• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉర్దూ కథ : పీరున్

పి. శ్రీనివాస్ గౌడ్ by పి. శ్రీనివాస్ గౌడ్
August 10, 2026
in అనువాద కథలు
0
ఉర్దూ కథ : పీరున్

ఉర్దూ మూలం: సాదత్ హసన్ మంటో
తెలుగు అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్

ఇది నేను కటిక పేదవాడిగా ఉన్నప్పుడు జరిగింది. నీళ్లు, కరెంటు సౌకర్యం లేని గదికి నేను నెలకు తొమ్మిది రూపాయలు అద్దె చెల్లించేవాడిని. ఆ భవనం చాలా భయంకరంగా ఉండేది. పైకప్పు నుండి వేల సంఖ్యలో పడే దోమలు, ఎక్కడ చూసినా నేను ఇంతకు ముందెన్నడూ చూడనంత పెద్ద పెద్ద ఎలుకలు ఉండేవి. అవి ఎంత పెద్దగా వుండేవంటే వాటిని చూసి పిల్లులు కూడా భయపడేవి.

ఆ మిద్దెలో ఒకే ఒక స్నానాలగది ఉండేది, దాని తలుపు విరిగిపోయింది. ఆ భవనంలోని యూదు, మరాఠీ, గుజరాతీ, క్రైస్తవ స్త్రీలు తెల్లవారుజామున తమ బకెట్లలో నీళ్ళు నింపుకోవడానికి అక్కడ గుమిగూడేవారు. ఆ స్త్రీలందరూ పొద్దున్నే ఒకచోట చేరి స్నానాలగదికి వెళ్లి, ముందుగా తలుపు ముందు ఒక గోడలా నిలబడి, ఆ తర్వాత ఒక్కొక్కరుగా స్నానం చేసేవారు.

ఒకరోజు నేను ఆలస్యంగా నిద్రలేచాను. నేను స్నానాలగదిలోకి వెళ్లి స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. అది నా పక్క గదిలో ఉండే ఆవిడ. ఆమె చంకలో ఒక నీళ్ల కుండ ఉంది. ఎందుకో తెలియదు కానీ, ఆమె ఒక క్షణం పాటు నన్నే తదేకంగా చూస్తూ నిలబడింది. తర్వాత ఆమె హఠాత్తుగా వెనక్కి తిరిగింది. దాంతో ఆ కుండ జారి కిందపడి హాలులో దొర్లుకుంటూ వెళ్లింది. సింహం ఏదో తరుముతున్నట్లుగా ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. నేను గట్టిగా నవ్వుకుని, తర్వాత లేచి, తలుపు మూసుకుని, స్నానం కొనసాగించాను.

మళ్ళీ తలుపు తెరుచుకుంది. ఈసారి అక్కడ బ్రిజ్ మోహన్. ఆసరికే నేను స్నానం ముగించి, బట్టలు వేసుకుంటున్నాను.

అతను, “హేయ్, మాంటో. ఈరోజు ఆదివారం కదా” అని అన్నాడు.

అప్పుడు నాకు గుర్తొచ్చింది, బ్రిజ్ మోహన్ ప్రతి ఆదివారం కలిసే తన స్నేహితురాలు పీరున్‌ను కలవడానికి బాంద్రా వెళ్ళాలి. ఆమె ఒక పార్శీ అమ్మాయి. బ్రిజ్ మోహన్ సుమారు మూడేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాడు.

బ్రిజ్ మోహన్ ప్రతి ఆదివారం రైలు ప్రయాణం కోసం నన్ను ఎనిమిది అణాలు అడిగేవాడు. అతను పీరున్ ఇంటికి చేరుకున్నాక, వాళ్లిద్దరూ అరగంట సేపు మాట్లాడుకునేవారు. బ్రిజ్ మోహన్ ఆమెకు ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ’ పదబంధాల పజిల్ సమాధానాలు ఇచ్చి, ఆ తర్వాత తిరిగి వచ్చేసేవాడు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండేది కాదు. రోజంతా అతను పీరున్ కోసం ఆ పజిల్ ను పరిష్కరించడానికి కష్టపడేవాడు. అతను కొన్ని చిన్న బహుమతులు గెలుచుకున్నప్పటికీ, అవన్నీ, ప్రతీది ఆమెకే దక్కేవి.

బ్రిజ్ మోహన్ దగ్గర పీరున్ లెక్కలేనన్ని ఫోటోలు ఉండేవి- షల్వార్ కమీజ్‌లో, బిగుతుగా ఉండే పైజామాలలో, చీరలో, పెళ్లిళ్లకు వేసుకునే దుస్తులలో, సాయంత్రపు అంగీలో ఉన్న పీరున్ ఫోటోలు. అతని దగ్గర వందకు పైగా ఫోటోలు ఉండి ఉంటాయి. పీరున్ అస్సలు అందంగా ఉండేది కాదు. నా అభిప్రాయానికి ఆమె పూర్తి వ్యతిరేకం. అయినా నేను ఏమనుకుంటున్నానో బ్రిజ్ మోహన్‌కు ఎప్పుడూ చెప్పలేదు. ఆమె గురించి నేను ఎప్పుడూ అడగలేదు – ఆమె ఎవరు, ఏం చేసేది, అతను ఆమెను ఎలా కలిశాడు, ఎలా ప్రేమలో పడ్డాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా అని. బ్రిజ్ మోహన్ కూడా నాతో ఆమె గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ప్రతి ఆదివారం ఉదయం అల్పాహారం తర్వాత, అతను నా దగ్గర ఎనిమిది అణాలు అడిగి, బాంద్రాలో ఉన్న పీరున్‌ను కలవడానికి వెళ్లి, మధ్యాహ్నం తిరిగి వచ్చేవాడు.

నేను నా గదికి తిరిగి వెళ్లి, అతనికి డబ్బు ఇస్తే, తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం అతను తిరిగి వచ్చినప్పుడు, మొదటిసారిగా, “అది ముగిసిపోయింది” అని అన్నాడు.

“ఏమైంది?”

“నేను ఈరోజు పీరున్‌తో విడిపోయాను,” అని అతను ఊరట చెందినట్లుగా అన్నాడు. “నేను ఆమెతో చెప్పేసాను. నిన్ను కలిసినప్పటి నుండి నాకు ఏదీ కలిసి రావడం లేదు.. నువ్వొక దురదృష్టపు దానివి..” అందుకు ఆమె, ‘అయితే నన్ను కలవడం మానేసెయ్, అప్పుడు నీకు ఉద్యోగం వస్తుందో లేదో చూద్దాం. నేను దురదృష్టపు దాన్నేమో, కానీ నువ్వొక పెద్ద బద్ధకస్తుడివి- నీకంటే బద్ధకస్తుడు మరొకడు లేడు.’ అంది. దాంతో అంతా అయిపోయింది. దేవుడి దయ ఉంటే రేపు నాకు ఉద్యోగం వస్తుందని పందెం కాయగలను. రేపు ఉదయం నువ్వు నాకు నాలుగు అణాలు ఇస్తే, నేను సేథ్ నానూ భాయ్‌ని కలవడానికి వెళ్తాను. ఆయన నాకు తన గుమస్తాగా ఉద్యోగం ఇస్తారని నాకు నమ్మకం ఉంది.”

సేథ్ నానూ భాయ్ ఒక సినిమా దర్శకుడు. బ్రిజ్ మోహన్ సోమరి అని భావించి, అతనికి అప్పటికే లెక్కలేనన్ని సార్లు ఉద్యోగాన్ని తిరస్కరించాడు. కానీ మరుసటి రోజు బ్రిజ్ మోహన్ మరలా వెళ్ళినప్పుడు, సేథ్ నానూ భాయ్ అతనికి నెలకు 250 రూపాయల జీతంతో చాలా సంతోషంగా ఉద్యోగం ఇచ్చాడనే శుభవార్తను నాతో పంచుకున్నాడు. ఆ కాంట్రాక్టు ఒక సంవత్సరానికి. దానిపై సంతకాలు, ముద్రలు అన్నీ పూర్తయ్యాయి. అతను తన జేబులో చేయి పెట్టి వంద రూపాయల నోటు తీసి నాతో, “ఇది అడ్వాన్స్. నేను నిజంగా ఈ కాంట్రాక్టు, డబ్బు తీసుకుని బాంద్రాకు వెళ్లి పీరున్‌తో, ‘హేయ్, చూడు! నాకు ఉద్యోగం వచ్చింది’ అని చెప్పాలనుకుంటున్నాను. కానీ నానూ భాయ్ నన్ను వెంటనే పనిలోంచి తీసేస్తాడేమోనని భయంగా ఉంది. నాకు ఇలా చాలాసార్లు జరిగింది. నాకు ఉద్యోగం వస్తుంది, పీరున్‌ను కలవడానికి వెళ్తాను. అంతా నాశనమైపోతుంది. ఏదో ఒక సాకుతో నన్ను పనిలోంచి తీసేస్తారు. ఈ అమ్మాయి ఎందుకింత దురదృష్టవంతురాలో దేవుడికే తెలియాలి. కనీసం ఒక సంవత్సరం పాటు ఆమెను కలవకూడదని నేను నిశ్చయించుకున్నాను. నా దగ్గర వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు.’ వచ్చే ఏడాదిలోగా నేను కొన్ని కుట్టించుకుని, ఆ తర్వాత ఆమెను కలవడానికి వెళ్తాను.”

ఆరు నెలలు గడిచాయి. బ్రిజ్ మోహన్ పని బాగానే సాగుతున్నట్లు అనిపించింది. అతను కొన్ని కొత్త బట్టలు కుట్టించుకున్నాడు. డజను చేతిరుమాళ్లు కొనుక్కున్నాడు, ఇప్పుడు ఒక బ్రహ్మచారికి కావలసినవన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఒకరోజు అతను స్టూడియోకి వెళ్ళిన తర్వాత, అతనికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ రాత్రి నేను దాన్ని అతనికి ఇవ్వడం మర్చిపోయాను. మరుసటి రోజు ఉదయాన్నే అల్పాహరం సమయమప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అతని చేతికి ఆ ఉత్తరం అందిన వెంటనే, అతను “ఓరి, దేవుడా!” అని అరిచాడు.

“ఏమయింది?” అన్నాను

“ఇది పీరున్ రాసింది. అదీ అంతా బాగానే వుందనుకున్న సమయంలో” అతను తన చెంచాతో కవరును తెరుస్తూ అన్నాడు. “ఖచ్చితంగా ఆమెనే. ఆమె చేతిరాతను నేను ఎప్పటికీ మర్చిపోలేను.”

“ఆమెకు ఏమి కావాలంట?”

“ఛీ, ఈ ఆదివారం నన్ను కలవాలనుకుంటోంది. నాకు ఏదో చెప్పాలనుకుంటుందట” అని చెప్పి, అతను ఆ కవరును తన జేబులో పెట్టుకున్నాడు. “ఇదిగో చూడు మాంటో.. రేపు నన్ను ఉద్యోగం నుండి తీసేస్తారో లేదో చూస్తూ ఉండు.”

“ఉండు.. ఏం మాట్లాడుతున్నావ్?”

“లేదు మాంటో, చూస్తూ ఉండు..” అని అతను ధృడమైన నమ్మకంతో అన్నాడు. “రేపు ఆదివారం. సేథ్ నానూ భాయ్ ఏదో ఒక సాకు చెప్పి నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు.”

“మీకు అంత నమ్మకం ఉంటే, వెళ్లొద్దు”

“కుదరదు. ఆమె నన్ను రమ్మన్నప్పుడు, నేను వెళ్ళాలి.”

“ఎందుకు?”

“సరేలే, ఏదేమైనా, పనిలో చేరి ఆరు నెలలకు పైగా అయ్యింది. నాకు కూడా పని చేసి చేసి, కొంచెం విసుగొచ్చింది..” అని చెప్పి, నవ్వి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయం అల్పాహారం తర్వాత అతను బాంద్రాకు బయలుదేరాడు. అతను తిరిగి వచ్చినా ఏమీ మాట్లాడలేదు. అందుకే నేను అతన్ని, “నీ దురదృష్ట తారకని కలిశావా?” అని అడిగాను.

“కలిసాను. నన్ను త్వరలోనే ఉద్యోగం నుండి తీసేస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు అని ఆమెతో చెప్పాను.” ఆ తర్వాత అతను మంచం మీద నుండి లేచాడు. “సరేలే, పద భోజనం చేద్దాం.” అన్నాడు‌

మేము హాజీ హోటల్‌లో భోజనం చేశాము, ఆ సమయంలో పీరున్ గురించి అస్సలు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆ రాత్రి పడుకునే ముందు అతను, “రేపు ఏం జరుగుతుందో చూద్దాం” అన్నాడు.

ఏమీ జరగదేమో అనుకున్నాను, కానీ మరుసటి రోజు బ్రిజ్ మోహన్ తొందరగా తిరిగి వచ్చాడు. మేము కలిసినప్పుడు “నా ఉద్యోగం పోయింది..” అని గట్టిగా నవ్వాడు.

అతను తమాషా చేస్తున్నాడనుకుని, “ప్చ్..ఆపు” అన్నాను.

“ఎప్పుడు ఆగిపోవాలో అప్పుడే ఆగిపోయింది! నేను ఆపడానికి ఇంకేముంది? నానూ భాయ్ అందులో కుతికెల దాకా పూర్తిగా కూరుకుపోయారు. ఆయన స్టూడియో అమ్మేశారు. ఇదంతా నా వల్లే జరిగింది!” అని చెప్పి మళ్ళీ నవ్వాడు.

ఇది ఊహించని పరిణామం.

“సరే, దీనికి వివరణ అవసరం లేదు కదా!” బ్రిజ్ మోహన్ ఒక సిగరెట్టు వెలిగించి, కెమెరా తీసుకుని, నడవసాగాడు.

బ్రిజ్ మోహన్‌కు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. తను దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టేశాక, ఆదివారం బాంద్రాకు వెళ్లడానికి మళ్లీ నన్ను ఎనిమిది అణాలు అడగడం మొదలుపెట్టాడు. ఆ ముప్పై, నలభై నిమిషాల పాటు వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అతను గొప్ప మాటకారి అయినా తనకు దురదృష్టాన్ని మాత్రమే తెస్తుందని గట్టిగా నమ్మిన ఆ అమ్మాయితో మాట్లాడటానికి ఏం విషయం వుంటుంది? ఒకరోజు నేను అతన్ని, “బ్రిజ్, పీరున్ నిన్ను ప్రేమిస్తుందా?” అని అడిగాను.

“లేదు, ఆమె వేరొకరిని ప్రేమిస్తోంది.” అన్నాడు.

“మరి, ఆమె నిన్ను ఎందుకు కలుస్తోంది?”

“ఎందుకంటే నేను తెలివైనవాడిని. ఆమె అందవిహీనమైన ముఖాన్ని, అందంగా మార్చే మార్గాన్ని నేను ఆలోచించగలను. ఆమె కోసం పదబంధాల పజిల్లు పరిష్కరిస్తాను. కొన్నిసార్లు ఆమెకు బహుమతులు కూడా గెలిపిస్తాను. మంటో, నీకు అలాంటి అమ్మాయిల గురించి తెలియదు, కానీ నాకు తెలుసు. ఆమె ప్రియుడిలో ఏ లోపం ఉన్నా, నేను దాన్ని భర్తీ చేస్తాను. ఆ విధంగా ఆమెకు ఒక పరిపూర్ణ పురుషుడు దొరుకుతాడు.” అతను నవ్వాడు.

‘ఇది ఖచ్చితంగా మోసం!’ అనుకొని “మరి నువ్వు ఆమెను ఇంకా ఎందుకు కలుస్తున్నావు?” అని అయోమయంగా అడిగాను.

బ్రిజ్ మోహన్ నవ్వి, ఆ తర్వాత భృకుటి ముడిచాడు. “నాకు నచ్చింది.”

“ఏమిటి నచ్చింది?”

“ఆమె దురదృష్టాన్ని తెస్తుందని నాకు తెలుసు. ఆమె దురదృష్టాన్ని నేను పరీక్షిస్తూ వస్తున్నాను. ఇప్పుడు అది నిజమని నాకు ఖచ్చితంగా తెలిసింది. ఆమె నాకు తెలిసినప్పటి నుండి, నేను చేసిన ప్రతి ఉద్యోగం నుండి నన్ను తీసేశారు. ఇప్పుడు నేను దాన్ని అధిగమించడానికి ఒక మార్గాన్ని కనుక్కోవాలనుకుంటున్నాను.”

“నీ ఉద్దేశ్యం ఏమిటి?”

“నన్ను ఉద్యోగం నుండి తీసేయక ముందే నేను మానేయాలనుకుంటున్నాను” అని బ్రిజ్ మోహన్ చాలా గంభీరంగా అన్నాడు. “అంటే, నేనే మా బాస్‌ని ఉద్యోగం నుండి తీసేయాలనుకుంటున్నాను. నేను ఇలా చెప్తాను, ‘సార్, మీరు నన్ను ఉద్యోగం నుండి తీసేయబోతున్నారని నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని ఆ శ్రమ పడనివ్వను. నేనే స్వయంగా వెళ్ళిపోతాను. ఏమైనా, నిజానికి నన్ను తీసేసింది మీరు కాదు. నా స్నేహితురాలు పీరున్. ఆమె ముక్కు ఎంత పెద్దదంటే అది బాణంలా ​​కెమెరాలను చీల్చేస్తుంది!” బ్రిజ్ మోహన్ నవ్వాడు. “ఇది నా చిన్న కోరిక. అది నెరవేరుతుందో లేదో చూద్దాం.” అన్నాడు

ఇది చాలా వింత కోరిక.

“నా గురించి ప్రతీదీ వింతగా ఉంటుంది” అన్నాడు అతను. “గత ఆదివారం నేను పీరున్ ప్రియుడిని ఫోటో తీశాను. అతను దాన్ని ఏదైనా పోటీకి పంపి గెలవమనండి!” బ్రిజ్ మళ్ళీ నవ్వాడు.

ఒక ఆదివారం బ్రిజ్ బాంద్రా నుండి తిరిగి వచ్చి, “మాంటో, అంతా అయిపోయింది” అని అన్నాడు.

“అంటే నువ్వు, పీరున్ అన్నమాట?”

“అవును. నాకు వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. అందుకే వెళ్లడం మానేయడమే మంచిదని అనుకున్నాను. దేవుడి దయ ఉంటే, రెండు రోజుల్లో నాకు పని దొరుకుతుంది. సేథ్ నయాజ్ అలీని కలవాలనుకుంటున్నాను. ఆయన ఒక సినిమా తీస్తున్నాడట. నేను రేపు వెళ్తాను, కానీ ఆయన ఆఫీస్ ఎక్కడ ఉందో నువ్వు కనుక్కోగలవా?”

నేను ఒక స్నేహితుడిని అలీ కొత్త టెలిఫోన్ నంబర్ ఏమిటో అడిగి, దాన్ని బ్రిజ్ మోహన్‌కు చేరవేశాను. మరుసటి రోజు అతను అక్కడికి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చేసరికి, తృప్తిగా నవ్వుతూ ఉన్నాడు. “హే, మాంటో..” అని చెప్పి, తన జేబులో చేయి పెట్టి టైప్ చేసిన కాగితాన్ని బయటకు తీశాడు. “ఒక సినిమాకి కాంట్రాక్ట్ – నెలకు 200 రూపాయలు. ఇది పెద్ద మొత్తం ఏమీ కాదు, కానీ సేథ్ నయాజ్ అలీ నాకు త్వరలోనే జీతం పెంచుతానని చెప్పారు. ఫర్వాలేదు కదూ?”

“మరి పీరున్‌ను ఎప్పుడు కలుస్తావు?”

బ్రిజ్ మోహన్ నవ్వాడు. “ఎప్పుడూ..? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను..”

“నేను ఆమెను ఎప్పుడు కలవాలి? కానీ, మాంటో, నేను తీర్చుకోవాలనుకుంటున్న ఒక చిన్న కోరిక ఉందని నీకు చెప్పాను కదా? నేను దాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను మరీ తొందరపడకుండా, ముందు కొంచెం డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. నాకు అడ్వాన్స్‌గా యాభై రూపాయలు వచ్చాయి. ఇదిగో, నువ్వు ఇరవై ఐదు తీసుకో.”

నేను ఆ డబ్బు తీసుకుని ఒక రెస్టారెంట్‌లోని బకాయి బిల్లును చెల్లించాను. అంతా చాలా బాగానే నడచిపోతోంది. నేను నెలకు వంద రూపాయలు సంపాదిస్తుండగా, బ్రిజ్ మోహన్‌కు 200 రూపాయలు వచ్చేవి. మేము చాలా హాయిగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఐదు నెలలకు, అకస్మాత్తుగా పీరున్ నుండి ఒక ఉత్తరం వచ్చింది.

“చూడు, మంటో, నా మృత్యు దేవత..!”

నిజానికి ఆ ఉత్తరం చూడగానే నాకు భయమేసింది. బ్రిజ్ మోహన్ నవ్వుతూ కవరు తెరిచి, అందులోంచి ఉత్తరం తీసి చదివాడు. అది చాలా కొంచెమే ఉంది.

‘’ఏమిటి?’’

“ఆమె నన్ను ఆదివారం కలవాలనుకుంటోంది. చాలా ముఖ్యమైన పని ఉంది.” ఆ తర్వాత బ్రిజ్ మోహన్ ఆ ఉత్తరాన్ని తిరిగి కవరులో పెట్టి తన జేబులో కుక్కేశాడు.

“నువ్వు వెళ్తున్నావా?”

“నాకు వేరే దారి లేదు.” అన్నాడు. ఆ తర్వాత అతను, ‘మర్చిపోకు, యాత్రికుడా, ఒక రోజు నువ్వు వెళ్ళిపోవలసిందే’ అనే సినిమా పాటను పాడటం మొదలుపెట్టాడు.

కానీ నేను అతనితో, “ఆమెను కలవడానికి వెళ్ళొద్దు. మనం చాలా బాగా బతుకుతున్నాం. నీకు గుర్తుండకపోవచ్చు. కానీ ప్రతి ఆదివారం నేను నీకు ఎనిమిది అణాలు అప్పుగా ఇచ్చేవాడిని. అది నాకు గుర్తుంది” అని చెప్పాను.

బ్రిజ్ మోహన్ నవ్వాడు. “నాకు అన్నీ గుర్తున్నాయి, అందుకే ఆ రోజులు మళ్లీ తిరిగి వస్తుండటం చాలా బాధగా ఉంది.”

ఆదివారం బ్రిజ్, పీరున్‌ను కలవడానికి బాంద్రాకు వెళ్ళాడు. తిరిగి వచ్చాక అతను, “నీ వల్ల నేను ఉద్యోగం కోల్పోవడం ఇది పన్నెండవ సారి అని ఆమెతో చెప్పాను. నా మీద దయ చూపించు అన్నాను!” అన్నాడు.

“దానికి ఆమె ఏమని సమాధానం చెప్పింది?” అన్నాను

“నువ్వొక తెలివి తక్కువ వెధవవి అనింది”

“నువ్వా..?”

“వందకి వంద శాతం!”అతను నవ్వాడు. “రేపు ఆఫీసుకు వెళ్ళగానే నా రాజీనామాను సమర్పిస్తాను. అది పీరున్ దగ్గరే నేను రాసేశాను.”

అతను నాకు ఆ కాగితాలు చూపించాడు. మరుసటి రోజు అతను అల్పాహారం హడావిడిగా ముగించుకుని పనికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు అతని ముఖం దిగులుగా ఉంది. అతను నాతో ఏమీ మాట్లాడలేదు. దాంతో నేనే అడగాల్సి వచ్చింది.

“ఏంటి బ్రిజ్? ఏమైంది?”

అతను ఎలాంటి భావమూ లేకుండా తల అడ్డంగా ఊపాడు.

“ఏమీ లేదు, అంతా అయిపోయింది.”

“ఏమిటి?”

“నేను సేథ్ నయాజ్ అలీకి నా రాజీనామా లేఖను ఇచ్చాను. కానీ అతను నవ్వి, గత నెల నుండి అమలులోకి వచ్చేలా నా జీతం 200 నుండి 300 రూపాయలకు పెంచానని అంటూ ఒక లేఖను నాకు ఇచ్చాడు!” అన్నాడు.

ఇక, బ్రిజ్ మోహన్‌కు పీరున్‌పై ఆసక్తి పోయింది. ఒకరోజు అతను నాతో ఇలా అన్నాడు, “ఆమెకి పట్టిన దురదృష్టం పోగానే, నాకు ఆమె మీద విసుగొచ్చింది. నా ఆట గాలిలో కలిసిపోయింది! ఇప్పుడు నా పనంతా ఎవరు చెడగొడతారు..?”


రచయిత పరిచయం :

సాదత్ హసన్ మంటో (1912–1955) ఒక ప్రముఖ ఉర్దూ రచయిత, కథకుడు, నాటక రచయిత. భారత ఉపఖండంలోని సామాజిక వాస్తవాలను, మానవ స్వభావాన్ని, ద్వంద్వ ప్రవృత్తులను తన కథల్లో నిర్భయంగా చిత్రించినందుకు ఆయన ప్రసిద్ధి చెందాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన మంటో, భారత దేశ విభజన సమయంలోని అనుభవాలను, సమాజంలోని వివక్షలను, మతపరమైన ఘర్షణలను తన రచనల్లో విశ్లేషించాడు.

ఆయన రచనలు, ముఖ్యంగా “టోబా టెక్ సింగ్”, “ఖోల్ దో”, “ఠండా గోష్ట్” వంటి కథలు, విభజన సమయంలో భయానక పరిణామాలను, మానవత్వం యొక్క లోతైన అంశాలను వెల్లడి చేస్తాయి. మంటో రచనలు తరచూ వివాదాస్పదమైనప్పటికీ, అవి సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. సమాజంలోని నీచమైన వాస్తవాలను బహిర్గతం చేసే ఆయన శైలి, ఆయనను ఒక గొప్ప వాస్తవిక రచయితగా నిలిపింది.

మంటో బొంబాయిలో సినిమా రంగంలో కూడా కొంతకాలం పనిచేశాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. 1955లో, 42 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశాడు. కానీ ఇప్పటికీ ఆయన సాహిత్యం ఉర్దూ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

పి. శ్రీనివాస్ గౌడ్

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.

రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

Previous Post

ఉర్దూ కథ: భ్రమ

Next Post

కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’

Next Post
కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’

కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • హిందీ కవితలు: గోధుమ + గోవు
  • సచ్చిదానందన్ కవితలు రెండు..
  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

అభిప్రాయాలు

  • కొల్లూరి సోమ శంకర్ on ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • Reddy on హిందీ కథ : లెక్క తప్పింది !
  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply