మూలం : సారా టీస్‌డేల్
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు
నా ఆత్మ గురించి నేను విచారించను.
అది అసంతృప్తిగానే మిగిలిపోయినా పరవాలేదు.
ఎందుకంటే
అది వెయ్యిసార్లు జీవించగలదు;
శాశ్వతం అగాధమై అపారమైనది.
కానీ…
నా ఈ శరీరం గురించి మాత్రం బాధ కలుగుతుంది.
ఒక రోజు
అది కొద్దిపాటి ధూళి రేణువులలో కలిసిపోవాల్సిందే.
తాను తెలుసుకోవాలని,
అనుభవించాలని తపించిన ఆనందాన్ని
పూర్తిగా ఆస్వాదించకుండానే…
![]()
కవితా రూపరేఖ:
ఈ కవితలో కవయిత్రి ఆత్మ, శరీరం అనే రెండు భిన్న సత్యాలను తాత్విక దృష్టితో ఆవిష్కరించారు. శాశ్వతమైన ఆత్మ అసంతృప్తిగా మిగిలినా దానికి అనంతమైన కాలం, అనేక అవకాశాలు ఉన్నందున దాని గురించి ఆమె విచారించదు. అయితే నశ్వరమైన శరీరం మాత్రం కొద్దికాలానికే ధూళిలో కలిసిపోవాల్సి వస్తుంది. జీవితం ముగిసేలోపు తెలుసుకోవాలని, అనుభవించాలని, పొందాలని తపించిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోవడం పట్ల ఆమె సున్నితమైన వేదనను వ్యక్తం చేస్తుంది. ఈ విధంగా ఆత్మ యొక్క అనంతత్వానికీ, శరీరపు పరిమితికీ మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూపిస్తూ, మానవ జీవితంలోని అసంపూర్ణత, కోరిక, శాశ్వతాన్వేషణ అనే తాత్విక భావాలను ఈ కవిత హృద్యంగా ప్రతిబింబిస్తుంది.
సారా టీస్‌డేల్ (Sara Teasdale, 1884–1933) అమెరికన్ లిరికల్ కవయిత్రి. ప్రేమ, ప్రకృతి, ఏకాంతం, జీవితం, మరణం, మానవ మనసులోని సూక్ష్మ భావోద్వేగాలు ఆమె కవిత్వానికి ప్రధాన ఇతివృత్తాలు. సరళమైన పదాల్లో లోతైన అనుభూతులను వ్యక్తీకరించడం ఆమె కవిత్వ విశిష్టత. 1918లో వెలువడిన Love Songs కవితా సంపుటికి ఆమెకు కొలంబియా పోయెట్రీ ప్రైజ్ లభించింది. అనంతరం అదే పురస్కారం పులిట్జర్ కవితా పురస్కారంగా రూపాంతరం చెందింది. భావసౌందర్యం, సంగీతాత్మకత, అంతర్ముఖత కలగలిసిన ఆమె కవితలు ప్రపంచవ్యాప్తంగా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.
సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.
ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.































