మూలం: సుసొకి నట్సుమె
తెలుగు అనువాదం: పి. శ్రీనివాస గౌడ్
నేను ఆమె మంచం దగ్గర చేతులు ముడుచుకుని కూర్చున్నాను. ఆమె వెల్లకిలా పడుకొని, తాను చనిపోబోతున్నానని నిశ్శబ్దంగా చెప్పింది. ఆమె పొడవాటి జుట్టు దిండుపై పడి, అండాకారపు ముఖాన్ని మెత్తగా ఒక చిత్రపటంలా చూపించింది. ఆమె తెల్లటి బుగ్గలపై వెచ్చని ఎరుపు కనిపించింది. ఆమె పెదవులు ఎర్రగా ఉన్నాయి. ఆమె చనిపోబోతున్నట్లు అనిపించలేదు. కానీ ఆ స్త్రీ తాను చనిపోబోతున్నానని నిశ్శబ్దంగా, స్పష్టంగా చెప్పింది. ఆమె నిజంగా చనిపోతుందని అనుకోవడం మొదలుపెట్టాను. కాబట్టి ఆమె ముఖంలోకి చూస్తూ ఆమె నిజంగా చనిపోతోందా అని స్పష్టంగా అడిగాను. ఆ స్త్రీ తాను చనిపోతానని చెప్పి కళ్ళు వెడల్పుగా తెరిచింది. ఆమె కళ్ళు ఆకర్షణీయంగా ఉన్నాయి. పొడవైన కనురెప్పలతో వలయాకారంగా ఉన్నాయి. ఆ నల్లటి కంటపాపల దిగువన, నేనే స్పష్టంగా కనపడుతున్నట్లు వున్నాను.
చీకటిలో మెరుపును దాదాపు పారదర్శకంగా చూశాను. ఆమె నిజంగా చనిపోతుందా అని ఇంకా ఆలోచిస్తున్నాను. ఆమె దగ్గరగా వంగి, మర్యాదగా,’ చనిపోతున్నావా’ అని మళ్ళీ అడిగాను. ‘బాగానే వున్నావా’ అని అడిగాను. ఆ స్త్రీ, తన నిద్ర కళ్లు చికిలించి తెరిచి, తాను నిజంగా చనిపోతానని, బయటపడటానికి మార్గం లేదని మంద్ర స్వరంలో చెప్పింది.
సరే, అయితే.. ‘ఆమెను నన్ను చూడగలవా’ అని కుతూహలంగా అడిగాను. ఆమె నవ్వి, నేను కనపడుతున్నానని చెప్పింది. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నేను దిండు నుండి దూరం జరిగాను. నేను అక్కడే కూర్చుని, నా చేతులు ముడుచుకుని, ఆమె చనిపోతుందా అని మళ్ళీ ఆలోచిస్తున్నాను.
కొంతసేపటి తర్వాత, ఆ స్త్రీయే మళ్ళీ మాట్లాడింది.
“నేను చనిపోతే, దయచేసి నన్ను మీరే పాతిపెట్టండి. పెద్ద ముత్యపుచిప్ప గుల్లతో సమాధిని తవ్వండి. రాలిన నక్షత్రాన్ని సమాధి మీద రాయిలా వుంచండి. అప్పుడు నాకోసం అక్కడ వేచి ఉండండి. కొంతకాలం తర్వాత నేను మిమ్మల్ని చూడటానికి వస్తాను.”
“ఎప్పుడు” అని అడిగాను.
“సూర్యుడు ఉదయిస్తాడు.. అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయిస్తాడు.. అస్తమిస్తాడు..ఎర్రటి సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించినప్పుడు.. మీరు నాకోసం వేచి ఉంటారా?”
నేను తల ఊపాను. ఆమె గొంతు మరింత బిగ్గరగా మారింది. ఆమె నిశ్చయంతో “నాకోసం వంద సంవత్సరాలు వేచి ఉండండి. నా సమాధి వద్ద కూర్చుని నాకోసం వంద సంవత్సరాలు వేచి ఉండండి. నేను మిమ్మల్ని చూడటానికి ఖచ్చితంగా వస్తాను” అని చెప్పింది.
నేను ఆమెకు వేచి ఉంటానని చెప్పాను. ఆమె నల్లటి కళ్ళలో ఇంతకు ముందు చాలా స్పష్టంగా ఉన్న నా ప్రతిబింబం మసకబారి, చెదిరిపోవడం చూశాను. కళ్ళల్లో కదులుతున్న ప్రతిబింబాన్ని ఇప్పటికే నీరు భర్తీ చేసింది. కళ్ళు మూసుకుపోయాయి. పొడవైన కనురెప్పల క్రింద నుండి కన్నీళ్లు ఆమె బుగ్గల మీదుగా కారుతున్నాయి.. ఆమె చనిపోయింది.
నేను తోటలోకి వెళ్లి ముత్యపుచిప్ప గుల్లతో సమాధిని తవ్వడం ప్రారంభించాను. ఆ చిప్ప పదునైన అంచుతో నునుపుగా ఉంది. తడి వాసనగల భూమిలో సమాధిని తవ్వుతున్నప్పుడు వెన్నెల గుల్ల లోపలి భాగంలో తారాడింది. నేను ఆ స్త్రీని లోపల పడుకోబెట్టాను. తర్వాత ఆమెపై మెత్తటి మట్టిని చల్లాను. రాలిపడిన నక్షత్రాన్ని తీసుకొని సమాధిపై సున్నితంగా ఉంచాను. అది అండాకారంలో ఉంది. రాత్రి ఆకాశం గుండా దాని సుదీర్ఘ ప్రయాణం దాని పదునైన అంచులను అండాకారంలోకి మార్చిందని అనుకున్నాను. దానిని పట్టుకుని నేలపై ఉంచినప్పుడు; నా చేతులు, నా గుండె కొంచెం వెచ్చబడినట్లు నాకు అనిపించింది.
ఆ నాచు నేలపై కూర్చుని, నా చేతులు ముడుచుకుని, ఆలోచిస్తున్నాను.. గుండ్రని సమాధి రాయిని చూస్తూ ఆమె కోసం వంద సంవత్సరాలు ఇలాగే వేచి ఉంటాను. ఇంతలో, ఆ స్త్రీ చెప్పినట్లుగా, సూర్యుడు తూర్పున ఉదయించాడు. అది భారీ , ఎర్రటి సూర్యుడు. ఆ స్త్రీ చెప్పినట్లుగా, అది పశ్చిమాన అస్తమించింది. అది అకస్మాత్తుగా పడిపోయింది. అది ఇంకా ఎర్రగా ఉంది. నేను ఒకటి లెక్కించాను.
కొద్దిసేపటి తర్వాత, ఎర్రటి సూర్యుడు మళ్ళీ నిశ్చలంగా ఉదయించి నిశ్శబ్దంగా అస్తమించాడు. నేను రెండింటిని లెక్కించాను.
నేను ఎన్ని అస్తమయాలు చూసానో చెప్పడం అసాధ్యం. లెక్కలేనన్ని ఎర్రటి సూర్యులు నా తలపై నుండి తరలిపోయారు, కానీ ఇప్పటికీ వందవ సంవత్సరం రాలేదు. చివరికి, ఇప్పుడు నాచుతో కప్పబడిన గుండ్రని రాయిని చూసి, ఆ స్త్రీ నన్ను మోసం చేసిందని అనుకున్నాను.
చివరికి, ఒక ఆకుపచ్చ కొమ్మ రాయి కింద నుండి మొలకెత్తి, నా వైపుకు ఏటవాలుగా పెరగడం ప్రారంభించింది. క్షణంలో అది నన్ను చేరుకునేంత పొడవుగా అయింది. అది నా ఛాతీ వద్ద ఆగిపోయింది. పొడవుగా నిటారుగా ఉన్న కొమ్మ పైభాగంలో, కొంచెం కోణంగా కోలగా వేలాడుతున్న ఒక మొగ్గ పువ్వులాగ విచ్చింది. అది తెల్లటి లిల్లీ పూవు. గాఢమైన సువాసన కలిగి ఉంది. స్వర్గం నుండి మంచు దానిపై పడగానే, పువ్వు దాని బరువుకి కిందకి తల వంచింది. నా తలని ముందుకు సాచి మంచుతో కూడిన తెల్లటి రేకులను ముద్దు పెట్టుకుని వెనక్కి వచ్చాను. సుదూర ఆకాశం వైపు చూసినప్పుడు, తెల్లవారుజామున ఒక నక్షత్రం మాత్రమే మెరుస్తోంది.
నేనప్పుడు తొలిసారిగా గ్రహించాను “వంద సంవత్సరాలు గడిచాయి.” అని.
![]()
సుసొకి నట్సుమే పరిచయం
సుసొకి నట్సుమే 1867 ఫిబ్రవరి 9 న (మెయిజీ యుగం ప్రారంభం), టోక్యో (అప్పటి ఎడో) లో జన్మించాడు. బాల్యంలో తల్లిదండ్రులు విడిపోవడంతో, దత్తత కుటుంబంలో పెరిగాడు. పేరు “నట్సుమే” అక్కడి నుంచి వచ్చింది. టోక్యో ఇంపీరియల్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ సాహిత్యం చదివాడు (1893లో గ్రాడ్యుయేషన్). జపాన్‌లోనే మొదటి ఇంగ్లీష్ లిటరేచర్ ప్రొఫెసర్ (టోక్యో యూనివర్శిటీ) అయ్యాడు.
1900-1903 వరకు బ్రిటన్‌లో స్కాలర్‌షిప్‌పై ఉన్నాడు. అక్కడి ఒంటరితనం, న్యూరాస్థీనియా వల్ల మానసికంగా ఇబ్బందులు అనుభవించాడు. ఈ అనుభవాలే తర్వాత అతని రచనల్లో “ఆధునిక మనిషి – ఒంటరితనం” థీమ్‌గా మారాయి. 1907లో ‘అసాహి షింబున్’ పత్రికలో ఫుల్-టైమ్ రచయితగా చేరి, జపాన్‌లో తొలి “ప్రొఫెషనల్ నవలాకారుడు” అయ్యాడు.
సుసొకి లేకపోతే ఆధునిక జపాన్ సాహిత్యం ఇంత లోతుగా ఉండేది కాదు. మురకమి, ఒయే కెంజాబురో వంటి తర్వాతి రచయితలందరూ అతని వారసులే. జపాన్‌లో ‘షింకింగ్ షోసెత్సు’ (మానసిక నవల) జానర్‌కు ఆద్యుడు. జపాన్ 1,000 యెన్ నోటు మీద అతని ముఖచిత్రం ఉంటుంది (2004-2024 వరకు).
1916 డిసెంబర్ 9 (వయసు 49) నసుసొకి నట్సుమే మరణించాడు.
సుసొకి నట్సుమే రచనలు :
- వాగాహై( 1905–06) – పిల్లి దృక్కోణంలో మెయిజీ సమాజాన్ని హాస్యంగా విమర్శించిన తొలి హిట్ నవల.
- బోట్చాన్ (1906) – సరళమైన, నీతిమంతుడైన యువకుడి కథ. ఇప్పటికీ జపాన్ స్కూల్స్‌లో పాఠ్యాంశం.
- కోకోరో (1914) – అపరాధభావం, ఈగోయిజం, తరాల ఘర్షణ. జపాన్ ఆధునిక సాహిత్యంలో అతి ముఖ్యమైన నవల.
4.కుసమకురా
5.సాన్షిరో
6.మోన్
7.మీచికుకురియో
ఈ కథ ‘ముర – కుమొ’ (Ten Nights Dreams, 1910) నుండి తీసుకున్నది.

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
































చాలా బాగుంది