హిందీ మూలం : రాకేష్ భ్రమర్
తెలుగు అనువాదం : డా. వి.ఎల్. నరసింహం శివకోటి
వెంకట్రావు తనువు చాలించాడు. ఎప్పటిలాగనే భటులు అతణ్ణి యమధర్మరాజు ఎదుట ప్రవేశపెట్టారు. తదుపరి కార్యక్రమం, చనిపోయిన మనిషి పాప-పుణ్యాల లెక్కలు చూడటం …. దానికి అనుగుణంగా అయితే స్వర్గానికో లేదా నరకానికో పంపడం. ఇది ముచ్చట. వెంకట్రావు ముఖంలో ఎలాంటి భయాందోళనలు లేవు. ప్రశాంతంగా ఒక మూల నిలబడి జరుగుతున్న తతంగం అంతా చూస్తున్నాడు. కళ్ళతోనే తప్పొప్పులు అంచనా వేస్తున్నట్టు యమధర్మరాజు వెంకట్రావు వైపు గుడ్లురిమి చూస్తున్నాడు. మరొక వైపు చిత్రగుప్తుడు చక్కటి-మెత్తటి తివాచీపై కూర్చుని వెంకట్రావు చిట్టా తిరగేస్తున్నాడు.
యమధర్మరాజు తనదైన శైలిలో గంభీరమైన కంఠంతో – “విచారణ మొదలుపెట్టండి” అని ఆజ్ఞాపించాడు.
“చిత్తం ప్రభు!” వినయంగా అన్నాడు చిత్రగుప్తుడు.
వెంకట్రావును సంబోధిస్తూ – “ఓ మానవా! నీ నామధేయము ఏమి? ప్రభువుల వారికి తెలియజేయుడు” అన్నాడు చిత్రగుప్తుడు.
“తమరే కదా, నన్ను ఇక్కడకి తీసుకొచ్చినదే! మరి, తమరికి తెలియకుండా ఉంటుందా?”
“మాకు తెలుసు. కానీ ఇది యమధర్మరాజుల వారి సభ. విచారణ చేపట్టడానికి కొన్ని నియమ-నిబంధనలు ఉంటాయి. వాటికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలి. నువ్వు అడిగినదానికి మాత్రమే జవాబు చెప్పాలి. ఎదురు ప్రశ్నలు వేసే హక్కు నీకు లేదు. సరే, సరే ప్రభువులకు నీ పేరు ఏమిటో చెప్పు.”
“నా పేరు వెంకట్రావు. తల్లిదండ్రులు స్వర్గీయ సూర్యనారాయణ మూర్తి – సీతమ్మ. భార్య వసంత. కొడుకు సుప్రీత్, కూతురు సుప్రజ. ఇద్దరికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. కాలేజిలో చదువుకుంటున్నారు” మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఒకేసారి గంపగుత్తిగా, గుక్కతిప్పుకోకుండా చెప్పేసాడు వెంకట్రావు.
చిత్రగుప్తుడు – “నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పవలెను” అంటూ హెచ్చరించాడు.
యమధర్మరాజు – “ఇతగాడి నామధేయము తెలిసినది. ఇక ఇతడి పాప-పుణ్యముల చిట్టా విప్పుడు” అన్నాడు విసురుగా.
చిత్రగుప్తుడు, వెంకట్రావు పాప-పుణ్యాల వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు – “ప్రభూ! ఇతను ఒక నాస్తికుడు. ఎప్పుడూ ఏ దేవుణ్ణీ నమ్మలేదు. ఎలాంటి పూజలూ-పునస్కారాలూ చెయ్యలేదు, ఏ గుడికీ వెళ్ళలేదు, ఏ దేవుడి విగ్రహానికీ తల వంచి నమస్కరించలేదు. దేవుణ్ణి ఎప్పుడూ తనకి ఇది కావాలి, అది కావాలి, నాకు ఆస్తిపాస్తులు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు అని కూడా అడగలేదు. పైగా జీవితాంతం తన కష్టాన్నే నమ్ముకుని బ్రతికాడు, అలాగే చచ్చిపోయాడు. స్వార్జితంతో వచ్చినది పచ్చడి మెతుకులు అయినా పరమాన్నం అనుకుని సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడూ ఎదుటి వాడి రూపాయి కోసం ఆశపడలేదు. కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకున్నాడు. బీదాబిక్కికి తోచిన సాయం చేసాడు. అడిగినవాళ్ళకి తనకి ఉన్నతంలోనే సహాయం చేసాడు కానీ ఎప్పుడూ ఎవ్వరినీ ఖాళీ చేతులతో వెనక్కి పంపలేదు. అడిగిన వాడిది పుణ్యం, అడగని వాడిది పాపం అన్నట్టు ఉండేది. ఇవన్నీ చూసే ఇతని ఇంట్లోవాళ్లు ఎప్పుడూ ఇతన్ని తిట్టుకుంటూ ఉండేవారు.”
“భూలోకంలో ఇతడు ఏం పని చేసేవాడు?” అడిగాడు యమధర్మరాజు.
“అయ్యా! ఇతడేం పెద్ద ధనవంతుడూ, జమీందారు కాదు. ఆఫీసులో ఒక మామూలు క్లర్కు. పైరాబడికి మంచి అవకాశం ఉన్నా, ఎప్పుడూ ఆ జోలికి కూడా పోలేదు. అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. అయితే వింత ఏంటి అంటే, ఇతని తోటి క్లర్కులు, అధికారులు, ఇబ్బడిముబ్బడిగా లంచాలు తీసుకుని, బోల్డంత సంపాదించారు. బోల్డన్ని ఆస్తులు కూడబెట్టుకున్నారు. నగరంలో నాలుగైదు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, ఊళ్ళో పొలాలు కొనుక్కున్నారు. ఆఫీసుకు కూడా మంచిగా పెద్ద పెద్ద కార్లల్లో వచ్చేవారు. ఇతడు మాత్రం జీవితాంతం ఆ డొక్కు బండి మీదే ఆఫీసుకు వెళ్ళేవాడు. జీవితం అంతా ఆ అద్దె ఇంట్లోనే మగ్గిపోయాడు. ఆఖరుకు అక్కడే జీవితం ముగించేసాడు.”
“అయ్యో పాపం” అన్నాడు యమధర్మరాజు.”
“అవకాశాలని అందిపుచ్చుకోలేని వాళ్ళని మూర్ఖులు అనే అంటారు. ఇతని చిట్టాలో ఇంకా ఏమేమి ఉన్నాయి. క్లుప్తంగా చెప్పు.”
“చిత్తం ప్రభు! ఒకసారి ఇతను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మనిషిని ఒక్కడే మోసుకుంటూ వెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాడు. నిజానికి అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ అందరూ ఆ గాయపడిన మనిషిని తాకడానికి కూడా భయపడ్డారు. సహాయం చెయ్యడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ జనాలు, చుట్టూ నిలబడి రక్తం మడుగులో గిలగిల కొట్టుకుంటున్న ఆ మనిషికేసి చూస్తూ వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకరకంగా తమాషా చూస్తున్నారు. ఎవరూ సహాయం చెయ్యకపోవడంతో ఈ వెంకట్రావు ఒక్కడే ఆ గాయపడిన మనిషిని మోసుకుంటూ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాడు. ఇదంతా చెయ్యడానికి ఈ వెంకట్రావు చాలా కష్టపడ్డాడు పాపం. ముందు ఆసుపత్రివాళ్ళు, తర్వాత యాక్సిడెంటు కేసు పేరు చెప్పి పోలీసువాళ్లు కూడా ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇంత సహాయం చేసినందుకు కృతజ్ఞత చూపించడం పోయి, అతని ఇంటి వాళ్ళు కూడా ఈ వెంకట్రావే యాక్సిడెంట్ చేసాడు అని ఇతని మీదనే నిందలు వేసారు.”
“అయ్యో పాపం” అన్నారు యమధర్మరాజు. కానీ వెంకట్రావు మాత్రం ఇదంతా తన గురించి కాదు, ఎవరి గురించో చెబుతున్నారు అన్నట్టు ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా తల దించుకుని, అసలు ఈ విచారణకు, తనకు ఎలాంటి సంబంధం లేనట్టు ఒక పక్కన నిలబడి ఉన్నాడు.
“ఇతడు గొప్ప పుణ్యాత్ముడా?” అడిగాడు యమధర్మరాజు.
“అవును ప్రభూ! ఇతడు చెప్పుకోదగ్గ ధనవంతుడు కాకపోయినా, ఎందరో నిస్సహాయులకు, పేదవారికి తన వంతు సహాయం చేసాడు. ఎప్పుడూ నిండు మనసుతో ఇతరులకు సేవ చేస్తూ ఉండేవాడు. ఇంత చేసినా అతని ముఖంలో వీసమెత్తు గర్వం ఉండేది కాదు. ఇతడి ఈ సేవాకార్యక్రమాలు చూసిచూసి ఇతడి ఇంటివాళ్ళు విసిగిపోయారు. ఎప్పుడూ ఇతణ్ణి తిడుతూ, తమని తాము తిట్టుకుంటూ ఉండేవారు. అయినా ఇతడికి అవేం పట్టేవి కావు” అన్నాడు చిత్రగుప్తుడు.
“నువ్వు ఇతడి పుణ్యాల గురించే ఊదరగొడుతున్నావు. పాపాల చిట్టా కూడా విప్పు.”
చిత్రగుప్తుడు, వెంకట్రావు కర్మలకు సంబంధించిన చిట్టా అంతా తిరగేశాడు. ఒక్కక్క పేజి తిరగేసాడు. వేళ్ల మీద ఏవో లెక్కలు వేసాడు. మరి కాసేపటికి చిత్రగుప్తుడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నుదుటి మీద చిరు చెమటలు. ఎందుకో చిత్రగుప్తుడు కాస్త ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడు.
“ఏమయింది చిత్రగుప్తా! లెక్క తేలట్లేదా లేక ఏమయినా….”
చిత్రగుప్తుడు నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ – “లేదు ప్రభూ! లెక్కలు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ…”
“కానీ …. ఏమిటి చిత్రగుప్తా! నాన్చకు. త్వరగా చెప్పుము” అన్నాడు కుతూహలంగా.
“అదేమిటంటే ప్రభూ! ఇతడు ఎన్నడూ దేవుడికి తలవంచి నమస్కరించకపోయినా, ఇతని ఖాతాలో ఒక్క పాపం కూడా కనిపించడం లేదు.”
“మనిషై పుట్టి ఒక్క పాపం కూడా చెయ్యకపోవడం ఏమిటీ… అసంభవం. ఎప్పుడో ఒకప్పుడు… ఏదో ఒక చిన్న పాపం చేసే ఉంటాడు. ఇతడి ఖాతా మరొకసారి సరిగ్గా చూడుము.”
“నేను కూడా అదే చూస్తున్నాను ప్రభూ! కానీ ప్రతి పుట, ప్రతి వాక్యం ఎంత జాగ్రత్తగా వెతికినా, ఒక్క పాపం కూడా కానరావటం లేదు.”
“ఒళ్ళు దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా చూడుము” ఈసారి యమధర్మరాజు మాటల్లో కోపం బుసలుకొడుతోంది.
చిత్రగుప్తుడు ఒకటికి నాలుగుసార్లు శ్రద్ధగా పుస్తకం తిరగేసి, వేళ్లమీద లెక్కలు వేసి, ఆఖరికి చెమట తుడుచుకుంటూ “మన్నించాలి ప్రభూ! ఇతని ఖాతాలో కేవలం పుణ్యకర్మలే ఉన్నాయి. పాపకర్మలు మచ్చుకు కూడా కనిపించడం లేదు.”
“అయితే ఇతగాణ్ణి స్వర్గానికి పంపవచ్చా?”
“నిస్సంకోచంగా ప్రభూ!” అన్నాడు చిత్రగుప్తుడు.
వెంకట్రావును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి భటులు బంగారు రథం సిద్ధం చేస్తున్నారు. ఇంతలో వెంకట్రావు మెల్లగా – “ప్రభూ!” అన్నాడు. వెంటనే అందరూ ఒక్కసారిగా “చూసారా, చూసారా ఇతడు మొదటిసారి ప్రభువును తలచుకున్నాడు” అన్నారు హర్షధ్వానాలు చేస్తూ.
“అవును. అన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు చనిపోయాను. భూలోకంలో ఆ రాతి విగ్రహాల మీద నాకు నమ్మకం లేదు. కానీ ఇక్కడ మిమ్మల్ని సాక్షాత్తు చూసాను. అదే నమ్మకంతో పిలిచాను. అయితే నాది ఒక చిన్న విన్నపం.”
“నిర్భయంగా చెప్పు. నీ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ మాట్లాడితే, నీ మాటలు వినాలని మాకు చాలా కుతూహలంగా కూడా ఉంది.”
“ప్రభూ! నా పుణ్యకర్మల ఆధారంగా నాకు స్వర్గం ప్రసాదించారు. సంతోషం. కానీ స్వర్గానికి వెళ్ళే ముందు ఒక్కసారి నేను భూలోకం వెళ్ళి రావాలి అనుకుంటున్నాను.”
“ఎందుకు?” అడిగాడు యమధర్మరాజు.
“నేను చనిపోయిన తర్వాత నా భార్య-పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు? తెలుసుకోవాలని ఉంది.”
“నువ్వు బ్రతికుండగా ఏమనుకునేవారో ఇప్పుడూ అదే అనుకుంటూ ఉండొచ్చు. ఇందులో పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏముంది?”
“లేదు ప్రభూ! మా భూలోకంలో – ‘చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా ఆలోచించకూడదు, మాట్లాడకూడదు’ అని ఒక సామెత ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలుసుకోవాలని ఉంది.”
“మంచిది. నీ పుణ్యకర్మల వల్ల నీకు స్వర్గం దొరికింది. కాబట్టి భూలోకం వెళ్ళి నీ వాళ్ళని కళ్ళారా చూసుకుని, వాళ్ళు నీ గురించి ఏమని అనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం ప్రసాదిస్తున్నాం. అయితే ఈ అవకాశం ఒక్కరోజే. మరొక హెచ్చరిక. నువ్వు వారితో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మాట్లాడ కూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన యెడల కఠిన శిక్ష తప్పదు. తీసుకెళ్ళి నరకంలో పడేస్తాం” అంటూనే యమధర్మరాజు భటులకు సైగ చేసాడు.
క్షణాల్లో వెంకట్రావు భూమి మీద ఉన్నాడు.
వెంకట్రావు భూలోకంలో తన ఇంటి బయట నిలబడి ఉన్నాడు. చుట్టూ చూస్తే యమధర్మరాజు, చిత్రగుప్తుడు, భటులు, ద్వారపాలకులు, దేవదూతలు ఎవ్వరూ కనిపించలేదు. అదే అద్దె ఇల్లు, ఇరుకు సందులు, మురికి రోడ్లు, హడావుడిగా అటూ-ఇటూ తిరుగుతున్న జనాలు. తన ఇంటి తలుపు వేసి ఉంది. తలుపు కొడదామా అని ఒక్క క్షణం ఆలోచించాడు. ఇంతలో తను ఒక ఆత్మ అనీ, తనకి ఆకారం లేదనీ, ఎక్కడికైనా ఎలాంటి అడ్డు-ఆపు లేకుండా వెళ్ళొచ్చనీ గుర్తొచ్చింది.
ఇంట్లోకి అడుగుపెడుతూనే ఏదో స్మశానంలో అడుగుపెట్టినట్టు అనిపించింది. ఇల్లంతా నిశ్శబ్దం. అదేదో మరీ పెద్ద ఇల్లు కాదు. రెండు గదులు, ఒక హాలు, చిన్న వరండా. సొంతిల్లు అవ్వనీ, అద్దె ఇల్లు అవ్వనీ, చిన్నది అవ్వనీ, పెద్దది అవ్వనీ, తన ఇల్లు అంటే ఎవరికైనా సంతోషమే కదా!
వెంకట్రావు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని తన ఇంటిని చూసుకుంటున్నాడు. పాత జ్ఞాపకాలు అతణ్ణి కదిలించాయి. పడకగదిలోకి వెళ్ళి చూస్తే భార్య మంచం మీద కొన్ని కాగితాలు ముందు వేసుకుని కూర్చొంది. అదే మంచం మీద మరొక వైపు కొడుకు-కూతురు కూడా కూర్చొన్నారు. అందరూ కలిసి ఏవో కాగితాలు తిరగేస్తున్నారు.
“ఈయనకేం హాయిగా, దర్జాగా వెళ్ళిపోయాడు. ప్రావిడెంటు ఫండులో తిప్పితిప్పి కొడితే ఎనభై వేలు కూడా లేవు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాషుమెంటు డబ్బులు వస్తాయి అంతే. పెన్షన్ ఎంత వస్తుందో ఇంకా లెక్క తేలలేదు. ఈ కాస్త డబ్బుతో ఇల్లు గడిచేది ఎలా?” అంటోంది భార్య. భార్య ముఖం మాడిపోయి ఉంది. ఆమె మాటలని బట్టి చూస్తే ఆమెకి భర్త చనిపోయిన బాధ కంటే, ఎక్కువ డబ్బులు కూడబెట్టకుండా పోయినందుకు బాధపడుతున్నట్టు ఉంది. నిజమే… మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే. మనుషుల ప్రేమలు-అభిమానాలు అన్నీ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. డబ్బు లేకపోతే బంధాలకి-అనుబంధాలకీ చిల్లు కాణీ విలువ లేదు.”
“ఎప్పుడు చూడు ఒక్క వంద రూపాయలు ఇవ్వడానికి కూడా ఏడ్చేవారు. ఫీజు తప్పించి ఖర్చులకి ఎన్నడూ పది రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. ‘మా నాన్న నాకు ఇది కొన్నాడు’ అని చెప్పుకునేలా ఎప్పుడైనా ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చాడా? ఒక స్మార్ట్ ఫోను లేదు, బైక్ లేదు నా ముఖానికి. కాలేజిలో ఫ్రెండ్స్ ముందు నాకు తల కొట్టేసినట్టు ఉంటుంది” అంటున్నాడు కొడుకు.
“నేను మాత్రం ఒక్క బ్రాండెడ్ డ్రెస్సు కోసం ఎంత తపించిపోయేదాన్ని. అవే చౌకబారు బట్టలు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంత ఆటపట్టించేవారో తెలుసా నీకు? అమ్మ, నాకు ఇప్పుడైనా ఒక మంచి డ్రెస్, వాచీ కొనిపెట్టు.” అంటోంది కూతురు.
భార్య ముఖం కుళ్ళిన టమాటాలా కనిపిస్తోంది. “ఇదిగో నాలుగు లక్షలు గ్రాట్యుటీ, ఎనభై వేలు ప్రావిడెంట్ ఫండ్. అసలు ప్రావిడెంటు ఫండులో డబ్బులు అదనంగా ఎందుకు జమచేసేవాడు కాదో ఆ భగవంతుడికే తెలియాలి. రిటైర్మెంటుకు ముందే పోయాడు. కాబట్టి, పెన్షన్ ఎంత వస్తుందో చెప్పలేం.
తను రిటైర్మెంటుకి ముందే చనిపోయాడు. మంచిదే కదా! కుటుంబ సభ్యులకే లాభం. వీళ్లల్లో ఎవరో ఒకరికి ఉద్యోగం వస్తుంది. అయితే ఈ విషయం ఇంకా ఇంట్లో ఎవరికీ గుర్తొచ్చినట్టు లేదు.
“ఇంకా ఇన్ష్యూరెన్స్ డబ్బులు రావాలి కదా?” కొడుకు గుర్తు చేసాడు.
“అదేమన్నా కోట్లల్లో వస్తుంది అనుకుంటున్నావా? ఏదో పదిహేను-ఇరవై లక్షలు వస్తాయి అంటున్నారు ఆఫీసు వాళ్ళు. అసలు ఏమన్నా నాలుగు పెద్ద పాలసీలు చేసి చస్తే కదా నాలుగు డబ్బులు వచ్చేది?” అంది భార్య.
“ఇవన్నీ నాకేం తెలియదు. నాకైతే ఒక మంచి డ్రెస్, వాచీ కావాల్సిందే” అంది కూతురు ఇంట్లో ఏదో పండగ జరుగుతున్నట్టు.
“నాకు బైకు కావాలి. ఆయన బ్రతికుండగా ఎలాగూ ఏ సంతోషానికీ నోచుకోలేదు. కనీసం ఆయన పోయిన తర్వాత అయినా ఆ వచ్చే నాలుగు డబ్బులతో సుఖంగా ఉండకపోతే ఎలా? హీరో హోండాలో కొత్త మోడల్ వచ్చింది. సుమారు అరవై వేలు ఉండొచ్చు. నాకు డబ్బులు ఇవ్వు. రేపే బుక్ చేసుకుంటాను.”
పెళ్ళం ఇంతెత్తున లేస్తూ – నోర్ముయ్యండి. ఇందాకటి నుండి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. మీ బాబు చచ్చి ఇంకా నాలుగు రోజులు కాలేదు. ఇంకా అస్థికలు గంగలో కలపాలి, కార్యక్రమాలు జరిపించాలి. వీటన్నిటికీ అసలు ఎంత ఖర్చవుతుందో కూడా తెలియదు. అప్పుడే మన జీవితాలు తెల్లవారిపోయాయా? భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. సొంత ఇల్లు లేదు, కూతురు పెళ్ళి, కట్న కానుకలు…. కొడుకు పై చదువులు. ఆ మనిషి మన కోసం చేసింది ఏం లేదు. ఇప్పుడు మన తిప్పలు మనమే పడాలి.”
తిప్పలు పడటానికి జీవితం ఇంకా చాలా ఉంది. ఆయన టైం అయిపోయింది, పోయాడు. ఇప్పుడు ఆయన కోసం దిగులు పడుతూ, మన జీవితంలో కూడా సంతోషాలు లేకుండా చేసుకుంటామా ఏం? నాన్న ఉద్యోగం ఎలాగూ నాకు వస్తుంది. ఇక అప్పుడు డబ్బులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.” ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు కొడుకు.
“అవును, నీకు ఉద్యోగం వస్తుంది. పెళ్ళవుతుంది. ఆర్నెల్లు తిరిగేసరికి పెళ్ళాంతో వేరు కాపురం పెడతావు. అప్పుడు మేం చిప్ప పట్టుకుని అడుక్కోవాలి. ఇంకా ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలి. ఆ పెళ్ళి కూడా చేసేస్తే నాకు ఏం మిగులుతుంది? నా జీవితం ఎలా వెళ్తుంది? నువ్వు నన్ను తిన్నగా ఏ వృద్ధాశ్రమానికో తీసుకెళ్ళి వదిలేసి, చేతులు దులుపుకుంటావు. వచ్చిన నాలుగు డబ్బులు, నీ సరదాలకి ఖర్చుపెడితే నేనేం చెయ్యాలి? నువ్వు ఉద్యోగం చేసినప్పుడు బైక్ కాకపోతే కారు కొనుక్కో. అడిగేవాడు ఎవడు?” – తల్లి తేల్చి చెప్పేసింది.
నిజం ఎదుట అబద్దం, అయితే మౌనంగా ఉండిపోతుంది, లేదా గొంతు పెంచి అరుస్తుంది. అమ్మ ముఖం చూస్తే కూతురుకి జాలేసింది. ఆమె మౌనంగా తల్లి-కొడుకుల మాటలు వింటూ నిలబడింది. కొడుకు కూడా ఏం మాట్లాడలేదు.
గదిలోనే మరొక మూల నిలబడ్డ వెంకట్రావు ఆత్మకి, తన కుటుంబ పరిస్థితి చూసి చాలా బాధ అనిపించింది. బ్రతికున్నన్ని రోజులూ తన కుటుంబానికి ఏం చెయ్యలేకపోయానే అని ఆలోచిస్తున్నాడు. పరోపకారం మాట సరే. కానీ కుటుంబం కోసం మనిషి ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. బ్రతికున్నన్ని రోజులూ, తన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అని అనుకునే వాడు. అలాగే నడుచుకున్నాడు కూడా. కానీ ఇప్పుడు….ఇక్కడి పరిస్థితి… బ్రతికున్నప్పుడు వీళ్ళు ఎవరూ తన వల్ల సుఖపడలేదు. ఇప్పుడు చచ్చిపోయాక, తన కోసం రెండు కన్నీటి చుక్కలు కూడా కార్చట్లేదు. తను బోల్డంత ఆస్తి కూడబెట్టి ఉంటే, ఇంట్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు.
మానవ సంబంధాలకి పునాది కేవలం ప్రేమ, పరోపకారం కాదు అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జీవితంలో డబ్బుకు ప్రత్యేకమైన విలువ ఉంది. ఆ డబ్బు లేకపోతే సంబంధాల దారం సునాయాసంగా పుటుక్కుమంటుంది. తన చావుకి కుటుంబంలో ఎవ్వరూ బాధపడకపోవడం వెంకట్రావుకి స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళు అందరూ వెంకట్రావు బోల్డంత డబ్బు, ఆస్తులు కూడబెట్టనందుకు, తమకి సౌకర్యవంతమైన జీవితం, వసతులు కల్పించనందుకు బాధపడుతున్నారు.
ఇదే జీవిత సారాంశం. మనిషి తను కష్టపడి, ఆ కష్టంతో సుఖపడాలి అనుకోడు. ఎదుటి వాడి డబ్బుతో సుఖాలు అనుభవించాలి అనుకుంటాడు. మనిషికి తన పురుషార్థాల మీద నమ్మకం లేదు. ఐశ్వర్యం, సుఖాలు-భోగాలు అన్నీ వారసత్వంగా రావాలి అని కోరుకుంటాడు.
తన ఇంట్లో వాళ్ళ మాటలు విని వెంకట్రావు ఆత్మ మళ్ళీ చచ్చిపోయింది. వీళ్ళ మాటకి బాధపడినంతగా వెంకట్రావు జీవితంలో ఎన్నడూ బాధపడలేదు.
ఇంకా అక్కడ ఉండి వాళ్ళ మాటలు వినే ధైర్యం లేక వెంకట్రావు వెంటనే యమధర్మరాజు సభకి చేరుకున్నాడు. వెంకట్రావుని చూసి ఆశ్చర్యపోతూ యమధర్మరాజు – “ఓ మానవా! ఏమి ఇంత త్వరగా వచ్చినావు? నీకు ఒక రోజంతా సమయం ఇచ్చితిమి కదా? నీ కుటుంబ సభ్యులని చూసి వచ్చితివా? వారు ఏమనుకుంటున్నారు నీ గురించి?” అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
“ప్రభూ! చెప్పడానికి పెద్దగా ఏం లేదు” అన్నాడు వెంకట్రావు.
“మంచిది. మాకు కూడా అర్థమవుతూనే ఉంది. చనిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వెళ్ళడం నీకు కూడా ఏం నచ్చలేదని నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. మానవ సంబంధాల నైజమే అంత. బ్రతికున్నన్నాళ్ళు మనవాళ్లు పరాయి వాళ్ళలా, అప్పుడప్పుడు పరాయి వాళ్ళు మన సొంత వాళ్ళ కంటే ఎక్కువగా అనిపిస్తారు. కానీ నువ్వేం బెంగపెట్టుకోకు. నీ కోసం అన్ని రకాల స్వర్గసుఖాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నువ్వు దేనికీ బాధపడక్కర్లేదు. ఈ మనవుడిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి తగు ఏర్పాట్లు చెయ్యండి.”
వెంటనే వెంకట్రావు – “ప్రభూ! కాస్త ఆగండి. నాది ఒక చిన్న విన్నపం. మీరు నన్ను స్వర్గానికి కాదు, నరకానికి పంపించండి.”
“ఓ మానవా! ఏమంటున్నావు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? మా లోకంలో ఇలాంటివి ఉండవు. నువ్వు చేసిన పాప-పుణ్యాలను బట్టే ఫలితం ఉంటుంది.”
“ప్రభూ! నాకు తెలుసు. నేను భూలోకంలో మంచి పనులు చేసాను. దాని ఆధారంగానే మీరు నన్ను స్వర్గానికి పంపుతున్నారు. కానీ నేను బ్రతికున్నన్ని రోజులూ నా కుటుంబ సభ్యులకి ఎలాంటి సుఖసంతోషాలూ ఇవ్వలేకపోయాను. నా కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యాను. అంటే, పాపం చేశాను. కాబట్టి నరకానికి పంపి పుణ్యం కట్టుకోండి. మీ మేలు ఈ జన్మలో మరచిపోను.”
యమధర్మరాజు ధర్మ సంకటంలో పడ్డాడు. ఇంతలో చిత్రగుప్తుడు కలగజేసుకుంటూ – “ప్రభూ, మీరు ఈ మానవుడి మాటల వలలో పడొద్దు. ఈ మనుషులు చాలా తెలివైనవారు. ఘటికులు. వీళ్ళు తమ మాటల గారడీతో నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మించడంలో బహు నేర్పరులు. వీళ్ళు చాలా మొండివారు కూడా. మీరు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతగాడి మాటల్లో పడొద్దు. వెంటనే ఇతణ్ణి స్వర్గానికి పంపండి. మరికాసేపు ఇతనితో మాట్లాడితే, మిమ్మల్నే బుట్టలో వేసి తన మాట నెగ్గించుకోగలడు.”
సభ ముగిసింది.
దేవదూతలు వెంకట్రావును ఈడ్చుకుంటూ వెళ్ళి స్వర్గంలో పడేశారు.
![]()
శ్రీ రాకేష్ భ్రమర్
1 జనవరి, 1956 న రాయబరేలీ, ఉత్తరప్రదేశ్ లోని కహింజర్ గ్రామంలో జన్మించిన శ్రీ రాకేష్ భ్రమర్ అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టా పొందారు. కేం ద్ర ప్రభుత్వ సేవల నుండి పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిగా సాహితీ సేవకు అంకితమైన శ్రీ భ్రమర్, 2008 సంవత్సరం నుండి ‘ప్రాచీ’ అనే హిందీ మాసపత్రిక సంపాదకులుగా తమ సేవలు అందిస్తున్నారు.
శ్రీ భ్రమర్ ఇప్పటి వరకు 8 నవలలు, 10 కథా సంకలనాలతోపాటు వివిధ పత్రికలలో ఎన్నో వ్యంగ్య రచనలు, కవితలు, కథానికలు, వ్యాసాలు, గజల్స్ ప్రచురించి పాఠకుల మన్ననలు అందుకున్నారు.
సగటు మనిషి వేదన, జీవిత సంఘర్షణ, కలలకి అక్షర రూపం వీరి రచనలు.
మొబైల్ : 9968020930

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా రాసిన పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన హిందీలోకి అనువదించి ప్రచురించారు. హిందీ కవి నరేష్ సక్సేనా కవితలను, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, హిందీ రచయిత్రి మమతా కాలియా రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఎంపిక చేసిన హిందీ లఘు కథానికలను తెలుగులోకి అనువదించి ‘తోలుబొమ్మలు’ శీర్షికన ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.



