ఆంగ్లమూలం : “Leisure“ by W.H. Davies
అనువాదం -హిమజ
చింతలతో నిండిన ఈ జీవితం ఏమిటి,
ఆగి ఆస్వాదించేందుకు వేళే లేకపోతే?
చెట్ల కొమ్మల కింద నిలబడి,
గొర్రెలు, ఆవులు చూసినంత సేపైనా
ప్రకృతిని చూడటానికి సమయం లేదు.
అడవి దారిన నడిచేటపుడు
గడ్డిలో ఉడతలు దాచుకున్న గింజలను
గమనించే ఖాళీ లేదు.
పగటి వెలుగులోనే,
నక్షత్రాలతో నిండిన నిశి ఆకాశంలా మెరిసే
ప్రవాహాలను తిలకించటానికి తీరిక లేదు.
సౌందర్యం ఒక్కసారి చూపు తిప్పితే,
ఆమె నర్తించే అడుగుల సోయగాన్ని
వీక్షించటానికి ఓపిక లేదు.
ఆమె కళ్లలో మొదలైన చిరునవ్వు
పెదవులపై వికసించే వరకు
వేచి చూసేందుకు సమయం లేదు.
చింతలతో నిండిన ఆ జీవితం ఎంత దయనీయమో —
ఆగి నిలిచి, ఆస్వాదించేందుకు సమయమే లేనప్పుడు!
ఇది William Henry Davies రాసిన “Leisure” అనే ప్రసిద్ధ కవిత. ఈ కవితలో కవి మనుషులు రోజువారీ పనులు, ఆందోళనల్లో మునిగిపోయి ప్రకృతి సౌందర్యాన్ని, జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడానికి కూడా సమయం కేటాయించకపోవడాన్ని విచారిస్తున్నాడు. జీవితం కేవలం పరుగులు తీయడం కోసం కాదు; కొంతసేపు ఆగి ప్రకృతిని, అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించడం కూడా అవసరమని చెబుతున్నాడు.

2005 నుండి కవిత్వం రాస్తున్నారు, ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ వీరి కవితా సంకలనాలు. తాజాగా అఫ్రో అమెరికన్ కవయిత్రి మాయా ఏంజిలో కవితల అనువాదం పుస్తకంగా వచ్చింది. సంచిక అంతర్జాల పత్రికలో “పొయెట్స్ టుగెదర్” శీర్షికతో భిన్న కవుల విభిన్న కవిత్వాన్ని అనువదించి అందించారు.
సిసి రెడ్డి గారి ‘మనభూమి’మాసపత్రికలో ‘హిమశకలం’ పేరుతో సంవత్సరం పాటు కాలమ్ నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రిక లో పద ప్రహేళిక నిర్వహించారు. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి కవయిత్రి తొలి ప్రోత్సాహక పురస్కారం, రొట్టమాకు రేవు అవార్డు, అమృతలత అపురూప అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, కలేకూరి ప్రసాద్ స్మారక అనువాద పురస్కారం- అందుకున్నారు.
‘రెండు సంతకాలు‘ త్వరలో రానున్న కవితా సంకలనం
ప్రముఖ కవి రాజేందర్ జింబో హిమజ జీవన సహచరులుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.



