జపనీస్ మూలం : సుసొకి నట్సుమె
ఇంగ్లిషు : తకుమి కషిమ, లొరెట్ట ఆర్.లొరెంజ్
తెలుగు : పి.శ్రీనివాస్ గౌడ్
నేను ఆరేళ్ల పిల్లవాడిని వీపు మీద పెట్టుకుని నడుస్తున్నాను. అతను నా కొడుకు అని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ విచిత్రంగా, అతను ఎందుకని గుడ్డివాడయ్యాడో, బోంజ్ పూజారిలా బట్టతల వాడయ్యాడో నాకు తెలియదు. అతన్ని “ఎప్పుడు గుడ్డివాడివి అయ్యావ”ని అడిగాను. అతను “చాలా కాలంగా అలా ఉన్నా”నని సమాధానం ఇచ్చాడు. అతని గొంతు చిన్నపిల్లల గొంతులా ఉంది. కానీ అతను పరిణతి చెందిన వ్యక్తిలా మాట్లాడుతున్నాడు గానీ, తండ్రి పట్ల గౌరవం లేనట్టు మాట్లాడుతున్నాడు.
మేము చిన్న వరి పొలాన్ని దాటుతూ ఒక పొడవైన కాలిబాటలో ఉన్నాము. అప్పుడప్పుడు ఒక మంచు కొంగ అక్కడ చీకటిలోకి తదేకంగా చూస్తోంది.
“మనం వరి పొలానికి వచ్చాం అనుకుంటా” అని నా వీపు మీద కూర్చున్న అబ్బాయి అన్నాడు.
“నీకెలా తెలుసు?” అతని వైపు తల తిప్పి అడిగాను.
“కొంగ అరుపు ద్వారా నాకు తెలుసు.”
అప్పుడు అతను చెప్పినట్లుగానే రెండుసార్లు కొంగ అరుపు వినిపించింది.
అతను నా కొడుకు అయినప్పటికీ, అతనికి భయపడటం ప్రారంభించాను. ఈ వింత జీవి నా వీపు మీద ఉండగా, నాకు ఏదో భయంకరమైన సంఘటన జరగబోతోందని నాకు అనిపించింది. ఈ జీవిని వదిలించుకొని, పారవేయడానికి మంచి స్థలం కోసం చుట్టూ వెతికాను. ముందు చీకటిలో ఒక పెద్ద అడవి ఉంది. అలా చేయడానికి అది మంచి ప్రదేశం అని నేను అనుకున్నాను, ఆపై నా వెనుక నుండి నవ్వు వినిపించింది.
“ఎందుకు నవ్వుతున్నావు?” అని అతనిని అడిగాను. నా ప్రశ్నకు సమాధానం లేదు. బదులుగా అతను, “నేను మీకు బరువుగా ఉన్నానా, నాన్నా..?” అని అన్నాడు. నేను “లేదు” అని సమాధానం ఇచ్చాను. అతను, “నేను త్వరలోనే బరువుగా ఉంటానని అనుకుంటున్నాను” అని అన్నాడు.
నేను మాట్లాడకుండా అడవి వైపు దృష్టి పెట్టి నడుస్తూనే ఉన్నాను. పొలాల గుండా తిరుగుతూనే ఉన్నాను కాబట్టి బయటకు రావడం కష్టంగా ఉంది. కొంతసేపటి తర్వాత నేను దారి రెండుగా చీలిపోయే దగ్గరికి చేరుకున్నాను. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆగాను.
“మీకు ఇక్కడ ఒక రాతి స్మారక చిహ్నం కనపడాలి” అని పిల్లవాడు అన్నాడు. అది నిజమే. నేను ఎనిమిది × ఎనిమిది అంగుళాల చదరపు ఆకారపు రాతి స్తంభాన్ని చూడగలిగాను. అది నా నడుము ఎత్తు వరకు ఉంది. ఎడమవైపున హిడారిగాకుబోకు, కుడివైపుకు అయితే హొట్టహారాకు వెళుతుందని అది చూపుతోంది. రాయిపై ఉన్న ఎర్రటి అక్షరాలు చీకటిలో కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. అవి నీటిఉడుము కడుపు మీద చారల్లా ఎర్రగా ఉన్నాయి.
“నువ్వు ఎడమ వైపుకు వెళ్ళడం మంచిది” అని బాలుడు నాతో అన్నాడు. నేను ఎడమ వైపుకు చూసాను, నేను వెళదామనుకున్న అడవులు మాపై చీకటి నీడలు పరుస్తున్నాయి. నేను కొంచెం సంకోచించాను.
“దేనికోసం ఎదురు చూస్తున్నావు?” ఆ బాలుడు మళ్ళీ నన్ను అడిగాడు. నేను అయిష్టంగానే అడవి వైపు వెళ్ళాను. అడవికి దారి తీసే బాటలో నేను నడుస్తూనే ఉన్నాను. అతను గుడ్డివాడు అయిప్పటికీ ప్రతిదీ ఎలా తెలిసిపోతుందని ఆశ్చర్యపోయాను.
“నాకు గుడ్డివాడుగా ఉండటం ఇష్టం లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది,” అని అతను నా వెనుక వైపుకి తిరిగి అన్నాడు.
“అందుకే నేను నిన్ను నా వీపు మీద మోసుకెళ్తున్నాను. అది నీకు మంచిగా వుంటుంది.”
“నన్ను మీ వీపుపై మోసుకుపోతున్నందుకు మీకు కృతజ్ఞుడను, కానీ నేను గుడ్డివాడినని ప్రజలు నన్ను మూర్ఖుడిని చేసారు. నా తండ్రి కూడా అలా చేసాడు.”
నాకు ఈ అబ్బాయి మీద అసహ్యం కలిగింది. వీలైనంత త్వరగా అతన్ని అడవిలో వదిలేయాలని తొందరపడ్డాను.
“ఇంకొంచెం ముందుకు వెళితే నీకు ఒకటి తెలుస్తుంది. అది సరిగ్గా ఇలాంటి రాత్రే జరిగిందని నాకు గుర్తుంది” అతను తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా, నా వైపు తిరిగి అన్నాడు.
“నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?” నేను అతనిని తీవ్రంగా అడిగాను.
“ఎందుకు నన్ను అడుగుతున్నావు? మీకు బాగా తెలుసు,” అని పిల్లవాడు అవహేళనగా అన్నాడు. అప్పుడు నాకు ఏదో తెలుసు అని అనిపించింది, కానీ అదేమిటో పూర్తిగా తెలియదు. అది నిజంగా ఇలాంటి రాత్రే జరిగిందని నాకు అనిపించింది. కొంచెం ముందుకు వెళితే నాకు మరింత రూఢి అవుతుంది. కానీ అదేమిటో తెలుసుకోకుండా నేను దూరంగా వుంటేనే మంచిదని ఏదో నన్ను హెచ్చరించింది. నేను అదేందో తెలుసుకునేలోపు వీలైనంత త్వరగా అతన్ని వదిలించుకోవాలి. నేను నా వేగాన్ని ఇంకా పెంచాను.
కొద్దిసేపటి నుండి వర్షం పడుతోంది. ఒక్కో అడుగు వేసే కొద్దీ చీకటి కమ్ముతోంది. నేను ముందుకు సాగడంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాను. నా వీపుకు అతుక్కుపోయిన ఆ బాలుడు అద్దంలాగా మెరుస్తూ నా గతం, వర్తమానం, భవిష్యత్తులోని ప్రతి చిన్న విషయాన్ని ప్రతిబింబిస్తున్నాడు. అతను నా స్వంత బిడ్డ, అంధుడు. నేను ఇక భరించలేకపోయాను.
“ఇదిగో! ఇదిగో, ఆ దేవదారు చెట్టు మొదల్లో..!” వర్షంలో అతని గొంతు చాలా స్పష్టంగా వినిపించింది. నేను స్పృహ లేనట్టు ఆగిపోయాను. నాకు తెలియకుండానే నేను అడవిలోకి వచ్చాను. ఆరు అడుగుల ముందు నల్లగా ఏదో ఉంది. అతను చెప్పినట్లుగా అది దేవదారు చెట్టులా కనిపించింది.
“నాన్నా..ఆ దేవదారు చెట్టు మొదల్లో చేశావు..మీకు గుర్తుందా?”
“అవును, అక్కడే చేశాను” అని నన్ను నేను ద్వేషిస్తూనే జవాబిచ్చాను.
“ఇది బుంకా 5వ సంవత్సరం (1808), డ్రాగన్ సంవత్సరం, కాదా?”
అతను చెప్పింది నిజమే అనుకున్నాను.
“కాబట్టి నువ్వు నన్ను ఇక్కడ చంపి సరిగ్గా 100 సంవత్సరాలు అయింది!”
ఈ మాటలు విన్న వెంటనే, 100 సంవత్సరాల క్రితం, బుంకా 5వ సంవత్సరం, డ్రాగన్ సంవత్సరంలో, ఇదే దేవదారు చెట్టు మొదల్లో, ఇలాంటి ఒక రాత్రి, నేను ఒక గుడ్డివాడిని చంపానని నాకు అకస్మాత్తుగా గుర్తు వచ్చింది. మొదటిసారిగా నేను హంతకుడిని అని గ్రహింపుకి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా నా వీపుపై ఉన్న చిన్న పిల్లవాడు మునుపటి కంటే చాలా బరువుగా, జిజో* రాతి పిల్లవాడిలాగా మారిపోయాడు.
(జిజో బోసాట్సు – పిల్లల, ప్రయాణికుల రక్షక దేవత. వీరిని ‘భూమిని భరాయించే దేవత’ (earth bearer) అని కూడా పిలుస్తారు. అందుకే జిజో విగ్రహాలు రాతితో చేస్తారు. ఈ రాయికి బౌద్ధమత విశ్వాసాల కంటే ముందు నుంచే రక్షణ, దీర్ఘాయువు ఇచ్చే ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు.)
![]()
సుసొకి నట్సుమే పరిచయం
సుసొకి నట్సుమే 1867 ఫిబ్రవరి 9 న (మెయిజీ యుగం ప్రారంభం), టోక్యో (అప్పటి ఎడో) జన్మించాడు. బాల్యంలో తల్లిదండ్రులు విడిపోయి, దత్తత కుటుంబంలో పెరిగాడు. పేరు “నట్సుమే” అక్కడి నుంచి వచ్చింది. టోక్యో ఇంపీరియల్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ సాహిత్యం చదివాడు (1893లో గ్రాడ్యుయేషన్). జపాన్‌లోనే మొదటి ఇంగ్లీష్ లిటరేచర్ ప్రొఫెసర్ (టోక్యో యూనివర్శిటీ).
1900-1903 వరకు బ్రిటన్‌లో స్కాలర్‌షిప్‌పై ఉన్నాడు. అక్కడి ఒంటరితనం, న్యూరాస్థీనియా వల్ల మానసిక క్లేశం అనుభవించాడు. ఈ అనుభవాలే తర్వాత అతని రచనల్లో “ఆధునిక మనిషి – ఒంటరితనం” థీమ్‌గా మారాయి. 1907లో అసాహి షింబున్ పత్రికలో ఫుల్-టైమ్ రచయితగా చేరి, జపాన్‌లో తొలి “ప్రొఫెషనల్ నవలాకారుడు” అయ్యాడు.
సుసొకి లేకపోతే ఆధునిక జపాన్ సాహిత్యం ఇంత లోతుగా ఉండేది కాదు. మురకామి, ఒయే కెంజాబురో వంటి తర్వాతి రచయితలందరూ అతని వారసులే. జపాన్‌లో షింకింగ్ షోసెత్సు (మానసిక నవల) జానర్‌కు ఆద్యుడు. జపాన్ 1,000 యెన్ నోటు మీద అతని ముఖచిత్రం ఉంటుంది (2004-2024 వరకు).
1916 డిసెంబర్ 9 (వయసు 49) న మరణించాడు.

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.




Discussion about this post