ఒక్కప్పటి సమాజంలో, ఎంతోమందిలో ఉండిన; ప్రస్తుత ఆధునిక సమాజంలో లోపిస్తున్న లక్షణం కృతజ్ఞతతో ఉండటం!
కృతజ్ఞతా భావం అనేది ఒక చిన్న కాంతి లాంటిది, అది జీవితంలోని చీకటి కోణాలను కూడా వెలిగిస్తుంది. “If you want to find happiness, find gratitude.” అని అంటారు Steve Maraboli.
కృతజ్ఞతా భావం ఒక సాధారణ అలవాటు మాత్రమే కాదు, అది మన మనుగడకు ఎంతో అవసరమైన ఒక శక్తివంతమైన మానసిక ఆయుధం.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బు, పదవి, విజయం కోసం నిరంతరం పరిగెడుతున్నారు. ఈ పరుగు పందెంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి. మనం కృతజ్ఞతతో ఉన్నప్పుడు, మన మెదడు నెగటివ్ ఆలోచనల నుండి బయటపడి, మనకు ఉన్న మంచి విషయాలపై దృష్టి పెడుతుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల వల్ల నేటి తరం ఇతరుల జీవితాలతో తమను తాము ఎక్కువగా పోల్చుకుంటున్నారు. ఇతరుల విలాసాలు చూసి, “నాకు ఇది లేదు, అది లేదు” అని బాధపడే స్థితిలో సమాజం ఉంది. కృతజ్ఞతా భావం మనకు ఉన్నదాన్ని గౌరవించడం నేర్పుతుంది. ఇది మనల్ని ఇతరులతో పోల్చుకునే అలవాటును దూరం చేస్తుంది.
ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య ప్రత్యక్ష బంధాలు తగ్గిపోయి, డిజిటల్ బంధాలు ఎక్కువయ్యాయి. చిన్న స్వార్థాలకే బంధాలు విడిపోతున్నాయి. మన జీవితంలో భాగమైన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా సహోద్యోగులకు మనం కృతజ్ఞత (Thank you) చెప్పినప్పుడు, వారి మధ్య నమ్మకం, గౌరవం పెరుగుతాయి. బంధాలు మరింత బలంగా మారతాయి.
నేటి సమాజంలో “నాకేంటి?” అనే స్వార్థం పెరిగిపోతోంది. అలాంటి వాతావరణంలో ఎవరైనా చేసిన చిన్న సహాయాన్ని గుర్తించి, వారికి కృతజ్ఞత తెలపడం వల్ల సమాజంలో ఒక మంచి మార్పు మొదలవుతుంది. మన కృతజ్ఞత ఎదుటి వ్యక్తిని కూడా మరింత మంచి పనులు చేసేలా ప్రోత్సహిస్తుంది.
సైన్స్ ప్రకారం, ఎవరైతే ప్రతిరోజూ కృతజ్ఞతతో ఉంటారో వారిలో ‘డోపమైన్’, ‘సెరోటోనిన్’ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు రాత్రి పూట మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
దాదాపుగా ఇటువంటి అంశాలనే ప్రస్తావిస్తూ, మనుషులలో రావల్సిన మార్పులను ఆశిస్తూ, ధనంజయ లక్ష్మి రామకృష్ణ; నేహా నలినా లోకేష్ సంయుక్తంగా, ఆంగ్లంలో ‘The Eternal Gift’ అనే పుస్తకం వ్రాశారు. సమాజానికి మంచి చేయాలనుకున్న తమని మోసం చెయ్యటం, అవమానించాలని చూడడం, తాము స్థాపించిన సంస్థకి చెడ్డపేరు తేవడం ఇవన్నీ సహిస్తూ, మనుషుల్లో తమపై, తమ సంస్థపై నమ్మకం కలిగించుకోడానికి ప్రయత్నించారు ధనంజయ్.
ఈ పుస్తకం ఒక Gratitude Journal. ‘ఎవ్రీ ఫ్యామిలీస్ స్టోరీ’ (ప్రతి కుటుంబం యొక్క కథ) అనే శీర్షికతో వచ్చింది. మన జీవితానికో ఆకృతినిచ్చిన వ్యక్తులను గౌరవించడానికి, జ్ఞాపకాలను భద్రపరుచుకోవడానికి, జీవితంలో లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్నవాటికి కృతజ్ఞత చూపడం ఎలాగో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇందులో 26 నిజ జీవిత కథలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంకా కుటుంబంలా మారిన తోటి ఉద్యోగుల గురించి ఈ కథలలో చెప్పారు. ప్రస్తుతం ఈ పుస్తకం ఇంగ్లీష్, కన్నడ, తెలుగు భాషలలో అందుబాటులో ఉంది.
ఈ పుస్తకం తెలుగులో ‘కృతజ్ఞతలతో మీవాడు’ అనే పేరుతో అనువాదమైంది. ప్రముఖ రచయిత, అనువాదకులు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి ఈ పుస్తకాన్ని అనువదించారు.
“ఇందులోని పాత్రలేవీ కల్పితాలు కావు. మన మధ్యనే తిరిగినవారు. తిరుగుతున్నవారు. ధీరహితైషులై మనల్ని తమ వెంట తిప్పుకుంటున్నవారు. ఇందులోని రామన్నా, లలితమ్మా, రాధమ్మా, లక్ష్మీదేవమ్మ, మొదలనవాళ్ళే కాదు, వడ్డీ వ్యాపారస్థుడైన మీసాల సేఠు గారు కూడా తన పరిధిలో కృతజ్ఞలు ప్రకటించి మనల్ని గ్లోబల్ విలేజ్ నించి మళ్ళీ వసుధైక కుటంబంలోకి తీసుకువస్తారు. అందుకే ఈ పుస్తకం చదవాలి.” అన్నారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తమ ముందుమాటలో.
![]()
నాగార్జున అనే వ్యక్తి తన అన్న కొడుకు అభిమన్యుతో కలసి బెంగళూరు నుంచి కాశీకి రైలు ప్రయాణం చేస్తూ తనని ప్రభావితం చేసిన తమ కుటుంబంలోని వ్యక్తుల గురించి, ఇతరుల గురించి సంభాషిస్తాడు. కొందరు వ్యక్తులు, వారి నుండి తాను తన కుటుంబం పొందిన సహకారం, కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు, సర్దుకుపోవడాలూ తదితర అంశాలను రచయిత నాగార్జున పాత్ర చేత ఒక్కో అధ్యాయంలో చెప్పిస్తారు.
మొదటి కథలో నాగార్జున తమ తల్లి గురించి అంటే అభిమన్యు నానమ్మ గురించి చెప్తాడు. ఆమె ఎన్ని కష్టాలు పడినా, పిల్లలకి ఆత్మగౌరవం అలవడేలా చేసిందని చెప్తాడు. “గతాన్ని తవ్వుకుంటున్నప్పుడు హఠాత్తుగా ఖాళీలు ఏర్పడతాయి. వాటిని పూరించగలిగేది మౌనం మాత్రమే” ఇది ఈ కథలో నాకు బాగా నచ్చిన వాక్యం.
తర్వాతి కథలో తన తండ్రి గురించి చెప్తాడు నాగార్జున. తను తండ్రిని ఎంతగా అపార్థం చేసుకున్నాడో చెబుతాడు. తన తండ్రి ఔదార్యాన్ని తాను గ్రహించలేదని చెప్తాడు.
తర్వాతి కథలో నాగార్జున తన అన్న బాబన్న గురించి అంటే అభిమన్యు తండ్రి గురించి చెప్తాడు. అందరితోనూ స్నేహసంబంధాలని పటిష్ఠంగా ఎలా నిర్మించుకోవాలో బాబన్న నుంచి నేర్చుకోవాలని చెప్తాడు. అమ్మ ఫిల్టర్ కాఫీ, నాన్న షుగర్‍లెస్ సూపర్ స్ట్రాంగ్ కాఫీ అయితే, బాబన్నయ్య దాన్నైనా దీన్నైనా వేడి తగ్గకుండా రుచి చెడకుండా కాపాడే ఫ్లాస్క్ లాంటివాడని చెప్తాడు.
తర్వాతి కథలో తన బాబాయి కొడుకు శేషన్న గురించి చెప్తాడు నాగార్జున. శేషన్న ఒంటరితనాన్ని పోగొట్టే ప్రయత్నంలో తాను తన ఒంటరితనాన్ని పోగొట్టుకున్నానని చెప్తాడు నాగార్జున. ఈ కథలోని ఒక చక్కని వాక్యం: “ఏటినీళ్ళు ఏటికే అర్ఘ్యమిచ్చినట్లు, తన డబ్బులతో తనకే స్వీటిచ్చాను.” శేషన్న తనకి చదువులో ఎలా సాయం చేసిందీ, తన ప్రవర్తనని ఎలా మార్చిందో చెప్పుకొస్తాడు. “దేన్నైనా బాధ్యతగా భావిస్తే అందులో ప్రేమాభమానాలుండవు. దాని పట్ల ఏ భావనలూ పెట్టుకోకుండా మన పని మనం చేసుకుపోతుంటే భావనలూ, ప్రేమాభమానాలూ వాటంతట అవే వచ్చి అందులోకి చేరతాయి” – ఇదీ శేషన్న నాగార్జునకి చెప్పకనే చెప్పిన పాఠం! స్టేటస్ గురించి శేషన్న అభిప్రాయం తెలుసుకుంటే, మనమూ ఆయన అభిమానులం అవుతాం – “స్థాయి అంటే మెయిన్‌టెయిన్ చేసేది కాదు, మెయిన్‌టెయిన్ అయ్యేది. దాన్ని మనం పాడు చెయ్యకుండా ఉంటే, అదే మనల్ని బాగు చేస్తుంది.”
ఇక తరువాత రెండు అధ్యాయాలలో నళిని అక్క గురించి, లోకేశ్ బావగారి గురించి చెప్తాడు. అక్కాబావలిద్దరూ గొప్ప సహనమూర్తులు. అక్క ఒక రకమైన సహనాన్ని, కరుణని ప్రదర్శిస్తే, బావగారు మరో రకమైన సహనాన్ని, స్థితప్రజ్ఞతని ప్రదర్శస్తారు.
తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడిన జయరామిరెడ్డి గారి చెబుతూ, “మనం ఏమిస్తే మనకి అదే లభిస్తుందనేది పెద్దల వాక్యం. దానికి తిరుగులేని సాక్ష్యం జయరామిరెడ్డిగారు” అని అంటారు. నాగార్జున తండ్రిగారికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి ఆయన. ఈ కుటుంబాన్ని ఎన్నో విధాలుగా ఆదుకున్నారు, కుటుంబ సభ్యులందరూ ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటారని చెప్తాడు.
“నిజమైన సంపద డబ్బు కాదు, స్నేహం. అందరినీ స్నేహితుల్లా చూడడం అందరికీ సాధ్యం కాదు. అందులోనూ మన మీద ఆధారపడి జీవించేవాళ్ళని మనతో సమానం చూస్తూ స్నేహం చెయ్యడానికి అహం అడ్డొస్తుంది. ఆ అహాన్ని జయించినవారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి చంద్రశేఖర రావు గారు” అంటూ ఆయనకీ, తన తండ్రికీ స్నేహమెలా కలిసిందో చెప్పి, ఆయన తమకెలా మేలు చేసినదీ చెప్తాడు నాగార్జున. నిజంగా గొప్ప వ్యక్తి చంద్రశేఖర రావుగారు. “కృతజ్ఞత అనేది అప్పులాగా తీరిస్తే తీరిపోయేది కాదు, డి.ఎన్.ఎ. లాగా ఒకరి నుండి ఒకరికి అందివచ్చేది. అదే మనం అందిపుచ్చుకోవలసింది” అంటాడు నాగార్జున.
అలాగే, 1973లో నాగార్జున తండ్రికి టైఫాయిడ్ వచ్చి ఆసుపత్రిలో చేరినప్పుడు అక్కడి నర్స్ లక్ష్మి, పాలు అమ్మే రామన్నగారు, అమ్మకి బస్సు డబ్బులిచ్చిన వెంకటేశ్ గారు, చిన్నప్పటి ముస్లిం స్నేహితురాలు, గీతక్క గురించి చదువుతుంటే కళ్ళు చెమరుస్తాయి.
తరువాత నాగార్జున తన నాల్గవ మేనమామ అయిన నాగన్న గారి గురించి చెప్తాడు. ‘చదువుకున్నవాదికి చదువొక్కటే జీవనాధారం అనే భ్రమలు ఏర్పడుతాయి. కానీ చదువు ఆపేసినవారి జీవనాధారాలకి అంతే ఉండద’ని నిరూపించిన వ్యక్తి నాగన్న. ఆయన చదువెందుకు ఆపేశారో, కుటుంబానికి ఏ రకంగా ఆధారమయ్యారో, ఎందుకు ‘వెర్రినాగన్న’ అని అనిపించుకున్నారో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది.
పిత్రార్జితం అంటే ఏమిటో నాగార్జున చాలా గొప్పగా వివరిస్తాడు అభిమన్యుకి ఒక కథలో, తన తాతయ్య కిట్టన్న గురించి చెబుతూ. “నేర్చుకుంటే రాని పని లేదు, చేస్తే కాని పని లేదు” అనేది ఆయన పాటించిన కర్మసూత్రం అని తెలిసినప్పుడు పాఠకులకు కూడా ఆయనపై గౌరవం రెట్టింపు అవుతుంది. మనుషుల్లోని మనిషితనాన్ని కాపాడుకోవడం కోసమైనా మన పెద్దవాళ్ల గురించి తెలుసుకోవాలని చెప్తారు రచయిత ఈ కథలో. రియలిస్టిక్ లైఫ్ నుంచి మెటీరియలిస్టిక్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్న ఆధునిక తరం పిల్లలు ఆలోచించవలసిన విషయాలనెన్నో ఈ కథ చెబుతుంది.
కిట్టన్న గారి భార్య రాధమ్మ గారిదీ గొప్ప కథే. “మనం లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఉన్నప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవీ ప్రాబ్లమ్సే కావు” అని నిరూపిస్తూంది ఆవిడ కథ.
1973 నాటి కరువు కాలంలో తమ కుటుంబాన్ని ఆదుకున్న మునియమ్మ గురించి మరో కథలో చెబుతాడు నాగార్జున. కల్లుగీత కులవృత్తి అయిన మునియమ్మ – స్త్రీ ఆత్మగౌరవానికి గొప్ప ఉదాహరణగా నిలిచిన వైనం స్ఫూర్తిదాయకం.
లలితమ్మగారి కథ చెబుతూ, మనం మన పెద్దల నుంచి నేర్చుకొవాల్సిన గొప్ప గుణం కృతజ్ఞతాభావమని, దాన్ని పోగొట్టుకుంటే మన ఆత్మని పోగొట్టుకున్నట్లే అని వ్యాఖ్యానిస్తాడు నాగార్జున.
తమ పట్ల జాలీ దయా చూపించకపోయినా, వినమ్రత అనే అద్భుతమైన గుణాన్ని నేర్పిన మీసాలసేఠు గురించి చెప్తూ, “మనం గుర్తుంచుకోవాల్సింది ఉన్నవాటినే తప్ప లేనివాటిని కాదు” అంటాడు నాగార్జున, అభిమన్యుతో.
ప్రతిమ, పార్వతి, సంపంగి రామయ్య, రాజాసర్, విజయకుమార్ సర్, అరుణ మేడమ్, లలితాంటీ, రాజగోపాల్ సార్, వేణు పెదనాన్న, బరగూరు బామ్మ, ఉష – విక్రాంత్ వంటి వ్యక్తులు విలువల వారధులు. వాళ్ళ గురించి తెలుసుకోవడం.. వాళ్ళు నిస్వార్థంగా చేసిన మంచిపనులను తలచుకోవడం – మనం మరచిపోతున్న కృతజ్ఞతాభావాన్ని తిరిగి గుర్తుచేసుకోడాని సాయపడుతుందనలో సందేహం లేదు.
![]()
పుస్తకం చదవడం పూర్తి చేశాకా, మనమూ మన జీవితంలో ఇలాంటి వ్యక్తుల కోసం వెతుకుతాం! తప్పక కనబడతారు, స్ఫురిస్తారు. వారి మన పట్ల చూపిన ఔదార్యం గుర్తొస్తుంది, ఆ ఔదార్యాన్నే మనం ఇతరుల పట్ల చూపాలన్న సూచనా గోచరిస్తుంది. అదే కృతజ్ఞతకి అర్థం!
అనేక వ్యక్తిత్వ వికాస పుస్తకాల అసలైన సారం ఈ పుస్తకం!!
![]()
కృతజ్ఞతతో మీవాడు
ఆంగ్లం: ధనంజయ లక్ష్మీ రామకృష్ణ,
అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి,
ప్రచురణ: TK Ink Bangalore,
పేజీలు: 196,
వెల: ₹ 199/-
ప్రతులకు:
టోటల్ కన్నడ,
638, 31 స్ట్రీట్, 10th క్రాస్,
బి మెయిన్ రోడ్, జయనగర్ 4 బ్లాక్,
బెంగుళూరు – 560011.
ఫోన్: 080-4146 0325, 96861 52902
![]()
ఆన్లైన్లో:
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్‍పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.































