హిందీ మూలం : దినకర్ కుమార్
అనువాదం : డా. వెన్నా వల్లభరావు
ఆమె నరకపు అగ్నిలో కాలి మరణించనూ లేదు
నరకపు ఆటవికతలో ఎట్టి తగ్గుదలా రాలేదు
ఆమెను పాపపు గీటురాయిపై గీసేముందు
కొంచెం వ్యవధి ఇవ్వాలి-
తన రోగిష్టి బిడ్డకి స్తన్యం ఇవ్వటానికి
అవిటి భర్తకు చేతికర్రగా మారేందుకు
ఆమెను బోనులో నిలబెట్టే ముందు
ఎక్కడైతే ఆమె తన యౌవనాన్ని, చిరునవ్వుని
పవిత్రతని వదిలివచ్చిందో
ఆ తెల్లదుస్తుల వాళ్ళ పడక గదుల్లో వెదకాలి
ఆమె గతాన్ని గురించి అడిగే ముందు
ఆమె అసలు పేరుని, ఆమె కలల్ని
స్త్రీ అన్న గుర్తింపుని ఆమెకు దూరం చేసి
చింపిరి వస్త్రంలో పంచిన వర్తమానపు కథ
అడిగి తెలుసుకోవాలి.
ఆమెకు శిక్ష విధించే ముందు
ఆమె ఆత్మపై లెక్కలేనన్ని గాయాల్ని లెక్కించాలి
ఆమె ఖాళీ పర్సుని సోదా చెయ్యాలి
ఆమె ఎన్ని రోజులనుంచి పస్తులుందో
ఎన్ని రాత్రుల నుంచి మేల్కొని ఉందో తెలుసుకోవాలి.
![]()

తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి కథ, కవిత, నాటకం మొదలైన ప్రక్రియల్లో గత 4 దశాబ్దాలుగా అనువాదాలు. రెండు భాషల్లో స్వీయ రచనలు. ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడలో హిందీ శాఖాధ్యక్షునిగా 3 దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ. 20 పుస్తకాల ప్రచురణతో పాటు పలు పత్రికల్లో అనువాద రచనల ప్రచురణ. సుమారు 60 ఆకాశవాణి జాతీయ నాటకాలు (హిందీ-తెలుగు-హిందీ) అనువాదాలు ప్రసారం. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం.




Discussion about this post