• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ మూలం: డా. హేమా పట్టణశెట్టి
అనువాదం: రంగనాథ రామచంద్రరావు

కొండ ఎక్కేటప్పుడు ఆయాసం కలిగింది. ఎండ తీవ్రత ఆయాసాన్ని మరింత పెంచింది. మిగిలిన వాళ్ళంతా చాలా ముందుకు వెళ్ళిపోయారు. అతను మాత్రం నాతోపాటు అడుగులు వేస్తున్నాడు. ఆ కాణుగ కాయల చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, చల్లదనం హాయిగా అనిపించి అక్కడే కూర్చున్నాను. అతనూ కూర్చున్నాడు.

అప్పటికే అతను తన స్నేహితుడు చేసిన వందలాది చేయరాని పనులను వర్ణించాడు. బహుశా తాను ఆ స్నేహితుడికన్నా గొప్పవాడని నేను అనుకోవాలని అవన్నీ చెప్పాడో ఏమో! మగవాళ్ళల్లో ఉండే ఇలాంటి ఆడంబరాలకు ఇతను కూడా  మినహాయింపు కాదేమో! ఇదంతా నాకు కొత్త కాదు అనుకొని మౌనంగా వింటున్నాను. 

“పదండి, వాళ్ళంతా ఇప్పటికే పూర్తిగా కొండ పైకి వెళ్ళివుండొచ్చు. ఇప్పటివరకూ మనం కూర్చున్నామని ఏమైనా అనుకోవచ్చు” అని అతనే చెప్పినప్పుడు- 

“ఏమైనా అనుకోనీ. లేదా ఆ ఏమైనా జరిగినా జరగనీ” అనే ఆలోచనను సమర్థవంతంగా సంరక్షించే శక్తి అతని కళ్ళకు ఉన్నాయని అనిపించి సూటిగా అతన్నే చూశాను. అతను చూపులు మరల్చాడు. 

“ఇతను ఇలాంటివన్నీ లేనిపోనివి ఎందుకు ఆలోచించాలి. ఏమైనా కానీ అనటానికి, ఇతనితో నాకేం సంబంధం ఉంది?” అని అనుకున్నాను. 

“నిజం, ఏమీ సంబంధం లేకపోతే ఇలాంటి వాతావరణంలో, ఇతనితో ఒక్కదాన్నే ఇలా కూర్చోవడానికి ఎందుకు అవకాశం ఇస్తున్నాను…” 

అతను లేవలేదు, నేను కూర్చునే ఉన్నాను. తన కాలేజీ మొదటి రోజుల అల్లర్లంతా చెప్పినప్పుడు, అతను ప్రేమని చెప్పడం- నాకు ఆశ్చర్యం అనిపించింది. మొదటి నుంచీ అనేక టీనేజ్ లవ్ గురించి విని తెలివిమాలినతనం అని నవ్విన నాకు ఇప్పుడు మాత్రం అలా నవ్వాలనిపించలేదు. అతను ఆ అమ్మాయిని పలకరించడమే అరుదట. చివరివరకూ తన ఏ భావననూ ఆమె ముందు చెప్పలేక వందలాది కవితలను రాసి ఇతను మౌనంగా ఉండిపోవటం పిరికితనమేమో అనిపించింది. 

ఇంతైన తర్వాత వేరే అబ్బాయిల గురించి ఏదైనా అనిపించడం పోనీ, ఆలోచించడం కూడా పాపం అనుకోవడం విన్నప్పుడు అతని ఆ ప్రేమ, ఆ అమాయకత- నేను ఎన్నడూ అనుభవించనిది,  ఇష్టంగా అనిపించింది. 

ఆ తర్వాత కొన్ని రోజులలో ప్రేమకు పెళ్లికి ఏమిటి సంబంధం లేదని తెలిసినప్పుడు పెళ్లి చేసుకున్నాడట. 

‘లవ్ నీడ్ నాట్ ఎండ్ ఇన్ మ్యారేజ్, బికాజ్ ఇట్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ అట్రాక్షన్…’  అని నేను ఆ సాజిద్‌కు చెప్పటం గుర్తొచ్చి నాలో నేను నవ్వుకున్నాను. 

“ఎందుకు నవ్వుతున్నారు?” 

ఓహ్! నా మనస్సు నవ్వు పెదవుల మీద తేలటం అతని ప్రశ్న వల్లనే నాకు అర్థమైంది. 

“లేదే, నేనెక్కడ నవ్వాను?” అని ముక్తసరిగా నవ్వినప్పుడు అతనూ నా నవ్వులో చేరిపోయాడు. మళ్లీ మౌనం. 

“ప్రేమించడం వేరు, పెళ్లి చేసుకోవటమే వేరు” 

– అతని మాటలు నాకు కరెక్టే అనిపించినా అతను చెప్పిన తన రెండు మూడు- ప్రేమకథల అర్థాలు నాకు స్పష్టం కాలేదు.  

‘ఒక్కరిలోనే ప్రేమకు సంబంధించిన అన్ని రూపాలను చూడటం సాధ్యం కానప్పుడు, రెండు మూడు ప్రేమలు వాస్తవంగా మారుతాయి.’ అనే అతని మాట ‘నిజం’ అనిపించనప్పటికీ ‘ఉండొచ్చు’ అనుకున్నాను. అతను తనను సమర్థించుకోవడానికి చెప్పిన ఈ మాట, ఒక విధంగా డిఫెన్స్ మెకానిజంలా స్వాస్థం, సమతౌల్యపు దృష్టి వల్ల సహజం, సమర్థనీయమని గ్రహించాను. 

అతను కోరుకునే సంపూర్ణ ప్రేమ కూడా నాలోనే అతనికి దొరికితే… అనిపించినప్పుడు మొట్టమొదటిసారి ఒళ్లంతా అదోలాంటి పులకరింత! 

వెనక్కు జరిగి చెట్టు కాండానికి ఆనుకుని కూర్చున్నాను. 

“ఇంకా కొద్దిసేపు కూర్చుందామా?” 

“ఇక బయలుదేరుదామా…” 

వ్యానిటి బ్యాగ్ నుంచి పాపిన్స్ బయటికి తీసి, రేపర్ విప్పి, అరచేతిలో పెట్టుకుని చేతిని అతని ముందుకు చాపాను. 

“అవన్నీ నాకేనా?” అంటూ రెండు మెజాంటా రంగులవాటినే ఎన్నుకున్నాడు. ఒకదాన్ని తన నోట్లో వేసుకుంటూ లేచి నిలుచుని, ఇంకొక దాన్ని నా వైపు చాపాడు. 

నాకు సంతోషం అనిపించి నా రెండు చేతులు ఉపయోగించి అతని అరచేయి పట్టుకొని లేచి,  కుడి చేత్తో ఆ పాపిన్స్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాను. 

నెమ్మదిగా నడిచాం. తాను చదివిన ఒక మరాఠీ కథను చెప్పసాగాడు. వినాలని నా ఆసక్తి, చెబుతున్న అతని ఆసక్తిని రెట్టింపు చేసింది. మధ్యమధ్యన కథ నా చుట్టే తిరుగుతోందని అనిపించినప్పుడు అతని కళ్ళల్లో వెతుకుతున్నాను. 

మేము పూర్తిగా కొండెక్కినప్పుడు మిగిలిన వాళ్ళంతా కిందికి దిగే సన్నాహంలో ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన చూపులు, గుసగుసల  సద్దులు, సూటిగా ఉన్న చేష్టలు మమ్మల్ని ఆహ్వానించాయి. 

చుట్టూ చూశాను. అతను నాకు దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. మాటల అవసరం లేదు.

దూరంలో కనిపించే ఇల్లు అగ్గిపెట్టెలకన్నా చిన్నవి… పొలాలన్నీ గుంటక చెక్కిన ఇండ్ల మాదిరి… 

ప్రవహిస్తున్న వాగు కనిపించగానే దాని చూపించి, “అక్కడికి వెళ్లి కూర్చుందామా?” అన్నాను. 

“ఊఁ…” అని నవ్వుతూ అతను పక్కనున్న బండరాయి మీద కూర్చున్నాడు. నేను కూడా వెళ్లి అతని పక్కనే కూర్చున్నాను. అతని వైపు తిరిగినప్పుడు అతను స్తబ్దంగా నన్నే చూస్తుండటం గమనించి ఒక విధంగా అనిపించింది. తన మొత్తం ఒంటిని కళ్లుగా చేసుకొని, నా ఉబ్బులు-తగ్గులను అన్నింటినీ కొలిచే సాజిద్, విశ్వ, శరత్, ఇంకా ఎవరెవరో… లేదు, వాళ్ళు కళ్ళలో కనిపించే గుచ్చుకునే చూపు   ఇతని కళ్ళల్లో లేదు. ఇది ఒక విధమైన ఆరాధన. 

దృష్టి మరల్చడానికి, “ఊఁ… కథ సగమే అయింది కదా…?” అన్నాను. 

“ఆఁ… అవును కదా…” అంటూ నా వైపు ముఖం తిప్పి కూర్చున్నాడు. 

“కొందరు విమర్శకులు ఆ కథానాయికలాంటి స్త్రీ ఉండటమే అసాధ్యమని రాశారు. అయితే మిమ్మల్ని చూస్తుంటే అది సాధ్యం అనిపిస్తుంది…” అతను నిజాయితీగా చెబుతున్న తీరు, ఆలోచనలను తలుచుకొని నాకు కలిగిన సంతోషం… 

సూటిగా నడిచే, నడిచినందుకు చింతించకుండా, వ్యథ చెందకుండా ఆ కథానాయిక తన నిజాయితీతో కూడిన తన సహజమైన ఆలోచనలను కృతిగా మలచగలిగే సామర్థ్యం కలిగివుంది. ఆమె నిర్భయత్వం, నిస్సంకోచ ప్రవృత్తిని అతను విశ్లేషించడం విని మూగబోయాను. 

నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే బాధ ఇన్ని రోజుల నుంచి నన్ను వేధిస్తున్నది ఇప్పుడు ఇతని సమీపంలో  నెమ్మదిగా కరగసాగింది. 

జీవితంలో ఉన్నదాన్ని, లభించినదాన్ని పూర్తిగా పీల్చుకోవాలన్న కోరిక నాలో నిండిపోయింది. లేనిదాని కోసం, పోగొట్టుకున్న దానికోసం వెంటపడటం అర్ధహీనమని అర్థమైంది. అయితే ఇప్పుడు ఇదంతా లేనిది కాదు, పోగొట్టుకునేటటువంటిది కాదు అని  ఒక్కసారిగా అనిపించసాగింది.

నేను… అతను… ఎవరి దగ్గరికి ఎవరు జరుగుతున్నాం?  అతని కథ ముందుకు సాగింది, ముగియలేదు. 

రోగిష్టి భార్య, ఆమె విచిత్ర స్వభావం, ప్రవర్తన… తాను కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండటం, మాటల్లేని ఇల్లు… వీటన్నీటినీ భరించి అప్పుడప్పుడు కథ-కవితలను రాసి ఓదార్చుకోవటం విని నా కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. 

అతని తలను నా గుండెలో దాచుకోవాలనే కోరిక నాలో చిగురిస్తుండగా దగ్గరికి జరిగి అతనే నా కన్నీళ్లు తుడిచాడు. హఠాత్తుగా వంగి నా నుదుటి మీది గీతను చుంబించాడు. నివ్వెరపోయాను. 

నా సంకోచానికి అవకాశం ఇవ్వకుండా చేయి పట్టుకొని లేపి తన కుడిచేత్తో నా నడుము పట్టుకొని నడవసాగాడు. చాలా కాలంగా   మా మధ్య స్నేహం ఉన్నప్పటికీ మేము ఎన్నడూ ఇంత దగ్గరికి రాలేదు. అలాగని ఇప్పుడు సంకోచం అనిపించలేదు. మౌనంగా నిలుచున్నాను. 

“ఎందుకు, ఇంకా అలసటగా అనిపిస్తోందా?” అంటూ నా తలను తన ఎదకు ఆనించుకున్నాడు. నేను కళ్ళు మూసుకున్నాను. మెల్లగా నా జుట్టులో వేళ్ళు కదిలించాడు. 

“ఇంకొద్దిసేపు కూర్చుందామా?” మళ్లీ అతనే అన్నాడు. నేను తల ఊపాను. అప్పటికే కొండ నుంచి సగభాగం దిగాం. నాకు తెలియకుండానే నా ఎడమ చేయి అతని వీపును చుట్టుకుని ఉంది. మనసు  మనశ్శరీరాలు రెండింటికీ ఆధారమైన తృప్తి నన్ను నెమ్మదిగా ముందుకు తీసుకుని వెళుతోంది. 

మా మాటలు అతని రచన వైపు తిరిగాయి. ఆ విషయంలో అతనికి సంతృప్తి ఉన్నట్టు కనిపించలేదు. అతని కథలు – కవితల్లో నాకు చెందినవి, చెందని వాటి గురించి చెప్పాను. అంగీకరిస్తూ, ఇంకా ఎక్కువగా అందంగా ఏమైనా రాయాలి అనేలా గొణిగాడు. 

“మీ స్టడీస్ చాలా హెవీగా అయివుండాలి కదా?” 

“ఊఁ… సర్జరీలో మాస్టర్ డిగ్రీ అంటే సామాన్యమా, అందులోనూ మా బాస్ చాలా స్ట్రిక్ట్” 

తన ఉద్యోగం, బాస్, ఎం.ఎస్. కోర్స్, మొదలైనవాటి గురించి చెప్పసాగాడు. 

“ఇంత ఉన్నప్పటికీ మీరు చాలానే రాశారు కదా. అదేమైనా చిన్న విషయమా?” అని అతను నిట్టూర్పు వదిలాడు. 

“నిజంగా నా రైటింగ్‌కు ఒక ఆసరా ఉంటే నేను ఎంతైనా రాసి ఉండొచ్చు… అయితే…” క్షణం ఆగి తానే కొనసాగించాడు. 

“నాకు ఇప్పుడు అనిపిస్తోంది. సుమీ… నువ్వు… ” అంటూ తడబడి, మళ్లీ ఒక్కసారిగా- 

“నువ్వు నాకు ఆసరా కావాలి, అవును నాకు నీ ఆసరా కావాలి” అని భావపారవశ్యంతో చెప్పి చప్పున ఆగి నన్నే సూటిగా చూడసాగాడు. 

నా కళ్ళల్లో అతన్ని పూర్తిగా నింపుకుంటున్నట్టు చూసి తృప్తిగా కళ్ళు మూసుకున్నాను. అతను నాలో పూర్తిగా నిండిపోయాడు.  కళ్ళు తెరిచినప్పుడు అతని కళ్ళనిండా మాటలు. పెదవుల నిండా నవ్వులు. 

కర్చీఫ్ తో పెదవులు తుడుచుకున్నాను. మెరుస్తున్న అతని కళ్ళు ఒక్కసారిగా మసకబారాయి. 

“అలా తుడుచుకోకూడదు కదా?” మెల్లగా అన్నాడు. అవుననిపించింది. నా పెదవులు తప్పు దిద్దుకున్నాయి. 

మేము కిందకి దిగి వచ్చి మిగతా వాళ్ళను కలుసుకున్నప్పుడు దూరంలో దిగంతంలోని మునుగుతున్న సూర్యుడి సౌందర్యం నా కంటి గర్భంలో శిశువై నవ్వుతోంది. 

‘శనివారం మనం పణజికి వెళ్దాం, మీ కారులో, ఊఁ అనండి’- 

ఈ ఒక్క వాక్యం అతనికి చేర్చడానికి రెండు రోజులు ఎదురు చూశాను. 

ఆరోజు అతని డ్యూటీ ఓపిడిలో ఉంది. నేనే వెళ్లి చీటీ అతని ముందు పెట్టాను. చదివి ఒక్కసారిగా కంగారు పడ్డట్టు ‘ఇదంతా ఏమిటి’ అనేలా కళ్ళు చిట్లించి చూశాడు. 

“అన్ని సాధ్యమే’నని  నా కళ్ళే తెలియజెప్పాయి. 

‘ఊఁ… ఆరోజు పదకొండుకు బస్టాండ్‌లో ఎదురు చూస్తుండు’-అని రాసి నా ముందు జరిపిన ప్రిస్క్రిప్షన్ కాగితంలో ఆ ఒక్క వాక్యముంది. 

పణజి చేరినప్పుడు ఐదు గంటలైంది. 

“ఒక టూరిస్ట్ రూములో మా సూట్ కేస్ పారేసి, ముఖం కడుక్కొని, బట్టలు మార్చుకొని, బీచ్ వైపు వెళ్ళాం. 

మాండవీ నది ఒడ్డు వెంబడి నేరుగా ఒళ్ళు చాపుకుని పడివున్న పణజి ఏకైక ముఖ్య మార్గం అవతల చివరనే ‘మీరామార్’ బీచ్. 

ఐస్ క్రీమ్ తింటూ, “సుమీ, నీవల్ల నేను పదేళ్ళు చిన్నవాణ్ణయ్యాను” అనేటప్పుడు అతని కళ్ళల్లో ఏర్పడిన ‘నేను’ స్పష్టంగా ఉన్నాను. 

ఇసుకలో ఆడుకుంటున్న పిల్లల, అలా తిరుగుతున్న జంటల రంగులన్నీ అతని శూన్యమైన చూపులో కలిసిపోయి, చివరికి కేవలం సముద్రపు దట్టమైన నీలి రంగు మాత్రమే కనిపిస్తూ ఉంది.

“భార్యను ప్రేమించడం వేరు; ఆ ప్రేమతో పెళ్లి చేసుకోవడం వేరు.  ఇదంతా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. ముఖ్యంగా నా విషయంలో, కేవలం కామం, ఆకర్షణ వంటి వాటిని వివాహం అనే లోతైన గుంటలోకి తీసుకెళ్లి, వాటిని వదిలించుకుని, మనసును శుద్ధి చేసుకుని, స్వచ్ఛమైన హృదయంతో ప్రేమించవచ్చు. అలా ప్రేమించాలి కూడా…”

నేను భరించలేనంత భారమైన ఈ మాటలు. అతని భావాలు నా కళ్ళల్లో అనువాదమై రెప్పల వెంబడి గీతలవుతూ తడితేరాయి. 

సముద్రపు అంచుకు వచ్చి నిలుచున్నాను. 

అలలు నృత్యం చేస్తూ నా పాదాలను తాకి, పాదాల కింద ఉన్న ఇసుకను మెల్లగా మరీ మెల్లగా  తమతో లాక్కుంటూ వెళ్ళినప్పుడు నేను అతనితో జారుతున్నట్టుగా, స్థిరత్వం వదులైనట్టుగా… 

అతను సముద్రపు అల!… అవును, ప్రతిసారి అతని కౌగిలిలో నేను ఒక విధంగా శిథిలమవుతున్నట్టు, సంపూర్ణంగా ఓడిపోతున్నట్టు… పక్కకు మరలి చూశాను. అతని ముఖం నిండా సాయంత్రపు సూర్యుడు! 

కళ్ళు తెరిచినప్పుడు ఎండ కిటికినెక్కి కూర్చుంది. పక్కనే అతని ప్రసన్నమైన ముఖం. ఆ ప్రసన్నతకు నేను,  అవును నేనే కారణమని అనిపించినప్పుడు జీవితం సార్థకం కావడం అంటే ఇదే కావొచ్చునని అనిపించింది. 

నేను నేనుగా మిగల్లేదు. ఈ సమర్పణలోని విడుదలైన భావం… ముక్తి… కావొచ్చా? 

రాత్రి గుర్తొచ్చి తలదిండులో ముఖం దాచుకొన్నాను. నా ఒంటినిండా అతని పెదవులు. 

నేనే మొదట లేవటం మంచిదైందని, బాత్రూంకు వెళ్లి వచ్చి, మళ్లీ అతని పక్కన దొర్లాను. నిద్ర కళ్ళతోటే అతను నన్ను లాక్కున్నాడు. 

నేను సావకాశంగా తిరిగి వెల్లికిలా పడుకున్నాను. “దేవుడు, అమ్మ మనకు ప్రాణాలు ఇచ్చి ఉంటారని మనం వాళ్లకు రుణపడి ఉంటాం. మరి నువ్వు… నువ్వు నాకు జీవితమే ఇచ్చావు. నీ రుణం నేను…” మనస్ఫూర్తిగా అన్నాడు. 

‘మీ వల్లనే నేను నా ఇష్టానుసారం జీవించాను, ఇకపై జీవించటం మీ వల్ల మాత్రమేనని అనిపించడం మొదలైంది’ అని చెప్పాలనుకున్న నా మాటలను అతని పెదవులు నిశ్శబ్దంగా పీల్చుకున్నాయి. 

“ఎన్నోసార్లు మనం ఒకరి మాటలు ఒకరు లాక్కున్నట్లు మాట్లాడుతాం కదా?” 

అతను చెప్పింది నిజమే. 

“జీవితం పొందడం కన్నా జీవితం ఇవ్వడంలో ఎంతటి తృప్తి ఉంటుంది కదా? ఇలాంటి తృప్తి ఎంతమంది స్త్రీలకు దొరుకుతుంది?” 

ఇప్పుడు అతను నన్ను తన వైపు లాక్కున్నప్పుడు అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. ఆపకుండా నా నుదురంతా ముద్దులు పెట్ట సాగాడు. నాకు సిగ్గు వేసి అతని ఎదలో ముఖం దాచుకున్నాను. 

“ఇక్కడ చూడు సుమీ..” నా చుబుకం పట్టుకొని బలవంతంగా ముఖం పైకెత్తాడు. 

“నన్ను క్షమించు, నీకు వద్దనిపించింది ఏదైనా జరిగివుంటే నన్ను క్షమించు సుమీ…” 

మృదువుగా ముద్దు పెట్టి పైకి లేచాడు. 

స్నానం ముగించి వచ్చేసరికి అతని ఏదో రాస్తున్నాడు. పక్కనున్న ఫ్రేమ్ కుర్చీలో మౌనంగా కూర్చున్నారు. 

‘క్షమించే’ మాట గుర్తొచ్చింది. 

ఒకసారి అతను నా జీవితం గురించి ఏదేదో చెబుతూ, ‘నా పట్ల కాన్ఫిడెన్స్ మిగిలివుంటే నా మాట విను’ అని అన్నప్పుడు, ఆ మాటలు నాకు మరీ నాటకీయమనిపించి, ‘కాన్ఫిడెన్స్’ అనే మాట అప్పుడు అనుచితం అనిపించడం వల్ల మనసులోని ఆందోళనలోనే ‘ఇదంతా ఇలాగే ఉండిపోతుందా?’ అని అనుకున్నాను. ఒకసారిగా అతని ముఖంలో బాధ కనిపించింది. 

ఎనిమిది రోజుల తర్వాత వార్డు రౌండ్స్‌కు అతను వచ్చినప్పుడు, ‘నన్ను క్షమించాలని అనిపిస్తే, క్షమిస్తే నాకు చెప్పండి’ అనేటంతలో నాకు ఇబ్బందిగా అనిపించింది. నేను ఇంతకుముందు ఎవరినీ అలా అడగలేదు. మునుముందు అడగను. అడగలేను. 

“మనలో క్షమించే ప్రశ్ననే లేదు” అని అతను చెప్పింది పూర్తిగా నమ్మలేక నాలుగు రోజుల అతన్ని కలవనే లేదు. 

“నేను నువ్వు ఏదైనా తప్పు (చేసి ఉంటే) చేసినప్పుడు, అది తెలిసినప్పుడు మనల్ని మనమే స్వయంగా క్షమించుకుందాం. ఒకరి తప్పు ఇంకొకరు క్షమించి, ఒకరు గొప్పవాళ్ళై, ఇంకొకరిని హీనంగా చేయడం వద్దు. మనం చేసే తప్పు మన ఇద్దరికీ తెలిసినప్పుడు మనల్నే పరస్పరం మరింత ఎక్కువ ఆత్మీయతతో, ప్రేమతో కూడిన దృష్టితో చూడగలిగే, ప్రవర్తించే శక్తిని సంపాదించుకుందాం. అయినా నేను క్షమించాలని నీకు అనిపిస్తే అలాగే చేస్తాను. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క తప్పునూ నువ్వు క్షమించావు అని నేను భావిస్తున్నాను. ఈ  భావన వల్లనే నేను నీతో కూడా ఇంత దృఢంగా ప్రవర్తిస్తాను.”

– తెల్లటి కాగితం మీద ఏర్పడిన అతని చేతిరాత లోని ఒక్కొక్క అక్షరమూ సార్థకమై నా ఎదుట విప్పుకుంటోంది. 

“సుమీ, దీన్ని తీసుకో,  నేను స్నానం చేసి రానా?” అతను అప్పుడు రాసిన దాన్ని నా చేతిలో పెట్టి బాత్రూం వైపు నడిచాడు. 

“నా ప్రియతమా, నీ

ఇంత పొడవైన జుట్టు మీద ఒట్టు,

నా 

భుజం మీద ఉన్న నీ

పంటి గుర్తు మీద ఒట్టు,

నీ 

నుదుటి గీత మీద ఒట్టు,

నీ కుడికాలి 

నల్లటి మచ్చ మీద ఒట్టు,

పిచ్చెక్కించే వెన్నెలలో

నేనూ నువ్వూ

నవ్వుకున్న ఆ నవ్వు మీద ఒట్టు,

ఇసుక తీరంలో నువ్వు

నాట్యం చేసిన ఆ అడుగుల మీద ఒట్టు,

సముద్రపు అల అలల్లా

కొట్టుకున్న నా గుండె మీద ఒట్టు,

నేను 

నీ వాడిని”

రాత్రి ఉన్మత్త ఆనందంలో అతని భుజం కొరకటం గుర్తొచ్చి నవ్వొచ్చింది. 

‘మనం పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు అయినవాళ్ళలా ఉన్నాం కదా?’ 

అవును, రాత్రి అతను నా చెవిలో గుసగుసగా అన్నది అతని మాటలైనప్పటికీ అది నా ఆలోచన కూడా. అతని చల్లటి భుజాలు రెండూ కుర్చీ వెనకనుంచి నన్ను చుట్టుకున్నప్పుడు నేను ముఖం పైకెత్తాను. 

భోంచేసిన తర్వాత ఇద్దరికీ నిద్ర మత్తు. చలికాలం అయినప్పటికీ పణజి ఉక్క తక్కువగా లేదు.

సాయంత్రం మళ్ళీ సముద్రపు మరొక  తీరం దోనాపౌలా దగ్గరికి వెళ్ళాం. అతను తన బూట్లు విప్పి చేతిలో పట్టుకున్నాడు. నేను చెప్పులు తీసి పట్టుకున్నాను. ఇద్దరం సముద్ర తీరం వెంబడి పరిగెత్తాం. పరిగెత్తాం, పరుగెత్తాం.  జీవితమంతా ఇలా పరిగెడుతూనే ఉండాలని అనిపించింది. అలసిపోయి కూర్చున్నాను. అతనూ కూర్చున్నాడు. 

“నీ ఒంట్లో సముద్రం పొంగటం మొదలైంది” అన్నాడు. 

అతని కళ్ళు చూసి నేను గబుక్కున కొంగు కప్పుకున్నాను. 

దూరంలో వాస్కో పోర్ట్.  లంగరు వేసిన ఓడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్యుడు ఎర్రగా కుడివైపు సముద్రపు అంచులో నిషాభిముఖమయ్యాడు. నీళ్ళన్నీ ఎరుపు… 

సముద్రం` సూర్యుడు, ఎవరిని చూడాలి? ఎవరి సౌందర్యం పోగొట్టుకోవాలి? 

ఆకాశమంతటా కొత్త అందాలు, పేర్లు లేని ఎన్నో రంగులు, వందలాది ఆకారాలు. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడు!  

“సుమీ, ఈ మధ్యన నేను రాసిన కవితలన్నీ చేర్చి ఒక కొత్త కలెక్షన్ తీసుకొస్తాను. దానికి ఏమని పేరు పెట్టాలి…? దాన్ని నీకు అంకితం చేయాలని నా కోరిక… అయితే ఎలా? ఆ విషయం ఒక వేళ నా భార్యకు తెలిస్తే ఇకేమైనా ఉందా? అంతా అయిపోతుంది. అందుకే ఇలా చేస్తాను…  ‘ఒక టూరిస్ట్ 16వ నంబర్ గదికి’ అని నీకు సమర్పిస్తాను. ఊ…అవును…” 

అతని మాటలకు నేను కేవలం నవ్వాను. 

“చూడు, నేను ఎంత పిరికివాడినో… నీకూ అలాగే అనిపిస్తుండాలి కదా?” 

నిజం, నాకు బాధగా అనిపించింది. 

“పిరికివాడెందుకు? అలా ఏమీ లేదు. అలా కానూ కూడా. మనకు సాధ్యం కానిదాన్ని ఇద్దరమూ కలిసి సాధ్యమయ్యేలా చేస్తున్నాండేవాళ్ళం కదా” 

ఓహ్! అతని కోరిక… నా కోసం అతని కోరిక… అతని కోరిక కోసం నా కోరిక! అతనికి నేను కావాలి, నాకు అతను కావాలి, అతనికి ‘కావాల్సినవి’ నాకు కావాలి. 

మరుసటి వేకువనే ఇంకా మసక చీకటిలోనే వెళ్లాలి అని అతను చెప్పినప్పుడు నాకు ఏడుపొచ్చింది. 

“వెళ్లేటప్పుడు బెలగావి మీది నుంచి వెళ్దాం. నిన్ను అక్కడ వదిలిపెట్టి వెళ్తాను”

“వద్దు. నాకు అక్కడికి వెళ్లడానికి మనస్కరించటం లేదు” 

“అలాగంటే ఎలా సుమీ. అమ్మ`నాన్న, ఇంటి కోసమైనా మన డ్యూటీ అని ఒకటి ఉంటుంది కదా. దాన్ని తప్పించకూడదు. నువ్వు ఒక రోజు ఉండి రా” 

చిన్నప్పటినుంచీ హాస్టల్‌లోనే పెరిగి, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్న నాకు ఇల్లు, ఇంటి జనం పట్ల నాది అనిపించే భావన ఏమీ ఉండలేదు. 

కారు బయలుదేరినప్పుడు మనసు చాలా ఉదాసీనంగా ఉంది. దారి పక్కనంతా మసక చీకటి. ఒక విధమైన జడత్వం నన్ను ఆవరించింది. 

“బెళగావి వచ్చిందంటే నేనెవరో నువ్వెవరో…” అతని కంఠం విని, స్టీరింగ్ మీద చేయివేశాను. 

“ఎందుకు, కారు నిలపనా?” 

“లేదు… అలాగైతే మనం తిరిగి వెళ్ళటమే వద్దు” 

బ్రేక్ వేసి ఒక పక్కన కారు నిలిపి నన్ను తన భుజానికి ఒరిగించుకున్నాడు. 

“నేనెవరో నువ్వు ఎవరో…” పలువరించాడు. 

“అలా కాదు సుమీ… నీ… నీకు ఎలా చెప్పాలి…” అతని మనోవేదన నాదైంది.  

ఒక నెల తర్వాత అతను నన్ను వెతుక్కుంటూ హాస్టల్‌కి వచ్చాడు. మొదట నా ఆరోగ్యం గురించి విచారించాడు. ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు అని ఆక్షేపించడానికి నాకు సాధ్యం కాలేదు. 

“నాకు నిజాయితీ అసలైన అర్థాన్ని నేర్పినది నువ్వే. నీకు కాక నేను ఇంకెవరికి రుణపడి ఉండాలి? ఒకటి: ఎవరు ఏమైనా అననీ. భరించాలి” 

చదువుకో, బాగా చదువుకో, ఈ అనేవాళ్లు, అనేవాళ్ళ మాటలు వినేవాళ్ళు,  ఈర్ష్యపడేలా, స్వయంగా సిగ్గుపడేలా ప్రవర్తించు. మీ అభివృద్ధి, నీ వికాసం, నీ వ్యక్తిత్వ నిర్మాణం, నీ స్వంత నిర్ణయంతో, నీకు నచ్చిన విధంగా, ఆత్మసంతృప్తి కోసం ఎవరి మీదా ఆధారపడకుండా ముందుకు సాగు. ఇది చాలా ముఖ్యం. నీ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోకూడదు; అది నీకూ, నాకూ ఎంతో అవసరం.

ఇంకొక మాట: తెలియకుండా ఎవరైనా నిన్ను నొప్పించివుంటే క్షమించెయ్. 

నేను ఎప్పటికీ నువ్వే కదా…? 

వెళ్లేటప్పుడు అతను ఇచ్చి వెళ్లిన కాగితం ఎన్నో మాట్లాడింది!

అతను నేను సముద్రం!

డా. హేమా పట్టణశెట్టి

జననం: ఫిబ్రవరి 10, 1954న ధార్వాడలో జన్మించారు.

చదువు:సైకాలజీ మరియు కన్నడ సబ్జెక్టులలో రెండు మాస్టర్స్ డిగ్రీలు. 

వృత్తి: లెక్చరర్, ఫ్రొఫెసర్. ‘సంకలన’ సాహిత్య పత్రిక సంపాదకురాలు, ప్రచురణ సంస్థ నిర్వహకురాలు.

ప్రచురితమైన రచనలు 36. కవిత్వం, కథలు, విమర్శ, నాటకాలు సంపాదకత్వం మొదలైన సాహిత్య రంగాల్లో విశేషమైన కృషి చేసి, అనేక రచనలను ప్రచురించారు.

కర్ణాటక సాహిత్య అకాడమీ గౌరవ పురస్కారం, ప్రొ.ఎస్.వి. పరమేశ్వర భట్ట అవార్డు, ముద్దన కావ్య అవార్డు, కె.ఎస్.పి. మల్లికా అవార్డు, రెండు సార్లు ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది
  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply