మూలం : అమృతా ప్రీతమ్
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణా రావు
ఈ రోజు నేను
నా ఇంటి నంబరును చెరిపేశాను.
వీధి ముఖంపై చెక్కబడిన
ఆ వీధి పేరునూ తొలగించాను.
ప్రతి దారికీ దిశ చూపిన
ఆనవాళ్లన్నింటినీ తుడిచివేశాను.
అయినా—
మీరు నన్ను
తప్పక వెతికి పట్టుకోవాలనుకుంటే,
ప్రతి దేశంలో,
ప్రతి నగరంలో,
ప్రతి వీధిలో,
ప్రతి ఇంటి తలుపునూ తట్టండి.
ఇది ఒక శాపం—
అదే సమయంలో
ఒక వరం కూడా.
ఎక్కడైతే
స్వేచ్ఛగా శ్వాసించే
ఒక ఆత్మ జాడ కనిపిస్తుందో,
ఎక్కడైతే
మనసు తన సంకెళ్లను తెంచుకుని
నిర్భయంగా నిలబడుతుందో—
అక్కడే
నా చిరునామా.
![]()
కవిత గురించి
‘నా చిరునామా’ అనేది ఒక మనిషి ఉనికిని భౌతిక చిరునామాలతో కాక, అతని స్వేచ్ఛా చైతన్యంతో నిర్వచించే అపూర్వమైన కవిత. ఇంటి నంబరు, వీధి పేరు, దారిచూపే గుర్తులు—ఇవన్నీ మనిషిని గుర్తించేందుకు సమాజం సృష్టించిన బాహ్య సంకేతాలు మాత్రమేనని, వాటిని దాటి అతని నిజమైన చిరునామా స్వేచ్ఛ, ప్రేమ, మానవత్వం, ఆత్మగౌరవం నివసించే ప్రతి హృదయమని ఈ కవిత చెబుతుంది. వ్యక్తి నుంచి విశ్వమానవుడిగా విస్తరించే ఈ భావయానం, సరిహద్దులను అధిగమించే ఆత్మస్వేచ్ఛకు రూపకంగా నిలుస్తుంది. ఒక వ్యక్తి చిరునామా చివరికి ఒక ఇల్లు కాదు—స్వేచ్ఛగా ఊపిరి పీల్చే ప్రతి మనసేనని ఈ కవిత హృదయాన్ని తాకే సరళతతో ఆవిష్కరిస్తుంది.
అమృతా ప్రీతమ్ గురించి
అమృతా ప్రీతమ్ (1919–2005) ఆధునిక భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. ప్రధానంగా పంజాబీ భాషలో రచనలు చేసిన ఆమె, హిందీ సాహిత్యంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించారు. ప్రేమ, విరహం, స్త్రీ అస్తిత్వం, స్వేచ్ఛ, సామాజిక అన్యాయం, భారత విభజన మిగిల్చిన గాయాలు—ఇవి ఆమె సాహిత్యానికి ప్రధాన స్వరాలు. వ్యక్తిగత అనుభవాలను విశ్వమానవీయ అనుభూతులుగా మలచగల అరుదైన సృజనశక్తి ఆమె సొంతం. ఆమె రచించిన ‘అజ్ ఆఖరీ వారిస్ షాహ్ నూన్’ భారత విభజన విషాదానికి శాశ్వత సాక్ష్యంగా నిలిచిన కవిత. సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి భారతీయ మహిళా కవయిత్రిగా, అనంతరం జ్ఞానపీఠ పురస్కారం మరియు పద్మ విభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలను అందుకున్న ఆమె, భారతీయ సాహిత్యంలో స్త్రీ స్వరానికి కొత్త అర్థాన్ని, కొత్త దిశను అందించిన సృజనకారిణిగా చిరస్మరణీయురాలయ్యారు.
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.
సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.
ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.































