ప్రముఖుల అనువాదం
తమిళమూలం : ఆర్.ఏ. వీజెనాధన్
స్వేచ్ఛానువాదం : యన్. కళ్యాణసుందరీ జగన్నాధ్
ప్రముఖులు చేసిన అరుదైన అనువాద రచనలని అప్పుడప్పుడూ అందించడం ఈ శీర్షిక ఉద్దేశం. తొలుతగా, ప్రముఖ రచయిత్రి నిడుమోలు కల్యాణసుందరీ జగన్నాథ్ గారు చేసిన అనువాద రచన ‘స్వాయంభువమూర్తి’ మీకందిస్తున్నాం. ఇది దాదాపుగా కనుమరుగై పోయిన రచన. కృష్ణాపత్రిక వజ్రోత్సవ సంచికలో ఇది ప్రచురించబడింది. కథగా చెప్పుకోవాల్సింది పెద్దగా లేకపోయినా, భాష విషయంలో కల్యాణసుందరి గారు తీసుకున్న స్వేచ్ఛ, అందులో పోషించిన లయాత్మకత గమనించదగ్గవి.
-ఎ.వి. రమణమూర్తి
రాజాధిరాజ రాజమార్తాండ, వీరాధివీర వీరమార్తాండ, జగద్వంద్య శౌర్యప్రచండ, – వీర, ధీర, పరాక్రమకేసరి. సర్వకళా విశారద, సంగీత నాట్య నాటక రసిక శిరోమణి – శ్రీ శ్రీ శ్రీ మలయసింహ మహారాజు చిత్రశాలకు వెడలుచున్నారు. హెచ్చరిక, యిదే హెచ్చరిక.
వందిమాగదులు కైవారములుసేయ, ఉచిత పరివారములు పచారములు చేయ, ఠీవులొలుక, గాంభీర్యము చిలుక, మహారాజు చిత్రశాల ప్రవేశించెను.
ఆ చిత్రశాలయందు లేని అపురూపపు కళాఖండములు అవనియందే లేవనవచ్చును. ఆ చిత్రశాల వివిధ విధముల కల్పనా చతురత కాటపట్టయి, కళాకారుల కృషి సఫలతకు మెట్టినిల్లయి, చిత్ర లేఖకుల శ్లాఘ్యచిత్రములకు శరణ్యమయి, చెయి తిరిగిన శిల్పులు చేసిన సజీవ శిలా ప్రతిమలకు శాశ్వతవిలాసమై, చిత్తశుద్ధి గల్గిన విగ్రహకారులు పోతపోసిన లోహవిగ్రహములకు ఆవాహనా మందిరమయి వొప్పారుచుండెను.
రాజోద్యోగులు సంవత్సరము పర్యంతమూ, దేశదేశములు తిరిగి, సంస్కృతీ స్వరూపములో శ్రేష్టతమయిన వానిని శోధించి, ఎంచి, సంపాదించి, మహారాజు చిత్రశాలయందు సేకరించుటయూ – సంవత్సరమున కొకరోజు, ఆ మహారాజు, తీరికగా, – తదేక తత్సరతతో, వానిని తిలకించి, పరిశీలించి, మెచ్చి, అభినందించి, – వానిని సేకరించిన విధానమ్ములడిగి తెలుసుకొని, అది సాధించిన ఉద్యోగులను ఉత్సాహపరచి, ఆ కళాకారుల పూర్వ ప్రస్తుత పరిస్థితుల వివరములను అడిగి తెలుసుకొని, వారికి తన మెప్పు చెప్ప నొప్పగించి, ఆ దినమంతమూ, కళారాధకుడై, ద్రష్టయై, తన్మయుడై, విమర్శకుడై, ఉత్సాహియై, ఉత్తేజితుడై, ఆ చిత్రశాలయందు సంచరించుటయూ – ఆ సంస్కృతి చిహ్నముల వెదకి, వెలకట్టి, ఆ చిత్రశాలకు తరలించి తెచ్చిన రాజోద్యోగులు హృదయములలో ఔత్సుక్య ఆందోళనలతోనూ, – ముఖములలో భయనమ్రతలతోనూ, మహారాజు వెందొడగెను.
వెన్దొడంగి మహారాజు ప్రశ్నల కుత్తరములిచ్చుచూ, ఆయా చిత్రముల కాధారభూతములయిన చరిత్రాంశముల వివరించుచూ, ఆయా శిలాప్రతిమల సేత కుపక్రమించిన శిల్పుల జీవిత వృత్తాంతములు సంక్షేపించుచూ, ఆయా పంచలోహ విగ్రహముల కుత్పారితములయిన, పురాణ ఇతిహాస తార్కాణముల నుదహరించుచూ, ఆ చిత్రశాలయంతయూ పరీభ్రమించుటయూ ఆ రాజ్యాంగము నందలి సాంప్రదాయము.
ఆ రాజ్యాంగములో ప్రతి సంవత్సరమూ, మహారాజు చిత్రశాలకు వెడలు దిన మొక పండుగరోజు చిత్రశాల అలంకరింపబడి అమరపురిని పోలియుండును.
తన యశస్సును అష్టదిక్కులా వ్యాపంపచేయుచూ మలయసింహ మహారాజు డెబ్భదివేసవులు వెనకవేసిన ధన్యజీవి. — తన దేశపు ప్రజలుమెచ్చ, లాతిదేశస్థులు విస్మయమంద, రాజధర్మమును రవంతయు బెసగనీక పాటించుచూ, పాలించుచూవచ్చిన నీతిపరుడు. లలితకళాస్వాదన తన రాజ్యమందంతయూ వ్యాపించజేయగలిగిన ఆశయ సాధకుడు.
నిశితన్యాయ నిర్ణయమునకు నిలయమని తన సింహాసనమునకూ దాన ధర్మములకు సాక్షియని తన (కంకణమునకూ) భక్తి వినయములకు స్థావరమని తన కిరీటమునకూ, పేరెన్నిక గణించినవాడు. కళాభిరుచికి కన్నులనూ, గాంభీర్యమునకు కనుబొమలనూ, ప్రేమ భాషణములకు పెదవులనూ, పౌరుషమునకు మీసమునూ, శాంతతకు నుదుటినీ, నాగరికతకు నాసికనూ, ఠీవికి చుబుకమునూ ఉనికి చేసినవాడు. అట్టి సర్వగుణ సంపన్నుడు చిత్రశాలకు వేంచేయునన్న– ఆ భవనము శోభాయమానముగానుండుట ఏమి ఆశ్చర్యము?
మహారాజు ప్రతి చిత్రమునూ తీరికగా నిలచి తిలకించుకూ, – ప్రతి శిల్పమునూ చుట్టుతిరిగి పరీక్షించుచూ, – ప్రతి విగ్రహమునూ అనతి, అతి, దూరములనుంచి చూచి తృప్తిచెందుచూ, మందిరమంతయూ మందగమనముతో చరించుచుండెను.
కంచు విగ్రహములున్న తావునకు చేరిన పిదప మహారాజు కాలు కదపలేకపోయెను. కనులు మరల్చలేకపోయెను. అతి ప్రయత్నము మీదగాని ఒక విగ్రహమునందు మగ్నమయిన దృష్టిని మరల్చి మరియొక విగ్రహము వీక్షించుటకు వీలుపడలేదు. – అచ్చట నెలకొల్పబడిన మూర్తులన్నిటియందునూ మానవాతీతమయిన ఒక నిపుణత ఏదో వ్యాపించి వ్యక్తమగుచుండెను. యిట్లు ప్రాణము పోసుకొనిన ప్రతిమలుగా ప్రత్యక్షమయిన ప్రావీణ్యత, ఏ అసమాన శిల్పిదోగదాయని చూపరుల కాశ్చర్యము గలిగించుచుండెను. ఇటుప్రక్కనున్న కల్యాణసుందరమూర్తి విగ్రహము తరుణచిహ్నమై తేజరిలుచుండెను. ప్రక్కనేవున్న గజాననుడు పంచకరములతో, కండలు దేరిన మనుష్య శరీరముతో, శరణన్న వారికి క్షేమమే కల్గునన్న అభయహస్తముద్రతో, – కారుణ్యకరణములు నలుగడల చిల్కుచున్న కనుదోయితో, చూచువారిని చూచుచుండెను.
సమీపముననున్న కోదండపాణి, యిరుగడల సీతాలక్ష్మణులు నిల్వ, శాంతమూర్తియై దర్శనమొసంగుచుండెను. ఆ సీతాదేవి చేతివ్రేళ్ళు సహజమైన ఒయ్యారపు ఒంపుతో భూమాతను సూచించుటలో భావమేమి చెపుమా? లోకరక్షకుడైన శ్రీరాముని చరణములంటి శరణనుటకంటె తరించుమార్గము లేదనియా, – కాక, ఈ విగ్రహములను చేసిన శిల్పి నిపుణత – కాలి వ్రేళ్ళను చూచి గ్రహించుకోమని కూడనా? – పంచలోహముతో చేసిన విగ్రహముల పాదములయందు నాజూకుగా నరములూ నాడులూ, తోచునట్లు తీర్చిన శిల్పి దెట్టి సామర్ధ్యమోకదా! ఈ విగ్రహములు తనివితీర చూచుటకు వెయ్యి కన్నులున్నను చాలవేమోగదా!–
పిల్చిన పలుకునా యన్నట్లు జీవకళ లుట్టిపడు ఈ విగ్రహలును చూచుచున్న రాజు, తానూ ఒక విగ్రహమువలె నిశ్చేష్టుడయ్యెను.
అయినను, నృప కులదైవమయిన నటరాజమూర్తి ఆ మహారాజు దృష్టి నాకర్షించెను. ఆ విగ్రహము పరిమాణమున చిన్నదైననూ, ప్రతిభలో పరిమితి లేనట్లుండెను. చిదానందముఖుడై తాండవగ్నుడై ఒక పాదము మాత్రమే భూమిపై మోపి సునాయాస భంగిమలో నిలిచిన నటరాజ విగ్రహమునూ, దాపుననే నిల్చి తన ప్రభుని తన్మయతతో తిలకించుచూ స్మితవదనియైన పార్వతి విగ్రహమునూ, మహారాజును అనిమీషినిగా చేసెను. తానాడుచూ, ధరణినంతయూ ఆడించు ఆ పరమశివుని తాండవము చూచుచున్నట్లే మహారాజునకు భ్రాంతికలిగెను. ప్రచండ తాండవ నిమగ్నుడయ్యునూ, బహుసునాయాసముగా ఒకవైపు త్రిప్పిన ఆ మోమునూ, తీవ్రతర లయాబద్ధ విన్యాసియయ్యునూ, సుతారపు వంపులు దాల్చిన మేని సౌష్టవమునూ, – అతి విసురుగా కదలించి, అతి సున్నితముగా గాలి నానించిన పాదమునూ, ఒక లిప్తలో కదలునేమో ననిపించెడు గజ్జెలనూ, – గమనించుచున్న మహారాజు తాను కైలాసమునందున్నట్లే భావించుకొనెను – మెరపు వేగముతో నటించు మహాదేవుడు తనకొరకు స్థిరుడయ్యెనో, స్థావరమయిన ఆ విగ్రహము క్షణములో తాండవించునో తెలియదయ్యెను.
విస్మయుడై, ఆ మహారాజెంతకాలము అట్లే నిలబడిపోయెనో ఆయనకు తెలియదు. మధ్యాహ్నమయినదన్న సూచనగా, గంట మ్రోగినప్పుడు కాని, తానున్నది కైలాసము కాదు, చిత్రశాలయన్న జ్ఙాపకము రాలేదు. ఆ స్ఫురణ గలిగిన తరువాత సహజరాజఠీవితో, తలమాత్రము త్రిప్పి చేతులు కట్టుకొని చేరువన నిల్చియున్న మంత్రినీ, తన ఏకాగ్రతకు భంగము కలుగునేమోయని శ్వాసను కూడా జాగ్రత్తగా విడుచుచున్న ఆ చిత్రశాలాధికారినీ చూచెను. ఆ ఉద్యోగిని చేరువకు పిల్చెను. ‘‘ఈ విగ్రహములన్నియూ ఈ సంవత్సరము తెచ్చినవా?’’
‘‘చిత్తము ప్రభూ’’
‘‘ఆ గజాననుని చేసిన శిల్పి ఎవరు?’’
‘‘శివాచారిగారి శిష్యుడైన సాంబమూర్తి, – ప్రభూ’’
‘‘ఆ రాముని విగ్రహము చేసిన దెవరు’’?
‘‘అదియూ సాంబమూర్తి చేసినదే’’
‘‘నటరాజ విగ్రహము?’’
‘‘అదీ అతనే’’
మహారాజు మరియొక ప్రశ్న వేయు లోపలనే, నటరాజు, రాజుగారి చిత్తమున జొచ్చి నాట్యముచేయ దొడంగెను. నిలువెత్తు విగ్రహము చేయించవలెనని సంకల్పము కలిగెను.
‘‘ఆ శిల్పి సాంబమూర్తి – ఎచ్చట నున్ననూ, సాయంత్రము లోపల మా సముఖమునకు తోడ్కొనిరావలయును.’’
కళాపిపాసియైన ప్రభువు సహృదయము నెరింగిన ఉద్యోగులు ‘చిత్త’మని సెలవు తీసుకొనిరి.
ఆ మహారాజు ఆదేశము అనిన సామాన్యము కాదు. అది పాలించపోయిన ఆయన ఉద్యోగులూ సామాన్యులుకారు. ఆజ్ఙ సాయంకాలము కాకముందే, శిల్పిని తోడితెచ్చినట్లు, ప్రభువునకు కబురు చేరెను. డెబ్బదియేండ్లు పైబడి, వయస్సాయంతనముననున్న మహారాజు మెల్లగా నడచివచ్చి సింహాసన మధిష్ఠించెను. యిరువది యైదేండ్లు నిండని శిల్పిని ఎదటనిల్పిరి. – తన నొకసారి చూచుకొని, ప్రభువు తరుణుడైన సాంబమూర్తిని చూచెను. – కొమ్మచివరనున్న క్రొత్త చిగురువైపు క్రిందరాలిపోవు ముందురోజువాడు, పండుటాకుజూచె. యిపుడు వాడి రేపు ఎండు, నిన్నటిపువ్వు, – తెలవారి కనువిప్పు నునుమొగ్గజూచె. సగముగ్రుంకి, ఎంతో చల్లజారిన రవి, పదునారు కళలతో పక్కున నవ్వుచూ మింటిపై కెగబ్రాకు శరచ్చంద్రుజూచె. (నవ్వేటి, శరచ్చంద్ర శోభజూచె)
జీవితసౌధపు సింహద్వారపు గడపదాటిదాటకముందే, మేటి శిల్పియైన సాంబమూర్తి, సంచితపుణ్యసంపన్నుడా? సద్గురుకటాక్షలబ్ధు డా, పారంపర కళాప్రవీణుడా, – పుష్కరములతరబడి పరిశ్రమించియూ, కృషితో కృశించియూ – వయఃపరిపాకముతప్పిన, కళోపాసకుల కెందరకో కైవశముగాని పనితనము ఈ పరువముననే ఈతని కబ్బియుండుట నిజమేయగునా?
‘‘శిల్పీ’’ మా చిత్రశాలకు చేరిన ఆ వినాయక, రామ, నటరాజ విగ్రహములన్నియూ నీవు చేసినవేనా?’’
‘‘ప్రభువులకిట్టి సందేహము ఉదయించుటకు కారణము?’’
‘‘సందేహముకాదు మాది – సంభ్రమము (ఆదరము : ఉత్సాహము అన్న అర్థంలో) భువనైకసుందరముగా మూర్తీభవింపచేసిన ఆ భువనేశ్వరునిమూర్తీ, కొలతకు చిన్నదిగనే చేసితివిగాని, హద్దులేని అందము సమకూర్చితివి. అట్టి నీ అనన్యదుస్సాధ్యమైన నిపుణతనుపయోగించి, – మాకు నిరంతర పూజనీయుడూ, కులదైవమూ అయిన నటరాజదేవుని, విగ్రహము నొకదానిని, నిలువెత్తు విగ్రహమునొకదానిని, చేయుట నీకు సాధ్యమేనా?’’
‘‘మహారాజా! సాధకునకు సాధ్యముకానిదేమున్నది? – మహామునులైనవారు, ఏకాగ్రతతో నుపాసించి నిరాకారుడైన ఈశ్వరుని సాన్నిధ్యమునే సాధ్యము చేసుకున్నారు – కళాకారులైనవారు చిత్తమున భక్తి వహించి, దేహమునకు దీక్షవిధించి, మనసున సంకల్పము ప్రతిష్టించి, జాగృతి సమయమంతయూ కష్టించి, ఆ నిరాకారుని ప్రత్యక్షస్వరూపముగా ప్రదర్శించుట సాధ్యపరచుకొన్నారు. ఆ కళాకారుల పరంపరలో జన్మించిన నాకు ఈ పవిత్ర కార్యమును నిర్వర్తించుటకు శాయశక్తులా ప్రయత్నించుట విద్యుక్తధర్మము.’’ ఈ శిల్పి ప్రాయమున పసివాడైననూ, ఆలోచనలో పరిపక్వమయినవాడేనని మహారాజు గ్రహించెను.
‘‘కాలాతీతమయి (ప్రఖ్యాతిగణించు) నిల్చు కళాస్వరూపముల సేతకుకాలవ్యవధి విధించుట, కానిపనియే అయిననూ, – నిలువెత్తు నటరాజవిగ్రము – నీవుచేయ, చూడవలెనని మాకు పుట్టిన ఔత్సుక్యకారణముననూ – మేము యిప్పుడే వయసుమళ్లిన వారమగుటచేతను, – రాబోవు ఆర్ద్రదర్శన మహోత్సవములోపల – మాకు స్వామిమూర్తి దర్శన మిప్పించమని అడగవలసి వచ్చుచున్నది. – వీలగునా?’’
‘‘దైవ కటాక్షముగల్గుచో, దేవరసహాయము చేయుచో, వీలుగాక నేమగును?’’
శిల్పి సాంబమూర్తికి, వలసిన సౌకర్యమునూ, సామగ్రినీ సమకూర్చుటకు మంత్రుల నాదేశించి మహారాజు (అంతఃపురోన్ముఖుడయ్యెను) కొలువు చాలించెను.
ఆ కాలమున శిల్పి శివాచారి కీర్తి, దేశదేశముల వ్యాపించియుండెను. విగ్రహములు చేయుటలో శాస్త్రనియమములను క్షుణ్ణముగ తెలిసినవాడు. సాముద్రికా లక్షణములను సమగ్రముగ గ్రహించి జ్ఙాపకముంచుకొన్నవాడు, – పంచలోహ మిశ్రమమున సర్వజ్ఙుడని పేరుపొందినవాడు, – పోతపోసిన తరువాత ఏ విగ్రహమునకు ఏ వర్ణమురావలయునో, ఏ భంగిమమునకు లోహమెంత ఘనత కలిగియుండవలెనో – ఏ యే లోహములు, ఏ క్రమమున కరగించి, కలుపవలయునో తన జీవిత మంతయూ ధారపోసి, పరిశ్రమించి, పరిపక్వము పొందినవాడు. తనకు మగ సంతతి లేనందువలన పురుషోచిత కఠినమయిన ఈ కళాసృష్టియందు తన సాంకేతిక నిపుణత తనతోనే అంతరించిపోవునేమో యని చింతించుచుండెను. – ఆయనను అనపత్య దుఃఖమునుండి తప్పించుటకు ఒకే ఒక కుమార్తె మాత్రము కల్గెను – తన విద్యను అభ్యసించి, ఉత్తీర్ణతచెంది, తనకు తృప్తినీ, లోకమునకు ఉపకారమునూ కలుగజేయు తగిన అల్లుడైన తనకు సంప్రాప్తించునేమోయని అతడాశించుచుండెను. అట్టి యెడ, అన్యదేశస్థుడయిన సాంబమూర్తి శివాచారియొద్ద శిష్యుడుగా చేరెను. కొలది కాలములోనే సాంబమూర్తి శ్రద్ధగల వాడనియూ, సమర్థతగలవాడనియూ, భక్తిగలవాడనియూ, పట్టుదలగలవాడనియూ, కుశాగ్రబుద్ధి గలవాడయ్యునూ కుతూహలముతో దివారాత్రములు శ్రమచేయగలవాడనియూ శివాచారి గమనించి, గ్రహించి సంతుష్టుడయ్యెను.
అల్లునకు తన విద్య అరణముగాయిచ్చి, తన కుమార్తె శివకామినిల్లాలు చేసి కళ్లారగా వారి అన్యోన్య జీవితము కొన్నేళ్లు తనుజూచి, సాంబమూర్తి తగినంత కీర్తిగణించిన పిమ్మట శివాచారి తృప్తిగా శివుని సాయుజ్యమునుచెందె.
యువదంపతుల మధురమయ జీవితము నడుమ, మలయసింహ మహారాజు పిలిపించి ఈ పవిత్ర భారమును పైనుంచె.
కాని, కళల కంకితుడైన సాంబమూర్తి యిది యొక కష్టమనుకొనలేదు. ఆనంద తాండవుని ఆరడుగుల ఆకృతిని చేయునవకాశము తనను పిలిపించి ఆరాజు కల్పించినందు కానందమందెను.
భక్తిప్రసన్నుడై, పనితనము ప్రదర్శింప నుత్సాహియై, విగ్రహ సృష్టియందు నిమగ్నుడయ్యెను. అతడు దివారాత్రములు మరచెను. ఆకలి దప్పులు మరచెను. ఆత్మీయురాలైన పడుచు భార్యను మరచెను – తన్ను తానే మరచెను.
అనుక్షణమునూ అతని చిత్తమునందు ఆ నటరాజ మూర్తి ధ్యాసే తప్ప మరొయొక ఆస తలయెత్తలేదు. నిరంతర ధ్యానమున ఆమూర్తి యొక్క స్వరూపము ప్రమాణమున వృద్ధియగుచు, ఆతని హృదయసీమను ఆవరించియుండెను. నిలువెత్తు విగ్రహమున కేర్పరుపవలసిన రూపురేఖలు అతని కనులకు సాక్షాత్కరించుచుండెను.
చెరగుకప్పి పళ్లెరమున ఆహారపదార్ధములు కొనివచ్చి చేరువన నిల్చియేయున్న ధర్మపత్ని అతని దృష్టికి తోచనేలేదు.
విగ్రహమును పోతపోయుటకు, అచ్చును సర్వాంగసౌష్టవముగ తయారుచేయుచు సందడిలో ఆ సాంబమూర్తికి, అర్థాంగి అతి వినయముగ పిలుచుపిలుపు వినపడలేదు.
పంచాగ్ని మధ్యమున, మూసలలో పంచలోహములు కరగించుచూ, ఏకాగ్రతతో గమనించుచున్న ఆ శిల్పికి దూరముగా కూర్చున్న భార్య విడచు దీర్ఘనిశ్వాసముల వెచ్చదనము సోకనేలేదు.
గడువు మీరకముందు, నటశేఖరుని విగ్రహమును నిర్దుష్టముగ నిర్మించవలెనన్న ఆసక్తితో అహోరాత్రములు శ్రమించు అతనికి, ఆ విగ్రహము తప్ప మిగిలిన విశ్వమంతయూ శూన్యప్రాయమయ్యెను.
అచ్చు పూర్తిచేసి, లోహములు విశ్రమించి, పోతపోసి, – అది చల్లారుటకు వలయునన్ని నీళ్ళూ భక్తియుతుడై, ధ్యాననిరతుడై గడపి, అచ్చు పెగల్చి విగ్రహమును బయటికి తీసెను.
పరిమాణమున సరియైనదయ్యునూ, – భంగిమమున నిర్దుష్టమైనదయ్యునూ, రూపురేఖలలో కొరతలేనిదయ్యునూ, – సాంబమూర్తికి ఆ విగ్రహము సంతృప్తికరముగ లేదు. తన హృదయమున తాండవించుచున్న ఆ నటరాజుని విశ్వాసలావణ్యము ఆ విగ్రహమునకమరలేదు.
తిరిగి అచ్చుచేసి, మరల పోతపోసి ప్రతిమకేసి చూచి, శిరము పంకించి మరియొకసారి ప్రారంభించెను.
ఎన్ని విగ్రహములు చేసెనో, – ఎన్ని దినములు గడచెనో, అతను లెక్కించలేదు.
చిహ్న తుల్యప్రాయమగు, చిన్న విగ్రహమును చూచిననాటినుండియూ, నటరాజస్వరూపమునే స్మరించుచున్న నృపుడు దినమొక యుగముగా లెక్కపెట్టుచుండెను. ఏనాడు సాంబమూర్తి ఏపనిని చేసెనో భటులవల్ల తెలిసికొనుచుండెను, – అచ్చు ముగిసినదని లోహము కరగించినాడనీ విని, కొలదిరోజులలోనే స్వామిమూర్తిని దర్శించవచ్చునుగదా అని సంతోషపడెను. పూర్తిఅయిన విగ్రహమును తృప్తికరముగా లేదని, శిల్పి పునఃప్రయత్న మారంభించెనని విని, ప్రభువు ఓర్పు వహించెను.
కొన్ని వారములు గతించెను–క్రొత్త విగ్రహము లుత్పత్తిచెందెను. ప్రభువున కాహ్వానము రాలేదు,–ఆతురత హెచ్చెను–శిల్పియే వానిని యోగ్యప్రదములు కావని తీర్మానించినట్లు కబురు తెలిసెను. శిల్పి సమర్ధుడు కాడేమోనని సందేహము పొడమెను.
సభలో సాంబమూర్తి ‘‘ప్రభుల కాసందేహము కలుగుటకు కారణము’’ అని ప్రశ్నించిన సమయము జ్ఙాపకము వచ్చెను.– ఒకవేళ తన గురువు శివాచారి చేసి దాచియుంచిన విగ్రహములను తను చేసినవని ప్రదర్శించి, సాంబమూర్తి ఖ్యాతిగణించెనేమో లేకున్న యున్నవిగ్రహములు, చేసిననూ యేల లోపము లుండును.
వేచియుండి వేచియుండి, ఆశాభంగము చెందిన రాజున కాగ్రహము కల్గెను.
‘‘నేటినుండి ఒక నెలలోపల విగ్రహము తృప్తికరముగా పూర్తి చేయకున్న శిరచ్ఛేదము చేయించెదమని సాంబమూర్తికి చెప్పిరండ’’నెను.
సర్వకార్యములనూ స్వహస్తముతో చేసుకొనుచున్న, శిల్పికి రాజాజ్ఞ నివేదించిరి – కొంతసేపటికి గాని సాంబమూర్తికది మనసున చొరనేలేదు. పూర్తిగా అర్థమయిన పిమ్మట అతని ముఖమున నొక చిరునవ్వు మొలచెను. ‘‘ఈ దైవమూర్తిని, నేను మహారాజు కొఱకు చేయుచున్నది’’అని అతని ఆత్మ స్వగతము పల్కుచుండెను.
కాని యింతకాలమూ భర్తపనికి భంగము రాకూడదని స్వగతములే పల్కుకొనుచున్న ఆ సాధ్వి శివకామి మాత్రము, రాజాజ్ఞవిని, నోరు విప్పి సాహసించెను. ‘‘తన కొర్కె తీర్పని వారికి, తల దీయించనెంచు రాజేమి న్యాయనిరతుడైన రాజు? – ఆ రాజు కొరకు అహోరాత్రములు శ్రమించుట ఏమి శ్రేయము’’ అని ఆమె మనసు ఆమెతో తర్కమునకు దిగెను. సాంబమూర్తి తిరస్కరించిన విగ్రహము ఆమె దృష్టి పసరించెను. ఆమె కండ్లయెదుట కాలచక్రము గిర్రున తిరిగి, క్షణములో 30వ రోజు దృశ్యము గోచరించెను.
‘‘మానుషత్వము లేని ఈ మహారాజు కొరకు మీరు పడిన కష్టము చాలును – పోతపోసిన విగ్రహములు చాలును. మనమీక్షణమే బయలు దేరుట కర్తవ్యము. ఱాతి హృదయముగల ఈ రాజు పాలించు దేశమును రాత్రిపడకుండ వదలివేయుటయే మంచిది. ఈ రాజాజ్ఞతో మనకు నిమిత్తములేదు. ఆ రాజు సంతసముతో మన కవసరము లేదు’’.
‘‘శివకామీ! – నేను మీ తండ్రి యొద్దకు వచ్చి శిల్ప విద్య నేర్చుకొన్నది, ఈ మహారాజుకోసమా,? – నా స్వప్రయోజనము కోరియా? – కళకు పరమావధి కళయేననీ, పామర ప్రజలకు ప్రయోజనమైనదే కళ అనీ, పండితులు మెచ్చినదే కళ అనీ, – ఎందరెన్ని నిర్వచనములు చేసిననూ, కళ నుపాసించుట కసలు కారణము వేరు. మానవుని జీవిత ప్రమాణము మితమైనది. కళా స్వరూపము కాలాతీతమయినది. మనుజుడు మరణించును గానీ, మనుజసృష్టి మన్వంతరములు నిలచును. నా కృషి ఫలించక పోయిన నెల తిరగగానే నేను మరణింతునని భయపడుచున్నావుగాని, – ఈ రాజ్యము విడచి పోయిననూ, మరి నూరేళ్లు బ్రతికిననూ మరణము తప్పించుకొనుట సాధ్యము కాదుకదా. ఆ మాత్రమున కాశపడి ఈ సాంబమూర్తి – పవిత్ర కార్యమును పరిత్యజించి పారిపోయెనన్న అపయశము తెచ్చుకొనునా? – అంతకంటె నెలలోపల నిర్దుష్టముగ నటరాజ మూర్తిని పూర్తిచేసి అమరకీర్తి గణించుటయో, లేక ఆ ప్రయత్నములో నిమగ్నుడనై భక్తితో ప్రాణము విడచుటయో మేలుకాదా – నీవు ధైర్యశాలి భార్యవు – దైవేచ్ఛ ఎటులున్న అట్లు జరుగును – బేలవయి భయపడకుము.’’
కాని అతని వేదాంతబోధ శివకామి హృదయమున శాంతిని ప్రతిష్ఠించలేదు – తన భర్త కిదియొక గండము కాబోలునని ధైర్యముతో దుఃఖమును దిగమ్రింగుటకు ప్రయత్నించెను.
రాజు పెట్టిన గడువు నేటితో ముగియును – అహములు లెక్కించి చిక్కి సగమయిన శివకామి, చైతన్యమును దక్కి చింతతో కూర్చుండె – యితర చింతన లేక, లోహప్రతిమలు పోయుచూ, సాంబమూర్తి ఆ చావడి ఎల్ల తిరుగుచుండె – ఒకప్రక్క అచ్చున, మొన్న పోసిన విగ్రహము చల్లారుచున్నది. మరియొక దిక్కున క్రొత్త అచ్చు పోతకు సిద్ధమైయుండెను. మూసలో, లోహము తకతకమని తిర్గుచుండెను. సాంబమూర్తి చెవికది ఢమరుకవాద్యమే. మొన్నటి విగ్రహము అచ్చునుండి తీసివేసి, తృప్తిలేకున్న మరియొక పోతపోయుటకు సాంబమూర్తి సర్వసన్నాహములు చేసియుంచుకొనెను. ఈసారి సజీవ మయినట్లున్న విగ్రహము ఏర్పడుటయో, తన జీవమును ధారపోయుటయో తేలవలెనన్న బింకమతని నావహించియుండెను. కాగుచున్న కంచునూ, దగ్గరలో నున్న అచ్చునూ, ఆరుచున్న విగ్రహమునూ వేయికనుల చూచుకొనుచుండెను.
కాని చెంతనున్న శివకామి కివి యేమియూ కాన్పించుటయే లేదు. ఆమె అరమోడ్పు కనులకేమి దృశ్యములు తోచెనో అన్యులకు తెలియదు.
నడినెత్తిన సూర్యుడు అంతలో నగరము – వెనుక కేగెను. గుడిగోపురము వెనుక దాగి సూర్యుడు నిష్క్రమించుచుండెను.
నీలి ఆకాశము నెత్తురు వర్ణమయ్యెను. – శివకామి కది కనుల రుధిర పంకల వధ్యస్థలముగా తోచెను
ఆ భయ దృశ్య విహ్వలురాలైన శివకామికి ఎవరో పిల్చినట్లాయెను. – ‘‘అమ్మా, అమ్మా’’యని పిల్చు స్వరము నాలకించి, దాని దెసను వెతకనున్న శివకామికి (ఎట్టఎదుటి కంటెదుట దాపుననే) వృద్ధదంపతులు కనుపించిరి – (సాంబమూర్తి తన పనులయం దాసక్తుడై యుండెను. నేలమీద నిలుచుటకు కూడా త్రాణ లేక కాబోలు వారి పాదములు గాలిలో నాట్యము చేయుచుండెను. వృద్ధుని తల తైల సంస్కార దక్షత లేక కాబోలు తాటలుగట్టి ఎండిన తాటి టెంకవలె నుండెను. అతి డస్సి కాబోలు వారి కన్ను లర్థనిమీలితములై యుండెను.
ఆకలిదప్పుల హీనస్వరమయ్యె గాబోలు ‘‘అమ్మా, తల్లీ’’ అతి దూరము నుంచి పిల్చుచున్నట్లుండె.
శివకామి తలయెత్తి చూచెను.
‘‘ఏమి’’ అని ఆమె నోరు తెరచి పలుకాడలేదు. ఆమె ముఖమెత్తిన వైఖరిలోనే ఆ శబ్దముద్భవించెను.
‘‘బహుదూరమునుంచి వచ్చినామమ్మా’’
‘‘ఐతే’’ అని శివకామి చూపులు ప్రశ్నించెను.
‘‘కొంచెము దాహము యిప్పించవమ్మా – నోరెండి ప్రాణము పోవునట్లున్నది–’’
‘‘మా ప్రాణములూ పోబోవునట్లే యున్నవి – పొండు పొండు’’ అని ఆమె ఆంతర్యమున చేసిన గర్జన వారికి వినిపించెనో ఏమో–?
‘‘శివకామ సుందరివైన నీకు యింత నిర్దయ కూడదమ్మా–’’
‘‘శివకామ సుందరి నిజముగ దయగలిగినదే అయిన మాకీకర్మమేల పట్టును’’– అని ఆమె అశృులు ఘోషించెను.
ఆలయమునకై బయలుదేరి అంతిపురము వెడలుచున్న రాజునకున్నట్లుండి గుండెనొప్పి గల్గెను – క్షణము విశ్రాంతికై, ఒక ఉయ్యాలలో కూలబడెను.
‘‘గంజిలేకున్న, మజ్జిగలేకున్న, మంచినీళ్లు ఏదో గ్రుక్కెడు ద్రవముపోసి మమ్ము రక్షించిన నీకు కోటి పుణ్య ముండునమ్మా’’యని యా ముదుసలి, అనంత కాలమునుంచి అభ్యాసమున్నట్టు చేతిలోని పాత్ర నీటెను.
‘‘నీకు గుణవంతుడయిన కొడుకు పుట్టునమ్మా’’యని ఆ ముసలిది వంతపాడెను.
సూర్యోదయమున భర్తకు శిరచ్ఛేదము గల్గిన, తాను సహగమనము నిశ్చయించుకున్న శివకామికి ఈ దీవెన విని ఏడ్చుచూనవ్వెను.
‘‘అమ్మా నీవు లేచి మాకు దాహముపోయువరకూ మా కిచ్చటనుంచి పోవుట సాధ్యముకాదు.’’
‘‘కావలయునన్న ఆ కాగుచున్న కంచు త్రాగుడు’’
‘‘మంచిదమ్మా – మేము కాదందుమా–’’
వారి శఠింపు చూసి, విసుగుచెందిన శివకామి క్షణములో లేచి ఆ కంచు పోయుటయూ వారు త్రాగుటయూ గూడ జరిగిపోయెను. కళకళ క్రాగెడు కంచు తాను గరిటెతో ప్రోయ, గడగడ త్రాగిన ఆ ముదుసలులు భస్మమయి పోవుదరని భయపడి చూచుచున్న శివకామి ఎట్టఎదుట, ఆ భిక్షకుల ముడుతలు పడిన చర్యము నునుపయ్యెను. వారి శరీరకాంతి స్వర్గతుల్యమయ్యెను – వారి ముఖముల మందహాసములు మొలచెను. ఆమెకది కలయో వాస్తవమో బోధపడలేదు.
‘‘శివకామి, శివకామి,’’
అమిత ఉత్సాహముతో తన భర్త పిలుచుచున్నట్లు వినిపించెను. ఆమె కనులు నలుపుకొని – అటు చూచెను. సాంబమూర్తి అచ్చు పెగిల్చి అప్పుడే నిలబెట్టిన విగ్రహములను చూచెను – తాను కాగిన కంచుపోసి దాహము తీర్పగా – విగ్రహములుగా మారిన వృద్ధులు వీరేనా?
ఆమెకు ఆ విగ్రహములు ఒక క్షణము విగ్రహములుగనూ, ఒక క్షణము వృద్ధ భిక్షువు లుగనూ కనుపించసాగెను.
ఆమె అతి ఆవేశముతో భర్తను వేడుకొనెను. ‘‘మీరు తక్షణమే పోయి మహారాజును తోడ్కొనిరండు’’.
ఈ విగ్రహములకే సజీవ కళ లెట్లు వచ్చెనో ఊహించనేరని సాంబమూర్తి అమిత ఆనందముతో అంతఃపురమునకు పరుగెత్తెను.
గుండెనొప్పి తేరి, లేవబోవుచున్న ప్రభువు సముఖమునకు పరుగుపరుగున సాంబమూర్తి వచ్చిపడెను. – చేతులు జోడించి, పరవశస్వరముతో, నటరాజమూర్తిని దర్శింప రమ్మనమని విన్నవించెను. అంతతో నాగక, ఆ విగ్రహమున కబ్బిన సజీవ కళలను, ఆ దివ్వ తేజోమూర్తి ప్రకాశమును, వర్ణింపసాగెను.
కూర్చున్నరాజు, లేవకుండగనే కనులు మూసికొని ఆ వర్ణనానుక్రమముగ, ప్రతిమల నూహించుకొని, అంతర్చక్షుడై స్వామిని దర్శింపసాగెను – వర్ణనముగీసి ఎంత వేగిరపరచినను, మహారాజు మరల కనులు తెరువలేదు.
(స్వాయంభువమూర్తి యనబడెడు ఈ విగ్రహము ఈ నాటికినీ, తంజావూరు జిల్లాలోని, కోనేరి రాజపురమున, వెలసియున్నది.)
(కృష్ణాపత్రిక వజ్రోత్సవ సంచిక లో ఈ కథ ప్రచురించబడినది)
1950-60 ల కాలం నాటి ప్రసిద్ధ తెలుగు రచయితల్లో ఒకరు. వీరు రాసిన అలరాస పుట్టిళ్లు కథ సుప్రసిద్ధం. తక్కువ కథలే రాసినా విషాదాంత ప్రేమ కథలకు ప్రసిద్ధి చెందారు.
Discussion about this post