మూలం : జాయిస్ కిల్మర్ (Joyce Kilmer) “Trees”.
తెలుగు అనువాదం : హిమజ
నేనెన్నడూ చూడనేమో,
చెట్టువంటి చక్కని కవితను.
భూమాత మధుర క్షీరధారను
ఆకలితో పీల్చే నోరు కలిగిన చెట్టు.
రోజంతా దేవునివైపు చూపు నిలిపి,
ఆకుల చేతులను ప్రార్థనగా ఎత్తే చెట్టు.
వేసవి వేళ తన పచ్చని జడలో
రాబిన్ పిట్టల గూళ్లను ధరించే చెట్టు.
మంచు తన ఒడిలో సేదతీరగా,
వానతో ఆత్మీయ స్నేహం చేసే చెట్టు.
నాలాంటి మూర్ఖులే కవితలు రాస్తారు;
కానీ ఒక చెట్టును సృష్టించగలవాడు
ఆ దేవ దేవుడొక్కడే…!!
![]()
ఈ కవితలో భక్తి, ప్రకృతి సౌందర్యం, కవితాత్మక హృదయం కనిపిస్తుంది.
Joyce Kilmer
జాయిస్ కిల్మర్ (1886–1918) ప్రముఖ అమెరికన్ కవి, జర్నలిస్టు, సాహిత్య విమర్శకుడు. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక భావనలు, మానవ విలువలను తన కవిత్వంలో హృద్యంగా వ్యక్తపరిచాడు. ఆయన రచించిన “Trees” కవిత ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందింది. ఈ కవితలో చెట్ల గొప్పతనాన్ని, ప్రకృతిలో వాటి స్థానాన్ని ఎంతో అందంగా వర్ణించాడు.
మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యంలో సేవలందించిన కిల్మర్, 1918లో ఫ్రాన్స్‌లో యుద్ధ సమయంలో వీరమరణం పొందారు. ఆయన కవిత్వం సరళమైన భాష, లోతైన భావాలతో నేటికీ పాఠకులను ఆకట్టుకుంటోంది.

2005 నుండి కవిత్వం రాస్తున్నారు, ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ వీరి కవితా సంకలనాలు. తాజాగా అఫ్రో అమెరికన్ కవయిత్రి మాయా ఏంజిలో కవితల అనువాదం పుస్తకంగా వచ్చింది. సంచిక అంతర్జాల పత్రికలో “పొయెట్స్ టుగెదర్” శీర్షికతో భిన్న కవుల విభిన్న కవిత్వాన్ని అనువదించి అందించారు.
సిసి రెడ్డి గారి ‘మనభూమి’మాసపత్రికలో ‘హిమశకలం’ పేరుతో సంవత్సరం పాటు కాలమ్ నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రిక లో పద ప్రహేళిక నిర్వహించారు. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి కవయిత్రి తొలి ప్రోత్సాహక పురస్కారం, రొట్టమాకు రేవు అవార్డు, అమృతలత అపురూప అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, కలేకూరి ప్రసాద్ స్మారక అనువాద పురస్కారం- అందుకున్నారు.
‘రెండు సంతకాలు‘ త్వరలో రానున్న కవితా సంకలనం
ప్రముఖ కవి రాజేందర్ జింబో హిమజ జీవన సహచరులుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.



