కన్నడమూలం: కు.స. మధుసూదన రంగేనహళ్ళి
తెలుగు అనువాదం: రంగనాథ రామచంద్రరావు
యుద్ధవీరులు
మొన్న వీళ్ళూ ఎన్నో యుద్ధాలు
గెలిచారు
గెలిచిన రాజ్యంలోని స్త్రీలను
వేటాడారు.
ఇప్పుడు సాంత్వనా కేంద్రాలు తెరిచి .
కూర్చున్నారు.
మొన్న వీళ్ళూ ఊరూరికి నిప్పు
పెట్టారు.
కాలిపోయిన ఇళ్లలో స్త్రీలు
పిల్లలని ಅನಿ చూడకుండా తలలు నరికారు
ఇప్పుడు అనాథాశ్రమాలు తెరిచి
కూర్చున్నారు.
మొన్న వీళ్ళూ తుపాకులు, ఖడ్గాలు
పట్టుకున్నారు
ఇప్పుడు ధర్మ గ్రంథాలు
పారాయణం చేస్తూ కూర్చున్నారు.
మొన్న మొన్నటి వరకూ జరిగిన
అకారణ యుద్ధాలకు ఇప్పుడు
సకారణాల పట్టిక తయారు చేస్తూ కూర్చున్నారు.
నరికిన తలల
అనుభవించిన యోనుల
కొరికిన స్తనాల
కలచి వేసిన పిండాల
ఖచ్చితమైన గణాంకాలకోసం
తలలు గోక్కుంటున్నారు
ప్రతి మనిషికీ ఉండగలిగిన
మృగపు ముసుగు
తొలగించడానికి ప్రయత్నించినకొద్దీ
గందరగోళం కలగడం ఖచ్చితం .
చూడూ, రాసేటప్పుడు దీన్ని
తీక్షణంగా చూస్తోంది ఒక మృగం-
రణపుటాకలితో!
నీ వల్ల-నీ కోసం మాత్రమే!
నువ్వు కేవలం రక్తమాంసాలతో కూడిన
నూతన యవ్వనంలోని ఒక సజీవ స్త్రీ మాత్రమేఅయిఉంటే,
నిన్నుఇంతగా ప్రేమించేవాడిని కాను నేను!
నా గాఢమైన విషాదపు పాత్రలోని మధువువు నువ్వు,
నా ఒంటరితనపు అర్ధరాత్రుల కలవు నువ్వు,
నా అనాథ, సంచార పగళ్లలోని వెతుకులాటవు నువ్వు.
నేను కోల్పోయిన ప్రతిదానినీ
దోసిళ్ళతో ఇవ్వగల
చావు లేని, బాధలు లేని దేవతవు నువ్వు.
నువ్వొక భూమిలాంటి దానివి,
నేనేమో నీవైపే కదులుతూ, నీ చుట్టూనే తిరిగే
అల్ప గ్రహాన్ని.
తిరస్కరించినకొద్దీ నిన్నే కలవరించే
కష్టాల రోజులలోనూ సత్యమే పలుకుతూ
ఊచల వెనుక మూలుగుతున్నఒక జీవిని మాత్రమే నేను.
ఇంత మాత్రం చెప్పగలను
నా తప్పులన్నింటిని క్షమించు ,
నన్ను ఈ బురదలో నుంచి పైకెత్తి
మళ్లీ ఈ లోకం ముందు
తలెత్తి నిలబెట్టగలిగేది నువ్వు మాత్రమే,
నువ్వు మాత్రమే!
మేమేమి వ్యభిచారులం కాదు!
ఆమెను ప్రేమించానన్నది నిజమే.
పేరులో ఏముంది చెప్పండి—
సుశీల, షకీలా, షైనీ!
ఏదో ఒక పేరు తప్పనిసరిగా
ఉండాల్సిందే అనే పట్టుదల
నాకైతేలేదు!
అలాగే నా పేరు
మహేశ్, ముబారక్, మ్యాక్—
ఇలా ఏదో ఒకటి అయితీరాలన్నపట్టుదల
ఆమెకూ ఉన్నట్లు అనిపించలేదు!
మా కలయికలోని ఆ ఉన్మత్తమైన క్షణాల్లోకూడా
ఆమెగానీ, నేనుగానీ
పొరపాటునైనా
మా పేర్లను గుసగుసలాడుకోలేదు!
అంతగా అనామకులమై
మేము ప్రేమించుకున్నాం.
బయటి వారికి మేము తెలిసింది
మా పేర్లతో మాత్రమే.
కానీ ఆపేర్లకు ఆవలకూడా
ఉన్న మా అసలైన ఐడెంటిటీని
వెతుక్కోవడం మాకు
అనివార్యమైంది.
అంత మాత్రాన నేను విటుడినికాదు,
ఆమె జారిణి కాదు!
![]()

కు.స. మధుసూదన రంగేనహళ్ళి
సంపాదకుడు,
సంగాతి కన్నడ పత్రిక

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.































