హిందీ మూలం: అంజనా వర్మ
అనుసృజన: ఆర్ శాంతసుందరి
కురుస్తోంది వర్షం విడవకుండా
ఎదురుగా కనబడే ఆ అడవిలో
నిజానికి అది అడవి కాదు
విస్తరించి ఉన్నాయి కనుచూపు మేర వరకు
దట్టమైన చెట్లు
పెరుగుతూ పోతున్నాయి ఆ చెట్ల తెగలు
అడ్డూ ఆపూ లేకుండా
అందుకే అది కనిపిస్తుంది అడవిలా
వర్షం కురుస్తోంది ఆగకుండా
నేనున్నది ఎనిమిదో అంతస్తులో
ఆశ్చర్యంగా చూస్తున్నాను
చెట్లు ఇలా వర్షంలో స్నానం చెయ్యటం
మహానగరంలో చెలరేగే
చెట్లు నరుకు – నివాసాలు కట్టు అనే దాడి నుంచి
అదృష్టం బాగుండి తప్పించుకున్న యీ చెట్లు
హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి
మరణాన్ని తప్పించుకుని పండగ చేసుకుంటున్నాయి
ఈ చిటపట చినుకుల్లో
మైమరచిపోతున్నాయి
ఊగుతున్నాయి వృక్షాలు అటూ ఇటూ
వీస్తోంది తడి గాలి
ఆకాశం నుంచి వేలాడుతున్నాయి
లెక్కలేనన్ని చినుకు ముత్యాల సరాలు
గాలి విసురుకి
కుడి నుంచి ఎడమకి కదులుతూ
అలలు అలలుగా
కురిసే చినుకులని తాగుతున్నాయి ఈ నల్లని తనువులు
మౌనంగా
లోకం కళ్ళుకప్పి ఆస్వాదిస్తున్నాయి అమృతాన్ని మైమరచి
వీటికి లేవు మనలా మానవ శరీరాలు
అయినా ఎందుకో అనిపిస్తాయి ఆత్మీయుల్లా
మన సొంత బంధువులైనట్టు
వీటితో మనకి లేకపోలేదు సంబంధం
ఇవి మన పూర్వీకులే
ప్రవహించే రక్తం ఒకటే
![]()



