• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ: ఆ ఒక విధంగా …

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
January 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ: ఆ ఒక విధంగా …

కన్నడ మూలం: కావ్య కడమె
అనువాదం: రంగనాథ రామచంద్రరావు

‘‘ఎందుకు ఒక విధంగా అది?’’ అనే ఒకే మాట సుఘోష్‌ ‌నోటి నుంచి రాకుండా ఉండాలి దేవుడా అని మను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ శబ్దాలు అతని మనసులోనూ పుట్టకూడదని శక్తికి మించి ప్రయత్నిస్తుంటుంది. అతను ఆ ఒక్క మాట అన్నాడంటే ఇంట్లో అకారణంగా ఏదో విస్పోటనం చెందుతుంది. ఆ వేడి ఇద్దరినీ కాల్చివేస్తూ ఒక వారం వరకూ కొనసాగుతుందని పెళ్లయిన ఈ మూడు సంవత్సరాల అనుభవంలో ఆమెకు తెలుసు.

అయినా ఆమె చేయి దాటి సుఘోష్‌ ఆ ‌మాట అనే ఘడియ రెండు నెలలకు ఒకసారైనా తప్పకుండా వస్తుంది. వారి దైనందిన పరిస్థితి ఆమె అదుపు దాటిపోయి ఇక అతను ఆ మాటను అంటాడనటానికి రెండు క్షణాలు ముందు ఆమెకు తెలిసిపోతుంది. తప్పుగా వేసిన చేతికుట్టును వెనుతిరిగి తీసుకోలేని బాధలో ఆమె ఆ సమయం వికారమైన బట్ట ఎదుట మందదృష్టి టైలర్‌ ‌నిలబడినట్లు నిస్సహాయంగా నిలబడుతుంది.

తనలాగే సుఘోష్‌ ‌కూడా ఆ ఒక్క మాటను అనకూడదని అనేక సందర్భాలలో నిగ్రహించుకుంటాడని కూడా మనుకు చాలా సార్లు అనిపించింది. అయితే అన్ని సంసారాల్లోనూ జరిగేలా నిగ్రహపు హద్దు దాటి ఏదో ఒకటి జరగనే జరుగుతుంది. జడను అల్లినట్టు ఒకదానికొకటి వాదాల వరుస చేరుకుంటూ ముచ్చిపెట్టిన నిప్పు కణికల మీద ఎండుటాకులు కురిసినట్టు మంటలోలోపల బుసకొడుతుంది. తర్వాత ఆ నిప్పుకణికను వెంటనే ఆర్పాలి లేదా పూర్తిగా కాలిపోవటానికి వదలాలి, అలా ఎన్ని రోజుల వరకు గాలిలో ఆ ఎండిన ఆకులు అగ్ని స్పర్శించిన పొగ చేరిపోయినట్టు ముక్కును తాకుతుంది. పొగంతా క్రమంగా ఆవిరైపోయిన ముక్కుపుటాలలో ఆ కమరు వాసన జ్ఞాపకం కొత్త చర్మం వచ్చినప్పుడు మాత్రం మెత్తగా ఉన్న పాత గాయంలా మిగిలిపోతుంది.

ఆ ‘ఒక విధంగా’ అంటే ఏమిటని వివరించే కచ్చితత్వాన్ని మనుకూ, సుఘోష్‌కూ డిక్షనరీలోని ఏ పదాలు కూడా ఇవ్వలేవేమో? ‘ఆ ఒక విధంగా’ అన్నది ముఖం మీది ఒక భావం కాకుండా ఇద్దరిలో ఒకరికి ఏదో ఒక విషయానికి అసహనంగా అనిపించినప్పుడు వ్యక్తమయ్యే నియంత్రించలేని ఒక దేహ భాష అయ్యేది. కాలం గడిచినట్టల్లా ‘ఆ ఒక విధంగా’’ అర్థం క్రమంగా మారుతూ, ప్రతిసారి కూడా ఆ శబ్దాలు కొత్త అర్థాన్ని సూచించడమూ ఇదివరకు ఆ అర్థపు గుట్టును చేధించకపోవటానికి కారణముండొచ్చేమో.

ఆ ఆదివారం జరిగింది అదే.

వారాంతంలోని రెండు రోజులైనా ఉదయపు ఫలహారానికి భారతీయ వంటకాలను చేసుకుని తినాలని మనూ, సుఘోష్‌ను పెళ్లయిన ఈ మూడు సంవత్సరాలలో పాటిస్తూ వచ్చిన ఒక ఒప్పందం. సోమవారం నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల అలారం చప్పుడుకు నిద్రలో తూగుతూనే లేచి హడావుడిగా టోస్ట్ ‌చేసే బ్రెడ్‌కు, తొందరలో పాలుకు చేర్చి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినడానికి సాధ్యమయ్యే ఫ్లాక్స్ ‌సీడి చప్పటి సీరియల్‌కూ, చిన్న టీ బ్యాగును పాలల్లో అద్ది అర నిమిషంలో తయారు చేయగలిగే ‘బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌టీ’ కూ వారాంతపు ఆ రెండు రోజులు పూర్తిగా సెలవు.

ఆరోజు ఏమి ఉన్నప్పటికీ అలారం భయం లేకుండా తొమ్మిది తర్వాతే లేచి చిన్న మంటలో టీ పొడి ఉడికించి రెండు రెండుసార్లు ఆనందంతో చాయ్‌ ‌తాగడానికి కుదరాలి మను-సుఘోష్‌లకు. తర్వాత మను యూట్యూబ్‌లో ఆసక్తితో చూసి నేర్చుకున్న క్రిస్పి మసాలా దోసెను, మెత్తటి ఇడ్లీలను, చక్కటి గుంత పొంగనాలను, చట్నీ-సాంబార్‌- ‌బంగాళ దుంప వేపుడుతోపాటు ప్రత్యేకంగా ఒక గంట జతగా కూర్చొని తినడానికి కుదరాలి. దాంతోపాటు మను మూడ్‌ ‌సరిగ్గా ఉంటే ఆ ఉదయపు మెనూలో అలసందల వడ, మైసూర్‌ ‌బజ్జీలు కూడా చేరుతాయి. చివరలో ఫ్రిజ్లో పెట్టిన ‘రసమలై’ చప్పరించడంతోపాటు వారి ఈ వీకెండ్‌ ‘‌చక్కటి ఫలహార కార్యక్రమం’ పూర్తవుతుంది

ఆరోజు ఆదివారం కావడం వల్ల దోసె, పుదీనా చట్నీ తిని మధ్యాహ్నం తయారు చేయబోతున్న చికెన్‌ను, ఫ్రిడ్జ్ ‌నుంచి తీసి ఒక పాత్రలో నీరు నింపి, ‘థా’ చేయడానికి అంటే రూమ్‌ ‌టెంపరేచర్‌కు తీసుకురావడానికి మను అద్ది పెడుతుండగా, ‘‘వంట మొదలుపెట్టడానికి ముందు కారులో ఒక రౌండ్‌ ‌వెళ్లివద్దామా?’’ అని బయటి గది నుంచి సుఘోష్‌ ‌మృదువుగా అడిగాడు.

హుబ్లీలో ఉన్నప్పుడు విశ్రాంతిగా దాజిబాన పేటలాంటి కిక్కిరిసిన జన సమూహంలోంచి స్వతంత్రంగా కారు నడిపిన అనుభవం

ఉన్నప్పటికీ, మను అమెరికాలోని విశాలమైన రోడ్లలో, సాటి లేని వేగానికి, రోడ్డుకు కుడివైపున మాత్రమే నడపాలనే నియమాలకు విపరీతంగా భయపడేది. అది నిజమైన భయమో లేదా సుఘోష్‌కు కారు పట్ల ఉన్న అతి వ్యామోహానికో ఆమెలో ఏర్పడిన అసహనమో ఆమె స్పష్టంగా చెప్పలేదు. ఇరవై ఐదు మైళ్ళ వేగంతో నడపాల్సిన రోడ్డులో ఐదు మైళ్ళు ఎక్కువగా పోయినా వందలాది డాలర్ల ‘టికెట్‌’ అం‌టే ఫైన్‌ ‌వేసే పోలీసుల వాహనపు ఎరుపు-నీలి లైట్లు కళ్ళను చెదరగొట్టేటప్పుడు ఆమె మరింతగా అస్వస్థురాలవుతుంది.

‘‘అక్కా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు చూడు. హుబ్లీ మార్కెట్లో కారు నడిపినవాళ్లు ప్రపంచంలోని ఏ మూలకు ఎత్తివేసినా కళ్ళు మూసుకొని కారు నడుపుకుంటూ వెళ్లిపోతారు’’ అని కాలిఫోర్నియాలోని సాంటా క్లారా నుంచి రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఫోన్‌ ‌చేసి సరిగ్గా ఏడున్నర నిమిషాలు మాట్లాడే ఆమె తమ్ముడు నవీన్‌ ‌చెబుతూనే ఉంటాడు. ఈమెకు న్యూజెర్సీలో తొమ్మిదిన్నర అయినప్పుడు నవీన్‌కు కాలిఫోర్నియాలో ఉదయం ఆరున్నర అయ్యుంటుంది. రోజూ ఇంటి నుంచి ఆఫీస్‌కు అతను ట్రైన్‌లో వెళ్లడం వల్ల ట్రైన్‌లో అడుగుపెట్టిన వెంటనే దూరంలోని ఊరులో ఉన్న ఈ అక్కకు ఫోన్‌ ‌చేస్తాడు. సరిగ్గా ఏడున్నర నిమిషాల తర్వాత అతని ఆఫీసు స్టాప్‌ ‌వస్తుంది. అప్పుడు ఎలాంటి సీరియస్‌ ‌విషయం మాట్లాడుతున్నప్పటికీ నవీన్‌ ‌ఫోర్‌ ‌ఫోన్‌ ‌కట్‌ ‌చేస్తాడు. నవీన్‌ ‌కాలిఫోర్నియాకు వచ్చిన ఒక సంవత్సరం నుంచి ఇదంతా అలవాటైంది. మను కూడా అదే నిమిషంలో మొదలు పెట్టిన మాటను పూర్తిచేస్తుంది. ఒకట్రెండు క్షణాల సమయం ఉన్నప్పటికీ కొత్త వాక్యాన్ని ప్రారంభించదు.

ఇటు సుఘోష్‌ ‌కూడా న్యూయార్క్‌లోని తన ఆఫీసుకు వీళ్లున్న న్యూజెర్సీ నుంచి వారంలోని ఐదు రోజులూ ట్రైన్‌లో వెళ్లడం వల్ల ఇంట్లోని కారు ఆ ఐదు రోజులూ దుమ్ముతో నిండిన ఒక్కొక్క దుప్పటిని కప్పుకొని మౌనంగా నిలుచుకొని ఉంటుంది. శనివారం ఉదయం భార్యాభర్తలిద్దరూ ఆలస్యంగా లేచి, టిఫిన్‌ ‌చేసి సెలవు మత్తులోనే తిరుగుతూ కారు దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు అయివుంటుంది. తర్వాత సుఘోష్‌ ‌ఢిక్కిలో ఉన్న పసుపు రంగు కాటన్‌ ‌గుడ్డతో భక్తితో కారు అంగుళం అంగుళమూ తుడవటాన్ని మను ప్రసాదం కోసం భక్తితో ఎదురుచూస్తూ నిలుచున్న భక్తురాలిలా కాస్త మెడ వంచి దూరంలోనే నిలుచుకొని చూసేది. శనివారం ఉదయమే ఆ కారును తుడిచే పవిత్రమైన కార్యాన్ని నెరవేరుస్తూనే సుఘోష్‌ ‌మనువైపు తిరిగి అవునా కాదా అన్నట్టు సైగ చేస్తాడు. దానికోసమే ఎదురుచూస్తున్న మను గంతులేస్తూ వెళ్లి కారు ముందు సీటు కుడివైపు తలుపు తెరిచి, కూర్చొని సీటు బెల్ట్ ‌వేసుకుని, గువ్వపిట్టలా కూర్చుంటుంది.

ఉదయం టిఫిన్‌కు మాత్రమే భారతీయ వంటకాలు చేసుకోవాలి అనే ఒక నియమం తప్ప ఈ శని, ఆదివారాల వీకెండ్‌ ఎలాంటి నియమాలనూ మోసుకొని రాదు మను-సుఘోష్‌లకు. అందువల్ల ఆ రెండు రోజులూ ఎప్పుడో లేచి, ఎప్పుడో స్నానం చేసి, లేదా చేయకుండానే టిఫిన్‌ ‌చేసి, ఏదో హోటల్లో భోజనం చేసి ఏదో సమయానికి ముద్దు పెట్టి, టీవీలో వచ్చే ఏదో షో చూస్తూ ఇంకెప్పటికో పడుకొని – లేదా పడుకోకుండా ఈ రెండు రోజులు చిటికె వేసినట్టు ఇద్దరికీ గడిచిపోతుంది. ఈ రోజులలో చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే వచ్చే వారానికి అవసరమైన వంట సామాన్లనూ, కూరగాయలనూ, ఇండియన్‌ ‌స్టోర్‌ ‌నుంచి కొనుక్కొని తీసుకొని రావటం. కూరగాయలు ఫ్రెష్‌గా ఉంటాయని శనివారం ఉదయమే వెళ్లాలని ఇద్దరూ అనుకుంటారు. అది కొన్నిసార్లు మాత్రమే సాధ్యమవుతుంది.

తల్లిదండ్రుల ముఖాలను పుట్టుక నుంచే చూడకుండా, ధారవాడలోని నగరకర్‌ ‌కాలనీలో నివసించే పెదనాన్న ఇంట్లో పెరిగిన సుఘోష్‌కు సొంత కారు అన్నది కేవలం ఒక కారు మాత్రమే కాదు అని మను పెళ్లయిన కొత్తలోనే అర్థం చేసుకుంది. అచ్చమైన తెల్లటి రంగు ఆ ఫోర్డు ఫియెస్టా కారు సుఘోష్‌కు నాలుగు చక్రాల మీద తిరిగే, ఇంధనాన్ని తాగే, స్థలాల మధ్య ఒక సంపర్కాన్ని సాధించే నిర్జీవ వాహనం మాత్రమే కాదు. ‘ఆ కారును తన శరీరంలోని ఒక బాడీ పార్ట్‌గా అతను భావించాడు’ అని మను హుబ్లీలో ఉన్న తన తల్లి హర్షమణికి ఫోన్‌ ‌చేసి చెప్పినప్పుడు అది సంతోషించాల్సిన విషయం అవునో కాదో అని హర్షమణకీ భయం వేసేది.

ఒక విధంగా చూస్తే వారంలోని ఐదు రోజులు సుఘోష్‌ ‌పనిచేసే న్యూయార్క్ ‌లోని ‘స్ట్రాసన్‌ ఇన్వెస్టర్స్’ ఆఫీసుకు వీళ్లున్న న్యూజెర్సీ ఎడిసన్‌లోని ‘పార్క్ ‌వ్యూ అపార్ట్‌మెంట్స్’ ‌నుంచి కారులో కేవలం ఒక గంట ప్రయాణం. రోజూ వందలాది మైళ్ళు కారులోనే ప్రయాణించే అమెరికన్లకు ఈ ఒక గంట కారు ప్రయాణం అంటే నట్టింటి నుంచి పెరట్లోకి వెళ్లినంత సరళమైన విషయం. అయినా సుఘోష్‌ ‌వెళ్లేటప్పుడు రెండు గంటలు, వచ్చేటప్పుడు రెండు గంటలు ట్రైన్‌లోనే వెళ్లడానికి ‘ఊరికే డ్రైవ్‌ ‌చేసేటప్పుడు టైమ్‌ ‌దండగ’ అనే చెప్పే కారణం తప్ప వేరే కారణమూ ఉందని మనుకు అనుమానం. ఎప్పుడో ఇద్దరి మనస్సులు తేలికగా ఉన్నప్పుడు, సమయం-సందర్భం చూసుకొని ‘టైర్‌ అరిగింది కదా పాపం’ అని అతని ఈ అసహజమైన స్వభావానికి తనదైన కారణాన్ని ఇచ్చి సుఘోష్‌ను మనసారా ముద్దు పెట్టుకునేది.

రోజు ట్రైన్‌లోనే వెళుతున్నప్పటికీ సుఘోష్‌ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తప్పకుండా కారుకు ప్రదక్షిణ వేసి వచ్చేవాడు. ఆ ప్రదక్షిణలో కారు అంగుళం అంగుళం తూచా తప్పకుండా తనిఖీ చేసేవాడు. అపార్ట్‌మెంట్లోని ఇతర ఇళ్లవారూ, వారి పిల్లలూ చేసిన కనీకనిపించని చిన్న గీతనో, పక్కన నిలబెట్టిన కారువాళ్ళు హడావుడిలో తలుపు తెరిచినప్పుడు కలిగే డెంటో దొరుకుతుందేమోనని ఒళ్లంతా కళ్లు చేసుకొని రోజుకు రెండుసార్లు అసహనంతో చూసేవాడు. అతని తీక్షణమైన కళ్ళల్లోని ఈ బాధ చూసి మనుకు ఒక్కొక్కసారి గుండెలో అకారమైన వణుకు తన్నుకొచ్చేది.

ఈ వణుకునే కప్పుకున్నట్టు ఆ ఆదివారం మను ‘‘ఒక రౌండ్‌ ‌వేసి వద్దామా?’’ అని అడిగిన సుఘోష్‌ ‌వెంట నడిచి డ్రైవర్‌ ‌సీట్‌ ‌మీద కూర్చొని డోర్‌ ‌వేసుకుంది.

ఈ మూడేళ్లలో ఇదే మొదటిసారి డ్రైవర్‌ ‌సీట్‌ ‌లో ఆమె కూర్చోవడం. సుఘోష్‌ ‌మనూలిద్దరి ఎత్తు ఐదు అడుగుల నాలుగు అంగుళాలే కావడం వల్ల కారు మూడు అద్దాల కోణాలు సరిగ్గా ఉన్నాయి. ఇండియాలో ఆమె నడిపిన సెకండ్‌ ‌హ్యాండ్‌ ‌మారుతి 800 రెండింతలు ఉండటం ఇప్పుడిప్పుడే లభించిన ఈ సందర్భంలో ఆమెకు ఇంకోసారి దృష్టికి వచ్చింది.

పక్కన కూర్చున్నా సుఘోష్‌, ‘‘ఇది ఎక్సలేటర్‌, ‌బ్రేకు గుర్తుండాలి ఎ-బి’’ అని మొదలు పెట్టాడు, ‘‘హుబ్లీలో ఫ్రెండ్‌ ‌కారును చాలాసార్లు నడిపాను చాలాసార్లు’’ అని నిర్లక్ష్యం చూపినట్టు నటించినా క్లచ్‌ ‌లేకుండా కేవలం కీ తిప్పగానే స్టార్ట్ అయ్యే కారును చూసి మనుకు ఆందోళన కలిగింది. చాలా రోజుల నుంచి డ్రైవర్‌ ‌సీట్లో కూర్చోకపోవడం వల్ల ఆందోళన మనశ్శరీరాలలో ఒక విధమైన జడత్వాన్ని తెచ్చింది.

‘‘స్టాప్‌’’ అన్నాడు సుఘోష్‌. ‌కంటంలో అప్పటికే మృదుత్వంపోయి అనుభవజ్ఞుడైన కోచ్‌ ‌గడుసుతనం రావడం మను గమనించింది.

మనుకు ఒక్క క్షణం బాధగా అనిపించినప్పటికీ కుదుటపడి నవ్వు కాని నవ్వును పెదవుల మీద తొణికిస్తూ, ‘మిర్రర్‌ను అప్పుడే చెక్‌ ‌చేసుకున్నాను’’ అంది. అలా అంటూనే ముందు జరగబోయే ప్రమాదం ఆమె మనసులో కదిలిపోయింది.

‘‘అయ్యో సారీ సుఘూ, హడావుడిలో లైసెన్స్ ‌పర్సులో ఉండిపోయింది. ఒక్క నిమిషంలో వస్తాను’’ అనే కారు తలుపు తెరిచి పరుగుతీసింది. మెట్లెక్కి ఇంటి ముందు నిలిచినప్పుడు ఆమెకు ఇంటి తాళం కూడా పర్సులోనే ఉండటం గుర్తుకొచ్చింది. మళ్లీ దిగొచ్చిన సుఘోష్‌ ‌దగ్గర ఉన్న ఇంటి తాళం చెవి తీసుకొని వెళ్లి చాలా తలాబాదుకుంటూ మను ఇంటి నుంచి పర్సు తీసుకుని వచ్చి మళ్లీ కారు స్టార్ట్ ‌చేసేలోపు సుఘోష్‌ అప్పటికే చిరచిరలాడుతున్నాడు.

ఫోర్డ్ ‌ఫియెస్టా అని సుఘోష్‌ ఈ ‌కన్నబిడ్డను మెల్లగా రివర్స్ ‌తీసుకొని అప్పుడప్పుడే రెక్కలు బలపడిన పక్షి సంభ్రమంతో అపార్ట్‌మెంట్‌ ఆవరణ నుంచి రోడ్డులోకి తిప్పింది. తిప్పేటప్పుడు ఇండికేటర్‌ ‌వేసి స్టాప్‌ ‌సైన్‌ ఉన్నచోట అచ్చం అమెరికన్ల శైలిలో, ‘‘ఒన్‌ ‌మిస్సిస్సిపి టూ మిస్సిస్సిపి థ్రీ మిస్సిస్సిపి’’ అని మూడు సెకండ్ల కాలం కారును ఆపి సుఘోష్‌ను ఓరకంట గమనించింది. ఎందుకో అతని ముఖం బిగుసుకుని ఉండటం ఆ హడావుడిలోనూ గమనించింది.

కారు రోడ్డు దిగగానే సుఘోష్‌ ‌మాటలు మొదలయ్యాయి.

‘‘అయ్యయ్యో బ్రేకు వేయి’’, ‘‘స్టాప్‌ ‌సైన్‌ ‌కనపడటం లేదా?’’, ‘‘రేర్‌ ‌వ్యూ మిర్రర్‌ను ఎందుకు చూడటం లేదు’’, ‘‘ప్యాసింజర్‌ ‌సీట్‌ అద్దాలనెందుకు చూడడం లేదు’’, ‘‘డ్రైవర్‌ ‌సీట్‌ అద్దాన్ని కూడా చూస్తూండు’’ బ్లైండ్‌ ‌స్పాట్‌ ‌కనిపించకపోతే ఏదైనా ట్రక్కును గుద్దుతావు’’, ‘‘ఇరవై ఐదు మైళ్ళ స్పీడు వెళ్లే రోడ్డు ఇది, నువ్వు పదిహేను మైళ్లలో పోతే ట్రాఫిక్‌ ‌స్లో చేస్తున్నావని టికెట్‌ ఇస్తారు చూడు’’, ‘‘రోడ్డు సైన్‌ల వైపు ఒక కన్ను పెట్టిండు…’’

ఐదే నిమిషాల క్రితం ఉన్న ఉత్సాహమంతా మనుకు సర్రున జారి పోవడానికి ఇది చాలు. మరో మనిషిదేమో అన్న తీరులో మారిన సుఘోష్‌ ‌స్వరం గుండెలోని ఏదో బిందువులో దిగి కలచివేసింది. కళ్ళల్లో నీటి పల్చటి పొర ఏర్పడటం మొదలైంది.

కారు ‘హెసార్డ్’ ‌బటన్‌ను నొక్కి రోడ్డు ‘షోల్డర్‌’ ‌భాగంలో కారును నిలిపి మను దిక్కుతోచనట్టు కూర్చుంది.

‘‘ఇలా చేస్తే ఎలా ఒప్పుకుంటావు?’’

మను పూర్తి పేరును సుఘోష్‌ ‌పిలిచాడంటే అది చివరి మూవ్‌ అని ఆమెకు తెలుసు. అతి సహజమైన తన పేరును కూడా ఆ సందర్భంలో ఒక తిట్టులా ఆమెకు వినిపించింది. కళ్ళ నుంచి నీరు టపటపమని రాలటం మొదలైంది.

‘‘ఏమిలేదు సుఘూ. ఎందుకలా సాగదీస్తావో చెప్పు’’ అని ముక్కలు ముక్కలుగా.

‘‘నేనెక్కడ సాగదీశాను. అయినా నేను ఏం తప్పుగా మాట్లాడానో చెప్పు? ఇలా రోడ్డు మధ్యలో కారు నిలిపితే క్యాప్స్ ‌వచ్చి మనతోపాటు కారును కూడా ‘టో’ చేసుకొని తీసుకెళ్తారు’’

‘‘నాకు వద్దు, నువ్వే నడుపు’’

‘‘రోడ్డు మధ్య దిగడానికి ఇది హుబ్లీ బ్రాడ్‌వే అనుకున్నావా? రైట్లో తిప్పి పార్కింగ్‌ ‌లాట్‌లో ఆపు. అక్కడినుంచి నేనే నడుపుతాను’’ అన్నాడు.

కళ్లు తుడుచుకొని కుడివైపు ఉన్న పార్కింగ్‌ ‌లాట్‌ ‌లో కారు నిలిపి ఇద్దరూ సీట్లు మార్చుకున్నారు. ఒక్క మాట మాట్లాడకుండా సుఘోష్‌ ‘‘‌పార్క్ ‌వ్యూ అపార్ట్‌మెంట్స్’ అని పచ్చటి అక్షరాలతో రాసుకున్న మలుపు వైపు కారు తిప్పాడు.

ఇంటికి రాగానే ఇద్దరూ ఒక్కసారి కూడా పరస్పరం చూపులు కలవకుండా చూసుకున్నారు. చికెన్‌ ‌వంట తయారు చేసే ఓపిక లేకపోవడం వల్ల మను నీటిలో అద్దిపెట్టిన చికెన్‌ను అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టింది. సమయం అప్పటికే మధ్యాహ్నం ఒకటిన్నర అయింది. ఫ్రోజన్‌ ‌పరోటానే వేడి చేసి వెనకటి రోజు చేసిన బీన్స్ ‌కూర, పలావును మైక్రోవేవ్‌లో పెట్టి, వేడి చేసి, దోసకాయను, అడ్డంగా కోసి బేబీ క్యారెట్‌తో పాటు డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద పెట్టింది. వివిధ పాత్రలు డైనింగ్‌ ‌టేబుల్‌కు కొట్టుకున్న సద్దులోనే టైమ్‌ ఊహించిన సుఘోష్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌నుంచి రావడానికీ, మను ఇద్దరికీ ప్లేట్లు తెచ్చిపెట్టడానికీ సరిపోయింది. టీవీ దగ్గర ఒకరు, బాల్కనీ దగ్గర ఒకరు ముఖం తిప్పుకొని టిఫిన్‌ ‌చేశారు. సుఘోష్‌కు అప్పడాలు కావలసినా, ‘ఎక్కడ పెట్టావ్‌?’ అని అతను మనునూ అడగలేదు. సగం భోజనం అయిన తర్వాత మనుకు సుఘోష్‌ ‌పలావుతోపాటు ఎప్పుడూ అప్పడాలు నంచుకోవడం గుర్తుకొచ్చినా ఆమె

కావాలనే ఆ మాటను మరవడానికి ప్రయత్నించింది.

ఈమె ఏదో పత్రిక పట్టుకొని, అతను ల్యాప్‌టాప్‌ ‌పట్టుకొని ఆ సాయంత్రం గడిపారు. రాత్రి కూడా ఫ్రిడ్జ్ ‌లోని పరోటాను వేడి చేసుకుని తిని, ఈమె గోడ వైపు తిరిగీ, అతను ల్యాప్‌టాప్‌లో క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌పెట్టుకుని బుసలుకొడుతూ ఒకరి శరీరం ఒకరికి తగలకుండా పడుకున్నారు.

ఉదయం సరిగ్గా ఆరుగంటల అలారంకు మనుకు మెలకువ వచ్చినప్పుడు ఆమె ఎప్పటిలాగే సుఘోష్‌ ‌ఛాతీ మీద పడుకొనివుంది. అతనూ లేచి పరస్పరం చూపులు చూపులు కలిసే వరకు వెనకటి రోజు కలిగిన మనోవేదన ఆమె జ్ఞాపకాల నుంచి మాసిపోయింది. నెమ్మదిగా లేచి జుట్టుకు ఒక బో పెట్టుకొని బ్రష్‌ ‌చేయడానికి వెళుతున్నప్పుడు మనుకు అది వీక్‌ ‌డే అని, సుఘోష్‌కు బాక్స్‌లో పెట్టడానికి క్రితం రోజు తాను ఏమీ తయారుచేసి పెట్టలేదని గుర్తొచ్చింది.

గబగబా ఒక లోటా బియ్యం అన్నానికి పెట్టి, పులిహోర కోసం తాళింపు పెట్టి, పెరగన్నం తాళింపుకు ఇంకొక పాత్రను పెట్టి రెండు లోటాల పాలు చాయ్‌ ‌కోసం మైక్రోవేవ్లో పెట్టింది. ఫ్రిడ్జ్ ‌నుంచి నాలుగు స్లైసుల బ్రెడ్డు తీసి టోస్టర్లో పెట్టింది. ఇతర రోజులలో ఒకేసారి ఐదారు పనులు చేస్తున్న మను బెడ్‌ ‌రూమ్‌ ‌నుంచి లేచి వచ్చిన సుఘోష్‌కు నైపుణ్యమున్న ఆటగత్తెలా కనిపించి ఆమె వీపు చుట్టుకొని మెడకు మృదువుగా ముద్దు పెట్టేలా చేసేది.

ఆరోజు ఆమె ముఖంలో సుఘోష్‌ ‌మరో భావాన్ని గుర్తించాడు. ఆ తర్వాత ఒక్క క్షణంలోనే అతనికి తెలియకుండానే ఆ మాటల బాణం ఎక్కుపెట్టాడు.

‘‘ఎందుకు ఒక విధంగా ఉన్నావుకదా?’’

నిన్నటి రోజు ఇంటి గొడవ ఇంకొక రెండు రోజుల్లో లావా రసంలా బయటకు వచ్చి దహిస్తుందని మనుకు తెలుసు. అయితే అది ఇలా ఉదయమే జరగొచ్చని ఆమె ఊహించని కారణంగా ఎదురుచూడని దానికి సిద్ధంగా ఉండలేదు.

‘‘నేనా? లేదు కదా? ఏమైంది?’’

‘‘రోజూ నువ్వు ఇలా ఉండవు కదా, అలా సొట్టముఖం పెట్టుకొని కూర్చోవడానికి నీకేమైందో చెప్పు?’’

‘‘ఎందుకలా అంటున్నావ్‌? ‌నేనెక్కడ ముఖం సొట్టంగా పెట్టుకున్నాను? ఇంతకీ నేనేం కూర్చోలేదు. వంట చేస్తుండడం కనిపించడం లేదా?’’

‘‘ఇలా సొట్టగా ముఖం పెట్టుకొని వంట చేసేటట్టయితే వంట చేయనే వద్దు’’

‘‘ఎందుకలా అంటావ్‌? ‌మాట మాటకు సొట్టమూతి అని? నాకేమైంది? బాగానే ఉన్నాను కదా’’

‘‘నువ్వు నీ ముఖం అద్దంలో చూసుకో. సొట్టగా ఉందో లేదో అని. నేనే అద్దం తెచ్చి పట్టుకోనా?’’

‘‘నేను కాదు, నువ్వే నిన్నటి నుంచి అద్దం అద్దం అని అరుస్తున్నావ్‌ ‌కదా? నీ ముఖానికి పట్టుకో, నాకెందుకు పట్టుకుంటావు?’’

‘‘ఓహ్‌, ‌నిన్న జరిగింది ఇంకా మనసులోనే పెట్టుకున్నావేమే? రేర్‌ ‌వ్యూ మిర్రర్‌లో చూడకుండా ఎంతమంది ఆక్సిడెంట్‌ ‌చేసుకుంటారు’’ నోట్లో బ్రష్‌ను అటు ఇటు కదిలిస్తూ, టూత్‌ ‌పేస్ట్ ‌నురుగు బయటికి రాకుండా బ్యాలెన్స్ ‌చేస్తూ సుఘోష్‌ ‌తొదలుతూ అన్నాడు.

అప్పటికే మను కన్నీరు పెట్టసాగింది. అది చూసి సుఘోష్‌ ‌మరింతగా అసహనం చెందాడు. కన్నీరు కనిపించగానే సింక్‌లోనే ఒకసారి నోరు పుక్కిలించి, సహజ శైలిలో సహస్రనామావళి మొదలుపెట్టాడు. ఒక్కటి ఒక్క చెడ్డమాట కూడా మాట్లాడకుండా, గొంతు తారా స్థాయికి పెంచకుండా మను మనసులో దాచిపెట్టిన దుఃఖాన్ని బయటకు రప్పించే కళ అతనికి సిద్ధించింది. మాటల్లోనే కస్టమర్లను ఆకర్షించాల్సిన అతని స్టాక్‌ ‌బ్రోకర్‌ ఉద్యోగం అతనికి నేర్పిన గొప్ప పాఠం ఈ కళ. అతని మాటల్లో మను జన్మను జల్లడ పట్టేటటువంటి మాటలూ వచ్చి పోయాయి. ‘వద్దు, అక్కడ అదొక్కటే చెప్పకుండా ఉండాలి’ అని ఆమె అనుకోగానే అదే మాట అతని నోటి నుంచి వచ్చింది. వెంటనే కళ్ళు తుడుచుకున్నప్పటికీ హఠాత్తుగా ఆమె కళ్ల నుంచి రాలిన రెండు కన్నీటి బొట్లు అతని టిఫిన్‌ ‌క్యారియర్‌లో చేరిపోయాయి. ఇతను ఆఫీసుకు తొందరగా వెళితే చాలు అనుకుంటూ తర్వాతి రెండు గంటలను గడిపింది.

అతను అటు వెళ్లగానే పక్క మీద వాలి, దుప్పటి కప్పుకొని తానే సృష్టించుకున్న చీకట్లో పెద్దగా, మనసారా ఏడ్చింది.

ఇలా వెక్కివెక్కి ఏడుస్తుండగా ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి ఏర్పడే ఈ మనోవేదనలో ఇద్దరిదీ తప్పుండదని మనుకు తెలుసు. అయితే దాన్ని అంగీకరించడానికి అదే మనసు చిన్న పిల్లలా మొండిపట్టు పడుతుంది. ‘ఎందుకు? ఎందుకు ఇది అతని తప్పు కాదు? ఇంకొక మనిషిని పెద్ద గొంతుకతో తిట్టే అధికారం ఇతనికి ఎవరిచ్చారు?’ అని అనుకుంటూ మరింతగా ఏడ్చింది. ‘నీ జెండర్‌ ఇచ్చిన అధికారం అది’ అని మనసులోనే అనుకున్నప్పటికీ నోరు తెరిచి మాట్లాడితే సామాన్య శబ్దానికి అంటుకునే పదునైన అర్థపు మొనలు మాట్లాడిన తర్వాత మిగిల్చే కంపనలకోసం భయంతో మాట్లాడకుండా ఉండిపోయేది. అలా మాట్లాడితే ముత్యాలు పగిలిపోయినట్టే. తర్వాత ఆడిన ఒక తప్పు మాట నుంచి రెండే రోజుల్లో కరగగలిగే మనోవ్యధ మరో రెండు వారాల వరకు కొనసాగుతుంది. చివరికి జ్వాలాముఖిలా బయటికు వచ్చి మరొకసారి కారణమే లేకుండా ఇద్దరినీ కాల్చి వేస్తుంది. ఈ మూడు సంవత్సరాల్లో మాట్లాడకుండా మిగిలిన మాటల శక్తే ఎక్కువ అని ఆమెకు అర్థమైంది.

ఏడ్చి సమాధాన పడి, కళ్ళు లాగటంతో నిద్ర ఆవరించింది. మెలకువ వచ్చిన తర్వాత కాస్త మెడ వంచి టీవీ ముందు ఉన్న డిజిటల్‌ ‌గడియారం వైపు చూపులు సారించి మను కలవర పడింది. మధ్యాహ్నం పన్నెండుంపావు అయింది. ఆమెకు అరగంట అనిపించిన సమయంలో మూడున్నర గంటలు గడిచిపోయాయి. పన్నెండున్నర అంటే న్యూయార్క్‌లో ఉన్న సుఘోష్‌ ఆఫీసులో భోజనం సమయం. ఉదయం జరిగిన విషమ ఘటన కళ్ళ ముందుకొచ్చి అంత జరిగిన తర్వాత కూడా ఆమె టిఫిన్‌ ‌బాక్సులు కట్టిన పులిహోర, పెరగన్నం, అప్పడాలు సుఘోష్‌ ‌తింటుండవచ్చా అని మనుకు అనుమానం వేసింది. ‘‘చెప్పడానికి కుదరదు. నిన్న మ్యాగీ మీది కోపం భోజనం మీద చూపించిన చూపిస్తాడు’’ అని అనుకుంది. రాత్రి అతను ఆఫీస్‌ ‌నుంచి వచ్చినప్పుడు మూసిన డబ్బా నుంచే ఇల్లంతా వ్యాపించిన పులిసిన పెరుగన్నపు వాసన ఇప్పటికే ముక్కుకు కొట్టినట్టే ముఖం నలుచుకుంది.

ఇలాగే వదిలితే సాయంత్రం ఆరు వరకు సుఘోష్‌ ‌వచ్చే అరగంట ముందు వరకు ఇలాగే పక్క మీద పడివుంటుంది మను. తర్వాత రోజంతా సమయం పాడుచేశానని నొచ్చుకుంటుంది. అంతేకాకుండా ఈరోజు దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్లాలనుకుంది. దాన్ని గుర్తు చేసుకుని ఇష్టంలేని మనసుతోటే పక్కమీది నుంచి లేచింది.

జుట్టును ముడివేసుకుంటూ, వంటింటికి నడిచింది. ఉదయం సుఘోష్‌ ‌కోసం కలిపిన మిగిలిపోయిన పులిహోరను ఒక కంచంలో పెట్టుకొని వచ్చి టీవీలో ‘హోమ్‌’ ‌ఛానల్‌ ‌చూస్తూ తినడం ముగించింది.

వెనుకటి సంవత్సరమే సుఘోష్‌ ‌ముద్దుగా కొని తెచ్చిన, నిలువుటద్దం ముందు నుంచోని జుట్టు విప్పింది. ఉదయం నుంచి ఒక్కసారి కూడా తల దువ్వుకోలేదు. పైకి లేపి జడ కడితే మరీ పల్చగా కనిపించే, అలాగే వదిలి క్లిప్పు వేస్తే దట్టంగా కనిపించే ఛాతీని దాటే ఉంగరాలు జుట్టు, నాలుగు రోజుల నుంచి స్నానం చేయని కారణంగా అక్కడక్కడ సగం తెగి విచిత్రంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆమె నిలుచున్న గది నుంచి నిలువుటద్దం సరిగ్గా వెనుకనున్న పెద్ద కిటికీ నుంచి దూరి వచ్చే తీవ్రమైన ఎండ కిరణాలు ఆమె ముఖం మీద దర్పంగా పడుతున్నాయి.

ఇదే మొదటిసారి ఆమె కనుబొమ్మలను ఒక్కింత కూడా ముడివేయకుండా నుదుటిమీద పల్చగా ఏర్పడిన ముడతలను చూసింది. కళ్ళు ఇరువైపులా, పెదవుల అంచులో దూరం నుంచి ఎవరూ చూడలేని లేత నాజూకు గీతలు. ఒక్కింత కూడా వెలుతురు లేని నిస్తేజమైన కళ్ళు. మొత్తం ముఖం మీద చర్మానికి అంటుకుని, కనీ కనిపించనట్టున్న చిన్నచిన్న గుల్లలు. పై పెదవి అంచులో ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నట్టు కనిపించే లేత మబ్బులాంటి గోధుమరంగు జుట్టు, ముప్ఫయి దాటిన తర్వాత ఇది సహజమా? ఆమెకు అర్థం కాలేదు. ‘‘ముప్ఫయి దాటిన తర్వాత స్త్రీ శరీరంలో కలిగే మార్పులు’’ అని గూగుల్లో వెతకటానికి ఫోన్‌ ‌కోసం చూపులు సారించింది.

ఒక విధంగా చూస్తే మనుకు సుఘోష్‌ ‌గురించి ఏ విధమైన అభ్యంతరాలు లేవు. విచిత్రం ఏమిటంటే అతను కంటి ముందు లేనప్పుడు ఇప్పటికీ ఆమెకు ఐదవ తరగతిలోని ఆ చిన్నారి సహధ్యాయుడైన కుర్రవాడే కళ్ళ ముందుకొస్తాడు. మొదటి బెంచ్‌ ‌గోడ అంచు చివర నుంచి మెల్లగా సిగ్గుపడుతూ నడిచి అతను బోర్డు మీద సుజాత టీచర్‌ ‌చెప్పిన ప్రాబ్లమ్‌ను పరిష్కరిస్తూ ‘2’ అనే అంకెను ప్రత్యేకంగా రాయడమే కళ్ళు ముందుకొస్తుంది. పాఠశాలలో ఒక్కసారి కూడా తల ఎత్తకుండా, కుర్రవాళ్ళ గుంపులో చేరకుండా, దేని నుంచో తప్పించుకోవాలన్నట్టు, నిరంతరం పుస్తకంలో మునిగివుండేవాడు. ఆ సన్నటి కుర్రవాడే ఇప్పుడు రాత్రి దీపాన్ని ఆర్పకుండా కంటి చివరి నుంచి బాణంలాంటి చూపును నాటి, అరుదైన తన ఆత్మవిశ్వాసంతో ఆమె మొత్తం దేహాన్ని నఖశిఖపర్యంతం ఆవరించి ముద్దులు పెడతాడంటే ఆమెకు నమ్మడం కష్టం.

మను, ఆమె తమ్ముడు నవీన్‌, ‌వారి తల్లి హర్షమణి ధారవాడలోని తాత ఇంటి నుంచి గొడవపడి హుబ్లీలోని సాయినగర్‌ ‌కు వచ్చి నివసించడానికి ముందు మను చదివింది ధారవాడలోని బాసెల్‌ ‌మిషన్‌ ‌ప్రాథమిక పాఠశాలలో. అప్పట్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు సుఘోష్‌ ఆమె సహవిద్యార్థిగా ఉన్నాడు. తర్వాత హుబ్లీ మహిళా విద్యాపీఠంలో మను బి.ఎ. ఫైనల్‌ ‌చదువుతున్నప్పుడు ప్రారంభమైన ఫేస్‌బుక్‌ అనే ఆధునిక మాయా లోకంలో పాత సహవిద్యార్థులందరూ దొరికినప్పుడు సుఘోష్‌ ‌మళ్లీ మాయలా దొరికాడు.

ఆమెతో చదువుకున్న వందలాది సహ విద్యార్థులలో ఒక్కడైనా సుఘోష్‌ ‌వ్యక్తిత్వం చివరి వరకూ అపరిచితంగానే మిగిలిపోవడానికి కావాలంటే మను దగ్గర అనేక అవకాశాలు వెతికితే దొరికే చేతికి అందుబాటులోనే ఉన్నాయి. బెంగళూరు పెసిట్‌లో ఇంజనీరింగ్‌ ‌మూడవ సంవత్సరం చదువుతున్న సుఘోష్‌ ‌హుబ్లీ కాలేజీలో బి.ఎ. చదువుతున్న మనును ఒక్కసారి కూడా కలవకపోవటానికి ఈ లోకంలో కావలసినన్ని సమర్ధనలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌ అనే ఈ మాయవంతెన ఒకటి సకాలంలో జన్మించి ఈ ఇద్దరి మనసులను కలపకపోయి ఉంటే సుఘోష్‌, ‌మను ఇద్దరూ పరస్పరం ఒకరికొకరు కేవలం పేర్లుగా, బాల్యంలో ఎప్పుడో కలిసి మసక బారిన జ్ఞాపకాలుగా కార్యక్రమంగా పరస్పరం అస్తిత్వాన్ని మరిచిపోయే రెండు ప్రత్యేకమైన బిందువులుగా అయిపోయేవారో ఏమో అని మనుకు చాలా సార్లు అనిపిస్తుంది.

మను డిగ్రీ ముగించటం, ఆమె తల్లి హర్షమణి పది సంవత్సరాల నుంచి పని చేస్తున్న హుబ్లీ నగరంలోని ‘రాక్‌వుడ్‌ ఇం‌టర్నేషనల్‌’’ అనే స్టార్‌ ‌హోటల్‌ ‌లెఫ్ట్ ‌వింగ్లో రిసెప్షనిస్ట్‌గా చేరినప్పుడు నెల చివరన చేతికి వస్తున్న ఆరున్నర వేల రూపాయలు ఆమెకు చాలా పెద్ద మొత్తంగా అనిపించేది. పెదవులకు లేత గులాబీ రంగు పూసి ‘దిస్‌ ‌వే సార్‌’, ‘ఎస్‌ ‌మ్యామ్‌’, ‘‌హ్యావ్‌ ఏ ‌గ్రేట్‌ ‌డే గైస్‌’’ అం‌టూ మను ఈ పనిలో తర్వాతి ఆరు సంవత్సరాలు కాలం గడిపింది. అదే సమయంలో సుఘోష్‌ ‌పెసిట్లో ఇంజనీరింగ్‌ ‌ముగించి, రెండు సంవత్సరాలు విప్రో అనే కంపెనీలో పనిచేసి, తర్వాత అమెరికా స్యాన్‌ ‌హోసె విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌. ‌ముగించి చిన్నచిన్న ఇంటర్న్‌షిప్‌ల తర్వాత ఇప్పుడున్న ‘స్ట్రాసస్‌ ఇన్వెస్టర్స్’‌లో ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రులు లేకుండా పెదనాన్న ఇంట్లో పెరిగిన సుఘోష్‌కు ఆ ఫేస్‌బుక్‌ ‌ప్రేమ ప్రయాణం ఆకర్షణీయంగానే ఉంది. సంబంధాల్లో ఏమి వెతకాలన్నదే తెలియని తొందరలో మరుసటి సంవత్సరం సుఘోష్‌ ‌భారత్‌కు వచ్చినప్పుడు ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు.

సుఘోష్‌ ‌స్నేహితుల భార్యలు అమెరికాకు వచ్చి ఒకటి రెండు సంవత్సరాలలో ఎమ్మెస్‌ ‌ముగించి, ఏదో కంపెనీలో పనిచేస్తూ వీకెండ్‌ ‌పార్టీలో, డిన్నర్లలో మనూ తయారుచేసిన పాలక్‌ ‌కూర కబాబులను నములుతూ, ‘సో వాట్‌ ‌డు యు డు?’ అని తమ నాజూకైన లేసుబ్రా పట్టీలు కనిపించేలా ధరించి భుజాల వరకు కత్తిరించిన మృదువైన జుట్టును తడుముతూ అడిగినప్పుడు మాత్రం మనుకు సమస్యగా

ఉండేది. అప్పుడంతా ఆమెకు వాళ్ల లేసుబ్రా పట్టీలా ఆకర్షణీయంగా ఉన్న వారి బి.ఇ. , ఎం.ఎస్‌. ‌డిగ్రీల ముందు తాను హుబ్లీ మహిళా విద్యాపీఠంలో చదువుకున్న బి.ఎ.డిగ్రీ -ఎకానమిక్స్, ‌హిస్టరీ-పొలిటికల్‌ ‌సైన్స్ ‌విషయాలు ఆడంబరమైన మాటల మధ్యలో, అకస్మాత్తుగా కదిలే ప్రమాద రహితమైన అబద్ధాల్లా గోచరిస్తాయి. డిగ్రీ చివరి సంవత్సరం ఎకనామిక్స్ ‌సబ్జెక్టులో అత్యంత ఎక్కువ మార్కులు పొందినందుకు గాను దొరికిన 270 రూపాయల పారితోషకమూ, దాని వెనుక ఆమె తల్లి హర్షమణి కళ్ళల్లో తొణికిన గర్వపు కన్నీటి బిందువులు గుర్తుకొచ్చి గొంతు మూగబోయేది.

‘వెల్‌, ఐ ‌యామ్‌ ఏ ‌రైటర్‌’’ అని కళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ పెద్ద కంఠంతో చెప్పేటప్పుడు చంకల్లో, తొడ సందుల్లో కాస్త చెమర్చడం అర్థమై కాలి వేళ్ళు అదిరినట్టు అనిపించింది. ఒకటి రెండు కన్నడ పత్రికలలో ఆమె ఒకిన్ని మినీ కవితలు ప్రచురింపబడటం వల్ల ప్రస్తుతం తానూ ఒక కవయిత్రి అని సంకోచం లేకుండా చెప్పుకోగలదు. ఆ స్నేహితులు ‘‘రైటర్‌! ‌యూ మీన్‌ ఇన్‌ ‌ద బ్యాంక్‌?’’ అని అడిగినప్పుడు చప్పున ఎవరో ముఖానికి నీళ్లు విసిరినట్టు అనుభవమైంది. ‘‘నో, ఐ మీన్‌, ఐ ‌రైట్‌ ‌పోయెమ్స్ ఇన్‌ ‌కన్నడ’’ అనే మాటలు ఆమె గొంతు నుంచి అవునో కాదో అన్నట్టు దొరిలాయి.

మను ఆ మాత్రం చెప్పటమే సుఘోష్‌ ఎక్కడున్నా ఆమె సహాయానికి పరుగున వస్తాడు. తన పొడవైన మాయా వేళ్ళల్లో కళాత్మకంగా చెక్కిన నైపుణ్యం ఉన్న వైన్‌ ‌గ్లాసును దృఢంగా పట్టుకొని అతను మాటలకు దిగితే ఎదుట ఎవరు ఉన్నప్పటికీ అతని మాటలకు లొంగ వలసిందే, అలా ఉంటుంది అతని తీరు. ఈ కళనూ అతని ఉద్యోగ ట్రైనింగే కరుణించి ఉండాలని మను అనుకునేది.

రచయితలకు ‘లీజర్‌’ అం‌టే విరామం ఎంత ముఖ్యమో అని మొదలైన అతని వాదన ఎక్కడెక్కడో తిరిగి రచయితలు జగత్తుకు ఎందుకు కావాలో అనే వరకూ అతని ఏకముఖ వాదనామాలను అతని స్నేహితుల భార్యలు సుఘోష్‌ అభిప్రాయంతో ఏకీభవించి మెచ్చుకున్నారు. అతని పొడవైన వేళ్ళు, విశాలమైన ఛాతీ, చక్కటి శరీర నిర్మాణం, అతను ఉన్నదానికన్నా కాస్త పొడుగైన ఆకారాన్ని అతనికి కల్పించింది. మాటలు మొదలైన ఐదు నిమిషాల్లో సుఘోష్‌ ఈ అల్లరి మూకకు రచన ఎలా ఉదాత్తమైన కార్యమో, అందులోనూ భారతీయ ప్రాంతీయ భాషలలో రాసేవారు ఎలా రచనను వృత్తిగా అనుకోరనీ, ఆ కారణంగా రచయితలకు దొరికే స్వాతంత్రమే ముఖ్యమనీ వివరించడానికి చాలా ప్రయాసపడినట్టు మనుకు అనిపిస్తుంది. రాసిన నాలుగు మినీ కవితల కారణంగా తనను కన్నడలో ముఖ్య సాహిత్యవేత్తతో పోలుస్తున్నాడుకదా అని మను లోలోపల కలవరపడింది. తర్వాత కొన్ని నిముషాల్లో ఆ గుంపు సంభాషణ కన్నడ సాహిత్యం నుంచి హెచ్‌- ‌వన్‌ – ‌బి వీసాకూ, గ్రీన్‌ ‌కార్డ్ అప్లికేషన్‌లకూ మరలటంతో కాస్త నిశ్చింతగా ఫీల్‌ అయింది

‘వాట్‌, ఇం‌త తొందరగా నాలుగు గంటలు అయిందా?’ అనుకుంటూ ముందుగానే మను పక్క నుంచి దూకింది. చాతి మీద నిర్దోషిలా పడిన మొబైల్‌ ‌చార్జింగ్‌ ‌ముగిసి ప్రాణం పోయినప్పటికీ ఆమె లేచిన తీరుకు తాను కలవరపడి నేల మీద పరిచిన కార్పెట్‌ ‌మీద పడింది. సాయంత్రం లేత ఎండకు కళ్ళను సర్దుకుంటూ మరొకసారి సరిగ్గా గడియారం చూస్తే సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలు చూపిస్తోంది. అంటే సుఘోష్‌ ఇల్లు చేరటానికి ఇంకా మూడున్నర గంటలు ఉన్నాయి.

‘ముప్పయి దాటిన తర్వాత శరీరంలో కలిగే మార్పులు’ అని ఇంటర్‌నెట్‌లో వెతకడం మొదలుపెట్టి ఒకదాని తర్వాత ఒక లింకును క్లిక్‌ ‌చేస్తూ ‘ముప్ఫయి అంటే ఇప్పటి కొత్త ఇరవై, ఎందుకు?’, ‘ముప్ఫయి తర్వాత మనశ్శాంతిని కాపాడుకోవడం ఎలా?’’, ‘మనశ్శాంతికీ బాల్యానికీ సంబంధం ఉందా?’, ‘మీరు తొంభైయవ దశకంలో బాల్యాన్ని గడిపివుంటే ఈ విషయాలు మీకు గుర్తుంటాయి’, ‘ప్లాస్టిక్‌ ‌సర్జరీ చేయించుకున్న ఇప్పటి ప్రముఖ నటీమణులు ఎవరు?’, ‘దీపికా పదుకొనే చర్మపు మెరుపు గుట్టేమి?’, ‘క్లియోపాత్ర అదొక్క గుట్టును లోక దృష్టి నుంచి ఎలా కాపాడుకుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ ‌చేయండి’… ఇలా ఆలస్యం చేయకుండా ఇంటర్‌నెట్‌ ‌సమకూర్చిన లింకులన్నీ వెతుకుతూ చివరికి ఎక్కడినుంచి మొదలు పెట్టిందో, ఇక్కడికి ఎలా వచ్చి చేరిందో మను మరిచిపోయింది. చివరికి ‘క్లియోపాత్ర సౌందర్య రహస్యం ఈబంకమట్టిలో ఉంది’ అనే పోస్ట్ ‌చదివేటప్పుడు చాలా సేపు మొబైల్‌ను చూసిన కళ్లకు విశ్రాంతి కావాలనిపించి అక్కడే కళ్ళు మూసుకుంది.

ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ఇంటి దగ్గరి గ్రంథాలయానికి వెళ్లాల్సి ఉంది. ఒక సంవత్సరం నుంచి ఈ పబ్లిక్‌ ‌లైబ్రరీలో మను ‘వాలంటీర్‌’‌గా పనిచేస్తుంది. అంటే చీఫ్‌ ‌లైబ్రేరియన్‌ ‌లిఝ్‌ అని పిలిపించుకునే ఎలిజబెత్‌ ‌చెప్పిన పనులను చేసి పెట్టడం. రీడర్స్ ‌తిరిగి ఇచ్చిన పుస్తకాలను కబోర్డ్‌లలో పేర్చి పెట్టడం, చిరిగిపోయిన బైండ్‌ ‌పుస్తకాల సంఖ్యను లేడ్జర్లో రాసి పెట్టడం మొదలైన చిన్న చిన్న పనులను చేసేది.

మంచానికి సరిగ్గా వెనుక ఉన్న, ఎప్పుడూ బ్లైండ్‌ ‌వేసిన కిటికీలోంచి తొంగి చూసింది. అప్పుడే పాఠశాల వదిలిన పిల్లలను వెనుకనున్న జేబీసీట్లలో కూర్చోబెట్టుకుని ఉద్యోగస్థులైన ఇద్దరు తల్లులు కారు దిగ•ం చూసింది. తన ఇద్దరు పిల్లలను దింపుకున్న నీలం రంగు కారు స్త్రీ ముఖం ముందే కనిపించిన నల్లకారు స్త్రీకి ఇష్టం లేని మనసుతోటే కాస్త పెదవి వంకర చేసి ‘హలో’ చెప్పటం కనిపించింది. ఇలాంటి వేగవంతమైన రోడ్లలో నిశ్చింతగా కారు నడుపుకుంటూ వెళ్లే ఆడవాళ్లను చూస్తే మనుకు కడుపులో నిప్పులు పడ్డట్టు అవుతుంది. అయితే వెంటనే హుబ్లీ దాజీబాన పేట సందుగొందులలో చిన్న మారుతి 800 కారును తాను నడపడం గుర్తుకొస్తుంది.

లేత ఆకుపచ్చ ఫ్రాక్‌ ‌ధరించిన నల్ల కారు స్త్రీ ఒక చేత్తో బిడ్డను ఎత్తుకొని, ఇంకొక చేత్తో ఒక పెద్ద పాల క్రేటిన్‌ ‌పట్టుకొని మను కిటికీ కనుచూపుమేరలో నెమ్మదిగా మాయమైంది. ఎందుకో మను ఒంట్లో మెరుపు సంచరించినట్లయింది. టీవీ టేబుల్‌ ‌మీద సుఘోష్‌ ‌పెట్టిపోయిన కారు కీని చూసి కారు నడపాలనే కోరిక తీవ్రమైనప్పటికీ ఆపుకుంది.

మరుక్షణమే మనసు మార్చుకుని జుట్టుకు ఒక బో పెట్టుకొని జీన్స్ ‌తోడుక్కొని కారు కీతోపాటు ఇంటి కీ కూడా తీసుకొని బయటికి నడిచింది.

ఆరున్నరకు మను ఇంటికి తిరిగొచ్చినప్పుడు చిన్నగా ఈలవేస్తోంది. ఈరోజు మొదటిసారి ఈ పరదేశంలో స్వతంత్రంగా కారు నడిపే ఉద్వేగంలో ఉదయం నుంచి మనసును ఆవరించుకున్న డత్వమంతా కరిగి తేలికైంది. షవర్‌లో తలస్నానం ముగించుకుని వచ్చిన ఆమెకు ఒక్క క్షణం రాత్రి వంటకు ఏమీ చేయాలి అనే ఆలోచన కమ్ముకొని వెనకటి రోజు థా చేసి పెట్టిన చికెన్‌ ‌గుర్తుకొచ్చింది. వెంటనే సుఘోష్‌కు బిర్యానీ ఎంత ఇష్టమో అనే విషయమూ గుర్తుకొచ్చింది.

సరిగ్గా ఏడున్నరకు ఎప్పటిలాగే సుఘోష్‌ ఇం‌టి కీ తీసి లోపలికి కాలు పెట్టినప్పుడు బిర్యాని వాసనలు ఇల్లంతా పల్చటి మబ్బులా ఆవరించింది. పరస్పరం ‘హాయ్‌’ ‌చెప్పుకున్నప్పటికీ ఇద్దరూ ఎందుకో చూపులు తప్పించడం ఇద్దరి దృష్టికీ వచ్చింది. అతను కళ్ళముందే లేనప్పుడు పుట్టుకొచ్చే విసురు మాటలన్నీ అతను ముందుకు రాగానే కరిగిపోతాయి. అతని ముగ్ధమైన చూపుకు మనసు నిండిపోతుంది. అలాగే కరిగిపోతుంది. బహుశా అతనికీ తన పట్ల అదే విధంగా అనిపించివుండొచ్చని అనుకుంది మను. లేదా అలాగే అనిపించాలని ప్రార్థించింది.

‘‘చాయ్‌ ‌చేస్తాను’’ అని సోఫా నుంచి లేచిన ఆమెకు చాలాసేపటి నుంచి ఏమీ మాట్లాడకుండా ఉండటం వల్ల గొంతు కాస్త బిగుసుకుపోవటం దృష్టికి వచ్చింది. బాల్‌ ‌పాయింట్‌ ‌పెన్నుతో రాసిన మొదటి అక్షరాన్ని పెన్ను ఏర్పరిచిన తర్వాత ఇంకొకసారి దిద్దినట్టు ‘చాయ్‌’ అని ఇంకోసారి అంది. ‘‘మ్యాగీ కూడా చేయనా?’’ అని అడగడంతో ‘‘ఆఁ థాంక్స్’’ అని జవాబు వచ్చింది.

మళ్లీ ఇదే మౌనం నాలుగు రోజులు కొనసాగుతుందని మనుకు బాధ కలిగింది. ఆ వాక్యం మనసులో ఏర్పడడానికి ముందే సుఘోష్‌ ‌లోపలికి వచ్చి భుజాలు కదిలించాడు బాణలి నిండా ఉన్న చక్కటి బిర్యాని కూడా అతని ఈ క్రియకు కారణం కావచ్చునేమోనని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారిగా మనూతో చూపులు కలపడానికి అతను సిగ్గుపడ్డాడు. ఎలక్ట్రికల్‌ ‌స్టవ్‌ ‌వైపు తిరిగిన మను ముఖాన్ని మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఆమె ముఖం మీద ఉన్న ‘ఆ ఒక విధమైన’ భావం ఇప్పుడు లేకుండా కరిగిపోయి ఉండటం గమనించి తన పట్టును మరింత బిగువు చేశాడు.

ఇంకొన్ని క్షణాల్లోనే తాను ఒంటరిగా కారు నడుపుకొని లైబ్రరీకి వెళ్ళిన సంఘటనను చెప్పినప్పుడు ఇతను ఒక్కసారిగా కోప్పడకుండా ఉండాలి దేవుడా అని మను అతని నిమీలిత కళ్ళల్లోకి తన్మయత్వంతో చూస్తూ ప్రార్థించింది.


కన్నడ రచయిత్రి గురించి
కావ్య కడమె
కడమె కన్నడసాహిత్యంలో యువ కథకుకురాలు, నవలాకారిణి, కవయిత్రి, నాటకకర్త. ఉత్తర కన్నడ జిల్లాలోని కడమెకు చెందినవారు. డిగ్రీ తర్వాత కర్నాటక విశ్వ విద్యాలయం నుంచి జర్నలిజంలో ఆరుబంగారు పతకాలతో ఎంఎ. పట్టా అందుకున్నారు. 2013 అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్నారు.
కావ్యకడమె ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం లభించింది. యువరచయితలకు ఇచ్చే టోటో పురస్కారం, గుల్బర్గా జిల్లా సేడం ‘అమ్మ పురస్కారం, బేంద్రె గ్రంథ బహుమానం, రత్నమ్మ హెగ్గడె గ్రంథ బహుమానం, కడంగొడ్లు కావ్య పురస్కారం, దినకర కావ్య పురస్కారం, సాహిత్య పరిషత్‌ కాకోళ సరోజమ్మ దత్తి , నీలగంగా దత్తి , నాటక అకాడెమి పురస్కారాలు లభించాయి

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

రష్యన్ కథ : మాస్క్

Next Post

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Next Post
2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Discussion about this post

ఈ సంచికలో…

  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com