• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

టర్కిష్ కథ : వలసపిట్ట

డా. ఎ.యం. అయోధ్యారెడ్డి by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
July 10, 2026
in అనువాద కథలు
0
టర్కిష్ కథ : వలసపిట్ట

మూలం: ఎలిప్ షఫాక్ (టర్కీ)
స్వేచ్ఛానువాదం: ఎ.యం.అయోధ్యారెడ్డి

శీతాకాలం ఈ పాడుబడిన పట్టణానికి ఒక మహారాణిలా వస్తుంది. ప్రకృతిధర్మం ప్రకారం తన రాక గురించి ముందుగానే సంకేతాలు ఇస్తుంది. చల్లని గాలులు దాని దూతలు. మంచు రేణువులు సందేశాలు. తనొస్తున్నట్టు కొన్నివారాల ముందే చెపుతుంది.

కానీ ఈ సంవత్సరం అలాలేదు. ఈసారి శీతాకాలం ఎవ్వరిని అప్రమత్తం చేయకుండా ఒక్కసారిగా దాడిచేసింది. ఒకే రోజులో.. కొన్ని గంటల్లోనే పట్టణాన్ని ముట్టడించింది.

నేను ఉదయం లేచేసరికి చలిగాలి తీవ్రంగా వుంది. అది చర్మాన్ని తాకేది కాదు, లోపలికి చొచ్చుకుపోయేది. మధ్యాహ్నానికి

శ్వాస తీసుకోవడమే పోరాటంలా అనిపించింది. రోడ్లు తెల్లని మంచుతో కప్పబడి పోయాయి. ఇళ్ళ పైకప్పులు, చెట్లు, వాహనాలు అన్నీ శ్వేతవస్త్రాలు ధరించి ఒకేవిధంగా ప్రకృతి తన రంగుల్ని మరిచినట్టుగా ఉన్నది. సాయంత్రానికి మంచు దట్టంగా కురవడం మొదలైంది.

ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళిన మేం ఎవ్వరమూ తిరిగి ఇళ్లకు వెళ్లలేని స్థితిలో అక్కడే చిక్కుకుపోయాం. రోడ్లు మూసుకుపోయాయి. బాహ్య ప్రపంచం నుంచి క్యాంపస్ తాత్కాలికంగా వేరుపడి చిన్న దీవిలా మారిపోయింది.

మంచులో నడవడం కష్టంగా వున్నది. నేను బరువైన బూట్లు వేసుకొని అడుగులు వేస్తూ కాంటీన్ వైపు వెళ్ళాను. ప్రతి అడుగు చప్పుడు గట్టిగా వినిపిస్తుంది. నా బూట్లు బాగా తడిసిపోయి ఇసుక బకెట్లు మోసినంత బరువుగా అనిపించాయి.

చలి తట్టుకోలేక అందరూ వెచ్చదనం కోసం కాంటీన్ వైపు పరుగులు తీశారు. నేను కూడా వెళ్లాను. లోపలికి వెళ్లగానే వేడి గాలి తాకింది.

కాంటీన్‌లో అడుగుపెట్టగానే ఒక్కసారిగా మనుషుల సందడి వినిపించింది.

సాధారణంగా ఖాళీగా ఉండే కుర్చీలన్నీ నిండిపోయాయి. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంతా ఒకే కప్పుకింద చేరిపోయారు. బయట వాతావరణం సర్దుకునే వరకు ఇక్కడే ఉండాలని చెప్పుకుంటున్నారు. కాఫీ వాసన, బిగ్గరగా మాటలు.. నవ్వులు బయట చలిని కాసేపు మరిపించాయి. ఒక మూల నేనెప్పుడూ కూర్చొనే సీట్లో ఒక అపరిచితుడు కూర్చున్నాడు. అతని చుట్టూ నా స్నేహితులున్నారు.

చూడగానే నన్ను ఆకర్షించింది అతని ముఖం కాదు, జుట్టు. అది బంగారు రంగులో ఉంది. కాంతి పడితే మెరుస్తుంది. చర్మం తెల్లగా, చేతివేళ్లు సన్నగా, కళ్లలో బూడిదరంగు నీడ. చుట్టూ ఉన్న గోధుమ వర్ణం ముఖాల మధ్య అతను భిన్నంగా కనిపించాడు. ఆర్టిస్టు ఎవరో రంగులు పూర్తిగా వేయకుండా వదిలేసిన చిత్రంలా అనిపించాడు.

ఆ దృశ్యం నా చూపును కాస్సేపు అతనిపైనే నిలిపి వుంచింది. నేను అటు వెళుతుంటే ఆ యువకుడు చుట్టున్నవాళ్లకు ఏదో చెప్పాడు.

మాటల్లో నాకు సరిగా వినిపించలేదు. కానీ నా స్నేహితులు గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

“కమాన్ సల్మా.. ఇక్కడ మాతో కూర్చో!” అని నా ఫ్రెండ్ యాస్మిన్ పిలిచింది.

“మనకో కొత్త అతిథి వచ్చాడు. అతడు టర్కిష్ నేర్చుకుంటున్నాడు”

యాస్మిన్ నాకు స్కూలు రోజుల నుంచి స్నేహితురాలు. ఆమెప్పుడూ చలాకీగా.. మాటల్లో ఒక వేడి, వేగం ఉంటుంది. కానీ చూపుల్లో ఎప్పుడూ అనుమానం ఉంటుంది. ఆమెకు అది సాధారణం.

అపరిచిత యువకుడు నన్ను చూసి చేయి చాపాడు. టర్కిష్ పదాలు పట్టిపట్టి పలుకుతూ “నా పేరు జెరార్డ్. నీ పేరు?” అన్నాడు.

అతని టర్కిష్ ఉచ్ఛారణకు మావాళ్లు స్నేహపూర్వకంగా నవ్వారు. విదేశీయులు ఎవరైనా టర్కిష్ మాట్లాడుతూ కష్టపడుతుంటే మేం ఇష్టంగా చూస్తాం. వాళ్లు సరిగా పలకకపోయినా, బాగా ప్రోత్సహిస్తాం.

కానీ నేను అతనితో చేతులు కలపలేదు.“సారీ నేను పురుషులతో చేతులు కలపను. మా ఇంట్లో అలాంటి ఆచారం లేదు” అన్నాను.

మాది మత విశ్వాసాలు నిష్టగా పాటించే కుటుంబం. పదకొండేళ్ల వయసు నుంచే నేను తలకు హిజాబ్ కప్పుకున్నా. నిజానికి నా అవతారం, నా కళ్లలో కనిపించే సంకోచం, ఇవి అతనికి ఒక సంకేతం కావాలి. కానీ తను అదేమీ గ్రహించలేదు.

నేను చిరునవ్వుతో చూశాను. అది మర్యాదకు మాత్రమే.

ఆ యువకుడు వెంటనే తన చేయి వెనక్కి తీసుకున్నాడు. చెంపలు ఎర్రబడ్డయి. కొంచెం సిగ్గుపడ్డాడు. ఒక పురుషుని ముఖంలో అలాంటి అపరాధ భావాన్ని చూడటం నాకు అదే తొలిసారి. ఆ క్షణమే అతనిపై ఒకరకమైన మమకారం ఏర్పడింది. ఇదేం నా బలహీనత కాదు, ఒక సున్నితత్వం.“నాపేరు సల్మా” అని మెల్లగా చెప్పాను.

“సల్.. మా” అని అతను చిన్న పిల్లాడిలా పునరావృతం చేశాడు.

నేనెళ్ళి గుంపులో కూర్చొన్నాను, కానీ కొంచెం దూరంగా. అతన్ని ఓరకంట గమనించాను. బాగా తెల్లగా, నాజూకుగా కనిపించాడు. గట్టిగా ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాడు. కళ్ళు, ముక్కు, జుట్టు ఈ దేశానికి చెందినవాడిగా అనిపించలేదు. చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ నాకో బుజ్జి కుక్కపిల్లని ఇచ్చింది. దాన్నెవరైనా బూటు కాళ్లతో తొక్కేస్తారేమో, ఎత్తుకు పోతారేమోని అస్తమానం భయపడుతూ ఎప్పుడూ దించకుండా చేతుల్లోనే ఎత్తుకొని ఉండేదాన్ని. జెరార్డ్ కూడా అలానే అనిపించాడు. చాలా సున్నితంగా, రక్షణ అవసరమైనవాడిలా.

మరుసటి రోజు మంచు కొంచెం కరిగింది. యాస్మిన్ నన్ను అడిగింది.

“ఆ డచ్ వాడి అసలు ఉద్దేశం ఏమిటో తెలిసిందా?”

“అతను చెప్పాడు కదా. ఈయూ ప్రోగ్రామ్. ఎక్స్చేంజ్ స్టూడెంట్.”

“నమ్మలేం” అనుమానంగా అంది.

“నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు.”

“అతను మిషనరీ కూడా కావచ్చు”

“అలా అనిపించడం లేదు. అతనికి భాషల మీద ఆసక్తి ఉంది.”

“లేదంటే యూరోపియన్ గూఢచారి కావొచ్చు”

“ఈ పట్టణంలో గూఢచారికి ఏం పని?”

“ఎవరికి తెలుసు” ఈ మాటకు ఇద్దరం నవ్వుకున్నాం. అయినా నా ఫ్రెండ్ అనుమానం పోలేదు. అప్పుడే మేం చూశాం. జెరార్డ్ ఒంటరిగా బెంచిమీద కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే చేయి పైకెత్తాడు. నాకు అర్థమైంది. అతను ఇకమీదట నన్ను చూసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించడు. కానీ ఈసారి సిగ్గుపడ్డది నేనే. అప్పట్నుంచి మా పరిచయం పెరిగి మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మొదట చిన్న మాటలు. తర్వాత క్రమంగా చనువు పెరిగింది. అతడు నేను చెప్పేది మాట్లాడక వినేవాడు. తను టర్కిష్ లో మాట్లాడితే తప్పులు సరిచేసేదాన్ని. నేనలా చేయడాన్ని అతడు  ఇష్టపడేవాడు.

“మీరు తప్పులు చెప్పడానికి మొహమాట పడకండి. అలాగైతే టర్కిష్ నేనెప్పటికి నేర్చుకోలేను” అనేవారు.

ఆ మాటలో నిజాయితీ కనిపించేది. అతను సిగ్గరి అనిపించినా లోపల స్థిరచిత్తుడే అనుకున్నాను.

“జాగ్రత్త ఐలా” యాస్మిన్ హెచ్చరించింది.“నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా?”

“నువ్వేదో ఊహించుకోకు. అతడు కేవలం స్నేహితుడు మాత్రమే” అన్నాను.

“కానీ అతడు మగవాడు. పైగా ముస్లిం కాదు. బయటందరూ మీగురించి చెప్పుకుంటారు. నీ తండ్రికి తెలిస్తే…”

ఆమె వాక్యం పూర్తిచేయలేదు. కానీ నాకు బోధపడింది. తండ్రి గుర్తుకు రాగానే గుండెలో రాయి పడింది.

ఒకరోజు లంచ్ బ్రేక్‌లో జెరార్డ్, నేనూ మా తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాం.

“నీ కంటే ముందు నీ జుట్టే నన్ను మొదట ఆకర్షించింది” అన్నాను.

అతడు నవ్వి అన్నాడు.“ఇది మా అమ్మవాళ్ల నుంచి వచ్చింది. నా సున్నితత్వం, బలహీనత, భావుకత కూడా అటునుంచి వచ్చిందే.”

“మరి నా గురించి ఏమనుకున్నావు?” అని అడిగాను.

“నిన్ను మొదట చూసినప్పుడు మహా కోపిష్టిలా కనిపించావు.”

“ఎందుకలా అనిపించింది?”

“ఎందుకంటే నువ్వు చాలా ముభావంగా ఉన్నావు. కోపంగా ఉండేవాళ్లు నాకు భయంకరంగా కనిపిస్తారు.”

ఆ మాటలు నన్ను కదిలించాయి. ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే కోపంగా ఉండే ఒక మనిషి నాకు దగ్గరగా తెలుసు. అతనెవరో కాదు, మా బాబానే. మా ఇంట్లో తండ్రి మాటే చట్టం. తన కోపంతో అందరిని వణికిస్తాడు. ఆయన ఒకప్పుడు చెడు అలవాట్లకు బానిసై  ఉండేవారని చెపుతారు. క్లబ్బులకు వెళ్లేవాడు. చెడు స్నేహాలు చేసేవాడు. నాకు ఏడేళ్ల వయసప్పుడు, బాబా ఒక వేశ్యతో తిరిగి డబ్బంతా ఖర్చు చేశాడు. క్లబ్ లో పెద్దఎత్తున బాకీలు పడి అక్కడి బాడీగార్డుల చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాతే తన నడవడి తప్పని గ్రహించినట్టున్నాడు. మిగతా జీవితాన్ని పాప ప్రక్షాళన కోసం అంకితం చేయాలను కొన్నాడు. ఫలితంగా ఇంట్లో యాష్‌ట్రేలు మాయమైనయి. వైన్ బాటిళ్లు పోయాయి. సిగరెట్ వాసన, మద్యం వాసన, చవకబారు సెంట్లు అన్నీ పోయాయి.

అమ్మ చాలా సంతోషించింది. తర్వాత ఇంకొన్ని రోజులకు ఇంట్లో టీవీ కూడా పోయింది. నేను స్కూల్‌ నుంచి వచ్చేసరికి టీవీ క్యాబినెట్‌ ఖాళీగా కనిపించింది.“టీవీ ఎక్కడ?” అని అడిగాను.

“నీ తండ్రి ఎవరికో ఇచ్చేశాడు” అంది అమ్మ.

“మళ్ళీ ఎప్పుడు తెస్తారు?”

“మనకు టీవీ అవసరం లేదు”

నేను ఏడ్చాను. ఎంత గొడవ చేయాలో అంతా చేశాను. కానీ బాబా ఇంటికి రాగానే ఎలుకలా మారిపోయాను. ఆయనకు ఎదురునిలిచే  ధైర్యం లేదు. అమ్మకూ లేదు.. అక్కకూ లేదు. నిజానికి ఆయన మమ్మల్ని ఏనాడూ కొట్టలేదు. కానీ ఆ అవసరం లేకుండానే మమ్మల్ని వణికించగలిగాడు. ఆయన చూపులు వాడి బాణాల్లా గుచ్చుకునేవి. కోపంగా మాట్లాడితే మాటలు తూటాల్లా పేలేవి.

అమ్మకైతే ఆయనో సింహస్వప్నం. అదే భయం పిల్లలమైన మాకూ అంటుకుంది. దేవుడు బాబా అలవాట్లు కొన్ని మార్పించ గలిగాడు కానీ అతన్ని శాంత స్వభావిని చేయలేకపోగా మరింత కోపిష్టిని చేశాడు. దేవుని సంగతి అటుంచితే బాబా మాత్రం ఎప్పుడూ నిప్పుల మీద కూర్చున్నట్టు మంటగానే ఉంటాడు.

జెరార్డ్ నా కుటుంబం గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. మొదట మొహమాటపడ్డాను. కానీ తర్వాత అతనికి చెప్పకూడని విషయాలు కూడా చెప్పడం మొదలుపెట్టాను. బహుశా అతడు వింటున్న విధానం నన్నలా ఎక్కువ మాట్లాడేలా చేసేది.

మా ఇంట్లో నానమ్మ గొప్ప భక్తురాలు. దేవుని మీద ఆమె విశ్వాసం బాబా మాదిరి భయపెట్టేది కాదు. ఆమెకు జీవితం పట్ల ఒక మృదుత్వం ఉంటుంది. ఒకరోజు జెరార్డ్ గురించి ఆమెతో చెప్పాను. “జాగ్రత్త.. నీ మనసు పారేసుకోకు” ఒక్కమాటలో నన్ను హెచ్చరించింది.

“ఎందుకు? అతడు క్రైస్తవుడు కావటం వాళ్లనా?” అడిగాను.

“అదొక్కటే కాదు. అతను వలస పక్షి. ఈ రోజు ఇక్కడ, రేపు మరెక్కడో” అంది.

“అతని మతం వేరు కావొచ్చు. కానీ తలుచుకుంటే మార్చుకోవచ్చు కదా?”

నానమ్మ ముఖంలో ఆందోళన వ్యక్తమైంది.“ఈ మాటలు నీ తండ్రి విన్నాడంటే ప్రమాదం”

“కానీ మీరు ఆయనకు తల్లి. తను మీ మాట వినాలి.”

ఆమె నావైపు విచారంగా చూసింది. “నీ తండ్రి మనసును కరిగించగల శక్తి అల్లాకు మాత్రమే వుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అప్పటిదాక మనం వేచి ఉండాలి. అల్లాను ప్రార్థించాలి.”

ఆమె మాటల్లో నిజం ఉంది. కానీ నాకెందుకో పట్టించుకోవాలని అనిపించలేదు.

వసంత కాలం వచ్చేసింది. అయినా గాలిలో ఇంకా చలి మిగిలే ఉంది. నా మనసులోనూ ఒక ఘనీభవించిన స్థితి ఉన్నది.

జెరార్డ్‌కు దూరంగా ఉందామని ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. మళ్లీ మళ్ళీ అతనితో మాట్లాడేదాన్ని. అందరూ చూస్తున్నారని తెలుసు. హిజాబ్ కప్పుకున్న అమ్మాయి, బంగారు జుట్టున్న ఒక ఐరోపా తెల్లవాడితో అంత చనువుగా ఉండటం, కలిసి ఎక్కువ సమయం గడపటం ఎవరి దృష్టిలోనూ పడకుండా ఉండదు.

రాత్రుళ్లు గదిలో పడుకున్నప్పుడు, అతనిలో నచ్చని విషయాలు వెతికే ప్రయత్నం చేసేదాన్ని. జెరార్డ్ ఎక్కువ శబ్దం చేస్తూ తినేవాడు. అది కొంచెం చిరాకు తెప్పించేది. అతని చర్మం మరీ తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు మోచేతుల వరకేనా లేక శరీరం లోపల కూడానా అనే ఆలోచన కలిగేది. అంతలోనే అతని నగ్న రూపాన్ని ఊహిస్తున్నానని అర్థమై, ఆ భావన నా దేహాన్ని వేడెక్కించేది.“మేం పెళ్లి చేసుకుంటే మా పిల్లలు ఎలా పుడతారు?” అని ఒకసారి ఆలోచన కలిగింది.

నా లాంటి కళ్ళతోనా? లేక అతనిలా బంగారు జుట్టుతోనా? పెళ్లి తర్వాత హాలాండ్‌ వెళ్ళి బతకాలా? అట్లా కుదరదేమో. ముస్లిం ప్రాంతంలోనే ఉండాలి. అప్పటికి జెర్దార్ ఇస్లాం స్వీకరించి ఉండాలి. అతడు తన పేరు కూడా మార్చుకోవాలి.

ఒకరోజు మా అక్క ఫాతిమా నా నోటు బుక్స్ చూసి అన్నది. “ఈ సంగతి బాబాకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు.”

ఆ మాట నిజమే. బాగా భయమేసింది. ఆ భయంతోనే జెరార్డ్‌ ప్రతి జ్ఞాపకాన్ని తుడిచేయాలని ప్రయత్నించాను. అతని పేరున్న ప్రతి కాగితాన్ని చింపేశాను. అతనిచ్చిన బహుమతులు, రాసిన నోట్లు, ఉత్తరాలు, డ్రాయింగులు అన్నీ నాశనం చేశాను. కొన్ని నెలల తరబడి కూడబెట్టిన జ్ఞాపకాలను అరగంటలో మాయం చెయ్యగలమని అప్పుడు తెలుసుకున్నాను.

జెరార్డ్ ఈస్టర్‌ పండుగకి స్వస్థలానికి వెళ్లాలి. గత శీతాకాలంలో క్రిస్మస్ అలంకరణలు చేయలేక పోయానని అతడు నిరాశపడ్డాడు.ఈస్టర్ ఆచారాలు, చాక్లెట్ గుడ్లు, డచ్ ఈస్టర్ హేర్ గురించి చాలా చెప్పాడు. కానీ మా మతం గురించి, ప్రవక్త గురించి, పవిత్ర గ్రంధం ఒక్కమాట కూడా అనలేదు. నేనతడు చెప్పింది విన్నాను. అతన్ని అర్థం చేసుకున్నాను.

వెళ్లే ముందు నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. అది ఖలీల్ జిబ్రాన్ రాసిన ది బెలవ్డ్. “నా వద్ద ఇదొక్కటే ఉంది” అన్నాడు.“నిజానికి మనిద్దరం ఒకేసారి చదివితే, మరింత దగ్గరగా ఉండేవాళ్లం. తర్వాత కలిసినప్పుడు బుక్ గురించి మాట్లాడుకుందాం.” అన్నాడు. అతని ముఖంలో ఒక మృదువైన బావ ప్రకటన మెరిసింది.

చుట్టూ చూశాను. కారిడార్లో ఎవరూ కనిపించలేదు. చటుక్కున అతని చెంపలపై ముద్దుపెట్టి వీడ్కోలు చెప్పాను. ఆ స్పర్శ చాలాసేపు నా పెదవులను మండిస్తూనే ఉన్నది. ఒక శుక్రవారం నమాజు తర్వాత అమ్మ నన్ను పక్కకు పిలిచింది.

“మన కుటుంబం పరువు మంట గలపాలని చూస్తున్నావా? సిగ్గు లేదూ?” అన్నది కోపంగా. నాకు విషయం అర్థమైంది. ఇందులో దాచడానికి ఏమీలేదు. నేనతన్ని ప్రేమిస్తున్నాను. అతడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడని భావించాను. “అతడు నన్ను పెళ్లి చేసుకుంటాడు. తిరిగి రాగానే మన ఇస్లాం కూడా స్వీకరిస్తాడు” అని చెప్పేశాను. అది నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు. ఆ క్షణంలో ధైర్యమే ముఖ్యం. అమ్మలో నేనెప్పుడూ చూడని కోపం. “ఇది ఇంతటితో ఆపేయ్. లేదా మీ బాబా నిన్ను చంపేస్తాడు. నిన్నే కాదు నన్నూ చంపేస్తాడు.”

ఆ రాత్రి నాకో కల వచ్చింది. నేను చాలా సంతృప్తిగా వున్నాను. నా పక్కన ఒక పురుషుడు నిలుచుని ఉన్నాడు. అతను జెరార్డ్. అది చర్చి కాదు.. మసీదు కూడా కాదు.. మరేదో పవిత్ర స్థలం. అతడు నా చెయ్యి పట్టుకుని వున్నాడు.

“నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. లేకపోతే మనం ఎలా కలిసుండగలం?” అన్నాడు.

అప్పుడు చూశాను నా వొంటి మీద ఉన్న గౌను. ముత్యపు రంగులో పొడవైన గౌను. అంటే మేం పెళ్లి చేసుకోబోతున్నాం.

ఉదయం నిద్రలేచాక మనసు తేలికైనట్టు అనిపించింది. విషయం బాబాకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. కానీ అంతకన్నా ముందు వివాహం గురించి జెరార్డ్‌కు చెప్పాలి. ఇంట్లో కంప్యూటర్ లేకపోవడంతో యూనివర్సిటీ దాకా వెళ్ళి అతనికి మెయిల్ రాశాను.

నాకు ఇప్పటి వరకు ప్రేమంటే తెలియదు. ఎవరినీ ఇంతగా ప్రేమించింది లేదు. అందుకే అతనితో ఎట్లా చెప్పాలో తెలియలేదు. చాలాసేపు తటపటాయించి చివరకు నాలో ప్రేమ విషయం చెప్పాను. తిరిగి ఇక్కడికి వచ్చాక ఇస్లాం స్వీకరించాలని సూచించాను. ఎందుకో భయమనిపించినా అంతా మంచే జరుగుతుందని నమ్మాను.

వారం రోజులు అతని సమాధానం కోసం ఎదురుచూశాను. చివరకు ఒక మెయిల్ వచ్చింది.

“సల్మా… నువు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ మీద నాకెప్పుడూ అలాంటి భావన లేదు. మనం స్నేహితులమే. నాకు ఇక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ వుంది. ఆమెతో రిలేషన్ లో వున్నాను. నాకసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. అందులోనూ మతం మార్చుకోవడం అసాధ్యం. నేను నేనుగానే ఉండటం సంతోషాన్ని ఇస్తుంది. మళ్ళీ అక్కడికి రావాలనుకోవడం లేదు. నాకు మరోచోట ఫెలోషిప్ వచ్చింది. టర్కీలో గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి. ముఖ్యంగా నిన్ను జీవితాంతం మరిచిపోను.”

ఆ మెసేజ్ చదివాక కొన్నిరోజులు నేను కోలుకోలేక పోయాను. వర్సిటీలో కాంటీన్‌కి వెళ్లడం మానేశాను. నా క్లోజ్ ఫ్రెండ్ యాస్మిన్‌ను కూడా దూరం పెట్టాను. “నేను ముందే హెచ్చరించాను కదా” అని ఆమె సానుభూతి చూపితే అసలు భరించలేను.

ఇప్పుడు నా మనసు గాలిలో ఎగిరే ఎండుటాకు అయింది. క్షణం ముందుకు పోతాను.. తిరిగి వెనక్కి వస్తాను. నేలపై పడతాను. మళ్లీ ఎగురుతాను. ఏదీ మారనట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి చాలా మారిపోయాయి. జీవితం అలాగే సాగిపోతుంది.

నాలో అన్నీ తారుమారైనయి. మునుపటి నేను… ఇప్పుడసలు లేను.

రచయిత్రి ఎలిప్ షఫాక్ బయో

విఖ్యాత టర్కిష్ రచయిత్రి ఎలిఫ్ షఫాక్‌, అరబ్ గద్య సాహిత్యంలో ఒక లివింగ్ లెజెండ్.

ఆమె 1971 అక్టోబర్ 25 న జన్మించారు. బ్రిటన్ వలసవెళ్ళి స్థిరపడ్డారు. నవలా రచనతో పాటు ఆమె వ్యాసకర్త, రాజకీయ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్తగా అపారమైన ఖ్యాతి గడించారు. ఆమె తండ్రి నూరి బిల్గిన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, తల్లి షఫాక్ రాయబారి.

తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత, ఆమె అనివార్యంగా అంకారాలో తల్లి, అమ్మమ్మల వద్ద పెరిగింది. చిన్ననాటి పరిస్థితులు ఏమైనప్పటికి,  పితృస్వామ్యానికి దూరంగా వున్న వాతావరణం షఫాక్ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది.

మాడ్రిడ్, జోర్డాన్, జర్మనీ వంటి దేశాల్లో కొంతకాలం గడిపిన షఫాక్, మిడిల్ ఈస్ట్ టెక్నికల్ వర్సిటీలో డిగ్రీ చేసింది. తర్వాత మాస్టర్స్, రాజకీయ శాస్త్రంలో పీహెచ్‌డీ పొందింది. టర్కీతో పాటు అమెరికాలోని మౌంట్ హోలియోక్ కాలేజ్, మిషిగన్, అరిజోనా యూనివర్సిటీల్లో విద్యా బోధన చేశారు. ఆక్స్‌ఫర్డ్ లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

టర్కిష్, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేసే ఎలిప్ షఫాక్, ఇప్పటివరకు పాతికపైగా బుక్స్ ప్రచురించారు. ఆమె రాసిన నవలల్లో ‘ది బాస్టర్డ్ ఆఫ్ ఇస్తాంబుల్’ – ‘ది ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ – ‘త్రీ డాటర్స్ ఆఫ్ ఏవ్’ – ‘టెన్ మినిట్స్ థర్టీ ఎయిట్ సెకెండ్స్ ఇన్ దిస్ స్ట్రెంజ్ వరల్డ్’ – ‘ది ఐలాండ్ ఆఫ్ మిస్సింగ్ ట్రీస్’- బాగా పేరు తెచ్చుకున్నాయి. ఆమె రచనలు దాదాపు 60 భాషల్లోకి అనువదించబడి, అంతర్జాతీయ బెస్ట్‌సెల్లర్స్‌గా నిలిచాయి. 2025లో ఆమెను రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ అధ్యక్షురాలిగా నియమించారు. షఫాక్ రచనల్లో ఇస్తాంబుల్ నగరం ప్రధాన నేపథ్యంగా కనిపిస్తుంది. తూర్పు- పడమర సంస్కృతుల సంగమం, సమాజంలో మహిళల స్థానం, మానవ హక్కులు, మైనారిటీల సమస్యల వంటి అంశాలు విస్తృతంగా ప్రతిఫలిస్తాయి. షఫాక్ ప్రధానంగా స్త్రీవాది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మహిళా హక్కులు, మైనారిటీ హక్కుల కోసం గళమెత్తిన రచయిత్రి. సాహిత్యం ద్వారా మానవత్వాన్ని పునరుద్ధరించడం ఆమె రచనా లక్ష్యంగా ఉన్నది.

డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
Previous Post

కన్నడ కథ: నాలుగో ఆయామం

Next Post

హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!

Next Post
హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!

హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!

Subscribe
Login
Notify of
guest
Required
guest
2 Comments
Oldest
Newest Most Voted
Rajeshwari Srimallik
Rajeshwari Srimallik
11 days ago

Good story

0
Reply
Gopal Venuraja Rao
Gopal Venuraja Rao
8 days ago

Never love a stranger. On this theme there has been many stories and novels.
But the oldest story comes from Mahabharata.
Kalidasa took this story from Mahabharata and slightly changed the version in Abignana Shakuntalam.
First of I shall appreciate your free translation Mr.Ayodhya Reddy, Congratulations to you

Mobile
09959206973
0
Reply

ఈ సంచికలో…

  • సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!
  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
2
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply