హిందీ మూలం : శ్రీమతి ఇళా సింగ్
తెలుగు అనువాదం : డా. వి.ఎల్. నరసింహం శివకోటి
మొబైల్ మళ్ళీ మోగింది. అప్పటికే వందన రెండు సార్లు సైలెంట్ లో పెట్టింది. తప్పకుండా పెద్దక్కయ్య సునందే అయ్యుండొచ్చు. టిఫిన్ బాక్సు సర్దుతూ వెంటనే మొబైల్ వైపు చూసింది.
“అవును, సునంద అక్కయ్య! ఆపకుండా చేస్తూనే ఉంటుంది” కాస్త చిరాకుపడుతూనే మొబైల్ మ్యూట్ చేసి టిఫిన్ బాక్సు సంజీవ్ బ్యాగులో పెట్టింది.
“ఇంత పొద్దున్నే ఎవరు?” సంజీవ్ మొబైల్ వైపు తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తూ అడిగాడు.
“ఎవరో ఒకరులెండీ, అవన్నీ నేను తర్వాత చూసుకుంటాను. ముందు మీరు బయల్దేరండి” అంటూ వందన మాట దాటేసింది.
కానీ సునంద అక్కయ్య అస్సలు ఆగకుండా ఫోను చేస్తూనే ఉంది. సంజీవ్ ఆఫీసుకు బయల్దేరే లోపు మళ్ళీ ఫోను చేసేసింది. ఈసారి వందన ఫోను మ్యూట్ చేసేలోపే సంజీవ్ గబగబా వచ్చి స్క్రీన్ మీద మెరుస్తున్న పేరు చూసేసాడు.”
“ఈమెకి ఇంట్లో పనేం ఉండదా? పొద్దున్న పొద్దున్నే ఫోన్లు. ప్రశాంతంగా బతకనిచ్చేలా లేదు” సంజీవ్ ముఖం చిట్లిస్తూ అన్నాడు.
వాతావరణాన్ని కాస్త చల్లబరచడానికా అన్నట్టు – “పదవుతోంది కదా! నువ్వు ఆఫీసుకి వెళ్ళిపోయావు అనుకుని ఉంటుంది.”
“ఓహో అంటే ఇది రోజూ ఉండే తంతేనా? నేను ఆఫీసుకి బయల్దేరగానే, ఫోను చేస్తుందా?” ఇప్పుడు సంజీవ్ మాటల్లో కాస్త వెటకారం.
వందన తేలుకుట్టిన దొంగలా “రోజూ ఎందుకు చేస్తుంది? తనకేం ఇంట్లో పని-పాట ఉండదా? ఏదో ముఖ్యమైన పని ఉందేమో!” అంది.
“మరి అలాంటప్పుడు ఫోను తీసి మాట్లాడొచ్చు కదా?” సంజీవ్ బ్యాగ్ తీసుకుని బయలదేరబోతూంటే వందన కూడా మ్యూట్ చేసిన మొబైల్ చేతిలోకి తీసుకుని బాల్కనీ వరకు వచ్చింది. ఇక సంజీవ్ వారం పదిరోజులపాటు సునంద అక్క ఫోను గురించి దెప్పుతూనే ఉంటాడు.
వందన సంజీవ్ ముందు తన పుట్టింటి వాళ్లతో ఫోనులో చాలా తక్కువ మాట్లాడుతుంది. అయినా ఎప్పుడో ఒకసారి ఇలా దొరికినప్పుడు ముఖం మాడ్చుకుంటాడు.
మరొక మూడు నెలల్లో సంజీవ్ రిటైర్మెంటు. ఇప్పుడు అదే వందనకి పెద్ద సమస్య. ఇక ముందు ముందు ఎలా నెట్టుకురావాలా అని ఆలోచిస్తోంది. తను ఎవరితోనూ మాట్లాడటం సంజీవ్ కి ఇష్టం ఉండదు. ఇరవై నాలుగు గంటలూ అతన పక్కనే ఉండాలి. వందన కళ్ల ముందు భవిష్యత్తు గిర్రున తిరుగుతోంది. సంజీవ్ రిటైర్మెంటు తర్వాత ఈ ఇల్లే తనకి జైలు. సరే, జరిగేది జరగనీ అప్పుడు చూసుకుందాం అనుకుంది.
తన ఆలోచనలకి బ్రేక్ వేస్తూ, సునంద అక్క దగ్గర నుండి మరొకసారి ఫోను రాక ముందు, తనే ఫోను చేసింది. “హాయ్ అక్క! ఏమైంది? ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నావు? ఏంటి విశేషం?”
“పిచ్చి తల్లి, అప్పటి నుండి చేస్తున్నాను. ఫోను ఎత్తవే? సంజీవ్ ఆఫీసుకి వెళ్ళిపోయి ఉంటాడుగా?”
“లేదు. ఇప్పుడే వెళ్ళారు. ఇవాళ కాస్త ఆలస్యం అయిపోయింది. నేను ఫోను ఎత్తకపోతే, కాస్త ఆగొచ్చు కదా అక్క! సంజీవ్ ఇంట్లోనే ఉండొచ్చు అన్న ఆలోచన రాలేదా?”
“అసలు సంజీవ్ ముందు ఫోను ఎత్తడానికి నీకు అంత పెద్ద ఇబ్బంది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తనకి ఎందుకు అంత భయపడతావు?”
“ఇందులో భయపడేది ఏముంది? నువ్వు కూడా భలే తమాషాగా మాట్లాడతావు!” కాస్త నొచ్చుకుంటున్నట్టు అంది వందన.
“భయం కాకపోతే ఏంటి మరి? నీ వయసెంత? యాభై ఐదు! ఇంత వయసొచ్చినా, నీకు నీ పుట్టింటి వాళ్లతో ప్రశాంతంగా ఫోను మాట్లాడే స్వాతంత్ర్యం కూడా లేదంటే ఏమనాలి?”
వందన పళ్లికిలించింది. ఇక అక్కయ్య ప్రవచనాలు మొదలు. తన సాధకబాధకాలు అర్థం చేసుకోదు. ఏదో విప్లవం తీసుకురావాలని ఆదుర్దా.
“అలాంటిదేం లేదు అక్క, భయం లేదు పాడు లేదు. నాకు ఒత్తిడి నచ్చదు అంతే. నా కోరికలన్నీ తీరుతూనే ఉన్నాయి. మీ అందరితో ఇంచుమించు మాట్లాడుతూనే ఉన్నాను కదా? నా ఫోను బిల్లు కట్టేది కూడా సంజీవే! ఇంక భయం ఏముంది?” వందన నవ్వుతూ మాట దాటేసింది.
“వందన, నేను చెప్పేది కాస్త ఆలోచించు. ఇప్పుడైతే సంజీవ్ ఆఫీసుకి వెళ్ళాక మాతో మాట్లాడుతున్నావు. మూడు నెలల తర్వాత సంజీవ్ రిటైర్ అయిపోతాడు. ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే ఉంటాడు. మరి అప్పుడేం చేస్తావు? ఆలోచించు.”
“హబ్బ! అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే. ఎప్పటిలాగనే మాట్లాడుతూ ఉంటాను.” వందన చెప్పనయితే చెప్పింది కానీ, లోపల ఆమెకు కూడా భయం లేకపోలేదు.
“చూద్దాం, చూద్దాం. ఎంత మాట్లాడతావో. అప్పుడు ప్రతిరోజూ మాట్లాడటం కుదరదు. నీ భవిష్యత్తు నా కళ్ళముందు మెదులుతోంది.” అటువైపు నుండి సునంద వదిలిన నిట్టూర్పు ఇటు వందన గుండెల్లో గుచ్చుకుంది.
“సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ, అసలు పొద్దున్నే ఇంత హడావుడిగా ఫోను ఎందుకు చేసినట్టు?” తన ఆలోచనలకి కళ్ళెం వేస్తూ అడిగింది.
“మన పక్కింటి సంజన తెలుసు కదా?”
“హాఁ, తెలుసు, నీ ఫ్రెండు.”
“అవును, దాని కూతురు సిద్ధి మొగుణ్ణి వదిలి పుట్టింటికి వచ్చేసింది. పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు, అప్పుడే విడాకులు కావాలని కేసు వేసింది.”
“అయ్యో, అలాగా? వాళ్లది లవ్ మ్యారేజి కదా? నువ్వు రోజూ ఆ ముచ్చట్లన్నీ చెబుతూ ఉండేదానివి. సిద్ధి, తన బాయ్ ఫ్రెండు కబుర్లు అన్నీ కథలు-కథలుగా చెప్పేదానివి. నీ కూతురు సుమ కి కూడా అలాంటి మొగుడే వస్తే బాగుణ్ణు అనేదానివి. చాలా మంచి పిల్లాడు. అందగాడు. మంచి ఉద్యోగం, ఐదంకెల జీతం, సిద్ధి అదృష్టమే అదృష్టం. అంత మంచి పిల్లాణ్ణి ఎలా పడేసిందో – ఇలా ఎన్నో చెప్పేదానివి.” వందన ఇంకా నమ్మలేకపోతోంది.
“అవును, నిజమే. పిల్లాడు మంచివాడు. సిద్ధి గురించి కూడా నీకు ముందే చెప్పాను. చాలా చురుకైనది, పెంకిపిల్ల, మొండి ఘటం. సంజన ఒక్కగానొక్క కూతురు. చాలా అల్లారుముద్దుగా పెంచింది. కొండ మీద కోతిని అడిగినా తీసుకొచ్చి ఇచ్చేది. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు ఉండేది. అడిగినవి అన్నీ క్షణాల్లో కాళ్ల దగ్గరకి వచ్చేవి. సంజన తన జీవితంలో అనుభవించని భోగభాగ్యాలు అన్నీ కూతురుకి ఇచ్చింది. అందుకే సిద్ధి అంత పెంకిగా తయారయ్యింది.
“అక్క, నువ్వు ఒకవైపే చూసి ఎందుకు నిర్ణయిస్తావు? అక్కడ సిద్ధికి ఏం ఇబ్బందులు ఎదురయ్యాయో మనకి తెలియదు కదా? సిద్ధిని చిన్నప్పటి నుండి చూసావు, కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. కానీ, ఆ పిల్లాడి గురించి నీకేం తెలుసు?” కాస్త విసుగ్గా అంది వందన.
“ఒకవైపు నుండే చూడటం కాదు వందన, ఈ స్త్రీవాదం తప్పు దారి పడుతోంది. నీ అభిప్రాయం చెప్పు.”
“తప్పు దారి ఏముంది అక్క? ఎదురు తిరిగినప్పుడల్లా ఏదో ఒక మార్పు సహజం. ఎవరో ఒకరు అనుభవించి తీరవలసినదే. సరే, మరి నన్ను ఎప్పుడూ ఎదురు తిరగమని ఎగదోస్తూ ఉంటావు, ఇప్పుడు ఈ కొత్త తరం ప్రతిఘటిస్తే తప్పు పడుతున్నావు?” వందన మాటలు సునందని బాధపెట్టాయి.
“నీ పరిస్థితి ఏమన్నా గొప్పగా ఉందా? ఒక ఆడదానికి, తనకి నచ్చినప్పుడు తనవాళ్లకి ఫోను చేసుకునే స్వాతంత్ర్యం కూడా లేదంటే ఏమనాలి? ఇంత కట్టడి ఏంటి? అక్కర్లేని చర్చలు, వాదులాటలతో బంధాలు తెగిపోతాయి. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ తప్పుని ఎదిరించాలి కదా! అలాగని, స్త్రీవాదం ముసుగు వేసుకుని తన ప్రతి మాట నెగ్గాలి అని పంతం పట్టడం ఎంత వరకు సబబు?”
“సరే అక్క, కానీ సిద్ధి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. చూస్తూ చూస్తూ ఎవరూ తమ జీవితాన్ని నాశనం చేసుకోరు కదా?”
“సిద్ధిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా! చాలా మొండి పిల్ల. దాని మాటలు-చేతలు నమ్మడం కష్టం. తన అందం, సంపాదన చూసుకుని గర్వం. ఈ సంగతి నీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఎవ్వరితో సరిగ్గా మాట్లాడదు, ఎవరి మాటకీ విలువ ఇవ్వదు.”
“మాట్లాడాల్సిన అవసరం ఏముంది? తనకి తక్కువ మాట్లాడటం అలవాటేమో, అదే నీకు పొగరు అనిపిస్తోందేమో. సంజన నీ స్నేహితురాలే కదా? తను ఏమంటోంది కూతురు గురించి.”
“ఇంకా సంజనతో మాట్లాడలేదు. పొరుగింటావిడ చెప్పిన కబురు వార్త ఇది. సంజన చెప్పకుండా అడగడం బాగోదు.”
“అవును. సంజన, నీ స్నేహితురాలు. నాలుగు రోజుల తర్వాత మెల్లగా తనే చెబుతుందిలే.”
“సరే. విషయం వివరంగా తెలిసాక నీకు చెబుతాను. ఉంటాను. సంజీవ్ ఉన్నా ఫోను తియ్యి. అలవాటు చేసుకో. లేదంటే ముందుముందు బాగా ఇబ్బంది పడతావు.”
“సరే, సరే. ఉంటాను. బాయ్.” వందన నవ్వుతూనే ఫోను కట్ చేసింది.
సునంద మాటల్ని నవ్వుతూ దాటేసింది కానీ, ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటున్నాయి.
“నిజంగానే, సంజీవ్ ఉన్నప్పుడు ఫోను తియ్యడానికి తను చాలా భయపడుతుంది. ఎవరి దగ్గర నుండి అయినా ఫోను వస్తే చాలు, సంజీవ్ ముఖం, ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతాయి. ఫోను స్క్రీన్ మీద తళతళ మెరిసే పేరు చూస్తూనే ముఖంలో రంగులు మారతాయి. ఎంత సంతోషంగా ఉన్నా, ఫోను రింగు వింటూనే కనుబొమ్మలు ముడిపడతాయి. ఫోను చప్పుడు వినిపిస్తూనే ఆ ఫోను ఎవరి దగ్గర నుండి అని చూడటానికి గబగబా వచ్చేస్తాడు. వీలైనంత వరకు వందన, రింగ్ కాకుండానే సైడ్ బటన్ నొక్కి ఫోను సైలెంట్ చేసేస్తుంది. అయినా అప్పుడప్పుడు దొరికిపోతూనే ఉంటుంది. అవతల నుండి ఫోను చేస్తున్న వాళ్ల గురించి ఏవో నాలుగు అవాకులు-చెవాకులు మాట్లాడతాడు. మరీ ముఖ్యంగా వందన పుట్టింటి తరఫు వాళ్ళో, స్నేహితులో అయితే ఇంకా రెచ్చిపోతాడు. అందుకే వీలైనంత వరకు సంజీవ్ ఆఫీసుకి వెళ్ళిన తర్వాతనే ఎవరితోనైనా ఫోను మాట్లాడుతుంది. అప్పుడయితే కాస్త నిదానంగా మాట్లాడొచ్చు. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంత ఒత్తిడిలో మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం? సగం బుర్ర సంజీవ్ మూడ్ ఎలా ఉందో ఆలోచించడానికే సరిపోతుంది. కానీ సునంద అక్క మాత్రం “నువ్వు ఇక ఇప్పుడైనా ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకి రావాలి! మన స్వాతంత్ర్యం కోసం కాస్త ఒత్తిడి అనిపించినా, తట్టుకోవాలి. సంజీవ్ కి నీ విలువ తెలిసిరావాలి. అతడు నీకూ, నీ బంధువులకి అసలు విలువ ఇవ్వడు. అందుకే తన ముందు నువ్వు ఎవరితోనూ మాట్లాడటం అతనకి నచ్చదు” అని చెబుతూ ఉంటుంది.
“నిజంగా తను కంఫర్ట్ జోనులో ఉంటోందా? దాంట్లో నుండి బయటకి రావడానికి తను అస్సలు ఏం ప్రయత్నించట్లేదా?” ఇప్పుడు వందన ఆలోచనలో పడింది.
“ఇంచుమించు నిజమే. ఒక్క ఫోను విషయంలోనే కాదు. సంజీవ్ ఇంట్లో అడుగు పెడుతూనే వాతావరణం మొత్తం మారిపోతుంది. ప్రతి పని సంజీవ్ కి నచ్చినట్టే జరగాలి. ఆమె ఎప్పుడూ బొంగరంలా భర్త చుట్టూనే తిరుగుతూ ఉండాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి పెళ్లైన దగ్గర నుండి ఈ ముప్పై ఐదేళ్లని చూస్తే ఆశ్చర్యంతో కూడిన బాధ – భర్త తోడు లేకుండా, ఒక్కర్తి పుట్టింటికి వెళ్ళిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టచ్చు. అది కూడా మహా అయితే రెండు లేదా మూడు రోజులు. సంజీవ్ తో కలిసి వెళ్లిన సందర్భాలు కూడా చాలా తక్కువ. పెళ్ళయిన తర్వాత అమ్మ దగ్గరకి ఒక్కర్తి వెళ్ళి ఐదు-పది రోజులు ఉన్న జ్ఞాపకమే లేదు. ఇప్పుడు వాళ్ళు రమ్మని పిలవడం కూడా మానేశారు. పుట్టింటికి రమ్మంటే వందనకి ఒత్తిడి పెరిగిపోతుందని అర్థం చేసుకున్నారు. సంజీవ్ అంత తొందరగా ఒప్పుకోడని వాళ్ళకి కూడా తెలుసు. దానితో లేనిపోని గొడవలు తప్ప ఒరిగేది ఏం లేదు.
అసలు, తను సంజీవ్ కి ఎందుకు ఇంత లొంగి ఉంటుంది? ఇదంతా ఆలోచించి వందన మనసు చేదెక్కిపోయింది.
ఇప్పుడే, పావు గంట క్రితం సిద్ధి తరఫున మాట్లాడుతూ, అక్కతో వాదించింది. కానీ, తన దగ్గరకి వచ్చేసరికి నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతోంది? ఎవ్వరికీ ఎందుకు చెప్పదు? ఎవరికైనా కొద్దో గొప్పో తెలుసు అంటే సునంద అక్కకే. తను అక్క దగ్గర కూడా చాలా విషయాలు దాచేస్తుంది. కానీ, అక్క చూపుల నుండి తప్పించుకోవడం అసాధ్యం.
గాయపడ్డ మనసు ప్రశ్నిస్తోంది – “సునంద అక్క చెబుతున్నది నిజమా? నేను కంఫర్ట్ జోను కి అంతగా అలవాటు పడిపోయానా?”
అసలు తన కంఫర్ట్ జోన్ ఏంటి? తన అందమైన ఇల్లు? దాన్ని తను ఎంతో ఇష్టంగా అలంకరించుకుంది. తన గది, అందులో తన మంచం, మళ్ళీ ఆ మంచంలో తను ఇష్టంగా ఎంచుకునే మూల, పక్కనే డ్రాయింగ్ టేబుల్. దాని సొరుగులో పెయింటింగ్ సామాన్లు. కొన్ని కవితల పుస్తకాలు. అయితే ఎప్పుడైనా సంజీవ్ ఎదురుగా తను కవితల పుస్తకం తెరిచే ధైర్యం చేస్తుందా? తన పెయింటింగులు సంజీవ్ కి చూపించగలదా? ఆమె సంజీవ్ ని ఎదిరించదు. అతడు లేనప్పుడు తనకి నచ్చిన పనులన్నీ చక్కబెట్టుకుంటుంది. కానీ, అతనికి కోపం వచ్చే పనులేవీ అతని ముందు చెయ్యదు.
అయితే అతని కంటపడకుండా తప్పించుకోగలుగుతుందా? అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ దెప్పిపొడుస్తూనే ఉంటాడు.
పెళ్లైన కొత్తల్లో తను వేసిన పెయింటింగ్ సంజీవ్ కి చూపించబోయింది. సంజీవ్ స్పందన చూసి ఆమె చప్పగా చల్లారిపోయింది – “తర్వాత చూస్తాను కానీ, ముందు వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా” అన్నాడు.
తను కాఫీ తీసుకొచ్చే సరికి పెయింటింగ్ మంచం మీద పక్కన పడేసి ఉంది. సంజీవ్ ముఖం చూసాక, మళ్ళీ ఎప్పుడూ సంజీవ్ కి తన పెయింటింగ్ చూపించడానికి మనస్కరించలేదు. తర్వాత ఒకటి-రెండుసార్లు ప్రయత్నించింది. కానీ పెయింటింగ్ మాట ఎత్తుతూనే నవ్వుతూ-నవ్వుతూ ఉన్న ముఖం ముటముటలాడిపోవడం చూసి ఇక ఆ ప్రయత్నాలు మానుకుంది. తను పెయింటింగ్ చూపిస్తూనే, సంజీవ్ కి ఏదో ముఖ్యమైన విషయమో, లేక తను చేసిన ఏ చిన్న తప్పో గుర్తొస్తాయి – “పెయింటింగ్ పక్కన పెట్టు. వంటింట్లో పాలు పొంగుతున్నట్టున్నాయి. ముందు వెళ్ళి ఆ సంగతి చూడు.” లేదా అలాగే ఏదో ఒకటి మాట మారుస్తాడు. ఇక పెయింటింగ్ గాలికి వదిలేసినట్టే. తను ఇక తప్పదన్నట్టు సంజీవ్ పురమాయించిన పని చేసుకుంటూ కూర్చొంటుంది.
వందన మెల్లమెల్లగా పరిస్థితులకు లొంగిపోయింది. సంజీవ్ ఆఫీసుకు వెళ్ళిన తర్వాతనే తనకి ఇష్టమైన పనులు చేసుకోవడం మొదలుపెట్టింది. అవన్నీ సంజీవ్ కి చెప్పాలి-చూపించాలి అన్న ఆశలు పూర్తిగా వదులుకుంది. బహుశా పరిస్థితులు కుదురుగా ఉండటమే తన కంఫర్ట్ జోన్ అనుకుంటా. సంజీవ్ సంతోషంగా ఉండి, ఇంట్లో ఎలాంటి గొడవలు లేకపోతే అంతే చాలు. సంజీవ్ సంతోషంగా ఉంటే, తను కూడా హాయిగా ఊపిరిపీల్చుకుంటుంది. పోనీ ఇదంతా చేసినా, సంజీవ్ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడా అంటే అదీ లేదు. ఇది కాస్త కష్టమైన ప్రశ్న!
ఎన్నో ఏళ్ళుగా ఈ సాలెగూడులో చిక్కుకుపోయింది. తనకు నచ్చిన పని ఏదీ చెయ్యలేకపోయింది. అలాగని పెయింటింగ్ మానెయ్యలేదు. పెయింటింగులు వేసి స్టోర్ రూములో పెట్టుకోవడం, లేదంటే స్నేహితులకి పంచిపెట్టడం. అంతే!
ఒకసారి ఇంట్లో గోడకి తగిలిస్తే, సంజీవ్ గట్టిగా పగలబడి నవ్వాడు. అంతే, మనసు విరిగిపోయింది. సంజీవ్ నోరు తెరిచి ఏమీ అనలేదు. కానీ, ఆ నవ్వుకి ఒక్కసారిగా మనసు ముక్కలు-ముక్కలు అయిపోయింది. మర్నాడే ఆ పెయింటింగ్ తీసి స్టోర్ రూంలో పెట్టేసింది.
ఇవాళ వందన లెక్కలు వేసుకుంటోంది. నిజంగా తను సంజీవ్ కి భయపడుతోందా? అతని ముఖకవళికలని బట్టి అతనికి నచ్చినట్టు నడుచుకోవడానికి అలవాటు పడిపోయిందా?
నిజంగా తమ దాంపత్య జీవితం సజావుగా ఉందా?
సిద్ధి విషయమే తీసుకుందాం – ఈ యువతరానికి ఇంత చురుకుదనం, ధైర్యం ఎక్కడి నుండి వస్తాయి? కారణం తెలియదు కానీ, సిద్ధి, ఒక్క క్షణంలో నిర్ణయం తీసేసుకుంది. ఈ కొత్త తరం – తొందరపాటు నిర్ణయాలు!
పెళ్లయ్యి ఏడాది తిరగకుండానే, విడిపోవడాలు – ఇలాంటి కబుర్లు ఇరుగుపొరుగు, చుట్టాలు, వార్తల్లో చూస్తూనే ఉంది. ఇటు పెళ్ళి అవుతూనే, అటు విడాకులు. ఒక్కొక్కసారి ఒక పిల్లో-పిల్లాడో పుట్టిన తర్వాత కూడా చిన్న-చిన్న కారణాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
అదే వందన తరం? ఆ తరం ఇంకా అక్కడే ఆగిపోయింది. ప్రాథమిక హక్కుల కోసమే నానా తంటాలు పడాల్సి వస్తోంది.
అసలు ఇంతకీ ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఈ ప్రశ్న వందన మెదడుని తొలిచేస్తోంది.
వందనని రకరకాల ఆలోచనలు ముసురుకుంటున్నాయి – మా తరం, తమ పిల్లలకి మంచి చదువు, కావలసిన సదుపాయాలు, ఆర్థిక స్వాతంత్ర్యం అన్నీ ఇచ్చి తప్పు చేసిందా? నేటి తరంలో మొండితనం, స్వార్థం, విప్లవ భావాలు పెరిగిపోయాయా? ఇది ఎంత వరకు నిజం?
ఒకరోజు మెట్రోలో పెద్ద బ్యాగ్ పట్టుకుని నిలబడి ఉంది. రైలు వేగానికి సంభాళించుకోలేక పడబోయింది. ఇంతలో చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న ఒక అందమైన అమ్మాయి, ఠక్కున నన్ను పట్టుకుని, లేచి తన సీట్లో నన్ను కూర్చోబెట్టింది. అంతలోనే మెట్రో కారిడార్ కి ఉన్న హ్యాండిల్ పట్టుకుని మళ్ళీ మొబైల్ లో తలదూర్చింది.
అలాగే మరొక రోజు పార్కులో నలుగురు ముసలి వాళ్ళు ఫోనులో ఏదో ఇబ్బంది వచ్చి తిప్పలు పడుతున్నారు. రోజూ వాళ్ళు పార్కులో బెంచి మీద కూర్చుని యూట్యూబ్ చూస్తూ ఉంటారు. కాసేపు నడిచి, అలసిపోయి బెంచి మీద కూర్చొని మొబైల్ లో ప్రవచనాలో ఏవో వింటూ ఉంటారు. అసలు ఏమయిందో చూద్దామని అటు నాలుగు అడుగులు వెయ్యబోతోంటే, అటుగా వెళ్తున్న ఒక ఇరవై-ఇరవై రెండేళ్ల కుర్రాడు వాళ్ల దగ్గరికి వచ్చి, వాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ జాగింగ్ కి పరుగందుకున్నాడు.
ఇలా, మంచి మనసున్న యువతీ-యువకులని చాలా మందిని చూసాను. బాగా చదువుకుని, ఎక్కువ మాట్లాడకుండా తమ పని తాము చేసుకుని పోతూ ఉంటారు, ఉద్యమాలూ అంటూ ఎలాంటి జెండా పట్టుకుని తిరగకపోయినా వీళ్లల్లో మానవత్వం పాళ్ళు కూడా ఎక్కువే. కరోనా సమయంలో ఈ యువత ఎందరికో సహాయం చెయ్యడం వందనకి తెలుసు.
కానీ ఇదే యువత తమ వ్యక్తిగత జీవితంలో ఇంత పట్టుదలగా ఎందుకు ఉంటున్నట్టు? వీళ్ళ విషయంలో మానవ సంబంధాలు నీటిబుడగల్లా ఎందుకు క్షణికం అయిపోతున్నట్టు?
ఒక క్షణం పాటు సహృదయతకి, జీవితాంతం రాజీ పడటానికీ చాలా తేడా ఉండొచ్చు. నేటి యువతరం నిజంగా తెలివైనది. తన ఉనికిని ప్రశ్నించే జీవితంతో రాజీపడటం వాళ్లకి నచ్చదు కాబోలు.
మొత్తానికి వందన తన ఆలోచనలకి కళ్ళెం వేసింది. ఆలోచనలు ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్లిపోయాయి.
వందన తన కొడుకుని కూడా చాలా చక్కగా పెంచి పెద్ద చేసింది. ఐ.ఐ.టి. లో ఇంజినీరింగ్ చేసి ప్రస్తుతం బెంగుళూరులో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సమాజం పట్ల వాడి ఆలోచన, బాధ్యత, సహృదయత చూసి చాలా సంతోషంగా ఉంటుంది. తన పెంపకం మీద గర్వంగా కూడా ఉంటుంది. కానీ, పెళ్ళి విషయానికి వస్తూనే దిగులు. ముప్పైరెండేళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. పెళ్ళి విషయం ఎత్తితే చాలు, మాట దాటేస్తాడు.
సిద్ధి గురించి తెలిసి, సునందతో ఇంత గంభీరంగా మాట్లాడిన తర్వాత, అవే ఆలోచనల్లో కొడుకుకి ఫోను చేసింది. ఎప్పటిలాగానే పెళ్ళి సంగతి ఎత్తుతూనే కొడుకు మాట దాటేస్తూ – “అమ్మా, పెళ్ళి-పెళ్ళి అని నా ప్రాణాలు ఎందుకు తీస్తారు? నేను మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు చేసుకుంటాను. ఇందులో ఏముంది? మీరెందుకు అసలు ఇంత గొడవ చేస్తున్నారు? ఇంకా నేను మానసికంగా సిద్ధంగా లేను. ఇది ఎంజాయ్ చేసే వయసు. కెరియర్ లో ఇంకా మంచిగా స్థిరపడాలి. సరైన జోడీ దొరికినప్పుడు చేసుకుంటాను.
“వయసు సంగతి?” వందన గొంతు తడబడింది. కొడుకుతో ఇలాంటి విషయాలు తిన్నగా మాట్లాడటానికి కూడా వందనకి ఇబ్బందిగా ఉంటుంది.
“వయసుది ఏముంది అమ్మా? నువ్వు చిన్న వయసులో పెళ్ళి చేసుకున్నావు సరే? ఏం ఒరిగింది నీకు?”
“ఏం ఒరిగిందా? నువ్వు వచ్చావు కదా? తల్లి అవ్వడం కంటే ఆనందం ఏముంటుంది చెప్పు?” వందన నవ్వుతూ చెప్పింది.
“అందులో ఏముంది? కాస్త ఆలస్యంగా చేసుకున్నా పుట్టే వాడిని. నువ్వు కూడా వయసులో ఉన్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించి ఉండాల్సింది. కెరియర్ చక్కదిద్దుకోవాల్సింది. నీకంటూ ఒక కెరియర్ లేకపోవడం వల్లనే ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉంటావు.”
“కానీ, ఒక వయసు తర్వాత పిల్లల్ని కనటం, పెంచటం ఇబ్బంది కదా? వయసులో ఉన్నప్పుడైతే పిల్లల్ని చక్కగా చూసుకోవచ్చు” కొడుకుతో వాదనకి దిగింది.
“అలాంటిదేం లేదు అమ్మ. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. వయసులో ఉన్నప్పుడే మంచి ఉద్యోగం, సంపాదన వీలవుతుంది. పెళ్ళి, పిల్లలు అని కెరియర్ ని ఉపేక్షిస్తే, ఇక అంతే సంగతులు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో. ప్రస్తుతం కాంపిటేషన్ చాలా ఎక్కువగా ఉంది. కెరియర్ కోసం బాగా కష్టపడాల్సి వస్తోంది. మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉంటే పిల్లల్ని ఇంకా బాగా పెంచుకోవచ్చు.
నేటి యువతరం, పాతతరంలా భ్రమల్లో బతకట్లేదు. వీళ్ళు ఎంత స్పష్టంగా ఆలోచిస్తున్నారో! వందన ఒక్కసారి నిట్టూర్చి, మళ్ళీ ఇంతలోనే “వయసు పెరిగే కొద్దీ పిల్లలు ….. కాంప్లికేషన్స్ …” అని ఏదో చెప్పబోయింది.
వందన ఇంకా వాక్యం పూర్తి చెయ్యకముందే, కొడుకు ఇంతెత్తున లేస్తూ “ఏం కాంప్లికేషన్స్? అసలు నీకు ఏం తెలుసు ఇవన్నీ?” అన్నాడు.
తన తరం, ఆ కాలం గుర్తొచ్చి వందన ఒక్కసారి బిక్కచచ్చిపోయింది. ఆ కాలంలో అసలు తల్లిదండ్రుల ముందు ఇలా గొంతుపెంచి మాట్లాడే ధైర్యం ఉండేదా? అయితే పిల్లలు అంత స్పష్టంగా మాట్లాడుతూంటే తను కూడా ఇక నోరు మెదపక తప్పదు అని వందన “ఒరేయ్, ఒక వయసు దాటిన తర్వాత జన్యుపరమైన సమస్యలు … మళ్ళీ ఎగ్…”
కొడుకు నవ్వేసాడు. “ఇంకా ….? ఎగ్స్-స్పెర్మ్ క్వాలిటీ? మమ్మీ! ఈ మధ్య బాగా గూగుల్ చేస్తున్నట్టున్నావు? సరే ఒప్పుకుంటాను. లేటు వయసులో పెళ్ళి, పిల్లలు అంటే కొన్ని సమస్యలు ఉన్న మాట నిజమే! కానీ లాభాలు కూడా ఉన్నాయి కదా! ఒక వయసు తర్వాత ఆర్థికంగా, మానసికంగా కూడా స్థిరత్వం వస్తుంది. అప్పుడు వైవాహిక జీవితాన్ని కూడా మంచిగా సంభాళించుకోగలం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలం. మరి ఈమధ్య ఎగ్స్-స్పెర్మ్ బ్యాంకులు తెరిచారని నీ గూగుల్ దేవత చెప్పలేదా? నేటి యువతరం తమ స్పెర్మ్ ని కూడా సురక్షితంగా దాచుకుంటోంది. తమ పరిస్థితులు చక్కబడిన తర్వాత, మానసికంగా సిద్ధమైనప్పుడు తల్లిదండ్రులు అవ్వొచ్చు.
![]()
వందన ఇవాళ ఉదయం నుంచి ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతోంది. పొద్దున్నే సునంద అక్క, తర్వాత సిద్ధి ముచ్చట, ఇప్పుడు కొడుకుతో వాదన … ఇలా మనసులో ఒక రకమైన ఘర్షణ. పాత తరానికి – కొత్త తరానికి మధ్య ఘర్షణ. ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? తప్పొప్పుల ప్రశ్నే లేదు. కాలం మారుతోంది. నిన్న ఒప్పు అన్నది, ఇవాళ తప్పు అంటున్నారు. అలా చూస్తూంటే నిన్నటి ఒప్పు కూడా ముందు తరానికి తప్పే! ఇవాళ కొత్త తరం, పాత తరాన్ని ఔట్ డేటెడ్ అంటోంది. మా తరం కూడా ముందు తరం గురించి ఇలాగే ఆలోచించింది. ఈ ఘర్షణ ఇవాల్టిది కాదు. తరతరాలుగా కొనసాగుతూనే ఉంది.
కొత్త టెక్నాలజీ, కొత్త చదువులు ఈ కొత్త తరానికి ఆధునిక ఆలోచనా ధోరణి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చాయి. వాళ్ళ పురోగతి, ఆత్మవిశ్వాసానికి అవే ఆధారం. ఈ ఘర్షణ నుండి తప్పించుకోవడానికి మా తరమే నడుం బిగించాలి కాబోలు. సాంప్రదాయబద్ధమైన ఆలోచనా ధోరణికి స్వస్తి చెప్పి మార్పుకు స్వాగతం పలకాలి. ఆ పాత కట్టుబాట్లకు నీళ్ళొదిలి, ఒక సహజమైన జీవితం వైపు అడుగులు వెయ్యాలి.
ఇవాళ వందన తన మనసు పొరల్లోకి తొంగి చూడాలని కంకణం కట్టుకుంది. అసలు తను సంజీవ్ ని ఎందుకు భరిస్తోంది? సంజీవ్ ఆత్మన్యూనత, ఆత్మముగ్ధత, మొండితనం తనని ఎంతో ప్రభావితం చేసేసాయి. ఇన్నేళ్ళుగా వందన అతని ముందు నటిస్తూనే ఉంది. ఇన్నేళ్ళుగా అందరి ముందూ నవ్వుతూ, నవ్విస్తూ, తన వాస్తవిక పరిస్థితులని దాచిపెడుతూ వచ్చింది.
బహుశా తప్పు వందనదే అయ్యుండొచ్చు. ముందు నుండే సంజీవ్ మాటలకి ఎదురు తిరిగి ఉండాల్సింది. మొదట్లో ఉండే వల్లమాలిన ప్రేమ వల్ల సంజీవ్ తనని డామినేట్ చేస్తున్న విషయం అర్థం చేసుకోలేకపోయింది. వందన మెతకదనమే ఆమెను ముంచేసింది. వందనకి విషయం బోధపడేటప్పటికి పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి.
సంజీవ్ తన మాటకి ఎవరైనా ఎదురు చెబితే అస్సలు భరించలేడు. సంజీవ్ లో ఉన్న ఆత్మన్యూనత, తన గురించి తాను గొప్పగా ఊహించుకోవడం, ఇవన్నీ కలిసి అతడిలో అహంకారాన్ని పెంచేసాయి. తనని ఎవరైనా విమర్శించినా తట్టుకోలేడు. బహుశా అతని తల్లిదండ్రుల మొదలు బంధువులు ఎవ్వరూ కూడా సంజీవ్ మాటకి ఎదురు చెప్పరు. అతడు చెప్పే ప్రతీ దానికీ గంగిరెద్దుల్లా తలాడిస్తారు. అక్క-చెల్లెళ్ళు కూడా అతణ్ణి సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తూంటారు. కుటుంబానికి కూడా చాలా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చేసేదానికంటే చూపించుకునేదే ఎక్కువ. అతడు చేసే ప్రతిదాంట్లో కూడా ఒకరకమైన అతిశయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
వందన మనసులో ఎన్నో చిక్కుముడులు. ఇవాళ ఎలాగైనా ఈ చిక్కుముడులు విడదీసి తీరాల్సిందే. సంజీవ్ ప్రవర్తనకి అతని అలవాట్లకి, మానసిక రుగ్మతలే కారణం.
ఒక్కొక్కసారి సునంద అక్క చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఆమె మాట వినాలి అనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ – “చూడు వందన, సంజీవ్ ప్రవర్తనలోనే ఏదో తేడా ఉంది. ఏవో చిన్నప్పటి జ్ఞాపకాలు, మానసిక రుగ్మతలు, తల్లిదండ్రుల పరస్పర సంబంధాలు, మెదడులో రసాయనిక చర్యల్లో సంతులనం లోపించడం, ఇలా ఏదో కారణం వల్ల అతడు నీతో అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మళ్ళీ తన వైపు వాళ్లతో బాగానే ఉంటాడు. వాళ్ళని సంతోషపెట్టడానికి కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ కసి అంతా నీమీద తీర్చుకుంటూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా కౌన్సిలర్ ని కలిస్తే నయం!” అంటూ ఉంటుంది.
ప్రతిసారీ వందన తన పరిస్థితుల గురించి తల బద్దలుకొట్టుకుంటుంది. సునంద అక్క చెప్పే మాటల్లో కూడా నిజం ఉంది అనిపిస్తుంది. కౌన్సిలర్ ని కలిస్తే ఎలా ఉంటుంది? కానీ, ఇన్నేళ్ళు గడిచిపోయాక? ఇప్పుడా? ఇప్పుడు ఇక తనకి అలవాటయిపోయింది. అసలు సంజీవ్ వ్యక్తిత్వంలో లెక్కలేనన్ని పొరలు. అవన్నీ డాక్టరుకి ఎలా వివరించి చెప్పగలదు? అవన్నీ విడమరిచి చెప్పే అంత సామర్థ్యం తనకి ఉందా?
సంజీవ్ తాగి వచ్చి, కొట్టడం, అవసరాలకి డబ్బులు ఇవ్వకపోవడం – ఇలా ఏం బాధపెట్టడు. కానీ అతని ప్రవర్తనలోనే ఒక ఏకఛత్రాధిపత్యం దాగి ఉంది. ప్రతి పనీ తనకి నచ్చినట్టే జరగాలి. అతను నంది అంటే నంది, పంది అంటే పంది. కాస్త అటూ-ఇటూ అయినా, అతడిలో దాగున్న మరొక మనిషి నిద్రలేస్తాడు. కానీ కౌన్సిలర్ దగ్గరకి వెళ్లాలి అన్న ఆలోచనతోనే వందన వెన్నులో వణుకు పుడుతోంది. అరచేతుల్లో చెమటలు పట్టేస్తున్నాయి. పొరపాటున ఆ కౌన్సిలర్ సంజీవ్ ని పిలిపిస్తే? తనకి సంజీవ్ ని డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళే ధైర్యం ఉందా?
గణగణమని మోగిన మొబైల్ రింగ్ తో వందన మళ్ళీ ఈలోకంలోకి వచ్చింది.
సునంద అక్కయ్య ఫోను. ఇదేంటి రోజులో ఇన్నిసార్లు?
“చెప్పు అక్కయ్య! ఏమయింది?” ఎందుకో కాస్త గాబరాగా అడిగింది.
“పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏం కాదు. ఒక చిన్న మాట చెప్పాలి నీకు అంతే!” సునంద అక్కయ్య నవ్వేస్తూ చెబుతోంది.
“హమ్మయ్య, ఒకే రోజు ఇన్నిసార్లు ఫోను చేసేసరికి కంగారు పడ్దాను.”
“అసలు నువ్వు ప్రతి చిన్న దానికీ ఎందుకు అంత భయపడతావు అర్థంపర్థం లేకుండా? మనసులో అనుమానాలు ఉంటే ఇలాగే లేనిపోనివి అన్నీ ఆలోచిస్తూ ఉంటావు. ఒసేయ్, కాస్త సహజంగా ఉండు.”
“ఊరుకో అక్క, ఎప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటావు” అనేసింది నవ్వుతూ.
“సరే, అవన్నీ వదిలెయ్యి కానీ, ఒక ఎగ్జైటింగ్ న్యూస్. ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, అది కూడా మీ ఊళ్ళోనే. గొప్ప గొప్ప ఆర్టిస్టులు వస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళు. వాళ్ళని కలిసి నీ పెయింటింగులు చూపించు” సునంద చెప్పుకుపోతోంది.
“నేనా? ఆర్ట్ ఎగ్జిబిషన్ కా? ఏం మాట్లాడుతున్నావు అక్కయ్య?” అంది వందన.
“ఏం మాట్లడుతున్నావు? ఇందులో అంత ఆశ్చర్యపోయేది ఏముంది? అసలు నువ్వు ఎందుకు అంత భయపడతావు? నేను ప్రతి యేడాదీ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి చెబుతూనే ఉంటాను, నువ్వు దాటేస్తూనే ఉంటావు. కానీ ఈసారి మీ ఊళ్ళోనే. రైళ్లు, విమానాలు ఎక్కే పని కూడా లేదు. సంజీవ్ ని కౌన్సిలర్ దగ్గరకి తీసుకెళ్ళడం మాట దేవుడెరుగు, ముందు నీ భయానికి వైద్యం చేయించుకో” అని కేకలేసి సునంద కోపంగా ఫోను పెట్టేసింది.
వందన, తన అక్కయ్య ఏం చెప్పిన ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తుంది. ఇలా ఆర్ట్ ఎగ్జిబిషన్లకి వెళ్లడం, ఆర్టిస్టులని కలవడం, తన పెయింటింగులు చూపించడం – అసలు ఈ ఆలోచనలకే వందన భయపడిపోతుంది.
విషయం కొడుకుకి చెబితే, వాడు కూడా ఉత్సాహంగా, “అమ్మా, వెళ్ళు. నీకున్న టాలెంట్ బయటకి రానివ్వు. దానికి కూడా కాస్త విలువ ఇవ్వు. నాన్న ఎలాగూ మారేది లేదు. ఎదిరించడం నేర్చుకో. కావాలంటే మెడికల్ సపోర్టు తీసుకో. నాకు తెలిసున్నంత వరకు, తనకి ఇష్టమైన వస్తువు దూరమైపోతుందన్న భయం నాన్నగారికి. అందుకే నీపట్ల అంత పొసెసివ్ గా ఉంటారు. నన్ను కూడా తన ప్రేమలో బంధించి ఉంచడానికి ప్రయత్నించారు. మొత్తానికి ఎలాగో తప్పించుకోగలిగాను. అంత మాత్రానికి ఆయన నన్ను ప్రేమించడం మానెయ్యలేదు కదా! పెళ్ళి మాట ఎత్తినప్పుడల్లా నేను ఆయన్ని బ్లాక్ చేస్తూ ఉంటాను. మళ్ళీ మామూలే. ఆయన తన ప్రయత్నాలు మానరు. నేను మాత్రం నా మనసుకి నచ్చినదే చేస్తాను. ధైర్యం నువ్వే చెయ్యాలి. నీ బదులు వేరొకరు ధైర్యం చెయ్యలేరు కదా? నాలుగు రోజులు అరుస్తారు-సణుగుతారు. మెల్లమెల్లగా మరచిపోతారు. కాలం గడిచేకొద్దీ పరిస్థితులతో రాజీపడతారు. ఆయన అనుమతి కోసం ఎదురుచూస్తూ కూర్చొంటే, ఒక్కనాటికీ అది జరిగే పని కాదు.”
వందన మెదడులో చెలరేగుతున్న తుఫాను మెల్లమెల్లగా తీరంచేరుతున్న అనుభూతి! కంఫర్ట్ జోన్ బూజులు దులిపి తీరాల్సిందే. ఇంకా ఆ సాలెగూటిలో చిక్కుకుని ఉండటం తనవల్ల కాదు.
“ఉన్నది ఒక్కటే జీవితం. తనివితీరా ఆస్వాదించాలి.” యువతరం సిద్ధాంతాన్ని ముందు తరం కూడా పాటించాలి. తప్పేముంది? ఉన్నది ఒక్కటే జీవితం!
![]()
శ్రీమతి ఇళా సింగ్
ప్రముఖ కథా రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు శ్రీమతి ఇళా సింగ్, హిస్టరీలో ఎం.ఏ., పట్టా పొందారు. ‘హంస్’, ‘కథాదేశ్’, ‘కథాక్రమ్’, ‘పరికథ’, ‘సాహిత్య అమృత్’ ‘సేతు’ (పిట్స్ బర్గ్ నుండి) వంటి జాతీయ-అంతర్జాతీయ హిందీ పత్రికల్లో కథలు, సాహిత్య వ్యాసాలు ప్రచురించారు. విష్ణుచంద్ర శర్మ గారి ఐదు నవలికలు, మంటో ఐదు కథల మీద విమర్శనాత్మక వ్యాసాలు ప్రచురించారు. పలు సంకలనాలలో వీరి కథలకు చోటు లభించింది. లక్నో ఆకాశవాణి, దూరదర్శన్ నుండి వీరి కథలు ప్రసారమయ్యాయి. ‘ముఝే పంఖ్ దే దో’ వీరి కథల సంకలనం.
మొబైల్ : 7839040416
ఈ-మెయిల్ : ilasingh1967@gmail.com

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా రాసిన పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన హిందీలోకి అనువదించి ప్రచురించారు. హిందీ కవి నరేష్ సక్సేనా కవితలను, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, హిందీ రచయిత్రి మమతా కాలియా రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఎంపిక చేసిన హిందీ లఘు కథానికలను తెలుగులోకి అనువదించి ‘తోలుబొమ్మలు’ శీర్షికన ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.



