• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తమిళ కథ : ఎస్తర్

జిల్లేళ్ల బాలాజీ by జిల్లేళ్ల బాలాజీ
August 10, 2026
in అనువాద కథలు
0
తమిళ కథ : ఎస్తర్

తమిళ మూలం:  వణ్ణ నిలవన్
అనువాదం:  జిల్లేళ్ళ బాలాజీ

చివరికి బామ్మనూ, ఇజాక్‌నూ ఇక్కడే వదిలి వెళ్లాలని నిర్ణయమైంది. పైగా బ్రతకటానికి వెళ్లే చోటికి బామ్మ ఎందుకూ? ఆమె వచ్చి ఏం పని చేస్తుందనీ? నడవటానికే కాదు, ఆమెకు చెవులూ వినిపించవు. ఆమె పక్కకెళ్లి నిలబడితే అదీ వెలుతురుంటేనే మనం కనిపిస్తాం. ఒకప్పుడు బామ్మే ఈ ఇంట్లోని వాళ్లందరినీ లాలించింది. మనవళ్లూ, మనవరాళ్లందరికీ చివరగా పుట్టిన ‘రూత్’ తో సహా అందరికీ బామ్మ లాలింపే గుర్తుంది. ప్రయోజనం లేని బామ్మను వెంటబెట్టుకొని బ్రతకటానికి వెళుతున్న చోట్లకల్లా తీసుకెళ్లటానికి వీలవుతుందా?

ఇంట్లో చాలా రోజులుగా దీని గురించే చర్చ. అందరూ వేర్వేరుగా అరుగుమీదా, గాదె పక్కనా, కిటికీ దగ్గరా… ఆ పాత స్టూల్‌ను వేసుక్కూర్చుని, పెరట్లోనూ, ముందున్న నడవలోనూ, అంటూ… ఎవరి మటుకు వాళ్లు ఆలోచించిందంతా భోజన సమయంలో కలిసినప్పుడు మాట్లాడారు. మునుపంతా భోజన సమయం ఆ ఇంట్లో ఎంతో ఆనందంగా గడిచేది. ఇప్పుడు పచ్చిబియ్యమన్నం దొరకటం లేదు. జొన్నలూ, రాగులూ, సద్దల తోటే ఇంటి ఇల్లాండ్లూ వంటలు చేస్తున్నారు. బియ్యంతోనే ఆనంద జీవితమంతా వెళ్లిపోయిందా?!

అలా చెప్పటానికీ వీల్లేదు. ఇప్పటికీ వంటలో ప్రధాన భాగం ‘ఎస్తర్’ చేతుల్లోనే ఉంది. పిప్పిలాంటి ఈ జొన్నలూ, సద్దలూ, రాగులునే ఎస్తర్ పిన్ని ఎంత రుచికరంగా వండుతుందనీ? ఒక రకంగా ఇంతటి కఠినమైన పరిస్థితి లోనూ ఎస్తర్ పిన్నే కనక లేకపొయ్యుంటే ఏమై ఉండేది? ఆలోచించటానికే భయంగా ఉంది. ముగ్గురు ఆడపిల్లలూ, ఒక మగపిల్లవాడికీ తండ్రి అయిన అగస్టిన్ కూడా పశువుల కొట్టంలోని దూలానికి పంచెతో ఉరేసుకొని నాలుక బయటికొచ్చేలా వ్రేలాడుతూ చచ్చుండేవాడు.

ముగ్గురికీ పెళ్లిళ్లై పిల్లా పాపలతోటి ఉంటున్నారు. అగస్టిన్ పెద్దవాడు. ఎందులోనూ ఇతణ్ణి నమ్మి ఏమీ చెయ్యలేం. ప్రశాంతంగా ఉండేవాడిలా ఎప్పుడూ అరుగుమీదే కూర్చుని ఉండేవాడు. కానీ లోలోపల అతను అలాంటివాడు కాడు; ఎప్పుడూ తపన పడుతుండేవాడు. రెండవవాడే డేవిడ్. ఇతని భార్య పేరూ, అగస్టిన్ భార్య పేరూ ఒకటిగానే కుదిరింది. పెద్దవాడైన అగస్టిన్ భార్యను ‘పెద్ద అమలం’ అనీ, చిన్నవాడి భార్యను ‘చిన్న అమలం’ అనీ పిలిచేవాళ్లు. చిన్నవాడికి ఇద్దరూ మగపిల్లలే.

వీళ్లు కాక వీళ్ల తండ్రి మరియదాస్‌కు ఒక్కగానొక్క చెల్లెలే ఎస్తర్. మరియదాస్ చనిపోవటానికి పన్నెండేళ్ల మునుపే ఎస్తర్ పిన్ని ఈ ఇంటికొచ్చేసింది. మొగుడితో కాపురం చెయ్యటం ఇష్టం లేకే వచ్చేసిందని ఊరంతా కొంతకాలం నీచంగా చెప్పుకున్నారు. ఇప్ప్పుడు అదంతా పాత కథై పోయింది. అందరికీ ఎస్తర్ పిన్ని ఏం ఇచ్చిందో చెప్పలేం. అగస్టిన్‌కు, డేవిడ్‌కు అందమైన భార్యలుండి కూడా ఎస్తర్ పిన్ని పట్ల చూపించిన ప్రేమను అమాయకులైన ఆ ఆడవాళ్ల ముందు ప్రదర్శించారా అన్నదీ అనుమానమే.

ఎస్తర్ పిన్ని పొట్టిగా ఉంటుంది, చాలాకాలంగా పురుష స్పర్శలేని కారణంగానో ఏమో ఆమె ఒళ్లంతా చూపరులను ఆకర్షించే విధంగా మిసమిసలాడుతుంటుంది. అందుకు ఆమె చేసే శారీరక కష్టం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. నల్లగా ఉన్నప్పటికీ, అక్కడక్కడా వెంట్రుకలు మెలితిరిగి ఉంటాయి. బాడీ (లో దుస్తులు) ధరించే అలవాటు లేదు. అందుకే ఆమె ఎద ఇంకా పొటమరించి ఉంది. పిన్నికి ఎప్పుడూ విశ్రాంతి లేని పనులు. ఎప్పుడూ చీర కుచ్చిళ్లను నూనూగు రోమాలు కనిపించేలా పైకి దోపుకుని ఉంటుంది.

పిన్నికి తాత్కాలిక ప్రయోజనాలో, నిర్వహణకు కావలసిన మొరటు స్వభావాలో ఏవీ లేవు. అయినప్పటికీ పిన్ని మాటకు ఎదురుండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని మరియదాస్ తర్వాత ఆమె నిర్వహిస్తూ వస్తోందంటే అదే ఎంత గొప్ప విషయం? ఇన్ని ఎకరాల భూమికి ఇంత ధాన్యపు గింజలు విత్తాలి అన్న లెక్కలన్నీ కొడుకులు వేసే లెక్కలు. అయితే ఇంటి పనులైనా, పొలం పనులైనా అలసిపోకుండా చెయ్యాలిగా! పనివాళ్లను అదిలించో, బెదిరించో పనులు చెయ్యించుకోవటం ఎలా? పిన్ని… అదిలింపులూ, బెదిరింపులూ అంటే ఏమిటో తెలియని ఆడది!

నారు నాటే సమయమైనా, నీళ్లు పారించే సమయమైనా; ఉదయమో, మధ్యాహ్నమో లేదూ సాయంకాలమో ఏదో ఒక సమయంలో ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో అడవికి వెళ్లొచ్చేది. అదీ ఏదో ఉత్తినే వెళ్లొస్తున్నట్టుగా ఉండేది. కానీ పనులన్నీ కూడా ఏదో మంత్రం వేసినట్టుగా చకచకా జరిగిపోయేవి. సాయంకాలం అడవికి వెళ్లిందంటే, ఆమె రాకకోసం, భయభక్తులతో అన్ని పనులనూ ఏ లోటూ లేకుండా పూర్తి చేసేసేవాళ్లు. ఇంట్లోని వాళ్లంతా పిన్ని కోసం కలిసికట్టుగా పనిచేసేవాళ్లు.

ఆ ఇద్దరు ఆడవాళ్లూ అద్భుతమైన మనుషులు. పెద్దామె ఒక గొప్ప ఇంట్లో పెద్ద కూతురుగా పుట్టింది. ఆమె తన బడి రోజుల్లోనూ సరే, ఐదవ తరగతి తన గ్రామ బళ్లో పూర్తిచేసే లోపే పెద్దమనిషై ఇంట్లో ఉన్న ఆరేడేళ్లూ సరే, ఇప్పుడు ఈ ఇంట్లో ఈ పెద్ద అగస్టిన్‌కు భార్య అయి, ముగ్గురు కూతుళ్లూ, ఒక కొడుకును కన్నాక కూడా ఆమె మాట్లాడిన మాటలను ఎవరైనా అక్కడే ఉండి లెక్కించి ఉంటే చెప్పేయొచ్చు. కనీసం వంద మాటలనైనా తన ఇరవై ఎనిమిదేళ్ల ప్రాయంలోపు మాట్లాడి ఉంటుందా అన్నదీ అనుమానమే.

పెద్ద అమలం చాలా అమాయకురాలు. పిన్ని ఒక విధంగా ఆమెకు అత్తగానూ, ఇంకో విధంగా బంధుత్వరీత్యా అక్కగానూ కూడా అవుతుంది. ఎస్తర్ చెప్పే చిన్నచిన్న పనులను మనసు నొచ్చుకోకుండా చెయ్యటమూ, భర్తా బిడ్డల బట్టలను కాలవగట్టు దగ్గరకు తీసుకెళ్లి సబ్బుపెట్టి ఉతికి, ఎండలో ఆరాక తీసుకొచ్చి, బాగా మడిచిపెట్టటమే ఈమె జీవితంలోని ముఖ్యమైన పనులని చెప్పొచ్చు. తనకంటూ ఏమైనా చేసుకోవాలన్న ఆశ కానీ, ఎవరి దగ్గరైనా అడిగి తీసుకోవాలన్న ఆలోచన కూడా తెలియని ఆడది.

చిన్న అమలం దీనికి విరుద్దమైన గుణం కలిగిన ఆడది. లంగాలు, లేసులతో అల్లిన బ్రాలనూ, రకరకాల ఎంబ్రాయిడరీలతో అల్లిన వాటిని తొడుక్కోవాలన్న కోరిక కలిగిన యువతి. పెద్దామెకన్నా కాస్త తక్కువస్థాయి కుటుంబం నుండి వచ్చింది. అయినప్పటికీ ఇక్కడికొచ్చాక తన అవసరాలనూ, బాహ్య అలంకారాలనూ ఎక్కువ చేసుకుంది. అందరూ నేలమీదే పడుకునేవాళ్లు. అటక ఉంది. తాటాకు ఇంటికి తగ్గట్టు సరిపోయే అటక అది. మట్టి గచ్చే అయినప్పటికీ బిడ్డలనంతా క్రిందే పడుకోబెట్టి వెదురుతో చేసిన నిచ్చెన మెట్లమీద కిర్రుమని శబ్దం చేస్తుంటే భర్తతో కలిసి అటకమీద నిద్రపోవాలని ఆశపడేది. బామ్మకు కళ్లు సరిగ్గా కనిపిస్తున్నప్పుడు, బాగా నడుస్తున్నప్పుడు చిన్నామెను ‘గుడిసేటిదానా’(వేశ్య) అని తిడుతుండేది. తన భర్తకాక, వేరే మగాళ్లతో సంభాషించటమంటే ఇష్టమున్న ఆడదే. కానీ ఏ రకంగానూ నడత తప్పిన ఆడది కాదు.

ఇక ఈ ఊళ్లో ఏముందనీ? ‘సాత్తాన్ గుడి’ మైదాన ప్రదేశంలోనూ, ఎండిపోయిన బయళ్లలోనూ పశువుల్ని తోలేశాక ఇక్కడ ఏముందనీ?

ఇరుగుపొరుగున ఉన్నవాళ్లంతా ఊరొదిలిపెట్టి వెళ్లిపోయారు. ఎగవ వీథిలో మనుషులెవరూ లేరని నిన్న ఇజాక్ చెప్పాడు. ఊరు చిన్నదే అయినప్పటికీ రెండు అంగళ్లున్నాయి. వ్యాపారం జరగక రెండు అంగళ్లనూ మూసేయాల్సి వచ్చింది. ఇంట్లో ఒకే అగ్గిపెట్టె ఉంది. కొద్దిగా రాగులున్నాయి. కొద్ది రోజులకు మాత్రమే అవి సరిపోతాయి. సద్దలు కూడా ఉన్నాయి. కానీ అగ్గిపెట్టె మాత్రం ఒక్కటే ఉంటే ఎన్నిరోజులు గడపటానికి వీలవుతుందనీ?

బీడీ వెలిగించుకోవటానికి అంటూ ఎస్తర్ పిన్నికి తెలియకుండా నిన్న డేవిడ్ ఒక అగ్గిపుల్లను వెలిగించే శబ్దాన్ని ఎలా దాచగలడు? అతను శబ్దం వినిపించకూడదని మెల్లగానే అగ్గిపెట్టె మీద పుల్లను గీశాడు. ఎస్తర్ పిన్ని పశువుల కొట్టంలో నిలబడుంది. మామూలు కన్నా ఎక్కువ ముందు జాగ్రత్తతో అగ్గిపుల్లను గీయటం వల్ల శబ్దమూ తక్కువగానే వినిపించింది. అయినప్పటికీ ఎస్తర్ పిన్ని చెవిన అది పడనే పడింది. ఆవుకు కుడితిని తాగిపిస్తున్న ఆమె అలాగే పరుగెత్తుకొచ్చేసింది. గాబరా పడుతూ వచ్చింది. పొయ్యిలోని అగ్నిజ్వాలలు ముఖమంతా ప్రతిబింబిస్తుంటే బీడీని అంటించి నిలబడున్నాడు డేవిడ్. పిన్ని అతణ్ణి అడిగి ఉంటే, ఏమైనా మాట్లాడుంటే మనసుకు ఓదార్పుగా ఉండేది. ఇతనికీ ఏమీ మాట్టాడాలనిపించలేదు. ఊరికే ఒకరి ముఖాన్ని ఒకరు క్షణం సేపు చూసుకోవటంతో సరి! ఏమీ మాట్లాడకుండా ఉత్తినే చూస్తూ ఉండిపోయారు. అది మాటకన్నా కఠినంగా అనిపించింది. ముఖ్యంగా డేవిడ్‌ను అది ఎంతో బాధించింది. ఎస్తర్ పిన్నిలోని దయాదాక్షిణ్యాలు అప్పుడు ఎటు పోయిందనీ? ఇంతకాలమూ పిన్ని గౌరవానికీ అభిమానానికీ పాత్రుడైన అతను ఈ ఒక్క కారణంగా ఎంతగా కుమిలిపోయాడనీ? ఆ బీడీనీ అతను పూర్తిగా కాల్చలేకపోయాడు. కిటికీ బయటకు దూరంగా విసిరేశాడు.

ఆరోజు రాత్రి అంబలి మాత్రమే తయారైంది. ఆ అంబలికీ, ఇంకా ఇంటి అవసరాలకూ రాన్రానూ మంచినీళ్లు దొరకటమూ కష్టమై పోతోంది. రైళ్లు వెళ్లే సమయం తెలుసుకొని ఎన్ని పనులున్నప్పటికీ ఇజాకూ, పిన్నీ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఆ ఇంజన్ డ్రైవర్‌తో నీళ్ల కోసం ఎంతగా ప్రాధేయపడాల్సి వస్తోందనీ? ఎస్తర్ పిన్నితో మాట్లాడే సాకుతో డ్రైవర్లు కొంతసేపు మాట్లాడి చివరకు నీళ్లు వొదిలేవాళ్లు. ఊళ్లో ఉండే జనాలందరూ ఉన్నప్పుడు దీనికీ పోటీ ఉండేది. ఊరినుండి అందరూ వెళ్లిపోయాక అదొక లాభంగా ఉంది. నలుగురైదుగురు తప్ప పోటీకి ఇంకెవరూ లేరు.

ఆ రోజు రాత్రి అందరూ అరకొరగా తిని పడుకున్నారు. చిన్న అమలం ఎప్పుడో అటక మీదికి వెళ్లి పడుకుంది. చాలాసేపటి వరకూ డేవిడ్ అరుగు మీదే కూర్చున్నాడు. ఎస్తర్ పిన్ని అతణ్ణి ఎన్నోమార్లు తినటానికి పిలిచింది. అందరికీ అంబలి పోసి పంపించి అతని దగ్గరికొచ్చి అతడి చేతిని పట్టుకొని పైకి లేచేలా చేసింది. అతడి వెనకే వంటింట్లోకి తీసుకెళ్లి పళ్లెం ముందు కూర్చోబెట్టింది. తలను వంచుకుని తినటం ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టాడు. పిన్ని డేవిడ్ గడ్డాన్ని పట్టుకొని పైకి లేపి అంది: “ఏయ్ తినరా, నీ కోపమంతా నాకు తెలుసు!”

డేవిడ్ అలాగే పిన్ని ఎండిపోయిన ఆమె ఎదమీద వాలిపోయి ముఖాన్ని దాచుకున్నాడు. పిన్ని అతడి వీపును అలాగే గట్టిగా కౌగిలించుకొని అతణ్ణి ఓదార్చింది. డేవిడ్ చిన్నగా ఏడ్చాడు. పిన్నికూడా అతణ్ణి చూసి కన్నీళ్లు పెట్టుకొంది. ఇద్దరూ ఆ స్థితినీ, ఏడుపునూ ఇష్టపడ్డారు. ఒకరిమీద ఒకరికి అప్పటి వరకూ లేని అద్భుతమైన ప్రేమా, కరుణా ఉప్పొంగాయి.

డేవిడ్ ఏడవటంలో న్యాయముంది. కానీ పిన్ని ఏడ్చిందే? ఆమె డేవిడ్‌తో ఎంతో కఠినంగా నడుచుకున్నందుకు బాధపడే ఇలా ఏడుస్తోందా? అయితే అసలు విషయం చెప్పాలి. ఎస్తర్‌కు ఆమె భర్త లారెన్స్ గుర్తుకొచ్చాడు. లారెన్సూ, అతనికి సంబంధించిన జ్ఞాపకాలూ ఇప్పుడు అందరికీ చాలా పాత విషయం. ఎవరికీ ఇప్పుడు లారెన్స్ ముఖం కూడా గుర్తుకు లేదు. అంతగా అతని పనులన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. ఇద్దరికీ అప్పుడు అంతకన్నా గొప్ప కార్యం ఆ సమయంలో మరొకటి దొరకలేదు. ఆ రాత్రి డేవిడ్ అటకమీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. అయితే ఎస్తర్ పిన్ని నిద్రపోలేదు. డేవిడ్ తిన్న కంచాన్ని కూడా కడిగి పెట్టలేదు. చాలాసేపటి వరకూ ఒంటరిగా కూర్చుని ఎన్నో జరిగిపోయిన సంఘటనలను తలుచుకుంటూ ఉండిపోయింది. తర్వాత ఎప్పుడో పడుకొని నిద్రపోయింది.

రైలుపట్టాలలో ఏముందీ? ఆమె ఈ ఇంటి పెద్దకోడలిగా వచ్చినప్పటినుండి ఆమెకు దొరికిన విరామ సమయమంతా ఇంటి బయటి నుండి ఈ పట్టాలనే చూస్తూ ఉండేది. పట్టాలు, వేసిన చోటే  వేసినట్టుగా అలాగే ఉన్నాయి. ఆ పట్టాలు ఆమెకు కొత్తగా ఏ విధమైన విషయాన్నీ తెలియజేయలేదు. కొన్ని సమయాల్లో ఆ పట్టాలమీద మేకలు మందలు మందలుగా వెళుతుండేవి. అందులోనూ పొట్టిగా ఉండే గొఱ్ఱెలు పట్టాలను దాటుకొని వెళ్లేదానికన్నా, మేకలు దాటుకొని వెళ్లటాన్ని చూడ్డం మాత్రమే ఆమెకు ఎంతో ఇష్టంగా ఉండేది. రెండూ మేకల జాతే. ఆమె ఇంట్లో ఒక మేకల మంద ఉండేది. అందుకే ఆమె మేకల్ని ఇష్టపడేది. ఇప్పుడు ఆ విధంగా ఒక మేకల మంద ఆ రైలుపట్టాలను దాటుకుంటూ అటు వైపుకు వెళితే బాగుణ్ణు అనుకుంది. ఊళ్లో ఇప్పుడు మంద ఎక్కడుందనీ? మంద కలిగిన ఇండ్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఖాళీగా ఉన్న రైలుపట్టాలను చూస్తున్న కొద్దీ ఆపుకోలేని దు:ఖం పొంగుకొచ్చింది. ఇలా బాధపడ్డం కన్నా ఆమె లోపలికి వెళ్లిపోయి ఉండొచ్చు. బడి మూసేసినందువల్ల పిల్లలందరూ అరుగుమీద బామ్మ పక్కన చేరి ఆడుకుంటున్నారు. అక్కడికెళ్లి కొంతసేపు పిల్లలతోటీ ఉండొచ్చు. కానీ ఆమెకు ఆ పనిచెయ్యటం ఇష్టం లేదు. ఒకవిధంగా ఇలాంటి హద్దుల్లేని కష్టాన్ని అనుభవించటాన్ని ఆమె లోలోపల ఇష్టపడిందనే చెప్పాలి. ఇలా మనసును కష్టపెట్టటం ఏదో ఒక వినోదమైన ఆనందాన్నిచ్చింది.

ముందున్న పశువుల కొట్టంలో పశువులు లేవు. ఇంత కష్టంలోనూ పశువులనూ కాపాడవలసిన దురదృష్టం. ఇన్ని రోజులూ కష్టించిన ఆ రెండు నోరులేని జీవాలనూ ఎక్కడికని తరిమెయ్యగలం? ఇజాక్ నీళ్లులేని ‘సాతాన్ గుడి’ ముందరి మైదానంలో ఎండిపోయిన గడ్డీ, పైరునూ మేపటానికి తీసుకెళ్లాడు. ఇజాక్ మాత్రం లేకపొయ్యుంటే పశువులకు ఏ గతి పట్టుండేదోనని ఆలోచించటానికి కూడా భయంగా ఉంది.

అత్తయ్యనూ, ఇజాక్‌నూ ఉళ్లోనే వదిలేసి వెళ్లాలటగా?! అదెలా?

ఈమె అత్తగారు ఈమెతో ఎక్కువగా మాట్లాడిందే లేదు. అందుకు ఈమె పెద్ద అమలం ఒక కారణమై ఉండొచ్చు. అసలు ఎవరితో ఎక్కువగా మాట్లాడిందనీ? అత్తయ్య పట్ల గాఢమైన వినయం ఉంది. దీన్ని నేర్పింది అమ్మ అనే చెప్పాలి. అమ్మ, నాన్నగారి అమ్మకూడా ఈమెకు బామ్మఅయిన ఆలీస్‌బామ్మతో ఎంతో వినయంతో ప్రవర్తించటం చిన్నప్పటినుండే చూసి ఉంది. ఎన్నో విషయాలు బామ్మకూ, అమ్మకూ మధ్యలో జరిగాయి. ఎదిరించటమో, సణుక్కోవటమో లేకుండా ప్రశాంతతా, ప్రేమా నిండిన సంతోషకరమైన మాటలను ఈమెకూడా ప్రత్యక్షంగానే గ్రహించింది. అన్నీ నిన్ననో, మొన్ననో జరిగినట్టుగా మనసులోనే ఉంది.

బామ్మకు వ్యాథి సోకి పడకేస్తే అమ్మ ‘కుటుంబ ప్రార్థన’ (జపం) అధిక భాగం, బామ్మ వ్యాథి స్వస్థత చేకూరాలన్న వేడుకోళ్లే ఉండేవి. అమ్మ చదువుకోని ఆడది. అమ్మ ప్రార్థన వింటున్నకొద్దీ అందరికీ ప్రశాంతత చేకూరేది. ఆ ప్రార్థనను అమ్మకు ఎవరు చెప్పించారో తెలియదు. అమ్మే ఆలోచించి గుర్తుపెట్టుకొని నేర్చుకుంది. ఆ ప్రార్థన చిన్నచిన్న మాటలే. అధికభాగం ఇంట్లో మాట్లాడే అలవాటైన మాటలే. రోజూ అమ్మ ప్రార్థన చెయ్యదు. ప్రార్థన చేసే సమయం ఎప్పుడొస్తుండాని ఉండేది. చదువురాని ఆడదాని ప్రార్థన, అందుకే తప్పులు లేకుండా ఉన్నాయని మామయ్య పదేపదే అనేవాడు.

అమ్మ తన అత్తయ్యను బాగా చూసుకుంది. పెద్ద అమలానికి ఇది అమ్మ ద్వారా అలవాటైంది. అమ్మలాగానే కుటుంబంలోని అందరితోనూ ప్రియంగా నడుచుకోవాలని లోలోపల అత్యాశను పెంచుకున్న ఆడది అమలం.

అమలం… అంటూ ఇష్టపడే పొడవాటి వ్యక్తి ఆమె ఊళ్లోనే ఉన్నాడు. ఆమె వున్నఊరికి తూర్పున ప్రవహించే ఒక పంటకాలవ ఉంది. పంటకాలవ నుండే ఊరు మొదలవుతుంది. పంటకాలవకు అటుపక్క కూడా కార్లు వెళ్లే రహదారి వరకూ ఒఠి ముండ్లచెట్లు పెరిగి ఉండేవి. పంటకాలవకు అటుపక్క ఎందుకు ఊరు పెరగలేదో తెలియదు. పంటకాలవకు అటుపక్క రహదారి వరకూ ఊరు పెరగటానికి ఎవరికీ ఇష్టం లేదు. పంటకాలవ నుండే ఒక్కో వీథీ మొదలై ముగుస్తుంది.

అమలం ఇల్లు ఉంటున్న వీథికి ‘కోవెల వీథి’ అని పేరు. అది ఒఠి మట్టితో కూడిన వీథి. అమలం ఇంటికి ఉత్తరాన ఒక ఇల్లుంది, పొడవైన ఇల్లు. ఇంట్లోని గోడలన్నీ నీలి వర్ణంలో ఉండేవి. ఈ ఇంట్లోనే అమలాన్ని ఇష్టపడి మాట్లాడుతూ నవ్వుతూ తిరిగే వ్యక్తి ఉండేవాడు. అమలం అతణ్ణి ఇష్టపడింది ఒఠి మాటల కోసం మాత్రమే కాదు. అతను ఇక్కడికీ ఎప్పుడైనా వచ్చేవాడు. ఎందుకొచ్చాడని చెప్పలేం. వచ్చినవాడు ఒక్కసారి కూడా కూర్చోలేదు. ఎందుకు వచ్చి పరుగెడుతున్నాడని ఎవరూ కారణం చెప్పలేరు. అమలానికైనా తెలుశా? అంతదూరం నుండి వచ్చినవాడు కూర్చోవటానికి కూడా ఇష్టం లేకుండా వచ్చీ రాగానే బయలుదేరి వెళ్లిపోతున్నాడే, ఇవన్నీ ఎవరు గ్రహించగలరు? అమలానికి తెలియకుండా ఉంటుందా?

ఇంతటి మెత్తనైన ఆడదానికి అన్నీ ఉన్న ఇంట్లో ఏం కష్టం వచ్చి పడింది? ఇంట్లో ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటూ ఏం వెతుకుతోందనీ? ఎవరితోనూ చెప్పలేని ఆమె ఇష్టాలు, ఆమె దు:ఖమూ ఎంత విడ్డూరమైనవి? అమలం మనసును ఆమె భర్తా, ఆమె మరిదీ అయిన డేవిడ్‌కూడా తెలుసుకోలేకపొయ్యారు.

ఇజాక్ అడవినుండి వచ్చే సమయమైంది. ఇజాక్‌కు ఇప్పుడు అడవిలో ఏ పనీ లేదు. అతని ప్రపంచమే అడవి అన్నది ఎస్తర్ పిన్ని మాత్రం ఎలాగో తెలుసుకుని, ఎండా కరవూ నిండిన అడవి లోపలికి అతణ్ణి పంపి వచ్చింది. అడవిని చూడకుండా ఉంటే ఇజాక్ చచ్చిపొయ్యేలా ఉన్నాడు. అతను అడవిని గురించి మాట్లాడని రోజే ఉండదు. అడవి కనుమరుగవుతూ ఉంది. పంటపొలాలు, పచ్చగడ్డి మేసే పశువుల మెడలోని గంటల శబ్దాలు కొంతకాలంగా మరుగైపొయ్యాయి. ఊళ్లోని వాళ్లందరికీ ఉపయోగకరంగా ఉన్న అడవిలో ఇప్పుడేమీ లేదు. ఎర్రని ఎండ చెట్లను కాల్చేస్తోందని ఇజాక్ అంటున్నాడు. ఎండ రంగులు ఇజాక్‌కు బాగా తెలుసు. ‘పసుపురంగు ఎండ కాస్తే రేపు వాన పడుతుంది’ అని అతను చెప్పాడంటే వాన కురిసేది. వేసవి కాలపు ఎండ రంగునూ, వర్షాకాలపు ఎండ రంగునూ గురించి ఇజాక్‌కు తెలియని విషయం లేదు.

ఇజాక్ పొలాల్లో పండే పైరు పంటలకోసమూ, పశువులూ జీవాల కోసమే ఈ లోకంలో జీవిస్తున్నాడు. అయినా ఇజాక్‌కు ఇష్టమైన పంటలన్నీ కనుమరుగవుతూ వస్తున్నాయి. చివరకు ఎండిన పంటలను పశువులకు దాణాగా వదిలేసినపుడు ఇజాక్ గంజి కూడా తాగకుండా కుమిలిపోయాడు. ఎంతగా ఏడ్చాడని ఆ రోజు? అయినప్పటికీ అతనిమీద తప్పేమీ లేదు. నీళ్లే లేకుండా, పైర్లు ఎండిపోతుంటే తానే వాటిని నాశనం చెయ్యటానికి అతణ్ణి వెళ్లమని చెప్పింది ఎస్తర్ పిన్ని. ఎండిపోయిన పైర్లను నాశనం చెయ్యటంలో అతనికి ఏం నష్టం? అయినప్పటికీ ఇజాక్ ఎంతగా ఏడ్చాడనీ? అతని పొలమూ కాదది.

ఇంతటి అగ్నిని దగ్గరుండి గుమ్మరిస్తున్నది ఎవరు? నీళ్లూ లేకుండా, తినటానికి అవసరమైన తిండిగింజలు కూడా లేని రోజుల్లో పగటి సమయాన్ని రాత్రి ఏడు గంటలవరకూ పెంచింది ఎవరు? గాలి కూడా దాక్కోవటానికి చోటు వెతుక్కుంది. పగటిపూట అలవికాని వెలుతురూ రాత్రిపూట చూడగానే భయం గొలిపే చీకటీ ఏర్పడుతున్నాయి.

ఒకరోజు రాత్రి ఎస్తర్ పిన్ని, హరికేన్ దీపం ముందు అందరూ కూర్చొని ఉన్నప్పుడు చెప్పింది: “ఇలాగ కటిక చీకటి ఉండనే కూడదు. ఇది ఇంతటి చీకటిని ఎందుకు కలిగి ఉంటోందో తెలియటం లేదు. ఇది నాశనానికే.” అదృష్టం ఈ విషయాన్ని పిన్ని చెబుతునప్పుడు పసిపిల్లలందరూ అడ్డదిడ్డంగా పడుకొని నిద్రపోతున్నారు. చిన్న అమలం చంటిబిడ్డ మాత్రం పాలు తాగటం కోసం మేలుకొని ఉంది. పిన్ని చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేని ఆ పసిపిల్లలు అదృష్టవంతులు. ఇది జరిగి ఎన్నో నెలలు అయ్యాయి.

ఇప్పుడు ఈ రాత్రిపూట చీకటి ఇంకా ఎక్కువైంది. పౌర్ణమి రోజుల్లో కూడా ఈ మోసమైన చీకటి దూరం కాలేదు. ఊళ్లో మనుషుల సంచారం కూడా లేకపోవటం వల్ల, చీకటిని ఇంకా ఎక్కువ చేసేసింది. ఇండ్లల్లో మనుషులుంటే, ఇంటి తలుపులు మూసి ఉన్నా, తెరిచి ఉన్నా వెలుతురు వీథుల్లోకి పడకుండా ఉండదు. ఎంత అమావాస్య చీకటిగా ఉన్నప్పటికీ ఇండ్లల్లో నుండి వినబడే మనుషుల మాటల శబ్దమూ, వాళ్ల సంచారమూ చీకటిని నాశనం చేసేది. చీకటిని నాశనం చెయ్యటం ఇలాంటి ఒక చిన్న విషయమే. చీకటిని పోగొట్టేది పంచాయతీ బోర్డువాళ్లు ఏర్పాటుచేసిన కరెంటు స్తంభాలో, పదిహేను రోజులకొకసారి కురిసే వెన్నెలో కాదు. చీకటిని పోగొట్టేది ఇండ్లల్లోనుండి వినిపించే మనుషుల మాటల శబ్దాలూ సంచారమూనూ. అన్ని ఇండ్లల్లోనూ వెలుతురు లేకున్నా, దీపాలన్నీ ఆరిపోయున్నా ఇండ్లల్లో మనుషులు ఉంటున్నారన్న చిన్న విషయమే చీకటిని తరిమేసేది. చీకటి ఎప్పుడూ ఎస్తర్ కుటుంబానికి బాధను కలిగించ లేదు. ఇప్పుడు చీకటి కలిగిస్తున్న దు:ఖం ఎండ వేడిమిలా తట్టుకోలేకపోతున్నారు.

ఎండ చెమటనూ మంటనూ కలిగిస్తోంది. ఎండ పగటిపూట బాధల్ని ఎక్కువ చేస్తోంది. చీకటి ఎండలా మంటను కలిగించకున్నా ఇంకో కార్యాన్ని చేసింది. అదే భయం. ఒఠి చీకటిని చూసి పసిపిల్లలు భయపడే భయం కాదు. ఎవరూ ఊళ్లో లేరని, నిద్రకూడా పోనీకుండా గుమ్మం బయట నిలబడి భయపెడుతోంది చీకటి.

చీకటి అనే నల్లని వస్తువు, ప్రాణం లేనిదై ఇన్నేళ్లూ మూలన పడి ఉంది. ఈసారి ప్రాణం పోసుకోవటం వింతగానే ఉంది. ఎస్తర్ పిన్ని ఇంటి ముందు అది నిలబడి గొణుక్కు౦టోంది. అది ఏమంటోంది? ఇంత నల్లగా ముఖమే లేనిది ఎంత భయపెడుతోంది? అయితే నిజానికి చీకటి ఈ విధంగా నడుచుకోవటం దానికి స్పష్టంగా మాట్లాడ్డం చేతకాకే. అయితే ఏం గొణుగుతోందో ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు మాత్రం అర్థమవుతోంది.

ముఖ్యంగా తెలివీ, అధికారమూ నిండిన ఎస్తర్ పిన్నికి అది గొణగటం వినిపిస్తోంది. చీకటి చెప్పిన మాటల్ని విని ధైర్యస్థురాలైన ఎస్తర్ పన్నినే భయపడింది. ఇక తప్పించుకోలేమని స్పష్టమైపోయింది. చీకటి అన్న మాటలు ఏమిటి?

పై కప్ప్పు పెంకులతో వెయ్యబడిన ఇల్లే అయినప్పటికీ గోడలు కాల్చిన ఇటుకలతో కట్టినవే. గోడలకు సున్నం పూశారు. బాగా గట్టిగా ఉన్న గోడలే. చీకటి చొచ్చుకు రాలేని గోడలు. బాగా నమ్మకమున్న ఈ గోడలకు కూడా పగుళ్లు ఏర్పడతాయా? ఎస్తర్ పిన్ని భయపడింది. చీకటి చెప్పింది భయంకరమైనదే.

“నువ్వూ నీకిష్టమైన వాళ్ళూ ఇక్కణ్ణించి వెళ్లటం తప్ప మరో మార్గమేముందీ? ఇంకా వాన కోసం ఎదురుచూస్తూ చస్తారా?” ఇదే ఎస్తర్ పిన్నికి చీకటి చెప్పిన మాటలు. ఈ మాటల్ని అది ప్రతిరోజూ విరామం లేకుండా గొణుగుతూనే ఉంది; మొండితనంతో కూడిన, దృఢమైన గొణుగుడు.

బామ్మకు కళ్ల చుట్టూ చెమట పడుతూ ఉంది. అందరూ నిద్రపోయాక ఎస్తర్ పిన్ని పదేపదే నూనె దీపాన్ని పెంచి వచ్చి చూసేది. ఆ వెలుతురులో, ఆమె చెమట వెనక అపారమైన నమ్మకం కనిపించేది. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ఆ కళ్లల్లోని ఈ నమ్మకం నిజంగా ఆశ్చర్యకరమే. కళ్లకు ముసలితనమే రాదా? ఇంత అపారమైన నమ్మకం కలిగి ఉండి నిద్రపోకుండా పైకప్పులోకే చూపుల్ని నిలిపిన ఈమెను వదిలిపెట్టి పోవటం తప్ప మరో మార్గమేముంది? ఇజాక్ తోడుగా ఉండగలడా? అతనికి ఇవ్వటానికి కూడా ఏమీ లేదని తెలిసినా దేన్నీ ఆశించకుండా శ్రమించినప్పటికీ ఇంటిని నిర్వహించే వ్యక్తికి ఇదీ ఒక గౌరవ సమస్యే.

పైకప్పులోకి చూడ్డానికి ఏముందనీ? పైర్ల పెరుగుదల దగ్గరుండి చూసుకునే ఇజాక్‌కు తెలిసినట్టుగా, పైకప్పు పెంకులు ఎండకూ వానకూ, గాలికీ పాతబడిపోయి, జారిపోవటాన్ని బామ్మ తెలుసుకోకనా ఉంటుంది? పైకప్పు లోని ఏయే భాగంలో పెంకులు ఎప్పుడు రంగు వెలిసిపోవటం మొదలైంది అన్నదీ బామ్మకు తెలుసు.

ఆ రోజు రాత్రి మళ్లీ అందరూ కలిశారు. కొద్దిగా రాగిపిండి మాత్రమే మిగిలి ఉంది. ఎండిపోయిన కొన్ని కరివేపాకు రెమ్మలూ కాస్త నూనె కూడా ఇంట్లో ఉండటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. రాగిపిండితో ఎస్తర్ సంగటిలాంటి ఒక పదార్థాన్ని తయారుచేసింది. నిప్పు కోసం కష్టపడాల్సిన పనిలేకపోయింది. దీని కోసమే ఇజాక్ ఎక్కడి నుండో కొన్ని ఎండిన కట్టెపుల్లల్ని తీసుకొచ్చి పెట్టాడు. చివరి అగ్గిపుల్లను గీసిన రోజునుండి అగ్గి ఆరిపోకుండా కాపాడుతూ వస్తోంది. ఇజాక్ మాత్రం అడవినుండి సన్నని కట్టెపుల్లల్ని తీసుకురాకపోయుంటే ఇలా అగ్గిని భద్రంగా కాపాడుకోవటానికి వీలయ్యేదికాదు. నిప్పు లేకుండా ఏ పని జరుగుతుంది?

ఇలాంటి విశ్వాసప్రాత్రుడైన శ్రామికుడిని వదిలి ఎలా వెళ్లటం? పైర్లను కాపాడుతూ వచ్చాడు. పశువులను పోషించాడు. వానలోనూ, చలిలోనూ గుమ్మం ముందు నులక మంచమే చాలు అన్నాడు. బామ్మకోసం ఇజాక్ చావాలనుకోవటం బావుంటుందా? ఈమే అన్నంపెట్టి పెంచింది, ఈమే గుండెలమీద వెంట్రుకలు పెరగటాన్నీ, మీసాలు మొలవటాన్నీ చూస్తూ పెంచింది. రాత్రుల్లో ఎన్నోరోజులు నులక మంచం దగ్గరికొచ్చి శబ్దం కాకుండా నుంచొని ఇజాక్ నిద్రపోవటాన్ని చూస్తూ ఉండిపోయింది. ఇజాక్ దగ్గర ఏముంది? అడవిలో కాచే ఎర్రని ఎండలో తిరుగుతూ నల్లబడి కమిలిన తోలుతో కప్పబడ్డ ఒళ్లు తప్ప ఇంకేం ఉంచుకోనున్నాడు ఇజాక్? ఇంటి ముందున్న పశువుల కొట్టంలో నిలబడి తన వికారమైన చెమటతో కంపుకొడుతున్న ఖాకీ నిక్కరును మార్చుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు చిన్నప్పటి నుండి ఈరోజుటి వరకూ పూర్తి నగ్నంగా ఇజాక్‌ను చూసింది. ఇది కాకుండా ఆ మొరటువాడి తడి కళ్లల్లో ఒక వింతైన భావన దాక్కొని ఉంది. అది మేకలను, ఆవులను కాస్తున్నప్పుడు కనిపించే భావన కాదు. బాగా పెరిగిన పైర్ల మధ్య నడిచి వెళుతున్నప్పుడు కళ్లల్లో కనిపించే తళతళలాడే కాంతి కాదు. అన్ని విధాలుగానూ భిన్నమైన ఒక కాంతిని ఎస్తర్‌ను చూస్తున్నపుడు అతని కళ్లు బహిర్గతపరుస్తాయి.

ఎవరికీ చాలని భోజనాన్ని కంచాల్లో వడ్డించింది ఎస్తర్ పిన్ని. పసిపిల్లలకు కూడా చాలని భోజనం. చిన్న అమలం ముఖం చిట్లించింది. అది ఆమెకు అలవాటే.

“మీరిద్దరూ మీ మీ ఇండ్లకే వెళ్లిపోండి. బిడ్డల్ని తీసుకెళ్లండి.” అని పెద్ద అమలాన్ని చిన్న అమలాన్ని చూస్తూ చెప్పింది. ఇద్దరూ అందుకేమీ బదులివ్వకూడదన్నట్టుగా ఎస్తర్ పిన్ని గొంతు వినిపించింది. వాళ్లూ బదులేమీ చెప్పలేదు.

“మీరిద్దరూ నాతో పాటు రండి. మదురైకు వెళ్లి కూలిపనులు చూసుకుందాం. వానలు పడి నీళ్లు వచ్చేంతవరకూ ఎక్కడైనా కాలాన్ని వెళ్లబుచ్చాల్సిందే కదా? ఇజాక్ కూడా రానీ…” దీనికీ అగస్టిన్, డేవిడ్ ఏమీ బదులివ్వలేదు. కొంతసేపయ్యాక డేవిడ్ మాత్రం మాట్లాడాడు. చేతివ్రేళ్లకు అంటుకొని ఉన్న రాగి సంగటిని ఒక్కో వేలినీ నోట్లోకి పెట్టుకుని చప్పరిస్తూ మాట్లాడాడు. “బామ్మ ఉందా?” ఎస్తర్ అతణ్ణి సూటిగా చూసింది. తర్వాత బదులేమీ మాట్లాడలేదు. పడుకోవటానికి వెళుతున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడ లేదు. కానీ ఆ రాత్రి సుమారు ఒంటి గంటకు పైన వేడి గాలులు వీచటం మొదలుపెట్టింది. అప్పుడు ఇంటి మధ్యలో పసిపిల్లల మధ్య పడుకొని ఉన్న ఎస్తర్ పిన్ని లేచి వెళ్లి బామ్మ పక్కన పడుకుంది. ఉదయమైనా ఆ వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. అది చల్లబడితే వాన వస్తుంది. అది చల్లబడదు. చల్లబడ్డానికి ఆ గాలులకు ఇష్టం లేదు. బక్కచిక్కిన రెండు ఎద్దులు పదేపదే దీర్ఘశ్వాస వదులుతూనే ఉన్నాయి. ఆ శబ్దాన్ని, నిద్ర సరిగ్గా పట్టక పొర్లుతున్నవాళ్లందరూ బాగానే విని ఉంటారు. ఆ ఎద్దుల దీర్ఘశ్వాసను ఎక్కువసేపు వినలేము. భరించలేని శోకాన్ని ఎలాగో ఆ దీర్ఘశ్వాసలో కలిపి ఆ ఎద్దులు బహిర్గతం చేస్తున్నాయి. ఆ గాలులైనా కాస్త మెల్లగా వీచి ఉండొచ్చు. వేడిమి వీచే గాలికి ఇంత వేగం అక్కర్లేదు. ఎండిపోయి పడున్న ఎగవ కొండల నుండి ఆ గాలులు బయలుదేరి ఉండాలి. అడవిలో పడున్న ఎండిన పశువుల పేడా, మేకల పింటికా మొదలైనవాటి వాసన గాల్లో కలిసిపోయి ఉంది. ఎగవ కొండలోకే చివరగా ఈ యేడాది ఎక్కువ మందలు కలిసి వెళ్లాయి.

బామ్మను ‘సమాధుల తోట’కు తీసుకెళ్లటానికి, పక్క ఊరైన కురుంబూరు నుండి ఒక పాత శవపేటికను చాలా తక్కువ ధరకు కొని, ఇజాకే తలమీద పెట్టుకొని తీసుకొచ్చాడు. అంతలోపే సాయంత్రమై పోయింది. ఫాదర్ ఊళ్లో లేరని చర్చి మనిషే పాళయంజెట్టి కుళత్తూరు నుండి వచ్చారు. ఊరొదిలిపెట్టి వెళ్లటానికి అంటూ ఎస్తర్ దాచిపెట్టిన డబ్బులోనుండి బామ్మ చావుకు కొంత ఖర్చు అయిపోయింది.

ఎవరూ ఏడవ లేదు. మారుగా భయపడి ఉండటాన్ని వాళ్ల కలతపడ్డ ముఖాలే చూపించాయి. సమాధుల తోట ఎంతో దూరంలో లేదు. పక్కనే ఉంది. కోవెల వీథిలో, నాటారు వీథిలో ఉంటున్న రెండు కుటుంబాలవాళ్లు వచ్చి కొంతసేపు ఉండి వెళ్లిపోయారు. దు:ఖంతో ఉన్న ఇంటికి దు:ఖంలో భాగం పంచుకునే బాధ్యతను అంత సులభంగా తీసిపడెయ్యగలమా?

ఎస్తర్ పిన్నికి మాత్రం, బామ్మ చెమ్మ నిండిన కళ్లతో పై కప్పునే చూస్తూ ఉండటం పదేపదే గుర్తుకొస్తూనే ఉంది. చాలాకాలం వరకూ ఆ కళ్లను ఆమె మరిచిపోలేకపోయింది.

జిల్లేళ్ల బాలాజీ

1961 లో తిరుత్తణిలో జన్మించిన వీరి విద్యాభ్యాసమంతా చిత్తూరులోనే సాగింది. ఎస్వీ యూనివర్సిటీ నుండి ఎమ్మే పట్టా పొందారు.
వీరు 1983 నుండి రచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 167 కి పైగా కథలూ, 123 కి పైగా కవితలూ, 1 నవలా ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 20 కథలకు  బహుమతులు పొందారు.
ఇప్పటివరకూ 1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా… 5) పగడాలు పారిజాతాలూ…6) నిరుడు కురిసిన వెన్నెల 7) గుప్పెడు మల్లెలు (కథా సంపుటాలు) 8) కవన కదంబం (కవితా సంపుటి) 9) జీవితమొక పయనం (నవల) పుస్తకాలను వెలువరించారు.
వీరి సాహిత్య కృషికి గాను 1) ‘గురజాడ కథా పురస్కారం’ (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) కీ.శే. శ్రీమతి కామాక్షీబాయి శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు)  మొదలైనవి వరించాయి.
తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు.
ఇప్పటిదాకా వీరు… 139 కి పైగా కథలు, 12 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 జీవిత చరిత్ర,  2 వ్యాస సంపుటాలు, 1 వచన రామాయణ గ్రంథం… అనువదించారు.
అనువాదంలోనూ… 1) “నల్లి దిశై ఎట్టుమ” పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం
2) ప్రతిష్టాత్మకమైన “కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం”
3) “కె.ఎస్.మొళిపెయర్పు విరుదు” పురస్కారం
4) ‘పడైప్పు’ సంస్థ నుండి ‘ఇలక్కియ చుడర్’ పురస్కారాన్ని పొందారు.

Previous Post

కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’

Next Post

ఆంగ్ల కథ: నది మది

Next Post
ఆంగ్ల కథ: నది మది

ఆంగ్ల కథ: నది మది

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!
  • రష్యన్ కథ : శస్త్రచికిత్స
  • కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • హిందీ కథ : లెక్క తప్పింది !
  • రష్యన్ కథ : వాంక
  • గుజరాతీ కథ : ప్ర- పంచతంత్రం
  • ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply