• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ : చావు

చందకచర్ల రమేశబాబు by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ : చావు

కన్నడ మూలం: చీమనహళ్ళి రమేశ బాబు
తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు

అది చీకటి కాని చీకటి. కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మాయలా కదులుతాయి కదా చిత్రాలు: అలాంటి చీకటి. అక్కడ దివాకర్ కళ్ళు ఒక విచిత్రమైన ఒక దృశ్యాన్ని చూడసాగాయి. మట్టిలో కలవడం కోసం కాచుకున్న ఒక కుళ్ళిపోయిన శవం తాలూకు సంబరం అతడి కళ్ళకు అలలుగా తట్టసాగింది. గిజగిజమంటున్న కీటకాల సద్దు కూడా. అది మట్టిలో పూడ్చబడిన శవం. మట్టిలోకి కలిసిపోయే ప్రక్రియలో ఉన్న శవం.

అతడు చూస్తుండగానే కీటకాల సంఖ్య ఇబ్బడి, ముబ్బడిగా వందలుగా… ఇలా పెరుగుతూ సంబర పడసాగాయి. మట్టికి ప్రాణం వచ్చినట్టై ఒత్తిగిల్లినట్టనిపించింది. గరిక వేర్లు కీటకాల్లా ఉత్సాహంతో దొర్లుతూ శవంలోకి చొచ్చుకుని పోతున్నాయి. అలాగే చెట్ల, మొక్కల వేర్లు పాముల్లా చలిస్తూ ఆ శవాన్ని చుట్టుముట్టాయి. పైనేమో పచ్చటి ఆకుల సంబరం. కొన్ని క్షణాల్లోనే ప్రాణం నింపే మట్టిగా మారిన శవం. దాని మధ్యన తళతళ మెరిసే ఎముకలు. అతడు మిగిలిపోయిన ఎముకల వైపే చూడసాగాడు. శవం తాలూకు రెండూ చేతుల చూపుడు వేళ్ళ ఎముకలు క్షిపణుల్లా ఎగిరి వచ్చి అతడి కన్నుగుడ్లలోకి దూరి, మెదడులో కూర్చున్నాయి. భరించరాని నొప్పి. తోడుగా చీకటి. అలాంటి చీకట్లో చూడడం మరచిపోయిన కళ్ళు. దిక్కు తోచనట్టు గట్టిగా అరిచాడు.

అతడి అరుపుకు మేలుకున్న భార్య ‘ఏమయ్యింది?’ అనేలా కుడి చెంపను తట్టింది. అతడు దిగ్గున లేచి కళ్ళు తాటించసాగాడు. మందమైన వెలుగు: అయినా అన్నీ కనబడుతూ ఉన్నాయి. భార్య, కొడుకు, ఫ్యాను, టేబల్, ల్యాప్టాప్, మొబైలు… ఇలా అన్నీ. పక్కన పడుకున్న కొడుకు మొహాన్ని తేరిపార చూడసాగాడు. ప్రశాంతంగా ఉన్న మొహం, అంతే ప్రశాంతమైన నిద్ర. వాడి నుదుటి పైన చెదిరిన వెంట్రుకలు అంతే ప్రశాంతంగా ఉన్నట్టనిపించింది. ఇంకా చూడసాగాడు. మూసిన రెప్పల్లోంచి కనుగుడ్లు ఒకసారి చలించినట్టయింది. వీడు ఎలాంటి కలలు కంటున్నాడో అనిపించింది. భార్య “ఏమయ్యింది?” అని మెత్తటి గొంతుతో అడిగింది. ‘ఏదో కల’ అంటూ మళ్ళీ పడుకున్నాడు. నిద్ర పట్టక దొర్లసాగాడు. పైన సద్దు లేకుండా తిరుగుతున్న ఫ్యాను వైపు చూడసాగాడు. వదులై పైన పడితే అని భయపడ్డాడు. మళ్ళీ ఛ! తన ఆలోచనలెందుకు ఇలా భయపెడుతున్నాయి అనుకున్నాడు.  భార్య కొంతసేపటికి గురక పెట్టసాగింది. తను అంత త్వరగా ఎలా నిద్రలోకి జారుకుంటుంది… నిద్ర కూడా ఒక సిద్ధి అనుకుంటూ మళ్ళీ లేచి కూర్చున్నాడు. మెదడులో ఆ వేళ్ళ ఎముకలు ఇంకా ఉన్నాయేమో అన్న సందేహం కలిగి ఒకసారి తలను విదిలించాడు. లోపల ఏదో అల్లాడినట్టనిపించింది. మళ్ళీ ఒకసారి విదిలించాడు. మళ్ళీ అదే అనుభవం. దాంతోపాటు నుదుటి రెండు వైపులా గుచ్చినట్టు కూడా అనిపించింది. తలనొప్పి మాత్ర వేసుకోనా అనుకున్నాడు. లేదా నిద్ర మాత్ర ? ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నాళ్ళైందో అనిపించింది. బయట కుక్కల అరుపులు కాలని అంతా ఆవరించింది. యుద్దం ప్రకటించేలా ఒక్కలాగా మొరగడం. పడకనుండి లేచి వచ్చి హాల్లోకి వచ్చి ఆవలిస్తూ సోఫాలో కూర్చున్నాడు. హాల్లోని అన్ని కిటికీలకూ తెరలు వేసున్నా వీధి దీపాల వెలుగు మంద్రంగా తొంగిచూస్తూ ఇంటికి వెలుగునిస్తోంది.  ఈ వీధి దీపాల వెలుగు, తెరల వయ్యారం అందంగా కనిపించింది. దాన్నే చూస్తూ నిదానంగా కళ్ళు మూసుకున్నాడు.

“ఒరేయ్ పితృద్రోహీ! నాశనం చేశావు కదరా… ఎన్నిసార్లు నీతో కొట్టుకున్నాను: నన్ను మన ఊరి తోటలో పూడ్చమని. దరిద్రుడా! మాట నిలబెట్టుకోలేదు కదరా!! బూడిద చేసేశావు కదరా నన్ను. నువ్వు బాగుపడవు. చూస్తూ ఉండు. ఇంతకింత అనుభవిస్తావు. థూ… నా కొడుకువా నువ్వు? దరిద్రుడా. ఉండు. నీక్కూడా కాచుకునుంది. నీ కొడుకు అంతా చూస్తున్నాడులే.” దివాకర్ తల విదిలించాడు. కొంత సేపటి నిద్రలోనే నాన్న తనను ఆవరించుకున్నది దిగులు కలిగించింది. నాన్న మొహం ఉగ్రంగా ఉండింది. అంత కోపంగా ఉన్న మొహాన్ని ఆయన బ్రతికున్నప్పుడు చూడలేదు అనుకున్నాడు. తల వెంట్రుకలు చెదిరి కనిపించాయి. ముక్కు పుటాలు అదురుతున్నాయి. పళ్ళు పటపటమని కొరుకుతున్నాడు. కళ్ళైతే నిప్పు గోళ్ళాల్లా భగభగమంటున్నాయి. కొంచెం గాలి తగిలితే చాలు భగ్గుమనేలా అనిపించాయి. అవును. మరి అతడి దేహం మండుతోంది కదా! కాదు… తనే కదా చితికి మంట పెట్టింది? అనిపించి తల బరువనిపించసాగింది. మరొక్కసారి తలను నింపాదిగా విదిలించాడు. ఆ చూపుడు వేళ్ళ ఎముకలు తల రెండూ వైపులా బలంగా గుచ్చుతున్నట్టు అనిపించింది. మాత్రలతో తగ్గేది కాదు ఇది అనిపించింది. పూజా గది పక్కన ఉన్న టేబల్ పైన ఒక చిన్న కుండ వైపు చూశాడు. దాన్ని ఒక గుడ్డతో కట్టి ఉంచారు. అందులో నాన్న బూడిద. నిజంగా నాన్న అందులో ఉన్నాడా? అతడి ఉనికి ఏమున్నా తనలోనే కదా? ఇప్పుడైతే తనలోకి దూరిపోయి ఛాతీని దబదబ రెండూ చేతులతో కొడుతున్నట్టు అనిపించింది. నాన్న ఆత్మ తనలోకి దూరిపోయిందా అనే సందేహం కలగసాగింది. 

నాన్నను కాల్చి బూడిద చేసిన రోజు రాత్రి కూడా ఇదే విధంగా కలలో వచ్చి నోటికొచ్చినట్టు తిట్టాడు. అప్పుడే అతడికి తను తప్పు చేసినట్టు అనిపించి పాప ప్రజ్ఞ సతాయించసాగింది. ఇప్పుడు తెలవారితే మూడవ రోజు. అస్తికలు ఏరుకుని వాటిని త్రివేణి సంగమంలో కలపాలని నిర్ణయించుకున్నాడు. ఆ పని అయిపోతే చాలు మళ్ళీ తను మామూలుగా డ్యూటికి జాయినవచ్చు అనుకున్నాడు. మళ్ళీ పదకొండవ రోజు కార్యక్రమానికి సెలవు పెట్టాలి. రెండు వారాల్లో నాలుగు సెలవులు. ఇప్పుడున్న ఒత్తిడికి సెలవు దొరకడం కష్టమే. కానీ అనివార్య సందర్భం కాబట్టి ఎవరూ ఆక్షేపించలేదు. లేకుంటే ఎన్ని మాటలు వినాల్సి వచ్చేది! “ ఒరేయ్! నన్ను నాశనం చేసేశావు కదరా! పనికి రాకుండా చేశావు. బూడిద చెయ్యమని నేనేమైనా చెప్పానా? దరిద్రుడా!” మళ్ళీ మగత నిద్ర. అవే నాన్న మాటలు. తన బాధ. నిస్సహాయ స్థితి. దివాకర్ కలవరపడసాగాడు. తను ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇంత తనను బాధ పెడుతుందని అనుకోలేదు. 

అసలు అతడి నాన్న చనిపోయింది అతడి నిర్లక్ష్యం వల్లనే. అదీ కాకుండా పని ఒత్తిడి వల్ల కూడా. చనిపోవడానికి పదిహేను రోజుల ముందునుండి అతడి తండ్రి మంచం పట్టాడు. జ్వరం, దగ్గు, కొద్దిగా ఊపిరి సమస్య. ఈ ఊరికి వచ్చిన పది సంవత్సరాలకు శ్వాసకోశ క్యాన్సర్ వచ్చి ఒక ఊపిరితిత్తిని తీసేశారు. అదే కొంచెం సమస్య అయి ఉండవచ్చు అనుకుని దగ్గరలోని క్లినిక్ కు తీసుకుని వెళ్ళాడు. కొన్ని మాత్రలు, ఆయుర్వేద మాత్రలు తీసుకుంటున్నాడు నాన్న. చనిపోవడానికి రెండు మూడు రోజుల క్రితం పరిస్థితి చెయ్యిదాటసాగింది. భార్యతో “ఏం లేదులే… చలికాలం కదా. సమస్య కొంచెం ఎక్కువయ్యుంటుంది. విక్స్ రాస్తుండు.” అని చెప్పి డ్యూటికి వెళ్ళిపోయాడు.  అక్కడ ఒక్క క్షణం కూడా ఊపిరి సలపనంత పని. దాంతోపాటు ఒక చిన్న టీం నాయకత్వం వేరే. దాని బాధ్యతలు… ఇలా అన్నీ ముగించి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదయ్యేది. ఆ సమయానికి నాన్న లేచుంటే మాట్లాడడం. లేదంటే అదీ లేదు. మళ్ళీ తెల్లవారు జామున కూడా అదే సమస్య. దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ నాన్న తన వైపు చూస్తుంటే తను డ్యూటీకి వెళ్లడానికి తయారై భార్యకి “తప్పకుండా మాత్రలివ్వు” అని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఆ రోజు ఉదయం పరిస్థితి మరీ బిగడాయించింది. నాన్న ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడతూ గురకల మధ్య ఏదో అన్నది వాడికి స్పష్టంగా వినబడలేదు. కన్నుల భాషనైనా అర్థం చేసుకోవచ్చునయ్యింది. అంత తీరికకూడా ఉండలేదు. భార్య “పరిస్థితి గంభీరంగా ఉన్నట్టుంది. ఆస్పత్రిలో చేర్చరాదా?” అన్నది. దానికి అతడు “నాన్నకు ఈ నగరానికి వచ్చినప్పటినుండి ఈ సమస్య ఉంది. నువ్వు పట్టించుకోకు. మాత్రలిచ్చి విక్స్ రాస్తుండు.” అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆస్పత్రిలో చేరిస్తే డబ్బులు ఖర్చవుతాయి అనే సమస్య కూడా లేదు అతనికి. కంపెనీ వాళ్ళే కన్నవాళ్ళ ఆరోగ్య భీమా చేయించి ఉన్నందువల్ల అంతా అందులోనే సరిపోయేది. ఆ రోజు ఒక చాలా ముఖ్యమైన ప్రయోగం చేయాల్సి ఉన్నందున అతడు వెళ్ళి తీరాల్సిన అవసరం ఉండింది. దాని గురించి క్రితం రోజు జరిగిన మీటింగులోనే అతడికి చెప్పబడింది. కాబట్టి తండ్రి ఆరోగ్యం వైపు దృష్టి పెట్టకుండా వెళ్ళిపోయాడు.

మధ్యాహ్న భోజనం ముగించి మళ్ళీ పనివైపు వెళ్తుండగా భార్యవద్ద నుండి ఫోన్ వచ్చింది.‘ ఊపిరి తీసుకోవడానికి చాలా కష్ట పడుతున్నారు. నాకు భయంగా ఉంది. త్వరగా రండి’ అని. అతడు ‘ ఒక రెండు మూడు గంటలు ఎలాగో నిభాయించు. పని ముగించుకుని వచ్చేస్తాను.’ అన్నాడు. అరగంట తర్వాత మళ్ళీ ఆమె ఫోను. అలాగే ఐదారు సార్లు గాబరా పడుతూ, భయపడుతూ ఫోనులో మాట్లాడుతూ సమయం వెళ్ళదీశాడు. అరగంట ముందుగా వెళ్ళాలని బాస్ కు ఫోన్ చేశాడు. ఆయన “ ఇంత పనుంది ఇక్కడ. మీరింగా లేట్ అవర్స్ దాకా ఉండి పని చెయ్యాలి. అలాంటిది అరగంట ముందుగా వెళ్తానంటున్నారు. వేర్ ఇస్ ది రెస్పాన్సిబిలిటి?” అని కోప్పడ్డాడు. దానికతడు “నాన్నకు అస్సలు బాలేదు ఒక వారం నుండి. అడ్మిట్ చెయ్యాలి.” అన్నాక “ ఓ ఐసీ” అంటూ పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ “టేక్ కేర్ ఆఫ్ హిమ్” అని చెప్పి పంపాడు. 

అతడు ఇంటికి వచ్చేటప్పటికి నాన్నకు గురుక ఎక్కువైంది. కళ్ళు తేలవేసి సగం ప్రజ్ఞావస్థలో ఉన్నాడు. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కన్నీళ్ళు పెట్టుకుని, తన కార్లోనే తీసుకుని వెళ్ళి ఒక మంచి ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. వాళ్ళు వెంటనే ఐసియులోకి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం పదిగంటలకు తన చేంబర్లోకి పిలిపించుకున్న డాక్టర్ దివాకర్ తో “ మీ నాన్న ఇక లేరు. ఐ యామ్ సారి.” అన్నారు. రెండు నిమిషాలు మౌనంగా ఉన్న దివాకర్ బయటికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. అక్కడున్నవాళ్ళు, వైద్యులు, నర్సులు, సెక్యురిటి సిబ్బంది, పోలీసులు, ఆసనాలు, గోడలు, మెట్లు, ఎలివేటర్, సెన్సర్ అలవరచిన తలుపులు, అన్నీ దొరికే క్యాంటీను… ఇలా దేని గురించి ఆలోచించకుండా ఏడ్చాడు. అంతా చీకటి అనిపించింది. అతడి పంచేంద్రియాలు పని చెయ్యడం మానేశాయి. చాలా సేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు. తరువాత ఒక మూలకు ముడుచుకుని కూర్చుని, ఆప్తులకందరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు. తన నిర్లక్షం వల్లనే ఆయన చనిపోయారని కూడా అందరికీ చెప్పాడు. వాళ్ళందరూ తమకు తోచిన విధంగా ఇతడిని ఓదార్చారు. అంతా అయిపోయింది. ఒకరిద్దరు ఆప్తులు వచ్చి ముందు జరగాల్సిన కార్యక్రమాలు గుర్తు చేశారు. ఊరునుండి ఫోన్ చేసిన బాబాయ్ 

“వాడు కోరినట్టు మన తోటలో చింతచెట్టుంది కదా. దాని అడుగులోనే పూడ్చుదాం. వాడి ఆత్మ నెమ్మదిస్తుంది. నేను గుంత తవ్వడానికి రెడీ చేస్తాను. తొందరగా శవాన్ని తీసుకుని రండి.” అన్నాడు. ఇక్కడ్నుండి తీసుకుని వెళ్ళి అక్కడ పూడ్చిపెడితే, మళ్ళీ మూడవ రోజు కార్యక్రమం, పదకొండవ రోజు కార్యక్రమం, సాంవత్సరీకం ఇలా అన్నింటినీ అక్కడే చేయాల్సి వస్తుంది. సమయం, ఖర్చు, ఆఫీసులో సెలవుల కోసం పోట్లాటలు, బాధ్యతల గొడవలు ఇలా అన్నింటిని నిభాయించాలంటే కష్టం. అందుకే ఎక్కడైనా దహనం చేసేస్తే అయిపోయింది అనే నిర్ణయించుకున్నాడు. విషయాన్ని భార్య, ఆప్త స్నేహితుల వద్ద ప్రస్తావించాడు. స్నేహితులైతే మంచి నిర్ణయం, సమయానికి తగిన మార్పు అని సహాయానికి సిద్ధపడ్డారు. భార్య మాత్రం ‘ ఆయన తనను తోటలోనే పూడ్చిపెట్టమన్నారు’ అని రెండు మూడు మార్లు హెచ్చరించింది. “నాన్న ఉండాల్సింది మట్టిలో కాదు, మన హృదయాల్లో. అర్థం చేసుకో” అని గద్దించి, ఆమెను ఊరుకునేలా చేశాడు. అతడి బాబాయ్ కూడా “ ఏమిటోనయ్యా… మీ సిటీ వాళ్ళ ఆలోచనలు. అంతా కొత్తగా అనుకుంటారు. నాకైతే ఇష్టం లేదు. ఊళ్ళోని తోట అంటే వాడికి ఎంతో ఇష్టం. అది కూడా చెయ్యడం లేదంటే నువ్వెలాంటి కొడుకువయ్యా.. నీ గడప నేనిక తొక్కను. నా గడప నువ్వు తొక్కకు.” అని ఖచ్చితంగ చెప్పేశాడు. ఎవరొచ్చినా, రాకపోయినా వచ్చినవాళ్ళే చాలు అని తీర్మానించుకున్నాడు దివాకర్. దగ్గరలోని విద్యుత్ చితాగారానికి తీసుకుని వెళ్ళాడు. కాల్చడానికి ముందు అతడి మనసు కొంత గజిబిజిగా అనిపించింది. నాన్న మొదటే తన నిర్లక్షంవల్ల చనిపోయాడు, ఇప్పుడు అతడి చివరి ఆశనైనా నెరవేర్చక పోతే ఎలా? ఆయన తన కోరికను నేరుగా చెప్పక పోయినా పరోక్షంగా లేదా ఇతరుల ద్వారా తనకు తెలియబరచాడు కదా! తరువాత ఏదైనా అనుకోనిది జరిగితే?అనుకుని కొంచెం భయపడ్డాడు. తరువాత, మట్టిలోనే ఎందుకు కప్పెట్టాలి? ఆ మట్టిలో ఎరువుగా మారి ఏదైనా సాధిద్దామనా? తను ఈ మట్టినే నమ్ముకునుంటే తన బ్యాంక్ బ్యాలన్స్ ఇంత పెరగడానికి వీలయ్యేదా? అంతా మూఢ నమ్మకాలు. బూడిదై పవిత్ర తీర్థాలలో కలసిపోతే ఇంకా మంచిదే కదా! ‘తొందరగా ముక్తి లభిస్తుంది’ అని చాలా మంది తనతో చెప్పలేదా అనుకుంటూ తనను తాను సమాధాన పరచుకున్నాడు. 

గోడ పైనున్న గడియారం వైపు దృష్టి సారించాడు. మూడు గంటలైంది. ఎక్కడో దూరంగా ఆంబులెన్స్ శబ్దం తప్ప నగరం ప్రశాంతంగా ఉండింది. కాలనీలోని కుక్కలు కూడా మొరగడం ఆపేశాయి. నగరంలోని ఆ మౌనంలో తండ్రి కళ్ళు వీడకుండా అతడిని సతాయించసాగాయి. అలాగే అతడి గురక కూడా. నాన్న చనిపోవడానికి ఒక మూడు రోజుల క్రితం, తను పనికి వెళ్ళడానికి తయారై ఉన్నప్పుడు తన గురక గొంతుతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అతడి అస్పష్టమైన ధ్వని… అసలు అర్థమయ్యేది కాదు. అలాగే అతడి కళ్ళు కూడా ఏమో చెప్పాలని తపించేవి. తను కొంచెం సేపు ఆయన పక్కలో కూర్చుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుంటే ఆ భాష అర్థమయ్యేదేమో. నిజం. నాన్న తను చనిపోతే ఎక్కడ పాతి పెట్టాలి అనే విషయం గురించి కొద్ది మందితో చెప్పుకున్నాడు.  కొడుకు ఒక సారి “తాతా… తాతా.. మనిషి చనిపోతే ఏమవుతాడు? దేవుడి దగ్గరికి వెళ్తాడా?” అని అడిగినదానికి ఆయన “లేదు బాబూ! మనం చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళము. మనం మొక్కలవుతాము. చెట్లవుతాము. పురుగులమవుతాము. గడ్డి పరకలమవుతాము. మొత్తానికి మళ్ళీ బ్రతుకుతాము.” అని చెప్పి తన వైపుకు తిరిగి తనకు వినిపించేలా  “నేను చచ్చిపోతే మీ నాన్న నన్ను ఊరవతల మామిడి తోటలో పూడ్చిపెడ్తాడు. అక్కడికి నువ్వు వచ్చినప్పుడంతా నీతో నేను మాట్లాడతాను. పళ్ళు ఇస్తాను.” అన్నాడు. నాన్న తనతో ఎప్పుడు అలాగే కదా మాట్లాడుతూ ఉండింది! అమ్మ ఉన్నప్పుడు అంతే. ఆమెను నేరుగా ఏదీ అడిగేవాడు కాదు. కానీ మొదటి సారిగా నాన్న తన ఆయాసపడుతున్న గొంతుతో, నిస్తేజంగా ఉన్న కళ్ళతో తనతో మాట్లాడాలని ప్రయత్నించాడు కదా! అతడి కోరిక ప్రకారం అతడిని పూడ్చిపెట్టుంటే తను ఏమైనా పోగొట్టుకునేవాడా? ఎలాగో నిభాయించగలిగే వాడు తను. ఇలా ఆలోచిస్తున్నప్పుడు.. ’తాతా…’ అనే గొంతు వినిపించింది. ఆ నీరవతలో ఆ శబ్దం అలలుగా తేలి వచ్చి అతడిని ఉలిక్కిపడేలా చేసింది. లేచి రూమ్ వాకిలి వద్దకు వెళ్ళాడు. బాబు నిద్రలో కిల కిల నవ్వుతున్నాడు. “చక్కిలిగిలి పెట్టకు తాతా” అంటూ అటూ ఇటూ దొర్లుతున్నాడు. దివాకర్ కు తను తప్పు చేశాననే పాపప్రజ్ఞ మరింత గాఢంగా సతాయించసాగింది. 

తిరిగి హాల్లోకి వచ్చి సోఫాపైన కూర్చున్నాడు. హాల్లోని ఒక మూలలో ఉన్న అక్వేరియంలో చేపలు నిదానంగా చలిస్తున్నాయి. రంగు రంగుల విధవిధమైన చేపలు. ఆకర్షణీయమైన దేహ విన్యాసాల చేపలు. వాటి వైపే చూడసాగాడు. అవి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అనుకున్నాడు. బుద్దుడిలాంటి ప్రశాంతత అంటే ఇదే అనుకున్నాడు. ఆక్వేరియం అడుగున ఏదో నిశ్చలంగా పడి ఉన్నట్టు అనిపించింది. లేచి దాని వద్దకు వెళ్ళి వంగి చూశాడు. ఒక చేప చచ్చి పడి ఉంది. మిగిలిన చేపలు తమకదేమీ పట్టనట్టు ఈదుతున్నాయి. ఉదయం బాబు చూస్తే ఏడుస్తాడు అనుకుంటూ దాన్ని తీసి కిటికీ తెరిచి పక్క సైటులో పడేటట్టు విసిరేశాడు. అలా విసిరేసేటప్పుడు, ఒక ఇరవై రోజుల క్రితం ఇలాగే చచ్చిపోయిన ఒక చేపను బాబు కళ్ళలో నీళ్ళు నింపుకుంటూ తీసి, తన అరచేతిలో జాగ్రత్తగా పట్టుకుని, ఇంటి ముందున్న చెట్టు మొదట్లో చిన్న గుంత తీసి అందులో వేసి మళ్ళీ మట్టి కప్పింది గుర్తుకు వచ్చింది. తను అలా పక్కవాళ్ళ సైటులో విసిరెయ్యకుండా వాడు చేసినట్టు చేసుండాలేమో అనిపించి మనసు బరువయింది. అలా చెయ్యాలని వాడికి ఎవరు నేర్పించారు అనే విషయం కూడా అతడిని సతాయించింది. మళ్ళీ నాన్న మొహం! ఒకదాంట్లో ఒకటి దూరుకుని అతడిని కంగారు పెట్టసాగాయి. అలా ఇబ్బందిని అనుభవిస్తూనే వెనిక్కి వచ్చి సోఫాలో కూర్చుని టేబల్ పైనున్న కుండ వైపే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు. అలాగే నెమ్మదిగా కళ్ళు మూసుకుని తరువాత ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు. 

తెల్లవారేసరికి అతడు ఒక అచలమైన నిర్ణయానికి వచ్చేశాడు. సూర్యోదయానికి ముందే తన కొడుకును లేపి, స్నానం చేయించి, తను చేసి కారులో బయలుదేరాడు. తన పక్క సీట్లో కూర్చున్న తన కొడుకు చేతిలో నాన్న అస్తికలున్న కుండను పెట్టాడు. వాడు దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తన ఛాతీకి హత్తుకున్నాడు. దివాకర్ ఏం మాట్లాడకుండా కారును తన ఊరివైపు నడపసాగాడు. ఊళ్ళోకి వెళ్ళకుండా నేరుగా తోట వైపు వెళ్ళాడు. తోట ఎందుకో సన్నబడినట్టు అనిపించింది. ఏదో తెగులు వచ్చినట్టు నీరసంగా కనిపించింది. అక్కడే తన తండ్రి చెప్పిన జాగా దగ్గర కారు ఆపి దిగాడు. తన బాబాయ్ తోటలో మామిడి చెట్టు కింద ఉన్న గునపం, పార తీసుకున్నాడు. కొడుకు “పప్పా! అవెందుకు?” అని అడిగాడు. దానికతడు “నువ్వు ఊరికే చూస్తుండు.” అంటూ తను అనుకున్న జాగాకు వచ్చి తవ్వసాగాడు. నేల గట్టిగా ఉండింది. ముందు గునపంతో తవ్వి తరువాత మట్టిని పారతో ఎత్తి అటూ ఇటూ వేయసాగాడు. రమారమి ఆరడుగుల పొడుగు, మూడడగులు వెడల్పుతో ఒక గుంత తవ్వాడు. ఎర్రటి మట్టి గుట్టలు గుట్టలుగా పడసాగింది. ఇంత చిన్న జాగాలో ఇంత మట్టి ఉంటుందా అని ఆశ్చర్యపడ్డాడు. ముక్కుకు ఆ మట్టి పరిమళం సోకసాగింది. ఆహ్లాదకరంగా అనిపించింది. వానపాము, తేళ్ళు, చీమలు, చెదలు… ఇలా ఏవేవో లోకాలు తెరుచుకోసాగాయి. నుదుటినుండి జారుతున్న చెమట బిందువులు ముక్కు కొసకు జారి ఆ గుంతలో పడసాగాయి. అలాగే ఒళ్ళంతా చెమటతో స్నానం చేసినట్టు తడిసిపోయింది. మన దేహంలో ఇంత నీరుంటుందా అని ఆశ్చర్యపోయాడు. 

గుంత లోతుకు వెళుతున్నట్టల్లా కనిపిస్తున్న వేర్ల సముహం, గునపపు దెబ్బలకు సంభ్రమిస్తూ, అపరిమితానందానికై ఎదురు చూడసాగాయి. అక్కడి కాలుదారిలో వెళుతున్న నెరసిన వెంట్రుకలతో ఉన్న తన తండ్రి వయసాయన “దివాకరప్పా! పొద్దున్నే వచ్చి గునపం తీసుకుని తవ్వుతున్నావు.. ఏం పెట్టుకోవడానికి?” అని అడిగాడు. దివాకర్ “ఏంలేదన్నా! అదే నాన్నను పూడ్చిపెట్టడానికి.” అని జవాబిచ్చాడు. దానికతడు “ అయ్య.. మీ నాన్న పోయి మూడు రోజులైందంట. ఏమిటి ఐస్ ప్యాక్లో తెచ్చావా? మట్టిలో కలసిపోవడం అన్నదుందే. అదో పెద్ద గౌరవం.” అంటూ చెట్ల గుబురులో చెట్టై కనుమరుగయ్యాడు. దివాకర్ కొంచెం సేపు అతడు వెళ్ళిపోయిన దిక్కు వైపే చూస్తూ నిలుచున్నాడు. దట్టమైన పచ్చని తెరలో దూరి మాయమైనట్టు అనిపించింది. మరి అతడు ఒక సంవత్సరం క్రింద చనిపోయిన దగ్గరి బంధువు హనుమప్ప కాదా? మరి ఇప్పుడు కనిపించడం ఎలా సాధ్యం? అతడు మరణించలేదా? అతడు చనిపోయాడు అనేది తన భ్రమా?.. లేక ఇప్పుడు కనిపించింది భ్రమా అనే గందర గోళంలో పడ్డాడు. తరువాత మళ్ళీ గుంతను తవ్వడం మొదలుపెట్టాడు. నెత్తికెక్కుతున్న సూర్యుడి వైపు చూశాడు.తన చెమట వాసనకు సంబరపడి పైకెక్కినట్టు అనిపించింది. ఇలా సూర్యుణ్ణి చూసి ఎన్నాళ్ళయింది అనుకున్నాడు. సూర్యుడి ఎత్తును బేరీజు వేసి సమయం పది గంటలయ్యుండవచ్చు అనుకున్నాడు. మళ్ళీ తవ్వసాగాడు. ఇప్పుడేమో నల్లమట్టి రాసాగింది. గుంతకు రెండు వైపులా ఎర్ర మట్టి, నల్ల మట్టిల మిశ్రణం, మిలనపు మెరుగును సంతరించుకుని సంబరపడుతోంది. గుంత సుమారు ఐదారు అడుగుల లోతు అనిపించి తవ్వడం ఆపాడు. అంత తవ్వినా తనకు అలసట కలగక పోవడం అతనికి ఆశ్చర్యం వేసింది. ఒంటికి పట్టిన చెమట మెరుస్తోంది. 

కొడుకును దగ్గరికి పిలిచి వాడి వద్ద ఉన్న కుండను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తరువాత గుంతలోకి దిగి దాని మధ్యలో కుండను పెట్టి, మళ్ళీ పైకి వచ్చి మట్టిని వేయసాగాడు.తన కొడుకును కూడా మట్టి వేయమని చెప్పాడు. ఇద్దరూ నింపుతూ ఉండగా కొంత సేపటికి అక్కడ దివాకర్ తండ్రి అస్తికలున్న  సమాధి తయారైంది. ఒక రెండడుగులు వెనిక్కి వెళ్ళి ధ్యానముద్రలో నిల్చున్నాడు. అతడి వెనుక కొడుకు. కొంచెం సేపటికి తన కాళ్ళ కింద మట్టి జరుగుతున్నట్టు అనిపించింది. భయపడి మరో రెండడుగులు వెనిక్కి జరిగాడు. ఆ సమాధి ఇరు వైపుల ఉన్న మామిడి చెట్ల, చింతచెట్ల వేర్లు బయటికి వచ్చి ఒకదాన్నొకటి పెనవేసుకున్నాయి. ఇప్పుడు వాటి వేర్లు ఊర్ధ్వముఖంగా ఉన్నాయి. దివాకర్ వైపు చూస్తూ గట్టిగా నవ్వసాగాయి. పచ్చని కొమ్మలు, రెమ్మలు మట్టిలో కూరుకుపోయాయి. అతడికి ఆ దృశ్యం చూసి వాంతికొచ్చినట్టయింది. ఆ వేర్లు కొద్ది క్షణాలలో సూర్యుడి కాంతికి ఎండిపోయి, పదునుగా ఉన్న ఈటెల్లా కనిపించి, అన్ని దిక్కులకూ పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించసాగింది. అతడు తన కొడుకు వైపు తిరిగి చూశాడు. వాడు తన వీపునే చూస్తున్నాడు. మళ్ళీ అతడు తన తండ్రి సమాధి వైపు చూస్తుండగా రెండు పదునైన వేర్లు ఎగిరి వచ్చి కనుగుడ్లను పొడిచాయి. అతడు బాధతో ’అబ్బా…’ అని అరిచి కళ్ళను నులుముకో సాగాడు. ఒక సారి తలను విదిలించాడు. 

సోఫానుండి లేచి రూము తలుపు దగ్గర నిలుచున్నాడు. కొడుకు, భార్య గాఢ నిద్రలో ఉన్నారు. తెలవారితే మూడవ రోజు కార్యక్రమం. నాన్న తనను ఆవరించుకునే క్రమాన్ని చూసి గాబరాపడ్డాడు. ఆయన తనను వదలిపెట్టడేమో అనిపించింది. బయట కుక్కలు మొరుగుతున్న లయ తన ఇంటి ఆవరణను కమ్ముకుంది. మళ్ళీ సోఫాలో కూర్చుని కుండవైపే చూడసాగాడు. మళ్ళీ అవే కునికిపాట్లు.   

చందకచర్ల రమేశబాబు

నివృత్త బ్యాంకు అధికారి. హైదరాబాద్ శివార్లలో ఉంటున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. మాతృభాష కన్నడం.

ఆయన భాషల అభిమాని. బళ్ళారిలో పుట్టినందువల్ల ఆయనకు కన్నడం, తెలుగు రెండూ భాషల పరిచయం కలిగింది. రెండు భాషల్లోనూ సాహిత్య రచనలు చేశారు. ఆయన అనువదించిన కథలు అటు తెలుగు పత్రికలలోనూ, కన్నడ పత్రికలలోను ముద్రణకు నోచుకున్నాయి.

ఆయన కన్నడంలో “మనదర్పణ, అనిసిద్దెల్ల అక్షరదల్లి” అనే  రెండు కవితా సంకలనాలను తీసుకువచ్చారు. తెలుగు నుండి “తూర్పుగాలి, మంచుపువ్వు, తపన” నవలలను  కన్నడంలోకి అనువదించారు.  దేవరకొండ బాలగంగాధర తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, మామిడి హరికృష్ణ “ఒంటరీకరణ” కవితలను కన్నడంలోకి అనువదించి పుస్తకాలుగా తీసుకొచ్చారు.  ఆయన కన్నడం నుండి అనువదించిన కస్తూర్ బా గారి ఆత్మచరిత్ర “నేను కస్తూర్ బా ని”, అనువాద కథా సంకలనాలు “అత్తర్” “నలుగురికి చేరిన కథలు” “గుడిగంట” “మండే మంటకు ఒళ్ళంతా నోరు”, నవల “వేర్లు” వెలువడ్డాయి.

“గీతలోని మార్గదర్శకాలు” అనే శీర్షికన “కర్తవ్య బోధన, స్థితప్రజ్ఞత, త్రిగుణాలు, నిత్య జీవన గీత ” అనే నాలుగు పుస్తకాలను స్వంతంగా రాశారు. వాటిలో “స్థితపజ్ఞత. త్రిగుణాలు” గుంటూరు నుండి వెలువడుతున్న ఆధ్యాత్మిక పత్రిక “విశ్వధర్మ వాణి” పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ”ఉపనిషత్తుల సారం” అనే పుస్తకాన్ని కన్నడం నుండి అనువదించారు. అనువాద కృషికి గాను 2019 లో గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం  పొందారు. స్థానిక ఓం భం ట్రస్ట్ వారు ఆయన అనువాద కృషిని గుర్తిస్తూ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

Previous Post

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

Next Post

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

Next Post
రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply