• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

శివ చల్లా by శివ చల్లా
September 10, 2026
in అనువాద కథలు
0
ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

తెలుగు అనువాదం : శ్రీ శివ చల్లా

పూర్వకాలం వాసిల్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనిని అందరూ “నెవర్-డై వాసిల్” – అంటే మరణమే లేని వాసిల్- అని పిలిచేవారు. అతని చిన్న గుడిసె ఎప్పుడూ పిల్లలతో కళకళలాడుతూ సందడిగా ఉండేది. అతనికి పది మంది సంతానం. అంతమంది పిల్లలను పోషించడం చాలా ఇబ్బంది. వాళ్లందరికీ బట్టలు-గట్రా  కొనడం మరీ ఇబ్బంది అయ్యేది. 

వాసిల్ చలికాలంలో తన పిల్లలందరికీ కలిపి కేవలం ఒక్క జత బూట్లు కొనేవాడు. ఒక పిల్లవాడు వాటిని వేసుకుని బయటికి వెళ్లి కాసేపు ఆడుకుని వచ్చిన తర్వాత మరొక పిల్లవాడికి ఇచ్చేవాడు. ఇలా ఇంట్లోని పిల్లలందరూ ఒక్కొక్కరిగా ఆ బూట్లను వేసుకునేవారు. ఆ బూట్లకి రోజంతా పనే! 

పాపం,  మరణమే లేని వాసిల్ మాత్రం ఎప్పుడూ ఆకలితో, చిరిగిన బట్టలతోనే తిరుగుతూ ఉండేవాడు.

ఒకరోజు అతను కట్టెలు కొట్టుకురావడానికి అడవికి వెళ్లాడు. రోజంతా కట్టెలు కొడుతూనే ఉన్నాడు. ఆఖరుకు నిలబడటానికి కూడా ఓపిక లేనంతగా అలసిపోయాడు. 

వాసిల్ ఒక పెద్ద ఓక్ చెట్టు దుంగ మీద కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తన దుస్థితిని తలచుకుని బాధగా నిట్టూర్చి “ఛీ! ఈ పాడు జీవితం ఇక చాలు! మృత్యువు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతే బాగుణ్ణు. అసలు మృత్యువైనా నా గురించి ఏమి ఆలోచిస్తుందో? బహుశా నన్ను పూర్తిగా మర్చిపోయినట్టుంది” అనుకున్నాడు. 

అప్పుడే ఎవరో అతని భుజంపై చల్లటి, ఎముకలు పెళుసుగా ఉన్న చెయ్యి వేసి “నేను ఇక్కడే ఉన్నాను, వాసిల్” అన్నారు. 

వాసిల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు.

అతని ముందు సాక్షాత్తూ మృత్యువు నిలబడి ఉంది.

భయంతో వాసిల్ గొంతు తడి ఆరిపోయింది. నోట మాట కూడా రాలేదు.

“నన్నెందుకు పిలిచావు?” అని అడిగింది మృత్యువు. 

వాసిల్ మృత్యువుతో తన కష్టాలన్నీ ఏకరువుపెట్టాడు. 

“నా జీవితంలో బాధ తప్ప మరేం మిగిలింది చెప్పు? అంతకాడికి అసలు నేను ఎందుకు బతకాలి?” అన్నాడు.

మృత్యువు అతని మాటలకి “అలా అనకు వాసిల్! నువ్వు ఇప్పుడే చనిపోలేవు. నీ గుడిసెలో ఆకలితో అలమటిస్తున్న పసివాళ్లు ఉన్నారు. నువ్వు చనిపోతే వాళ్లను ఎవరు చూసుకుంటారు? నాతో స్నేహం చెయ్యి. నీ బాధలను దూరం చేయడంలో నేను నీకు సహాయం చేస్తాను” అని  చెప్పింది.

వాసిల్ కొద్దిసేపు ఆలోచించి “అయితే సరే!” అన్నాడు. 

అప్పుడు మృత్యువు “నేను నిన్ను ఒక వైద్యుణ్ణి చేస్తాను. నువ్వు అన్నీ గ్రామాలూ తిరుగుతూ ప్రజల రోగాలు నయం చేయాలి. అందుకు తగిన ప్రతిఫలం కూడా తీసుకోవచ్చు” అని చెప్పింది.

వాసిల్ ఆశ్చర్యంగా “నేనా? వైద్యుడినా? గాడిదకు బైబిల్ గురించి తెలిసినంత కూడా నాకు మందుల గురించి తెలియదు!” అన్నాడు.

మృత్యువు నవ్వుతూ “నీకు ఎక్కువగా ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో- నేను ఎల్లవేళలా నీతోనే ఉంటాను. కానీ నేను నీకు తప్ప మరెవరికీ కనిపించను” అని చెప్పింది.

“నేను రోగి తల దగ్గర నిలబడి ఉంటే, నువ్వు మంచం చుట్టూ మూడుసార్లు తిరిగి ‘అయ్యా, నువ్వు మృత్యువు చేతిలో ఓడిపోయావు. ఇక నీకు సమయం దగ్గరపడింది’ అని చెప్పాలి. 

కానీ నేను రోగి కాళ్ల దగ్గర నిలబడి ఉంటే, నువ్వు ఆనందంగా ‘ఓ మంచివాడా! నిన్ను నేను కాపాడుతాను. నువ్వు ఇంకా చాలా కాలం జీవిస్తావు!’ ” అని చెప్పాలి. 

వాసిల్ అనుమానంగా మృత్యువు వైపు చూసి “నీ గురించి నాకు బాగా తెలుసు. కొంతకాలం నా వెంట ఉంటావు. ఆ తర్వాత కంచెకు వేలాడే చిరిగిన గుడ్డలా నన్ను గాలికి వదిలేస్తావు” అన్నాడు. 

మృత్యువు తన సన్నని, ఎముకలలాంటి చేతిని పైకెత్తి ఆ పురాతన ఓక్ చెట్టు దుంగ ముందు ప్రమాణం చేస్తూ “నేను ఎన్నటికీ అలా చేయను అని ప్రమాణం చేస్తున్నాను” అని చెప్పింది.

మరుసటి రోజు వాసిల్ ఒక కర్ర పట్టుకుని, అప్పటికే ప్రాణాలతో పోరాడుతున్న ఒక రోగిని చూడటానికి బయలుదేరాడు.

అక్కడ రోగి భార్యా పిల్లలు మంచం పక్కన కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నారు.

వాసిల్ వారితో, “నేను వైద్యుణ్ని. మీరు అందరూ కాసేపు బయటికి వెళ్లండి. రోగిని నేను ఒంటరిగా పరీక్షించాలి” అన్నాడు.

వాళ్లంతా బయటికి వెళ్లిపోయారు.

వాసిల్ గదిలోకి అడుగుపెట్టగానే మృత్యువు రోగి తలవైపు నిలబడి ఉండటం చూశాడు.

అంతే! అతడు కర్ర తీసుకుని మృత్యువు వీపుమీద గట్టిగా ఒక్కటిచ్చాడు.

“ఏం చేస్తున్నావు! అతనికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కనిపించడం లేదా? వెంటనే కాళ్లవైపు వెళ్లి నిలబడు!” అని గద్దించాడు. 

మృత్యువు, కిక్కురుమనకుండా వెళ్ళి రోగి కాళ్ళ దగ్గర నిలబడింది.

అప్పుడు వాసిల్ రోగిని పరీక్షించినట్టు నటించి చిరునవ్వుతో “భయపడాల్సిన పని లేదు. మరో మూడు రోజుల్లో నువ్వు హాయిగా లేచి తిరుగుతావు. పొలం పనులు చేసుకుంటావు” అన్నాడు. 

ఆశ్చర్యం! అంతా వాసిల్ చెప్పినట్టుగానే జరిగింది.

మూడో రోజుకే ఆ రైతు కోలుకుని మళ్లీ పొలంలో నాగలి పట్టి విత్తనాలు చల్లడం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత వాసిల్ ఊరూరా తిరుగుతూ రోగులకు వైద్యం చేయసాగాడు.

కానీ, మృత్యువుకు మాత్రం రోగుల తలవద్ద నిలబడే ధైర్యం లేకపోయింది. మళ్లీ ఎక్కడ వాసిల్ చేతిలో కర్ర దెబ్బలు తినాల్సి వస్తుందో అని భయం పట్టుకుంది. 

అలా మంచి వైద్యుడిగా వాసిల్ పేరు ఆ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో మారుమోగిపోయింది. 

అతని చిన్న గుడిసె తలుపు ఎప్పుడూ మూసి ఉండేది కాదు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు అతని దగ్గరకు రావడం మొదలుపెట్టారు. 

వాసిల్ ఎవరి ఇంటికెళ్లినా వారు అతన్ని ఖాళీ చేతులతో పంపేవారు కాదు.

కొందరు  ధాన్యం ఇచ్చేవారు, మరికొందరు వెన్న, పాలు, తేనె ఇచ్చేవారు,  ఇంకొందరైతే డబ్బు, బట్టలు ఇచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్పేవారు.

కొద్దికాలానికే వాసిల్ ఇంట్లో పేదరికం మాయమైంది.

అతని పిల్లలకి ఇక ఎప్పుడూ ఆకలితో ఉండాల్సిన అవసరం రాలేదు.

మృత్యువు మాత్రం ఎప్పుడూ వాసిల్ వెంటే తిరుగుతూ ఉండేది.

కానీ ఇప్పుడు దాని ముఖంలో ఆనందం లేదు.

వాసిల్ చేతిలో పడినప్పటి నుంచి తన పని తాను చేయలేకపోవడంతో మృత్యువుకు ఎంతో అసహనంగా ఉంది. 

అయినా ఏమీ చేయలేకపోయింది.

ఎందుకంటే ఆ పురాతన ఓక్ చెట్టు దుంగ దగ్గర చేసిన ప్రమాణాన్ని అది ఉల్లంఘించలేకపోయింది.

ఒకరోజు మృత్యువు వాసిల్‌తో “ఎన్నో సంవత్సరాలుగా మనం మంచి స్నేహితులం. కానీ ఒక్కసారి కూడా నన్ను నీ ఇంటికి భోజనానికి పిలవలేదు” అంది నిష్ఠూరంగా. 

అందుకు వాసిల్ నవ్వుతూ- “అయితే ఈ ఆదివారం రా” అన్నాడు.

“తప్పకుండా వస్తాను” అంది మృత్యువు సంతోషంగా. 

ఆదివారం రానే వచ్చింది.

మృత్యువు తెల్లని దుస్తులు ధరించి వాసిల్ ఇంటికి భోజనానికి వచ్చింది.

వాసిల్, మృత్యువుకు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికి రుచికరమైన వంటకాలు వడ్డించాడు. 

ఇద్దరూ కలిసి హాయిగా తిన్నారు, తాగారు, పాటలు కూడా పాడుకున్నారు.

వాసిల్ తన ఇంట్లోని ప్రతి మూలనూ మృత్యువుకు చూపించాడు.

ఒకప్పుడు ఆకలితో అల్లాడిన వాసిల్ పిల్లలు ఇప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఆడుకుంటుండటం చూసి మృత్యువు కూడా ఆశ్చర్యపోయింది.

అన్నీ చూపించిన తర్వాత వాసిల్ చిరునవ్వుతో “నన్ను ఎప్పుడు నీ ఇంటికి రమ్మంటావు మరి?” అని అడిగాడు.

మృత్యువు “వచ్చే ఆదివారం… మనం మొదటిసారి కలిసిన ఆ ఓక్ చెట్టు దుంగ దగ్గరకు రా. అక్కడి నుంచి నేను తీసుకెళ్తాను” అని సమాధానమిచ్చింది.

 “అలాగే” అన్నాడు వాసిల్.

తరువాతి ఆదివారం వాసిల్ తన కొత్త జాకెట్, గడ్డి టోపీ, కొత్త బూట్లు వేసుకుని ఓక్ చెట్టు దుంగ దగ్గరకు చేరుకున్నాడు.

మృత్యువు అప్పటికే అతని కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంది.

అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టారు.

దట్టమైన అడవులు దాటారు.

లోతైన లోయలు దాటారు.

బురదతో నిండిన కుంటలను దాటారు.

అగాధాల మీదుగా ఎగిరి దూకారు.

చివరకు మంచులా తెల్లగా మెరిసిపోతున్న ఒక అద్భుతమైన రాజభవనం దగ్గరకు చేరుకున్నారు.

మృత్యువు గర్వంగా “ఇదే నా రాజభవనం” అంది. 

లోపలికి వెళ్లి చూసిన వాసిల్ ఆశ్చర్యపోయాడు.

అక్కడ రాజులు, యువరాజులు, మంత్రులు—ఎంతోమంది అతిథులు విందు చేసుకుంటున్నారు.

అయితే వాళ్ల ముఖాలు పిండి పూసినట్టుగా పాలిపోయి ఉన్నాయి.

వారి కళ్ళు మాత్రం వెలుగులు చిమ్ముతున్నాయి. 

తింటున్నారు…

తాగుతున్నారు…

పాటలు పాడుతున్నారు…

బలి ఇచ్చే మేకపిల్లలా ఉంది వాళ్ళ పరిస్థితి. 

అది చూసిన వాసిల్ పెదవి విరిచాడు.

“ఛ! ఇందులో చూడటానికి ఏముంది? మీ ఇంట్లో అసలు విలువైనది ఇంకేదైనా ఉంటే చూపించు.”

మృత్యువు అతన్ని రాజభవనం అంతా తిప్పి చూపించింది.

ఒక్క గది తప్ప.

ఆ చివరి గది మాత్రం తాళం వేసి ఉంది.

దాని దగ్గరకు రాగానే మృత్యువు ఆగిపోయింది.

వాసిల్‌కు అనుమానం వచ్చి “ఆ గది కూడా తెరువు”  అన్నాడు.

మృత్యువు తల అడ్డంగా ఊపి “అది అసాధ్యం” అంది. 

వాసిల్ చిరాకుపడ్డాడు.

“ఏమిటి అసాధ్యం? ఓక్ చెట్టు దొంగ దగ్గర చేసిన ప్రమాణం మర్చిపోయావా? నిజమైన స్నేహితుడివైతే ఆ గది తాళం తీయి. లేకపోతే ఈ రాజభవనాన్ని తలకిందులు చేసేస్తాను!” అన్నాడు. 

వాసిల్ మొండితనం ముందు మృత్యువు తలవంచింది. 

చివరికి తన నడుముకు వేలాడుతున్న తాళంచెవితో ఆ గది తలుపు తెరిచింది. 

గదిలోకి అడుగుపెట్టగానే వాసిల్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

అది ఎంతో విశాలమైన మందిరం.

అందులో వేలాది కొవ్వొత్తులు వెలుగుతున్నాయి.

కొన్ని అప్పుడే వెలిగించినట్టుగా ప్రకాశిస్తున్నాయి.

కొన్ని సగం వరకు కాలిపోయి ఉన్నాయి. 

మరికొన్ని ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

వాసిల్ ఆశ్చర్యంగా “ఇవన్నీ ఏమిటి?” అడిగాడు. 

మృత్యువు ప్రశాంతంగా “ఇవి మనుషుల జీవితాల కొవ్వొత్తులు” అని జవాబిచ్చింది. 

 “అయితే… నా కొవ్వొత్తి కూడా ఇక్కడే ఉందా?” అని కుతూహలంగా అడిగాడు. 

“ఉంది.”

“ఏది?”

మృత్యువు దాదాపు ఆరిపోతున్న ఒక చిన్న కొవ్వొత్తిని చూపించింది.

“అదే నీది.”

ఒక్కసారిగా వాసిల్ గుండె జారినంత పనయింది. 

కొద్దిసేపు ఆ కొవ్వొత్తినే చూస్తూ నిలబడ్డాడు.

తర్వాత నెమ్మదిగా “అది పూర్తిగా కాలిపోతే?” అని అడిగాడు.

 “అప్పుడు నువ్వు చనిపోతావు” అంది. 

ఆ మాట వినగానే వాసిల్ ముఖం పాలిపోయింది.

అయినా వెంటనే తేరుకుని మృత్యువు భుజం మీద సరదాగా తట్టి – “అయ్యో మిత్రమా! ఆ చిన్న కొవ్వొత్తి బదులు పెద్ద కొత్త కొవ్వొత్తి పెట్టేయి. అంతే!” అన్నాడు.

మృత్యువు కోపంతో తల అడ్డంగా ఊపింది.

“అది ఎన్నటికీ జరగదు. పుట్టిన ప్రతి ప్రాణీ, ఏదో ఒకరోజు మరణించి తీరవలసిందే. కాలాన్ని ఎవరూ ఆపలేరు” అంది. 

వాసిల్ మౌనంగా ఇంటికి తిరిగి వచ్చాడు.

అతని ముఖంలో దిగులు చూసిన భార్య, అనారోగ్యంతో ఉన్నాడేమో అనుకుని ఎంతో ప్రేమగా చూసుకుంది.

చాలాసేపటి తర్వాత వాసిల్ మెల్లగా “నా జీవితపు కొవ్వొత్తి ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది” అన్నాడు. 

భార్య కళ్లలో నీళ్లు తిరిగాయి.

“కొత్త కొవ్వొత్తి పెట్టమని అడగలేదా?” అని అడిగింది. 

“అడిగాను. కానీ మృత్యువు ఒప్పుకోలేదు” అన్నాడు. 

అంతే…

ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది.

వాసిల్ ఆమెను ఓదారుస్తూ “ఏడవకు. నేను మృత్యువుకు భయపడను. తప్పకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను” అన్నాడు. 

మూడు పగళ్లు…

మూడు రాత్రులు…

వాసిల్ కంటిమీద కునుకు లేకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు.

తినలేదు…

పడుకోలేదు…

చివరికి ఒక్కసారిగా లేచి బద్ధకం తీర్చుకోవడానికి ఒళ్ళు విరుచుకున్నాడు. 

వెంటనే ఒక విచిత్రమైన మంచాన్ని తయారు చేయడం ప్రారంభించాడు.

అది అవసరమైతే ఒక్క క్షణంలో గుండ్రంగా తిరగగలిగే మంచం.

కొద్దిరోజుల తర్వాత వాసిల్ నిజంగానే అనారోగ్యానికి గురయ్యాడు.

ఆ విచిత్రమైన మంచంపైనే పడుకున్నాడు.

కొద్దిసేపటికే మృత్యువు రానే వచ్చింది.

ఎప్పటిలాగే అతని తలవద్ద నిలబడి ఉంది.

వాసిల్ అది గమనించి మనసులోనే నవ్వుకున్నాడు.

“చూడు… ఎంత తొందరపడుతోందో!” అనుకున్నాడు.

అంతే…

ఒక్కసారిగా మంచాన్ని తిప్పేశాడు.

క్షణంలో మృత్యువు అతని కాళ్ల వద్ద నిలబడింది. 

మృత్యువు మళ్లీ తలవైపు వెళ్లింది.

వాసిల్ మళ్లీ మంచం తిప్పేశాడు.

ఈసారి మళ్ళీ మృత్యువు వాసిల్ కాళ్ళ దగ్గరకే చేరుకుంది. 

ఎన్నిసార్లు ప్రయత్నించినా అలాగే జరుగుతోంది. 

చివరికి మృత్యువు విసిగిపోయి “వాసిల్! నీ సమయం పూర్తయింది. నాతో రావాల్సిందే. లేదంటే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు” అని వేడుకుంది.

వాసిల్ నవ్వుతూ “నేను అంత అమాయకుడిని కాదు. నాకు రావాలి అనిపించిన రోజే వస్తాను. అప్పటివరకు నన్ను వదిలి వెళ్లిపో. నాకు ఇంకా చాలా పనులున్నాయి”అన్నాడు.

మృత్యువు తీవ్ర మనస్తాపానికి గురైంది.

“ఇదేనా నీ స్నేహం? ఇక మీదట ఈ గడప తొక్కను!” అని కోపంగా అరిచి మృత్యువు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

వాసిల్  అప్పుడు మంచం మీద నుంచి లేచాడు.

పూర్తిగా కోలుకున్నాడు.

మళ్లీ ఆరోగ్యంగా ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు.

అతను ఇప్పటికీ, ఎక్కడో ఈ నేల మీద తిరుగుతూ, అవసరమైన వారికి సహాయం చేస్తూనే ఉండి ఉంటాడని కొందరి నమ్మకం. 

ఏమో నిజమే కావొచ్చు.

ఆ పరమేశ్వరుడి లీలావిలాసాలు మానవమాత్రులకు అర్థమవుతాయా?  

శివ చల్లా

శివ చల్లా 5 జూలై 1997న నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఫిసికో-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్‌.సి., డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఇంపైర్‌మెంట్‌లో స్పెషల్ బి.ఎడ్. పట్టాలను పొందారు.
గత పదేళ్లుగా గుజరాత్, హైదరాబాద్‌లలోని పలు పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకులుగా సేవలందించారు. ప్రస్తుతం ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రదేశాలను సందర్శించడం, పుస్తక పఠనం, బేకింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం వీరి అభిరుచులు.

Previous Post

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

Next Post

కన్నడ కథ : చావు

Next Post
కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది
  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply