తెలుగు అనువాదం : శివ చల్లా
కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా!
అలాంటి రకరకాల కాలాల్లో అదొక రకం కాలం …. గడ్డు కాలం.
భూస్వాములు, రైతులను బానిసలుగా చూస్తున్న కాలం! వారు తమ పొలాల్లో పనిచేసే రైతులను పురుగుల కంటే హీనంగా చూసేవారు. దేవుడికీ-దెయ్యానికీ కూడా భయపడని ఆ భూస్వాములు భయపడేది ఒక్క మహమ్మారికే!
ఆ మహమ్మారి అడుగుపెట్టిన చోటల్లా శవాల గుట్టలే! దీనికి భపయడి గొప్ప గొప్ప భూస్వాములు సైతం తమ భవనాలను వదిలేసి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ ఊళ్ళు వదిలి పారిపోయేవారు.
ఒకసారి అలాంటి మహమ్మారి ఓ భూస్వామి ఇంటి మీద దాడి చేసింది. భూస్వామి, అతని భార్య ప్రాణభయంతో ఇంటి పక్కనే ఉన్న ఒక ఎత్తైన చెట్టెక్కి కూర్చొన్నారు. కానీ వారి చిన్నారి పిల్లలు మాత్రం ఆ మహమ్మారి కోరల నుండి తప్పించుకోలేకపోయారు. ఇంకేముంది చూస్తూచూస్తూనే మహమ్మారి ఆ పసివాళ్లను మింగేసింది.
పిల్లల్ని పోగొట్టుకున్న బాధలో ఆ భూస్వామి దంపతులు గుండెలు బాదుకుని ఏడ్చారు. కన్నీటి మధ్యనే తమ పిల్లలను సమాధి చేసి, వారి జ్ఞాపకాలలోనే రోజులు వెళ్లదీస్తున్నారు. కాలం గడుస్తున్నా ఆ ఇంట్లో మళ్ళీ పిల్లల నవ్వులు వినిపించలేదు.
ఒక రోజు ఆ భూస్వామి దంపతులు పొరుగూరు నుండి తిరిగి వస్తుండగా, దారి పక్కనున్న ఓ గుంటలో ఆకలితో అలమటిస్తూ వారికి ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు.
“ఈ బిడ్డ ఎవరై ఉంటాడు?” అని భూస్వామి చుట్టుపక్కల జనాలను వాకబు చేసాడు.
“అనాథ!”
“మహమ్మారి వాడి అమ్మ-నాన్నలను కబళించింది. అప్పటి నుంచి ఇదిగో ఇలా అనాథగా తిరుగుతున్నాడు. రెండు రోజుల నుండి పట్టెడు అన్నం దొరకక చావుతో పోరాడుతున్నాడు. ఇవాళో-రేపో ఓడిపోయేలా ఉన్నాడు.
ఆ భూస్వామి దంపతుల హృదయం కరిగిపోయింది.
“ఇక నుంచి వీడు మా బిడ్డ” అని భూస్వామి అక్కడివాళ్ళతో చెప్పి ఆ పిల్లవాణ్ణి తమ రథంలో ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చారు. భూస్వామి భార్య అతనికి స్నానం చేయించి, మంచి బట్టలు తొడిగి, కడుపునిండా భోజనం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆ పిల్లవాడు ఆరోగ్యంగా, అందంగా తయారయ్యాడు. ఆ పిల్లవాడి నవ్వులతో ఆ ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది.
అయితే, కొన్నాళ్ళ తరువాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఉన్నట్టుండి ఆ పిల్లవాడి కంటి చూపు పోయింది. సొంత కొడుకులా పెంచుకుంటున్న పిల్లవాడికి పట్టిన దుస్థితి చూసి ఆ భూస్వామి దంపతులు మళ్లీ దుఃఖంలో మునిగిపోయారు. కొంతకాలం బాధపడ్డారు. మెల్లమెల్లగా వాళ్ళ మనసు మారిపోయింది. వారి ప్రవర్తనలో కూడా ఎంతో తేడా వచ్చింది.
ఒక రోజు భూస్వామి భార్య, తన భర్తతో “వీడు మన సొంత బిడ్డ కూడా కాదు. పైగా గుడ్డివాడు. వీణ్ణి ఇక పశువుల కొట్టంలో పడేద్దాం౦” అంది.
భూస్వామి మనసు చివుక్కుమంది. అయినా భార్య మాటకు ఎదురు చెప్పలేక ఆ పిల్లవాడి మకాం పశువుల కొట్టంలోకి మార్చాడు. రాత్రి మిగిలిన కాస్త అన్నం, ఊరగాయ ముక్క పడేసి తినమనేవారు. వాడికి రోజూ ఆ చద్దన్నమే గతి. పిల్లవాడు ఎప్పుడూ చిరిగిన బట్టలతోనే తిరుగుతూ ఉండేవాడు. మెల్లమెల్లగా భూస్వామి దంపతులు ఆ పిల్లవాడితో మాట్లాడటం కూడా తగ్గించేసారు.
![]()
భూస్వామికి వేట అంటే సరదా! అతని దగ్గర ఒక మంచి తుపాకీ కూడా ఉండేది. అతడు తరచూ ఆ తుపాకీ తీసుకుని వేటకి వెళ్తూ ఉండేవాడు.
భూస్వామి ఒక రోజు అలా వేటాడుతూ వేటాడుతూ తనకి తెలియకుండానే అడవి లోపలకి వెళ్ళిపోయాడు.
అక్కడ అతనికి ఒక అందమైన జింక కనిపించింది.
వెంటనే గురి చూసి కాల్చాడు.
గురి తప్పింది.
మళ్ళీ కాల్చాడు.
మళ్ళీ గురి తప్పింది.
మూడవసారి కాల్చాడు. విచిత్రం ఆ జింక మాత్రం అక్కడ నుండి కదలలేదు.
అంతే. భూస్వామికి కోపం వచ్చింది. మరొకసారి గురిపెట్టబోతోంటే ఉన్నట్టుండి మూడు దెయ్యాలు వచ్చి అతని మీద పడ్డాయి. వాటిల్లో ఒక దెయ్యం భూస్వామి దగ్గర నుండి తుపాకీ లాక్కుంది. రెండవ దెయ్యం అతని చేతులు రెండూ వెనక్కి విరిచి కట్టింది. మూడవ దెయ్యం భూస్వామి కాళ్ళు కట్టేసింది. క్షణంలో ఆ భూస్వామి మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయాడు.
ఆ మూడు దెయ్యాలు అతన్ని ఈడ్చుకుంటూ నరకానికి తీసుకువెళ్లి ఒక లోతైన గోతిలో పడేశాయి.
ఒక రోజు గడిచింది… రెండు రోజులు గడిచాయి. మూడవ రోజుకు ఆకలి, భయంతో వణికిపోతున్న భూస్వామి దెయ్యాలతో “దయచేసి నన్ను మా ఇంటికి పంపండి. నా భార్య, ఆ గుడ్డి పిల్లవాడు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నా కోసం బెంగపెట్టుకొని ఉంటారు” అని ఆ దెయ్యాల కాళ్ళ మీద పడి బ్రతిమాలుకున్నాడు.
అప్పుడు వాటిల్లో పెద్ద దెయ్యం నవ్వుతూ “నిన్ను ఒక షరతు మీద విడిచిపెడతాం. నువ్వు శాశ్వతంగా మాకు బానిసగా ఉంటానని ఒప్పందపత్రం మీద సంతకం పెట్టాలి. సరిగ్గా రెండు వారాల తర్వాత నీ ఇంటి వాకిట్లోకి ఒక పెద్ద సుడిగాలి వస్తుంది. అది మా రాకకు గుర్తు అన్న మాట!” అంది.
ఒక దెయ్యం కాగితం, సిరా తీసుకొచ్చింది. భూస్వామి అందులో ఏమి రాసి ఉందో కూడా చదవకుండా ప్రస్తుతానికి బయటపడితే చాలు అనుకుంటూ వణుకుతున్న చేతులతో సంతకం పెట్టాడు.
ఆ తర్వాత దెయ్యాలు అతన్ని విడిచిపెట్టడం, అతడు ఇంటికి చేరుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. భూస్వామి తన పొలాలు, తోటలు, ఇల్లు కళ్ళారా చూసుకుని చాలా సంతోషించాడు. కానీ రోజులు గడిచే కొద్దీ భయం అతణ్ణి వెంటాడ సాగింది. అతని ముఖం చిన్నబోవడం భూస్వామి భార్య గమనించింది. దెయ్యాలు మళ్ళీ వచ్చేస్తాయన్న భయానికి అతని ముఖం పీక్కుపోయింది. ఒక్కసారిగా అతడి వయసు పదేళ్లు పెరిగి ముసలివాడు అయిపోయినట్టు అనిపించింది.
ఒక రోజు అతని భార్య “అసలు ఏమైంది? ఎందుకు అలా దిగులుగా ఉన్నారు?”అని అడిగింది.
ఇక దాచి లాభం లేదు అనుకుని భూస్వామి తన భార్యతో – “దెయ్యాలతో నేను ఒక ఒప్పందం చేసుకున్నాను. ఇంకో రెండు వారాల్లో అవి వచ్చి నన్ను మళ్ళీ తీసుకెళ్ళిపోతాయి. మహమ్మారి నుంచి తప్పించుకో గలిగాను కానీ ఈ దెయ్యాల బారి నుండి తప్పించుకోలేకపోతున్నాను.” అని పెద్దపెట్టున ఏడవసాగాడు.
భార్య కాసేపు మౌనంగా ఉండిపోయింది. మెల్లగా తేరుకుని తన భర్తను ఆ దెయ్యాల నుండి ఎలా రక్షించుకోవాలో ఆలోచిస్తూ కూర్చొంది.
చూస్తుండగానే రెండు వారాలు గడిచిపోయాయి. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది.
ఆ రాత్రి భూస్వామికి నిద్ర పట్టలేదు. భయంతో వణుకుతూ ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమటలు.
అర్ధరాత్రి …. అకస్మాత్తుగా బయట నుంచి వింత శబ్దాలు వినిపించసాగాయి. గాలి భయంకరంగా గర్జించింది. పైకప్పు కూడా ఎగిరిపోతుందేమో అనేంత సుడిగాలి…
అంతలో ఎవరో బయట నుంచి “ఓయ్! బయటికి రా! నీకు ఇచ్చిన గడువు పూర్తయింది.” అని మాటలు వినిపించాయి.
భూస్వామి భార్య తన భర్తతో “ఒక పని చేద్దాం. గాలికి పశువుల కొట్టం తలుపు కొట్టుకుంటోంది. గడియ వేసి రమ్మని ఆ గుడ్డి ఇవాంకోను బయటికి పంపండి.” అని సలహా ఇచ్చింది.
భూస్వామి వెంటనే ఆ గుడ్డి పిల్లవాడి చెయ్యి పట్టుకుని తలుపు దగ్గరకు తీసుకెళ్లి “నాయనా, ఇవాంకో! కాస్త బయటికి వెళ్లి పశువుల కొట్టం తలుపు సరిగ్గా వేసి రా.” అన్నాడు.
తలుపు తెరిచి, ఇవాంకోని బయటకు తోసేశాడు. అంతే! ఇంకేముంది! ఆ సుడిగాలి ఇవాంకోని గడ్డిపోచలా ఆకాశంలోకి ఎగరేసుకుని పోయింది.
ఆ సుడిగాలి ఇవాంకోను అలా తీసుకెళ్ళి చాలాసేపటి తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో దించి మాయమైంది.
ఆ సుడిగాలి ఒక భయంకరమైన దెయ్యంగా మారి “మాతో ఒప్పందం చేసుకున్న భూస్వామి నువ్వేనా?” అని కనుబొమ్మలు చిట్లించి అడిగింది.
“కాదు. నా పేరు ఇవాంకో. నేను ఒక గుడ్డివాణ్ణి. మహమ్మారి వల్ల నా తల్లిదండ్రులు చనిపోతే ఈ భూస్వామి నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ నాకు చూపు పోయిన తర్వాత, వాళ్ళు నన్ను చీదరించుకుని పశువుల కొట్టంలో పడేసారు. తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. ఎప్పుడూ పాచిపోయిన అన్నం పెట్టేవారు” అని జవాబిచ్చాడు.
ఆ దెయ్యం కొద్దిసేపు మౌనంగా నిలబడి, తర్వాత “నాతో రా.” అని ఇవాంకోను ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్లింది. బావిలోని నీటిని చేతిలోకి తీసుకుని, ఇవాంకో కళ్లపై చల్లింది.
“ఇప్పుడు నెమ్మదిగా కళ్లు తెరువు,” అని చెప్పింది.
ఇవాంకో కళ్లు తెరిచాడు. ఆశ్చర్యం! అతనికి మళ్లీ చూపు వచ్చింది.
“నాకు కనిపిస్తోంది! నేను ఇక గుడ్డివాడిని కాదు!” అంటూ ఇవాంకో ఆనందంతో కేరింతలు కొట్టాడు.
“అవును, నీ చూపు తిరిగి వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు మాకు ఒక సహాయం చేసిపెట్టాలి.” అంది దెయ్యం నవ్వుతూ.
దెయ్యం అతన్ని ఒక పెద్ద గుర్రాలశాలకు తీసుకెళ్లింది. అక్కడ నలుపు, తెలుపు, బూడిద రంగుల్లో మూడు గుర్రాలు కట్టేసి ఉన్నాయి.
“నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి రోజూ నల్ల గుర్రానికి మూడు బకెట్ల మండుతున్న నిప్పులు పెట్టాలి, మూడు కొరడా దెబ్బలు కొట్టాలి. తెల్ల గుర్రానికి రెండు బకెట్ల నిప్పులు, రెండు కొరడా దెబ్బలు. బూడిదరంగు గుర్రానికి ఒక బకెట్ నిప్పులు మాత్రం చాలు.” అని దెయ్యం ఆజ్ఞాపించింది.
తర్వాత ఆ దెయ్యం ముళ్లతో నిండిన ఒక చిన్న కొలను దగ్గరకు తీసుకెళ్లి “ఈ కొలను దగ్గరకు ఎప్పుడూ రావద్దు. ఇందులోని నీరు తాగే ప్రయత్నం అస్సలే చెయ్యొద్దు.” అని హెచ్చరించింది.
ఆ తర్వాత మూడు పెద్ద కుండలను చూపిస్తూ – “ఈ పెద్ద కుండ కింద మంట ఎప్పుడూ భగభగ మండుతూ ఉండాలి. మిగతా రెండు కుండల కింద చిన్న మంట సరిపోతుంది. కానీ వాటిలో ఏమి ఉడుకుతోందో చూసే ప్రయత్నం మాత్రం చెయ్యద్దు.” అంది.
“మీ ఆజ్ఞ శిరసావహిస్తాను” అని ఇవాంకో వినయంగా సమాధానమిచ్చాడు.
భరించలేనంత వేడి. ఆ వేడికి దాహంతో ఇవాంకో గొంతు ఎండిపోయింది. చివరికి దెయ్యం మాట మరచిపోయి, ఆ కొలను దగ్గరకు వెళ్లి దోసిట్లోకి కొద్దిగా నీళ్లు తీసుకున్నాడు.
ఆశ్చర్యం …. ఆ నీరు తాకిన వెంటనే అతని చేయి బంగారు రంగులో మెరిసిపోయింది.
“ఇదెక్కడి వింత!” అని ఆశ్చర్యపోయిన ఇవాంకో, తన ముఖాన్ని కూడా ఆ నీటితో కడుక్కున్నాడు. వెంటనే అతని తలంతా బంగారు కాంతితో మెరిసిపోయింది. దాన్ని ఎవరూ గమనించకూడదని తన టోపీని కళ్ల వరకూ లాక్కున్నాడు.
తర్వాత తిరిగి వచ్చి పెద్ద కుండ కింద మంటను బాగా రాజేశాడు. కానీ అతని మనసులో చిన్న కుతూహలం –
“అసలు ఈ కుండల్లో ఏమి ఉడుకుతోందో ఒక్కసారి చూద్దాం.” అనిపించింది.
క్షణక్షణానికీ ఇవాంకో కుతూహలం ఎక్కువయిపోయింది.
చివరకు కట్టెల గుట్ట పైకి ఎక్కి ఆ పెద్ద కుండలోకి తొంగి చూసి ఇవాంకో ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టాడు.
నల్లని తారులో భూస్వామి, అతని భార్య ఇద్దరూ కుతకుతమని ఉడుకుతున్నారు!
వాళ్ళు ఇవాంకోను గుర్తుపట్టి “ఇవాంకో! ఈ మంటని తట్టుకోలేకపోతున్నాం. నీకు పుణ్యం ఉంటుంది, మంట కాస్త తగ్గించు. ఈ వేడికి మా ఎముకలు కూడా కరిగిపోయేలా ఉన్నాయి!” అని వేడుకున్నారు.
“మంట తగ్గించమంటారా? అసలు తగ్గించను” అని ఇవాంకో వాళ్ళకి ప్రశాంతంగా జవాబు చెప్పాడు.
ఆ మొగుడు-పెళ్ళాలు ఇద్దరూ “మేము నీకు ఏం అపకారం చేశామని ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు?” అని అడిగారు.
“మీరిద్దరూ కలిసి కుట్ర పన్ని నన్ను దెయ్యాలకి అప్పగించారు. మీకు తగిన శాస్తి జరిగింది” అన్నాడు.
“మేము ఎంతకాలం ఇలా ఉడుకుతూ ఉండాలి?” అని అడిగారు వాళ్ళు.
“మీ పాపాలకు తగిన శిక్ష పూర్తయ్యే వరకు” అని చెప్పి ఇవాంకో మరికొన్ని కట్టెలను మంటలో వేసి, అక్కడి నుంచి గుర్రాల దగ్గరకు వెళ్లిపోయాడు.
గుర్రాల దగ్గరకు వెళ్లి కొరడా ఝుళిపించబోయాడు.
అప్పుడు బూడిద రంగు గుర్రం “మమ్మల్ని ఎందుకు కొట్టబోతున్నావు?” అని మృదువుగా అడిగింది.
“ఇది పెద్ద దెయ్యం ఆజ్ఞ” అని ఇవాంకో కంచుకంఠం తో జవాబు చెప్పాడు.
గుర్రం మెల్లగా “ఆ దెయ్యం మాట వినకు. మాకు కూడా నీకులాగా ప్రాణం ఉంది. ఈ రోజు మమ్మల్ని కొడతావు. రేపు అదే దెయ్యం నిన్ను కూడా గుర్రంగా మార్చి నిప్పులు తినిపించి, కొరడాతో కొడుతుంది. అందుకే మనం ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది” అంది.
ఇవాంకో కాసేపు ఆలోచించి, గుర్రం మాటల్లోని నిజం గ్రహించినట్టు మెల్లగా తల ఊపాడు.
“అయితే ముందుగా మా కట్లు విప్పు,” అని గుర్రం అరిచింది.
వెంటనే ఇవాంకో మూడు గుర్రాల కట్లు విప్పదీసాడు. బూడిద రంగు గుర్రం మీద ఇవాంకో సవారీ అయితే మిగిలిన రెండు గుర్రాలు, అతణ్ణి అనుసరించాయి.
అలా వారు నరకం నుంచి స్వేచ్ఛ వైపు దూసుకుపోయారు.
ఈ తతంగం అంతా జరిగేటప్పుడు నరకంలోని పెద్ద దెయ్యం సుష్టుగా తిని నిద్రపోతోంది. అకస్మాత్తుగా అక్కడ కలకలం రేగింది.
“గుర్రాలు పారిపోయాయి! ఆ గుడ్డి పిల్లవాడు కూడా వాటితో కలిసి తప్పించుకున్నాడు!” అని మిగతా దెయ్యాలు కేకలు వేశాయి.
ఆ మాట విన్న పెద్ద దెయ్యం ఉలిక్కిపడి నిద్ర లేచింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పారిపోతున్న వారి వెంట పడింది. అసలు ఆ దెయ్యం కాళ్లు నేలను తాకుతున్నాయా లేదా అన్నంత వేగంగా పరిగెత్తింది.
కొంతసేపటికి ఇవాంకో భుజాలు మంటలు అంటుకున్నట్టు కాలిపోతున్నట్లు అనిపించాయి.
“ఓ గుర్రమా! నా భుజాలు భరించలేనంతగా మండుతున్నాయి. దెయ్యం మనకు చాలా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి?” అని అడిగాడు.
బూడిదరంగు గుర్రం ప్రశాంతంగా “భయపడకు మిత్రమా! నా కుడి చెవిలో రెండు తువ్వాళ్లు ఉన్నాయి. వాటిని తీసి, దెయ్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక తువ్వాలు దాని మీదికి విసిరేయి” అని చెప్పింది.
దెయ్యం చాలా దగ్గరకు రాగానే ఇవాంకో ఒక తువ్వాలు విసిరాడు.
అది మామూలు తువ్వాలు కాదు. క్షణంలోనే అది దెయ్యం తల చుట్టూ గట్టిగా బిగుసుకుంది. ఏమీ కనిపించక దెయ్యం ఒక రాయిని గుద్దుకుని బోర్లాపడింది. తువ్వాలు విప్పుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది మరింత బిగుసుకుపోయింది. చివరకు ఎలాగో విడిపించుకుని దెయ్యం మళ్లీ ఆ గుర్రాలను తరమడం మొదలుపెట్టింది. అప్పటికే ఇవాంకో చాలా దూరం వెళ్లిపోయాడు.
అయినా దెయ్యం ఆగలేదు. వేగం పెంచి వారిని వెంబడించింది.
మరి కాసేపటికి ఇవాంకో గుర్రంతో ”గుర్రమా! మళ్ళీ నా భుజాలు మండుతున్నాయి. అది మన దగ్గరకు వచ్చేస్తోంది అనుకుంటా” అన్నాడు.
“రెండో తువ్వాలును కూడా విసిరేయి,” అంది గుర్రం.
ఇవాంకో రెండో తువ్వాలును కూడా దెయ్యం వైపు విసిరాడు.
వెంటనే దెయ్యం చుట్టూ దట్టమైన చీకటి అలుముకుంది. దెయ్యానికి ఏమీ కనిపించలేదు. బురదలో, మట్టిలో పడుతూ లేస్తూ దారి తప్పిపోయింది. చివరకు నానా అవస్థలు పడుతూ మళ్లీ వారిని వెంబడించడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే ఇవాంకో చాలా దూరం వెళ్లిపోయాడు.
కొద్దిసేపటికే దెయ్యం మరోసారి దగ్గరకి వచ్చేసింది. ఈసారి ఇవాంకో భుజాలు మరింతగా మండిపోతున్నాయి.
“గుర్రమా! ఇక నేను కాలిపోతానేమో! ఇప్పుడు ఏం చేయాలి?” అని ఇవాంకో కంగారు పడ్డాడు.
“నా ఎడమ చెవిలో ఉన్న కొరడాను తీసి, దెయ్యం కాళ్ల దగ్గర పడేయి” అంది బూడిద రంగు గుర్రం.
ఇవాంకో వెంటనే గుర్రం చెప్పినట్లే దాని ఎడమ చెవిలో నుంచి కొరడా తీసి దెయ్యం కాళ్ల ముందు పడేసాడు.
నేలను తాకగానే కొరడాకి ప్రాణం వచ్చినట్టు లేచి దెయ్యాన్ని చుట్టుముట్టింది. గాలిని చీల్చుకుంటూ దాని మీద విరుచుకుపడింది.
తీవ్రమైన కొరడా దెబ్బల నొప్పితో దెయ్యం విలవిల్లాడిపోయింది. ముందుకు వెళ్లాలని ఎంతగా ప్రయత్నించినా కొరడా తన పట్టు బిగిస్తూనే ఉంది. చివరకు ప్రాణాలు దక్కితే చాలు భగవంతుడా అనుకుని కాళ్ళకు బుద్ధి చెప్పి ఆ దెయ్యం తిరిగి నరకం వైపుకు పారిపోయింది. అయినా ఆ కొరడా మాత్రం దెయ్యాన్ని వదిలిపెట్టకుండా తరుముతూనే ఉంది.
ఇవాంకో, బూడిద రంగు గుర్రంతో సహా రాజధాని నగరానికి చేరుకున్నాడు.
అక్కడ గుర్రం ఆగి ఊపిరి పీల్చుకుని “ఇక్కడి నుండి నీ దారి నీది, నా దారి నాది. నా జూలు నుంచి మూడు వెంట్రుకలు పీకు. ఎప్పుడైనా నీకు కష్టం వచ్చినప్పుడు వాటిలో ఒక వెంట్రుకను తుంచితే, నేను వెంటనే ప్రత్యక్షమయ్యి నీకు సహాయం చేస్తాను” అని చెప్పింది.
ఇవాంకో, ఆ గుర్రం చెప్పినట్టే దాని మూడు వెంట్రుకలు పీకి జాగ్రత్తగా దాచుకున్నాడు. వెంటనే గుర్రం గాలిలోకి ఎగిరి మాయమయిపోయింది.
ఇవాంకో మాత్రం ఆకలితో అలమటిస్తూ నగరంలో ఏదయినా పని దొరుకుతుందేమో అని తిరగసాగాడు.
అతని శరీరం బంగారు కాంతితో మెరిసిపోతుండటంతో అందరూ అతణ్ణి ఆశ్చర్యంగా చూసేవారు. కానీ ఎవరూ పని మాత్రం ఇచ్చేవారు కాదు.
“ఇతను మనలాంటి మనిషి కాదు. బంగారం రంగులో ఉన్నాడు. వేరే లోకం మనిషి అయ్యి ఉండొచ్చు!” అని పని ఇవ్వడం మాట దేవుడెరుగు, ఎవరూ అతనితో స్నేహంగా మాట్లాడేవారు కూడా కాదు.
ఇవాంకో ఒకరోజు రాజమహల్ పక్క సందులో నడుచుకుంటూ వెళ్తున్నారు.
అతనికి అక్కడ ఒక విశాలమైన తోట కనబడింది. తోటలోకి వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్న తోటమాలికి నమస్కరించి “ఇక్కడ నాకు ఏదైనా పని దొరుకుతుందా?” అని అడిగాడు.
తోటమాలి ఇవాంకోని ఎగాదిగా చూసి, “నువ్వు ఏం పని చేయగలవు?” అని అడిగాడు.
“మీరు ఏ పని చెప్పినా చేస్తాను,” అని ఇవాంకో ఎంతో వినయంగా జవాబు చెప్పాడు.
“అయితే ఈ తోటలోని పూలు, చెట్లను కత్తిరించి చక్కగా, అందంగా తీర్చిదిద్దు. కానీ జాగ్రత్త! పొరపాటున ఏ ఒక్క మొక్క వాడిపోయినా, నీ తల తెగిపోతుంది చూసుకో” అని హెచ్చరించాడు.
అదే రోజు ఇవాంకో తోటపనిలో చేరిపోయాడు.
ఇవాంకో తన పని ఎంతో శ్రద్ధగా చేసేవాడు.
ఆ తోటలో రాజకుమారికి ఎంతో ఇష్టమైన మూడు అరుదైన పూల మొక్కలు ఉండేవి.
ఒక రోజు తెలియక ఇవాంకో వాటినీ కత్తిరించేసాడు. క్షణాల్లో ఆ మూడు మొక్కలు వాడిపోయాయి.
ఇవాంకో గుండె దడదడలాడింది.
“ఇంక నా తల తెగిపోయినట్టే!” అని భయపడిపోయాడు.
ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. రాజకుమారి ఉదయం వచ్చి ఈ పూల మొక్కలను చూసింది అంటే తనకు మరణశిక్ష ఖాయమని భయపడ్డాడు.
బూడిద రంగు గుర్రం తాలూకు మూడు వెంట్రుకల సంగతి గుర్తొచ్చింది.
వెంటనే వాటిల్లో నుంచి ఒక వెంట్రుకను తీసి తుంచాడు.
క్షణంలో గుర్రం అతని ముందు ప్రత్యక్షమైంది.
“ఏమైంది, మిత్రమా? ఎందుకు పిలిచావు?” అని అడిగింది.
ఇవాంకో తన బాధను చెప్పుకుని రక్షించమని వేడుకున్నాడు. “రేపు ఉదయానికి రాజభవనం చుట్టూ ఉన్న కంచె మొత్తం వజ్రాల కంచెగా మారాలి. నాకు ఈ సహాయం చేసిపెట్టు” అని ప్రాధేయపడ్డాడు.
గుర్రం చిరునవ్వుతో, “నీ కోరిక నెరవేరుతుంది. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో” అని చెప్పి గుర్రం మాయమైంది.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన ఇవాంకో ఆ వింత చూసి ఆశ్చర్యపోయాడు.
రాజభవనం చుట్టూ ఉన్న మామూలు ఇనప కంచె స్థానంలో ధగధగలాడుతున్న అద్భుతమైన వజ్రపు కంచె కనిపించింది. ఇవాంకో అంత మిరుమిట్లుగొలిపే దాని వెలుగుని నేరుగా చూడలేకపోయాడు.
తోటమాలి నమ్మలేనట్టుగా ఆశ్చర్యంతో కంచె చుట్టూ తిరిగి చూస్తున్నాడు.
కొద్దిసేపటికే రాజకుమారి తోటలోకి వచ్చింది.
వజ్రపు కంచెను చూసిన ఆనందంలో రాజకుమారి వాడిపోయిన పూల మొక్కల సంగతి పూర్తిగా మరిచిపోయింది.
“ఈ అద్భుతమైన కంచెను ఎవరు నిర్మించారు?” అని తోటమాలిని అడిగింది.
“నాకు తెలియదు, యువరాణీ. బహుశా ఇది నా దగ్గర పనిచేస్తున్న ఇవాంకో పని అయి ఉండొచ్చు” అని తోటమాలి సమాధానమిచ్చాడు.
వెంటనే ఇవాంకోను పిలిపించారు.
“నీ పేరు ఏమిటి?” అడిగింది రాజకుమారి.
“ఇవాంకో.”
“ఈ వజ్రపు కంచెను నిర్మించింది నువ్వేనా?”
“అవును.”
“ఇంత అద్భుతాన్ని ఎలా చేయగలిగావు?”
ఇవాంకో చిరునవ్వుతో, “ఇలాంటి కంచెలను నిర్మించే ప్రతిభ నాకు ఉంది,” అని చెప్పాడు.
రాజకుమారి అతని వైపు చూసింది. ఆ క్షణమే ఆమెకు ఇవాంకో పట్ల ఇష్టం ఏర్పడింది. నిజానికి వజ్రపు కంచె కంటే అతని సౌమ్య స్వభావమే ఆమెను ఎక్కువగా ఆకర్షించింది.
“నాతో రా… కొద్దిసేపు తోటలో అలా కలిసి నడుద్దాం,” అని మృదువుగా చెప్పింది.
మరుసటి రోజే మహారాజు తన ఏకైక కుమార్తెకు వివాహం జరగబోతోందని, ప్రపంచంలోనే అత్యంత అందమైన పూలగుత్తిని తీసుకొచ్చిన యువకుడే ఆమెను వివాహం చేసుకుంటాడని రాజ్యం అంతటా దండోరా వేయించాడు.
ఆ వార్త నాలుగు దిక్కులా వ్యాపించింది. ఎక్కడెక్కడి రాజులు, యువరాజులు, ధనవంతులు, గొప్పింటి కుర్రాళ్ళు అపురూపమైన పూలగుత్తులతో రాజభవనానికి తరలి వచ్చారు.
విషయం తెలిసి ఇవాంకో మనసు గాయపడింది. ఎందుకంటే అతను రాజకుమారిని ప్రేమిస్తున్నాడు.
తోటలోనే అటూ-ఇటూ తిరుగుతూ ఒక్కసారైనా ఆమె కనిపిస్తుందేమో అని ఎదురుచూశాడు.
చివరకు రాజకుమారి స్వయంగా ఇవాంకో దగ్గరకి వచ్చి చిరునవ్వుతో “నువ్వు నాకు పూలగుత్తి తీసుకురాకపోతే… నేను అసలు పెళ్లే చేసుకోను” అంది.
ఆ ఒక్క మాట చెప్పి ఆమె గబగబా వెనుదిరిగి రాజభవనంలోకి వెళ్లిపోయింది.
ఇవాంకో ఆశ్చర్యంతో అక్కడే నిలబడి పోయాడు.
ఆ రాత్రి అతను బూడిదరంగు గుర్రం ఇచ్చిన రెండో వెంట్రుకను తుంచాడు.
క్షణంలో గుర్రం ప్రత్యక్షమైంది.
“ఏం కావాలి, మిత్రమా?” అని అడిగింది.
“రేపు ఉదయం కల్లా ప్రపంచంలో ఎవరూ ఎప్పుడూ చూడని అత్యంత అద్భుతమైన పూలగుత్తి నాకు కావాలి” అని ఇవాంకో వినయంగా అడిగాడు.
గుర్రం నవ్వుతూ, “బెంగపెట్టుకోకు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ప్రశాంతంగా నిద్రపో,” అని చెప్పి మాయమైంది.
తెల్లవారుజామున ఇవాంకో కళ్లు తెరిచేసరికి, తన బల్ల మీద ఒక అద్భుతమైన పూలగుత్తి కనిపించింది.
అందులో తెలుపు, పసుపు, ఎరుపు, నీలం… ఇలా అన్ని రంగుల పూలూ ఉన్నాయి. కానీ అవి మామూలు పువ్వులు కావు. వాటి మహిమే వేరు! ప్రతి పువ్వు సూర్యుడిలా ప్రకాశిస్తూ వెలుగులీనుతోంది.
ఇంత అద్భుతమైన పూలగుత్తిని ప్రపంచంలో ఎవరూ ఎప్పుడూ చూడలేదు.
ఇవాంకో ఆ పూలగుత్తిని రాజభవనానికి తీసుకెళ్లి, రాజాధిరాజులు, యువరాజులు, ధనికులు తీసుకువచ్చిన పూలగుత్తుల మధ్య ఉంచాడు.
మరుసటి రోజు మహారాజు అందరినీ సభకు రమ్మని ఆదేశించాడు.
కానీ ఇవాంకోకు మరొక సమస్య ఎదురైంది.
“ఇలాంటి చిరిగిన బట్టలతో సభకు ఎలా వెళ్ళేది?” అని బాధపడ్డాడు.
వెంటనే గుర్రం ఇచ్చిన మూడో వెంట్రుకను కూడా తుంచేసాడు.
బూడిద రంగు గుర్రం మళ్లీ ప్రత్యక్షమై, “ఈసారి నీకు ఏం కావాలి?” అని అడిగింది.
“ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన రాజులు కూడా అసూయపడేంత గొప్ప వస్త్రాలు కావాలి నాకు.” అని అడిగాడు ఇవాంకో.
గుర్రం చిరునవ్వుతో, “రేపు ఉదయం నీ కోరిక నెరవేరుతుంది” అని చెప్పి మాయమయిపోయింది.
మరుసటి ఉదయం ఇవాంకో లేచి చూసేసరికి, అతని కోసం అద్భుతమైన రాజవస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి.
ఇవాంకో వాటిని ధరించి రాజభవనానికి చేరుకున్నాడు.
అక్కడ దేశదేశాల రాజులు, యువరాజులు, ప్రభువులు, గొప్ప వంశస్థులు అప్పటికే సభలో కూర్చుని ఉన్నారు.
ఇవాంకో మహారాజుకు, మహారాణికి, రాజకుమారికి నమస్కరించి మౌనంగా ఒకవైపు నిలబడ్డాడు.
రాజు ఒక్కొక్క పూలగుత్తిని పరిశీలిస్తున్నాడు. ఇవాంకో తీసుకొచ్చిన పూలగుత్తి ముందు మిగిలిన రాజులు, యువరాజులు తీసుకొచ్చిన పూలగుత్తులు అన్నీ వెలవెలబోయాయి.
రాజకుమార్తె కూడా అదే పూలగుత్తిని ఎంచుకుని చిరునవ్వుతో, “నాకు ఈ పూలగుత్తే కావాలి” అని ముసిముసినవ్వులు నవ్వుతూ చెప్పింది.
అదే రోజు ఇవాంకో వివాహం రాజకుమారితో అంగరంగ వైభవంగా జరిగిపోయింది.
![]()
ఆ రోజు పనీపాట లేక ఊరికే అవారాగా అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి రాజధాని నగరం చేరుకున్నాను. రాజభవనంలో నుండి మంచి పాటలు, డ్యాన్సుల సందడి వినిపించడంతో, “సరే, ఒక గ్లాసు వోడ్కా అయినా తాగి వెళ్దాం” అనుకుని లోపలికి అడుగుపెట్టాను. తీరా చూస్తే అక్కడ ఎంతో అట్టహాసంగా ఒక పెళ్లి వేడుక జరుగుతోంది! నేను ఎవరో తెలియకపోయినా వాళ్ళు నన్ను కూడా ఆహ్వానించి ఎంతో ఆప్యాయంగా అతిథ్యం ఇచ్చారు. ఆ పెళ్లి వేడుకలో జరిగిన మరెన్నో విశేషాలను మీ అందరితో పంచుకోవాలి …. సిద్ధంగా ఉండండి. వస్తున్నా! వచ్చేస్తున్నా!
![]()



