తమిళ మూలం : మహాకవి భారతి
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణారావు
పొలాల మధ్య—
సమృద్ధిగా నీటితో నిండిన చెరువు గట్టున,
మనిషి జాడే లేని చోట,
మనసుకు కాస్త ఊరట కోసం
ఒంటరిగా వచ్చాను.
అంతలో పెనుగాలి వీచింది—
ఆ చెట్లన్నింటినీ లెక్కపెట్టగలమా?
చిన్న మొక్కల్లా
అవి అన్నీ పెకలించుకుపోయి,
నేలంతా చెల్లాచెదురయ్యాయి.
ఒక చిన్న మట్టిగట్టుపై
ఒక చిన్న కొబ్బరి తోట మాత్రం ఉంది—
పేదవాడి సొత్తు అది;
పెనుతుఫాను దాన్ని
నేలమట్టం చేయలేకపోయింది.
కొన్ని చెట్లు నేలకొరిగాయి;
మరికొన్ని మాత్రం మిగిలాయి—
వాయుదేవుడి దయతో
తుఫాను బారి నుంచి తప్పించుకున్నాయి.
ఈ తోట బతకాలి—
ఇలాగే పచ్చగా ఉండాలి.
ఏకాంతాన్ని ఆస్వాదించాను—
ఆ ఏకాంతంలోనే
ఒక మధురమైన ఆనందాన్ని పొందాను.
సూర్యకాంతిని కమ్ముకున్న
మంచుతెర కూడా
చెరకు పాకంలా
తీయగా అనిపించింది.
ఆకాశంలో సూర్యుడు
అన్నిటికీ సాక్షిగా నిలిచి,
ఆనందంతో ఉప్పొంగే
ఒక వెలుగుగోళంలా,
తన కిరణాలను
అన్నివైపులా విరజిమ్ముతూ,
ఆనందగీతం ఆలపిస్తున్నట్టుగా
అంతటినీ వెలుగుతో నింపాడు.
ఆ చెట్ల మధ్య
ఒక చిన్న నీడలో నిలబడి,
కవిత్వంలో శాశ్వతంగా
లీనమైనట్టుగా,
ఆనందం ఎప్పటికీ నిలిచేదని
అనుభూతి చెందాను.
పరాశక్తికి జయమగుగాక!
నీ మహిమను గానం చేసేవాడు
జీవిస్తాడు, వర్ధిల్లుతాడు.
ఓ పరాశక్తీ—
ఇదే నా మాట;
దీనిని ఎన్నటికీ మరువకు!
![]()
మహాకవి భారతి — జీవిత పరిచయం
సుబ్రహ్మణ్య భారతి (1882–1921) తమిళ సాహిత్యంలో ఆధునిక యుగానికి మార్గదర్శకుడైన మహాకవి, రచయిత, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన 1882 డిసెంబర్ 11న తమిళనాడులోని ఎట్టయపురంలో జన్మించారు. చిన్న వయసులోనే కవిత్వంలో అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఎట్టయపురం సంస్థానం ఆయనకు “భారతి” అనే బిరుదును ఇచ్చింది. అప్పటి నుంచే ఆయన సుబ్రహ్మణ్య భారతి, తరువాత మహాకవి భారతి అనే పేర్లతో ప్రసిద్ధి చెందారు. దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, స్త్రీ స్వేచ్ఛ, మానవ గౌరవం వంటి అంశాలను తన రచనల ద్వారా బలంగా వ్యక్తం చేశారు. పాత్రికేయుడిగా కూడా పనిచేసి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కలిగించారు.
భారతి కేవలం దేశభక్తి కవి మాత్రమే కాదు; ప్రకృతి, ప్రేమ, భక్తి, మానవత్వం, సామాజిక సంస్కరణ వంటి అనేక అంశాలపై కవితలు రాశారు. ఆయన కవిత్వంలో సరళమైన భాషతో పాటు ఉత్సాహభరితమైన భావోద్వేగం, స్వేచ్ఛా స్పూర్తి కనిపిస్తాయి. బ్రిటిష్ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా కొంతకాలం పుదుచ్చేరిలో నివసిస్తూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఆయన రచనలు తమిళ సాహిత్యంలో కొత్త శైలికి, కొత్త ఆలోచనలకు దారితీశాయి. 1921 సెప్టెంబర్ 11న చెన్నైలో కేవలం 38 ఏళ్ల వయసులో మరణించినప్పటికీ, “స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీ స్వాతంత్ర్యం, మానవతా విలువలను తన కవిత్వంలో బలంగా ప్రతిధ్వనింపజేసిన భారతి, తమిళ సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. మహాకవిగా భారతి చిరస్థాయిగా నిలిచారు.



