కన్నడ మూలం: సరితా నవలి
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
న్యూజెర్సీ, ఎడిసన్‌లోని ఆసియా ప్యాలెస్ రెస్టారెంట్‌లోని విశాలమైన బాంకెట్ హాల్ అది. చాలా అందంగా అలంకరించబడింది. పైకప్పు నుండి వేలాడుతున్న పెద్ద, పెద్ద షాండిలియర్లు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తున్నాయి. ఆ రోజు పార్టీ యొక్క ప్రత్యేక రంగు ‘లేత గులాబీ‘ అని అక్కడ ఉన్న ప్రతి వస్తువును చూస్తే తెలుస్తోంది. పార్టీ హాల్‌లోని ఓ భాగంలో ఒక అడుగు ఎత్తున్న వేదికపై, వెనుక భాగంలో అర్ధచంద్రాకారంలో లేత గులాబీ రంగు బెలూన్‌లను అలంకరించి, ముందు ఒక సింహాసనంలా కనిపించే కుర్చీని ఉంచారు. లేత గులాబీ రంగు డిజైనర్ గౌను, దానికి సరిపోయే రూబీ నెక్సస్ , పెద్ద హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్, గులాబీ రంగు క్రిస్టల్ క్లిప్‌తో కట్టిన ఆమె పొడవాటి గిరజాల జుట్టు, తలపై లేత గులాబీ రంగు స్ఫటికాలు పొదిగిన చిన్న, నాజూకైన కిరీటాన్ని ధరించి, తన అందానికి సరిపోయేలా మితంగా అలంకరించుకుని కుర్చీలో కూర్చున్న ‘రియా‘, ఒక రాజవంశానికి చెందిన అందమైన రాకుమారిలా మెరిసిపోతోంది. వేదిక వెనుక గోడపై అతికించిన బ్యానర్‌లో “హ్యాపీ స్వీట్ సిక్స్‌టీన్… రియా!” అని రాసి ఉంది. వేదిక కుడి వైపున ఉన్న 60 అంగుళాల టీవీ తెరపై రియా చిన్నపాపగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు జీవితంలోని చాలా క్షణాలను బంధించిన ఫోటోలు ప్రదర్శితమవుతూ, ఇది రియా స్వీట్ సిక్స్‌టీన్ పార్టీ అని స్పష్టం చేస్తోంది.
“థాంక్స్ ఫర్ యువర్ విషెస్,” “ప్లీజ్ కమ్, థాంక్స్ ఫర్ కమింగ్” అనే మాటలు వినిపిస్తున్నాయి. రియా తండ్రి వీ.కే. (వెంకటకృష్ణ) సూటు ధరించి పార్టీ హాల్ ద్వారం వద్దే నిలబడి పార్టీకి వస్తున్న స్నేహితులను ఆహ్వానిస్తున్నాడు. “యు ఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ సంగీతా.” “హే, దిస్ నెక్లెస్ ఈజ్ సో బ్యూటిఫుల్” అనే మాటలు పార్టీకి వచ్చిన మహిళల నుంచి వినిపిస్తున్నాయి. రియా తల్లి సంగీతను ఆమె స్నేహితురాళ్లు చుట్టుముట్టి, ఆమె కట్టుకున్న డిజైనర్ చీర, దానికి తగినట్లు ధరించిన నగలే విషయంగా మాట్లాడుకుంటున్నారు. ఇక పార్టీకి వచ్చిన చిన్న పిల్లలు అలంకరణ కోసం ప్రతి టేబుల్‌పై పెట్టిన బెలూన్‌లను తీసుకుని ఆడుకుంటుంటే, వేదికకు దూరంగా ఉన్న రెండు టేబుల్‌లను కలిపి పెద్దదిగా చేసుకుని, దాని చుట్టూ కూర్చున్న రియా స్నేహితుల్లో కొందరు తమ మొబైల్ ఫోన్లలో నిమగ్నమై ఉంటే, మరికొందరు అమెరికన్ ఇంగ్లీష్‌లో బిగ్గరగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
“వాట్! యు ఆర్ సర్వింగ్ ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్?” అని కిషోర్ బాబు డ్రింక్స్ కౌంటర్ వద్ద బిగ్గరగా అడుగుతున్నాడు. చెవులకు తాకుతున్న సంగీతం యొక్క హోరులో వారు మాట్లాడుతున్న మాటలు ఇతరులకు వినిపించడం లేదు. “లేదబ్బా… కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే పెట్టారు. అందుకే నేను కూడా కోక్ తాగుతున్నాను,” అని శ్రీని సర్ది చెప్పాడు. కిషోర్ బాబులాగే కొంతమంది అతిథులకు బార్ కౌంటర్ వద్ద తాగడానికి కేవలం సోడా పానీయాలు మాత్రమే ఉంచడం నిరాశ కలిగించింది. “డైట్ కోక్ ఉందా?”, “పెప్సీ లో షుగర్ ఉందా?” అని కొంతమంది మహిళలు తమ ప్లేట్ల నిండా సమోసా, చాట్స్, కబాబ్‌లను నింపుకుని డ్రింక్స్ కౌంటర్ వద్ద విచారిస్తున్నారు!
రియా ఐదు నెలల పాపగా ఉన్నప్పటి నుంచి న్యూజెర్సీలోనే స్థిరపడిన వి.కె., సంగీత దంపతుల ‘స్నేహితుల బృందం‘ చాలా పెద్దదిగానే ఉంది. ఆహ్వానించిన అతిథుల్లో చాలామంది వచ్చేసరికి పార్టీ సందడిగా మారింది. పదహారు కొవ్వొత్తులను ఊది, పెద్దగా, కస్టమైజ్ చేసిన కేక్‌ను రియా కత్తిరించినప్పుడు, అందరూ ఆమెను ఆశీర్వదించి, “హ్యాపీ బర్త్‌డే టు యు రియా, గాడ్ బ్లెస్ యు” అని పాడారు. పక్కనే నిలబడిన అమ్మ, నాన్న రియా తల నిమిరి, అభిమానంతో ఆశీర్వదించినప్పుడు, రియా వారిద్దరినీ కౌగిలించుకుంది. ఆ తర్వాత డి.జె. వేసిన పాటలకు పార్టీ హాల్ మధ్యలో ఉన్న డ్యాన్స్ ఫ్లోర్‌లో రియా స్నేహితుల గుంపు, సంగీత–వెంకటకృష్ణల స్నేహితులు, చిన్నపిల్లలు అందరూ డ్యాన్స్ చేసి, ఉల్లాసంగా గెంతుతూ పార్టీకి మరింత కళ తెచ్చారు. స్టార్టర్స్, దోసె, మెయిన్ కోర్స్, ఐస్ క్రీమ్, కోక్ అన్నీ తిని, తాగి, డ్యాన్స్ చేసి–సంతోషించి, నాలుగు గంటల పాటు రియా పదహారవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వీ.కే., సంగీతలు తమ ఒక్కగానొక్క కూతురు రియా యొక్క పదహారు సంవత్సరాల జీవితంలోని ప్రతి నిమిషాన్ని సంతోషపెట్టినట్లే, ఈ పార్టీని కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. రియా మాట్లాడుతూ తన జీవితంలోని పదహారు సంవత్సరాల ప్రతి క్షణం తనకు ముఖ్యమైనదని చెప్పింది. “లవ్ యూ మామ్, లవ్ యూ డాడ్” అని కళ్లలో నీళ్లు నింపుకుని తల్లిదండ్రులను కౌగిలించుకుంది.
పార్టీ తర్వాత, ముగ్గురూ ఇంటికి వచ్చి అక్కడ జరిగిన విషయాల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత, నిద్రించడానికి తన గదిలోకి వెళుతున్న రియాను బట్టలు మార్చుకుని రమ్మని అడిగినప్పుడు సంగీత, వీ.కే.ల కళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. బట్టలు మార్చుకుని తల్లి పక్కన కూర్చున్న రియా తలను ప్రేమగా నిమిరిన సంగీత కళ్ళు ఆప్యాయతతో నిండిపోయాయి. వి.కె. మాట్లాడటం ప్రారంభించి, పదహారు సంవత్సరాలుగా రియా నుండి దాచిపెట్టిన విషయాన్ని ఆమెకు వెల్లడించాడు. రియా ‘అద్దె గర్భంలో పెరిగిన బిడ్డ అని ఆమెకు చెప్పినప్పుడు, ఆశ్చర్యపోయిన రియా కళ్లలో అనేక ప్రశ్నలు కనిపించాయి. వీ.కే. సంగీతల వివాహం తర్వాత రెండు–మూడు సంవత్సరాలలో, సంగీతకు మూడుసార్లు గర్భస్రావ మయ్యింది. ఆమె గర్భాశయంలో సమస్య కారణంగా తొమ్మిది నెలల వరకు ఆమె గర్భం పూర్తి చేయలేకపోతుందని, దానికి చికిత్స లేదని డాక్టర్ చెప్పి, దానితో పాటు ఒక సలహా కూడా ఇచ్చారు. అప్పుడు సంగీత, వెంకటకృష్ణలు తమ సొంత బిడ్డను పొందడానికి సరోగసీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకున్నారు. ఆనాటి తమ నిస్సహాయతను వివరిస్తూ, దానిని అర్థం చేసుకునే పరిణతి పదహారు సంవత్సరాల తమ కూతురికి ఉందని భావించి, ఈ రోజు రియా జన్మ రహస్యాన్నిఆమెతో పంచుకున్నారు. రియా మాట కొనసాగించకుండా, వారిద్దరినీ ఒకసారి చూసి తన గదిలోకి వెళ్లిపోయింది.
ఇప్పుడిప్పుడే రియా ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చినట్లు సంగీత గ్రహించింది. తానూ, తన గదీ అన్నట్లుగా ఉన్న రియా మాటల్లో మునుపటి ఉత్సాహం లేదు. తనను చూడగానే కళ్లలో మెరుపు నింపుకుని, “అమ్మా…”, “అమ్మా…” అంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా తనతో పంచుకునే పిల్లల్లో చిన్న మార్పు కనిపించినా, క్షణంలో దానిని గుర్తించడం ‘అమ్మ‘కు మాత్రమే సాధ్యమవుతుంది కదా? ఎప్పటిలాగే నాన్నతో కాసేపు మాట్లాడటం, తన చదువు గురించి చర్చించడం చూసిన సంగీతకు, కూతురు తనపై ఏదో కోపం పెట్టుకున్నట్లు అనిపించింది. దీని గురించి మాట్లాడాలనుకున్న తల్లి మాటలను రియా పట్టించుకోలేదు. ఆమె భావరహితమైన మాటలను, ప్రశ్నలతో నిండిన కళ్ళను చూసి, సంగీత హృదయం తల్లడిల్లింది.
“నీవేం నన్ను మోసినదానివి కాదు, కన్నదానివి కాదు,” అని హేళన చేస్తే ఏమని సమాధానం చెప్పాలి? సంగీత భయపడింది.
రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్న విజ్ఞాన శాస్త్రం, దాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన వైద్యరంగం సహాయంతో తాను, తనలాంటి ఎంతో మంది ఆడపిల్లలు తల్లి కావాలని కోరుకోవడంలో తప్పేముంది? రియా తన అంశ నుంచే పుట్టిన కూతురు కదా? అని ఆలోచించి బాధపడింది సంగీత. ఎన్నో రోజులు ఒంటరిగా ఆలోచించి మనసు నొచ్చుకుని, ఒక రోజు భర్త వెంకటకృష్ణ ముందు ఈ విషయం గురించి మాట్లాడింది. తండ్రీకూతుళ్ల బంధంలో పెద్ద మార్పు చూడని వీ.కే., సంగీతలో ఇటువంటి ఆందోళన కలగడానికి కారణం అతిగా ఆలోచించే స్వభావమే అని కొట్టి పారేశాడు. దాంతో సంగీత తన మాట కొనసాగించకుండా మౌనంగా ఉండిపోయింది.
సంగీత మౌనం రియాలో మరింత మార్పును తెచ్చింది. ఆమె ఇప్పుడు తన స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించింది. సంగీత ప్రశ్నించే, ఆప్యాయత నిండిన కళ్లను ఇప్పుడు చూసీ చూడనట్లుగా తన గదిలోకి వెళ్లడం మొదలుపెట్టింది. ఎక్కువగా ఆఫీసు పని మీద టూర్‌లో ఉండే వీ.కే.కి ఇదంతా గమనించే సమయం దొరకకపోవడాన్ని తన అవకాశంగా మార్చుకుంది రియా. అయితే ఇదంతా చూస్తున్న సంగీత మాతృహృదయం తల్లడిల్లిపోయింది. బిజినెస్ ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన వీ.కే.కి రియాలో ఈ మధ్య వచ్చిన మార్పుల గురించి చెప్పి, తన మనసులో ఉన్న ‘సరోగేట్ తల్లి‘ గురించిన ఆందోళనలను కూడా వ్యక్తం చేసింది.
“సరోగసీ ద్వారా బిడ్డను కనాలనేది నీ నిర్ణయం. దాని మీద పెద్దగా ఆసక్తి లేని నన్ను నువ్వు బలవంతం చేశావు. ఆ రోజు ఒక బిడ్డ నిన్ను అమ్మా అని పిలవాలని కోరుకున్నావు. నీవూ మాతృత్వాన్ని అనుభవించాలని ఆ రోజు అన్నావు కదా, చూడు ఇప్పుడు… ఆ బిడ్డనే దాన్ని నీ గర్భంలో పెంచలేదు అనే కారణంతో, నిన్ను అమ్మ అని ఒప్పుకోకుండా నీ నుంచి దూరమవుతోంది. నేను ఇప్పుడు ఏం చేయగలను?” ప్రయాణ అలసటో, ఆఫీసు పని ఒత్తిడో ఏమో, సంగీత మాటల వల్ల చిరాకు పడిన వీ.కే., అసహనంతో గొంతు పెంచాడు. “నా స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు?” అని తానూ అరిచి అడగాలనుకున్నా, సంగీత మళ్లీ ఎప్పుడూ ఈ విషయం గురించి మాట్లాడలేదు.
“మమత–వాత్సల్యం చూపిస్తున్న నేను రియాకు తల్లిని కాదా?” అని మనసులో ప్రశ్నించుకుని రోదించింది.
![]()
హైదరాబాద్‌లో వెంకటకృష్ణ అక్క కూతురు పెళ్లికి, అందరూ తప్పకుండా రావాలని విమలక్క బలవంతం చేసి ఆహ్వానించినప్పుడు వీ.కే.కు తన ఊరి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఇరవై ఐదేళ్ల క్రితం తమ ఇంట్లో విమలక్క పెళ్లి జరిగి, సంవత్సరం లోపే సుమిత్ర పుట్టినప్పటి సంబరాన్ని గుర్తు చేసుకున్న వీ.కే. “అరె! ఆ చిన్నారి పాప సుమిత్రకి ఇప్పుడు పెళ్లి, వెళ్లక తప్పదు” అనుకుని కనీసం వారం రోజులైనా హైదరాబాద్‌కు వెళ్లి రావాలనుకున్నాడు.
రియా స్కూల్‌కి సెలవులు ఉన్నప్పటికీ, ఆమెకు సంగీతతో కలిసి పెళ్లికి వెళ్లాలనే కోరిక లేదు. ఇక సంగీత, కూతురితో కలిసి న్యూజెర్సీలోనే ఉండిపోతే విమలక్క కోపగించుకోవడమే కాక, అత్తా–ఆడపడుచులకు ఆడిపోసుకోవడానికి తాము అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకుని, రియా గదికి వెళ్లి తామందరం సుమిత్ర పెళ్లికి తప్పకుండా వెళ్లాల్సిందేనని చెప్పింది. సంగీత ఈ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న రియా ఒక షరతు పెట్టింది. ఆమె హైదరాబాద్ వెళ్ళినప్పుడు, తనను తొమ్మిది నెలలు కడుపులో మోసి జన్మనిచ్చిన ‘సరోగేట్ తల్లి‘ని కలవాలనుకుంది.
“అదంతా కుదరదు. అలా కలవకూడదని అగ్రిమెంట్‌లో రాసి ఉంది. మేము మాట కూడా ఇచ్చాము.”
“ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ యు. ఐ నీడ్ టు మీట్ హర్ అండ్ టాక్ టు హర్.”
“ఎందుకు పాపా, ఇలా మొండి పట్టు పడతావు?”
బాధగా పలికిన సంగీత దీనికి ఒక ఉపాయం వెతికింది. సుమి పెళ్లి తర్వాత తామిద్దరం మూడు వారాలు హైదరాబాద్‌లోనే ఉందామని, ‘అద్దె తల్లి‘ని కలిసే విషయం వీ.కే.కు తెలియకూడదని కూతురికి రహస్యంగా చెప్పి ఊరికి బయలుదేరదీసింది.
విమలక్క ఇంట్లో పెళ్లి సంబరం. వెంకటకృష్ణ అయితే తన పాత స్నేహితులతో, బంధువులతో కబుర్లు చెప్పుకోవడంలో, కాలక్షేపం చేయడంలో మునిగిపోయాడు. విమలక్క ఇంటికి చాలా దూరంలో సంగీత పుట్టినిల్లు ఉండటం వలన సుమిత్ర పెళ్లి ముగిశాక అమ్మ ఇంటికి వెళ్లవచ్చనుకుంది సంగీత. రియా తన కజిన్స్‌తో సంతోషంగానే మాట్లాడింది. ఆబిడ్స్, బడేచౌడి, సుల్తాన్ బజార్‌లలో తిరిగింది, షాపింగ్ చేసింది. చార్మినార్ దగ్గర ఉన్న ‘చూడిబజార్‘కి వెళ్లి గాజులు కొనుక్కుంది. కానీ అమ్మతో మాత్రం మాటలు తక్కువగానే. ఈ విషయం బంధువులకు అనుమానం రాకూడదని సంగీత కూతురికి ఎప్పటిలాగే ఆప్యాయత, ప్రేమ చూపినప్పుడు రియా చిరాకు పడుతుండటం చూసి మనసులోనే బాధపడింది.
విమలక్క కూతురు పెళ్లికి సంగీత ఊరికి వచ్చిన విషయం తెలుసుకున్న ఆమె స్నేహితురాలు స్వాతి ఫోన్ చేసి మాట్లాడింది. వెంకటకృష్ణ బావ, స్వాతి భర్త ఇద్దరూ దగ్గరి బంధువులు కావడంతో సుమిత్ర పెళ్లి వేడుకలన్నింటికీ తాను వస్తున్నానని స్వాతి చెప్పింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన స్నేహితురాలిని కలవడం గురించి ఆలోచిస్తూ సంగీత సంతోషించింది. తన జీవితానికి స్వాతి ఎంత దగ్గరగా ఉండేదో గుర్తుకు వచ్చి ఆమె మనస్సు ఇరవై సంవత్సరాల వెనక్కి పరుగెత్తింది.
హైదరాబాద్‌లో ఉన్న వెంకటకృష్ణతో సంగీత వివాహం జరిగి రెండేళ్లు అయింది. వెంకటకృష్ణకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం. సంగీత కూడా అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ప్రాజెక్టు పని నిమిత్తం వెంకటకృష్ణకు అమెరికాలోని ఫీనిక్స్‌కు వెళ్లే అవకాశం దొరికినప్పుడు సంగీతకు సంతోషం కలిగింది. అత్తగారింట్లో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, ఈ రెండు సంవత్సరాలలో ఆమెకు రెండుసార్లు ‘మిస్ క్యారేజ్‘ అయ్యి చాలా బాధ కలిగించింది. అది చాలా బాధాకరం. పెళ్లైన ఆరు నెలల తర్వాత తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు, సంగీత మాతృత్వం గురించి అందమైన కలలను కనింది. కానీ ఆ తర్వాత ఆరు వారాలలోనే మిస్ క్యారేజ్ అయినప్పుడు సంగీత కన్న కల ముక్కలైపోయింది. బాధపడిన మనస్సుతో సంగీత డాక్టర్‌తో ఈ విషయం గురించి మాట్లాడింది.
“నాకు మిస్ క్యారేజ్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది డాక్టర్?”
“దాని గురించి ఎందుకంత ఆలోచిస్తున్నారు? పూర్వం అమ్మమ్మలు చెప్పేవారు కదా, వారి మొదటి ఒకటి, రెండు పిల్లలు పోయాయని, ఆ తర్వాత ఎనిమిది–పది మంది పిల్లలు పుట్టేవారు కదా? ఇదీ అంతే.” అని సర్దిచెప్పి పంపించారు.
తరువాత ఒక సంవత్సరంలో అదే రిపీట్ అయినప్పుడు సంగీత, వెంకటకృష్ణలు ఆందోళనతో డాక్టర్ వద్దకు పరుగెత్తారు. సంగీత మళ్లీ అదే ప్రశ్నను అడిగింది.
“నాకు మళ్లీ మిస్ క్యారేజ్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది డాక్టర్?” డాక్టర్ కూడా ఈసారి ఏమాత్రం సంకోచించకుండా సంగీతకు కొన్ని మెడికల్ టెస్ట్‌లు చేయించి, “అంతా సరిగ్గానే ఉంది. ఏం ఇబ్బంది లేదు” అన్నారు. కానీ రెండవసారి కూడా మాతృత్వపు కల ముక్కలైనప్పుడు సంగీతకు షాక్ తగిలినట్లయింది. ఉద్యోగాన్ని కూడా వదిలేయడంతో, ఈ మధ్య వాతావరణం పట్ల అసహనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లడానికి దొరికిన అవకాశం ఇద్దరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. కొత్త కలలను మోసుకుని ఫీనిక్స్‌కు వచ్చారిద్దరూ.
కొత్తదనం గాలి సోకిన జంట తమ పాత జీవితంలోని ఏకరూపత నుండి బయటపడి దాని సువాసనను పీల్చడం ప్రారంభించారు. అది కొన్నిసార్లు సున్నితంగా శరీరాన్ని తాకి, మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే సాయంకాలపు చల్లటి గాలిలా ఉంటే, కొన్నిసార్లు సెగ పుట్టించే వేడి గాలిలా కూడా ఉండేది. రోజులు ఇలాగే సాగుతుండగా సంగీతకు మూడవసారి ఐన మిస్ క్యారేజ్ వారి జీవితంలో తుఫానులా దాడి చేసింది. ఏదో కొన్ని టెస్ట్‌లు చేసి, సంగీత ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదని హైదరాబాద్ వైద్యులు వేసిన అంచనా తప్పయింది. మూడవసారి కూడా ‘అమ్మ‘ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సంగీత మానసికంగా కృంగిపోయింది. ఫీనిక్స్‌లో వెంకటకృష్ణ ఆఫీస్ ప్రాజెక్ట్‌లో ఉన్న భారతీయ స్నేహితుల గుంపు పెద్దదిగా ఉంది. ఆ గుంపులో నెలకు ఒకసారైనా జరిగే ‘ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్‘, ‘బేబీ షవర్‘, పిల్లల నామకరణం, పిల్లల బర్త్‌డే పార్టీ సంబరాలను చూస్తున్న సంగీత, తనకు ఈ భాగ్యం లేదని కన్నీరు పెడుతూ నిరాశతో కృంగసాగింది. ఇదే సమయంలో ఆమెకు స్వాతి పరిచయమైంది. కాలిఫోర్నియాలో కొన్ని సంవత్సరాలు నివసించిన స్వాతి కుటుంబం ఇప్పుడు ఫీనిక్స్‌కు వచ్చి స్థిరపడింది. స్వాతి భర్త రామకృష్ణ, వెంకటకృష్ణ బావకు బంధువు కూడా కావడంతో ఈ స్నేహం–బంధం వారిని మరింత దగ్గర చేసింది. స్వాతి కవల పిల్లలు అర్జున్, ఆదిత్యలను సంగీత బాగా ఇష్టపడింది. స్వాతి సరళత, ఆత్మీయత, మాటల్లోని ఆప్యాయత, సంగీతకు అరిజోనా ఎడారిలో ‘ఒయాసిస్ దొరికినట్లుగా‘ అనిపించి, తన జీవితపు పుటలను ఆమె ముందు విప్పింది.
స్వాతి సలహా మేరకు, అక్కడి నిపుణులైన వైద్యులను కలిసిన సంగీత వారికి తన సమస్యను వివరించి అనేక కొత్త రకాల, ఆధునిక పరీక్షలు చేయించుకున్న తర్వాత, ఆమె ఆరోగ్య సమస్య ఏంటో తెలిసి వచ్చింది! అదే సమస్య కారణంగా, ఆమె తొమ్మిది నెలల గర్భధారణను పూర్తి చేయలేకపోతోంది. ప్రస్తుత వైద్య రంగంలో దీనికి పరిష్కారం లేదని చెప్పిన డాక్టర్, ‘సరోగసీ‘ ద్వారా బిడ్డను పొందవచ్చని కూడా సర్ది చెప్పారు. ఇదంతా జరిగేలోపు వెంకటకృష్ణ కంపెనీ అతనిని హైదరాబాద్‌కు తిరిగి పిలిపించింది.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సంగీత, ‘సరోగసీ‘ గురించి ఆలోచించి, దాని గురించి ఎక్కువ సమాచారాన్ని సేకరించి, ఏడ్చి–బతిమాలి వెంకటకృష్ణను ఒప్పించి, హైదరాబాద్‌లోని డాక్టర్‌లను కలిసింది. భారతదేశంలో ‘సరోగసీ‘ చట్టబద్ధం కావడం వలన చట్టపరంగా పెద్ద ఇబ్బందులు లేవని తెలుసుకుంది. ఇక ‘అద్దె తల్లి‘ కోసం అన్వేషించి, స్వాతి పుట్టింటి వైపు దూరపు బంధువు లతను ఒప్పించారు. గుంటూరు దగ్గర ఉన్న ఒక గ్రామానికి చెందిన లత ఇద్దరు చిన్న పిల్లలు, అవిటివాడైన భర్తతో జీవితాన్ని నెట్టుకురావడానికి కష్టపడుతోంది. సైనికుడైన ఆమె భర్త నక్సలైట్ల ల్యాండ్‌మైన్ దాడిలో కాళ్లు కోల్పోయాడు. ప్రభుత్వం నుంచి భర్తకు పెద్దగా సహాయం లభించక, పిల్లల స్కూల్ ఫీజు, భర్త చికిత్స కోసం డబ్బు సమకూర్చలేక నిస్సహాయంగా ఉన్న సమయంలో తనను సంప్రదించిన సంగీత, వెంకటకృష్ణల బిడ్డకు ‘అద్దె తల్లి‘గా ఉండటానికి ఒప్పుకుని, తన కుటుంబంతో సహా వచ్చి సంగీత పుట్టినింట్లో ఉండిపోయింది. దానికి తగ్గట్టుగా సంగీత కూడా తాను గర్భవతినని, ఎక్కువ విశ్రాంతి అవసరమని స్నేహితులకు, బంధువులకు చెప్పి ఎవరికీ అందుబాటులో లేకుండా పుట్టినింటికి చేరుకుంది. ఆమె పుట్టినింట్లో ఉండిపోయే నిర్ణయంతో అత్తామామలు, విమలక్క కొంత అసంతృప్తి చెందినప్పటికీ, ఈసారైనా గర్భం నిలిచి బిడ్డ పుడితే చాలని మౌనంగా ఉండిపోయారు.
తొమ్మిది నెలల తర్వాత, లత అందమైన, ఆరోగ్యకరమైన ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆమెను సంగీతకు అప్పగించింది. ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం, బిడ్డతో ఎలాంటి భావోద్వేగ సంబంధం పెట్టుకోనని, సంగీత కుటుంబాన్ని మళ్లీ ఎప్పుడూ కలవనని అంగీకరించి, వీరి నుంచి తన కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని స్వీకరించి, బిడ్డ వైపు తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు ‘తల్లి‘ అయినందుకు సంగీత చాలా సంతోషంగా ఉంది! బిడ్డను చూసుకోవడానికి ఆమె రాత్రింబవళ్ళూ బిడ్డ లాలన–పోషణలో మునిగిపోయింది. బిడ్డకు ఐదు నెలలు నిండి నామకరణం చేసే సమయానికే వెంకటకృష్ణకు పని మీద మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశం దొరకగా, న్యూజెర్సీకి వచ్చి స్థిరపడ్డారు. తల్లిదండ్రుల ప్రేమ, వాత్సల్యంలో ఊయల ఊగుతూ, పాకుతూ, అడుగులు వేస్తూ పెరిగిన రియా ఇప్పుడు పదహారు సంవత్సరాల అందమైన యువతి.
విమలక్క కూతురు సుమతి పెళ్లిలో సంగీత, స్వాతి ఒకరినొకరు కలుసుకుని సంతోషించారు. మాట… మాట… మాట! స్నేహితురాళ్లిద్దరి మాటలు ముగిసేలా కనిపించలేదు. సంగీత మాటల్లో పూర్తిగా రియా గురించే ఉండటం చూసి స్వాతి సంతోషించింది. బిడ్డ కోసం తపించిన సంగీత కడుపులోని బాధను చాలా దగ్గరగా చూసి స్పందించిన హృదయం కదా! స్వాతి కుటుంబం పది సంవత్సరాల క్రితమే భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆమె పిల్లలు అర్జున్, ఆదిత్యలు ఇప్పుడు ఎం.ఎస్. చదవడానికి అమెరికాలోని కాలిఫోర్నియాలోనే ఉన్నారని తెలిసినప్పుడు సంగీత చాలా సంతోషించింది. అటు పెళ్లి కార్యక్రమాలు వాటికవే జరుగుతున్నాయి. అందంగా అలంకరించుకుని కజిన్స్‌తో సినిమా పాటకు స్టెప్పులు వేస్తున్న రియాను పిలిచి స్వాతికి పరిచయం చేయాలనుకున్న తల్లి మాటలను ఆమె ఆమె కావాలనే విస్మరించింది. ఇంతలో అక్కడికి వచ్చిన వెంకటకృష్ణ చాలా అభిమానం, గౌరవంతో స్వాతితో మాట్లాడి, కూతురిని పిలవగానే నవ్వుతూ వచ్చిన రియా స్వాతిని పలకరించింది. రియా ప్రవర్తనతో సంగీత కళ్ళలో తడిని, ముఖంలో బాధను సూక్ష్మబుద్ధి కలిగిన స్వాతి గుర్తించింది. అయినా రియాతో సహజంగానే మాట్లాడి, వారందరినీ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది.
పెళ్లి సంబరం ముగిసేసరికి వెంకటకృష్ణ సెలవులు ముగిసి అతను న్యూజెర్సీకి బయలుదేరాడు. పెళ్లి ఇంటి వాతావరణంలోనూ తన ‘అద్దె తల్లి‘ని చూడాలనే ఆలోచనను రియా మర్చిపోయినట్లు లేదు. నాన్న న్యూజెర్సీకి వెళ్లిన తర్వాత ఆమె కళ్లలో కనిపిస్తున్న ప్రశ్నల పదునైన చూపును ఎదుర్కోలేక ఓడిపోయిన సంగీత, ఆమె ప్రశ్నలకు సమాధానం దొరికే ఒకే దారి అని రియాతో కలిసి తన అమ్మ ఇంటికి వెళ్లింది. రియా తన ‘అద్దె తల్లి‘ని కలవాలని మొండి పట్టు పడుతున్న విషయం సంగీత నుంచి తెలుసుకున్న ఆమె తల్లి గాబరా పడింది. మనవరాలికి ఎందుకింత మొండి పట్టు? అని బాధపడింది. తన మనసులోని బాధను దిగమింగుకున్న సంగీత మరుసటి రోజు స్వాతికి ఫోన్ చేసింది. సంగీత రియాతో కలిసి తన ఇంటికి తప్పక రావాలని పట్టుబట్టిన స్వాతికి వెంటనే సమాధానం చెప్పడానికి తటపటాయించింది. సంగీత కంగారును అర్థం చేసుకున్న స్వాతి ఆమె బాధకు కారణం ఏంటని అడిగింది. స్వాతి గొంతులోని ఆప్యాయతకు సంగీత మనస్సు కరిగిపోయింది. మరుసటి రోజే స్వాతి ఇంటికి వెళ్లి తన జీవితంలో మళ్లీ వచ్చిన సుడిగాలిని వివరించి, అగ్రిమెంట్ ప్రకారం తాను ‘అద్దె తల్లి‘ లతను కలవడానికి వీలులేదని చెప్పుకుంది. ఈ గందరగోళాల వలన రియా జీవితంలో జరుగుతున్న, ముందు జరగబోయే ఇబ్బందులను తలుచుకుని బాధపడుతున్న సంగీతని చూసిన స్వాతి, రియాను తాను తీసుకువెళ్లి లతను చూపించి వస్తానని భరోసా ఇవ్వగానే, స్వాతి చేతులను గట్టిగా పట్టుకున్న సంగీత బిగ్గరగా ఏడ్చేసింది. ఎన్నో రోజుల నుంచి ఆమె మనసులో దాగి ఉన్న బాధ, దుఃఖం కన్నీటి రూపంలో బయటకు వచ్చింది.
![]()
తన తల్లి వైపు ఉన్న బంధువు నుండి లత ప్రస్తుత చిరునామాను పొందిన సంగీత, స్వాతిని, రియాను కలిసి పంపడానికి సిద్ధమైంది. లత ఇప్పుడు గుంటూరు సమీపంలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. స్వాతి గుంటూరులోని తన బంధువుతో మాట్లాడి, అమెరికా నుండి వచ్చి ప్రభుత్వ పాఠశాలల గురించి సమాచారం సేకరించే ప్రాజెక్ట్ చేస్తున్న రియా, గుంటూరులో ఉండటానికి ఏర్పాట్లు కోరిందని తెలుసుకుంది. రియాతో కలిసి గుంటూరు వచ్చినప్పుడు, ఆమె తన బంధువు సహాయంతో అక్కడే ఉండటానికి మరియు లత గ్రామానికి కూడా వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంది. చేతిలో ఫైల్‌తో సిద్ధంగా ఉన్న రియా ప్రాజెక్ట్ కోసం సమాచారం సేకరించడానికి వచ్చినట్లు నటిస్తూ కనిపించడం చూసి స్వాతి తనను తాను ప్రశ్నించుకుంది.
“ఈ పాపకు మమత, ప్రేమ చూపించే తల్లిగా సంగీత ఉండగా, తనను మోసి, కన్న ‘అద్దె తల్లి‘ని చూడాలనే తపనే ఎక్కువగా ఉంది. ఇది మొండితనమా? ఆమె టీనేజ్ హార్మోన్లు ఆమెను చేయిస్తున్న వెర్రి సాహసమా?”
అటు చిన్నపిల్ల అనబడకుండా, ఇటు పెరిగిన అమ్మాయి కూడా కాకుండా ఉన్న పదహారేళ్ల రియా వయసుతో పాటు వచ్చే శారీరక, మానసిక మార్పులతో ఆమె మనసు గందరగోళంలో ఉన్నప్పుడు, ఆమె తల్లి ప్రేమను ఆమె ఎలా అర్థం చేసుకుంటుంది?
లత గ్రామానికి చేరుకుని, ఆమె పని చేస్తున్న పాఠశాల దగ్గరకు వెళ్లేసరికి రియాలో ఏదో ఆందోళన కనిపించింది. ఆమె కళ్లు లత కోసమే వెతుకుతున్నాయి. స్వాతి లతను కలిసి, ‘అద్దె తల్లి‘ గురించి మాట్లాడినప్పుడు లత ఆమె మాటను అంగీకరించక కోపగించుకుంది.
“అగ్రిమెంట్ ప్రకారం మళ్లీ కలవకూడదని నిర్ణయమైంది. మీరే, ఇప్పుడు వచ్చి మళ్లీ అడుగుతున్నారు? ఇప్పుడెందుకు ఈ ఆరాటం?” అని గొంతు పెంచింది.
స్వాతి అంతే ప్రశాంతంగా రియా మొండితనాన్ని, సంగీత బాధను వివరించినప్పుడు ఒప్పుకుంది, కానీ లత నుంచి వచ్చిన జవాబుకు స్వాతి ఆశ్చర్యపోయింది.
“నేను ‘సరోగేట్ తల్లి‘గా మోసి–కన్నది మగపిల్లవాడిని, ఈ ఆడపిల్లని కాదు!”
ఒక క్షణం ఏమి తోచక, పోయి కారులో కూర్చున్న రియాను తీసుకువచ్చి, ఈమె సంగీత కూతురు అని ఎంత చెప్పినా ఒప్పుకోని లత, తాను కని ఇచ్చింది మగబిడ్డనే అని చెప్పింది. “కావాలంటే మీరు ఆసుపత్రి రికార్డ్స్ చెక్ చేసుకోండి. మళ్లీ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి,” అని కోపగించుకుని తన తరగతి గదిలోకి వెళ్లిపోయింది.
లత మాట విని ఒకటి, రెండు నిమిషాలు ఏమీ తోచక నిలబడ్డ రియా మరియు స్వాతి వాస్తవానికి తిరిగి వచ్చి, హైదరాబాద్‌కు వెళ్లి ఆసుపత్రిలోని ‘బర్త్ రికార్డ్‘ చూడాలనుకున్నారు.
లత కన్నది మగపిల్లవాడిని అని తెలియగానే సంగీత ఉలిక్కిపడింది! ‘అద్దె తల్లి‘ గర్భంలో పెరిగింది తమ మగపిల్లవాడైతే, ఇన్నేళ్లు తాను ప్రేమతో పెంచిన రియాను కన్నదెవరు? ఈ ఆలోచనే ఆమెను వణికించింది. ఇక వెంకటకృష్ణకు ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడో? స్వాతి భయపడింది. మరుసటి రోజునే స్వాతితో కలిసి గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి పాత రికార్డ్స్ గురించి అడిగినప్పుడు అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి వీరిని పంపించడానికి ప్రయత్నించారు. వీరు కూడా పట్టువదలక ఆసుపత్రిలోని ‘జనన నమోదు‘ కార్యాలయానికి తిరిగి తిరిగి, అక్కడ క్లర్క్ చేతిలో నోట్ల కట్ట ఒకటి పెట్టినప్పుడు, అతడు పాత ఫైల్ దుమ్ము దులుపుకొని వీరి చేతికి ఇచ్చాడు! రియా ‘బర్త్ సర్టిఫికెట్‘లో నమోదు చేసిన తేదీని వెతికి చూసినప్పుడు, గర్భిణీ తల్లి పేరు సంగీత అని రాసి, ఆమెకు పుట్టిన బిడ్డ మగపిల్లవాడు అని, పుట్టిన తేదీ, పుట్టిన సమయాన్ని నమోదు చేశారు.
“ఆసుపత్రిలో ఆయా లేదా నర్సుల ద్వారా పిల్లలు మారిపోయారా? లేదా, సంగీత చేతికి ఆడపిల్లను ఇచ్చి, వీరి మగపిల్లవాడిని డబ్బు కోసం అమ్మేశారా? ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు, అక్కడక్కడ చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి కదా? అందరూ పుట్టబోయే బిడ్డ ఇంటికి కీర్తి తెచ్చే మగవాడు కావాలని కోరుకుంటే, హారతి పట్టే ఆడపిల్లలు కోరుకోకుండా పుట్టిన ప్రాణాలేనా?” అని ఆలోచించింది స్వాతి.
తన కొడుకును ఎవరికి ఇచ్చి ఉండవచ్చు? రియా ఎవరి బిడ్డ? ఆమె ఎవరిని అడగాలి? స్వాతి సంగీతలు ఆలోచిస్తుండగా, వారిద్దరి మాటలు వింటూ, ఆఫీసు సిబ్బంది వారికి నోట్లు ఇస్తుండటం చూసి, వారి నిస్సహాయతను తెలుసుకుని, తిరుగుతున్న ఒక నర్సు వారి దగ్గరకు వచ్చింది. ఆమె తనను తాను జైజీ వర్గీస్ అని పరిచయం చేసుకుని, పదిహేడు సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్నానని చెప్పింది. ఈ ఆసుపత్రిలో ప్రసూతి వార్డులో ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా ప్రధాన నర్సుగా పనిచేసి ఇప్పుడు పదవీ విరమణ చేసిన మేట్రన్ ఆదిలక్ష్మమ్మను కలిస్తే మరింత ఎక్కువ విషయం తెలియవచ్చని చెప్పగా, సంగీత మరియు స్వాతికి ఏదో ఒక ధైర్యం వచ్చింది. ఆదిలక్ష్మమ్మ అనే పేరు వినగానే సంగీతకు పదహారు సంవత్సరాల క్రితం ప్రసూతి వార్డులో ఉన్న పెద్ద గొంతు, ముడతలుగల ముఖం, లావుగా ఉన్న మహిళ గుర్తుకు వచ్చింది. కానీ ఆదిలక్ష్మమ్మ ఎక్కడ దొరుకుతుంది? స్వాతి దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం ఉంది, ఎందుకంటే రెండు నెలల క్రితమే, వందలాది విజయవంతమైన ప్రసవాలు చేసిన ఇదే ఆసుపత్రికి చెందిన ఒక నర్సును ప్రభుత్వం సత్కరించిందని టీవీలో వార్త చూసింది!
ఆదిలక్ష్మమ్మ ఇంటి చిరునామాను తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు సంగీతలో ఏదో తొందరపాటును రియా గమనించింది. తమ బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉండవచ్చో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్న సంగీతను చూసిన ఆమెను ఆలోచనలు చుట్టుముట్టాయి. తన తల్లిదండ్రులు ఎవరు? ఒకవేళ వారి ఆచూకీ దొరికినా, ఇప్పుడు వారు తనను కూతురుగా ఒప్పుకుంటారా? తమ కొడుకు దొరికాడు అని వెంకటకృష్ణ, సంగీతలు తనను దూరం చేస్తే, తన గతేమిటి? ప్రశ్నలు రియాలో భయాన్ని కలిగించాయి.
కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రోడ్డులోని చిన్న సందులో ఆదిలక్ష్మమ్మ ఇల్లు ఉంది. ముందు ద్వారానికి వేసిన తెరను పక్కకు జరిపి లోపలికి చూస్తే వరండాలో వేసిన మంచంపై మేట్రన్ ఆదిలక్ష్మమ్మ కూర్చుని ఉంది. అకస్మాత్తుగా తన ఇంటికి వచ్చిన ఈ ముగ్గురు మహిళలను చూసి ఆమె భయపడింది.
“మీరెవరు? ఏం కావాలి. ఎందుకు వచ్చారు?”
“నా బిడ్డను ఎవరికి ఇచ్చావు? ఎందుకు ఇలా చేశావు?” తలుపు నుంచి రెండు అడుగులు లోపలికి వెళ్లిన సంగీత, ఆదిలక్ష్మమ్మ చేతులను గట్టిగా పట్టుకుని, దీనంగా అడిగింది. సంగీత మాటలు విని ఆమె కోపగించుకున్నప్పుడు స్వాతి తన బ్యాగ్ నుంచి ఆసుపత్రి రికార్డు కాగితాన్ని బయటకు తీసి చూపించడం చూసి ఒక్కసారిగా ఆదిలక్ష్మమ్మ మౌనంగా ఉండిపోయింది.
“ఈ విషయం గురించి నీకు ఏం తెలుసు? దయచేసి చెప్పు. ఇది తల్లి–బిడ్డల జీవితానికి సంబంధించిన ప్రశ్న” అని సంగీత చేతులు జోడించి వేడుకున్నప్పుడు ఆదిలక్ష్మమ్మ అన్ని విషయాలు చెప్పింది.
‘అద్దె తల్లి‘ అయిన లతను సంగీత పేరుతో ప్రసవం కోసం అడ్మిట్ చేసిన రోజు, ఇంకా ఇద్దరు గర్భిణీలు ప్రసవం కోసం అడ్మిట్ అయ్యారు. లేబర్ రూమ్‌లో ప్రసవ వేదన అనుభవిస్తున్న ముగ్గురు గర్భిణీల జీవితాలు మూడు రకాల బాధలతో కూడి ఉన్నాయి. లత, సంగీత– వెంకటకృష్ణల బిడ్డకు ‘అద్దె తల్లి‘గా ఉంటే, అప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అయిన పుష్పవల్లి, నాలుగో ప్రసవంలోనైనా మగబిడ్డ పుడుతాడేమో అనే ఆశతో ఉంది. ఈసారి మగబిడ్డ పుట్టకపోతే తన జీవితం నరకమవుతుందని ఆమెకు తెలుసు. హైదరాబాద్ దగ్గర ఉన్న బాపట్లకు చెందిన ధనిక కుటుంబపు కోడలైన ఆమె ఈసారి వంశోద్ధారకుడిని ఇవ్వకపోతే, తాను తన ముగ్గురు ఆడపిల్లలు వీధుల పాలవుతామనే బాధతో పాటు ప్రసవ వేదనను అనుభవిస్తోంది. ఇక మూడో గర్భిణీ తారాబాయి, హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గా జిల్లాకు చెందినది. భర్త, ఇద్దరు ఆడపిల్లలతో పని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వచ్చిన ఆమె. మూడో బిడ్డైనా మగవాడు కావాలని కలవరం చెందుతోంది.
ఆడవారికి ప్రకృతి సహజంగా లభించే మాతృత్వం, సామాజిక, ఆర్థిక పరిస్థితుల సంకెళ్లతో కట్టివేయబడింది!
పది–పదిహేను నిమిషాల తేడాతోనే ముగ్గురికీ ప్రసవం అయ్యి, తారాబాయికి ఈసారీ ఆడపిల్ల పుట్టింది, అద్దె తల్లి లతకు మగబిడ్డ పుట్టాడు. పుష్పవల్లికి పుట్టిన మగబిడ్డ పుట్టేప్పుడే ప్రాణం కోల్పోయాడు. బిడ్డను చూసిన పుష్పవల్లి, మగబిడ్డ కావాలని చింతించి, అనుభవించిన మానసిక హింస ఫలితమే ఇది అని రోదించింది. లతకు తాను మోసిన ‘అద్దె గర్భం‘ భారం దిగినట్లు అనిపించి, తాను కన్న బిడ్డతో ఎలాంటి భావోద్వేగ అనుబంధం లేకుండా, తన కుటుంబానికి దక్కబోయే డబ్బు గురించి ఆలోచిస్తుంటే, లేబర్ రూమ్ బయట తన అంశ నుంచి ‘అద్దె గర్భంలో‘ పుట్టబోయే తమ బిడ్డ గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు నింపుకుని, చేతులు జోడించి దేవుడిని ప్రార్థిస్తున్న సంగీత మగపిల్లాడో–ఆడపిల్లాడో అని చూడకుండా, తాను ‘అమ్మ‘ అవుతాననే నిరీక్షణలో ఉంది. మూడో ప్రసవంలోనూ ఆడపిల్ల పుట్టడంతో, దాన్ని పోషించేదెలా అని ఆలోచిస్తూ, హైదరాబాద్‌లో ఉన్న కూలి పని ముగియడంతో ఊరికి తిరిగి వెళ్లాల్సి వస్తుందేమో అనే ఆలోచనలో ఉంది తారాబాయి.
అప్పుడు ఈ తల్లులందరి బాధను చూసిన ఆదిలక్ష్మమ్మ ఆసుపత్రిలో ఇచ్చిన సమాచారాన్ని విస్మరించి, తనదైన రీతిలో ఒక పరిష్కారాన్ని అందించింది, సంబంధాలు పరిస్థితికి తోలుబొమ్మలుగా మారకుండా నిరోధించింది..
తన మాటను కొనసాగించిన ఆదిలక్ష్మమ్మ లేబర్ వార్డ్ నర్సుగా తన వృత్తి జీవితంలో లెక్కలేనన్ని తల్లులు అనుభవించే బాధను దగ్గర నుంచి చూశానని కూడా చెప్పింది.
“బంధువుల చేతిలో ‘గొడ్రాలు‘ అని అనిపించుకుని, ఒక బిడ్డ పుడితే చాలు అనుకునే తల్లి ఒకవైపు ఉంటే, ప్రేమించి మోసపోయి వద్దనుకున్న గర్భాన్ని మోసిన తల్లి ఇంకొకవైపు. కాముకుల అత్యాచారం వల్ల గర్భిణి అయిన మానసిక వికలాంగురాలో లేదా స్కూల్‌కి వెళ్లే చిన్న పాపో, ఇక మగబిడ్డనే కావాలని కోరుకునే కుటుంబపు కోడలో… ఇలా బాధలో ఉన్న తల్లికి నాకు తెలిసినట్లుగా పరిష్కారం ఇచ్చాను, ఎవరికీ మోసం చేయలేదు. దేవుడు మెచ్చే పనే చేశాను నేను. ఒక ప్రాణం పుట్టి రావాలంటే, అదేమంత ఆటా అనుకున్నారా? ఇన్నేళ్లయినా ఎవరూ నన్ను వెతుక్కుంటూ రాలేదు. మీ బిడ్డ పుట్టుక మూలాన్ని వెతకాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా ఇక్కడితో వదిలిపెట్టి ఊరికి వెళ్లండి,” అని గొంతు పెంచి చెప్పినప్పుడు సంగీత తాము చేసిన తప్పును తెలుసుకుంది!
కొన్ని నెలల క్రితం జరిగిన బర్త్‌డే పార్టీలో రాకుమారిలా కనిపించిన రియా తాను కూలి పని చేసుకునే తారాబాయి కన్న బిడ్డ అనే విషయం తెలుసుకుని దుఃఖిస్తోంది. రియాను కౌగిలించుకుని సంగీత ఓదార్చినప్పటికీ ఆమె మనస్సు పుష్పవల్లిని ఒకసారి కలవాలనే ఆలోచనలో ఉంది.
ఆసుపత్రిలోని సమాచారం ద్వారా పుష్పవల్లి చిరునామా తీసుకుని, రియా మరియు స్వాతితో బాపట్లకు బయలుదేరింది సంగీత. హైదరాబాద్ నుంచి బాపట్ల చేరుకుని ఆమె ఇల్లు వెతకడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ ఊరిలో ధనిక కుటుంబం కావడంతో చాలా మందికి వారి పరిచయం ఉన్నట్లు అనిపించింది. పెద్ద గేటు నుంచి వెళ్లి, ముప్పై అడుగులు నడిచి, ఇంటి ప్రాంగణంలో నిలబడి, పుష్పవల్లిని బయటకు రమ్మన్నారు. తన ఇంటికి వచ్చిన ఈ ముగ్గురి మాటలు విని పుష్పవల్లి వణికిపోయింది. ఇన్నేళ్లు తను కాపాడుకుంటూ వచ్చిన రహస్యం బయటపడిందని విని భయపడింది ఆమె. ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడక వీరిని తిరిగి పంపడానికి అనవసరపు వాదనకు దిగింది. సంగీత కూడా పట్టువదలకుండా ఒక్కసారి తమ కొడుకును చూపించు అని వేడుకున్నప్పుడు పుష్పవల్లికి కోపం వచ్చింది.
“అతను నా కొడుకు, ఈ ఇంటి వారసుడు,” అని అరిచింది. అమ్మ అరుపు విని ఇంటి లోపలి నుంచి వచ్చిన అబ్బాయిని చూసిన సంగీత నిర్ఘాంతపోయింది. అచ్చం వెంకటకృష్ణలా కనిపిస్తున్నాడు ఆ అబ్బాయి! “హే, హి లుక్స్ లైక్ డాడ్!” అని రియా ఆశ్చర్యంగా అంది.
ఇప్పుడు పుష్పవల్లి కోపం తగ్గి దుఃఖంగా మారింది. ఏడుస్తూనే కొడుకును లోపలికి వెళ్లమని చెప్పింది. అమ్మ కన్నీళ్లకు కారణమైన ఈ ముగ్గురిని చూసిన అబ్బాయి చిరాకు పడ్డాడు.
“ఎవరమ్మా వీళ్లు? ఏం కావాలంట వీళ్లకు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? డబ్బు ఏమైనా అడుగుతుంటే కొంచెం పారేయ్. తీసుకుని వెళ్లిపోతారు,” అని వీరందరినీ ఒకసారి తేరిపార చూసి లోపలికి వెళ్లాడు.
ఆ ఇంటి వారసుడి డబ్బు దర్పం సంగీతకు అర్థమైపోయింది. నీళ్లు నిండిన ఆమె కళ్లు అతని వైపే చూస్తున్నాయి. కొడుకు లోపలికి వెళ్లిన తర్వాత అటూఇటూ చూసి, దగ్గరలో పని మనుషులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న పుష్పవల్లి సంగీత ముందు కొంగు పట్టింది.
“ఆ రోజు అద్దె తల్లి నుంచి నీకు ఒక బిడ్డ మాత్రమే కావాలి కదా? అది ఆడా,మగా అనేది నీకు ముఖ్యం కాదు. నువ్వు తల్లి కావడం ముఖ్యం. నీ బిడ్డ నీ దగ్గరే ఉన్నప్పుడు, నా నుంచి నా బిడ్డను దూరం చేయకు,” అని వేడుకుంది.
ఆమెకు ఏమీ సమాధానం చెప్పకుండా రియా చేయి పట్టుకుని వేగంగా నడుస్తూ గేటు నుంచి బయటకు వెళ్లిపోయింది సంగీత. ఆమెకు, “బిడ్డ పుట్టుక మూలాన్ని వెతకాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ఆదిలక్ష్మమ్మ అన్న మాట నిజమని అనిపించింది. కారు ఎక్కి కూర్చుని హైదరాబాద్ చేరుకునే వరకు ఎవరూ మాట్లాడలేదు. కారు నుంచి దిగి ఇంటి లోపలికి వచ్చిన రియా తన తల్లి తారాబాయిని కలవాలని మొండి పట్టు పట్టింది. మళ్లీ అదే మాటలు విన్న సంగీత ఇప్పుడు సహనం కోల్పోయింది. “రియా, మేం చేసిన తప్పేంటి? మనందరి జీవితం ప్రశాంతంగా సాగుతోంది కదా. నువ్వు ఇప్పుడు పెద్దదానివయ్యావు, మన మాటను అర్థం చేసుకుంటావని అనుకుని, నిన్ను సరోగసీ ద్వారా పొందవలసి వచ్చింది అని చెప్పడమే మేం చేసిన నేరమా? ఇంకా ఎక్కువ పిచ్చి పనులు చేయకు, న్యూజెర్సీకి వెళ్లడానికి ప్యాకింగ్ చేసుకో. నాన్నకు ఎయిర్ టికెట్‌ను ప్రీపోన్ చేయమని చెప్పాను.”
రియా నుంచి సమాధానం రాలేదు.
“నీకు నాన్న ముద్దు ఎక్కువైంది అందుకే ఇలా మొండితనం చేస్తున్నావు.”
“నేనిప్పుడు నాన్న కూతురిని కాదు, అమ్మ కూతురిని కాదు. అయితే, నేనెవరు?”
అమ్మ కోపం చూసిన రియా భయపడినప్పటికీ మొండితనం వదల్లేదు. సంగీత గదమాయించినప్పుడు రియా ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా–కూతుళ్ల మాటలు విని ఇద్దరినీ సముదాయించి తన ఇంటికి తిరిగి వెళ్లిన స్వాతికి ఎన్నెన్నో ఆలోచనలు వచ్చాయి. ఆదిలక్ష్మమ్మ అభిప్రాయం ప్రకారం, స్వాతి వెంకటకృష్ణలకు రియా పుట్టుక మూలాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందా? మమత–వాత్సల్యం చూపించే మాతృ హృదయం ఉన్న స్త్రీ కూడా తొమ్మిది నెలలు గర్భాన్ని మోసి–కన్నదానిలా ‘అమ్మ‘ అనిపించుకోకూడదా?
ముందు రోజు సంగీత కోపం ముందు మౌనంగా ఉన్న రియా, మరుసటి రోజు ఉదయం స్వాతికి ఫోన్ చేసి సంగీతకు సహాయం చేసినట్లే తనకూ తన తల్లిని కలవడానికి సహాయం చేయమని వేధించింది. రియా తన తల్లిని వెతకడానికి చేసిన ప్రయత్నం మరియు దాని పర్యవసానాలను చూసి స్వాతి భయపడింది. సంగీత మాట ప్రకారం వారిద్దరూ వీలైనంత త్వరగా న్యూజెర్సీకి తిరిగి వెళ్లడమే ఆమెకు కూడా సరైనదనిపించింది. కానీ రియా తనను కన్న తారాబాయిని కలిసి తనను ఆదిలక్ష్మమ్మకు అప్పగించడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని మొండి పట్టు పడుతోంది. స్వాతి కర్ణాటకకు చెందిందని, ప్రభుత్వోద్యోగైన తండ్రి బదిలీల కారణంగా పలుచోట్ల చదివినిన స్వాతికి కర్ణాటకలోని చాలా ఊర్లు తెలుసని సంగీత ద్వారా తెలుసుకున్న రియా, తన సహాయంతో గుల్బర్గా దగ్గర ఉన్న చించోళికి వెళ్లి తారాబాయిని చూడాలని ప్లాన్ చేసుకుందని తెలిసినప్పుడు స్వాతి నిర్ఘాంతపోయింది.
“ఈ పాపకు ఎందుకింత మొండితనం? సంగీత చెప్పినట్లు వెంకటకృష్ణ అతి ముద్దు వలనే ఇలా జరిగి ఉండాలి. రియా తన అంశ నుంచి పుట్టిన బిడ్డ కాదని తెలిస్తే వీ.కే. ఎలా రియాక్ట్ అవుతాడో?” అని ఆలోచించింది. లత, పుష్పవల్లి, ఆదిలక్ష్మమ్మలను వెతుక్కుంటూ తిరిగినట్లు చించోళికి కూడా వెళ్లి వద్దాం అనుకున్న స్వాతికి తాను కర్ణాటకలోని ఎన్నో జిల్లాల్లో తిరిగినా, ప్రైమరీ స్కూల్ చదివింది చించోళిలోనే అని గుర్తుకు వచ్చి, ఇదేమి ఋణానుబంధమో అనుకుంది. సంగీతకు రియా, స్వాతిలతో పాటు చించోళికి వెళ్ళడానికి కుదరలేదు. సంగీత తల్లికి తన కూతురు జీవితంలో వచ్చిన ఆటుపోట్ల కారణంగా రక్తపోటు పెరిగింది. ఆమెకు రియా ఆలోచన ఒకవైపు అయితే, తన అంశ నుంచి పుట్టిన మగబిడ్డ పుష్పవల్లి ఇంట్లో వారసుడిగా ఉన్నాడనే విషయం అల్లుడికి తెలిస్తే ఏమవుతుందో అనే ఆలోచనతో ఆ వృద్ధురాలు బెంగ పెట్టుకుంది.
రియా మరియు స్వాతి అద్దె టాక్సీలో తాండూరు మార్గం ద్వారా చించోళి వైపు బయలుదేరారు రియా స్వాతి. ఆసుపత్రి రికార్డ్స్‌లో ‘తారాబాయి, లచుమనాల్, చించోళి తాలూకా‘ అనే సమాచారాన్ని చూసి స్వాతి షాక్ అయ్యింది. చించోళి తాలూకా లచుమనాల్ మహిళలు తమ ఆడపిల్లలను పోషించలేక రెండు–మూడు వేల రూపాయలకు తాండూరు, హైదరాబాద్‌లోని అనాథాశ్రమాలకు అమ్మేశారనే వార్త చదివిన స్వాతి, తారాబాయి కూడా రియాను డబ్బు కోసం అమ్మి ఉండవచ్చేమో, దీనిని రియా ఎలా స్వీకరిస్తుందో అని ఆలోచిస్తుండగానే చించోళి చేరుకుని, అక్కడి నుంచి లచుమనాల్ వైపు కారు సాగింది. గ్రామంలోని ఇళ్లకు కొద్ది దూరంలో కారు ఆపినా పదుల సంఖ్యలో పిల్లలు వచ్చి కారును చుట్టుముట్టారు. చేతిలో ఫైల్స్ పట్టుకుని కారు నుంచి దిగిన స్వాతి, రియా తారాబాయి గురించి వారిని అడిగారు. ఒక చిన్న అమ్మాయి వీరిని తనతో పాటు రమ్మని చెప్పి ముందుకు నడిచింది. ఆమె వెనుక నడుచుకుంటూ వెళ్తున్న రియాకు అక్కడి జనజీవనం చూసి తాను సంగీత మాట వినాల్సిందే అని అనిపించడం మొదలైంది. పూరి గుడిసె ముందున్న అరుగుపై కూర్చుని బట్టపై ఎంబ్రాయిడరీ కుట్టు పని చేస్తున్న స్త్రీని చూపించి, “ఇగో ఈయమ్మే తారాబాయి” అంటూ చూపించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. జీన్స్ ధరించి, ఫైల్ చేతిలో పట్టుకుని నిలబడిన అమ్మాయి, పక్కనే చుడీదార్ ధరించిన మధ్యవయస్కురాలైన స్త్రీని చూసిన తారాబాయి, వీరు పేపరు వాళ్లో, టీవీ వాళ్లో అయ్యుంటారని అనుకుని భయపడింది.
“ఎవురు మీరు, ఏం కావాలె? ఈడ నేనొక్కదాన్నే కాదు బిడ్డను అమ్మింది, నా లెక్క చాలా మంది ఉన్నారు, నేను అమ్మి చాలా వర్షాలు అయింది,” అని ఒక్క గుక్కలో చెప్పింది.
లచుమనాల్ మహిళలు డబ్బు కోసం తమ ఆడపిల్లలను అమ్ముతారని ఒకటి, రెండు సార్లు బ్రేకింగ్ న్యూస్ చేసిన మీడియా కొద్ది రోజుల పాటు తమనందరినీ వేధించిన విషయం ఆమె మర్చిపోలేదు. పాపం, రియాకు ఆమె ఏ మాట కూడా అర్థం కాక ఆమెనే చూస్తూ నిలబడింది.
మాట్లాడటానికి ముందు తారాబాయిని ఒకసారి చూసిన స్వాతి, “తననే పోలిన ముఖం, అదే గోధుమ రంగు కళ్లతో తనను కళ్లనిండా చూస్తున్న కూతురి ముందు, జీవిత కష్టాలు, నిరక్షరాస్యత, నిస్సహాయతలు ఈ తల్లి భావాలనన్నిటినీ రాతిగా మార్చాయా? లేదా కళ్లకు తెలియని విధంగా కడుపు కూడా తెలుసుకోలేదా?” అని ఆలోచించింది. ఒక్కొక్కటిగా విచారించవచ్చనుకుని, తాము పేపరు వాళ్లం కాదని చెప్పి ఆమెను సముదాయించిన స్వాతి, రియా అమెరికా నుంచి వచ్చిందని, ఎంబ్రాయిడరీ చేసిన బట్టను కొనుగోలు చేస్తుంది అని చెప్పింది. వీరు తన దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చారని తెలుసుకున్న తారాబాయి సహజంగా మాట్లాడటానికి ముందుకు వచ్చింది.
“నా దెగ్గిర చాలా గుడ్డలు ఉన్నాయ్, మంచి ధర పెట్టి తీసుకోండ్రీ, నా కొడుక్కు స్కూల్ ఫీజుకు పైసలు కావాలె,” అంటూ వ్యాపారం ప్రారంభించింది.
ఇదే సరైన సమయం అని స్వాతి తారాబాయి కుటుంబం గురించి ఒక్కొక్క సమాచారాన్ని అడిగినప్పుడు, తన నిస్సహాయతను చెప్పుకుంటే ఎక్కువ వ్యాపారం చేయవచ్చని తారాబాయి తన జీవిత కథను చెప్పింది. ఆమెకు మొదటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టినప్పుడు, ప్రభుత్వం నుంచి సహాయం దొరికిందని, మూడో బిడ్డ మగవాడు కావాలని కోరుకున్నప్పటికీ ఆడపిల్ల కలిగినప్పుడు దానిని హైదరాబాద్‌లో అమ్ముకుని ఊరికి వచ్చింది, నాలుగోసారి కూడా ఆడపిల్ల పుట్టి చనిపోయిందని, ఆ తర్వాత మగబిడ్డ పుట్టాడని, అతన్ని పాఠశాలకు పంపిస్తున్నానని వివరంగా తన జీవితాన్ని వివరించింది.
“మూడో బిడ్డను ఎందుకు అమ్మావు? మళ్లీ నాలుగో బిడ్డను ఎందుకు అమ్మలేదు?” అని అడిగిన స్వాతికి తారాబాయి చెప్పిన మాట విని నిర్ఘాంతపోయి, మాతృత్వానికి ఇంతటి నిస్సహాయత కూడా ఉంటుందా అనిపించింది.
“ఆడ బిడ్డను అమ్మిన తర్వాత పుట్టే బిడ్డ మగవాడు పుడుతాడని పెద్దోళ్లు చెబుతారు, అందుకే అమ్ముతాం. ఇక్కడ ఆ ఆడబిడ్డలకు పాలు ఇవ్వరు. అవి చచ్చిపోతాయి! మాకు కడుపు నిండా రొట్టె లేదు, ఆపై వాటిని ఎట్లా సాకాలి?”
ప్రభుత్వం ఇచ్చే స్కీమ్‌లో మొదటి రెండు ఆడపిల్లలకు డబ్బు సదుపాయం దొరికి అవి బతుకుతాయి. మూడో బిడ్డ మగవాడు కాకుండా ఆడపిల్ల అయితే భర్త, ఇంటి వారి మాట ప్రకారం బిడ్డను అమ్మడానికి లేదా చంపడానికి ఈ మహిళలు సిద్ధపడతారంటే, సమాజ పరిస్థితులకు అనుగుణంగా కలిగే నిస్సహాయత, అవమానం, కోపం, ఆవేశం, ద్వేషం దుఃఖం యొక్క భావాలకు కారణమయ్యే హార్మోన్లు, మాతృత్వం, మమతా వాత్సల్యాల హార్మోన్ల కంటే పై చేయి సాధిస్తాయి కదా? అలాగైతే నిజమైన అపరాధి ఎవరు? మనసులో ప్రశ్నల వరద ముంచెత్తి పక్కనే నిలబడిన రియాను కౌగిలించుకుని కన్నీరు కార్చింది స్వాతి.
“రియా యు ఆర్ వెరీ లక్కీ, సంగీత లాంటి తల్లి నీకు దొరికింది అదృష్టం కాక మరేం కన్నా?”
“వాట్ డు మీన్ స్వాతి ఆంటీ?” అని ఆమె మాట అర్థమేంటని బలవంతంగా అడిగింది రియా.
స్వాతి ద్వారా తారాబాయి పరిస్థితిని, దాని వల్ల ఆమె తీసుకునే నిర్ణయాలను తెలుసుకున్న రియా ఏడుస్తూ అక్కడి నుంచి కారు వైపు పరిగెత్తడం ప్రారంభించింది.
“ఏమైంది, మీ బిడ్డకు ఏమైంది, ఎందుకలా ఆ అమ్మాయి పరిగెత్తింది?” అడిగింది తారాబాయి.
“ఆమె నీ కూతురు, డబ్బు కోసం నువ్వు అమ్మిన కూతురు,” అని గట్టిగా చెప్పాలని అనిపించినా, దానిని అర్థం చేసుకునేంత భావోద్వేగ పరిణత ఆమెలో లేదని ఆమె ఆడే మాటల నుంచే అర్థం అయ్యింది కాబట్టి, “మేము తర్వాత వస్తాము” అంటూ స్వాతి కారు వైపు వేగంగా అడుగులు వేసింది.
కారులో కూర్చుని ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్న రియాను చూసి స్వాతికి బాధ అనిపించింది. ఈ పరిస్థితికి ఆమె మొండితనమే కారణం అనిపించినా, ఆమెను అద్దె తల్లి ద్వారా పొందాము అని చెప్పడంలో సంగీత, వీ.కే.లు తొందరపడ్డారేమో అనుకుని కారు ఎక్కి కూర్చుని, దూరంలో ఉన్న చిన్న డబ్బా అంగడి ముందు నిలబడి టీ తాగుతున్న డ్రైవర్‌ను పిలిచి ఇప్పుడే హైదరాబాద్‌కు బయలుదేరాలని చెప్పింది. అంతవరకూ సీట్‌కు ఆనుకుని ముఖం దాచుకుని ఏకధాటిగా ఏడుస్తున్న రియా స్వాతిని కౌగిలించుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.
“కంట్రోల్ యువర్సెల్ఫ్ రియా. ప్రశాంతంగా ఉండు పాపా” అంటూ ఆమె వీపు నిమిరింది స్వాతి. రియా ఏడుస్తూ తన ముందు జీవితం ఎలా అని ప్రశ్నించినప్పుడు, ఏమి సమాధానం చెప్పాలో తోచలేదు ఆమెకు. అప్పుడే డ్రైవర్ కారు దగ్గరకు రావడం చూసిన స్వాతి రియా కళ్లను తుడిచి, ఆమెను తన భుజానికి వాల్చుకుంది.
“మనం ఇప్పుడే హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరాలి. రియాకు ఒంట్లో బాలేదు,” అని తన పక్కన ఉన్న బ్యాగ్ నుంచి శాలువా ఒకటి బయటకు తీసి రియాకు కప్పింది.
కారు కదిలి లచుమనాల్ మట్టి రోడ్డును దాటి చించోళి–తాండూరు హైవే చేరినప్పుడు దూరంగా కనిపిస్తున్న గ్రామం వైపు ఒకసారి చూసింది స్వాతి. ఇక్కడి ప్రజల నిస్సహాయతకు పరిష్కారం దొరికి, అభివృద్ధి కనిపించడం ఎప్పుడో అని తలచుకుని నిట్టూర్చింది. స్వాతి భుజానికి వాలిన రియా నిద్రలోకి జారుకున్నప్పటికీ, “ఐ యామ్ సారీ మామ్… సారీ,” అని కలవరిస్తుండటం చూసి, ప్రేమగా ఆమె తల నిమిరిన స్వాతి కళ్లు మూసుకుంది. రియా ముందు పరిస్థితి ఏమిటి? రియా తమ అంశ నుంచి పుట్టిన బిడ్డ కాదని తెలిస్తే వెంకటకృష్ణ ఊరుకుంటాడా? తమ బిడ్డ పుష్పవల్లి ఇంట్లో పెరుగుతోందని తెలిసినా సంగీత ఊరుకుండిపోయిందే? ఆలోచనలు ఆమెకు నిద్ర పట్టనివ్వలేదు. ‘అద్దె తల్లి‘ విషయం బయటపెట్టి వారిద్దరూ తొందరపడ్డారు అనిపించింది. బహుశా రియాకు మాతృత్వం గురించి తెలిస్తే, అమ్మ అంటే బిడ్డ ధమనులలో ప్రవహించే రక్తం కాదు, అందులోని జన్యువులో ఒక అంశం కాదు అనేది అర్థమవుతుంది. ఒక ప్రాణానికి ప్రాణం పోసే అంతర్ప్రవాహం కంటే, ఒక ప్రాణానికి జీవితాన్ని ఇచ్చే వాత్సల్యపు అంతర్వాహినియే జీవితానికి ముఖ్యమైనదని తెలుస్తుంది. మొత్తానికి మనిషి జీవితాంతం హార్మోన్లదే హవా!
రియా, స్వాతిలు హైదరాబాద్ చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. కారు ఇంటి ముందు ఆగినప్పుడు కిందకు దిగి లోపలికి రావడానికి రియా సంశయించింది.
స్వాతి, రియా చేతిని పట్టుకుని కిందకు దించి తలుపు దగ్గరకు తీసుకెళ్లింది. గేటు తెరిచిన శబ్దం విని తలుపు తీసిన సంగీతను కౌగిలించుకున్న రియా, “ఐ యామ్ సారీ మామ్… సారీ,” అంటూ గట్టిగా ఏడవటం చూసిన సంగీత ఆమెను సముదాయించింది.
“న్యూజెర్సీకి వెళ్లడానికి ప్యాకింగ్ చేసుకో. నాన్నకు చెప్పి ఎయిర్ టికెట్‌ను ప్రీపోన్ చేయిస్తున్నాను. పప్పా ఈజ్ మిస్సింగ్ హిస్ లిటిల్ ప్రిన్సెస్. అయితే ఇక్కడ జరిగిన ఏ విషయం కూడా పప్పాకు చెప్పకూడదు,” అంది.
ఆమె మాట విని ఆశ్చర్యపడి ఏమీ తెలియని విధంగా రియా స్వాతిని, సంగీతను మార్చి మార్చి చూడసాగింది. స్వాతి “రియా, అమ్మ చెప్పింది మనసులో పెట్టుకో పాపా“. వారిద్దరి మాటల అంతరార్థం తెలుసుకున్న రియా, “థ్యాంక్యూ మామ్, థ్యాంక్యూ స్వాతి ఆంటీ,” అంటూ తన ఇంటికి తిరిగి వెళ్లడానికి తయారీ చేసుకోవడానికి గదిలోకి పరిగెత్తింది.
సంగీత రెండు చేతులను పట్టుకుని స్వాతి కళ్లకు అద్దుకుంది. పక్కనే నిలబడిన సంగీత తల్లి గోడపై ఉన్న చిత్రం ఒకదానికి చేతులు జోడించినప్పుడు, స్వాతి , సంగీత ఇద్దరూ అటు తిరిగి గోడపై వేలాడదీసిన యశోదాకృష్ణుల చిత్రం వైపు చూశారు. స్వాతికి చిత్రంలో ఇప్పుడు సంగీత–రియా, పుష్పవల్లి – ఆమె కొడుకు కనిపించారు.
![]()

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.




Discussion about this post