
కథాసాహిత్యం, విమర్శ అభిమాన విషయాలు. ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. శ్రీకాకుళం ‘కథానిలయం’ కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

అనిల్ బత్తుల కవి, పిల్లల పుస్తక రచయిత. సోవియట్ తెలుగు పుస్తకాలను సేకరించి, డిజిటలైజ్ చేయించి ఉచితంగా తెలుగు వారికి అందించారు. అరుదైన అనువాద కథలు, నవలల్ని పునర్ ముద్రణకు కృషి చేస్తున్నారు. అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ద్వారా త్వరలో కొన్ని అరుదైన పుస్తకాలని మన ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుత నివాసం యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్.

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

ఎం వి రామిరెడ్డి జర్నలిస్టు, రచయిత, సంఘసేవకుడు. ముప్ఫయ్యేళ్లుగా కథలు రాస్తున్నారు. రామ్కీ ఫౌండేషన్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి పేరిట మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా.. పెదపరిమిలో వృద్ధాలయం నిర్వహిస్తున్నారు.

కృష్ణా జిల్లా తిరువూరు తాలూకా పాత రేపూడి గ్రామంలో జన్మించారు. ఎంఏ తెలుగు సాహిత్యం చదివారు. హైదరాబాదు ఈనాడులో మూడున్నర దశాబ్దాల పాటు పాత్రికేయవృత్తిలో కొనసాగారు. విపుల, చతుర పత్రికల సంపాదకుడిగా పదవీవిరమణ చేశారు. ‘ట్యాంక్ బండ్ కథలు’ కథా సంపుటి వెలువరించారు.
73 ఏళ్ల సంపత్ రెడ్డి ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), పి.జి.సి.టి.ఐ (CIEFL) చదివారు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేసి… 2011 లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ గా రిటైరయ్యారు. పుస్తకాలు చదవడం, అనువాదాలు చేయడం, ఫోటోగ్రఫీ ఆయన వ్యసనాలు
అత్యధికంగా అమ్ముడయే గ్రామర్ పుస్తకాల్లో ఒకటైన English Grammar Fundas (తెలుగు వివరణలతో) ప్రచురించారు. అనువాదాలు.. 1. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, 2. భిన్న దేశాల విభిన్న ఉత్తరాలు-ఉపన్యాసాలు (32 ఉత్తరాలు-32 ఉపన్యాసాల సంకలనం) 3. భిన్న దేశాల విభిన్న కవిత్వం (అనువాద కవితల సంకలనం) 4. హిందువులకో ఉత్తరం- లియో టాల్‌స్టాయ్ 5. సామ్యవాదం నుండి సర్వోదయ వరకు- లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వెలువడ్డాయి.
ఫోటోగ్రఫీ ఆసక్తి: తెలుపునలుపు ఛాయాచిత్రపు రోజుల్లో ఏతావాతా తీసిన ఫోటోలు కొన్ని భారతదేశంలోని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శితమయ్యాయి. 1982 లో ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (FIP) వారు నెలనెలా నిర్వహించిన మెంబర్స్ మంత్లీ కాంపిటేషన్ ‘బిగినర్స్ సెక్షన్’ ఫోటో పోటీలో “గ్రాండ్ అవార్డ్” (సిల్వర్ మెడల్) అవార్డు. 1984 లో ‘Decade of the Girl Child (1975-85) కార్యక్రమాల్లో భాగంగా UNICEF నిర్వహించిన Focus on the Girl Child ఫోటో పోటీలో 2200 మంది ఫోటోగ్రాఫర్లు పంపిన 6500 చిత్రాలలో మొత్తం 150 చిత్రాలు ఎంపిక కాగా, నా చిత్రాలు మూటికి మూడు (3) “గ్రాండ్ జ్యూరి అవార్డ్” గెలుచుకున్నాయి. అక్టోబర్, 2025 లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF), తెలంగాణా అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో రెండవ బహుమతి.

1961 లో తిరుత్తణిలో జన్మించిన వీరి విద్యాభ్యాసమంతా చిత్తూరులోనే సాగింది. ఎస్వీ యూనివర్సిటీ నుండి ఎమ్మే పట్టా పొందారు.
వీరు 1983 నుండి రచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 167 కి పైగా కథలూ, 123 కి పైగా కవితలూ, 1 నవలా ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 20 కథలకు బహుమతులు పొందారు.
ఇప్పటివరకూ 1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా… 5) పగడాలు పారిజాతాలూ…6) నిరుడు కురిసిన వెన్నెల 7) గుప్పెడు మల్లెలు (కథా సంపుటాలు) 8) కవన కదంబం (కవితా సంపుటి) 9) జీవితమొక పయనం (నవల) పుస్తకాలను వెలువరించారు.
వీరి సాహిత్య కృషికి గాను 1) ‘గురజాడ కథా పురస్కారం’ (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) కీ.శే. శ్రీమతి కామాక్షీబాయి శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు.
ఇప్పటిదాకా వీరు… 139 కి పైగా కథలు, 12 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 జీవిత చరిత్ర, 2 వ్యాస సంపుటాలు, 1 వచన రామాయణ గ్రంథం… అనువదించారు.
అనువాదంలోనూ… 1) “నల్లి దిశై ఎట్టుమ” పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం
2) ప్రతిష్టాత్మకమైన “కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం”
3) “కె.ఎస్.మొళిపెయర్పు విరుదు” పురస్కారం
4) ‘పడైప్పు’ సంస్థ నుండి ‘ఇలక్కియ చుడర్’ పురస్కారాన్ని పొందారు.

1952లో జన్మించిన చింతపట్ల సుదర్శన్ కృష్ణాపత్రిక, విశాలాంధ్రల్లో 1972లో కవితలతో రచనలు ప్రారంభించారు. హైదరాబాదు పాతనగరంలో ‘ఉషస్సు’ లిఖితపత్రిక సంపాదకుడిగా నడిపారు. 1973లోనే హైదరాబాదు పాతనగరం రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘వేదిక’ లిఖిత పత్రికర సంపాదకుడిగా ఉన్నారు. 1982 నుంచి వివిధ పత్రికల్లో 1500కు పైగా కాలమ్స్ ప్రచురితం అయ్యాయి. కాలమ్, క్రిటికాలమ్, హాట్ కేక్, మాయాబజార్, కానికాలమ్, నాశనగాలమ్, వలపులవల, క్విక్ బాక్సింగ్, కలంకారీ, చల్తే చల్తే, చౌరస్తా, రంగస్థలం వంటివి ప్రముఖమైనవి.
అద్దం, క్రిటికాలమ్, సుదర్శన్ సెటైర్స్, తెలంగాణ.కాం, అమృతం కురవని రాత్రి (కథలు), పగలే వెన్నెల (నవల) ప్రచురించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనేక అనువాద రచనలు చేశారు. ముల్క్ రాజ్ ఆనంద్- అంటరానివాడు, రవీంద్రనాధ్ టాగోర్- శిలావిలాపం, ఆదిశంకరాచార్య- భజగోవిందం, ఆర్కే నారాయణ్- మాల్గుడి నవలలు లాంటివి ముఖ్యమైనవి.

అల్లూరి గౌరీ లక్ష్మి
కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, నాలుగు నవలలూ, మూడు కవిత్వ సంపుటాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd.లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈమె రచనలకు పలు అవార్డులు, పురస్కారాలూ లభించాయి.

2005 నుండి కవిత్వం రాస్తున్నారు, ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ వీరి కవితా సంకలనాలు. తాజాగా అఫ్రో అమెరికన్ కవయిత్రి మాయా ఏంజిలో కవితల అనువాదం పుస్తకంగా వచ్చింది. సంచిక అంతర్జాల పత్రికలో “పొయెట్స్ టుగెదర్” శీర్షికతో భిన్న కవుల విభిన్న కవిత్వాన్ని అనువదించి అందించారు.
సిసి రెడ్డి గారి ‘మనభూమి’మాసపత్రికలో ‘హిమశకలం’ పేరుతో సంవత్సరం పాటు కాలమ్ నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రిక లో పద ప్రహేళిక నిర్వహించారు. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి కవయిత్రి తొలి ప్రోత్సాహక పురస్కారం, రొట్టమాకు రేవు అవార్డు, అమృతలత అపురూప అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, కలేకూరి ప్రసాద్ స్మారక అనువాద పురస్కారం- అందుకున్నారు.
‘రెండు సంతకాలు‘ త్వరలో రానున్న కవితా సంకలనం
ప్రముఖ కవి రాజేందర్ జింబో హిమజ జీవన సహచరులుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

సంగీతం, సాహిత్యం, సాహసయాత్రలు, స్వచ్ఛందసేవ ముఖ్యమైన అభిరుచులు. ఆకాశవాణినుంచి విరమించుకున్న తరువాత కాలిఫోర్నియాలో ఉద్యోగం, నివాసం. ఫ్రెంచ్ లో ఆంత్వాన్ ద సెంత్ ఎక్సూపెరీ రాసిన ప్రసిద్ధ నవల చిన్నారి రాకుమారుడు తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా రాసిన పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన హిందీలోకి అనువదించి ప్రచురించారు. హిందీ కవి నరేష్ సక్సేనా కవితలను, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, హిందీ రచయిత్రి మమతా కాలియా రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఎంపిక చేసిన హిందీ లఘు కథానికలను తెలుగులోకి అనువదించి ‘తోలుబొమ్మలు’ శీర్షికన ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.

మానవీయ దృక్పథం తో సాహిత్య సృజన చేస్తున్న పిన్నంశెట్టి కిషన్ 8 ఫిబ్రవరి, 1962 న వేములవాడ లో జన్మించారు. తండ్రి: అచల పరిపూర్ణ శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్నయ్య. తల్లి: శ్రీమతి మంచె లక్ష్మీబాయి. ఎం. ఏ., బీఎడ్., చదివి తూనికలు-కొలతలు శాఖ అధికారిగా పదవీ విరమణ చేశారు. దాదాపు అరవై కథలు, వందకు పైగా కవితలు, కొన్ని విమర్శనా వ్యాసాలు రాశారు.
కథా విభాగంలో “ లేంబాళ వాటిక కథలు “, కవితా విభాగంలో “ నల్ల పద్యం “ సంపుటాలు వెలువడ్డాయి. వేములవాడ నేపథ్యంలో 1970 నుంచి 1990 వరకు గల ఊరి సామాజిక స్థితిగతుల్ని ఆత్మకథనాత్మక శైలిలో “లేంబాళ వాటిక కథలు “ రాశారు. లేంబాళ వాటిక కథలకు గూడూరి సీతారాం కథా పురస్కారం-2024 నకు మరియు పీచర సునీతా రావు స్మారక సాహిత్య పురస్కారం-2025 నకు లభించాయి.
2023 వ సంవత్సరానికి, కథా విభాగంలో లేంబాళ వాటిక కథలు సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం వచ్చింది. “నల్ల పద్యం’’ కవితా సంపుటికి హాసిని రామచంద్ర లిటిరరీ పౌండేషన్, ఖమ్మం వారి పురస్కారం 2024 లభించింది.

శివ చల్లా 5 జూలై 1997న నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఫిసికో-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్.సి., డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఇంపైర్మెంట్లో స్పెషల్ బి.ఎడ్. పట్టాలను పొందారు.
గత పదేళ్లుగా గుజరాత్, హైదరాబాద్‌లలోని పలు పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకులుగా సేవలందించారు. ప్రస్తుతం ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రదేశాలను సందర్శించడం, పుస్తక పఠనం, బేకింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం వీరి అభిరుచులు.

ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా 2016 డిసెంబర్ లో రిటైర్ అయ్యారు. 1.1.1977 గుడివాడలో జననం. ఉద్యోగ విరమణ తర్వాత తిరుపతిలో నివాసం. B.com., MCJ, MA. (HINDI), రంగస్థల యోగా విజ్ఞాన్ లో సుశిక్షితులు. 28సం.ఆకాశవాణిలో ఉద్యోగం. అక్షరాలు నా ఆనవాళ్లు, ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే- కవితా సంపుటులు, వెన్నెలలో మల్లియలు- నాజీవన యానం. ఇప్పుడు ముద్రణలో చాంద్ ఫిర్ నికలా- 100 హిందీ పాటలకు వ్యాఖ్యానం, ఆయన రచనలు. రంగస్థల విమర్శ- సమీక్షకులు. వాట్సాప్ గ్రూపులో హిందీ అనువాదాలు. కథాయాత్ర పేరుతో కథల ఆడియో, చిత్ర కవితలు, పుస్తక సమీక్షలు, పరిచయాలు వగైరా.

M. Com. చదివారు. సిండికేట్ బ్యాంక్ లో క్లర్క్ గా చేరి 2012లో మేనేజర్ గా పదవీవిరమణ పొందారు. ప్రస్తుత నివాసం హిందూపురం. సాహిత్యం, సంగీత మంటే ఇష్టం. ప్రచురణ పొందిన మొదటి తెలుగు కథ కాగితపు పులి (ఆంధ్రప్రభ వీక్లీ). మొదటి అనువాద కథ పంజరం (విపుల). మూడు అనువాద కథా సంపుటాలు, ఒక్క తెలుగు కథా సంపుటం, రెండు నవలలు ప్రచురణ జరిగింది. ఒక నాటకం DTP లో ఉంది.

కవిత్వం, కథలు, అనువాదాలు (కథలు కవితలు) రాస్తుంటారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికల ఎడిట్ పేజీల్లో, ఆదివారం అనుబంధాలలో వ్యాసాలు రాస్తుంటారు. 2013 లో ‘వెన్నెల్లో మంచుపూలు’ (కవితా సంపుటి), 2024 లో ‘ఆఖరి స్నేహితుడు’ (కథా సంపుటి), 2025లో ‘100 కబీర్ కవితలు’ ప్రచురించారు. 1975 లో SV University నుండి MA English Literature పట్టా అందుకున్నారు. 1977 నుండి 2013 దాకా State Bank of India లో
ఉద్యోగం. కడప, తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ఊళ్లలో పనిచేశారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతిలో గురజాడ రచనలపై పరిశోధన చేసారు. విజయవాడలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈనాడు, వార్త దిన పత్రికలలో, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి వార పత్రికలలో, వనితా జ్యోతి, ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రిక లలో వీరి కథలు గతంలో ప్రచురితమయ్యాయి. విపులలో అనువాద కథలు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాల పత్రికలలో కథలు, కవిత్వం, అనువాద కవిత్వం, వ్యాసాలు రాస్తున్నారు. సాక్షి దినపత్రిక లో జ్యోతిర్మయం శీర్షిక కు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
మహాకవి గురజాడ అప్పారావు, మహాకవి జాషువా జీవితం -సాహిత్యం, ‘చెంగల్వ పూలు’ కథల సంపుటం, “అక్షర జ్యోతి” ఆధ్యాత్మిక వ్యాస సంపుటి మొదలైనవి వీరి ప్రచురితమైన పుస్తకాలు. తమ శ్రీవారి తో కలిసి, సుప్రసిద్ధ కథకులు, బహు గ్రంథకర్త విహారి గారి సాహిత్య జీవిత ప్రస్థానాన్ని “దర్పణం”
పేరుతో రచించారు. కథ, కవిత్వం, అనువాదం అభిమాన ప్రక్రియలు.

స్త్రీవాద కవయిత్రి. మూడు దశాబ్దాలుగా రాస్తున్నారు. బాల్యం నుంచి కవిత్వం రాస్తున్నారు. సూర్యుడు తప్పిపోయాడు, నిషిధ్ధాక్షరి, నీలి గోరింట, రాతి చెయ్యి కవితా సంపుటాలు.. వానచినుకులు వ్యాస సంకలనం ప్రచురించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ శర్మ అవార్డులు, తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం సహా పదివరకు పురస్కారాలు లభించాయి. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ, బెంగాలీ లలోకి ఆమె కవితలు అనువదించబడ్డాయి.

విశ్రాంత ఆంగ్ల అధ్యాపకురాలు, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, న్యూఢిల్లీ.
పాఠశాలలో, కళాశాలలో రచనా వ్యాసంగం మొదలుపెట్టినా, ఉద్యోగరీత్యా ఢిల్లీ లో ఉన్నప్పుడు శ్రీవారు , సహోద్యోగుల ప్రోత్సాహంతో అక్కడి తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో సభ్యత్వం తీసుకుని కవితలూ, వ్యాసాలు వ్రాసేవారు. పదవీ విరమణ తర్వాత కవితలు, సమీక్షలు, వ్యాసాలు వ్రాస్తున్నారు.
వృత్తిలో ఉత్తమ అధ్యాపకురాలు, ప్రవృత్తి రీత్యా తెలుగు వెలుగు, కలం రత్న సహస్రాధిక కవితా సమీక్షావిభూషణ, కవన కిరణం, కీర్తిరత్న మొదలైన పురస్కారాలు, బిరుదులు లభించాయి.
ప్రస్తుతం తెలుగు లో పిహెచ్ డి ప్రవేశ పరీక్ష ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణురాలై, మౌఖిక పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
బెంగుళూరు లోని కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య కు ఉపాధ్యక్షురాలు, పిఠాపురం లోని పురుహూతికా లలితకళా పరిషత్తు కు సాహితీ కార్యదర్శి గా సేవలందిస్తున్నారు.
పరిచయంలో వ్రాయడం మర్చిపోయాను –
మూడు వచన కవితాసంపుటులు.. 1 కవన సవ్వడులు 2 భావనా కుసుమాలు 3 గౌతమి తరంగిణి, ఒక వ్యాస సంపుటి- వ్యాస మంజరి ప్రచురించారు.

పంతుల కల్యాణి
ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా అందుకున్నారు. విద్యార్థి దశలో ఆమెకు ఆకాశవాణితోను, వివిధ యువ సాహితీ సంస్థలతోనూ, విశేషమైన సాన్నిహిత్యం లభించింది. విశాఖపట్నంలో సుమారు మూడున్నర దశాబ్దాలు కళాశాల అధ్యాపకురాలిగా పనిచేశారు. విఖ్యాత కంప్యూటర్ విషయజ్ఞుడు సుబ్రతో బాగ్చి రచించిన Go Kiss the World ని ‘ప్రపంచాన్ని ప్రేమించు’ పేరుతోను, Zen Garnden ని ‘ధ్యానవనం’ గానూ తెలుగులో అనుసృజన చేశారు. మరి రెండు అనువాద గ్రంథాలు కూడా ప్రచురితాలు.

కథాసాహిత్యం, నవల, కవిత్వం, అనువాదం ఇదే జీవితం. కేవీ లో పీజీ టీచరుగా ఉద్యోగ విరమణ. హైదరాబాద్‌లో ఆరునెలలు అమెరికాలో ఆరునెలలు నివాసం. రాత 69 నుండీ. తొలికథ వసుధలో 69-70. విపుల లో చాలానే అనువాద కథలు వచ్చాయి. కవిత్వం నా ఉనికి లానే.

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.

LIC లో ఆఫీసర్ గా పనిచేస్తున్నా. చదవడం ఇష్టమైన విషయం. కొన్ని కథలు రాసాను. 25 వ గంట కథల సంపుటి వచ్చింది. మంకెన పువ్వు పేరుతో భూమిక లో మూడేళ్ల పాటు శీర్షిక రాసాను. కొన్ని అనువాదాలు కూడా. ఇప్పటికీ రాయడం కంటే చదవడమే ఇష్టం.
వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. తెలుగు ఆంగ్ల కథా సాహిత్యం పై ప్రత్యేకమైన ఆసక్తి. హర్షణీయం పాడ్‌కాస్ట్ నిర్వాహకుల్లో ఒకరు.
హర్షణీయం పాడ్‌కాస్ట్ లింక్ – https://bit.ly/harshspot

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి కథ, కవిత, నాటకం మొదలైన ప్రక్రియల్లో గత 4 దశాబ్దాలుగా అనువాదాలు. రెండు భాషల్లో స్వీయ రచనలు. ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడలో హిందీ శాఖాధ్యక్షునిగా 3 దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ. 20 పుస్తకాల ప్రచురణతో పాటు పలు పత్రికల్లో అనువాద రచనల ప్రచురణ. సుమారు 60 ఆకాశవాణి జాతీయ నాటకాలు (హిందీ-తెలుగు-హిందీ) అనువాదాలు ప్రసారం. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం.

నివృత్త బ్యాంకు అధికారి. హైదరాబాద్ శివార్లలో ఉంటున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. మాతృభాష కన్నడం.
ఆయన భాషల అభిమాని. బళ్ళారిలో పుట్టినందువల్ల ఆయనకు కన్నడం, తెలుగు రెండూ భాషల పరిచయం కలిగింది. రెండు భాషల్లోనూ సాహిత్య రచనలు చేశారు. ఆయన అనువదించిన కథలు అటు తెలుగు పత్రికలలోనూ, కన్నడ పత్రికలలోను ముద్రణకు నోచుకున్నాయి.
ఆయన కన్నడంలో “మనదర్పణ, అనిసిద్దెల్ల అక్షరదల్లి” అనే రెండు కవితా సంకలనాలను తీసుకువచ్చారు. తెలుగు నుండి “తూర్పుగాలి, మంచుపువ్వు, తపన” నవలలను కన్నడంలోకి అనువదించారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, మామిడి హరికృష్ణ “ఒంటరీకరణ” కవితలను కన్నడంలోకి అనువదించి పుస్తకాలుగా తీసుకొచ్చారు. ఆయన కన్నడం నుండి అనువదించిన కస్తూర్ బా గారి ఆత్మచరిత్ర “నేను కస్తూర్ బా ని”, అనువాద కథా సంకలనాలు “అత్తర్” “నలుగురికి చేరిన కథలు” “గుడిగంట” “మండే మంటకు ఒళ్ళంతా నోరు”, నవల “వేర్లు” వెలువడ్డాయి.
“గీతలోని మార్గదర్శకాలు” అనే శీర్షికన “కర్తవ్య బోధన, స్థితప్రజ్ఞత, త్రిగుణాలు, నిత్య జీవన గీత ” అనే నాలుగు పుస్తకాలను స్వంతంగా రాశారు. వాటిలో “స్థితపజ్ఞత. త్రిగుణాలు” గుంటూరు నుండి వెలువడుతున్న ఆధ్యాత్మిక పత్రిక “విశ్వధర్మ వాణి” పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ”ఉపనిషత్తుల సారం” అనే పుస్తకాన్ని కన్నడం నుండి అనువదించారు. అనువాద కృషికి గాను 2019 లో గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం పొందారు. స్థానిక ఓం భం ట్రస్ట్ వారు ఆయన అనువాద కృషిని గుర్తిస్తూ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

కన్నడ సాహిత్య ప్రపంచంలో, ముఖ్యంగా అనువాద సాహిత్య రంగంలో, ఎస్. డి. కుమార్ పేరు విశేషంగా పరిచితమైనది. రాష్ట్రంలోని దాదాపు ప్రతి ప్రధాన గ్రంథాలయంలోనూ ఆయన రచించిన లేదా అనువదించిన వందకు పైగా గ్రంథాలు అందుబాటులో ఉండటం ఆయన సాహిత్య సేవకు నిదర్శనం.
ఎం.కాం. చేసారు. తెలుగు, ఆంగ్ల భాషల నుండి కన్నడకు విస్తృతంగా అనువాదాలు చేశారు. ఇప్పటివరకు 700–800 వరకు చిన్నా–పెద్ద నవలలు, 300కు పైగా కథలు అనువదించారు. ఆయన రచనలు, అనువాదాలు కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి.
కథ, నవల, నాటకం, వ్యాసం, విజ్ఞాన సాహిత్యం, వ్యవసాయం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆయన కలం సమాన నైపుణ్యంతో సాగింది. విభిన్న అంశాలపై సమాన ఆసక్తితో రచనలు చేయడం ఆయన ప్రత్యేకత.
ఆరు వేలకుపైగా కవితలను తెలుగు, ఆంగ్లం, కన్నడ భాషల మధ్య పరస్పరం అనువదించిన విశేష అనుభవం ఆయనకు ఉంది. ఈ అనువాదాల ద్వారా భాషల మధ్య సాహిత్య సేతును నిర్మించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.
పలు టెలివిజన్ ధారావాహికలకు స్క్రిప్ట్ రచయితగా పనిచేశారు. కొన్ని చలనచిత్రాలకు కథ, కథనం (స్క్రీన్‌ప్లే) రూపకల్పనలో భాగస్వామిగా, సహాయ దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

లక్కా రాధాకృష్ణ కంటే, L. R. K. మూర్తి, రాధాకృష్ణ, విశాలాక్షిగా, తెలుగు సాహిత్యాభిలాషులకి బాగా పరిచయం! క్రైం, సోషియా, adventures, చిల్డ్రన్స్, నవలలు 270పైచిలుకు రాసాను. అనువాద కథలకి ప్రేరేపణ విపుల, ఆంధ్రజ్యోతి. లక్కా రాధాకృష్ణ గా చిత్రపరిశ్రమలో డైరెక్టర్ నయ్యాను! జన్మస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. స్థిరపడింది చెన్నై (మద్రాసు)

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. మూడు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ‘గారడీవాడు’, ఒక కవితా సంపుటి ‘షష్ఠముడు’, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’, ‘పుత్రికాశత్రుః’, ఒక సంపాదకీయ వ్యాసాలసంపుటి ‘మునివాక్యం’ ప్రచురించారు. శీలా వీర్రాజు కథానిక పురస్కారం సహా ఆరు పురస్కారాలు లభింంచాయి.


