• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ:  నిర్ణయం

చందకచర్ల రమేశబాబు by చందకచర్ల రమేశబాబు
July 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ:  నిర్ణయం

కన్నడ మూలం: శ్రీమతి విద్యా శిరహట్టి
తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు

“అబ్బాయి నాకయితే చాలా నచ్చాడు. అందగాడు. ఎంబిఎ చెశాడు. అరవై లక్షల ప్యాకేజి. స్వంత ఇల్లు తీసుకున్నాడు. ఫ్లాట్ తీసుకుని అద్దెకిచ్చాడు. అల్కాజార్ కారుంది.” శామసుందర్ కు ఆ రోజు వచ్చిన అబ్బాయి చాలా నచ్చాడు.

“ముఖ్యంగా చెప్పాలంటే సౌమ్యుడు. మంచి గుణాలున్నవాడు అనిపిస్తుంది. ఎంత గౌరవంగా మాట్లాడాడో చూశారు కదా? అబ్బాయి తలిదండ్రులు కూడా చాలా సంస్కారవంతులు. నాక్కూడా ఈ ప్రస్తావన నచ్చింది. మన శరధికి తగిన జోడి. సుసంస్కృత వంశం. నాకయితే ఈ సంబంధం నచ్చింది. నువ్వేమంటావ్?” రామారావు గారు పత్ని జానకమ్మను అడిగారు.

సిగ్గుతో తలవంచుకుని కూర్చున్న శరధి తలను మెల్లిగా రాస్తూ జానకమ్మ అన్నారు. “ నాకు, మీకు శాముకు, శరయుకు నచ్చాడు అన్నది ముఖ్యం కాదు ఇక్కడ. అందరికంటే శరధి మనసుకు నచ్చాడా లేదా అన్నది ముఖ్యం. నువ్వేమంటావే శరధూ?”

“తను మొహమంతా ఎర్రగా చేసుకుని సిగ్గు పడుతూ కూర్చున్నది చూస్తుంటే అర్థం కాదా ఏమిటి? ఆమెకు వంద శాతం నచ్చినట్టే. అబ్బాయి గురించిన వివరాలన్నీ మీరు చెప్పినట్టే ఏ ఒన్. కాని శశాంక్ వ్యక్తిత్వంలో ఏదో అసహజత కనిపించింది నాకు. అదేమో తెలియదు. మీరు గమనించారో లేదో? అతడికి ఏమో చెప్పాలని ఉబలాటపడ్డట్టు అనిపించింది. ప్రయత్నం కూడా చేశాడు. కాని అతడి అక్క అతడిని మాట్లాడనీయకుండా విషయాన్ని మార్చేసినట్టు అనిపించింది నాకు. ఇంకోసారి వారి గురించి వాకబు చెయ్యడం మంచిది అనిపిస్తుంది.” శరయూ మాటలు అక్కడున్న వాళ్ళను కొద్దిగా విచలితం చేశాయి.

స్వప్నలోకాల్లో విహరిస్తున్న శరధిని ఎవరో తోసినట్టయింది.

“శరయూ అక్కా! నువ్వు డాక్టర్ అయ్యాక అందరినీ సందేహాస్పదంగానే చూస్తున్నావు. అదేం అసహజత కనిపించింది అబ్బాయిలో? అందరి మాదిరిగానే ఉన్నాడు. ఆరడుగుల ఎత్తు, ఎర్రటి ఎరుపు రంగు, దట్టంగా ఉన్న క్రాపు, విశాలమైన ఛాతి- రాజకుమారుడి మాదిరిగా ఉన్నాడు కదా! నవ్వయితే పసికందు నవ్వు. నువ్వు ఏదో ఒకటే వంక పెట్టమాకు. శరధీ! నీకు నచ్చాడా లేదా అబ్బాయి? ఇప్పుడు నీ నిర్ణయమే ఫైనల్..”

అన్నయ్య శామసుందర్ మాటకు తనకు తెలియకుండానే తలాడించేసింది శరధి.

“నాకనిపించింది నేను చెప్పాను. అలా ఏం లేదేమో మరి! అయినా ఆరోగ్యం గురించి ఇంకోసారి విచారిస్తే తప్పేంటి?” శరయూ తన వాదాన్ని కొనసాగించింది.

రామారావుగారు భార్య వైపు చూశారు. జానకమ్మ మొహం కూడా కొంచెం గంభీరంగానే కనిపించింది.

“శరయూ చెప్పినదాంట్లో తప్పేం లేదు. మన అమ్మాయిని ఇవ్వడానికి ముందు ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి అంటారు. శరయూకు అనిపించింది అంటే ఒకసారి దృఢపరచుకోవడం మంచిది. మీరు విఠల్ బాబాయ్ గారిని ఒకసారి అడిగి చూస్తారా? ఆయనకు వాళ్ళ ఇంటివాళ్ళ గురించి బాగా తెలుసు అని అన్నారు. ఇప్పుడే వాళ్ళకు అంత కంగారు పడి చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త తీరికగా ఆలోచిద్దాం.”

భార్య మాటకు “సరే…” అని తలాడించి బయటికి వెళ్ళసాగారు రామారావుగారు.

“ఆలోచిద్దాం. అయ్యేదంతా మన మంచికే..” అంటూ చెల్లెలి వీపు తట్టి శరయూ “అమ్మా. మరయితే నేను బయలుదేరతాను. నిఖిల్ ఒక్కడే ఉన్నాడు క్లినిక్ లో. తరువాతి విషయాలు నాకు తెలియజెయ్యండి.” అంటూ తన బ్యాగ్ భుజానికెక్కించుకుని వెళ్ళిపోయింది. జానకమ్మ వంటింట్లోకి చేరితే శామసుందర్ తన మొబైల్లో మునిగిపోయాడు.

ఒక్కసారిగా ఒంటరిదై పోయింది శరధి. తన మనసు నిండా పరచుకున్న ఇంద్రధనస్సు తన రంగులు కోల్పోయి నిరాశ అనే చీకటివైపు అడుగులు వేయసాగింది. మొదటి సారిగా ఎదలో పల్లవించిన ప్రేమ చిగురును ఒకే మాటతో కాలరాసే ప్రయత్నం చేసిన అక్క పైన తనకు బాగానే కోపం వచ్చింది.

రామారావుగారు ధారవాడ వాస్తవ్యులు. నలభై సంవత్సరాలుగా బెంగళూరులో వాసం ఏర్పరచుకున్నారు. ఆయనది జానకమ్మది అన్యోన్యమైన దాంపత్యం. ముగ్గురు పిల్లలు, శరయూ, శామసుందర్, శరధి. ముందునుండీ డాక్టర్ అవ్వాలనే పట్టుదలతో చదివిన శరయూ ప్రస్తూతి నిపుణురాలైంది. తన సహపాఠి అయిన నిఖిల్ ను ఇష్టపడి పెళ్ళి చేసుకుని తన ప్రేమ గూడును కట్టుకుంది. ఐఐటి నుండి డిగ్రీ పొంది బయటికి వచ్చిన శామసుందర్ అమెజాన్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం సంపాదించి ఆరంకెల జీతంతో పైకెదిగాడు. కాని చెల్లెలి పెళ్ళి అయ్యేదాకా తను పెళ్ళి చేసుకోకూడదు అనే తత్వానికి ముడి పెట్టుకుని బ్రహ్మచారిగానే ఉన్నాడు. రూపవతి, గుణవతి, విద్యావతి అని తమ బంధువర్గంలో పేరు పొందిన శరధికి ఇప్పటిదాకా కంకణ బలం కలిసిరాలేదు. ఒకసారేమో జాతకం కలిసేది కాదు. ఒకవేళ కలిసినా తమ చెల్లెలికి మన్మథుడిలాంటి అబ్బాయే కావాలని వెతుకుతున్న శామసుందర్ కో, శరయూకో ఆ అబ్బాయి నచ్చేవాడు కాడు. కొన్ని చోట్ల శరధికే నచ్చలేదు అనిపించింది కూడా. తలిదండ్రులు కొన్ని సంబంధాలు వద్దన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఇరవై ఎనిమిదేళ్ళు దాటుతున్నా శరధి కుమారిగానే ఉండిపోయింది.

అప్పుడే వీళ్ళ కుటుంబం శ్రేయోభిలాషి అయిన విఠల్ బాబాయ్ శశాంక్ ప్రస్తావన తెచ్చారు. ఊళ్ళోని పెద్దల్లో ఒక్కరుగా పరిగణించబడుతున్న లాయర్ రంగారావుగారి అబ్బాయి. తల్లి సరళమ్మగారు సమాజ సేవకి. తల్లి సరళ, శాంత స్వభావాన్ని పుణికి పుచ్చుకున్న శశాంక్. అక్క పరిమళ గారాబంలో ఈ తమ్ముడు పెరిగింది అని తెలిసిపోయేలా ఉన్నాడు. అప్పుడే పెళ్ళైపోయి ఇద్దరు పిల్లల తల్లిగా పుణె నగరంలో ఉంటున్న పరిమళకు శశాంక్ ఇంకా చిన్న పిల్లవాడే! తన బిడ్డే అన్నంత ప్రేమ. సహజంగానే స్నేహజీవియైన శశాంక్ తన అందం, గుణం, నడవడితో అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆమెకు తెలియకుండానే శరధి మనసును దోచుకున్నాడు. ఇప్పుడు శరయూ మాటలు ఆమెలో మళ్ళీ నిరాశను కలిగించాయి.

“శరధీ! నీకు ఫోన్ వస్తోంది చూడు…” అని శామసుందర్ చెల్లెలి చేతికి ఫోన్ ఇచ్చాదు.

శశాంక్ నుండి మొదటి కాల్ తనకు. శరధి గుండె పరవశంతో కొట్టుకోసాగింది. కడుపులో సీతాకోకచిలకలు ఎగురుతున్న అనుభవం.

పెద్దగా ఉపోద్ఘాతం లేకుండా నేరుగా విషయంలోకి వచ్చాడు శశాంక్. “శరధిగారూ! మీరు నాకు చాలా నచ్చారు. కానీ పెళ్ళికి ముందు మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఎక్కడైనా కలుద్దామా? ఎక్కడ అని మీరే సూచించండి.”

శరధి శశాంక్ ను కలిసి తిరిగి వచ్చింది. చేతిలో ఒక పెద్ద కవర్. మొహం పైన ఏదో అయోమయం అనిపించే భావం.

సంగతేమని తెలిసాక ఇంటిల్లిపాదికి అదే సందిగ్ధ పరిస్థితి. ఇప్పుడేం చెయ్యాలి? శరధి శశాంక్ ను ఇష్టపడింది అందరికీ తెలుసు. కానీ శరయూ సందేహం కూడా నిజమే. ఇప్పుడు కొనసాగాల వద్దా? అన్నది అందరి ఎదుట పరిష్కారం కనబడని ప్రశ్న. నిజాయితీగా విషయాన్ని తెలిపిన శశాంక్ పైన అందరికీ జాలి, మెచ్చుకోలు. కానీ ఇంటి అమ్మాయి భవిష్యత్తు గురించిన కలత. శరధి ఆలోచనల తాకిడికి తల్లడిల్లి పోసాగింది. ఇలాగూ అవుతుందా? తను మనసారా మెచ్చుకున్న శశాంక్ కే ఇలా అవ్వాలా? ఇప్పుడైతే బాగానే ఉన్నాడుగా! మరి ముందు… ఆమె మనసు మూగదై పోతోంది.

తేనెటీగల్లా మనసును ఆవరించిన వేలాది ప్రశ్నల ఒత్తిడికి నలిగి పోయింది శరధి.

“ఎక్కడో లక్షల్లో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుంది. శశాంక్ కు ఈ రకమైన సమస్య ఉంది అంటే అందులో అతని తప్పేం లేదు. ఇప్పుడైతే ఆపరేషన్ అయ్యింది. ఆరోగ్య దృష్ట్యా అతడికిప్పుడు ఏ సమస్య కూడా లేదు. నిజమే. కానీ ముందు ముందు సమస్య కాదు అని చెప్పడానికైతే కుదరదు. పిల్లలు పుట్టక పోవచ్చు. ఒకవేళ పుట్టినా వికలాంగులుగానో, మానసిక వికలాంగులుగానో కావచ్చు. వాళ్ళకు కూడా ఇలాంటి సమస్య రావచ్చు. వీటన్నిటి గురించి ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. నాకైతే ఈ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో ఉండవచ్చు అని ఒక శాతం అనిపించినా వచ్చినప్పుడు ఎదిరించడం చాలా కష్టం. ఊరికే ఛాన్సెందుకు తీసుకోవాలి? ఇది మన శరధి జీవితం ప్రశ్న కదా!…” శరయూ మాటలు అందరి చెవుల ద్వారా వాళ్ళ హృదయాలను స్పృశిస్తూనే ఉన్నాయి.

“శరయూ చెప్పడం కరెక్టుగానే ఉంది. తెలిసీ తెలిసీ నిప్పులో చెయ్యి పెట్టడమెందుకు?” రామారావుగారి అభిమతం.

శామసుందర్ కు కూడా శరధిలాగానే అంతా గందరగోళంగా ఉంది. ఎంత గంభీరమైన శశాంక్ కు ఇలాంటి పరిస్థితి ఏమిటి? అయ్యో పాపం అని ఒక వైపు మనసు జాలి పడుతుంటే మరో వైపు ఇలాంటి జాలి వలన చెల్లెలి జీవితాన్ని పరీక్షకు ఒడ్డాలా? చెల్లెలి భవిష్యత్తును అనిశ్చితతవైపు నెట్టాలా?

అతడి లాగానే శరధి మనసులోని ద్వంద్వం కూడా ఆమె మొహం పైన కనబడుతోంది.

“ఇది శరధి జీవితం. ఆమే నిర్ణయించుకోవాలి. కానీ అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకో శరూ…”తల్లి మనసు ఆందోళన.

అంతవరకూ మౌనంగా అందరి మాటలనూ వింటున్న నిఖిల్ ఇప్పుడు మెల్లిగా మాట్లాడసాగాడు. నిఖిల్ శరయూ భర్త. వివేకం కలవాడు. ఆ ఇంటి అల్లుడిగా కంటే ఇంటి పెద్ద కొడుకుగా ఆదరిస్తారు అందరూ అతడిని. శరధి అంటే తన కూతురు లాగానే ప్రేమ అతడికి. ఆమెకు విషయాన్ని వివరంగా చెప్పాడు-

“శరధీ! నీ మనసులోని గందరగోళం నాకర్థమవుతుంది. శశాంక్ నిజంగానే మంచి అబ్బాయి. ఒక్కోసారి మనం అనుకోని ఏదో మలుపు జీవితంలో వస్తుంది. అతడి జీవితంలోనూ వచ్చింది. అప్పుడు కూడా అతడు ఆ పరిస్థితిని ధైర్యంగానే ఎదుర్కొనుండాలి. ఆ మలుపు పరిణామాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ కారణంగా నువ్వు అతడిని ఒప్పుకోమనడం లేదు నేను. కానీ ఆ సమస్యకు అతడి వైపునుండి ఒక వాదం ఉంది అన్నది మాత్రం నీకు గుర్తు చేస్తున్నాను. నేను అతడి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ క్షుణ్ణంగా చదివాను. అతడి ఆపరేషన్ అన్నివిధాలా బాగానే జరిగింది. శశాంక్ ను రిక్వెస్ట్ చేసి నా మిత్రుడి వద్దకు కూడా తీసుకుని వెళ్ళాను. నా మిత్రుడు మంచి సర్జన్. అతడు కూడా శశాంక్ ను పరీక్షించి అంతా పర్ఫెక్ట్ గా ఉందని రిపోర్ట్ ఇచ్చాడు. అయినా శరయూ చెప్పినట్టు భవిష్యత్తులో దీని పరిణామం మళ్ళీ కనిపించవచ్చు. ఆమె చెప్పిన ఏ సమస్య ఐనా రావచ్చు. కానీ ఛాన్సెస్ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ. అలా ఏం కాకుండా మీ వైవాహిక జీవితం అందరిలా నార్మల్ గానే ఉండవచ్చు. కాబట్టి ఇలా చెయ్యి అని చెప్పే అధికారం మాలో ఎవ్వరికీ లేదు. అమ్మ చెప్పినట్టు నువ్వు అన్ని వైపుల నుండి ఆలోచించు. ముందు ముందు ఎలాంటి పరిణామాన్నైనా ఎదురించడానికి నీ మనసు రెడీగా ఉందనుకుంటే మాత్రమే నువ్వు శశాంక్ ను స్వీకరించు. ఒకవేళ సందిగ్ధ పరిస్థితిలో ఉంటే మాత్రం తప్పకుండా ముందుకు వెళ్ళకు. నిర్ణయం తీసుకోవడానికి తొందర పడకు. ఒక వారం, పదిహేను రోజులు కావలిస్తే తీసుకో. ఈ నిర్ణయం చాలా కష్టం అని మా అందరికీ తెలుసు. ప్రశాంతమైన మనసుతో ఆలోచించి గట్టి నిర్ణయానికి రా సరేనా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సిన అవసరం రాకూడదు. అతడి పైన జాలితో ఒప్పుకోకు. అతడు మహా అభిమానం కల మనిషి. అతడు కూడా నీకు అదే చెప్పాడు. కదూ?”

బావ నిఖిల్ మాటలను కన్నీళ్ళతో వింటున్న శరధి ఇప్పుడు అతడి చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. శరయూ, జానకమ్మ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తే నిఖిల్ వారించాడు.

“ఆమెను ఏడవనివ్వండి.మనసులో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చాక తనే శాంతపడుతుంది. ఇప్పుడైతే ఆమె పాటికి ఆమెను వదిలేద్దాం….”అంటూ నిఖిల్ తనను ఆమె రూముకు తీసుకుని వెళ్ళి వదిలి వచ్చాడు.

“మీరు మరీనూ! ఏదేదో చెప్పి ఆమెను కంగారు పెట్టేశారు. మనం ఇవన్నీ ఎందుకు ఆలోచించాలి. అయ్యేది కాదు పొయ్యేది కాదు అని ఊరుకుంటే అయిపోయేది. శరూ ఇంకా చిన్నపిల్ల. దానికేం తెలుస్తాయి ఇవన్నీ?” అంటు శరయూ భర్త పైన విసుక్కుంది..

పెళ్ళాం మాటలకు చిన్నగా నవ్వేశాడు నిఖిల్..

“ఇంకా ఎన్నాళ్ళని చిన్నపిల్ల అని చూస్తారు మీరు శరధిని? మీ అందరికంటే ఆలోచించే శక్తి ఉంది శరధికి. లేకుంటే శశాంక్ కు అక్కడే జవాబు ఇచ్చేసి వచ్చేది. అతడిని చూసిన రోజునుండి తనకు ఈ సంబంధం ఇష్టమైంది. అలాగని శశాంక్ కు కూడా చెప్పింది తను. ఇప్పుడు ఈ విషయం తెలిసాక అతడికి దూరమవడం తనకు నచ్చడం లేదు. అందుకే ప్రశాంతంగా ఆలోచించి తను నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.” అనాడు.

మళ్ళీ ఏదో వాదించాలని చూస్తున్న శరయూను ఆపాడు ఈ తడవ శామసుందర్.

“అక్కా! బావ చెప్పింది చాల సమంజసంగా ఉంది. శశాంక్ ను వద్దని చెప్పడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది అంటే శరధికెలా ఉండాలి? ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నిర్ధరించినా తరువాత ఎప్పుడో తను శశాంక్ కు మద్దతుగా నిలబడుంటే బాగుండేది అని అనిపించవచ్చు తనకు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం కలగవచ్చు. తనకు కొంచెం సమయం ఇద్దాం.” అన్నాడు.

తన గదిలో ఉన్న శరధికి వీళ్ళందరి మాటలు వినిపిస్తున్నాయి.

“అవునా? నా నిర్ణయం వల్ల తరువాత ఎప్పుడో నేను తప్పు చేశానని అనిపించవచ్చా?” ఆమె మనసులో ద్వంద్వం.

“శశాంక్ కూడా అదే చెప్పాడు కదా నీకు ? “బావ మాటలు గుండెను గుచ్చాయి.

ఏం చెప్పాడు శశాంక్? ఆ రోజు కలిసినప్పుడు ఏం చెప్పాడు?

ఆ రోజు, ఆ సన్నివేశం మళ్ళీ మనసు తెరపైకి వచ్చి నిలిచాయి.

కబ్బన్ పార్క్ లో సాయంత్రం ఐదు గంటలకు కలుద్దాం అనుకున్నారు. శరధి వెళ్ళేటప్పటికి శశాంక్ వచ్చి ఎదురు చూస్తున్నాడు. నునుసిగ్గుతోనే ఒక చిన్న నవ్వు విసిరి అతడి పక్కన కొంచెం ఎడంగా కూర్చున్న శరధికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. అతడు కూడా మౌనంగానే ఉన్నాడు. కొన్ని నిశబ్ద క్షణాలు….

వాటికి మంగళం పాడింది శశాంకే!

“శరధిగారూ! నేను నేరుగా విషయానికి వస్తాను. మొన్న కలిసినప్పుడే చెప్పాల్సిన విషయం ఇది. కాని అక్క మాట్లాడనివ్వలేదు. మీకు చెప్పేదాకా నాకు మనసాగడం లేదు. నా ఈ రిపోర్టులను చూడండి..” అంటూ చేతిలో పెట్టాడు.

దడదడలాడే గుండెలతోనే ఆ రిపోర్టులను చేతిలోకి తీసుకుంది. “గైనెకొమాస్టియా..” ఇదేం రోగం? దానికోసం సర్జరీ చేయించుకున్నాడు శశాంక్. ఆ మెడికల్ పదాలు అర్థం కాలేదు. దాన్ని గమనించిన శశాంక్ వివరాలు చెప్పడం మొదలెట్టాడు, ఒక నమ్మకం కలగని కథలాగా!

సుసంపన్న కుటుంబంలోని ముద్దుల కొడుకు శశాంక్. రాజకుమారిడిలా పెరిగాడు. స్కూలు చదువుల్లోనూ మొదటి వాడు. ఆటల్లో తమ స్కూలును జాతీయ స్థాయిలో ప్రతినిధించాడు. చెస్ చాంపియన్. క్రికెట్, ఫుట్బాల్ అంటే ప్రాణం. కాని హైస్కూలు చదువు అయిపోతున్నట్టల్లా అతడి దేహంలో ఏదో మార్పు జరుగుతోందన్న అనుమానం. కాలేజికి వెళ్ళాక ఆ అనుమానం గాఢమయింది. ఇంట్లో తన దేహంలోని మార్పులను ముందుగా గమనించింది తన అక్క పరిమళ.

“ఏం చుట్టుకున్నావురా ఛాతీకి? చూడు ఎంత అసహ్యంగా కనిపిస్తూందో!”అంటూ అతడి షర్ట్ విప్పి చూసి దిగ్భ్రాంతురాలయ్యింది. మళ్ళీ షర్టును యథావిధిగా కప్పి అమ్మను పిలిచింది. అమ్మ చూసింది కానీ అక్కలా ఆశ్చర్యం వ్యక్తం చెయ్యలేదు.

“ఒక్కోసారి ఏదో వాపు వచ్చిందిలా ఉంది. డాక్టర్ అంకుల్ ను అడుగుదాంలే రేపు.”అంటూ తేల్చేసింది.

డాక్టర్ గారు ఆ వాపుకు పెట్టిన పేరు ‘ గైనెకోమాస్టియా’ – అంటే పురుషుల్లో రొమ్ములు పెరగడం. పురుషుల్లో హార్మోన్లు స్రవించడం ప్రారంభం అయినప్పుడు కలిగే కొన్ని అవకతవకల వల్ల కలిగే అసహజమైన పెరుగుదల. ఆరోగ్యానికేం కాదు. కానీ అబ్బాయికి ఇలా స్తనాలు పెరగడం అంటే కుటుంబంలోని అందరికీ ఒక రకమైన ఆందోళన. ఆ సమయంలో అతడికి బలంగా నిలబడి మనోస్థైర్యాన్ని ఇచ్చింది కుటుంబ సభ్యులే. అందులోనూ అమ్మ. అక్కేమో ఈ అసహజత కనబడకుండా ఉండడానికి ఉపాయాలు చెప్తే, అమ్మ ఆ మార్పుతో ఎలా జీవించాలి అనే ధైర్యాన్ని నింపింది.

కాలేజిలో అందరూ గుచ్చి గుచ్చి చూడడం, తిరస్కారపు చూపులు, అవహేళనగా నవ్వే నవ్వులు, మాటలు అన్నిటినీ ఎదుర్కొంటూనే సాగాడు శశాంక్. మంచి స్నేహితులూ, లెక్చరర్లూ సపోర్టుగా నించున్నా మిగతావాళ్ళ అపహాస్యాన్ని, విషపు నవ్వులను హాలాహలంలా మింగాల్సి వచ్చేది. కానీ, కాలేజి టాపర్ అయినప్పుడు నమ్మనట్టు చూసినవారు కూడా ఉన్నారు. ఇవే అవమానం, అవహేళనలతో ఎంబిఎ పూర్తి చేశాడు. ముందుగా మందులతో తగ్గవచ్చు అనుకున్న ఈ తారుమారు అలా కొనసాగేసరికి అతడు సర్జరీకి శరణు కావలసి వచ్చింది. అక్కడినుండి అతడు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడతడిలో ఆ అవకతవకా లేదు. పైగా పురుష సౌందర్యానికి ధీమంత ప్రతీకలా ఉన్నాడు.

“వాడి దైహిక సమస్య ఇప్పుడు పూర్తిగా నయమయింది. వైవాహిక జీవితానికి ఏ మాత్రం అడ్డంకి కాదు అని డాక్టర్ గారు నమ్మబలికాకనే మేము తనకి సంబంధాలు చూడడం మొదలు పెట్టాము. ఇప్పటికి నాలుగు సంవత్సరాలయ్యాయి. ఈ విషయం చెప్పగానే ఆడపిల్ల తరఫువాళ్ళు వెనిక్కి తగ్గేవారు. ఇలాంటి ఎన్నో తిరస్కారాలు జీర్ణించుకున్నాడు మా శంకూ. కానీ నీ విషయంలో మాత్రం తనకు అదేమో నమ్మకం. అయినా నువ్వు వద్దన్నా తట్టుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాడమ్మా. కానీ ఓడిపోతున్నాడు. నీ తలపే వాడికి. ఇలా చెయ్యమ్మా అని నీకు చెప్పే అధికారం నాకు లేదు. కానీ ఒక తల్లిగా వాడి విషయం నీకు చెపుదాం అని వచ్చాను శరధీ. తప్పుగా అనుకోకు.” శశాంక్ నుండి విషయం విన్న రెండురోజులకు అతడి తల్లి సరళమ్మ ఇంటికి వచ్చినప్పుడు శరధి చేయి పట్టుకుని చెప్పారు.

ఆ రోజు రిపోర్ట్ చూపుతూ అన్ని విషయాలనూ చెప్పిన తరువాత శశాంక్ స్పష్టంగా అన్నాడు. “ఇప్పుడు నిర్ణయం మీదే శరధిగారూ! మీరు నన్ను స్వీకరిస్తే నేను అదృష్టవంతుణ్ణి. లేదు అంటే కూడా సరే. మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. కాని ఒకటి మాత్రం చెప్పగలను. ఇకపై నేను నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కోసం వెతకను.”

ఒక్కసారిగా బయటికి వచ్చిన ఈ విషయం వలన ‘ తన బుద్ధి, మనసు, హృదయం అన్నీ శూన్యమయి పోయాయి. ఏం చెప్పాలో తెలియక అక్కడినుండి లేచి వచ్చింది తను. కాని ఒక్కసారి తిరిగి చూసింది. ఎందుకో తెలియదు. అప్పుడు తననే ఆరాధనగా చూస్తున్న ఆ కళ్ళలో తన పైన అతడికున్న అవ్యాజ ప్రేమతో పాటు సన్నని నీటిపొర. కుడి చెంప పైన దిగిన కన్నీటి ధార ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది. ఇలాంటి ప్రేమ మరి ఇంకెవరినుండైనా దొరుకుతుందా? అలాగైతే శశాంక్ ను ఒకె అననా? తరువాత ఏదైనా అయితే? పిల్లలు పుట్టకపోతే? అయ్యో! నాకు నాదే అయిన బిడ్డ కావాలి భగవంతుడా! ఒడిలో పడుకుని బోసినవ్వుతో కిలకిల నవ్వే బిడ్డ. మెత్తని చిట్టి చిట్టి చేతులతో నా చెంపలు నిమిరే బిడ్డ… నాకు పిల్లలు కావల్సిందే… మరైతే? నాకు శశాంక్ వలన పిల్లలు కలగరు అని నేనెందుకు అనుకోవాలి? బావ చెప్పినట్టు అలా ఈ ఇబ్బంది రాకపోవచ్చు.. కానీ వస్తే?… భగవంతుడా ఏమిటి ఈ పరీక్ష? నేనేం చెయ్యాలి?

స్వగతంలో మునిగిన శరధికి దూరంగా ఒక గొంతు వినిపించింది. ’మీరింత ఆలోచించకండి శరధిగారూ! మీ నిర్ణయం ఏదైనా నేను స్వీకరిస్తాను. ఆలోచించకండి. నేనున్నాను.’ శశాంక్ గొంతు! ‘కానీ అతడెక్కడ? ఇది తన ఎదలోతుల్లోనుండి వచ్చిన ధ్వని! ఓహ్.. అంతగా వేళ్ళూరిపోయాడా తను నాలో ! అతడు లేకుండా నేనుండలేను. అతడు నాకు కావాలి. అంతే.”

ఒడిలోని బిడ్డ మొహాన్ని పక్కకు నెట్టి అతడి మొహం కనిపిస్తోంది. ఆ బిడ్డలోనూ అతడే కనిపిస్తున్నాడు. అవును. అతడే నా బిడ్డ కూడా… ఇంకో బిడ్డ కలగక పోయినా అతడంటూ ఉంటాడు కదా నాతో పాటు! నేనిప్పుడే వెళ్ళాలి.. నేను అతడి చెంపమీదినుంఛి కారుతున్న కన్నీటిని నా చెంగుతో తుడిచి ఆ మొహాన్ని నా ఎదకు హత్తుకుని ఓదార్చాలి. అతడు ఇన్ని సంవత్సరాలుగా అనుభవించిన అవమానం, తిరస్కారం, బాధలను తుడిచేసి నా చెంగులో కట్టుకోవాలి. ఇక ముందు అతడిని ఎవరూ అవమానం, అవహేళన చెయ్యకుండా ఉండేలా చూసుకోవాలి’

“అమ్మా అమ్మా!” బాబు గొంతు విని శరధి మేలుకుంది, తన ఆలోచనలనుండి. ‘ ఐదు సంవత్సరాలయ్యాయి మా పెళ్ళై. తరువాతి రెండు సంవత్సరాలకు ఈ కృష్ణుడు పుట్టి మా జీవితాలను నందనవనం చేశాడు. కానీ ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం క్షణం ఇప్పటికీ కలగానే కనబడుతూ ఉంటుంది.”

చందకచర్ల రమేశబాబు

నివృత్త బ్యాంకు అధికారి. హైదరాబాద్ శివార్లలో ఉంటున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. మాతృభాష కన్నడం.

ఆయన భాషల అభిమాని. బళ్ళారిలో పుట్టినందువల్ల ఆయనకు కన్నడం, తెలుగు రెండూ భాషల పరిచయం కలిగింది. రెండు భాషల్లోనూ సాహిత్య రచనలు చేశారు. ఆయన అనువదించిన కథలు అటు తెలుగు పత్రికలలోనూ, కన్నడ పత్రికలలోను ముద్రణకు నోచుకున్నాయి.

ఆయన కన్నడంలో “మనదర్పణ, అనిసిద్దెల్ల అక్షరదల్లి” అనే  రెండు కవితా సంకలనాలను తీసుకువచ్చారు. తెలుగు నుండి “తూర్పుగాలి, మంచుపువ్వు, తపన” నవలలను  కన్నడంలోకి అనువదించారు.  దేవరకొండ బాలగంగాధర తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, మామిడి హరికృష్ణ “ఒంటరీకరణ” కవితలను కన్నడంలోకి అనువదించి పుస్తకాలుగా తీసుకొచ్చారు.  ఆయన కన్నడం నుండి అనువదించిన కస్తూర్ బా గారి ఆత్మచరిత్ర “నేను కస్తూర్ బా ని”, అనువాద కథా సంకలనాలు “అత్తర్” “నలుగురికి చేరిన కథలు” “గుడిగంట” “మండే మంటకు ఒళ్ళంతా నోరు”, నవల “వేర్లు” వెలువడ్డాయి.

“గీతలోని మార్గదర్శకాలు” అనే శీర్షికన “కర్తవ్య బోధన, స్థితప్రజ్ఞత, త్రిగుణాలు, నిత్య జీవన గీత ” అనే నాలుగు పుస్తకాలను స్వంతంగా రాశారు. వాటిలో “స్థితపజ్ఞత. త్రిగుణాలు” గుంటూరు నుండి వెలువడుతున్న ఆధ్యాత్మిక పత్రిక “విశ్వధర్మ వాణి” పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ”ఉపనిషత్తుల సారం” అనే పుస్తకాన్ని కన్నడం నుండి అనువదించారు. అనువాద కృషికి గాను 2019 లో గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం  పొందారు. స్థానిక ఓం భం ట్రస్ట్ వారు ఆయన అనువాద కృషిని గుర్తిస్తూ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

Previous Post

వాయిదా పడిన కలయిక!

Next Post

ఆంగ్ల కవిత : విడిచిన బాట

Next Post
ఆంగ్ల కవిత : విడిచిన బాట

ఆంగ్ల కవిత : విడిచిన బాట

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • హిందీ కవితలు: గోధుమ + గోవు
  • సచ్చిదానందన్ కవితలు రెండు..
  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

అభిప్రాయాలు

  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె
  • కొల్లూరి సోమ శంకర్ on ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • Reddy on హిందీ కథ : లెక్క తప్పింది !
  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply