మూలం: హృషికేశ్ పాండా
తెలుగు అనువాదం: స్వాతీ శ్రీపాద
ఆగస్ట్ 1983 రెండో వారం.
జనం గట్టిగా నమ్మిన పుకారు గ్రామస్థుల మధ్య చక్కర్లుకొడుతోంది, పులి ఒకటి అడవి బయటకు వచ్చి గ్రామాల్లో తిరుగుతోందని. ముందుగా పెద్ద సింధబా గ్రామపు వయసు మళ్లిన ఓ స్తీ వంట చెరుకు సేకరణ కోసం అడవికి వెళ్తే పులి లాక్కుపోయిందని. ఆ తరువాత కొందరు ఆ ముసలిదాన్ని చూసామనీ, ఆవిడ బతికే ఉందనీ అన్నారు. కొందరు పులి చిన్న సింధబా గ్రామం కమ్యూనిటీ నుండి ఓ చిన్న బిడ్డను లాక్కుపోయిందనీ, పెద్ద సింధబా ముసలావిడను కాదనీ గట్టిగా చెప్పారు. బయట తిరిగే పులికి భయపడి టీచర్లు స్కూళ్ళను తొందరగా మూసేసి పిల్లలను మధ్యాన్నానికల్లా ఇళ్ళకు పంపేస్తున్నారు. పులి ఎవరినైనా ఆహారంగా వేటాడిందో లేదో అనేది అనుమానపడినా, అడవి దాటి అది బయటకు వచ్చిందని మాత్రం అందరూ నమ్మారు.
19, ఆగస్ట్, 1983
ఉధియా గమంగా గ్రామం హికేరిమా, వయసు ముప్పై అయిదు, వృత్తి- ప్రభుత్వ ఉద్యోగి (హికేరిమాకు ఏడు కిలోమీటర్ల దూరం లో ఉన్న హులూరుపలి గ్రామ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో టీచర్,). మామూలుగా గమంగా మాస్టర్ అని పిలుస్తారు, స్కూల్ కి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు. మిసెస్ గమంగా అతను పులి వల్ల స్కూల్లోనే ఉండిపోయాడో , అతనికి మంచో, చెడో, ఏదో జరిగిందేమోనని ఊగిసలాడుతూ రాత్రి గడిచే కొద్దీ ఆదుర్దాపడిపోయి కాలుగాలిన పిల్లిలా తచ్చాడింది. వీళ్ళు సాధారణంగా రాత్రి భోజనం త్వరగానే ముగిస్తారు. సూర్యాస్థమయం అయి ఒకటి రెండు గంటలు కాగానే, ఎంత ఆదుర్దాగా ఉన్నా, భర్త వస్తాడని ఎదురుచూస్తూ, పిల్లలతో ” మీ నాన్న నిర్లక్ష్యంగా వేళకు రాకపోయినంత మాత్రాన మీరు ఆకలితో ఉంటారా?” అంటూ వాళ్ళకు భోజనాలు పెట్టింది. పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. ఆమె ఎదురు చూస్తూనే ఉంది. ఏం చెయ్యాలన్నా అప్పటికే ఆలస్యమయింది, చీకటి పడిపోయింది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు మిస్టర్ గమంగాను వెదకమని ఎవరినైనా పంపడం ఎలా? మౌనంగానే భర్తను గట్టిగానే తిట్టుకుని, గొణుక్కుంది, ” ఏం మనిషో ఏమిటో, రాత్రి ఎవరితోనో సరసాలాడుతూ ఉండిపోయాడేమో, ఏమీ చెప్పడు. నేను ఇక్కడ కలవరపడి పోతా, నిలువెల్లా వణికి చస్తున్నా . రేపు ఇంటికి రానీ చెప్తాను. పెద్ద యుద్ధమే చెయ్యాలి. ”
20, ఆగస్ట్, 1983
మూడో తరగతి లో ఉన్న కొడుకు, బైరాగి స్కూల్ కి వెళ్లబోతుంటే మిసెస్ గమంగా వాడితో రాధు రైతా, లంజు రైతాలకు కబురుపంపింది. రాధు, లంజు లకు సైకిల్ నడపడం తెలుసు. వాళ్ళకు స్వంత సైకిళ్ళున్నాయి, డబ్బు తీసుకునో, తీసుకోకుండా కూడా జనాలకు సాయం చేస్తుంటారు. వాళ్ళు గమంగా మాస్టర్ ను స్కూల్లోనూ చుట్టుపక్కలా గాలించారు. పులి తిరుగుతోందని వార్త వచ్చిన రోజుమొదలుకుని మధ్యాన్నమే పులి భయానికి స్కూల్ మూసేసే వెళ్తున్నట్టే ఆ ముందు రోజు ఒక గంట ముందే వెళ్ళిపోయాడని తెలుసుకున్నారు. వీధుల్లోనూ, సందుల్లోనూ, వారపు సంతల్లోనూ, స్నాన ఘట్టాల్లోనూ, గ్రామ దేవతలను, నదీ దేవతలనూ కూడా అడిగారు. జీవితం మొత్తం లో స్కూల్ ను, గమంగా మాస్టర్ ను చూడని జనాలను కూడా అడిగారు. ఒకడు మాత్రం తను గమంగా మాస్టర్ ను చూసానని అన్నాడు. అయితే, ఒక సారి తల గోక్కుని అది క్రితం రోజు కాదనీ ఆ ముందు రోజు చూసానని అన్నాడు. అక్కడ అందరికీ తెలుసు ఒక నరభక్షకి పులి తిరుగుతోందని. సాయంత్రం కాకముందే =హికేరిమా తిరిగి వచ్చి మిసెస్ గమంగా కి చెప్పి తమ ఇళ్ళకు వెళ్లబోతుంటే మిసెస్ గమంగా ఆపి అతని బంధువులు, మిత్రులు ఉన్న ఊళ్ళకు వెళ్ళి చూడమని కోరింది. ” నువ్వు మమ్మల్ని పులినోట్లోకి తోస్తున్నావు” అని గొణిగి వెళ్లిపోయారు.
21, ఆగస్ట్, 1983
అంతకు ముందు రోజు మిసెస్ గమంగా చెప్పిన ఊళ్ళకు పొద్దున్నే రాధు, లంజు వెళ్ళారు. అక్కడ గమంగా మాస్టర్ కనబడలేదు. ఆ రోజున ఎలాగైనా తిరిగి వస్తాడులే అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మర్నాడు తిరిగి రాచ్చునని ఆ రాత్రికి పులి బారిన పడకూడదని ఆ ఊళ్ళో ఉండిపోయారు.
22, ఆగస్ట్, 1983
పొద్దున్నే ఇద్దరు హీరోలూ హికేరిమా కు తిరిగి వచ్చారు. వచ్చీ రాగానే వాళ్లు చూసినది తులసిని. పదహారేళ్ళ తులసి గమంగా మాస్టారి కూతురు. స్కూల్ టీచర్ కూతురు అవడంతో ఆ పిల్ల పదకొండో క్లాస్ పాసయింది. గమంగా మాస్టర్ తిరిగి రాలేదు. మిసెస్ గమంగా వాళ్ళ గొంతులు విని బయటకు పరుగెత్తుకు వచ్చి ” ఏమైనా తెలిసిందా?” అని అడిగింది.
” లేదు, ఏ విషయమూ తెలియలెదు.”
” మీరెందుకూ పనికి రాని వాళ్ళు. వెళ్ళి విశ్వనాథ్ మాస్టారి ఊళ్ళో చూసిరండి. ” అంది. విశ్వనాథ్ మాస్టారు సప్తమగిరి ఊళ్ళో ఉంటాడు, అది హికేరిమా పొలిమేరల్లో ఉంది.
లంజు , రాధు సప్తమ గిరి వెళ్ళారు. విశ్వనాథ్ ఆచారి ఇంట్లో లేడు. అతని కొడుకు త్రినాథ్ ఉన్నాడు, అదే అతను చెప్పాడు. ఆ ఇద్దరు హీరోలను త్రినాథ్ కాస్సేపాగి రమ్మన్నాడు. కాస్సేపాగి ఇద్దరు హీరోలూ వెళ్తే విశ్వనాథ్ అప్పటికే ఎంతో హడావిడిగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
23, ఆగస్ట్, 1983
ఊరి మంత్రసానిని తీసుకుని మిసెస్ గమంగా పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉన్న పొలీస్ స్టేషన్ కు వెళ్ళింది. పొలీస్ స్తేషన్ ఇంచార్జ్ ఆఫీసర్ రాలేదు. అతని డెప్యుటీ సార్జంట్ అధికారి లేనందున ఆమె ఫిర్యాదు తీసుకుందుకు నిరాకరించాడు.
24, ఆగస్ట్, 1983
పొలీస్ స్టేషన్ లో ఓ ఐ సీ ఉన్నాడు. అతను మిసెస్ గమంగాను పూర్తిగా విచారించాడు. అవే అవే ప్రశ్నలు తిప్పి తిప్పి, వేరు వేరు స్వర స్థాయిలలో అడిగాడు. అంత తిప్పి తిప్పి అడిగడంతో చివరికి మిసెస్ గమంగా తనే ఒక ఆడపులి ననీ, తనభర్తను తనే తినేసాననీ అనుకుంది. ఆఫీసర్ పిటీషన్ మళ్ళీ స్పష్టంగా, తన విచారణకు సరితూగేలా వ్రాసి తెమ్మని చెప్పాడు. మిసెస్ గమంగా బయటకు వెళ్ళి కొత్త కంప్లెయింట్ వ్రాసుకుని మళ్ళీ పొలీస్ స్టేషన్ కు వచ్చింది. ఎవరో రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వస్తున్నాడని ఆఫీసర్ వెళ్ళిపోయాడు. సార్జంట్ ఆమెకు సలహా ఇచ్చాడు, ” నరభక్షక పులి తిరుగుతోంది. వెంటనే మీ గ్రామానికి వెళ్ళిపొండి” అని.
25 , ఆగస్ట్, 1983
మిసెస్ గమంగా తన పిటీషన్ పొలీస్ ఆఫీసర్ ముందుంచింది. ఆ ఆఫీసర్ ఆమెను ఏడు రోజుల తరువాత రమ్మన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, “ఏడురోజులా? , నా మగడు ఏడు రోజులు ఎక్కడికి వెళ్తాడు?” అని అడిగింది.
ఆఫీసర్ జవాబిచ్చాడు, ” అయితే , నేనిప్పుడు వెళ్ళి అతన్ని ఏ చెట్టు నుండి తెంపుకు రాను? ఎక్కడో తాగి పడి దొర్లుతూ ఉంటాడు. లేదా పులి ఈడ్చుకుపోయి ఉండాలి.”
26, ఆగస్ట్, 1983
పొలీస్ ఆఫీసర్ వ్యంగ్యాన్ని లెఖ్క చెయ్యకుండా మిసెస్ గమంగా మళ్ళీ పొలీస్ స్టేషన్ కు వెళ్ళింది. సార్జంట్ కరిచినట్టుగానే అన్నాడు, “ఎహ్, ఇదేమైన మాంత్రికుడి ఇల్లా లేకపోతే దేవతా నివాసమా, నిన్న నువ్వు పిటీషన్ ఇచ్చి వెళ్లగానే ప్రేతాత్మలను పిలిచి నీ మొగుడిని తెచ్చి ఈ రోజు నీ ముందు నిల్చోబెట్టడానికి?”
మిసెస్ గమంగా కు పై ప్రశ్నలకు జవాబు తెలియకపోడంతో పొలీస్ స్టేషన్ వరండాలో కాస్సేఫు గడిపి, ఆ బిల్డింగ్ ముందున్న మర్రి చెట్టు కిందకు వెళ్ళింది. సాయంత్రం అయ్యాకనే ఇల్లు చేరుకుంది. తులసి వాడిపోయిన మొహం చూసి, ” ఏమిటే, రోజంతా నువ్వేమీ తిననే లేదా?” అని అడిగింది.
తులసి కన్నీళ్ళు ఆపుకుంటూ ” అమ్మా, నువ్వు అయిదు రోజులుగా ఏమీ తిననే లేదు.” అంది.
కాస్సేపయాక తులసి గుసగుసగా ” నేనిది అనకూడదు గాని, నీకు బాధనిపించినా, ఇవాళ త్రినాథ్ వచ్చాడు. నేనతన్ని పంపేసాను.” అని చెప్పింది.
మిసెస్ గమంగా “ఉష్” అని మరి మాట్లాడలేదు.
27, ఆగస్ట్, 1983
పొలీస్ ఆఫీసర్ మళ్ళీ మరోసారి మిసెస్ గమంగాను చాలా సేపు క్షుణ్ణంగా విచారించాడు. విచారణ పుర్తయాక ఆమె పొలీస్ స్టేషన్ ఉన్న ఊరంతా తిరిగింది. ప్రతి ప్రభుత్వ అధికారికీ, ప్రభుత్వ అధికారులు కాని వారికీ , ఏ ప్రభుత్వానికీ పని చెయ్యకపోయినా ఊరివాళ్ళకూ తన భర్త అదృశ్యం గురించి చెప్పింది. మిసెస్ గమ్ంగా కథ మొదలుపెట్టగానే వాళ్ళు కొంత ఆసక్తి కనబరిచారు, కాని ఆమె ముగించే సరికి చల్లగా జారుకున్నారు. అందరూ కాదు, వారిలో స్థానిక గిరిజనాభివృద్ధి ఇంచార్జ్ ఆఫీసర్ మిస్టర్ పట్నాయక్, ప్రత్యేకంగా నిజాయితీ పరుడూ, పేరున్నవాడూ, శక్తివంతుడైన అధికారీ కాడు, కాని తనను తాను తన అధీనంలో ఉన్న పది గ్రామాల గిరిజనులందరికీ సంరక్షకుడిగా భావిస్తాడు. ప్రతి వివరమూ తన అధికారిక నోట్ బుక్ లో వ్రాసుకుంటాడు.
28, ఆగస్ట్, 1983
మిస్టర్ పట్నాయక్ , అధికార శక్తులున్న తన పై అధికారిని కలిసి ఈ మొత్తం విషయంలో ఏదో దోషం ఉన్నట్టుందని అతనికి నచ్చజెప్పాలని చూసాడు. అతని పై అధికారి గంభీరంగా అన్నాడు, ” నీ పని నువ్వు చెయ్యి, పోలీసులను వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోనివ్వు. ఇంతకీ ఆ కల్వర్ట్ కట్టడం పూర్తి చేశావా?”
29, ఆగస్ట్, 1983
మిస్టర్ పట్నాయక్ జిల్లా పొలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్ చేరుకున్నాడు. కాని జిల్లా పొలీస్ హెడ్ ఎవరో వీఐపీ, బహుశా రాష్ట్ర గవర్నర్ కావచ్చు, వచ్చాడని వెళ్ళిపోయాడు. స్థానిక వార్తా పత్రికలలో ఈ కింది వార్త ప్రచురించారు,
గమంగా మాస్టర్ గా పిలవబడే మిస్టర్ ఉధియా గమంగా అలియాస్ ఉధబ్ గమంగా, 37 యేళ్ళ వాడు, నలుపు చాయ, చదునుగా ఉండే చిన్న ముక్కు, కొంచం బట్టతల, ఉంగరాల జుట్టు, ఎత్తు అయిదడుగుల నాలుగు అంగుళాలు, ఒరియా, ఇంగ్లీష మాట్లాడ గలడు, ఈ నెల 19 నుండి కనిపించడం లేదు. ఎవరైనా దయచేసి అతని గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తెలుపగలరు…
30, ఆగస్ట్, 1983
స్థానిక వార్తా పత్రికలో వచ్చిన ఒక కథనం
ముగ్గురు మనుషులు కనిపించడ లేదు.
(మా స్వంత విలేఖరి)
మన జిల్లా అటవీ ప్రాంతం లో ఒక నరభక్షక పులి తిరుగుతోంది. ఆ పులి డెబ్బై యేళ్ళ ముసలి స్త్రీని, ఎనిమిదేళ్ళ బిడ్డనూ ( ఆడా, మగా అనేది చెప్పలేదు) ముప్పై ఏడేళ్ళ స్కూల్ టీచర్ నూ చంపేసిందని జనం నమ్ముతున్నారు. ఈ సీరియస్ విషయం లో జిల్లా అధికారుల నిర్లక్ష్య ధోరణికి జనంకోపంతో చెలరేగిపోతున్నారు.
31, ఆగస్ట్, 1983
జిల్లా పొలీస్ సూపరింటెండెంట్ మిస్టర్ పట్నాయక్ తో , ” నువ్వు రాజకీయాల్లో చేరవలసిన వాడివి” అంటూ పెద్దగా నవ్వాడు. మిస్టర్ పట్నాయక్ అతన్ని ” సర్, ఒక్కసారి ఈ విషయం విచారణ జరిపించండి.” అంటూ బ్రతిమాలాడు.
3, సెప్టెంబర్ 1983
ప్రాధమిక విచారణ జరిపాక ఎస్పీ ఏదో జరుగుతోందని అనుమానం వచ్చి సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించుకున్నాడు.
5, సెప్టెంబర్ 1983
హికేరిమా నుండి హులూరుపలి అడవి దారినవెళ్ళేప్పుడు రెండు కిలోమీటర్లు దాటాక ఆశ్చర్యపరుస్తూ చెట్లు మాయమయిపోతాయి. కొండా మాయమవుతుంది. సరిగ్గా రోడ్డు కింద మూడువందల అడుగుల ఎత్తున్న కొండ వాలు ఉంటుంది, దాని కింద ఒక నది. దారి వైపునుండి కొండవాలుకు ఎలాటి హద్దులూ లేవు, చాలా ప్రమాదకరం, అక్కడా ఇక్కడా చెల్లా చెదరుగా రాళ్ళు తప్ప. ఆ వైపున ఒక్క పొదకాని, గడ్డి పోచ కాని కనిపించవు. కొండవాలున ఒక రాయి కింద మిస్టర్ గమంగా చెప్పు ఒకటి కనబడింది. పులికి చెప్పుల అవసరం లేదని ఎవరికి తెలియదు గనక?
6, సెప్టెంబర్ 1983
స్థానిక వార్తాపత్రికలో వార్త: గమంగా మాస్టర్ నరభక్షకి పులివాత పడ్డాడని అందరికీ తెలుసు. ప్రభుత్వం ఆ నరభక్షకిని చంపడానికి ఎలాటి చర్యలూ తీసుకోకపోడం గర్హనీయం.
కొండ వాలు కింద ఉన్న నదిలో చాలా మటుకు కుళ్ళిపోయిన మిస్టర్ గమంగా శవం దొరికింది . అతని వాచ్, బంగారు గొలుసు, ఉంగరం, పర్స్ దొరకలేదు. పొలీస్ లు ఇది హింసాత్మకమైన దారిదోపిడీ అని అనుమానిస్తున్నారు. శవం పోస్ట్ మార్టమ్ కు పంపించారు.
15, అక్టోబర్ 1983
పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ , ఇతర సాక్ష్షాల వల్ల పోలీస్ లు ఇది హత్య అనుకుంటున్నారు. కాని ఎలాటి ఆధారాలు లేక కేస్ ముగిసిపోయింది. ఇతర నేరాల ఒత్తిడి వల్ల ఈకేస్ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసారు.
15, అక్టోబర్ 1983
మళ్ళీ పులి సంచారపు వార్త చక్కర్లు కొడుతోంది. సాయంత్రం మిసెస్ గమంగా మిస్టర్ పట్నాయక్ ఇంటికి తమ గ్రామం నుండి లంజు రైతాను, మరొకరు బిశాఖ గమంగాను తీసుకుని వెళ్ళింది.
బిశాఖ చెప్పాడు, ఎన్ని రోజుల ముందో సరిగ్గా గుర్తు లేదు కాని , తన కూతురు పుట్టిన వెంటనే, (ఇప్పుడా పిల్లకు రెండు నెలలు-) అతనికి ఎవరో గమంగా మాస్టర్ ను చంపమని అయిదు వందలు ఇచ్చారు. దేవుడి పై ప్రమాణం చేసి ఎవరికీ చెప్పనని అన్నాడు గనక ఎవరు డబ్బిచ్చారో చెప్పనని అన్నాడు. కాని ఆడబ్బు తిరిగి ఇచ్చేశాననీ తను గమంగా మాస్టర్ ను చంపలేదనీ అన్నాడు.
మిస్టర్ పట్నాయక్ బిశాఖను తీసుకుని రాత్రి పొలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. పొలీస్ ఆఫీసర్ మిస్టర్ పట్నాయక్ ను కూచోమని కూడా అనలేదు. బిశాఖ నోరు విప్పకపోడంతో అతన్ని లాకప్ లో ఉంచారు.
17, అక్టోబర్ 1983
మిస్టర్ పట్నాయక్ ఎస్ పీ ఇంటికి వెళ్ళి ఆ విషయం విచారణ జరిపించమని కోరాడు. ఎస్పీ వెంటనే విచారణ జరిపించే స్థితిలో లేడు, ఏదో పొలిటికల్ పార్టీ రాలీ జరుగుతుండటంవల్ల శాంతిభద్రతల ను చూడాలి. నిజానికి ఆ పొలిటికల్ రాలీ కారణాల్లో ఇతర అభ్యర్ధనలతో పాటు గిరిజన కమ్యూనిటీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కూడా ఉంది. ఉధియా హత్య వివరాలు తెలుసుకోకపోడం ప్రభుత్వ ఉదాసీనతేనని కూడా అన్నారు.
మిస్టర్ పట్నాయక్ వెటకారంగా బెదిరించాడు ఎస్పీ గనక వెంటనే విచారణ చేపట్టకపోతే తను అసమ్మతిని తెలియజేస్తానని. ఎస్పీ కూడా వెటకారంగా ” ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. ప్రభుత్వ పనికి అడ్డుపడుతున్నావని, పైగా ప్రభుత్వ ఉద్యోగివై ఉండి నువ్వు నియాలను తప్పుదారిపట్టిస్తున్నావని.” అన్నాడు.
“నేను కోర్ట్ అరెస్ట్ కు సిద్ధం” పట్నాయక్ మొండిగా అన్నాడు.
“నువ్వెందుకీ కేస్ లో ఇంతగా తల దూరుస్తున్నావు? ఆ మనిషికి అందమైన కూతుళ్ళో, కూతురు వరస వాళ్ళో ఉన్నారా?” ఎస్పీ వెటకారమాడాడు.
మిస్టర్ పట్నాయక్ తలఊపాక,
“కాని ఆ కూతుళ్ళు ఏమంత అందంగా లేరు, కనీసం నేను విన్నది అది” అన్నాడు ఎస్పీ.
“ఈ ఒక్క అమ్మాయి ప్రత్యేకం. ఒక తులసి ఆకు. పవిత్రమైన తులసి.”
సంభాషణ అంతా పరిహాసంగానే సాగింది. ఎవరికీ ఒక్కమాటైనా ఎలా మాట్లాడాలో తెలియదు. ఎలా ఒక ప్రమాణం చెదరగొట్టాలో తెలీదు, ప్రతిదీ పరిహాసమే.
“రేపు విచారణకు వెళ్తాను” అన్నాడు ఎస్పీ.
18, అక్టోబర్ 1983
పై అధికారులొకరు రాడం వల్ల ఎస్పీ విచారణ జరపడానికి వెళ్లలేకపోయాడు.
19, అక్టోబర్ 1983
మాజిస్ట్రేట్ తో పాటు ఎస్పీ విచారణకు వెళ్ళాడు. కాని బిశాఖ గమంగా ఇంకా నోరు విప్పలేదు. మిస్టర్ పట్నాయక్ బిశాఖ ను ఓ మూలకు తీసుకువెళ్ళి ఏదో గుసగుసలాడాడు. ఆ తరువాతే బిశాఖ తన స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. 16 అక్టోబర్ రోజున, మిసెస్ గమంగా అతన్ని తనతో , లంజు రైతా తో పాటు మిస్టర్ పట్నాయక్ ఇంటికి తీసుకు వెళ్ళినప్పుడు అతనికి చెప్పినదే మళ్ళీ చెప్పాడు. ఆఫీసర్ ఇన్ చార్జ్ బిశాఖ జేబులోంచి మూడు వందల రూపాయలు బయటకు లాగి ” ఇవెక్కడి నుండి వచ్చాయి? ” అని అడిగాడు.
మిస్టర్ పట్నాయక్ ఆ డబ్బు తన చేతిలో కుక్కి నట్టు బిశాఖ ఒప్పుకున్నాడు. అది ముప్పై రూపాయలేమో అనుకున్నా కాని మూడువందలని అనుకోలేదన్నాడు.
” ఎవరికైనా వారి స్టేట్మెంట్ కోసం డబ్బివ్వడం కేసుపెట్టగల నేరం,” ఎస్పీ మిస్టర్ పట్నాయక్ కు చెప్పాడు.
ఎక్కడినుండో మిసెస్ గమంగా అస్థిమితంగా సాయంత్రం పోలీస్ స్టేషన్ చేరుకుంది. ఆమె పోయిన వస్తువులు, దొంగలను, పవిత్రమైన దర్భలతో అంజనం వేసే చూసే ఒక స్థానిక మతాధికారిని కలిసి గమంగా మాస్టర్ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోమంది. ఈ మతాధికారి పూజారి, దైవిక శక్తి కలవాడు, దొంగతనం అయిన వస్తువులను మాత్రమే గుర్తించగలడు. అత్యాచారం, మోసం,హత్యలాంటి పెద్ద విషయాల గురించీ ఏమీ చెప్పలేడు. ఆ పూజారి నదిని చేరుకుని దాదాపు నది మధ్య వరకూ వెళ్ళాడు. అంటే గమంగా మాస్టర్ వాచ్, గొలుసు, ఉంగరం ఎవరో నది మధ్యలోకి విసిరేసారు. అంటే దొంగతనం అనేదే అతని హత్యకు కారణం కాదు.
20, అక్టోబర్ 1983
ఆమెను పొద్దున చూసినా, సాయంత్రం చూసినా నిష్టూరంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది చిలకలా. గారం చేసి అహం ఎక్కువై అలా మాట్లాడుతుంది. కాదంటారా? ఊళ్ళోని అమ్మాయిల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె ఊరే కాదు, చుట్టుపక్కల ఓ డజను ఊళ్ళలో గిరిజన జీవన విధానంపై ఫొటోలు తీస్తే, ఆమె ఫొటో తప్పకుండా ఉంటుంది. ఆ ఊళ్ళో అబ్బాయి ల్లో, అమ్మాయిల్లో ఎక్కువ చదువుకున్నది, దాన్ని మించి ఆమె తండ్రి ఒక్కడే ఆ తరువాత ఎక్కువ చదువుకున్నవాడు.
దాదాపు ఒకనెలరోజులుగా ఆమె పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది. తన ఊపిరి ఏదో ఎగిరిపోతున్నట్టు శూన్యంలోకి చూస్తూ ఉంటుంది తులసి.
21, అక్టోబర్ 1983
హికేరిమా గ్రామంలో గమంగా మాస్టర్ ఇంటికి ఒక గడ్డం ఉన్న మనిషి వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. కొందరు గమంగా మాస్టర్ చనిపోలేదనీ, నదిలో దొరికిన శవం అతనిది కాదనీ అన్నారు. మరి కొందరు ఆ గడ్డం మనిషి సీఐడీ అనీ అన్నారు.
గ్రామంలో పిల్లలు ఆ గడ్డం మనిషి వెంటపడ్డారు కొంత దూరం వరకూ, కాని ఎలాగో ఆ మనిషి మాయం అయిపోయాడు. ఆ రోడ్డునే తిరిగి వస్తున్న త్రినాథాచారి కూడా గడ్డం మనిషి కాదు, కనీసం గడ్డం ఉన్న మేకను కూడా చూడలేదని ప్రమాణం చేసి మరీ చెప్పడు. ” అతన్ని పులి లాక్కుపోయిందా?” ఎవరో అడిగారు.
త్రినాథాచారి గమంగా మాస్టర్ ఇంటి ఎదురుగా రెండు మూడు సార్లు అటూ ఇటూ తిరిగాడు, మిసెస్ గమంగా ఇంట్లో లేదని ఓ పిల్లడి ద్వారా నిర్ధారించుకుని,
” ఓహ్ చెప్పకు, మిసెస్ గమంగా కు పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం వచ్చిందని” అని వెళ్ళిపోయాడు. తులసి గడియ పెట్టిన తలుపు వెనకాల వెక్కిళ్ళు పెడుతూ నించుని అతన్ని చూసింది.
22 , అక్టోబర్ 1983
పులి గడ్డం మనిషిని చంపేసిందన్న వార్త గుప్పుమంది.
పాలనా యంత్రాంగం నరభక్షకి పులిని చంపెయ్యమని శాసించింది. కాని మనం వన్య జీవులను రక్షిస్తాం -అనే సంస్థ కోర్ట్ లో కేస్ వేసి, స్టే తెచ్చుకుంది.
ఆ గడ్డం మనిషి పులి- భాగోతం గురించి పరిశోధన చేస్తున్నాడని జనం అనుకున్నారు. ఒకటి మాత్రం జనం తెలుసుకున్నన్నారు- ఆ పులికి జరిగేవన్నీ తెలుస్తున్నాయి, అది గొప్ప పథకం తోనే ముందుకు వెళ్తోంది. ఎవరైనా దాని పనుల గురించి ఆరాతీస్తే, వాళ్ళు ముందుకు వెళ్ళకముందే పులి వాళ్ళ మీదకు దూకుతోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. నిజంగా చాలా చురుకైన పులి.
23, అక్టోబర్ 1983
కొండ వాలున హికేరిమాకు హులూరుపలి కి మధ్యన ఒక సందులో పాడైపోయిన వాచ్ దొరికింది. అది గమంగా మాస్టర్ ది అని అనుకున్నారు. అది విచారణకు వీసమెత్తుకూడా పనికి రాలేదు. పొలీస్ లకు బాగా తెలుసు పులికి రిస్ట్ వాచ్ అవసరం లేదని.
29, అక్టోబర్ 1983
మిస్టర్ పట్నాయక్ కోసం పనిచేసే కంట్రాక్టర్ అర్ధ రాత్రి ఇల్లు చేరుకున్నాడు. అతనితో పాటు తిమితి గమంగా ను తీసుకువచ్చాడు. గ్రామం హికేరిమా. బాగా తాగి సగం మత్తులో సగం మెలుకువలో ఉన్నాడు. కంట్రాక్టర్ అతన్ని దయ్యం ఆవహించిందని చెప్పాడు. తిమితి, అతనిలో ని దయ్యం ఇలా మాట్లాడుకున్నారు.
తిమితి (లేదా దయ్యం) : తిమితి గమంగా, నువ్వు మా జాతి వాడివి. నీకు తినడానికి తిండి పెట్టాను. తాగడానికి నీళ్ళిచ్చాను. పని ఇచ్చాను, నువ్వు నన్ను హత్య చెయ్యాలని చూసావు.
తిమితి (లేదా దయ్యం) : (పిరికి స్వరంతో) నేను నిన్ను చంపలేదు, గమంగా మాస్టర్, ప్రతివాళ్ళూ నిన్ను పులి చంపిందని అంటున్నారు.
తిమితి (లేదా దయ్యం) : ( పెద్ద స్వరంతో గట్టిగా) అయితే, ఆ పులి పేరు నువ్వెందుకు చెప్పవు?
తిమితి (లేదా దయ్యం) : ( పిరికితనంతో , లో స్వరంలో) ఆ పులి పేరు బిశ్వనాథ్ ఆచారి. గ్రామం : సప్తమగిరి, వృత్తి: ప్రభుత్వోద్యోగం, ఒక స్కూల్ టీచర్.
తిమితి (లేదా దయ్యం) : ( పెద్ద స్వరంతో గట్టిగా) అంతా వివరంగా చెప్పు. అధికారులకు తెలిసేలా.
(పెద్ద స్వరంతో గట్టిగా) : (లోస్వరంతో)
బిశ్వనాథ్ ఆచారి దగ్గర అయిదువందలు తీసుకున్నాము. హికేరిమా, హులూరుపలి రోడ్డు మీద చాలా ఏటవాలుగా ఉన్న భాగం ఉందిగా. అక్కడే అనుకోని మలుపు కూడా ఉంది. ఒకవైపున పొదలు , పొడవైన చెట్లు, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. మరో వైపు కొండ అంచు. మేమక్కడ, ఆ బండ వద్ద నీ కోసం బాణాలు, విల్లు తో ఎదురు చూస్తున్నాము. పెద్దబండ, అడవి, అనుకోని మలుపు ఎంత బాగా ఎవరినైనా దాచగలవంటే, కథల్లో వర్ణించిన ఎంత పెద్ద దయ్యాలకైనా ఈ వైపున ఎవరు దాగి ఉన్నారో కనబడరు. నాకు కొంచం ఈత కల్లు ఇవ్వండి గొంతు ఎండిపోతోంది. ( ఈతకల్లు కాని, మరే కల్లు కాని లేదక్కడ. అతనికి కొంచం నిమ్మరసం కలిపిన సోడా ఇచ్చారు) కాని ఆ రోజున నువు తిరిగి రాలేదు. తరువాత తెలుసుకున్నాం స్కూల్ కి ఎవరో పై అధికారి వచ్చాడనీ, పులి భయానికి స్కూల్లోనే ఉండిపోయావనీ. మేం ఆలోచించి అదృష్టం నీ వైపు ఉందనుకున్నాము. మేం నీతో తలపడకూడదని నిర్ణయించుకున్నాము. అదృష్టం కనక గమంగా మాస్టర్ వైపున ఉండి , మేం చంపడానికి చూస్తే మేమే గొప్ప ఇరుకున పడతాము. అందుకే మేం బిశ్వనాథ్ కి డబ్బు తిరిగి ఇచ్చేసాము.
30, అక్టోబర్ 1983
ఒక బలమైన వదంతి ఒకటి వ్యాపించింది, పోలీస్ స్టేషన్ లో అధికారి, సైకిల్ హాండిల్ లా వంపుతిరిగిన మీసాలున్నవాడు, అతన్ని చూస్తేనే ఆకులూ, కొమ్మలూ గౌరవం తో వంగిపోతాయి, వీధుల్లో గుభేల్, గుభేల్ మని అడుగులు వేస్తూ నడుస్తుంటే ఉన్నట్టుండి భయంతో పసుపు తిరిగిన ఆకులు రాలిపోతాయి, పక్షులు, మరీ అంత తెలివైనవి కాని ఊరపిచ్చుకలతో సహా నిశ్శబ్దంగా మారిపోయి తమ మొహాలను అద్దం లో చూసుకోడం మర్చిపోయాయి. ఆ ఆఫీసర్ పక్కనుండి వెళ్తుంటే, పైకి నిటారుగా లేస్తున్న ఇళ్ళు కూడా మరింత నెమ్మదిగా లేస్తాయ్, ( జాగర్తగా భవనాలను చూస్తే మీకిది అర్ధం అవుతుంది).ఈ ఆఫీసర్ కు ఎవరు హత్య చేసారో, ఎందుకు చేసారో తెలుసు. ఈ అవినీతి విచారణ వల్ల ఎవరు , ఎలా లాభపడతారో కూడా తెలుసు.
31, అక్టోబర్ 1983
బిశాఖ గమంగా ఇంకా జైల్ లోనే ఉన్నాడు. అతని బెయిల్ కోసం ఎవరూ ప్రయత్నించ లేదు. తిమితి గమంగా ను పోలీస్ స్టేషన్ కు తెచ్చారు. అతను వరండాలో ఎదురుచూస్తున్నాడు. వారి ఊరి పొలీస్ మనిషి అతనికి టీ ఇచ్చాక, అతన్ని అరెస్ట్ చేసారు.
1 నవంబర్ 1983
బిశ్వనాథ్ ఆచారి ఇల్లు రాత్రి పదింటికి సోదా చేసారు. ఎవరినీ అరెస్ట్ చెయ్యలేదు. కాని ఒక రేకుపెట్టెలోంచి కొన్ని పేపర్లు తీసుకున్నారు. అది చేత్తో వ్రాసిన నవల అనుకున్నారు. ప్రతీ అధ్యాయం కిందా ఆశ్చర్యం, – రెండాకుల మొలక కూడా పరిమళం విస్తరిస్తుంది-అనే సంతకం.
3 నవంబర్ 1983
నవంబర్ ఒకటిన తెచ్చిన పేపర్లను పొలీస్ లు పరీక్షించారు. అవి నవల కాగితాలు కాదు. తులసి గమంగా త్రినాథ్ ఆచారికి రాసిన ప్రేమలేఖలు.
15 నవంబర్ 1983
ఏదో చిత్రం జరిగింది. మిసెస్ గమంగా పొలీస్ ల వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. పొలీస్ లే హికేరిమా గ్రామానికి వచ్చి మరణించిన గమంగా కుటుంబ సభ్యులను గాబరా పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నల మూలాలు వాటి కొమ్మలకు సరిపోలడం లేదు. ఒక వార్తా పత్రిక మిసెస్ గమంగా, ఆమె పిల్లల ఫొటో వేసి – మిసెస్ ఉధియా గమంగా, దరిద్రులైన ఆమె పిల్లలు అనే కాప్షన్ పెట్టింది. ఈ ప్రచురించిన ఫొటోలతో ఎవరైనా తన కుటుంబానికి చేతబడి చేస్తారేమోనని మిసెస్ గమంగా అసలు భయం.
16 నవంబర్ 1983
మిస్టర్ పట్నాయక్ హికేరిమా తులసి నుండి ప్రభుత్వ ఉద్యోగానికి నాలుగు లెటర్ లు తీసుకున్నాడు. ఆమె ప్రభుత్వం స్కూల్ టీచర్ గా కూడా అర్హురాలే, ఆమె తండ్రి అకాల మరణం వల్ల ప్రభుత్వం ఇచ్చే పరిహారం స్కీమ్ కింద ఆ ఉద్యోగం పొందవచ్చును. వాళ్ళు వారి హెడ్ క్వార్టర్స్ కు తిరిగి వస్తుంటే ఎవరో పెద్ద బండరాయిని దొర్లించారు, అది వారి జీప్ ను రాసుకుంటూ కింద పండింది. ఎవరికీ ఏమీ కాలేదు. ముందు సీట్ లో ఉన్న పట్నాయక్ కు ఏమీ కాదు. వెనకాల ఉన్న అతని తో పనిచేసే మనిషికి కొద్దిగా గాయాలయాయి. మిస్టర్ పట్నాయక్ ” సత్యమేవ జయతే” అని గట్టిగా జపిస్తూ డ్రైవర్ ను మిగతా వారిని కూడా అదే అనమన్నాడు. ఇది మిగతా శత్రువుల నుండి, జాతకంలో ఉన్న దుష్టగ్రహాలు , రాక్షసులు, చెడు ఆత్మలూ, రాజకీయ జిత్తుల నుండి రక్షించుకునే మంత్రం.
17, నవంబర్ 1983
పొద్దున పొద్దున్నే బిశ్వనాథ్ ఆచారి, త్రినాథ్ ఆచారి, దండ తరణీ పాణి, డేంగ తరణి పాణి ని అరెస్ట్ చేసారు. త్రినాథ్ స్టేట్మెంట్ పొలీస్ రాసుకున్నాడు. తను, తులసి, ప్రేమలో ఉన్నామని తినాథ్ చెప్పాడు. . త్రినాథ్ వ్యాపారుల కులానికి చెందినవాడు. తులసి అడవులలో నివసించే సవర జాతికి చెందినది. సామాజిక స్థాయిలో కింది తరగతికి చెందినది. కాని వాళ్ళు అంటరానివాళ్ళు కాదు. తులసి, త్రినాథ్ రహస్యంగా పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. సవర జాతిలో ఇదేమీ పెద్ద ఆంక్ష కాదు, మిగతా కొండజాతుల్లో మాదిరే. వారికి ఇంకో ఆచారం కూడా ఉంది అమ్మాయికి నచ్చిన వాడినే ఆమె పెళ్ళాడవచ్చును. ఆమె అంగీకారం లేకుండా ఎవరితోనూ ఆమె పెళ్ళి చెయ్యకూడదు. ఎలాగో గమంగ మాస్టర్ కి ఈ సంగతి తెలిసింది. వారి ఆచారం పట్ల ఉన్న గౌరవం వల్ల త్రినాథ్ తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇది వారి ఆచారం కాదు, సాధారణంగా పిల్లవాడూ, లేదా అతని కుటుంబం పెళ్ళి చెయ్యమని అడగడానికి, పిల్ల ఇంటికి వెళ్ళాలి. కూతురి మీద ప్రేమతో , ఆచారాన్ని వదిలేసి బిశ్వనాథ్ ఆచారి ఇంటికి వెళ్ళాడు.
బిశ్వనాథ్ ఆచారి గమంగా పైన విరుచుకు పడ్డాడు. ” తక్కువ జాతి అలగాజనం. నడమంత్రపు సిరివల్ల నా డబ్బు కోసం వెనకాల పడ్డారు” అంటూ.
గమంగా కాస్సేపు మర్యాదగా వేడుకున్నాడు. అది అతని ఆచారం లో అసాధారణం. ఉన్నట్టుండి, ” నువ్వు నా కూతురి పేరును పాడు చేద్దామనుకుంటున్నావా? నేను నీ కొడుకును వదుల్తాననుకున్నావా.” అన్నాడు.
“అది జరిగే ముందే నీకు మంచి పాఠం నేర్పుతాను.” అన్నాడు బిశ్వనాథ్ ఆచారి.
అదే రోజున త్రినాథ్ తులసికి ఒక లేఖ రాసాడు. కాని తులసి జవాబు ఇవ్వలేదు.
అక్టోబర్ 24 1983న కృత్రిమ గడ్డం పెట్టుకుని హికేరిమ గ్రామంలో తులసిని కలవడానికి వెళ్ళాడు. ’ కాని ఆమె తన తమ్ముడితో అతన్ని కలవనని సమాచారం పంపించింది.
22 నవంబర్ 1983
దండతరణి పాణి , డెంగా తరణి పాణి జ్యుడిషియల్ మాజిస్ట్రేట్ ఎదురుగా ప్రమాణం చేసి బిశ్వనాథ్ ఆచారి దగ్గర వెయ్యిరుపాయలు తీసుకున్నామని గమంగా మాస్టర్ ను పెద్ద కత్తితో చంపేశామని , శవాన్ని మట్టిలో దొర్లించి, ఒక గోనె సంచీలో కుక్కి కొండ అంచులకు తీసుకెళ్ళి నదిలో పారేసామని చెప్పారు,బిశ్వనాథ్ ఆచారి లాయర్ సలహా ప్రకారం, ప్రమాణం చేసి తనకీ విషయం ఏమీ తెలియదని చెప్పాడు.
23 నవంబర్ 1983: తులసి హికేరిమా గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ తెరిచిన ఒక ప్రాధమిక పాఠశాలలో టీచర్ గా చేరింది. ఆమె పోస్టింగ్ త్వరగా రావడానికి కొన్ని నియమాలు వదిలేసుకోవలసివచ్చింది.
27 నవంబర్ 1983: మిస్టర్ పట్నాయక్ బదిలీ ఆర్డర్ అందుకున్నాడు. 24 గంటల్లో అతని ఆఫీస్ జూనియర్ కు అప్పజెప్పి వెళ్ళమని ఆర్డర్.
22 డిసెంబర్ 1983:
తులసి గమంగా తల్లితో కలసి దండతరణి పాణి, డెంగాతరణి పాణీ లను కలిసేందుకు జైలుకి వెళ్ళింది. గ్రిల్, వైర్ మెష్ లలో నుండి వాళ్ళను అడిగింది, ” మా నాన్నను ఎందుకు చంపారు? అతను మీకేం అన్యాయం చేసాడు?” అని .
తులసి ఇంకా ఏదో చెప్పాలనుకుంది. మిసెస్ గమంగా మధ్యలో వచ్చి, ” నువ్వు ఇప్పటికే చెడు ఆడదయ్యాల కు బలైపోయావు. నువ్వు తప్పించుకోలేవు. నిన్ను కోర్ట్ లు వదిలిపెట్టినా గ్రామ దేవత లాయ్ రాణి నిన్ను వదలదు.” అని అరిచింది.
సిగ్గీ సెరమూ లేని మొహాం దండతరణి, ” బిశ్వనాథ్ మాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు. అందుకే నీ భర్తను చంపాము. నువ్వు రెండు వేలు ఇవ్వు, బిశ్వనాథ్ ఆచారిని చంపుతాము. ” అన్నాడు.
4 జనవవరి 1984:
దండతరణీ పాణిని, డెంగా తరణి పాణిని విడిపించి, వారి ద్వారా తన తండ్రి చావుకు పగతీర్చుకోవాలా వద్దా అనేది తులసి ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది.
1984
ఏడాది పొడుగునా తులసి డోలాయమానంగానే ఉంది, ఏదీ నిర్ణయించుకోలేక. ఒకసారి మిస్టర్ పట్నాయక్ ను కలవడానికి అతను పనిచేసే ఊరికి వెళ్ళింది కూడా.
4 జనవరి 1985 :
దండతరణి పాణిని, డెంగా తరణి పాణిని దోషులుగా నిరూపించచారు. వారికి మరణ శిక్ష పడింది. . బిశ్వనాథ్ ఆచారి పైన ఆరోపణకు సాక్ష్యం లేదు గనక అతన్ని వదిలేసారు. ” ప్రజా స్వేచ్ఛ, అరాచక వేదిక అనే సంస్థ ” కావలసిన సాక్ష్యాలు లేకుండా చాలా రోజులు అతన్ని జైలులో ఉంచడం తప్పు పట్టింది.
జనవరి చివరి భాగం 1985 :
త్రినాథ్ ఆచారిని ఏదో విప్పి చెప్పలేని దోష భావన పట్టి పీడిస్తోంది. లోలోపల కాలిపోతున్నాడు. మాంసాహారం తినడం మానేసాడు, షేవింగ్ చేసుకోడం వదిలేసాడు, సాయంత్రాలు మౌన వ్రతం, యోగా ఆచరిస్తున్నాడు. రోజంతా కూడా ఒకటి రెండు పదాలు లేదా మాటలు మాట్లాడుతున్నాడు. అవీ ఒక్కో సారి అర్ధం కావు. తరచు తల వాల్చుకునే ఉంటాడు. అప్పుడప్పుడు తలెత్తి చూస్తే అతని కళ్ళకూ మెదడు కూ ఉన్న కనెక్షన్ తెగిపోయిందేమో అని అనిపించేది.
ఫిబ్రవరి 1985:
ఒక కొత్త పుకారు మొదలైంది, తులసికి చేతబడి దుష్ట విద్యలు తెలుసనీ, వశీకరించుకోగలదనీ. అడవిలో ఉండే సాంప్రదాయ గ్రామపూజారులు ఒక సారి మామూలు విషయాల చర్చకన్నట్టు కలుసుకున్నారు. అలాటి సమావేశంలో తులసి మాట వచ్చింది. తులసి పోలీసులతో చాలా హాయిగా ఉంటుందని ఎవరో అనడంతో అది అక్కడ ఆగిపోయింది. కొంత మంది అప్పటికే గుసగుసలుపోతున్నారు, తులసి , పట్నాయక్ మధ్య సంబంధం, గంగానది నీళ్ళలా పవిత్రమైనది కాదని.
మళ్ళీ పులి తిరుగాడుతోందన్న పుకారు మొదలైంది.
(ఒక పిశాచం: పులి తినడానికి మగవారినీ, ఆడవారినీ కూడా చంపుతుంది అనేది ఒట్టి నిందారోపణే. నిజానికి, పిశాచానికి మాత్రం ఈ రోజుల్లో ఆ అవకాశం లేదు పాపం.)
![]()

కథాసాహిత్యం, నవల, కవిత్వం, అనువాదం ఇదే జీవితం. కేవీ లో పీజీ టీచరుగా ఉద్యోగ విరమణ. హైదరాబాద్‌లో ఆరునెలలు అమెరికాలో ఆరునెలలు నివాసం. రాత 69 నుండీ. తొలికథ వసుధలో 69-70. విపుల లో చాలానే అనువాద కథలు వచ్చాయి. కవిత్వం నా ఉనికి లానే.



