కన్నడ మూలం: జి.ప్రవీణ్ కుమార్
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
మూడు రోజులుగా బెంగళూరులోని విజయనగర్ ప్రాంతంలోని మారేనహళ్లి ఆరవ క్రాస్ వీధి నిశ్శబ్దంగా ఉంది. దానికి కారణం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక దుర్వార్త. సిడ్నీ జాతీయ రహదారిపై పది లైన్ల మధ్య దూసుకుపోతున్న ఒక కారును, కొత్త కార్లను ఫ్యాక్టరీ నుంచి షోరూమ్‌కు తీసుకెళ్తున్న భారీ లారీ ఢీకొట్టి బోల్తా కొట్టించింది. ఆ ప్రమాదంలో ఆగిపోయిన ప్రాణం పేరు సందీప్.
కేవలం ఇరవై ఏడు సంవత్సరాల వయసున్న సందీప్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలోనే స్వగ్రామానికి వచ్చి ఒక అమ్మాయిని చూసి, మాట్లాడి, ఇష్టపడి, వివాహానికి అంగీకరించాడు. ఇంకొన్ని నెలల్లో జరగబోయే తన పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో అతని మరణవార్త మొత్తం వీధినే విషాదంలో ముంచెత్తింది. చదువులోనూ, మంచితనంలోనూ, ప్రవర్తనలోనూ ఆదర్శంగా ఉన్న ఆ యువకుడు ఇంత తొందరగా చనిపోవడం అందరికీ జీర్ణించుకోలేని విషయం అయింది. ఆయుష్షును ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయగలిగితే, ఈ వీధి ప్రజలు తమ జీవితాల నుంచి తలా కొన్ని సంవత్సరాలను తీసి సందీప్‌కు ఇచ్చేవారు. అందరిలో ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాల రాజేష్ అయితే తన జీవితమంతా సందీప్‌కు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండేవాడు.
ఎందుకంటే రాజేష్ జీవితాన్ని కాపాడింది సందీపే. కోవిడ్ మహమ్మారి సమయంలో రాజేష్ తన తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నాడు. ఆ సమయంలోనే అతనికీ కరోనా సోకింది. ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతూ ఇంట్లో ఒంటరిగా జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాడు. తాను ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని భావించి భార్య, కొడుకును ఊరికి పంపించాడు. “ఇక్కడ ఉంటే మీకూ కరోనా సోకవచ్చు. నేను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాను” అని చెప్పి వారిని దూరంగా ఉంచాడు. అలాంటి సమయంలో సందీప్ నుంచి ఒక ఆంగ్ల సందేశం వచ్చింది— “ఓర్పే ప్రాణాలను కాపాడుతుంది. జాగ్రత్తగా ఉండండి. త్వరలో ప్రపంచం మామూలు స్థితికి వస్తుంది.” ఆ సందేశం చదివిన రాజేష్, “ఓర్పు ఉంది. కానీ ఆరోగ్యం?” అని తిరిగి పంపాడు. వెంటనే సందీప్ ఫోన్ చేశాడు.
ఆ రోజుల్లో చాలా మంది తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను కూడా చూడటానికి రాకపోయిన ఘటనలు టెలివిజన్‌లో కనిపించేవి. కానీ ఈ వీధిలోని వృద్ధులకు అలాంటి భయం లేదు. ఎందుకంటే సందీప్, అతని స్నేహితులు తమను కాపాడతారనే నమ్మకం వాళ్లలో బలంగా ఉండేది. సందీప్, అతని బృందం మందులు, ఆహారం, అవసరమైన సేవలు అందిస్తూ కరోనా బాధితులను ఆదుకున్నారు. దగ్గరలోని మూడలపాళ్య ప్రాంతానికి చెందిన ఒక వైద్యుడి సహాయంతో కొద్ది రోజుల్లోనే రాజేష్ కోలుకోవడం ప్రారంభించాడు. మొత్తం వీధిలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అలాంటి రాజేష్ ఇప్పుడు సందీప్ మరణవార్త విని మళ్లీ కుంగిపోయాడు. అతని శ్వాస మామూలు స్థితికి రావడానికి ఎన్నో గంటలు పట్టింది. ఇదే సమయంలో ఢిల్లీలో పనిమీద ఉన్న రాజేష్, తన పని ముగించుకుని బెంగళూరుకు బయలుదేరాడు. సందీప్ మృతదేహం ఇంటికి చేరే సమయానికి తానూ అక్కడికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మూడు రోజులుగా సందీప్ ఇంటికి తెలిసినవాళ్లు వచ్చి వెళ్లుతూనే ఉన్నారు. అతని అక్క సుప్రియ కన్నీళ్లు ఆపుకోలేకపోతోంది. సందీప్ తండ్రి పదేళ్ల క్రితమే గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు తల్లి కమలమ్మ తన కుమారుడి శవాన్ని, ఏడుస్తున్న కుమార్తెను చూస్తూ కుంగిపోతోంది. సుప్రియ చాలా సంవత్సరాల తర్వాత గర్భవతి అయింది. ఈ దుఃఖం వల్ల ఆమె ఆరోగ్యానికి ఏదైనా అయితే ఏమవుతుందో అన్న ఆందోళన కమలమ్మను మరింత కలవరపెడుతోంది. చివరకు ఆమె తన కుమార్తెతో ఇలా అంది— “ఏడవకు అమ్మా… అతడే మళ్లీ నీ కడుపులో పుడతాడు.” ఆ మాట సుప్రియకీ, కమలమ్మకీ కొంత ధైర్యం ఇచ్చింది. ఆ మాట నిజమవ్వాలని ఇద్దరూ తమ కన్నీళ్లను తుడుచుకున్నారు. మనిషి బహుశా ఇలాంటి భరించలేని దుఃఖాలను తట్టుకోవడానికే పునర్జన్మ వంటి నమ్మకాలను సృష్టించుకుని ఉండవచ్చు. జీవితం వైపు మనల్ని నడిపించే అలాంటి నమ్మకాలు ఇంకా పెరగాలని కమలమ్మ మనసారా కోరుకుంది.
ఉదయం నుంచే ప్రజలు సందీప్ ఇంటి ముందు గుమిగూడడం మొదలుపెట్టారు. రాజేష్ భార్య నిరీక్ష, వారి ఐదేళ్ల కొడుకు ఆర్య కూడా కమలమ్మ ఏడుపులో పాలుపంచుకుంటున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆస్ట్రేలియా నుంచి విమానంలో సందీప్ మృతదేహం బెంగళూరుకు చేరుకోబోతోందని సమాచారం వచ్చింది. సందీప్ పెద్దనాన్న, అతని కుమారుడు అనిల్ తదితర కుటుంబ సభ్యులు చిక్కమగళూరునుంచి వచ్చి అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కెంపేగౌడ విమానాశ్రయం నుంచి అంబులెన్స్ బయలుదేరిందని తెలిసిన వెంటనే జనసమ్మర్థం మరింత పెరిగింది.
మూడు రోజులుగా పక్కింట్లోనే తిరుగుతున్న ఆర్యకు ఈ పరిస్థితి అంతా అర్థం కావడం లేదు. మరణం అంటే ఏమిటో తెలియని వయసు అది. తనకు తెలిసినంతలో మనుషులు ఏడవడం అంటే ఎవరో తన బొమ్మ తీసుకున్నప్పుడు, పడిపోయి గాయమైనప్పుడు, లేదా కోరుకున్నది దొరకనప్పుడు మాత్రమే. కానీ ఇక్కడ ఎవ్వరూ గొడవపడడం లేదు. అయినా అందరూ ఏడుస్తున్నారు. ఆర్యకు కమలమ్మ అంటే అమ్మమ్మ, సందీప్ అంటే మామయ్య.
ఇంట్లో ఏడుపు ఎక్కువ కావడంతో ఆర్య బయటకు వచ్చాడు. ఆవరణలో పెద్దవాళ్లు చిన్నచిన్న గుంపులుగా నిలబడి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. బయట వరుసగా చెప్పులు కనిపిస్తున్నాయి. ఉదయాన్నే అమ్మ ఫోన్‌లో మాట్లాడినప్పుడు, ఈ రోజు నాన్న ఢిల్లీ నుంచి వస్తాడని ఆర్యకు తెలిసింది. ఎప్పుడొస్తాడో, ఏ ఆటబొమ్మలు తీసుకొస్తాడో అని వీధి చివర వైపు చూస్తూ నిలబడ్డాడు. అప్పుడే ఒక సరుకు ఆటో వచ్చి ఇంటి ముందు ఆగింది. దాని వెనుక భాగంలో ఒక పెద్ద గాజు పెట్టె కనిపించింది. దానితో పాటు శామియానా వస్త్రాలు, ఎర్రని ప్లాస్టిక్ కుర్చీలు కూడా ఉన్నాయి. కొంతమంది వచ్చి వాటిని దింపడం ప్రారంభించారు.
కొద్దిసేపట్లో ఇంటి ముందు శామియానా నిలిచింది. కుర్చీలు వరుసగా పేర్చబడ్డాయి. ఒక పూజారిని కూడా తీసుకువచ్చారు. ఆయన సంచిలో పూజా సామగ్రి ఉంది. మరికొందరు వచ్చి గులాబీ, కనకాంబర పూలహారాలను తీసుకొచ్చి కుర్చీలపై ఉంచారు. కుర్చీలు నిండిపోవడం ప్రారంభమైంది. మొదటగా వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న వారిలో చాలా మంది కరోనా సమయంలో సందీప్ సహాయంతో ప్రాణాలు దక్కించుకున్నవారే. వారి ముఖాల్లో తమ ఇంటి కొడుకుని కోల్పోయిన బాధ కనిపిస్తోంది.
ఇంట్లో వినిపిస్తున్న ఏడుపు క్రమంగా బయట ఆవరణమంతా వ్యాపించింది. ఆర్య ఇంటి గేటు దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతని వయసు పిల్లలు ఇద్దరు స్కూలు నుంచి వచ్చి నిలబడ్డారు. వాళ్లు కూడా గాజు పెట్టెను ఆసక్తిగా చూస్తున్నారు.
కొద్ది సేపటికి అంబులెన్స్ వీధిలోకి వచ్చింది. అక్కడున్నవాళ్లంతా లేచి నిలబడ్డారు. అంబులెన్స్ వెనుక తలుపులు తెరిచి, తెల్లటి వస్త్రంలో చుట్టిన శరీరాన్ని గాజు పెట్టెలో ఉంచి దింపడం ప్రారంభించారు. అంతే. సందీప్ ఇంటి ఆవరణలోని ఏడుపు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. అతని అక్క సుప్రియ స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే కొందరు నీళ్లు చల్లి లేపారు. ఏడుపు మరింత పెరిగింది. పెద్దవాళ్ల మధ్య నుంచి ఆర్య, అతని స్నేహితులు ముందుకు చేరుకున్నారు.
ఆర్యకు సందీప్ ముఖం కనిపించింది. కానీ అది తనకు తెలిసిన సందీప్ మామయ్యలా అనిపించలేదు. గాజు పెట్టెలో ఎవరో నిశ్చలంగా పడుకుని ఉన్నట్టే కనిపించింది. ఒక పెద్దాయన పక్కనే నిలబడి, “పాపం… ముఖం ఎంత ఉబ్బిపోయిందో చూడు…” అన్నాడు. సందీప్ చనిపోయాడని పిల్లలకు తెలిసింది. కానీ ఆ మాటలోని బాధ ఇంకా వారి హృదయాలను తాకలేదు. మృతదేహాన్ని మరొక గాజు పెట్టెలో ఉంచి అలంకరించడం ప్రారంభించారు. ఆర్య మాత్రం తన స్నేహితులతో కలిసి వీధిలో తిరుగుతూనే ఉన్నాడు. కార్లు, బైకులు వరుసగా వచ్చి ఆగుతున్నాయి. గాజు పెట్టెపై పూలు పేరుకుపోతున్నాయి. సందీప్ ఫోటోతో పెద్ద ఫ్లెక్సీలు ముద్రించి వీధి మొదట్లో, ఇంటి ముందు కట్టారు. ఆర్య స్నేహితుడు మహేష్ ఆ ఫ్లెక్సీని చూపిస్తూ, “ఇది కన్నడలో ఉంది” అన్నాడు. అప్పుడు ఆర్య అక్షరాలను కూడదీసుకుంటూ చదివాడు— “మ…ళ్లీ… పు…ట్టి… రా… స్నే…హి…తు… డా…” ఆ మాటల అర్థం అతనికి పూర్తిగా తెలియకపోయినా, ఆ వీధి అంతా మాత్రం ఆ ఒక్క వాక్యంలో మునిగిపోయింది.
అప్పటికే ఒక ఫార్చ్యూనర్ కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. అందులోనుంచి నలుగురు దిగారు—ఒక మధ్యవయస్క దంపతులు, ముప్పై ఏళ్ల యువకుడు, ఇరవై ఐదు సంవత్సరాల యువతి. వారిని చూసిన వెంటనే ఆర్యకు ఏదో గుర్తొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఒక ఫోటోలో చూసిన అమ్మాయి ఇదేనని అనిపించింది. సందీప్ మామయ్యకు పెళ్లి చేయాలని చూసిన అమ్మాయి. ఆ రోజు తననూ వెంట తీసుకెళ్లమని అడిగితే, “మరొకసారి తీసుకెళ్తాం” అని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి పేరు “ప” అక్షరంతో మొదలవుతుందని గుర్తుంది. కానీ పూర్తి పేరు మాత్రం ఎంత ఆలోచించినా గుర్తుకురాలేదు.
ఆ యువతి నేరుగా కమలమ్మ దగ్గరకు వెళ్లి కూర్చుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ముందే ఎర్రబడిన ఆమె కళ్లూ మరింత వాచిపోయాయి. ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న కొందరు మహిళలు ఆమెను చూసి తమలోతాము మాట్లాడుకున్నారు. గాజు పెట్టెలో నిశ్చలంగా పడి ఉన్న సందీప్ ముందు నిలబడినవారు మౌనంగా తలవంచి వెళ్లిపోతున్నారు. కానీ చిన్నపిల్లలకు మాత్రం ఎవరూ మరణం గురించి వివరించి చెప్పడం లేదు. “సందీప్ మామయ్య ఎందుకు ఇలా పడుకున్నాడు?” “ఎందుకు ఎవరూ లేపడం లేదు?” అనే ప్రశ్నలు పిల్లల మనసుల్లోనే మిగిలిపోయాయి.
ఇంతలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గాజు పెట్టె పక్కన అగరుబత్తులు వెలిగించారు. కొంత దూరంలో కట్టెల కుప్పకు నిప్పంటించారు. ఒక వృద్ధుడు రాళ్లను పేర్చి పొయ్యి చేసి పెద్ద పాత్రలో అన్నం వండడం ప్రారంభించాడు. ఆర్య, అతని స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ఇంట్లో కాకుండా బయట ఇలా అన్నం వండడం వాళ్లు ఎప్పుడూ చూడలేదు. “మన ఇంట్లో కూడా ఇలాంటి పాత్ర ఉంది. రేపు ఆదివారం కదా, మనమూ అన్నం వండుకుందాం” అని ఆర్య స్నేహితుడు పూర్విత్ అన్నాడు. మిగిలిన వాళ్లు కూడా ఉత్సాహంగా తలూపారు.
అప్పుడే ఒక పాత ఓమ్నీ వ్యాన్ అక్కడికి వచ్చింది. దానిలోనుంచి ఆరుగురు దిగారు. అందరూ ఒకే రకమైన ఎరుపు–నీలం రంగుల యూనిఫార్ములు ధరించారు. బంగారు రంగు అంచులతో మెరిసిపోతున్న ఆ దుస్తులు వాళ్లకు కొంచెం పెద్దగానే ఉన్నాయి. వాళ్లు దిగగానే వాద్యపరికరాలు బయటకు తీశారు. వ్యాన్ పక్కన పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది— “డా. రాజ్‌కుమార్ బ్యాండ్ సెట్, మూడలపాళ్య, విజయనగర్” ఆర్య తన స్నేహితులకు అది చదివి వినిపించాడు.
నలుగురు యువకులు వాద్యాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ వాయించడం మాత్రం మొదలుపెట్టలేదు. అందరూ వ్యాన్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే వ్యాన్ లోపల ఒక చిన్న గొడవ జరుగుతోంది. ఆర్య వయసున్న ఒక బాలుడిని ఒక ముసలివాడు బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ బాలుడు రావడానికి ఒప్పుకోవడం లేదు. “వస్తావా లేదా కొడతానా?” అని తాతయ్య కోపంగా అడిగాడు. “రాను!” అని బాలుడు ఏడుస్తూ తమిళంలో జవాబిచ్చాడు. ఇంకో యువకుడు నవ్వుతూ, “రాకపోతే మేమే వాయిస్తాం” అన్నాడు. దాంతో తాతయ్య అతడిని కోపంగా చూసి మందలించాడు. ఇంటివైపు చూస్తూ నిలబడ్డవాళ్లు “ఎందుకింత ఆలస్యం?” అన్నట్లుగా సైగలు చేయడంతో, “రెండు నిమిషాలు సార్!” అని తాతయ్య చెప్పాడు.
మళ్లీ వ్యాన్‌లోకి వెళ్లి, “కుమరా… రెండు గంటల పని మాత్రమే. వంద రూపాయలు ఇస్తాను” అని చెప్పాడు. అయినా బాలుడు వినలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. కోపంతో తాతయ్య ఒక చెంపదెబ్బ కొట్టి బయటకు వచ్చాడు. అయినా కుమరన్ కదల్లేదు. ఆ చిన్న బాలుడి ముందు ఒక జత గిలకలు (చేతిలో పట్టుకుని కదిలించే తాళవాద్యాలు) ఉన్నాయి. బ్యాండ్‌లో వాటిని వాయించాల్సింది అతడే. అది పెద్ద పని కాదు. చేతిలో పట్టుకుని తాళానికి తగ్గట్టు ఊపాలి. అప్పుడు “జిల్ జిల్” అని శబ్దం వస్తుంది. పాటకు అందం పెరుగుతుంది. అందుకే ఆ పని సాధారణంగా చిన్న పిల్లలకు ఇస్తారు.
కానీ కుమరన్ మాత్రం ఇక ఆ పని చేయనని మొండిగా కూర్చున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇలాగే ఒక అంత్యక్రియలకు వెళ్లినప్పుడు తన పాఠశాల స్నేహితులు చూసి ఎగతాళి చేశారు. ఆ అవమానం అతని మనసులో ఇంకా మిగిలి ఉంది. అందుకే ఇక నుంచి గిలకలు వాయించబోనని తాతయ్యకూ, అమ్మకూ చెప్పేశాడు. ఈరోజు కూడా అదే పట్టుదల. కుమరన్ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం భవనం మీద పెయింటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యత అంతా తాతయ్య ఈశ్వరన్ మీద పడింది. బ్యాండ్ పనులు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే వచ్చిన ప్రతి పనీ అతనికి ఎంతో విలువైనది. “ఈరోజు మనం సరిగా పని చేయకపోతే రేపు ఎవరు పిలుస్తారు?” అనే భయం అతడిని వెంటాడుతోంది.
ఇదంతా చూస్తున్న ఆర్య, మహేష్, పూర్విత్‌లకు మాత్రం వేరే ఆలోచన వచ్చింది. కుమరన్ ఎదుట పడి ఉన్న రంగురంగుల యూనిఫార్ములు, గిలకలు వాళ్లకు ఆటబొమ్మల్లా కనిపించాయి. వాటిని వేసుకుని తామే వాయించాలని అనిపించింది.
బ్యాండ్ బృందం ఇంకా సిద్ధంగానే ఉంది. గిలకలు లేకుండా పాటకు పూర్తి అందం రాదని ఈశ్వరన్‌కు తెలుసు. కానీ కుమరన్ మాత్రం ఓమ్నీ వ్యాన్‌లో కూర్చొని మొండిగా ఏడుస్తూనే ఉన్నాడు.
అప్పటికే ఇంటి ముందు చేరిన జనసందోహం మరింత పెరిగింది. సందీప్‌ను చివరిసారిగా చూసేందుకు వచ్చినవాళ్లు వరుసగా గాజు పెట్టె ముందు నిలబడి నమస్కరించి వెళ్తున్నారు.
అంతలో ఢిల్లీ నుంచి వచ్చిన టాక్సీ ఇంటి ముందు ఆగింది. రాజేష్ దిగాడు. అతన్ని చూసిన నిరీక్ష వెంటనే అతని ముఖం వైపు చూసింది. ఎన్నో గంటల ప్రయాణం, మనసును కుదిపేసిన దుఃఖం—అన్నీ కలిసి అతని ముఖం పూర్తిగా వెలిసిపోయింది. ఆర్య మాత్రం నాన్న వచ్చాడనే ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ ఈసారి నాన్న ముఖంలో ఎప్పుడూ కనిపించే చిరునవ్వు లేదు. అది చూసి ఆర్య కొంచెం అయోమయంలో పడ్డాడు.
రాజేష్ నేరుగా సందీప్ మృతదేహం దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. గాజు పెట్టెలో నిశ్చలంగా పడి ఉన్న తన మిత్రుడిని చూసిన క్షణం అతని కళ్లల్లో నీళ్లు ఉప్పొంగాయి. కోవిడ్ సమయంలో తాను మంచంపై పడుకొని ఊపిరి కోసం పోరాడుతున్నప్పుడు, ఎదుట నిలబడి ధైర్యం చెప్పిన సందీప్ ముఖం గుర్తొచ్చింది. అప్పుడు తాను మంచంపై… ఇప్పుడు సందీప్ మంచంపై… ఆ ఆలోచనే అతన్ని క్రుంగదీసింది. కన్నీళ్లు ఆగలేదు. రాజేష్ ఏడవడం చూసి కమలమ్మ మళ్లీ బిగ్గరగా ఏడ్చింది. నిరీక్ష, ఆర్య ఇద్దరూ వచ్చి అతని పక్కన నిలబడ్డారు. తన నాన్నను ఇంతలా ఏడుస్తూ చూడడం ఆర్య జీవితంలో ఇదే మొదటిసారి. అతని గొంతు కూడా బిగుసుకుంది. ఎందుకో తెలియదు. కానీ తనకూ ఏడుపు వచ్చింది. అతను నాన్నను గట్టిగా పట్టుకున్నాడు. కొంతసేపటి తర్వాత సందీప్ కళాశాల స్నేహితులు రావడంతో రాజేష్ పక్కకు జరిగాడు.
కమలమ్మ వైపు నడిచాడు. ఆమె పక్కనే కూర్చొని ఉన్న యువతిని చూసాడు. అప్పుడే ఆర్యకు గుర్తుకురాని పేరు రాజేష్‌కు తెలిసింది. ఆమె పల్లవి. సందీప్ భార్య కావాల్సిన అమ్మాయి. ఇంకా కొద్ది నెలల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం పెళ్లికూతురిగా కాదు… శవం ముందు కన్నీళ్లు కార్చే దురదృష్టవంతురాలిగా అక్కడ కూర్చుంది. రాజేష్‌కు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మాటలు సరిపోవు. అక్కడ మిగిలింది కేవలం నిశ్శబ్దం, కన్నీళ్లు మాత్రమే.
ఒక్కో పూజ పూర్తవుతూ వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. ఇంతసేపు మోగుతున్న బ్యాండ్ ఒక్కసారిగా ఆగిపోయింది. “డబ్బు తీసుకుని సరిగ్గా వాయించకుండా ఆపేశారా?” అని కోపంగా అనుకున్న అనిల్ బ్యాండ్ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లి చూసినప్పుడు వాళ్లు కేవలం టీ తాగుతున్నారని తెలిసింది. తాను అనవసరంగా కోపపడినట్లు అనిపించి మౌనంగా నిలబడ్డాడు. ఓమ్నీ వ్యాన్‌లో మాత్రం ఇంకా కుమరన్ కూర్చునే ఉన్నాడు. అతను బయటికి కూడా చూడడం లేదు. టీ తాగుతున్న వాళ్లను మాత్రమే చూస్తున్నాడు. తాతయ్య ఈశ్వరన్ మాత్రం అప్పుడప్పుడూ అతని వైపు చూసి మళ్లీ ముఖం తిప్పుకుంటున్నాడు.
అప్పుడే పూజారి అనిల్‌ను పిలిచాడు. సందీప్‌కు చివరి హారం వేసిన తర్వాత అనిల్ బ్యాండ్ నాయకుడు ఈశ్వరన్ దగ్గరకు వచ్చాడు. “అన్నా… మీకు భోజనం చేయాలనిపిస్తే వెళ్లి వచ్చేయండి. ఇంకా అరగంట సమయం ఉంది.” అని అన్నాడు. ఈశ్వరన్ అడ్డంగా తల ఊపాడు. అతని సమాధానం అక్కడున్న అందరినీ కాసేపు మౌనంలో ముంచేసింది. “వాళ్లు పూర్తిగా మట్టిలో కలిసే వరకు మేము అన్నం తినం సార్. మేమే కదా వాళ్లను చివరి ప్రయాణానికి పంపేది. ఇప్పుడు వాళ్లు మా ఇంటివాళ్లే.” అన్నాడు. ఆ మాట విన్న రాజేష్, అనిల్ ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. జననం మనల్ని బంధువుల్ని చేయకపోవచ్చు. కానీ మరణం మాత్రం పరాయివాళ్లనూ ఒక కుటుంబంలా కలిపేస్తుంది.
ఇంతలో ఆర్య తన నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న తన కోసం ఎలాంటి ఆటబొమ్మ తీసుకురాలేదని ఇప్పటికే తెలుసుకున్నాడు. అందుకే కొద్దిగా కోపంగా ఉన్నాడు. కానీ నాన్న ముఖం చూసి ఏమీ అడగలేకపోయాడు. అప్పుడే రాజేష్ దృష్టి మళ్లీ ఓమ్నీ వ్యాన్ వైపు వెళ్లింది. లోపల ఇంకా కుమరన్ ఏడుస్తూనే ఉన్నాడు. ఆర్య వెంటనే చెప్పాడు: “నాన్నా… ఇతనికి నేను బిస్కెట్ ఇచ్చాను. తీసుకోలేదు.” రాజేష్ దగ్గరకు వెళ్లి మృదువుగా అడిగాడు “ఏమయ్యింది బాబూ? ఎవరు కొట్టారా?” కుమరన్ సమాధానం చెప్పకుండా తాతయ్య వైపు చూశాడు. రాజేష్ ప్రశ్నించగానే ఈశ్వరన్ ముందుకు వచ్చాడు. “సార్, గిల్కీ లేకపోతే మా పాటకు అందం ఉండదు. పాట పూర్తికాదు. ఇలా వాయిస్తే వినేవాళ్లు మళ్లీ మమ్మల్ని పనికి పిలవరు. ఈ పిల్లాడు గిల్కీ వాయించనని మొండిగా కూర్చున్నాడు.” అంటూ కుమరన్ వైపు కోపంగా చూశాడు. “ఇంటికి నడువు!” అని గట్టిగా అన్నాడు. అయినా కుమరన్ కదల్లేదు. అదే సమయంలో నిరీక్ష కూడా అక్కడికి వచ్చింది. రాజేష్ కాసేపు ఆలోచించి, “నేను వాయించనా?” అని అడిగాడు. ఈశ్వరన్ ఆశ్చర్యంగా అతని ముఖం చూశాడు. అప్పటికే నిరీక్ష ముఖంలో అసౌకర్యం కనిపించింది. బహుశా ఆమె మనసులో ఇంకా కులం, వృత్తి, సామాజిక భేదాల గురించి సంకోచం మిగిలి ఉండొచ్చు. రాజేష్ గొంతు బిగుసుకుంది. “పంపేవాళ్లు చికాకుతో పంపితే… వెళ్లేవాళ్లకు శాంతి దొరుకుతుందా అన్నా?” అని మెల్లగా అడిగాడు. ఆ మాట విన్న ఈశ్వరన్ మౌనమయ్యాడు. గిలకల సంగతి వినగానే ఆర్యకు ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. ఇప్పటివరకు నాన్నపై ఉన్న కోపమంతా మర్చిపోయి, “నాన్నా… నేను… నేను…” అంటూ అతని చేతిని లాగాడు. రాజేష్ వ్యాన్‌లోకి వంగి గిలకలను తీసుకుని తన కొడుకు వైపు చాచాడు.
ఆర్య ఆనందంతో వాటిని అందుకోబోతుండగా నిరీక్ష అడ్డుకుంది. భర్త వైపు చూసి, “మనం ఇవన్నీ చేయకూడదు…” అంది. ఆ మాటలో సంకోచం ఉంది. సమాజం ఏమనుకుంటుందో అనే భయం ఉంది. అప్పుడు రాజేష్ ఆమెను నేరుగా చూశాడు. అతని కళ్లలో కోపం లేదు. కానీ గాఢమైన నిజం ఉంది. “కోవిడ్ సమయంలో నేను చనిపోతూ ఉండగా సందీప్ కూడా ‘మనమిదంతా చేయకూడదు‘ అని ఆలోచించి ఉంటే?” అన్నాడు. నిరీక్ష మౌనాన్ని ఆశ్రయించింది. రాజేష్ అక్కడే ఆగలేదు. తన జీవితాన్ని మార్చేసిన వాక్యం చెప్పాడు. “మరణాన్ని జయించిన నేను… కులానికి మాత్రం ఓడిపోను.” ఆ మాట విన్న నిరీక్ష కళ్లలో నీళ్లు నిండాయి. నెమ్మదిగా ఆమె చేతులే గిలకలను తీసుకుని ఆర్య చేతిలో పెట్టాయి. కళ్లతోనే క్షమాపణ కోరింది. రాజేష్ చిరునవ్వు నవ్వాడు. ఆ క్షణంలో అతను మరింత పెద్ద మనిషిగా కనిపించాడు.
ఈశ్వరన్ ఆర్యకు గిలకలు ఎలా వాయించాలో చూపించాడు. కొద్దిసేపటికే బ్యాండ్ మళ్లీ ప్రారంభమైంది. కొత్త పాట మొదలైంది. ఆర్య చిన్న చేతుల్లో గిలకలు మోగాయి. “జిల్… జిల్… జిల్… జిల్…” అని ఆ శబ్దం బ్యాండ్ సంగీతంలో కలిసిపోయింది. ఇప్పటివరకు బాధతో నిండిపోయిన ఈశ్వరన్ ముఖంలో మొదటిసారి చిరునవ్వు కనిపించింది. అతని బృందం కూడా ఉత్సాహంగా వాయించడం మొదలుపెట్టింది. పల్లవి, కమలమ్మ, సుప్రియా—అందరూ ఒక్కసారిగా బ్యాండ్ వైపు చూశారు. ఆర్య వారిని చూసి అమాయకంగా నవ్వాడు.
గిలకలు వాయిస్తున్న ఆర్య కళ్లలో మెరిసిన ఆనందం, క్రమంగా రాజేష్, నిరీక్షల హృదయాల్లోకి ప్రవహించింది. మరణపు బాధను అది కొద్దిగా తగ్గించింది. వ్యాన్ లోపల కూర్చున్న కుమరన్ కూడా బయటికి తొంగి చూశాడు. తాను చేయనని మొండిగా తిరస్కరించిన గిలకలను ఇప్పుడు ఆర్య ఎంత సంతోషంగా వాయిస్తున్నాడో చూశాడు. మొత్తం వీధి అంతా బ్యాండ్ సంగీతంతో నిండిపోయింది. మిగిలిన శబ్దాలన్నీ మాయమయ్యాయి. ఆర్య స్నేహితులు కూడా తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.
కళ్లలో నీళ్లు నిండి ఆ సంగీతాన్ని వింటున్న రాజేష్‌కు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. గాజు పెట్టెలో నిశ్చలంగా పడి ఉన్న సందీప్ ముఖం వైపు చూశాడు. ఇప్పటివరకు కనిపించిన బాధ, వేదన, కఠినత అన్నీ క్రమంగా చెరిగిపోతున్నట్టుగా అనిపించింది. ముఖం మళ్లీ పాత రోజుల సందీప్‌లా ప్రశాంతంగా కనిపించింది.
![]()

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.




Discussion about this post