగా దిగారు అందరూ. ఒకడైతే, గొంతెత్తి పెద్దగా పాడటం మొదలెట్టాడు.
“మీకేమీ అర్థం అవుతున్నట్టు లేదు,” అని కోపంగా అరిచాడు మెల్ఫా. “ఇలా రావడం బయటపెట్టి నన్నూ ఇరికిద్దామని చూస్తున్నారా? ఒడ్డుకి చేరుకున్నాక మీ ఇష్టం. పాటలు పాడుతూ ఏ పోలీసువాడి కంట్లోనో పడితే శుభ్రంగా మిమ్మల్ని వెనక్కి వెళ్లే బోట్‌లోకి ఎక్కిస్తాడు, మీ ఖర్మ. నాకు సంబంధం లేదు, మీ చావు మీరు చావండి. మన ఒప్పందం ప్రకారం నా వంతు నేను చేసాను. ఇది అమెరికా, మిమ్మల్ని అమెరికాకి చేర్చాను. ఇక నా దారిన నేను వెళతాను!”
అతను సర్దుకుని బోట్ ఎక్కి వెళ్లిపోయే వరకూ చూసారు వాళ్లు. శుభ్రంగా కనిపిస్తున్న ఇసక మీద కూర్చుండిపోయారు,
తర్వాతేం చేయాలో పాలుపోని పరిస్థితిలో. రాత్రిని ఒకపక్కన తిట్టుకుంటూనే, అవసరమైన రక్షణ కల్పించిందనీ సంతోషించారు. దీన్ని దాటుకుని బయటకి వెళితే ప్రమాదం.
మెల్ఫా ఇచ్చిన సలహా- గుంపుగా ఉండకుండా విడివిడిగా ఉండమని. కానీ, పక్కవాళ్లని విడిచిపెట్టి వెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. గమ్యస్థానమైన ట్రెంటన్ అసలు ఎక్కడుందో, ఎంత దూరమో ఎవరికి తెలుసు?
అంతలో దూరం నుంచి వింతగా ధ్వనిస్తున్న పాట ఒకటి వినబడసాగింది. “మన బండివాళ్ల పాటలాగే ఉంది అచ్చం,” అనుకున్నారు. ఎక్కడైనా ప్రపంచం ఒకటేననీ, ఏ మూలలో ఉన్న మనిషైనా పాట రూపంలో తన వ్యధనీ, బాధనీ వ్యక్తపరచే తీరు ఒకటేననీ అందరూ ఒప్పుకున్నారు. ఇంతలోనే, తాము అమెరికాలో ఉన్న సంగతి గుర్తుచేసుకున్నారు. ఈ ఇసక దాటాక, చీకటి కమ్ముకున్న చెట్ల అవతల వెలుగుతున్నవన్నీ అమెరికా నగరాలే కదా అనుకున్నారు.
ఇద్దరు ముందుగా వెళ్లి, విషయాలు కనుక్కుని రావాలని తీర్మానం చేసారు. లైట్లు వెలుగుతున్న దిశగా, సమీపంలో ఉన్న నగరం వైపుకి వాళ్లిద్దరూ పయనం మొదలుపెట్టారు. తొందర్లోనే, రోడ్డు ఎక్కడుందో కూడా కనిపెట్టారు. “తారు రోడ్లు ఎంత బాగున్నాయో కదా- మన దగ్గర రోడ్లతో పోలిస్తే ఇవి ఎంత వేరేలాగా ఉన్నాయో కదా!” అనుకున్నారు. నిజానికి ఇక్కడి రోడ్లు ఇంకా విశాలంగానూ, వంపులు లేకుండా తిన్నగా ఉంటాయని అనుకున్నారు. రోడ్డు మీద ఎవరైనా ఎదురయ్యే ప్రమాదం ఉంది కనక, దాన్ని వదిలేసి పక్కన చెట్లమాటున నడవడం మొదలెట్టారు.
ఇంతలో ఒక కారు వెళ్లింది. “మన సైచెంతో కారు లాగా ఉంది,” అనుకున్నారు. ఇంకోటి, మీల్లిచెంతో లాంటిది. ఇంకోటి, మరోటి దాటుకుంటూ పోయాయి. “మన కార్ల లాంటివి ఊరికే సరదాకి పెట్టుకుంటారు. వాళ్ల పిల్లలకోసం కొంటారు. మనం పిల్లలకి సైకిళ్లు కొంటామే- అలాగన్నమాట,” అని చెప్పుకున్నారు. ఇంతలో పెద్ద చప్పుడు చేస్తూ రెండు మోటారుసైకిళ్లు ఒకదాని వెనక ఒకటి వెళ్లాయి. వాళ్లు పోలీసులు! రోడ్డు వదిలి పక్కన నడవడం మంచిదయిందనుకున్నారు.
అదుగో, చివరికి బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా జాగ్రత్తగా చూసుకుంటూ బోర్డ్ దగ్గరికి దాన్ని చదవడానికి వెళ్లారు: శాంతా క్రోచే కామరీనా/స్కూలిత్తీ.
“శాంతా క్రోచే కామరీనా. ఈ ప్రదేశం పేరు ఇంతకు ముందు ఎక్కడో విన్నాను.”
“నాకూ తెలిసిన పేరులానే ఉంది. స్కూలిత్తీ కూడా.”
“మన బంధువుల్లో ఎవరో అక్కడ ఉండి ఉంటారు, ఆ విధంగా విని ఉంటాం. మా మామయ్యే అనుకుంటాను ఫిలడెల్ఫియాకి వెళ్లకముందు అక్కడ ఉండేవాడు. అవును, నాకు గుర్తున్నంతవరకూ ఫిలడెల్ఫియాకి ముందు ఆయన వేరే చోట ఉండేవాడు.”
“మా అన్నయ్య ఒకడు బ్రూచ్లిన్‌కి వెళ్లే ముందు ఇంకోచోట ఉండేవాడు. అయితే దాని పేరు మాత్రం గుర్తులేదు. అది సరే, వీటిని మనం శాంతా క్రోచే కామరీనా, స్కూలిత్తీ అని చదువుతున్నాం కానీ, అసలు వీటిని ఎలా పలుకుతారో! అమెరికన్లు రాసినదాన్ని రాసినట్టుగా పలకరు.”
“నిజమే. మన ఇటాలియన్ గొప్పతనమేమిటంటే, దాన్ని రాసినట్టుగానే పలుకుతాం. అది సరే కానీ, మనం ఇలా రాత్రంతా ఇక్కడే ఇలా గడుపుతూ ప్రమాదం కొనితెచ్చుకోలేం, కొంచెం ధైర్యం చేయాలి. ఈసారి వచ్చే కారుని ఆపుతాను. ‘ట్రెంటన్?” అని మాత్రం అడిగి చూస్తాను. ఇక్కడి జనాలు మర్యాదస్తులు. వాళ్లు చెప్పేదేమిటో మనకి అర్థం కాకపోయినా, ఏవో సంజ్ఞలు చూపించి సహాయం చేస్తారు. ఈ దరిద్రపుగొట్టు ట్రెంటన్ ఎక్కడుందో అప్పుడు కనిపెట్టొచ్చు.”
రోడ్డు మలుపులో, ఇరవై మీటర్ల దూరంలో ఒక చింక్విచెంతో కారు ప్రత్యక్షమైంది. వీళ్లిద్దరూ చేతులెత్తి కారుని ఆపమనడం ఆ డ్రైవరు చూసాడు. తిట్టుకుంటూ, బ్రేక్ వేసాడు. ప్రశాంతమైన ఏరియా కాబట్టి దారిదోపిడీ ప్రయత్నం అయివుండవచ్చన్న అనుమానం అతనికి రాలేదు. బహుశా, వీళ్లకి లిఫ్ట్ కావాలేమో అనుకుని కారు తలుపు తీసాడు.
“ట్రెంటన్?” అని అడిగాడు ఇద్దర్లో ఒకడు.
“కె?” డ్రైవర్ అడిగాడు.
“ట్రెంటన్?”
“ఏంటా దిక్కుమాలిన ట్రెంటన్- ఆ మాటని పట్టుకుని వదలకుండా?” అన్నాడు డ్రైవర్, తిట్టుకుంటూ.
“అతను ఇటాలియన్ మాట్లాడుతున్నాడు!” అన్నారు ఇద్దరూ ఒకేసారి, తర్వాత ఏం చేయాలా అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ. సాటి దేశస్థుడు ఒకడికి తమ గోడు చెప్పుకునే సమయం వచ్చినట్టుగా అనిపిస్తోంది.
డ్రైవర్ కారు తలుపు వేసేసుకుని ఇంజిన్ స్టార్ట్ చేసాడు. కారు ముందుకి దూకింది. కారు కొంచెం ముందుకెళ్లాక, బిత్తరపోయి చూస్తున్న ఇద్దర్నీ ఉద్దేశించి అన్నాడు. “తాగుబోతులు, తాగుబోతు వెధవలు. దరిద్రపు లం–” కారు దూరంగా వెళ్లిపోవడం వల్ల మిగతాది వినబడలేదు.
చాలాసేపు నిశ్శబ్దం నెలకొంది.
కాసేపటికి, శాంతా క్రోచే కామరీనా తెలిసిన పేరులాగా ఉంది అన్నవాడు, “ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక సంవత్సరం మా పంటలు దెబ్బతిన్నప్పుడు, మా నాన్న శాంతా క్రోచే కామరీనా వెళ్లాడు. అక్కడ పొలం పనులు చేయడానికి,” అన్నాడు.
ఏ గుంటలోకో జారిపడిపోయిన వాళ్లలాగా ఇద్దరూ అక్కడే కూలబడిపోయారు.
ఇప్పుడేమీ హడావుడి లేదు.
మనం దిగింది తిరిగి సిసిలీ తీరంలోనే అని వెళ్లి తమవారికి చెప్పడానికి అంతగా తొందరపడాల్సిన పనేమీ లేదు.
కథాసాహిత్యం, విమర్శ అభిమాన విషయాలు. ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. శ్రీకాకుళం ‘కథానిలయం’ కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.
Discussion about this post