• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కథ : పిరికి పంద

పాలెపు బుచ్చిరాజు by పాలెపు బుచ్చిరాజు
March 10, 2026
in అనువాద కథలు
0
ఆంగ్ల కథ : పిరికి పంద

ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్
అనువాదం: పాలెపు బుచ్చిరాజు

వాళ్లకి రైల్లో ఫస్ట్ క్లాస్ కూపేలో రిజర్వేషను దొరికింది. మంచిదే అయింది. లేకపోతే ఇంత సామాను తో నానా అవస్థా అయేది. ఆల్బన్ వే ఒక పెద్ద సూట్ కేసు, హోల్డాలు ఉన్నాయి.  అవి కాక ఏన్ తాలూకు సరంజామా ఇంకా చాలా ఉంది. అన్నీ కలిపి ఇరవై అయిదు స్వరూపాలయ్యాయి. ఇంకా పెద్ద పెద్ద సామాను పేక్ చేసి, వేరే ట్రక్కులో ముందుగా ఏజంటు ద్వారా లండన్ కి పంపించి వేశాడు ఆల్బన్. మరి ‘సోందురా’ నుంచి వారు శాశ్వతంగా మకాం ఎత్తేస్తున్నారు. వాటిని లండన్ లో  స్థిర పడ్డాక తీసుకోవచ్చు. సామానంతా వచ్చాక, తన అలవాటు ప్రకారం పోర్టర్ కి బాగానే డబ్బు ముట్టజెప్పాడు ఆల్బన్. తరవాత పుస్తకాల షాపు వరకు వెళ్లి, అయిదారు మేగజైన్లు, నాలుగు వార్తా పత్రికలూ కొనుక్కొచ్చి, సీటు మీద పడేశాడు. 

అవన్నీ చూసి, “ఇన్ని పుస్తకాలు కొనడం అనవసరమేమో! మన ప్రయాణం ఒక గంట మాత్రమే కదా!” అంది ఏన్.

“తెలుసు. తెలుసు. అయినా ఇవి ఎలాగూ కొనాలనుకున్నాను. కొనేశాను.  ఇంతకాలం పాత న్యూస్ పేపర్లు చదివి, చదివి విసుగొచ్చింది. ఏ రోజు వార్తలు ఆ రోజు చదవడంలో ఉన్న ఆనందం వేరు. 

ఏన్ మరేమీ బదులు పలకలేదు. ఇంతలో సింగపూర్ నుంచి వారితో బాటే వచ్చిన ఒక జంట లోపలికి తొంగి చూశారు. వాళ్ళు లోపలకి వస్తారని ఆశించింది ఏన్. కాని వారు ముందుకు సాగిపోయారు. 

“హమ్మయ్య! గండం గడిచింది. వాళ్ళు ఇక్కడే బైఠాయిస్తారని భయపడ్డాను” అన్నాడు ఆల్బన్

“ఆ ప్రమాదం లేదు లే! ఇది ఇద్దరి కోసమే! అయినా ఈ సామాను చూశాక ఎవరలా సాహసించ గలరు?” అంది ఏన్

ఆల్బన్ తలుపు దగ్గర నిలబడి, విలాసంగా సిగరెట్టు తాగుతూ ప్రకృతిని తిలకించసాగాడు. రైలు బయల్దేరి వేగం పుంజుకుంది. ఎదురుగాలి జోరుగా వీస్తోంది. అతని మనసు ఆనందంతో గంతులు వేస్తోంది. మొహం మీదకి చిరునవ్వు వస్తోంది. ఆరడుగుల పొడగరి. నీటుగా డ్రస్స్ చేసుకున్నాడు. ఇరవైలు దాటే వయసు. ఇంకేం లోటు? 

2️⃣

అందుకే, పెళ్ళికి ముందు, “మీ ఆయన ఎలా ఉంటాడే? ” అని స్నేహితులు అడిగితే, ”హీరోలా ఉంటా”డని గర్వంగా చెప్పింది ఏన్. 

గాలి బాగా ఎక్కువగా ఉండడంతో, లోపలికి వ చ్చి తలుపులు మూసి, ఏన్ ప్రక్కనే కూర్చున్నాడు ఆల్బన్. “ట్రెయిను ఇంగ్లండు చేరుకునే సరికి ఆరూ పది అవుతుంది. మనం టాక్సీ తీసుకుని హోటల్ సవాయ్ కి వెళ్లేసరికి ఏడు గంటలు కావచ్చు. ఓ గంటలో స్నానాదికాలు ముగించుకుని, భోజనం చేసి హాయిగా నిద్ర పోవచ్చు. “ అంటూ ప్రక్కనున్న పేపర్లలో ఒకటి తను తీసుకుని, మరొకటి ఏన్ కి ఇవ్వబోయాడు. ఆమె వద్దని వారించింది. 

“ఏం? అలిసిపోయావా?” అడిగాడు ఆల్బన్.

“అబ్బే! అదేం లేదు. “ అంది ఏన్.

“మరీ సంతోషంతో మనసు నిండి పోయిందా? ఇంటికి వచ్చేస్తున్నామని?”

మౌనంగానే తల అడ్డంగా ఊపి సమాధానం ఇచ్చింది. ఆమెకు ఆట్టే మాట్లాడడం ఇష్టం లేనట్టుగా ఉంది. 

ఆల్బన్ వార్తా పత్రిక చదవడంలో మునిగిపోయాడు. ఏన్ కి తెలుసు. అతను తాజా వార్తలంటే చెవి కోసుకుంటాడని. ఇంతకాలం విసిరి పారేసినట్టున్న అడవుల్లో నివసిస్తూ, వార్తాపత్రికలకి మొహం వాచిపోయాడు. అలాంటిది, ఇంకా న్యూస్ ప్రింటు వాసన కూడా పోని క్రొత్త పేపరు దొరికితే వదిలి పెడతాడా! 

ఏన్ నిశ్శబ్దంగా కిటికిలోంచి బైటికి చూస్తూ కూర్చుంది. ఒకదాని వెంట ఒకటి స్టేషన్లు దాటుకుంటూ, రైలు పరుగులు తీస్తోంది. రైలు వేగం తగ్గి, పెద్ద పెద్ద మేడలు, భవంతులు కనిపించడంతో, ఏదో పెద్ద ఊరే వస్తోంది అనుకుంది ఏన్. మరో అయిదు నిముషాల్లో రైలు లండన్ స్టేషనులో ఆగింది. 

కిటికీ లోంచే పోర్టరు కోసం చెయ్యి ఊపాడు ఆల్బన్. రైలు పూర్తిగా ఆగాక, సామాన్లు ఒక్కొక్కటీ పోర్టరుకి అందించి తానూ క్రిందికి దిగాడు. ఏన్ దిగడానికి చేయి అందించాడు. తోపుడు బండిలో పోర్టరు సామాను తేగా, స్టేషను లోంచి  బైటికి వస్తూ, సంతోషంగా ఏన్ చెయ్యి అందుకున్నాడు. “ నీకు ఆనందంగా లేదూ? ఈ మనుషుల రద్దీ, స్టేషను కెదురుగా ఆ బస్సు స్టాండు, పరుగులుతీసే ఆ ట్రాములు, ఇవన్నీ చూస్తుంటే నీ మనసు పరవశం కావడం లేదూ! “ అడిగాడు ఆల్బన్. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండాలని కోరుకుంటోంది. 

3️⃣

పోర్టరు టాక్సీని పిలిచి సామాను అందులో సర్దగానే, అతని చేతిలో ఒక పచ్చనోటు పెట్టి, “హోటల్ సవాయ్ కి పోనీ” అని టాక్సీ వాడికి చెప్పి, సీట్లో జేరబడ్డాడు ఆల్బన్. టాక్సీలో ఉన్నంత సేపు కూడా వారేమీ మాట్లాడుకో లేదు. హోటల్ కి చేరగానే, రిసెప్షనిస్టు మొదటి అంతస్తులో వారి గదిని చూపించింది. అది అటాచ్డ్ బాత్ ఉన్న ఏ.సి. డబల్ బెడ్రూము. ఆల్బన్ మరింత పరిశీలనగా రూమంతా పరికించి,  “మనం ఈ ఊరిలో ఏదో ఒక ఫ్లాట్ తీసుకునే వరకు ఇది బాగానే ఉంటుంది. “ అన్నాడు.  తన వాచీ చూసుకుని, డియర్! నువ్వు స్నానం అవి చేసేందుకు టైము పడుతుంది. ఈ లోగా నేను అలా క్లబ్బుకి ఒక రౌండ్ వేసి వస్తాను. ఈ సామానంతా  ఇప్పుడు నువ్వేమీ విప్పవద్దు. మన కాళ్ళకి చేతులకి అడ్డం పడుతుంది.. ముఖ్యంగా అవసరమైన వస్తువులు మాత్రం తీసుకో. నేను ఒక గంటలో వచ్చేస్తాను. “ అని చెప్పి బైటికి వెళ్ళిపోయాడు. 

ఏన్ తనకి కావలసిన సామాను తీసుకుని, రూమ్ బాయ్ ని పిలిచి, మిగతా సామానంతా తాము అడిగేవరకు హోటల్లో పెట్టమని చెప్పింది. రూము కొంత ఖాళీ అయింది.

ఏన్ తన పనులన్నీ పూర్తి కాగానే కాస్త స్థిమిత పడి అద్దంలో తన మొహం చూసుకుంది. ఆమెకు దు:ఖం ముంచుకొస్తోంది. ఈ మౌనాన్ని భరించడం భయంకరంగా ఉంది. ఆ క్షణం వచ్చేసింది. ఈ క్షణం కోసం ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తోంది తను. తీరా సమయం వచ్చాక ఇప్పుడు వెనుకాడ కూడదు. ఆల్బన్ బైటికి వెళ్ళడం కూడా ఒకందుకు మంచిదే అయింది. కాస్త తాపిగా ఆలోచించుకోవడానికీ, తనని తాను నిబ్బరించు కోవడానికీ,అవకాశం వచ్చింది. 

ఆలోచించిన కొద్దీ ఆమె గుండెలు వేగంగా కొట్టుకో సాగాయి. ఆమె ఎప్పుడో నిర్ణయించుకుంది. ఆల్బన్ తో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో. ఆ మాటలు ఒకటికి వంద సార్లు తన మనసులో మననం చేసుకుంది.ఈ ప్రయాణం సాగినంత సేపూ తిరిగి, తిరిగి వాటిని గుర్తు చేసుకుంటూ వచ్చింది కూడా. అయినా ఏన్ కి ఇంకా భయంగానే ఉంది. మధ్యలో ఎక్కడ తప్పటడుగు వేస్తానో అని. ఆల్బన్ వాదానికి దిగుతాడు. అతనితో వాదించి తానూ గెలవగలదా!  ‘నీకు హృదయం లేదు. నువ్వు దుర్మార్గురాలవు.‘ అని నిందిస్తాడు. తాను అది విని భరించగలదా? ఆ విసుర్లకి తాను తట్టుకో గలదా? కాని… తనేం చేయగలదు? 

4️⃣

ఒక్కసారిగా ఏన్ కి గుండెల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. గతించిన సంఘటనలు ఆమె కళ్ళకు కట్టినట్టు కనిపించసాగాయి. 

మళ్లి తానా బంగ్లాలో ఉన్నట్టు ఊహించుకుంటోంది ఏన్. భోజన సమయం అయింది. ఆల్బన్ ఇంటికి వస్తాడు. తనని చక్కగా అలంకరించుకుని, గదిని కూడా  అందంగా తీర్చి దిద్దింది. వారు ఆ యింట్లోకి వచ్చి ఏడాదిన్నర అయింది. అయినా ఆమె చేసే అలంకరణలతో ఆ ఇల్లు ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుంది.

ఆల్బన్ కి దక్తార్ కి జిల్లా ఆఫీసర్ గా బదిలీ అయినప్పుడు ఏన్ ని చూసి స్నేహితులంతా ఎంతో జాలి చూపించారు. “అయ్యో! దక్తార్ కి వెళ్తూన్నారా! అది సోందురాలోకెల్లా అతి ప్రమాదకరమైన మారు మూల ప్రదేశం. అక్కడి నుంచి తంతి తపాలా సౌకర్యాలు అసలే లేవు. బైటి ప్రపంచంతో సంబంధం ఉండదు. వారానికోసారి పోస్టుమేన్ వస్తాడంతే!” అంటూ. కాని ఆమె నిరుత్సాహపడలేదు.  ఆమె బాగా చదువుకున్నది. కళా హృదయం.  ఆధునిక నాగరికతకి దూరంగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రకృతి రామణియకత ఆమెని ఎంతో ఆకర్షించింది. ఆల్బన్ కూడా మంచి పుస్తక పరిజ్జానం ఉన్నవాడు.  స్థానికంగా ఉన్న ఆటవిక జనాలతో పోల్చి చూసుకుంటే తామెంతో ఉన్నతులుగా అనిపించేది ఆమెకి. అక్కడి సామాన్య ప్రజలంతా  కూలీలు, కార్మికులును. ఒకరిద్దరు మాత్రం ప్రభుత్వంలో పని చేసే వారు ఉన్నారు. వారిలో దగ్గరలో ఉన్న రబ్బరు ఎస్టేటు మేనేజరు ఒకరు. మరొకరు కలప వ్యాపారి. 

అక్కడికి వచ్చినప్పటి నుంచి ఏన్ కి ఆ పరిసరాలు, అమాయికపు ప్రజలు వారి జీవితాలు ఎంతో నచ్చాయి. వారు మాట్లాడే భాష తీరు వేరు. అది ఆమె కూడా నేర్చుకుంది. అది వారిని బాగా అర్థం చేసుకునేందుకు ఉపయోగ పడింది. అప్పుడప్పుడూ ఆల్బెన్ ఆఫీసు పని మీద ‘పోర్ట్ వేలెస్’ కి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు ఆమె కూడా అతనితో వెళ్ళేది. ఆ విధంగా ఆమెకి అక్కడి పెద్ద ఆఫీసర్ల కుటుంబాలతో కూడా పరిచయం అయింది. కాని అక్కడి వాళ్ళ ప్రవర్తన ఆమెకి నచ్చేది కాదు. వాళ్ళంతా మిడిల్ క్లాస్ మనుషులు. సంకుచిత మనస్తత్వాలు. అసుయాద్వేషాలు ఎక్కువ. వాళ్ళలో ఎవరికీ ఆల్బన్ అంటే మంచి అభిప్రాయం లేదు. కాని ప్రభుత్వాదికారులు ఎదురు పడినప్పుడు పలకరించుకోవడం తప్పదు కాబట్టి, చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. లోలోపల మాత్రం కుళ్ళుతూ ఉంటారు. ఆల్బన్ వాళ్ళతో ఎంత స్నేపాత్రంగా ఉన్నప్పటికీ, మనసులో మాత్రం ఎవరికీ అతని పొడగిట్టదు. 

5️⃣

ఒకసారి ఇలాగే ‘పోర్ట్ వేలెస్’ కి వెళ్ళినప్పుడు గవర్నరు భార్య, మిసెస్ హెన్నై– ఏన్ కి దగ్గర స్నేహితురాలు కూడా – ఈ విషయం ప్రస్తావించింది. బహుశా ఇందులో ఆమె భర్త ప్రమేయం కూడా ఉందేమో!

“ఆల్బన్ కి కాస్త నువ్వైనా చెప్పరాదూ! పదిమందితోను కలిసి మెలిసి ఉండాలని. తనే అందరి కంటే ఎక్కువ తెలివైన వాడినన్నట్టు ప్రవర్తిస్తాడు. అయిఉండవచ్చు, అలాగని మిగతా వాళ్ళని తృణికరించలేము కదా. మా ఆయన కూడా అదే అంటున్నారు. పై అధికారుల్ని కూడా ఖాతరు చేయడని.”

కాని ఏం చేస్తాం? ఆయన గురించి ఆల్బన్ కి ఎంత నీచాభిప్రాయం ఉందో ఏన్ కి తెలుసు. కుండ బ్రద్దలు కొట్టినట్టు మాట్లాడడం అందరికీ చేతగాదు. 

“అబ్బే! అతనలాంటివాడు కాదు.  ఉన్నదున్నట్లు దాచుకోకుండా మాట్లాడే స్వభావం ఆయనది.” నవ్వుతూ సమాధానం చెప్పింది ఏన్. 

“క్లబ్బులోను, మన సంఘంలోనూ కూడా అతనికంత మంచి పేరు లేదు. నీకు తెలుసో తెలియదో! వాళ్ళంతా అతనికి ‘పిరికి పంద’( పౌడర్ –  పఫ్ – పెర్సీ ) అని పేరు పెట్టారు. 

అది విని చాలా నొచ్చుకుంది ఏన్. కోపం కూడా వచ్చింది. వారి మధ్యలో అతను ప్రత్యేకంగా ప్రవర్తించడం చూసి ఓర్వలేక పోయారు. అదంతా పైపై గాంభీర్యమేనని, అతనిలో ‘పస’ లేదని వారి ఉద్దేశం. ఈ నిక్ నేమ్ విషయం ఏన్ కి ముందు కూడా చూచాయగా వింది. ఆమె కళ్ళలో నీళ్ళు రావడం గమనించింది మిసెస్ హెన్నై. 

“ఏన్! డియర్! నిన్ను నొప్పించడం నా ఉద్దేశం కాదు. ఆల్బన్ ముందు ముందు చాలా అభివృద్దిలోకి రావలసిన వాడు. అతను తన నడవడిని మార్చుకుంటే మంచిదని నా అభిప్రాయం.” అంది.

“ఇక్కడ మేమంటే చాలా  మందికి ఇష్టం లేదన్నమాట నిజమే! కాని, నేనేం చేయగలను? అది అతని సహజ స్వభావం.”

“ నీ విషయం వేరు ఏన్! నువ్వంటే మా అందరికి ఎంతో గౌరవ భావం ఉంది. సంఘంలో అతనికి లభించే గౌరవ మర్యాదలు నీ వల్లనే అనుకో!” 

“నాలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటో?”

6️⃣

అంది ఏన్. కాని అంతరాంతరాల్లో ఆనందంగానే ఉంది. నిశ్శంశయంగా ఆల్బన్ అక్కడి వాళ్ళందరికన్నా అందగాడు. తెలివైనవాడు. అతనిలా టెన్నిస్ ఆడగల వీరుడు లేడక్కడ. అతనికి సంగీతం, సాహిత్యం అంటే అభిమానం. వారెవరికీ ఇవి అర్థం కావు. అందుకే అతనంటే వాళ్లకి అసూయ. ఆ సంకుచితపు మనుషులకి తమకంటే ఉన్నతుడున్నాడన్న పచ్చి నిజం జీర్ణం కావడం లేదు. 

ఇంటికి తిరిగి వచ్చాక, మిసెస్ హెన్నై తో జరిగిన సంభాషణ గురించి చాలా సేపు ఆలో చించింది ఏన్. కాని దాని విషయం మరిచిపోవడమే మేలని పించింది. క్లబ్బులో అతని గురించి అందరూ ఏమనుకుంటున్నారో ఆల్బన్ కి చెప్పాలా వద్దా అని చాలా మధన పడింది. హు(! పిరికి పంద (పౌడర్ – పఫ్ – పెర్సీ) ఎంత నీచమైన ఆలోచన!  వాళ్ళెవరి మీదా కూడా అతనికి మంచి అభిప్రాయం లేదు. చెప్పినా అదేమీ లెక్క చేయడు. కొట్టి పారేస్తాడు. వాళ్లకి ఇష్టం లేనంత మాత్రాన తన కొచ్చిన నష్టమేమిటి? ఎవరి శక్తిని బట్టి వాళ్ళు పైకి వస్తారు. ఆల్బన్ తెలివైన వాడు. విధి నిర్వహణలో నేర్పు గలవాడు. ఎప్పుడో వీళ్ళందరి మీదా పై ఆఫీసరు అయ్యే లక్షణాలు ఉన్నాయి. అప్పుడు గాని వీళ్ళకి తెలిసి రాదు. ప్రవాహంలా సాగిపోతున్న ఆమె ఆలోచనలకి ఆల్బన్ బూట్ల చప్పుడు అంతరాయాన్ని కలిగించింది. ఆమె వర్తమానంలోకి వచ్చింది. ఓహ్! అదంతా భవిష్యత్తులో ఒకనాడు జరిగితే జరగవచ్చు. ప్రస్తుతానికి అతనొక జిల్లా అధికారి. 

ఆల్బన్ వస్తూనే తిన్నగా బాత్రుముకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు. ఈ లోగా బాయ్ డిన్నరు రెడీ చేశాడు. ఇద్దరూ టేబిల్ ముందు కూర్చోగానే, “ఈ రోజు ఆఫీసు విశేషాలేమిటి?” అని ఏన్ అడిగింది. ఏన్

“చెప్పుకోదగ్గవేమీ లేవు. ఏదో దున్నపోతు చేను మేసేసిందని ఫిర్యాదు. ఆ( ! అవును ప్రేన్నే కబురు చేశాడు.  కూలీలు కొందరు అడవిలో చెట్లు నరికేస్తున్నారని, వచ్చి చూసి దర్యాప్తు చేయమనీను.”

 ప్రేన్నే అక్కడి రబ్బరు ఎస్టేటు మానేజరు. సుమారు ముఫ్ఫై అయిదేళ్ళ వాడు. అతని బంగ్లాలో అప్పుడప్పుడూ బస చేస్తూ ఉండడం వారికి  అలవాటే. అతనంటే వారికి బాగా ఇష్టం. ఆట్టే చదువుకున్నవాడు కాదు. కాని, మంచి కంపెనీ ఇస్తాడు. అతను ఒక స్థానిక మహిళని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఆమె చదువుకున్నది కాకపోవడంతో మొదట్లో ఆమెను పరిచయం చేయడానికి బిడియ పడ్డాడు ప్రేన్నే. అప్పుడు ఆల్బన్ నవ్వుతూ, “ఫరవాలేదు. ఏన్ కి అలాంటి పట్టింపులేమీ లేవు. నిజమైన స్నేహానికి ఇవేమీ అడ్డురావు.” అని ధైర్యం చెప్పాడు.  ఏన్ కూడా అతని భార్యా పిల్లలతో బాగా చెలిమి కలిపింది. పిల్లలకి బొమ్మలు కొని పెట్టింది. ఆమెకు అరమరికలు లేనందుకు ప్రేన్నే చాలా సంతోషించాడు. వారి స్నేహం బాగా వృద్ది చెందింది.

7️⃣

“ఈ మధ్య ఫారెష్టులో ఈ కూలీల గొడవ ఎక్కువ అయింది. ఈ సారి కాంట్రాక్టులో వీళ్ళని తప్పించి క్రొత్త వాళ్ళని పెట్టాలి అని ఆలోచనలో ఉన్నాడతను. “

“మరి వాళ్ళేమీ అతని మీద తిరగబడరు కదా?” అడిగింది ఏన్.

“ఏం ఫరవాలేదు. ప్రేన్నే చాలా పట్టుదలగల మనిషి. మాట అన్నాడంటే చేసి తీరుతాడు. ఒకవేళ ఏదైనా తిరుగుబాటు వస్తే నేనూ, నా సిబ్బంది ఉండనే ఉన్నాం.” 

ఆల్బన్ ఈ మాటలు పూర్తిచేశాడో లేదో, ఇంతలో వారి ఇంటి ముందు పెద్ద అల్లరి జరుగు తున్నట్టనిపించింది. పెద్ద పెద్ద కేకలు, అరుపులు వినిపించాయి. “ఏమిటది?” అని అరిచాడు ఆల్బన్ వరండాలోకి వచ్చి. ఏన్ అతన్ని అనుసరించింది. మెట్ల దగ్గర ఓ పదిమంది కూలీలదాకా గుమిగూడి ఉన్నారు. ఒక సార్జెంటు, నలుగురు పోలీసులు వాళ్ళని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఒక ప్రక్కకి తప్పించి మధ్యలో పడి ఉన్న మనిషి కనిపించేలా చేశాడు సార్జెంటు. ఆ మనిషి శరీరం రక్తంతో తడిసి పోయి ఉంది. అపస్మారక స్థితిలో ఉన్నాడు. గబగబా మెట్లు దిగి వచ్చి, అతన్ని ఆనవాలు పట్టాడు ఆల్బన్. అతను ప్రేన్నే పని చేసే రబ్బరు ఎస్టేటులో అసిస్టెంటు మానేజరు. 

“అతన్ని ఇలా తీసుకు రండి ముందుగా! ”  అంది ఏన్. కానిస్టేబిల్సు అతన్ని వరండాలోకి తీసుకురాగానే అతని తల క్రింద దిండు పెట్టింది ఏన్. నీళ్ళు తెప్పించి, తల మీది గాయాన్ని కడిగి, ప్రథమ చికిత్స చేసింది. అతను బ్రతికే ఉన్నాడని నిర్థారణ చేసుకున్నాక, విషయం ఏమిటని వాళ్ళనిఅడిగాడు ఆల్బన్. 

వచ్చిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, కొందరు తిరుగుబాటుదారులు ఆ రాత్రి, ఫారెస్టు బంగ్లా మీద దాడి చేశారు. ఆక్కడ జరిగిన పోట్లాటలో ప్రేన్నే మరణించాడు. ఈ అసిస్టెంటు, తప్పించుకుని గాయాలతో బైట పడ్డాడు. వాళ్ళు బంగ్లాకి నిప్పంటించి పూర్తిగా దగ్ధం చేశారు.

 అసిస్టెంటు కొంచెం తేరుకుని, కళ్ళు విప్పి భయం భయంగా ఇటు అటు చూశాడు. 

“నీకేం భయం లేదు. మా సంరక్షణలో ఉన్నావు.” అంది ఏన్. అతను నీరసంగా నవ్వాడు. ఏన్ అతని తలకి కట్టు కట్టడం పూర్తి చేసింది. 

“నీకు మాట్లాడగల శక్తి వచ్చిందా?” అడిగారు ఆల్బన్. 

“ఇంకొంచెం సేపు ఆగు. కాలికి బేండేజ్ వేయడం బాకీ ఉంది.” అంది ఏన్.

8️⃣

ఈలోగా అక్కడ చేరివాళ్ళని పంపించాడు ఆల్బన్. సార్జెంటు. ఒక పోలీసు మాత్రం మిగిలారు. వారిద్దరూ కలిసి అసిస్టెంటుని ఎత్తి, సోఫాలో కూర్చోబెట్టారు. 

ఏన్ అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. అతను కొంచెం తేరుకున్నాక, ఆల్బన్ అతని మీద ప్రశ్నల వర్షం కురిపించ సాగాడు. నిజానికి ఆతనికి కూడా అక్కడికి వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువ విశేషాలు తెలియవు. ప్రేన్నే మరణం, బంగ్లా పూర్తిగా దగ్ధం అయిపోవడం మాత్రం నిర్థారణ అయింది. 

“మరి ప్రేన్నే భార్యా పిల్లలు ఏమైనట్టు?”

“ఏమో! నాకు తెలియదు.” 

“ఆ వచ్చిన వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయా?”

“ఏమో! చెప్పలేను. “

“లేకపోవడమేమిటి? ఉండే ఉంటాయి. లేకపోతే వాళ్ళు అంతటి సాహసం చేయలేరు. ఎంత మంది ఉంటారు వాళ్ళు?” 

“చాలా మంది. ఎభైకి పైనే!”

ఆల్బన్ అతన్ని ఇలా ప్రశ్నలతో వేధించడం అనవసర మనిపించింది ఏన్ కి. సరైన బలగాన్ని వెంట బెట్టుకుని వెళ్లి, వాళ్ళని పట్టుకోవడం అతని తక్షణ కర్తవ్యం. అదే చెప్పింది అతనితో. కాని ఆల్బన్ ఆమెతో ఏకీభవించ లేదు. “మన సిబ్బంది మొత్తం పది మంది కంటే ఎక్కువ లేరు. సంఖ్యలోనూ, ఆయుధ బలం లోనూ వాళ్ళు మన కంటే ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎదుర్కోవడం అవివేకం.” అన్నాడు. 

ఏన్ కి మతి పోయింది. అతని ఊహలు ఇలా ఉంటాయను కోలేదు. “అదేంటి ఆల్బెన్? ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఎలా? అక్కడి అమాయిక ప్రజల్ని వాళ్ళెంత బాధ పెడుతున్నారో! “ ఆశ్చర్యంగా అడిగింది ఏన్. 

“నాన్సెన్స్! ఇప్పుడు మేము వెళ్తే, వాళ్ళ దగ్గర చావు దెబ్బలు తినడం ఖాయం. “

“మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు?” అసిస్టెంట్ అడిగాడు. 

9️⃣

“హెడ్ క్వార్టర్స్ కి కబురు పంపి, మరింత పొలిసు బలగాన్ని, ఆయుధాల్ని తెప్పించుకుని, అప్పుడు ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేయాలి. “ 

“కాని అప్పటికి రెండు రోజులు పట్ట వచ్చు.” 

“అయితే కానీ! ప్రేన్నే ఎలాగూ పోయాడు. బంగ్లా మట్టిలో కలిసి పోయింది. ఇంకా వాళ్ళేమి ధ్వంసం చేయగలరు? ఇంత అర్జంటుగా వాళ్ళని పట్టే ప్రయత్నం చేయడం వృధా. ఈ లోగా మనం మనుషుల్ని పంపి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో, వాళ్ళ స్థావరాలేమిటో ఆనూ పానూ తెలుసుకోవచ్చు.” 

అసిస్టెంట్ ఇంకా ఏదో అందామని నోరు తెరిచాడు. కాని అంతలోనే ఆగిపోయాడు. తను ఒక చిరుద్యోగి మాత్రమే. ఎదురుగా ఉన్నవాడు పెద్ద ప్రభుత్వోద్యోగి. అతను నిస్సహాయంగా ఏన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. 

అప్పుడు ఏన్ కల్పించుకుని అంది. “ కాని ఈ రెండు రోజుల్లోనూ వాళ్ళు  సృష్టించే హింసాకాండ మాట ఏమిటి? వాళ్ళంతా ఏం చేస్తారో! హత్యలు, మానభంగాలు. మనం అలా చూస్తూ ఊరుకోవడమేనా?” 

“చెయ్యనీ! చెయ్యనీ. చేసినంతా అనుభవిస్తారు. ఒక్కొక్కరికీ ఉరి శిక్ష వేయిస్తాను. “  

“ఏమో! నాకిది న్యాయం అనిపించడం లేదు. ఈ క్షణంలో వెళ్లి వాళ్ళ నుంచి అమాయికపు ప్రజలని  రక్షించాలి. అది నీ బాధ్యత.” 

“చూడు ఏన్! తెలివి తక్కువగా మాట్లాడకు. ఈ ఎనిమిది మంది పోలీసు బలగంతో వారిని ఎదుర్కోవడం కలలోని మాట. “ 

“ఇలా మనం రెండు రోజుల పాటు మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే, వాళ్ళు దానిని మన బలహీనతగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది” మధ్యలో అడ్డుకుని ఆన్నాడు అసిస్టెంట్. 

అది విని “ఇదుగో! చూడు మిస్టర్! నీ సలహా అవసరమైనపుడు నేనే అడుగుతాను.అప్పటి వరకు నువ్వు మాట్లాడకపోవడమే మంచిది. “ అన్నాడు ఆల్బన్. 

అతను చిన్న బుచ్చుకుని మారు మాటలేకుండా కూర్చున్నాడు. 

1️⃣0️⃣

“నేనలా ఆఫీసు వరకు వెళ్లి, హెడ్ క్వార్టర్స్ కి రిపోర్టు రాసి, అదనపు సహాయం కోసం అర్థించి వస్తాను “ అంటూ తొందరగా డ్రస్ చేసుకుని బైటికి నడిచాడు ఆల్బన్. అంతవరకు అతని వెను వెంటనే తిరుగుతూ “ఒక్కసారి నా మాట విను డియర్! నువ్విలా ఏమీ చేయకుండా ఉండడం బాగోలేదు.” అంటూ అర్థించ సాగింది ఏన్.

“అబ్బ! ఇంక నువ్వు నన్ను విసిగించకు ఏన్! నీ పని నువ్వు చూసుకో! ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకు.” అన్నాడు ఆల్బన్ కోపంగా. 

ఏన్ గబగబా అతనికి అడ్డుగా వెళ్లి,  అతని చేయి పట్టుకుని “కనీసం ప్రేన్నే భార్యా పిల్లల గురించి అయినా ఆలోచించు. వాళ్ళనైనా ఆ రాక్షసుల బారినుంచి తప్పించాలి గదా! వాళ్ళని ఆ క్రూరులు చంపేస్తారేమో!” అంది అతి దీనంగా. 

“ఇంత వరకు వాళ్ళు బతికి ఉన్నారని గ్యారంటీ ఏమిటి?”  అన్నాడు ఆల్బన్.  

“నువ్వింత నిర్దయగా ఎలా ప్రవర్తించగలుగు తున్నావు? నీలో ఇంతటి కఠినత్వం దాగి ఉందా? ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళని రక్షించే బాధ్యత నీ మీద ఉందని గుర్తుంచుకో!” 

“నా బాధ్యత ఏమిటంటే, బాధ్యత ఎరిగిన ప్రభుత్వాధికారిగా ప్రవర్తించడం. ఒక ఆడదాన్ని, అదీ ప్రేన్నే పెళ్ళాడింది కాదు – ఉంచుకున్నది – దాని పిల్లల్ని కాపాడేందుకు నేను, నా జీవితాన్ని, ఈ పోలీసుల జీవితాల్ని, బలి చేయలేను. నేనంతటి తెలివి తక్కువ వాడిననుకున్నావా?” 

“అందరూ నువ్వు వాళ్లకి భయపడి వెళ్లలేదని అనుకుంటారు. “

“ఎవరు వాళ్ళు?”

“ఇక్కడున్న జనం, ఇరుగూ, పొరుగూ అంతా.”

అది విన్న ఆల్బన్ ఒక విషపు నవ్వు నవ్వి అన్నాడు. “ ఆహా(! ఇరుగూ పొరుగూను, ప్రజలూను. నీకు తెలుసు. వాళ్లకి నేనెంత విలువ ఇస్తానో!”

1️⃣1️⃣

ఏన్ అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ కిటికీ గుండా అతని మనసులోకి తొంగి చూసింది. ఇహ అతనికి నచ్చజెప్పి లాభం లేదని అర్థం చేసుకుంది. వారి వివాహం అయి ఎనిమిదేళ్ళు కావస్తోంది. అతని ప్రతీ చూపులోని అంతరార్థం ఆమెకు బాగా తెలుసు. అంతే! పట్టిన చేయి వదిలి పెట్టి, వరండాలోకి వెళ్లిపోయింది. 

ఆల్బన్ ఆఫీసుకి వెళ్లి ఆ రాత్రి జరిగిన హత్యా కాండ మీద రిపోర్టు రాసి, వెంటనే సాయుధబలాల సహాయం పంపమని హెడ్ క్వార్టర్స్ కి కబురు పంపాడు. 

ఆ తరవాత రెండురోజులు ఎస్టేటులో ప్రజలు నరక యాతనే అనుభవించారు. తిరుగుబాటు దారుల బారి నుంచి తప్పించుకున్న వారు చెప్పే కథనాలు, అక్కడ జరిగిన రక్తపాతం గురించి వింటూ ఉంటే ఇక్కడి వారి గుండెలు తరుక్కు పోయేవి. 

ప్రేన్నే భార్యా పిల్లల గురించి ఏ సమాచారము తెలియ లేదు. వారిని తల్చుకుని చాలా బాధ పడింది ఏన్. ఆల్బన్ కి కూడా పరిస్థీతి ప్రమాదకరంగా ఉందని తెలుసు. కాని, తాను చేయ గలిగినదంతా చేశానని, ఇంక సహాయం కోసం ఎదురు చూడడం తప్ప మరేమీ లేదని నమ్మాడతను. ఏన్ తో మామూలుగా ఏమీ జరగనట్టే ప్రవర్తించ సాగాడు. జీవితంలో మొదటిసారిగా ఆమె అభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తించానన్న ధ్యాసే లేదతనికి. 

ఆఖరికి మూడోనాటి మద్యాహ్నానికి రావలసిన సహాయం వచ్చింది. వారికి స్వాగతం పలకడానికి ఆల్బన్ పోర్టుకి వెళ్ళాడు. ఈ శుభవార్త  ఇంట్లో కోలుకుంటున్న అసిస్టెంట్ కి ఎంతో ఉత్సాహంగా చెప్పింది ఏన్. 

“ఎన్కౌంటర్ కి వారితో బాటు ఆల్బన్ సర్ కూడా వెళ్తారంటారా?” అడిగాడతను. 

“ఎందుకు వెళ్ళడు?” అడిగింది ఏన్ 

“నాకు అనుమానమే!” అన్నాడతను. 

ఏన్ గుండె ఒక బీట్ మిస్ అయింది. గత రెండు రోజులుగా ఆపుకుంటున్న దు:ఖం ఒక్కసారిగా పెల్లుబికింది. కన్నీళ్ళు ఆపుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 

ఇరవైమంది సిబ్బందితో వచ్చిన కెప్టెన్ స్త్రాట్టాన్ వారికి పోర్ట్ వేలేస్ లో పరిచయం ఉన్న వాడే. కుశల ప్రశ్నలు అయ్యాక, ప్రస్తుతం అక్కడి పరిస్థితి గురించి ఆల్బన్ కెప్టెన్ కి వివరించాడు. అంతా విన్నాక, “ నీ దూరదృష్టిని 

1️⃣2️⃣

నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నేనైతే నా సిబ్బందితో ఎప్పుడో వారి మీద దాడి చేసి ఉండేవాడి.ని” అన్నాడు కెప్టెన్. 

“అది చాలా ప్రమాదకరమని నా ఉద్దేశం.” ఆనాడు ఆల్బన్. 

“నిజమే ముందు మన రక్షణ చూసుకోవడం అవసరం.” అని వెటకారంగా అంటూ, “ఏమైనా చాలా అరుదుగా వచ్చే ఈ ఎన్కౌంటర్ అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది.” అన్నాడు కెప్టెన్. అతనికి ఎప్పుడెప్పుడు పోరు ప్రారంభిద్దామా అని ఉంది. “మరి ఘటనా స్థలానికి బయల్దేరదామా?” అని లేచాడు స్త్రాట్టాన్. 

అల్బన్ అందుకు కూడా అంగీకరించ లేదు. “వద్దు ఇలా అర్థాంతరంగా బయల్దేరి వెళ్తే మనం ముందుగానే వాళ్ళని హెచ్చరించిన వాళ్ళం అవుతాము. ఈ అడవుల్లో దొంగదారులు వాళ్లకి తెలిసి నట్టుగా మనకి తెలియవు. దారి తప్పి మనం వాళ్లకి దొరికిపోతే ఇంతే సంగతులు. కనుక నేనొక ప్లాను ఆలోచించాను. దానిని ఆచరిస్తే రక్తపాతం లేకుండా మనం వాళ్ళని స్వాధీన పరచుకోవచ్చు. “ అని తన ప్లాను చెప్పాడు. 

కెప్టెన్ కి కూడా అది నచ్చింది. “సరే! అలా అయితే మాకూ కొంత విశ్రాంతి దొరుకుతుంది.”అన్నాడు. 

అనుకున్న ప్రకారం దుండగుల్ని ఎదుర్కోవడానికి  ఆ సాయంత్రం బయల్దేరారు. అడవి దారి. చీకటిగా ఉంది. అంతా నిశ్శబ్దం. చీమ చిటుక్కుమన్నా వినిపించేలా ఉంది. చప్పుడు చేయకుండా జాగ్రత్తగా నడుస్తున్నారు. ఒక్కొక్క దగ్గర దారి మరీ ఇరుకుగా ఉండి, ఒకరికంటే ఎక్కువ నడిచేందుకు కుదరడం లేదు. అలా చాలా దూరం నడిచి, అర్థరాత్రి దాటాక శత్రువులున్న కూలీల కాలనీ వెనక భాగానికి చేరుకున్నారు. ప్లాను ప్రకారం వాళ్ళంతా తెల్లవారు ఝామున గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా దాడి చేయాలి. . అత్యవసరం అయితే కాని ఆయుధాలు ప్రయోగించకూడదు. వీలైనంత వరకు రక్తపాతం లేకుండా అంతా పూర్తికావాలి. 

చీకట్లు కొంచెం తగ్గే సమయం రాగానే, కెప్టెన్ ముందుకు పొమ్మని ఆర్డరు చేశాడు. నాలుగడుగులు నడిచేక వారు పొదలు దాటి రోడ్డు మీదికి వచ్చారు. ఎదురుగా శత్రువులున్న గుడిశెల దగ్గరికి రాగానే  ‘అటాక్’ అన్నాడు కెప్టెన్. పోలీసులు ఒక రౌండు కాల్పులు జరపగానే, హడావిడిగా పరుగులు పెడుతూ మనుషులు బైటికి వచ్చారు. వారందరికీ ముందు, ఖాకీ దుస్తుల్లో ఉన్న ఒక స్థూలకాయుడు బైటికి వచ్చి, “ఆగండాగండి. ఏమిటి? మీరు చేస్తున్నది?” అని అరుస్తూ వారి దిశగా పరుగెత్తుకు రావడం వారు గమనించారు. మరికొంచెం దగ్గర కాగానే అతన్ని

1️⃣3️⃣

 చూసి ఆశ్చర్యపోయాడు ఆల్బన్. ఆయనెవరో కాదు. అక్కడికి దగ్గరలోనే ఉన్న మరొక టింబర్ ఎస్టేటు మానేజరు వాన్ హసేల్ట్.

వారిని చేరుకున్న హసేల్ట్, “ఇలా దండెత్తడంలో ఏమిటి మీ ఉద్దేశం?” అని గద్దించాడు. 

“అరె! నువ్వా? నువ్వేం చేస్తున్నావిక్కడ?” అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కెప్టెన్. 

“అదే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అర్థరాత్రి వచ్చి అటాక్ చేయడంలో .మీ ఉద్దేశం ఏమిటి? అని క్షణంలో తప్పింది. లేకపోతే మీరు నన్ను చంపి ఉండేవారు. ” అన్నాడు  హసేల్ట్  కోపంగా . 

ఆయన్ని శాంత పరచి, “వీరంతా పోర్ట్ వేలేస్ నుంచి అల్లర్లు అణచడానికి వచ్చిన బలగం. ఇంతకీ నువ్విక్కడికి ఎలా వచ్చావు?”  అడిగాడు ఆల్బన్. 

“ఎలా వచ్చానా? నడిచి వచ్చాను. అల్లర్లని కంట్రోలు చేసి శాంతి భత్రతలు కాపాడడానికి. మీరు వచ్చిన పని అదే అయితే ఇక మీరు వెనక్కి వెళ్ళవచ్చు. “

“నువ్వు చెప్పేది నాకర్థం కావడం లేదు. “

“అర్థం కావడానికి ఇందులో ఏమీ లేదు. కొందరు కూలీలు నాదగ్గరికి వచ్చి ఇక్కడ జరుగుతున్న గలాటా గురించి చెప్పారు. నేను హుటాహుటిన నా అసిస్టెంటు, మరో నలుగురు సిబ్బందినీ వెంట బెట్టుకుని వచ్చాను. నలుగురైదుగురు గేంగ్ లీడర్లని  పట్టి బంధించాము.  ఒకడు తిరగబడబోతే, షూట్ చేశాము. అంటే! ఎక్కడివాళ్ళక్కడ గప్ చిప్. తెల్లవారాక బంధితుల్ని నేనే ప్రభుత్వానికి అప్పజెప్పేవాడిని. “

“మరి ప్రేన్నే, భార్యా పిల్లలు ఏమయ్యారు?”

“వారెప్పుడో తప్పించుకుని పారిపోయారు. వాళ్ళకేమీ కాలేదు.”

అది విన్నాక, ఏన్ మాటలు విని తాను రాకపోవడం ఎంత మంచి నిర్ణయం! అని తనను తానే అభినందించుకున్నాడు ఆల్బన్. వాళ్ళు బ్రతికి బైట పడతారని  అతను ఊహించ లేదు.

1️⃣4️⃣

తను వచ్చిన పని పూర్తి అయింది కాబట్టి వాన్ హసేల్ట్ టింబర్ ఎస్టేటుకి తిరుగు ప్రయాణం కట్టాడు. కెప్టెన్ స్త్రాట్టాన్ కూడా తనతో వచ్చిన పోలీసులతో సహా వెనక్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అతని ద్వారా జరిగిన ఉదంతం ఒక రిపోర్ట్ రాసి పోర్ట్ వేలేస్ కి పంపాడు ఆల్బన్. 

తిరుగుబాటు దారులు చేసిన విధ్వంసం చేసి, ఆల్బన్ కి ఎంతో పని కల్పించారు. ఎస్టేటులో దగ్ధం అయిన ఇళ్ళు ఎన్నో, వాటివల్ల ఎంత నష్టం వచ్చిందో, ఎన్ని కుటుంబాలు ఆస్తుల్ని  కోల్పోయాయో, అంతా ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు సేకరించాలి. వాటిని పునరుద్ధరించడానికి అయ్యే  ఖర్చు అంచనా వెయ్యాలి. ఈ పనులు పూర్తి అయ్యే సరికి వారం రోజులు పట్టింది. ఇంతకాలం అతను అక్కడే కేంపు చేసి, రిపోర్టు తయారు చేశాడు. ఇంతలో తిరుగు ప్రయాణం తలపెట్టక ముందే పోర్ట్ వేలేస్ నుంచి అర్జంటుగా రమ్మని తాకీదు వచ్చింది. అది చాలక వారు ఒక జీపుకూడా  వెంట పంపారు. ఆల్బన్ కి ఇంటికి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేదు. వెళ్తూ, వెళ్తూ దారిలోనే ఒక గంట సేపు ఆగి, ఏన్ కి విషయం చెప్పాడు. 

“ఏమిటో! ఈ ఆఫీసర్లు చేంబర్సులో కూర్చుని ఆర్డర్లు జారి చేసేస్తారు. నా పని నన్ను ప్రశాంతంగా చేసుకో నివ్వరు. “ అన్నాడతను ఏన్ తో.

“వాళ్ళ పనే అది. మీ వీలు చూసుకుని పిలుస్తారా ఏం?” అంది ఏన్.

“అర్జంటుగా వెళ్ళాలి. నిన్ను వెంట తీసికెళ్ళే సమయం కూడా లేదు. పని పూర్తవగానే రెక్కలు కట్టుకొచ్చి వాల్తాను. “ అంటూ జీపు ఎక్కాడు ఆల్బన్. 

పోర్ట్ వేలేస్ చేరుకోగానే ఒక పోలీసు ఆఫీసరు “గవర్నరుగారు మిమ్మల్ని వెంటనే చూడాలనుకుంటున్నారు. పదండి” అని బంగ్లాకి దారి తీశాడు. 

గవర్నరుగారిని దర్శించి, కుశల ప్రశ్నలు అయ్యాక, “నిన్న వాన్ హసేల్ట్ ఇక్కడికి వచ్చాడు.” అన్నాడాయన. “ ఉన్నట్టుండి.

“అవునా?” అని జవాబిచ్చాడు ఆల్బన్. ఆ గవర్నరు బాగా వయసు పై బడిన వాడు. ఆల్బన్ దృష్టిలో  అతనంత తెలివైన వాడేమీ కాదు. కాని నలభై సంవత్సరాలుగా అక్కడ పని చేసిన అనుభవం ఆయనకి బాగా ఉపయోగపడుతోంది. 

1️⃣5️⃣

“ఎస్టేటులో జరిగిన అల్లర్ల గురించి నీ అభిప్రాయం ఏమిటి? “ సూటిగా అడిగాడు గవర్నరు. 

ఆల్బన్ తను ఏమనుకున్నాడో అంతా ఏమాత్రం జంకు లేకుండా వివరంగా చెప్పాడు. 

“నీ దగ్గర ఎనమండుగురు సాయుధ సిబ్బంది ఉన్నారు. విషయం తెలియగానే నువ్వెందుకు అటాక్ చేయలేదు? “ 

“అంత తక్కువ ఫోర్స్ తో వాళ్ళని ఎదిరించడం తెలివి తక్కువ పని.” 

“ఆ మాత్రం రిస్కు తీసుకోకపోతే నువ్వు ఎలా పైకి రాగలవు?” 

ఆల్బన్ ఏమీ మాట్లాడ లేదు.                                                           

 “మరి వాన్ హసేల్ట్ కేవలం తన అసిస్టెంటు, ఓవర్ సీర్స్ తో మాత్రమే వెళ్లి వాళ్ళని పట్టుకోగలిగాడే!”

“అతను అదృష్టవంతుడు. పెద్ద రిస్కు తీసుకుని బతికిపోయాడు. అతనికేమీ కానంతలో అది మంచిపని అని నేను అనుకోవడం లేదు. “

“అసలు ప్రభుత్వోద్యోగిగా నువ్వు చేపట్టవలసిన బాధ్యతని అతను తీసుకోవడం ప్రభుత్వానికి ఎంత తలవంపులో నువ్వు గుర్తించావా?” 

“నేనలా అనుకోవడం లేదు. “

“ఊరిలో వారంతా నిన్ను చూసి పిరికి వాడివని భయస్తుడవని నవ్వుకుంటున్నారు.” 

“బాధ్యతలు తెలియని వాళ్ళు ఏమనుకున్నా నేను లెక్క చేయను. అటువంటి అర్థం లేని నిందలు మోయగల శక్తి నాకు ఉంది” 

“ఒక ప్రభుత్వోద్యోగి ఉపయోగం సంఘంలో అతనికున్న గౌరవ మర్యాదల్ని బట్టి ఉంటుంది. పిరికివాడు గా పరిగణించబడిన వ్యక్తి ఉద్యోగంలో ఉండే అర్హతని పోగొట్టుకుంటాడు. “ 

“మీరేమంటున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు. “

1️⃣6️⃣

“జాగ్రత్తగా విను. నాకూ, వాన్ హసేల్ట్, కెప్టెన్ స్త్రాట్టాన్ ఇంకా ఇతరులకీ  కూడా నీ విషయం తెలుసు. అక్కడ జరిగిన ఉదంతం గురించి అంతా నాకు విశదంగా చెప్పారు. ఇప్పుడు నీ డిఫెన్సు విన్నాను. ….”

“నన్ను నేను డిఫెండు చేసుకుంటున్నానని నేను అనుకోవడం లేదు. “

“చెప్పేది విను. మధ్యలో మాట్లాడి నాకు కోపం తెప్పించకు. నాదృష్టిలో ఎస్టేట్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే  నువ్వు తిరుగుబాటు దారుల్ని పట్టుకోక పోవడం నీ బాధ్యతా రహిత ప్రవర్తన. అందులో నువ్వు చెప్పినంత రిస్కు లేదని వాన్ హసేల్ట్ రుజువు చేశాడు. ఇటువంటి సమయాల్లో నిశ్చలమైన నిర్ణయాలు, నిబ్బరమైన హృదయం అవసరం. నువ్వు మాకు సహాయ సిబ్బంది కోసం రాసి, అది వచ్చేవరకు ఆగడంలో విలువైన సమయాన్ని కోల్పోయావు. నీవంటి వారు ఈ ఉద్యోగంలో ఉండడంవల్ల ఉపయోగం లేదు. “

ఆల్బన్ పై ఆఫీసరు వాదానికి అమితంగా ఆశ్చర్యపోయాడు. “ఆ సమయంలో మీరైతే ఆ దుర్మార్గుల్ని ఎదుర్కొని ఉండేవారా?” అని ఆడిగాడు సూటిగా. 

“నిస్సందేహంగా” తిరుగు బాణంలా వచ్చింది జవాబు. 

ఆల్బన్ భుజాలెగరవేసి అపనమ్మకంగా ఆయన వైపు చూశాడు. 

“ఏం? నమ్మకంలేదా?” 

“లేకేం? నమ్మగలను. కాని ప్రభుత్వం మీవంటి బాధ్యతగల ఆఫీసర్ని కోల్పోయి ఉండేది గదా అని విచారిస్తున్నాను.” 

“ఇదుగో! అబ్బాయీ! నీ వంటి సున్నితమైన మనస్తత్వంగల మనిషి ఈ పోలీసు ఉద్యోగానికి తగడు. నన్నడిగితే, నువ్వు ఇంటికి పోయి, నీ వ్యక్తిత్వానికి తగిన మరొక ఉద్యోగం లో చేరడం మంచిది. “ 

“మీరెటువైపు సూచిస్తున్నారో అర్థం కావడం లేదు. “

“మిస్టర్ ఆల్బన్! నువ్వు చిన్న పాపాయివేం కావు. నువ్వూ, నీ శ్రీమతీ ఇక్కడి సొసైటీలో తలవంపులు లేకుండా వెళ్ళిపోయే ఉపాయం చెప్పుతున్నాను. నువ్వు నీ పిరికితనం వల్ల ఉద్యోగం లోంచి డిస్ మిస్ అయినట్టుకాకుండా నువ్వే స్వయంగా రిజైన్ చేసి వెళ్లిపోవడం శ్రేయస్కరం. “

1️⃣7️⃣

“అడక్కుండా మీరిచ్చిన సలహాకి కృతజ్జుడిని. కాని ఈ ఉచిత సలహాని నేను వాడుకోలేనని చెప్పడానికి చింతిస్తున్నాను. నా రిజగ్నేషను నా తప్పుని ఒప్పుకోవడం అవుతుంది. అందుకు నా మనసు సుతారమూ ఒప్పుకోదు. ఇది మాత్రం జరగని పని. “ 

“నువ్వేమైనా అనుకో! ఈ కేసులో తప్పు నీదిగా పరిగణించి, నిన్ను ఉద్యోగంలోంచి బర్తరఫు చేయవలసినదిగా ప్రభుత్వ నిర్ణయం. ఆర్డర్లు వెనకాల వస్తాయి. ఈ లోగా నువ్వు వెళ్లి  నీ స్థానంలో క్రొత్తగా వేసిన ఆఫీసరుకి చార్జీ అప్పజెప్పు. “

“సంతోషం. నన్నెప్పుడూ తిరిగి వెళ్ళమని ఆజ్జ?”

“తక్షణం.”

“సరే! వెళ్లేముందు క్లబ్బుకి వెళ్లి భోజనం చేసి వెళ్ళ వచ్చునా?” 

“ఓ! నిరభ్యంతరంగా. సారీ! ఆల్బన్! నీవంటి తెలివైనవాడి విజ్జానాన్ని ఈ డిపార్ట్ మెంటు ఉపయోగించుకోలేక పోతోంది. “

“మన పెద్దలు చెప్పిన మాటలు ఒక్కొక్కప్పుడు నిజంగా చద్దిమూటలు అనిపిస్తాయి. “

“అంటే? నీ ఉద్దేశం?” 

“మీరు విన్నారోలేదో! మొండివాడు రాజుకంటే బలవంతుడంటారు. “

“సరే! ఇక నువ్వు వెళ్ళవచ్చు. “ 

ఆల్బన్ లో ఏమాత్రం పశ్చాత్తాపం ఉన్నట్టు కనిపించదు. ఉద్యోగం పోయినందుకు అతను విచారిస్తున్నట్టుగా కూడా లేదు. చక్కగా నవ్వుకుంటూ తలెత్తుకుని క్లబ్బుకి దారి తీశాడు. గవర్నరు కూడా సామాన్య మానవుడే! ఉద్యోగం పోయిన మనిషి ఏడుస్తూ ఇంటికి పోతాడు కాని క్లబ్బుకి వెళ్తాడా? ఇది నిజమా?  తెలుసుకోమని క్లర్కుని అతని వెంట పంపాడు. 

క్లబ్బులో కెప్టెన్ స్త్రాట్టాన్, ఇంకా ఆల్బన్ కి పరిచయం ఉన్న ఇతరులు చాలా మంది ఉన్నారు. అల్బన్ వారందరితోనూ ఏమీ జరగనట్టే ప్రవర్తించాడు. కాని చాలా మందికి ముఖ్యంగా కెప్టెన్ వంటి వారికి, అన్ని విషయాలు 

1️⃣8️⃣

సవిస్తరంగా తెలుసు. ఒక విధంగా అతనికి జరిగిన పరాభవానికి అంతా లోలోపల ఆనందిస్తున్నారు. ఆల్బన్ కుమిలిపోతాడని, అవమానం భరించలేక మొహం చాటు చేసుకుంటాడని భ్రమించారు. కాని దానికి భిన్నంగా అతను చీమ కుట్టినట్టు కూడా కనిపించకపోవడంతో, నిరాశ చెందడం వారి వంతయింది. శ్రుంగభంగం వారికి అయింది. 

అక్కడికీ ఉండబట్టలేక వారిలో ఒకడు అన్నీ తెలిసి ఉండి కూడా, ఏమీ ఎరగనట్టు అడగనే అడిగాడు. “ఏంటి విశేషాలు? హెడ్ క్వార్టర్స్ కి వచ్చావు?” 

“ఏముంది? ఆ ఎస్టేటు గొడవల్లో నేను తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చలేదు. గవర్నరు నన్ను పదవి నుంచి తొలగించాడు. నేను తిరిగి వెళ్లి  క్రొత్తవాడికి చార్జీ అప్పజెప్పాలి. “

“నీకు చాలా అన్యాయం జరిగింది. సారీ! “ అన్నాడు మరొకడు. 

“చూడు మిత్రమా! ఇటువంటి ఫూలిష్ ఆఫీసర్ల నుంచి మనం ఇంత కంటే గొప్ప నిర్ణయాల్ని ఆశించలేం. వారి పిచ్చి వారికానందం.” 

ఈ విశేషాలు క్లార్కు ద్వారా విని గవర్నరు ముక్కుమీద వేలేసుకున్నాడు. ‘ధైర్యం అనేది చాలా చిత్రమైన పదార్ధం. మొండి దైర్యం మరీను. నామట్టుకు నేను ఈ పరిస్థితుల్లో క్లబ్బుకి వెళ్ళే కంటే, ఆత్మహత్య చేసుకుని ఉండే వాడిని. చింత చచ్చినా పులుపు చావదు కదా!’ అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు.  

మరో పదిహేను రోజుల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి ఆల్బన్ దంపతులు కావలసిన సామాను తీసుకుని పోర్ట్ వేల్స్ వచ్చారు. అక్కడి నుంచి వారు స్టిమరులో సింగపూర్ వెళ్ళాలి. వారు వచ్చారని తెలిసి, కొందరు మిత్రులు వారిని తమ ఇళ్ళకి ఆహ్వానించారు. కాని వారు హోటల్ లోనే ఉండడానికి నిశ్చయించుకున్నారు. గవర్నరు భార్య మిసెస్ హెన్నై ‘టీ’ కి పిలిస్తే మాత్రం కాదనలేక పోయింది ఏన్.

అక్కడ గవర్నరు జరిగిన దానికి విచారం వెలిబుచ్చాడు., 

“మీరలా బాధపడనక్కర లేదు. ఈ విషయంలో నేను ఆల్బన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అతని పట్ల అన్యాయమే జరిగింది.” అంది ఏన్.

1️⃣9️⃣

ఆయన తన చేతిలో ఏమీ లేదన్నాడు.

“మన ఇంక దానిని మరిచిపోవడం మంచిది.” అంది ఏన్. వారికి సగౌరవంగా కృతజ్జతలు చెప్పి బైట పడింది 

మర్నాడు రాత్రి వారు  స్టిమరు ఎక్కారు. వీడ్కోలు చెప్పడానికి అందరూ వచ్చారు. ఓడ బయల్దేరగానే కేబిన్ లో ప్రవేశించిన ఆల్బన్ సీటు మీద తన పేరుతో ఒక పెద్ద పార్సిలు పడి ఉండడం చూశాడు. ఏమిటా అని విప్పి చూస్తే, అది ఒక పెద్ద సైజు పౌడర్ – పఫ్. అతను నవ్వుతూ, “ఏన్! డియర్! ఎవరిచ్చారోకాని, ఇది నీకోసం అనుకుంటాను.” అన్నాడు. 

ఆమె అటు చూసి నివ్వెర పోయింది. ‘వాళ్ళే! ఆ ధూర్తులే! ఎంత అప్రతిష్ట! ఎదురుగా వచ్చి ఇచ్చే దైర్యం లేక ఇలా చేశారు. వాళ్ళే పిరికి పందలు‘ అని తిట్టుకుని, దు:ఖాన్ని ఆపుకుంటూ, అతికష్టం మీద చిన్నగా నవ్వింది. 

“ఇంత పెద్ద సైజు పఫ్ నేనెప్పుడూ చూడలేదు. చిత్రంగా ఉంది కదూ! “ అన్నాడు ఆల్బన్. 

ఆల్బన్ అలా బైటికి వెళ్లినప్పుడు, దానిని కసికొద్దీ సముద్రంలోకి విసిరేసింది ఏన్. 

సింగపూర్ చేరిన తరవాత అక్కడినుంచి ఒక షిప్పులో లండన్ కి వచ్చారు. ఇప్పుడు వారు సోందురాకి తొమ్మిది వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. 

కానీ….    … ….  …

అక్కడి ఆలోచనలు మాత్రం ఏన్ ని వెంటాడు తూనే ఉన్నాయి. 

ఇంతవరకు జరిగిన సంఘటనలు కళ్ళారా చూస్తూ కూడా తనకి ఏడుపు ఎందుకు రావడం లేదో అర్థం కాలేదు ఏన్ కి. 

ఆల్బన్ తలుపు తోసుకుని లోపలి వచ్చాడు. ఏన్ ఆలోచనలకి అంతరాయం కలిగింది. అన్ని వస్తువులూ, చెక్కు చెదర కుండా పడిఉన్నాయి. ఆఖరికి ఏన్ కూడా తను కూర్చున్న కుర్చీ లోంచి కదల లేదు. 

2️⃣0️⃣

“ఏన్ నువ్వింకా స్నానం చేయ లేదా? రెడీగా ఉంటే భోజనానికి వెళ్ళేవాళ్ళం కదా” అన్నాడు ఆల్బన్. 

“ఈ పేకింగు విప్పాలనిపించ లేదు. “

“ఏం? ఎందుకు?”

“ఎందుకంటే, నేనెలాగూ ఇక్కడ ఉండడం లేదు కనక. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. “

ఒక్కసారిగా ఖంగు తిన్నాడు ఆల్బన్. “ఏమిటి? నువ్వంటున్నది.”

“అవును. ఇంతవరకు ఎలా భరించానో, భరించాను. ఈ మనసుని అదుపులో పెట్టుకోవడం ఇంక నావల్ల కాదు. ఇంక లండన్ వచ్చేశాం కనక, నీ దారి నీది. నా దారి నాది”. 

“నీ కేమైనా మతిపోయిందా?” 

“మై గాడ్! ఎంత దుర్భరమైన అనుభవం ఇది! ఇన్ని అవమానాలు! అందరికీ తెలిసిన పరమ రహస్యం. పిరికి పంద (పౌడర్–  పఫ్) గా జమ కట్టబడి, ఉద్యోగం ఊడిపోయిన ఒక  భీరుడి భార్యగా! వాళ్ళంతా నన్ను జాలిగా చూస్తూ ఉంటే, వీడిని ఎలా భరిస్తున్నావని నన్ను ప్రశ్నిస్తున్నట్టు ఉంటే! ఇవన్నీ చూస్తూ కూడా ఏమీ ఎరగనట్టు నువ్వు! పట్టించు కోకుండా, ఎవ్వరినీ లెక్కచేయకుండా, నీది ఏనుగు చర్మం.  ఎవరు మాత్రం అంత సిగ్గు లేకుండా ఉండగలరు?”

ఆమెలో ఇంత వరకు అణగారి ఉన్న అగ్ని పర్వతం ఒక్కసారిగా బ్రద్దలయింది.. ఉవ్వెత్తున లేచి నిప్పులు చిమ్మ సాగింది. ఆమె కోపం లావాలా ప్రవహిస్తోంది. దానినాపు చేయడం ఎవరి తరమూ కాదు. ఇప్పుడామె ఇరుగూ పొరుగుల గురించి, సొసైటి గురించి భాధపడ వలసిన అవసరం లేదు కాబట్టి, కంపిస్తున్నఆమె పెదవుల మీదనుంచి మాటలు వంకలు తిరిగే సెలయేరులా ప్రవహిస్తున్నాయి. 

“ఏన్! మై డియర్! నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఎవరో పల్లెటూరి పిల్ల టౌనుకొచ్చి, అందరూ తననే చూస్తున్నారని భ్రమిస్తున్నట్టుగా ఉంది నీ ప్రవర్తన. ఇంత పెద్ద మహా నగరంలో మనని పట్టించుకునే వారు ఎవర? ఒక వేళ ఒకరిద్దరు పట్టించుకున్నా, ఆ చవటలని లెక్క చేసేదెవరు? ఎదుటి వాళ్ళు బుద్ది తక్కువ వాళ్ళయితే, మన బుద్ది ఏమైనట్టు? ఇంతకీ ఏమనుకుంటున్నారు మన గురించి?” అడిగాడు ఆల్బన్.

2️⃣1️⃣

“నిన్ను ఉద్యోగంలోంచి పీకేశారని.” 

“అది నిజమేకదా!” 

“నువ్వొక పిరికి పందవని.” 

“అనుకుంటే అనుకోనీ”

“అంటే? అది నిజమనేనా?” 

ఆల్బన్ ఒక్కసారిగా దెబ్బతిన్నాడు. పళ్ళు బిగించి, నిక్కచ్చిగా అడిగాడు. “అది నిజమే అని నువ్వు నమ్ముతున్నావా?” 

“ఆ నిజం నీ కళ్ళలో కొట్టోచ్చినట్టు కనిపిస్తోంది. ఆ రోజు ఎస్టేటు లో హత్యాకాండ గురించి కబురు తెలిసి నప్పుడు, నిన్నెంతో బ్రతిమిలాడాను. ఎలాగైనా వెళ్లి వాళ్ళని అరెస్టు చేయమని. కాని నువ్వు ఒప్పుకోలేదు. నీలో భయం ఆరోజే చూడగలిగాను. “

“ఇప్పటికీ ఆ రోజు  నేను వెళ్ళడం సబబు కాదనే నమ్ముతున్నాను అక్కడేం కొంపలు మునిగి పోవడం లేదు. . ధైర్యం ఉంది కదా అని అగ్నిలో దూకితే కాలి బూడిద అవడం తప్ప ప్రయోజనం ఏముంది?”

“ఏమన్నావ్? కొంపలేం మునిగిపోవడం లేదనా? చదువులోను, తెలివితేటల్లోను, అధికారంలోనూ మనం వారి కంటే ఉన్నత స్థానంలో ఉన్నామని, ఆ కారణంగా మనం ఎక్కువ దైర్యసాహసాలు కల వాళ్ళమని . జాలి, దయాగుణం ఉన్నవాళ్ళమని గర్వపడే వాళ్ళం. కాని నువ్వు ఆ ఉదారగుణం చూపించవలసిన సమయం వచ్చినపుడు, పూర్తిగా నిర్వీర్యుడవయ్యావు. నీ అధికారం నిష్ఫలమయింది. మన ఆదర్శాలు మట్టిగలిసి పోయాయి. ఈ రోజు వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. నీ అధికారాన్ని పోగొట్టుకుని, నీ గురించి నీచంగా భావించే అవకాశం వాళ్లకి నువ్వే ఇచ్చావు. నువ్వు ఉత్త పిరికిపందవని, సమయం వచ్చినపుడు వెనుదిరిగి పోతావని వాళ్ళు అనుకున్నపుడు కోపంతో నా రక్తం ఉడికి పోయింది. అసలు నీకీ  విషయం తెలుసా? వాళ్ళు నీకు పిరికిపంద (పౌడర్ – పఫ్– పెర్సి) అనే పేరు పెట్టారని? 

“తెలుసు. కాని అదొక దురుద్దేశంతో, ఓర్వలేని తనంతో పెట్టిన పేరని అర్థం చెప్పుకున్నాను. అయినా నేను వాళ్ళ మాటల్ని ఎప్పుడు లెక్క చేశాను కనక. “

2️⃣3️⃣

“అవును. కాని ఆ దురుద్దేశమే నిజమని నిరూపించబడడం చాలా శోచనీయమైన విషయం.” 

“ఏన్! ఏంటి నువ్వంటున్నది? ఇంతకాలం నా గురించి ఇదే అభిప్రాయం నీ హృదయంలో దాచుకున్నావని నన్నునమ్మమంటావా?”  

“అక్కడ అందరూ నిన్నాడి పోసుకుంటూ ఉంటే నేనూ వారిలో ఒక్కటై నిన్ను వంచించ లేకపోయాను. ఏది ఏమైన సరే, అక్కడ మనం ఉన్నంత కాలం, నేను నీకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎవరేమన్నా నిన్నే సమర్ధించుకుంటూ వచ్చాను. ఈ రోజు వరకు. ఇంతకాలం నేను నరకాన్ని అనుభవించాను. ఇంక నాతరం కాదు. “

“నేనంటే ప్రేమ లేదా నీకు?” 

“ప్రేమా? అసలు నీ మొహం చూడాలంటేనే ఆసహ్యం వేస్తోంది. “

“ఏన్!”

“నేను నిన్ను ప్రేమించానన్నది భగవంతుడికి తెలుసు. నా జీవితంలో ఎనిమిది సంవత్సరాలకాలం నిన్ను దైవంలా ఆరాధించాను. నా సర్వస్వం నువ్వే అని నమ్మాను. కానీ…. ఆ రోజు నీ కళ్ళలో భయాన్ని చూశాక, ముఖ్యంగా – ఆ స్త్రీ మూర్తి , ఆమె పిల్లల విషయంలో – ఆమెను ‘ఉంచుకున్న’దన్నావు . వాళ్ళని రక్షించదానికి ప్రాణ భయంతో నువ్వు వెనుక ముందులాడినప్పుడు, నీలో మానవత్వం నశించిపోవడం నేను కళ్ళారా చూశాను. ఎవరో నా హృదయాన్ని నా శరీరం లోంచి బైటికి లాగి కాళ్ళతో త్రొక్కేసినట్టు బాధ పడ్డాను. ఆల్బన్! నువ్వు ఆ రోజే, అక్కడే నా ప్రేమని దారుణంగా హత్య చేశావు. అదీ ఒక క్షణికమైన దౌర్బల్యం అయి ఉండి తరవాత నువ్వు పశ్చాత్తాపపడి ఉంటే, నేను నిన్ను క్షమించి ఉండేదాన్ని. కాని, ఇదే నీలో పాతుకుపోయిన భావపరంపర అని తెలుసుకున్నాక నువ్వు క్షమార్హుడవు కావనే నిర్ణయానికి వచ్చాను. నీలాంటి కపట నాటకమాడే అధికారి కంటే,  మానవత్వమున్న ఒక సగటు మనిషి భార్యనై ఉంటే నేనెంతో సంతోషించి ఉండేదానిని. “

అతనింకేమీ అనలేదు. ముఖం పాలిపోయింది. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని ఏడ్వసాగాడు. “ఏన్! నువ్వలా అనకు. నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం ప్రాణాలైనా అర్పించగలను. నిన్ను వదిలి నేను బ్రతకలేను” అంటూ అతను ముందుకు రాబోయాడు. 

ఏన్ చేతులు ముందుకు చాచి అతన్ని ఆపు జేస్తూ, “ లేదు. లేదు ఆల్బన్! ఇప్పుడు ఇంక నువ్వు నన్ను మభ్య పెట్టే ప్రయత్నం చేయకు. నేనిక లోభంలో పడలేను. నేను వెళ్లి పోవాలి. నీతో సహచర్యం ఇక కలలోని మాట. గతం భయంకరంగా నా కళ్ళముందు కనిపిస్తోంది. నువ్వంటే నాకసహ్యం అన్న పచ్చి నిజాన్ని నేనిప్పుడు నీకు చెప్పక తప్పదు. “

అంతే! ఆల్బన్ ఆమె పాదాల దగ్గర నిలువునా కూలబడిపోయాడు. అతనిని తప్పించుకుని ఆమె కుర్చీలోంచి లేచి నిలబడింది. అతని తల కుర్చీసీటులోకి జారుకుంది. అతను ఆగకుండా రోదిస్తున్నాడు. ఎవరూ ఊహించ లేనంతగా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు అనంతం అనిపిస్తోంది. ఆ ఏడుపు కర్ణ కఠోరంగా ఉంది. 

అది విన లేక, రెండు చెవులకి చేతులు అడ్డం పెట్టుకుని, ఏన్ బైటికి పరుగు తీసింది.

పాలెపు బుచ్చిరాజు

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.

Previous Post

తమిళ కథ : సైకిలు డాక్టరు

Next Post

ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

Next Post
ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

Discussion about this post

ఈ సంచికలో…

  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..
  • ఆంగ్ల కథ : పిరికి పంద
  • తమిళ కథ : సైకిలు డాక్టరు
  • రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి
  • విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’
  • నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను
  • అనువాద కవిత : మహిళల మధ్య
  • అనువాద కవిత : ఓ  లక్ష్మణా!
  • కన్నడ కథ: బేలా
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com