“I Dream A World “ by Longston Hughes
తెలుగు అనువాదం : హిమజ
మనిషిని మనిషి ఎన్నడూ
తక్కువ చేసి చూడని లోకం కావాలని కలగంటాను,
ప్రేమ తన దీవెనలు చల్లే భూమి,
శాంతి తన బాటలపై పూలు పరిచే ప్రపంచం
కావాలని కోరుకుంటాను.
ప్రతి ఒక్కరూ మధురమైన
స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకునే లోకం
కావాలని కలగంటాను,
అత్యాశ ఆత్మను ఇక క్షీణింపజేయని చోట,
దురాశ మన దినాలను ఇక మసకబార్చని చోట.
నల్లవాడైనా, తెల్లవాడైనా—
ఏ జాతికి చెందినవాడైనా సరే,
ఈ భూమి అందించే సంపదలన్నిటినీ
సమానంగా పంచుకునే
ప్రపంచం కావాలి;
ప్రతి మనిషీ స్వేచ్ఛగా జీవించే లోకం కావాలి.
దారిద్ర్యం సిగ్గుతో తలవంచే చోట,
ముత్యంలా మెరిసే ఆనందం
ప్రతి మనిషి అవసరాలను
ఆప్యాయంగా ఆలింగనం చేసుకునే లోకం కావాలి—
అలాంటి ప్రపంచాన్నే
నా హృదయం కలగంటోంది,
అలాంటి ప్రపంచమే
నా కలల ప్రపంచం!
![]()
కవి పరిచయం — లాంగ్‌స్టన్ హ్యూస్
“Dream A World” అనే కవితను రచించిన కవి (Langston Hughes). ఆయన అమెరికాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త సామాజిక ఆలోచనాపరుడు. ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ ప్రజల జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, జాతి వివక్ష వంటి అంశాలను తన రచనల్లో బలంగా ప్రతిబింబించారు.
Hughes కవిత్వం కేవలం సాహిత్య వ్యక్తీకరణ మాత్రమే కాదు; అది సమానత్వం, మానవత్వం, స్వేచ్ఛ కోసం వినిపించిన ఒక గొప్ప స్వరం. ఆయన రచనలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా పాఠకులను ప్రభావితం చేస్తున్నాయి

2005 నుండి కవిత్వం రాస్తున్నారు, ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ వీరి కవితా సంకలనాలు. తాజాగా అఫ్రో అమెరికన్ కవయిత్రి మాయా ఏంజిలో కవితల అనువాదం పుస్తకంగా వచ్చింది. సంచిక అంతర్జాల పత్రికలో “పొయెట్స్ టుగెదర్” శీర్షికతో భిన్న కవుల విభిన్న కవిత్వాన్ని అనువదించి అందించారు.
సిసి రెడ్డి గారి ‘మనభూమి’మాసపత్రికలో ‘హిమశకలం’ పేరుతో సంవత్సరం పాటు కాలమ్ నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రిక లో పద ప్రహేళిక నిర్వహించారు. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి కవయిత్రి తొలి ప్రోత్సాహక పురస్కారం, రొట్టమాకు రేవు అవార్డు, అమృతలత అపురూప అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, కలేకూరి ప్రసాద్ స్మారక అనువాద పురస్కారం- అందుకున్నారు.
‘రెండు సంతకాలు‘ త్వరలో రానున్న కవితా సంకలనం
ప్రముఖ కవి రాజేందర్ జింబో హిమజ జీవన సహచరులుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.



