• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తమిళ కథ : పుష్పించని చెట్టు

జిల్లేళ్ల బాలాజీ by జిల్లేళ్ల బాలాజీ
January 10, 2026
in అనువాద కథలు
0
తమిళ కథ : పుష్పించని చెట్టు

తమిళ మూలం: పావణ్ణన్‌
అనువాదం: జిల్లేళ్ల బాలాజీ

‘‘జస్ట్ ‌ట్వెంటీఫైవ్‌ ‌రుపీసే. ఒకే ఒక గ్రూపు ఫోటో తీసుకోండి సార్‌. ‌లాల్‌బాగ్‌ను మీరొక రౌండు తిరిగొచ్చేలోపు నేను ప్రింట్‌ ‌తీసిచ్చేస్తాను సార్‌. ‌పోస్ట్‌కార్డ్ ‌సైజ్‌ ‌కలర్‌ ‌ప్రింట్‌.’’ అన్నాను. ఈ రోజు ఎదురైన మొదటి గిరాకీ. పదీ పన్నెండుమంది ఉన్న ఆ గుంపును విడిచిపెట్టకూడదు అనిపించింది. ‘‘ఇటు చూడండి సార్‌. ఇది పుష్ఫించని చెట్టు. ఏ రుతువులోనూ ఇది పుష్పించిందే లేదు. ఎంతో అపూర్వమైన చెట్టు. ఇక్కడికొచ్చేవాళ్లందరూ దీనిపక్కన నిలబడి ఫోటో తీసుకుంటారు. రండి సార్‌ ‌రండి.’’ వాళ్లు దృష్టిని మళ్లించి ఆసక్తి కలిగించేలా చెప్పాను.

నడుస్తున్న గుంపులో నుండి ఒక వ్యక్తి ఆగి నిలబడి హేళనగా నవ్వుతూ ‘‘ఏంటి తమ్ముడూ, కత చెప్పేందుకు ఒక హద్దంటూ లేదా? పుష్పించని చెట్టు, కాయలు కాయని చెట్టు అంటూ చెబుతున్నారు? బయటి ఊరివాళ్లని చెబితే చెవిలో పూలు చుట్టాలని చూస్తున్నారా? నా దగ్గర జరిగే పనేనా ఇది?’’ అన్నాడు. 

‘‘సార్‌, ‌నిజంగా ఇది పుష్పించని చెట్టే సార్‌. ‌నేను చెప్పేది నమ్మండి. కావాలంటే దగ్గరికొచ్చి చూడండి సార్‌. ‌గవర్నమెంటే చెట్టుమీద బోర్డు పెట్టింది చూడండి.’’ 

నేను వేగంగా నడిచి వెళ్లి చెట్టుకు కొట్టి ఉన్న ప్రకటనా రేకును తాకి చూపించాను. దాన్ని పరిశీలించటానికి ఇష్టపడేవాళ్లలా ఆయనా, ఆయన కుటుంబ సభ్యులూ నా వెనకనే వచ్చి దాన్ని చదివారు.

‘‘ఒక పువ్వూ లేదు, ఒక మొగ్గా లేదు. రెండువందల సంవత్సరాలుగా అలాగే పసిబిడ్డలాగా ఈ చెట్టు నిలబడుంది సార్‌. ఆ ‌కాలంలో టిప్పు సుల్తానుకు బిడ్డ పుట్టిన సమయంలో దానికి గుర్తుగా నాటిన చెట్టని చెబుతారు. ఈ లాల్‌బాగే వాళ్ల తండ్రి హైదరలీ రూపొందించిందే.’’

నేను చెప్పుకుంటూ వెళ్లాను. కథ కలిగించిన ఆసక్తితో వాళ్లు ఆగిపోయారు. ఇద్దరు చిన్నపిల్లలు ఆ చెట్టు చుట్టూ  పరుగెత్తి ఆడుకోవటం మొదలుపెట్టారు. ఒక చిన్నపిల్ల ఎగిరి దాని కొమ్మను పట్టకోవటానికి ప్రయత్నించింది.

‘‘ఏం చెట్టు ఇది?’’

‘‘మామిడిచెట్టే సార్‌. ఆకును చూస్తే తెలుస్తుంది చూడండి. అయితే నాటిన రోజునుండి పుష్పించింది లేదు, కాసింది లేదు. వింతైన చెట్టు.’’

కింద వున్న కొమ్మ నుండి ఒక ఆకును గిల్లి చూసి మిగిలినవాళ్ల చేతికిచ్చారు ఒకరు. ‘‘సార్‌, ‌స్ట్ ‌ట్వెంటీఫైవ్‌ ‌రుపీసే. ఈ చెట్టు ముందు నిలబడి ఒక గ్రూప్‌ఫోటో తీసుకుంటే బాగుంటుంది సార్‌. ఒక జ్ణాపక గుర్తుగా ఉంచుకోవచ్చు.’’ అని నేను మళ్లీ నా పల్లవిని మొదలుపెట్టాను.

ప్రశాంతంగా నిలబడ్డ గుంపులోని ఒక యువకుడి కళ్లల్లో ఆసక్తి స్పష్టంగా కనిపించటాన్ని చూశాను. వెంటనే అతనితో ‘‘ట్వెంటీఫైవే సార్‌. ‌పోస్ట్‌కార్డ్ ‌సైజ్‌. ‌రండి సార్‌.’’ అన్నాను. 

అతను వెంటనే ‘‘ట్వెంటీఫైవ్‌ ఎక్కువ. ట్వెంటీ ఓకేనా?’’ అన్నాడు. 

‘‘సార్‌, ‌కలర్‌ ‌ప్రింట్‌ ‌సార్‌. ‌ఖర్చు పోను ఒక ఫోటోకు నాకు అయిదు రూపాయలే మిగులుతాయి సార్‌. ‌ట్వెంటీ టూ అయినా ఇవ్వండి సార్‌.’’

‘‘అదంతా నాకు తెలియదు. ట్వెంటీ ఓకే అయితే తియ్యండి. లేకుంటే వదిలెయ్యండి.’’ అనిచెప్పి ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. నాకు వాళ్లను వదిలెయ్యటానికి మనసు ఒప్పలేదు. ఈరోజు ఒక నాలుగువందలు ఐదువందలు గిట్టాలి. సాయంత్రం తేన్‌మొళికి ఆస్పత్రిలో ఒక టెస్ట్ ‌చెయ్యించాలి. ప్రసవ సమయం. 

‘‘సరే సార్‌. ‌మీరే మొదటి కస్టమర్‌. ‌రండి సార్‌. ‌వదిలెయ్యటానికి మనసు రావటం లేదు. వచ్చి నిలబడండి సార్‌.’’ అన్నాను. ఆ యువకుడు ఆసక్తితో తనభార్య చేతిని పట్టుకుని లాగుతూ ముందుకొచ్చాడు. అతని పక్కన నిలబడ్డవ్యక్తి ‘‘ఎందుకురా గణేశా ఇవన్నీ? అనవసరపు ఖర్చు.’’ అని విసుక్కున్నాడు. 

‘‘ఉండనీ. రా అన్నా. ఒక జ్ణాపకంగా ఆల్బంలో పెట్టుకోవచ్చు. 1997లో బెంగుళూర్‌ ‌పర్యటనలో తీయించుకున్న ఫోటో అని ఫోటో వెనకాల రాసి పెట్టుకుంటే పెట్టెలో నిధిలాగా పడుంటుంది అన్నా. ఒక పాతికేళ్లు గడిచాక చూశామంటే, భలే కిక్కుగా ఉంటుంది.’’

‘‘ఫోటోలో ఏంట్రా కిక్కూ. టిక్కూ. ఊర్కే క్రాక్‌ ‌లాగా మాట్లాడొద్దు.’’

‘‘పాతికేళ్లు గడిచాక ఒళ్లంతా సన్నబడి, తల వెంట్రుకలు తెల్లబడి, పూచిక పుల్లలాగా మనం ఉంటామన్నా. అయితే ఈ ఫోటో మాత్రం అలాగే ఈరోజు లాగానే యవ్వనంతో ఉంటుంది.’’ 

‘‘మనిషిని లోబరుచుకునేలా ఏదో ఒకటి చెప్పురా. ఎప్పుడు చూసినా నీకు ఇదే పని.’’

విసుక్కుంటూనే అందరూ చెట్టు ముందుకొచ్చి నిలబడ్డారు. ఇద్దరు మహిళలు చేతి సంచిలో నుండి అరచేతిసైజులో ఉన్న అద్దాలను తీసి చెదిరిన వెంట్రుకలను సరిచేసుకున్నారు. ముఖాల మీద నీడ పడకుండానూ చాలినంత వెలుతురు పడే విధంగానూ ఒక సరైన కోణంలో వాళ్లను నిలబెట్టేందుకు కొంత సమయం పట్టింది.

‘‘తమ్ముడూ, మాతో ఏం సినిమానా తీస్తున్నారు? ఇలా తిరగండి, అలా తిరగండి అంటూ మార్చి మార్చి చెబ్తున్నారు?’’

‘‘అలా కాదు మేడమ్‌. ‌ఫోటోలో మీ ముఖం స్పష్టంగా కనిపిస్తేనే కదా చూస్తున్నప్పుడు తృప్తిగా ఉంటుంది.’’

కెమెరా కోణాన్ని మార్చి పరిశీలిస్తున్నప్పుడే చక్రాలకుర్చీతో వాళ్లతో కలిసి వచ్చిన ఒక స్త్రీ కొంత దూరంగా నిలబడటం కెమెరా గుండా కనిపించింది. ఒకవేళ ఆమె మెల్లగా వచ్చి కలుస్తుందేమోనన్న ఆలోచనతో చప్పున కెమెరాను జారవిడిచి నిలబడ్డాను. అయితే ఆ స్త్రీ నన్ను గమనించనే లేదు. దారి పక్కగా వేడుక చూస్తూ నిలబడుంది. కుర్చీలో కూర్చోనున్న పసిదాని భుజాన్ని పట్టుకొని ఉంది ఆమె చెయ్యి.

‘‘వాళ్లు రాలేదా? వాళ్లు అక్కడే నిలబడ్డారు.’’ అని ఆ స్త్రీని చూపిస్తూ అడిగాను. 

వెంటనే ఒకవ్యక్తి అసహనంగా, ‘‘వచ్చి నిలబడినవాళ్లను తియ్యకుండా వాళ్లెందుకు రాలేదు, వీళ్లెందుకు రాలేదు అన్న ప్రశ్నలన్నీ ఎందుకండీ? మాట్లాడకుండా మీ పని చూడండి.’’ అన్నాడు.

ఆ గొంతు నా లోపాన్ని గ్రహింపచేసినప్పటికీ, నాకు ఆ ఎడబాటు విచిత్రంగా అనిపించింది.

పూర్తి చెట్టును బ్యాక్‌‌గ్రౌండుగా పెట్టుకుని మంచి కోణంలో ఓ ఫోటోను తీశాను. 

‘‘ఏమండీ అంతలోనే తీసేశారా? స్మైల్‌ ‌ప్లీజ్‌ అని చెప్పనే లేదే?’’

‘‘నవ్వటం చేతకానివాళ్లకే దాన్ని చెప్పాలి. మీరందరూ నవ్వు ముఖాలతో ఉన్నారు. ఫోటోకంటూ వేరుగా స్మైల్‌ ‌చేస్తే చాలా కృత్రిమంగా ఉంటుంది.’’

వాళ్లు చెదిరిపోతున్న క్షణంలో ‘‘సార్‌ ‌సార్‌ ఒక్క నిమిషం.’’ అని చెప్పి వాళ్లను ఆపాను. 

‘‘కూర్చున్నట్టుగా ఒకటి తీస్తాను సార్‌. ‌సూపర్‌గా ఉంటుంది. నిలబడ్డ ఫోజులో ఒక ఫోటో. కూర్చున్నట్టుగా ఒక ఫోటో. రెండింటినీ ఫ్రేమ్‌చేసి పెట్టుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది సార్‌.’’

‘‘‌ఫోటో బాగుంటుందో లేదో, మీ మాటలు బాగున్నాయి. సరే తియ్యండి, తియ్యండి. బాగుండాలి! బాగుంటేనే డబ్బిస్తాము. లేదంటే లేదు.’’

వాళ్లు కలిసి కూర్చోవటం మొదలుపెట్టారు. 

‘‘సార్‌, ‌జెంట్స్ ఒక వరుస, లేడీస్‌ ఒక వరుస, పిల్లలు ఒక వరుసంటూ ఒకరి వెనక ఒకరుగా మూడు వరుసలుగా కూర్చోండి సార్‌. ‌ఫోటో అద్భుతంగా వస్తుంది…’’

ఫోటోలు తియ్యటం పూర్తికాగానే వెనక భాగాన్ని దులుపుకుంటూ ఒక్కొక్కరుగా పైకి లేచారు. 

నేను ఆ చక్రాల కుర్చీని పట్టుకోనున్న స్త్రీకేసి చూశాను. పసిదాని తలపై ఉన్న గులాబీ పువ్వును సరిచేస్తూ ఆమె నిలబడుంది. ఇటువైపుకు తిరిగి కూడా చూడలేదు.

‘‘ఎప్పుడు రెడీ అవుతాయి తమ్ముడూ?’’

‘‘సార్‌, ఇప్పు‌డు సమయం పదిన్నర కావస్తోంది. లాల్‌బాగ్‌ ‌పూర్తిగా ఒక రౌండు వెయ్యటానికి రెండు గంటలు పడుతుంది సార్‌. ‌రెండువందలు మూడువందల ఎకరాల ప్రదేశం సార్‌. ‌పన్నెండున్నర కల్లా రండి సార్‌. ‌నేను ఈ చెట్టు కిందనే నిలబడుంటాను.’’

‘‘ఇక్కడ ఏమేం చూడొచ్చు?’’ కాస్త వయసు మళ్లిన ఓ మహిళ అడిగింది. 

‘‘నేరుగా వెళ్లారంటే ఒక చెరువు వస్తుంది మేడమ్‌. ‌మిస్‌ ‌కాకుండా చూడండి. అక్కడ రకరకాల కొంగలున్నాయి. అటే వచ్చారంటే రోజ్‌ ‌గార్డెన్‌. ‌స్వాతంత్ర దినోత్సవం రోజున ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ఇంకా అలాగే ఉంచారు. దాన్ని కూడా చూడొచ్చు.’’

‘‘అంతేనా?’’

‘‘ఇక్కడ చెట్లే ముఖ్యం మేడమ్‌. ఇం‌డియాలోని ముఖ్యమైన చెట్ల రకాల్లో ఒక్కొక్క చెట్టుకూ ఒక శాంపిల్‌ ‌చెట్టు ఇక్కడుంది. నిలబడి నిదానంగా చూస్తే సాయంకాలం దాకా కూడా చూడొచ్చు.’’ 

‘‘సరే రావే టైమవుతుంది, పోదాం.’’ అంటూ నాతో మాట్లాడుతున్న మహిళ భుజాన్ని తాకి చెబుతూ గాల్లో చెదిరిన చీర మడతలను సరిచేసుకుంది ఇంకొక మహిళ. ఆమె పెదాలు లావుగా ఉన్నాయి. 

అందరూ కదిలి వెళ్లిన ఆ సమయంలో, ‘‘మమ్మల్ని మాత్రం ఒక ఫోటో తీస్తారా?’’ అని నన్ను అడిగాడు ఆ యువకుడు. అతనే నాతో మొట్టమొదటగా మాట్లాడిన వ్యక్తి. సిగ్గుపడుతున్న తన భార్యను లాగి తన పక్కన నిలబెట్టాడు. 

‘‘ఒకటేమిటి సార్‌. ‌వంద తీస్తాను. అదే కదా నా పని. వచ్చి నిలబడండి.’’ అంటూ ఉత్సాహపరిచాను. ఆ క్షణమే,  వాళ్లు ఎప్పుడు చూసినా పరవశం చెందే విధంగా ఆ ఫోటోను తియ్యాలి అని నిర్ణయించుకున్నాను. అందమైన కోణం. అందమైన బ్యాక్‌‌గ్రౌండ్‌. ‌తగినంత వెలుతురు. దానికోసం కెమెరా గుండా వాళ్లను చూస్తూ సరిచేసుకుంటున్నాను. 

అప్పుడు కాస్త వేగంగా వీచిన గాల్లో ఆమె తల వెంట్రుకలు చెదిరి ఎగరసాగాయి. ఎగురుతున్న వెంట్రుకలను ఆమె ఆపేందుకు చేతివేళ్లను తల దగ్గరకు తీసుకెళ్లింది. యువకుడు చిరునవ్వుతో ‘‘ఉండనీ వదిలెయ్‌ ‌విమలా. నేచురల్‌గా 

ఉండనీ. అప్పుడే బాగుంటుంది.’’ అన్నాడు. అతణ్ణి కాస్త తలపైకెత్తి చూసిన ఆమె ముఖం. ప్రేమతో వంగి ఆమెను చూస్తున్న అతని ముఖం. అందమైన కోణమని అనిపించగానే నేను ఆ సందర్భాన్ని ఫోటో తీసేశాను. ఇద్దరూ చేతులు కలిపి నిలబడే స్థితిలో ఫోజ్‌ ఇచ్చినప్పుడు దాన్నీ తీశాను. 

‘‘సార్‌, ఇలా కూర్చుని మేడమ్‌ ‌భుజాన్ని తాకుతున్నట్టుగా ఉండండి సార్‌. ఇం‌కో ఫోటో సూపర్‌గా తీసేద్దాం.’’ అన్నాను. ఏ వ్యతిరేకమైన గొంతూ లేకుండా ఇద్దరూ నా మాటకు కట్టుబడి కూర్చున్నారు. నేను ఆ ఫోటోనూ తీశాను. ఆమె వేగంగా లేచి వెళ్లి గుంపులో కలిసిపోయింది.

‘‘ఏంటి సార్‌, ‌కొత్తగా పెళ్లి చేసుకున్నారా?’’

‘‘అయ్యో, మూడేళ్లు అవుతోంది సార్‌. ఇం‌ట్లో నుండి బయటికొస్తే ఆమె అంతే. చాలా సిగ్గుపడిపోతుంది.’’

అతను వేగంగా వెళ్లి మిగతావాళ్లతో కలిసిన సమయంలో, పెదాలు లావుగా ఉన్న మహిళ, ‘‘రండి, మనమూ మన పిల్లలూ కలిసి వేరేగా ఒక ఫోటో తీయించుకుందాం.’’ అని తన భర్తను పిలవటం చూశాను.

‘‘నీకివ్వాళ అదృష్టంరా నల్లముత్తూ.’’ అంటూ నాకు నేనే మనసులో అనుకున్నాను. ‘‘ఫ్యామిలీ ఫోటోనే బెస్ట్ ‌ఫోటో. గ్రూప్‌ ‌ఫోటోను హాల్లో పెడితే, ఫ్యామిలీ ఫోటోను బెడ్‌రూమ్‌లో అందంగా పెట్టుకోవచ్చు. రండి సార్‌.’’ అన్నాను. 

ఆ మహిళ ఎవరికోసమూ తిరిగి చూడకుండా వేగంగా చెట్టుకిందికొచ్చి చీరను సర్దుకోవటం మొదలుపెట్టింది. ఆమె భర్తా ఇద్దరు పిల్లలూ ఆమెతో కలిసి నిలబడ్డారు. నేను మంచి యాంగిల్లో వాళ్లను నిలబెట్టి ఓ ఫోటోను తీశాను. 

వాళ్లు కూర్చున్న స్థితిలోనూ ఒక ఫోటోను తియ్యమని అడిగారు. 

వాళ్లు వెళ్లగానే తాముగా మరొక జంట వచ్చి నిలబడ్డారు. ఆ మహిళ జడ నడుము వరకూ పొడవుగా వ్రేలాడుతోంది. చాక్లెట్‌ ‌రంగు కలిగిన ఆమె భర్త వెంట్రుకలు ఎండలో మెరిశాయి. వాళ్ల ఇద్దరు పిల్లలూ కలిసి తల్లి పక్కన నిలబడ్డారు. ‘‘ఇటు వైపుకు ఒక పిల్లవాడు రావచ్చుగా తమ్ముడూ!’’ అని వాళ్లను చూస్తూ చెప్పాను. ఇద్దరూ ‘‘ఊహూ. నేను మా అమ్మ పక్కనే నిలబడతాను.’’ అని చెప్పేశారు. 

నేను కెమెరా గుండా చూడటం మొదలుపెట్టాను. అంతలోనే ఆయన విసుక్కుంటున్న గొంతుతో ‘‘తొందరగా తియ్యండి తమ్ముడూ. ఒక ఫోటో తియ్యటానికి ఎంత సేపు? లాల్‌బాగ్‌ అం‌తా తిరిగి చూడాలికదా. ఇక్కడేనా నిలబడుండగలం?’’ అన్నారు. ‘‘తొందరగా. ఎండ కూడా ఎక్కుతోంది కదా. ఒకేచోట ఎంతసేపని నిలబడతాం?’’ అనగానే ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వాళ్లను ఫోటో తీశాను. 

అందరూ చెరువు వైపుకు నడక మొదలుపెట్టారు. గాల్లో వాళ్ల పైటకొంగులు రెపరెపలాడుతున్నాయి. అందరికంటే వెనకాల చక్రాల కుర్చీని తోసుకుంటూ ఆ స్త్రీ చివరగా వెళ్లింది. 

ఆ స్త్రీ ప్రవర్తనను గురించి కొంతసేపు ఆలోచించి ఏమీ అర్థంకాక, తల విదిల్చి నా వ్యాపారంపై దృష్టి పెట్టాను.,  

పెద్ద గుంపుగానో జంటగానో వచ్చేవాళ్ల కోసం నేను బాటకేసి చూడసాగాను. ఎందరో మగవాళ్లూ ఆడవాళ్లూ నన్ను దాటుకుని వెళుతున్నారు. చెవులు వినిపించనట్టుగానే ఒక్కొక్కరూ నన్ను దాటుకుని వెళ్లారు.  

అప్పుడప్పుడు కొందరు కాలేజీ యువతీ యువకులు సరదాగా నా దగ్గర ఫోటోలు తియ్యుంచుకున్నారు. ఓ ఆరేడు గ్రూపు ఫోటోలు కూడా దక్కాయి.

లాల్‌బాగ్‌ ‌గూడు గడియారం పన్నెండు గంటలు కొట్టి విరమించింది. నేను కెమెరాను సంచిలో పెట్టి మూసేసి గబగబా లాల్‌బాగ్‌కు బయటున్న స్టూడియోకు వెళ్లాను. 

ప్రింటు చేసిన ఫోటోలన్నింటినీ వేర్వేరు కవర్లలో పెట్టి మూసి సంచిలో పెట్టుకుని ఉద్యానవన చెట్టుకిందికి వచ్చేసరికి ఒంట గంటైంది. వాళ్ల ముఖాలు ఎక్కడైనా కనిపిస్తుందా అని చుట్టుపక్కల చూడగానే నీడకు పక్కగా చక్రాల కుర్చీతో ఆ స్త్రీ మాత్రం నిలబడి ఉండటం కనిపించింది. గబగబా నేను ఆమెను కలుసుకోవటానికి వెళ్లాను. 

‘‘చాలాసేపటి దాకా మీకోసమే ఎదురుచూశారు. పిల్లలు ఐస్‌‌క్రీమ్‌ ‌కావాలని అడిగారు. దానికోసం అంగడి దాకా వెళ్లున్నారు.’’ అంది. 

నేను పక్కనున్న కుళాయిని తిప్పి నీళ్లు తాగి నోటిని తుడుచుకుంటూ వెనక్కు తిరిగాను. ‘‘లాల్‌బాగ్‌ ‌బయటున్న నా స్టూడియోకు కొంచెం దూరం నడిచిపోవాలి. అందుకే లేట్‌ అయ్యింది.’’ అన్నాను. 

‘‘సరే, నీడగా చూసుకుని పక్కగా నిలబడండి. వచ్చేస్తారు.’’ 

అంగడికి వెళ్లినవాళ్లు వచ్చేంతవరకూ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ‘‘ఏ ఊరి నుండి వచ్చారు?’’ అని అడిగాను. 

‘‘పాండిచ్చేరి. మా ఊరివాళ్ల అమ్మాయికి ఇక్కడ పెళ్లి. అందుకని బస్సు మాట్లాడుకుని వచ్చాం. ఉదయాన్నే ముహూర్తం అయిపోయింది. రేపు బయలుదేరేస్తాం.’’

నేను అప్పుడే చక్రాల కుర్చీలో కూర్చోనున్న పసిపిల్లను చూశాను. తల ఒక పక్కగా వాలిపోయి ఉంది. క్రాఫ్‌లాగా కటింగ్‌ ‌చెయ్యబడ్డ తల వెంట్రుకలు అందంగా ముడుచుకుని ఉన్నాయి. వెన్నెముక సమస్యగా ఉంటుందేమోనని భావించాను. 

‘‘బిడ్డకు ఏమైంది?’’

‘‘మైండ్‌ ‌బాగాలేదు.’’ 

నేను అప్పుడు ఆ పిల్లను పరిశీలనగా చూశాను. ‘పాపం’ అని దీర్ఘంగా నిట్టూర్చాను. ‘‘నడవలేందా?’’ అని అడిగాను. ఆమె తలూపింది. ‘‘కూర్చోబెడితే కూర్చుంటుంది. పడుకోబెడితే పడుకుంటుంది. తినిపిస్తే తింటుంది. అంతే దానికి తెలుసు. చెవులూ వినిపించవు, నోరూ మాట్లాడదు.’’ 

అది వినేందుకు నాకు కష్టంగా అనిపించింది. ఆమెకు ఓదార్పుగా ఏదైనా మాట్లాడాలన్న ఆలోచనతో ‘‘అందుకనే వాళ్లు ఈ బిడ్డను గ్రూపు ఫోటోలో చేర్చుకోలేదా?’’ అన్నాను. 

‘‘అదెలా చేర్చుకుంటారు? ఊళ్లో నలుగురూ గొప్పగా చెప్పుకోవాలనే ఇలా బస్సు మాట్లాడుకుని మమ్మల్ని పిలుచుకొచ్చారు. దీన్ని చూస్తేనే వాళ్లకు అసహ్యం. నడిచే దారిలో మలాన్ని చూసినట్టుగా ముక్కు మూసుకుని వెళ్లిపోతారు. ఒక్కరోజు కూడా వాళ్లు దీన్ని తాకలేదు. దీనితో మాట్లాడలేదు. ఈ ముగ్గురికీ పెద్దాయన ఒకరుండేవారు. ఆయన బిడ్డ ఇది.’’

‘‘ఇప్పుడాయన లేరా?’’ 

‘‘లేరు. చనిపోయారు. ఆయన ఉండుంంటే ఈ నీచుల్ని దగ్గరే చేర్చుండేవారు కారు. బంగారంలాంటి మనిషి ఆయన. ఈ బిడ్డను ఎంతగా బుజ్జగించేవారో తెలుశా? పాడేవారు, పాడేవారు రాత్రంతా బిడ్డను భుజంపై పడుకోబెట్టుకుని సుందరీ సుందరీ అంటూ పాడేవారు. నిద్రపోతే కూడా కింద పడుకోబెట్టేవారు కారు. అలాంటి ప్రేమ. ఈ పిల్ల ఉత్తినే ర్‌ర్‌ర్‌ర్‌… అం‌టూ సాగదీస్తే చాలు, అయ్యో నా బంగారు సుందరి మాట్లాడుతోందని అట్టే ఆకాశానికీ భూమికీ గెంతేవారు.’’ 

‘‘తల్లి లేదా?’’

‘‘ఉన్నారు ఉన్నారు. వాళ్లే కన్నారు. ఒక వయసొచ్చాకే బిడ్డ పరిస్థితి బాగాలేదని అర్థమైంది. వెంటనే ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. బిడ్డ వద్దని వాళ్ల వాదన. కావాలని ఈయన వాదన. ఆ అమ్మ కోపగించుకుని ఓ ఉద్యోగాన్ని వెతుక్కుని ఫ్రాన్స్‌కు వెళ్లిపోయింది. బిడ్డకు పాస్‌పోర్ట్ ‌తియ్యలేకపోవటంతో ఈయన వెళ్లలేకపోయాడు. బిడ్డకోసం ఇక్కడే 

ఉండిపొయ్యాడు…’’            

‘‘తోబుట్టువులెవరూ అప్పుడు సాయానికి రాలేదా?’’

‘‘వాళ్లా? కొంచెం కూడా మనసులో తడిలేని మనుషులు వాళ్లు. దగ్గరికొచ్చి కూడా చూళ్లేదు.’’ 

‘‘ఒంటరిగా ఎలా సంబాళించారు?’’

‘‘మా ఇంటాయనా ఈయనా చిన్న వయసు నుండే జతగాళ్లు. చదువు లేనందువల్ల ఆయన రిక్షా లాగేవాడు. ఈయనే మినిష్టర్‌తో చెప్పి ఏర్‌పోర్ట్‌లో ఒక వాచ్‌మేన్‌ ఉద్యోగం తీసిచ్చాడు. ఆ విశ్వాసం ఆయనకు. నువ్వు వెళ్లి బిడ్డను చూసుకో వళ్లియమ్మా అని నన్ను పంపించారు. నాకూ ముగ్గురు పిల్లలున్నారు. మనకూ ఒకటి ఇలా పుడితే మనమేం ఏట్లో పడేస్తామా అనుకుని రాత్రీపగలూ నేనే చూసుకున్నాను. వద్దని చెప్పినా వినకుండా అయ్య నాకు నెలకు రెండువేల రూపాయలు జీతం ఇచ్చారు.’’ 

‘‘ఆయనెలా చనిపోయారు?’’

‘‘నేనొచ్చిన ఆరవ నెలలో ఆయన స్కూటర్లో వెళ్తున్నప్పుడు ఒక లారీ గుద్ది చనిపోయారు. అప్పుడొచ్చి తొంగి చూసి వెళ్లింది ఈ పిల్ల అమ్మ. ఆ అమ్మ తరపున బంధువులంటూ ఎవరూ లేరు. అందుకని భర్తకు తమ్ముళ్లు ముగ్గురినీ పిలిచి ఈ బంగళాలోనే మీరు ఎన్నేళ్లు కావాలన్నా ఉండొచ్చు. అయితే బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. అదొక్కటే ఆమె నిబంధన. సరే వదినా సరే వదినా అని తలాడిస్తూ అందరూ ఇక్కడికొచ్చి ఉండిపొయ్యారు. నాకు జీతం కూడా ఆమే నెలనెలా పంపేవారు. వీళ్లకు ఒక్కపైసా ఖర్చులేదు. అంతా ఈ పసిబిడ్డకు చేరాల్సిన ఆస్తి. ఈబిడ్డ బాగూ కాకూడదు, చావనూ కూడదు. అలాంటి ఒక ఆలోచన వాళ్లకు. అప్పుడే కదా ఈ ఆస్తిని బాగా అనుభవించొచ్చు. ఒక్కొక్కళ్లకీ ఒళ్లంతా విషం. చిన్నపిల్లలకు కూడా పెద్దనాన్న బిడ్డ అని ఏ మాత్రం అభిమానం లేదు. పట్టింపూ లేదు. దాన్ని తలుచుకుంటేనే మనసుకు బాధేస్తుంది.’’

‘‘ఇలాంటి మనుషులకు దేవుడు సరైన సమయంలో గుణపాఠం నేర్పిస్తాడు, చూస్తూనే ఉండండి.’’

‘‘ఏం గుణపాఠం నేర్పిస్తాడో తెలియటం లేదు. రెండు నెలలకు ముందు ఈ బిడ్డ ఉన్నట్టుండి పెద్ద మనిషైంది. కుర్చీ అంతా రక్తం. బుద్ధి మాత్రమే పెరగలేదు. కానీ ఒళ్లు పెరిగింది. నేను వెళ్లి చెప్పి పరుగెత్తుకొచ్చాను. ఒకరికి ముగ్గురు ఆడవాళ్లున్నారు. ఒక కుక్క కూడా వచ్చి తొంగి చూడలేదు. నేను శుభ్రం చేసి, స్నానం చెయ్యించి, బట్టలు మార్చి, పసుపు రాసి రాత్రీపగలూ కాపలా కాస్తూ ఉండిపొయ్యాను. రోజూ ఈ బిడ్డకు స్నానం చెయ్యించి బట్టలు మార్చి, పూటపూటకూ అన్నం తినిపించటం నేనే చేస్తున్నాను. దీన్నీ నువ్వే చెయ్యవే అని నా నుదుటన ఆ దేవుడు రాసేసినట్టున్నాడు…’’                                

ఆ స్త్రీ ఉన్నట్టుండి భళ్లున ఏడవటం మొదలుపెట్టింది. నా ఒళ్లు వణికింది. అప్పుడే నేను ఆ పసిదాన్ని చూశాను. ఎంత అందం. ఎంత కాంతి. తడితో మెరిసే కళ్లు. ఒక శిల్పంలాగా ఉంది ఆ బిడ్డ ముఖం. కుర్చీ పిడిని గట్టిగా పట్టుకుని ఒళ్లంతా కదిలేలా వెక్కిళ్లు పెడుతున్న వళ్లెమ్మను ఓదార్చే దారి తెలియక అయోమయంలో పడ్డాను. 

కొన్ని క్షణాలలో ఆమే మెల్లమెల్లగా మామూలు స్థితికి వచ్చింది. 

‘‘నేను ఆమె పంపే డబ్బు కోసం ఇక్కడ లేను. ఈ బిడ్డను ఎత్తుకుని పెంచటంతో ఇదీ నా బిడ్డేనని అనుకోవటం మొదలుపెట్టాను. రోజూ దేవుడికి దీపం పెడుతున్నప్పుడు నేను మొక్కుకునేది ఒక్కటే ఒక్కటి. దీని ఊపిరి ఉండేంతవరకూ నాకు ఆయుష్షు ఇవ్వాలి. లేకపోతే, నా కంటి ముందే దీన్ని నువ్వే పిలుచుకోవాలి. అంతే. ఇంకేమీ అక్కర్లేదు నాకు.’’

నేను దీర్ఘంగా నిట్టూరుస్తూ రోడ్డు మలుపులో ఉన్న సిమెంట్‌ ‌బెంచీమీద వెళ్లి కూర్చున్నాను. బెంచీకి పక్కన ఒక తురాయి చెట్టుంది. దాని నీడలో ఒక కుక్క పడుకుని ఉంది. దాని ఒళ్లో ఆరేడు పిల్లలు రొమ్ముల్ని కుమ్ముతూ పాలుతాగుతున్నాయి. కళ్లు మూసుకుని ఒక విధమైన పారవశ్యంలో కూరుకుపోయిన తల్లికుక్క ముఖాన్ని చూడగానే ఒక్కక్షణం నా శరీరం పులకించింది. చప్పున బ్యాగులో నుండి కెమెరాను తీసి ఆ దృశ్యాన్ని ఫోటో తియ్యాలన్న కాంక్ష పెరిగింది. ఒక ఫోటో తీశాను. దాని ఏకాగ్రత చెడుతుందేమోనన్న జంకుతో శబ్దం చెయ్యకుండా లేచి చక్రాల కుర్చీ దగ్గరకు వచ్చాను. వళ్లియమ్మాళ్‌ ‌పైటకొంగుతో కళ్లను తుడుచుకుంటూ నిలబడ్డది.

అక్కడ నెలకొన్న మౌనాన్ని చెదరగ్టొటం కోసమే ‘‘ఏంటీ, వెళ్లినవాళ్లు ఇంకా రాలేదు. ఇంకానా ఐస్‌‌క్రీమ్‌ ‌తింటున్నారు?’’ అన్నాను. ‘‘ఐస్‌‌క్రీమ్‌ ‌మాత్రమేనా తింటారు. ఒక్కొక్కరూ తిండిపోతులు. అంగట్లో ఉన్నదంతా కొని తిన్నాకే వస్తారు.’’ అని నవ్వింది ఆమె. 

కొన్ని నిమిషాల తర్వాత జంకుతూ ‘‘ఇక్కడ బాత్‌రూమ్‌లేవీ లేవా?’’ అని మెల్లగా అడిగింది ఆమె. 

‘‘ఉన్నాయే, అదిగో అక్కడ ఎత్తుగా తైలం చెట్టు కనిపిస్తోంది చూడండీ, దాని పక్కన ఒకటుంది. ఇదిగో ఈ రావిచెట్టు ఉంది కదా, అక్కడా ఉంది.’’ అన్నాను. 

ఠక్కున తిరిగి, ‘‘ఏం, వెళ్లాలా?’’ అని అడిగాను. ఆమె సంకోచిస్తూ చూపులతోనే తలాడించింది. 

‘‘వెళ్లి రండి. వెళ్లి రండి. నేను చూసుకుంటాను బిడ్డను. నేనూ ఇద్దరు బిడ్డలను కనుక్కున్నవాణ్ణే. మూడవది పుట్టబోతుంది ఇప్పుడు.’’ అన్నాను. 

ఆమె నాలుగడుగుల దూరం నడిచిన తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్టుగా ‘‘చిల్లరుందా?’’ అని అడిగాను. ఆమె తలాడిస్తూ వేగంగా ఆ చోటు కేసి నడిచింది. 

నేను కుర్చీలో కూర్చోబెట్టబడిన ఆ పసిపిల్లను చూస్తూ కొంచెం పక్కగా ఉన్న చెట్టుకు ఆనుకుని నిలబడ్డాను. మళ్లీ ఆ అందాన్ని చూసినప్పుడు నా కళ్లు చెమర్చాయి. గబగబా చేతిలోని కెమెరాను తీసి వేర్వేరు కోణాలలో నిలబడి ఫోటోలను తియ్యటం మొదలుపెట్టాను. దేవతను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించిన ఆ పసిపిల్ల నవ్వును ఫోటోల్లో బంధించాను.

ఇంకా మంచి కోణాల కోసం కుడిపక్కగా, ఎడమవైపుగా కదిలి కెమెరా నుండి చూస్తున్న సమయంలో టిక్‌ ‌టిక్‌ ‌మంటూ శబ్దం చేసే స్ప్రింగ్‌ ‌చెప్పులు ధరించిన ఓ పసిపిల్ల టకటక మంటూ నడిచి వచ్చి చక్రాల కుర్చీ పసిపిల్ల పక్కకొచ్చి నిలబడింది. తలను రెండు వైపులా కదిలిస్తూ నవ్వింది. నడుము మీద చేతులుంచుకుని ఆడి చూపించింది. టిక్‌ ‌టిక్‌ అన్న శబ్దం రావాలని ఎగిరెగిరి దూకింది. ఈ…ఈ…ఈ… అని ముందరి పళ్లను చూపించి నవ్వింది.

మళ్లీ మళ్లీ ఆ పిల్ల ఈ… అంది. ఊహించని ఒక క్షణంలో కుర్చీలోని పసిపిల్ల నుండి ఊ…ఊ…ఊ… అంటూ శబ్దం రావటాన్ని నేను చూశాను. 

‘‘ఊ…ఊ…’’ 

‘‘ఊ…ఊ…’’

కుర్చీలోని పసిదాని చెయ్యి మెల్లగా సాగి చిన్నపిల్ల చంపను తాకి తడిమి కిందికి జారిపోవటాన్ని చూశాను. 

‘‘మాలు కుట్టీ, ఇక్కడికొచ్చేశావా బంగారం. నాన్న నిన్ను ఎక్కడంతా వెతికానో తెలుశా?’’ అంటూ వేగంగా వచ్చిన  ఒక యువకుడు ఆ పసిదాన్ని ఎత్తుకుని హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఊ…ఊ… అన్న శబ్దం పెదవులపై పలుచనవుతూ పరవశంలో మునిగిపోయి ఉంది కుర్చీలోని ఆ పసిపిల్ల. 

జిల్లేళ్ల బాలాజీ
1961 లో తిరుత్తణిలో జన్మించిన వీరి విద్యాభ్యాసమంతా చిత్తూరులోనే సాగింది. ఎస్వీ యూనివర్సిటీ నుండి ఎమ్మే పట్టా పొందారు.
వీరు 1983 నుండి రచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 167 కి పైగా కథలూ, 123 కి పైగా కవితలూ, 1 నవలా ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 20 కథలకు  బహుమతులు పొందారు.
ఇప్పటివరకూ 1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా… 5) పగడాలు పారిజాతాలూ…6) నిరుడు కురిసిన వెన్నెల 7) గుప్పెడు మల్లెలు (కథా సంపుటాలు) 8) కవన కదంబం (కవితా సంపుటి) 9) జీవితమొక పయనం (నవల) పుస్తకాలను వెలువరించారు.
వీరి సాహిత్య కృషికి గాను 1) ‘గురజాడ కథా పురస్కారం’ (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) కీ.శే. శ్రీమతి కామాక్షీబాయి శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు)  మొదలైనవి వరించాయి.
తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు.
ఇప్పటిదాకా వీరు… 139 కి పైగా కథలు, 12 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 జీవిత చరిత్ర,  2 వ్యాస సంపుటాలు, 1 వచన రామాయణ గ్రంథం… అనువదించారు.
మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అలాగే అనువాదంలోనూ… 1) “నల్లి దిశై ఎట్టుమ” పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం
2) ప్రతిష్టాత్మకమైన “కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం”
3) “కె.ఎస్.మొళిపెయర్పు విరుదు” పురస్కారం
4) ‘పడైప్పు’ సంస్థ నుండి ‘ఇలక్కియ చుడర్’ పురస్కారాన్ని పొందారు.
Previous Post

యుగోస్లేవియా కథ : కాప్టెన్

Next Post

రష్యన్ కథ : మాస్క్

Next Post
రష్యన్ కథ : మాస్క్

రష్యన్ కథ : మాస్క్

Discussion about this post

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి
  • తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)
  • కన్నడ కథ : వర్షరూపిణి
  • ఒడియా కథ : భయమే బంధమా?
  • హిందీ కథ : చీకటి గీతం
  • గుజరాతీ కథ: సైనికుడి సంతానం 
  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com