మూలం: డోనియా ఎలామల్ ఇస్మాయిల్
తెలుగు అనువాదం: డా. ఎయం. అయోధ్యారెడ్డి
తెల్లవారింది. సూర్యుడొచ్చాడు, నడినెత్తికెక్కాడు.
పశ్చిమాన క్రమంగా దిగిపోతూ అస్తమించాడు. చీకటిపడింది, రాత్రయింది. కానీ ఆ రాత్రి అట్లాగే నిలిచిపోయింది.
ఆమె ఎడమకన్ను అదేపనిగా అదురుతున్నది. భయంగానూ, గుండెలో దడగానూ ఉన్నది.“దేవుడా..! నా కొడుకుని చల్లగా చూడు.
క్షేమంగా ఇంటికి చేర్చు” పదేపదే చిన్నగా గొణుక్కుంటున్నది. అలజడిగానూ, అసహనంతోనూ ఆమె ఓచోట కుదురుగా ఉండటం లేదు. చేసిన పనే మళ్ళీమళ్ళీ చేస్తూ, సర్దిందే సర్దుతూ ఇల్లంతా తిరిగేస్తున్నది. మధ్య మధ్య బయట పెరట్లోకి వెళ్లి చూసివస్తున్నది. అట్లా ఆమె వృద్ధదేహం బాగా అలసిపోయింది. “ఎక్కడున్నావు బేటా? తెల్లవారుజాము రెండుగంటలైనా ఇల్లు చేరలేదు. కనీసం ఫోను చేసైనా నీ సమాచారం చెప్పలేదు. దేవుడా.. దయచూడు, అంతా మంచే చెయ్యి. మా శత్రువులు సంతోషించే విధంగా నా కుమారునికి ఏ కీడూ చేయకు..”
బయట పరిస్థితి బీభత్సంగా ఉన్నది. జబల్ అల్-మింటార్ వైపు నుంచి పెద్దఎత్తున తుపాకుల కాల్పులు వినిపిస్తున్నయి. ఆగి ఆగి బుల్లెట్ల వర్షం కురుస్తూ, శబ్దాలు అంతకంతకు పెరిగిపోతూ భయపెడుతున్నయి. బయట ఏం జరుగుతుందోనని ఆమె కంపించిపోతున్నది. తన కొడుకు సలీం పోరాటం జరిగే ప్రదేశాలకు దరిదాపుల్లో ఉండకూడదని దైవాన్ని ప్రార్థిస్తున్నది. శూన్యంలోకి చేతులు జోడించి మొక్కుతూ హడావిడి పడుతున్నది. ఆమె కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూ చెంపలమీద నుంచి జారిపోతున్నయి. తనకు సమీపంలో భర్త అడుగుల చప్పుడు వినిపించి ఆమె కళ్లు తుడుచుకున్నది.
ఆయన ఆశ్చర్యంగా భార్య వంక చూశాడు. “అదేమిటి..! నువ్వింకా మేల్కొనే వున్నావా? ఏం జరిగింది?”
‘సలీం ఇంటికి రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు.”
“బహుశా తన స్నేహితుల్లో ఎవరిదగ్గరైనా ఉండిపోయాడేమో.”
“ఇంత రాత్రిదాకనా? స్నేహితునితో వుంటే ఫోనుచేసి చెప్పడానికేం? నాకెందుకో భయంగా ఉన్నది. ఇదివరలో వాడెప్పుడూ ఇట్లా చేయలేదు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో రాత్రుళ్లు బయట తిరగటం క్షేమం కాదు. వాడితో చెబితే విన్పించుకోడు. బయట భయంకరమైన తుపాకుల మోతలు మీకు విన్పించడం లేదా?”
“ఈ ఊర్లో అవి మామూలే. ప్రతిరోజూ ఇట్లాగే ఉంటుంది.”
“కావొచ్చు, కానీ నాకు భయంగా ఉంది”
“కంగారుపడకు. మనవాడు వివేకం ఉన్నోడు. తొందరపడి ప్రమాదకరమైన పనులేమీ చేయడు”
“కానీ వాడు యువకుడండీ.. ఆవేశం ఎక్కువ. పైగా రోజురోజుకు వాడి ధోరణిలో మార్పు వస్తున్నది. తీవ్రవాదిగా తయారవుతున్నాడు. యూదులపై ప్రతీకారం తీర్చుకోవడం గురించే ఎప్పుడూ చెపుతుంటడు. వాడి స్నేహితులు పలువురు ఇప్పటికే ప్రతిఘటన దళంలో చేరిపోయారు. వాళ్ళు మనవాడిని కూడా తప్పుదారి పట్టిస్తున్నారనే నా ఆందోళన అంతా”
“నువు భయపడింది చాలక నన్ను కంగారు పెడతావెందుకు? దేవుడు మన అబ్బాయికి, వాడిలాంటి మరెందరో యువకులకు ఎప్పుడూ అండగా ఉంటాడు. నువు రా.. పోదాం. తెల్లవారుజాము ప్రార్థనకు వేళవుతున్నది. ఇతరుల గురించి ఆందోళన చెందకుండా ముందు నీ గురించి దేవుణ్ణి ప్రార్థించు. ఆ తర్వాతే కుటుంబాన్నీ, పిల్లల్నీ రక్షించమని కోరుకో. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు”
ఆమె పుణ్యస్నానాలు ఆచరించి దైవప్రార్థనలు జరిపింది. కొడుకును రక్షించమని వేడుకున్నది. అయినా ఏదో జరగకూడనిది జరిగిపోయినట్టు ఆంతరంగం కలవరపడుతున్నది. ఎంత అదుపు చేసుకుంటున్నా ఆమెలో అలజడి అలాగే ఉన్నది. తట్టుకోలేక పదేపదే దైవనామస్మరణ చేసింది. లేచి పక్కగదిలోకి వెళ్ళి టెలివిజన్ పెట్టింది. టీవీ తెరమీద ముందుగా అల్- మనార్ ఛానల్ తాలూకు చిహ్నం
కనిపించింది. ఆ తర్వాత వార్తా ప్రసారం మొదలైంది. హఠాత్తుగా కొడుకు సలీం పేరు వినిపించి ఆమె ఉలికిపడింది. కొడుకును
అమరవీరునిగా పేర్కొంటూ వార్తల్లో ప్రకటించినప్పుడు ఆమెకు గుండె ఆగినంత పనైంది. కొద్ది క్షణాలు ఏమీ అర్థం కాలేదు. తన కళ్ళూ
చెవులూ సరిగా పనిచేయడం లేదని భావించుకున్నది. ఆ వార్తలో నిజం లేదనుకున్నది.
కానీ టీవీలో అదే వార్త మళ్ళీ చెపుతుంటే కట్టెలా బిగుసుకుపోయింది. బిగ్గరగా అరవాలనుకుంది. ఎంత ప్రయత్నించినా నోరు పెగల్లేదు.
అతి సాధారణమైన ఒక గృహిణి, శాంతిని ఆకాంక్షించే ఆమె మాతృహృదయం ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేకున్నది. చూసే కళ్ళని, వింటున్న చెవుల్ని నమ్మాలో లేదో తెలియక శిలాప్రతిమే అయింది.
పక్కగదిలో ప్రార్థనలో లీనమైన భర్తను పిలవాలని యత్నించి విఫలమైంది. ఎవరో గొంతు నులిమినట్టు మూలుగులాంటి అరుపు మెల్లగా బయటకొచ్చింది. కాళ్ళు చచ్చుబడినట్టయి నడవలేక దేహాన్ని నేలమీద లాగుతూ పక్కగదిలోకి పోయింది. అక్కడ మోకరిల్లి ప్రార్థనలు చేస్తున్న భర్తను వెనుకనుంచి వీపుమీద తట్టింది. ఆయన స్పందించక పోవడంతో శక్తిలేక అక్కడే నేలమీద వాలిపోయింది.
ప్రార్థన ముగించి ఆయన ఇటు తిరిగి “ఏం జరిగిందని” భార్యని అడిగాడు.
ఆమె ఏదో చెప్పింది. కానీ దుఃఖంలో ఆమె చెప్పే మాటలేవీ అర్థం కాలేదు. చెయ్యెత్తి టీవీ ఉన్న గదివైపు సైగలు చేస్తూ చూపించింది. తర్వాత వెక్కిళ్లు పెడుతూ ఆమె గట్టిగా ఏడువసాగింది. కన్నీళ్లతో ముఖం తడిసి ముద్దయింది. విషయం సలీంకు సంబంధించినదై ఉంటుందని ఆయనకు అర్థమైంది. లేచి వేగంగా పక్కగదిలోకి పోయాడు.
టీవీ తెర నిండా కొడుకు బొమ్మ కనిపించింది. దాని వెంబడే అతని మరణవార్త వినిపించింది.
“సలీం! బేటా.. సలీం..!” గది దద్దరిల్లేలా అరిచాడు.
ఆయన ఆర్తనాదంతో పాటే బయట మైకులో ప్రాతఃకాల ప్రార్థన కూడా అప్పుడే వినిపించింది. దాంతో ఒక్కొక్కరుగా ఇంట్లో వాళ్ళంతా మేల్కొన్నారు. అందరూ టీవీ ముందు చేరారు. సామూహికంగా పీడకల కంటున్నట్టు ఏం జరుగుతున్నదో అర్థంకాక, జరిగిందాన్ని నమ్మలేక అచేతనులలై చతికిలబడ్డారు.
“ఇది అబద్ధం. అట్లా జరగడానికి వీల్లేదు” తండ్రి గట్టిగా అరిచాడు.
“ఈ సంఘటన జరిగితే మనకు తెలిసే ఉండేది. అసలు ఇది ఎప్పుడు జరిగింది?” అన్నను తలుచుకుంటూ అతని తమ్ముళ్లు బిగ్గరగా రోదించారు. నిన్న ఉదయం ఇంట్లోంచి బయటకు వెళుతూ అన్నయ్య తమకు కనీసం వీడ్కోలు కూడా చెప్పలేదని వారు గుర్తుచేసుకొని వాపోయారు. ఈలోగా ఇరుగుపొరుగు ఇంట్లోకి గుంపులుగా వస్తూ సానుభూతి తెలిపారు. తమ అమరవీరున్ని ఆశీర్వదించమని, అతని ఆత్మకు శాంతి చేకూర్చమని భగవంతుణ్ణి అభ్యర్థించారు. జరిగిన అనర్థానికి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరికొద్ది సేపట్లో ఆ చిన్న వీధిలో షాజయా గృహ సముదాయంలోని వాళ్ళింటి ముందు వాహనాలొచ్చి ఆగిన చప్పుడు వినిపించింది. వొచ్చినవాళ్లు బిగ్గరగా ఇస్లామిక్ ఉద్యమ నినాదాలు చేస్తూ పరిసరాలు హోరెత్తించారు. అందులో ఒకవ్యక్తి కారు మీదికి ఎక్కినిలబడి, అమరవీరుని స్మృతికి నివాళులర్పించాడు. పైన పుణ్యలోకాల్లో అతని ఆత్మకు శాంతి లభిస్తుందని, ఈ గడ్డ మీద అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎంతో ఉద్వేగంతో ప్రకటించాడు. ఇస్లామిక్ ఉద్యమ ఆశయసాధన కోసం పోరాడి వీరమరణం పొందిన అతని త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, అతని మార్గాన్ని అనుసరించాలని పార్టీలో యువకులకు పిలుపు ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్లు కొద్దిసేపట్లోనే చకచకా అక్కడో గుడారాన్ని ఏర్పాటు చేశారు. అందులో కూర్చునేందుకు కుర్చీలు తెచ్చి వేశారు. వచ్చినవాళ్ళు అందరికి వేడివేడి కాఫీలు సిద్ధం చేశారు. వీధి అంతటా ఇండ్ల తలుపులు, గోడలు, కరెంటు స్తంభాలపై అమరవీరుని పోస్టర్లను అతికించారు. వాళ్ళ ధోరణి చూస్తుంటే ఈ బలిదానాన్ని వాళ్లు ముందుగానే ఊహించినట్టుగా ఉన్నది.
వాస్తవానికి ఆరోజు ఉదయమే ఏడు గంటలకు సలీం వివాహ ఒప్పందంపై సంతకం చేయాల్సి వున్నది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగినయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అతడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
ఉద్యమ కార్యకర్తలు వీధిని దిగ్బంధం చేశారు. ఉద్యమ నాయకులు అమరవీరుడు సలీం తండ్రిగారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.
సలీం మృతికి సంతాపం ప్రకటిస్తూ పెద్దాయనకు తమ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇంత జరుగుతుంటే సలీం తండ్రి ఒక్కమాటైనా మాట్లాడక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఉద్యమనేతలు ఆయన చేతిలో కొంత డబ్బుపెట్టారు. కానీ ఆయన దానివైపు కనీసం చూడనైనా లేదు. డబ్బు జారి కింద పడింది. అందరూ చూస్తున్నారు. ఎవరూ ఏమీ అనలేదు. పార్టీ నేత సహాయకుడొకరు చప్పున వొంగి డబ్బు ఏరుకొని జేబులో పెట్టుకున్నాడు. జనం గుంపులుగా వొస్తున్నారు, పోతున్నారు.
అమరవీరుడైన సలీం మరణానికి ముందు జియోనిస్టుల బందీగా ఉన్నాడు. వాళ్ళు తమకు ఇది మామూలే అన్నవిధంగా ఎప్పట్లాగే అతన్ని ప్రశ్నించి పరీక్షించేందుకు, రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఫొటోలు తీసేందుకు, మాటలతో తీవ్రంగా అవమానించేందుకు తమ చెరలో ఉంచుకున్నారు.
“ఎన్నో యత్నాల తర్వాత నేటి ఉదయమే అమరవీరుని భౌతికకాయం లైజన్ అధికారులకు అప్పగించబడింది. ప్రస్తుతం పంచనామా కోసం మృతదేహాన్ని షిఫా ఆసుపత్రికి పంపించారు” అక్కడేవున్న అతనెవరో చెప్పడం ముగించక ముందే తండ్రి ఒక్క ఉదుటున లేచి భార్య పిల్లలతో కూడా చెప్పకుండా ఆక్కణ్ణుంచి వేగంగా కదిలాడు. మరణవార్త తెలిసిన అతి కొద్ది వ్యవధిలోనే పోస్టర్లలో వెలసి, మైకుల్లో మార్మోగిపోతూ, వార్తల్లో ముఖ్యాంశమైన తన కొడుకు సంతాపసభను సైతం ఖాతరు చేయకుండా ఒక ఉన్మాదిలా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
ఆయన ఆస్పత్రి చేరుకునే సమయానికి అక్కడ జనం విపరీతంగా ఉన్నారు. అడ్డుపడిన పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది, జనాలను నెట్టుకుంటూ లోపలికి నడిచాడు. నేరుగా శవపరీక్ష నిర్వహిస్తున్న గది వద్దకు పోయాడు. అంతకు కొన్ని నిమిషాల ముందే కుమారుని మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. తనకదే కడసారి చూపు అని తెలిసిన ఆ తండ్రి కళ్ల నిండుగా కొడుకుని చూసుకున్నాడు.
మంచు మీద నిలుచున్నట్టు కాళ్ళు వొణికాయి. సత్తువలేక నేలపై కూలబడ్డాడు. ఆయన కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూ ముఖం, గడ్డం కన్నీళ్లతో తడిసినయి.
కొందరు ఆయనకి ఆసరా ఇచ్చి పైకిలేపారు. మెల్లగా బయటికి తీసుకొచ్చి మంచినీళ్లు తాగించారు. గుండె నిబ్బరంతో ఉండమని ధైర్యం చెప్పారు. మనం మానవమాత్రులం, దేవుని అభీష్టాన్ని శిరసావహించాలని గుర్తుచేశారు. అమరవీరుని అంత్యక్రియల ఏర్పాట్లకు ఇంకా ఏమేం చేయాలో వివరించారు.
ఆసుపత్రివాళ్లు మృతదేహాన్ని కడిగి తెల్లటి వస్త్రంలో చుట్టి బయటికి తెచ్చారు. తర్వాత అతని కుటుంబ సభ్యులకు చివరిచూపు కోసం అంబులెన్స్‌లో ఇంటికి తరలించబడింది. భౌతికకాయం ఇంటి ముందుకు రాగానే మహిళల రోదనలు మిన్నంటినయి. అంతా ఒక్కసారిగా ముందుకొచ్చారు. వాళ్ళని మరీ దగ్గరకు రానివ్వకుండా కొందరు కోప్పడుతూ అడ్డుకున్నారు.
సలీం తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తూ కుప్పకూలింది. పక్కనున్న ఆడవాళ్ళు ఆమెకు ఆసరా ఇచ్చి నిలబెట్టారు. మరింత బిగ్గరగా శోకిస్తూ మళ్ళీ పడిపోయింది. అట్లా పలుమార్లు జరిగింది. ఆమె దుఃఖ ప్రవాహం ఆగడం లేదు. రోదనలు, ప్రార్థనల నడుమ ఆ మాతృమూర్తి చివరికి కొడుకు మెడలో పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించింది. అట్లాగే అతని దేహం మీద వొరిగిపోయింది. కొడుకు ముఖాన్ని హత్తుకొని గుండె పగిలేలా రోదించింది.
ఆమెను కష్టంమీద పక్కకి తీసుకెళ్లారు. మృతుని సోదరులు, అక్కయ్యలు భౌతికకాయం చుట్టూచేరి శోక సముద్రమయ్యారు. ఆప్యాయంగా దేహాన్ని తడుముతూ ముద్దులు పెట్టారు. తర్వాత కొంచెం పక్కకి తొలిగి ఇతరులకు సందర్శించే అవకాశం కల్పించారు. బంధుమిత్రు లందరూ శ్రద్ధాంజలి ఘటించడం పూర్తయ్యాక శవపేటిక మూసివేయబడింది.
“దేవుడు ఎంతో గొప్పవాడు” అనే ప్రార్థనలు…
“అమరవీరుడు సలీం జిందాబాద్” అనే నినాదాలు మిన్నంటినయి.
ఒక ఉత్తేజిత వాతావరణంలో ఊరేగింపు ముందుకు సాగింది. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనల కోసం పవిత్ర ఒమర్ మహా
మసీదుకు తీసుకుపోయారు. అక్కణ్ణుంచి పార్థీవదేహాన్ని శాశ్వత విశ్రాంతి స్థలమైన శ్మశానానికి తరలించారు.
ఊరేగింపు సాగుతుంటే మళ్ళా “దేవుడు ఎంతో గొప్పవాడు” “దేవుడు ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు” అనే శబ్దాలు నినాదాలు
హోరెత్తినయి. అంతిమ ఘట్టం జరుగుతున్న సమయంలో పిక్కటిల్లిన నినాదాలు, శత్రువు నుద్దేశించి కార్యకర్తలు చేసిన హెచ్చరికలు, బదులు తీర్చుకుంటామనే ప్రతిజ్ఞలు, చేతుల్లో బ్యానర్లు పైకెత్తుతూ ఉద్వేగపూరిత విన్యాసాలు, ఆవేశం పట్టలేక ఆకాశంలోకి పేల్చిన బుల్లెట్లతో పరిసరాలు ప్రతిధ్వనించినయి.
అంత్యక్రియలు ముగిసిన తర్వాత అంతా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. బాగా సన్నిహితులు కొందరు మృతుని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వరకూ వొచ్చారు. ఇంట్లో తల్లి అప్పటికే తన కుమారుడు రోజూ పడుకునే మంచాన్ని వ్యక్తిగత ప్రార్థనా మందిరంగా అలంకరించి మార్చుకున్నది. కొడుక్కి సంబంధించిన వస్తువులన్నిటిని తెచ్చి మంచం మీద అమర్చింది. అతని పుస్తకాలు, చిన్నప్పటి స్కూలు డ్రస్సులు, బూట్లు, ఫోటోలు, సంగీత, ఎలక్ట్రానిక్ సాధనాలు.
ఆమె ఒక్కో వస్తువుని ప్రేమగా స్పృశిస్తూ దుఃఖిస్తుంది. గుండెకు హత్తుకుంటుంది. వాటిపై వాలిపోతుంది. ఏడ్చిఏడ్చి అట్లాగే నిద్రిస్తుంది. ఆమెని పరామర్శించేందుకు మహిళలు గదిలోకి వొస్తారు. ప్రార్థనలు జరుపుతారు. ఆమెకు ధైర్యవచనాలు చెపుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తారు. పోయినవాళ్ళతో మనమూ పోలేమని, కొంచెమైనా తినమని బలవంతం చేస్తారు. ఆమె కోసం కొన్ని ఖర్జూరాలు, చక్కెర లేకుండా కప్పు కాఫీ తీసుకొచ్చి అందిస్తారు.
నాలుగు దశాబ్దాలుగా హైదరాబాదులో నివాసం. 1983లో జర్నలిజంలో మొదలైన ప్రయాణం, తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటరుగా పదవీవిరమణ. సాహిత్యపఠనం, కథా నవలా రచన, అనువాదం ఇప్పటి ప్రవృత్తి. 70కి పైగా కథలు, రెండు నవలలు రాశారు. 50 విదేశీ కథలు, ఒక విదేశీ నవల తెలుగులోకి అనువదించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటాలు– ఆహారయాత్ర, అక్కన్నపేట రైల్వేస్టేషన్, అనువాదాలు– ఏడవకుబిడ్డా, కథాసంగమం, అరబ్ కథలు ప్రచురించారు.
Discussion about this post