ఆంగ్ల కవిత: హెర్మన్ హెస్సే
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణారావు
ప్రతి పువ్వూ వాడిపోతుంది.
ప్రతి యౌవనమూ
ఒక రోజు వెనుదిరుగుతుంది.
అలాగే
జీవితంలోని ప్రతి దశ,
ప్రతి సద్గుణం,
మనం గ్రహించిన ప్రతి సత్యం—
మన పయనంలో
కొంతకాలమే తోడుంటాయి;
శాశ్వతంగా మనతో ఉండవు.
జీవితం-
ఏ వయసులోనైనా
మనల్ని కొత్త పిలుపుతో ఆహ్వానించవచ్చు.
అందుకే,
ఓ హృదయమా,
విడిపోవడానికి సిద్ధపడు.
కొత్త ప్రయాణాన్ని ఆహ్వానించు.
ధైర్యంగా ముందుకు సాగు;
పశ్చాత్తాపానికి చోటివ్వకు.
ఎందుకంటే
పాత అనుబంధాల్లో దొరకని వెలుగు
కొత్త దారుల్లోనే కనిపిస్తుంది.
ప్రతి ఆరంభంలోనూ
ఒక అద్భుత శక్తి దాగి ఉంటుంది.
అదే
మనల్ని కాపాడుతుంది;
మనల్ని జీవింపజేస్తుంది.
ప్రశాంతంగా
దూర దిక్కుల వైపు సాగిపోదాం.
‘ఇదే నా ఇల్లు’
అనే మమకారం
మన అడుగులను నిలువరించనివ్వకు.
విశ్వాత్మ
మనల్ని బంధించదు;
దశల దశలుగా
ఇంకా విశాలమైన ప్రపంచాల వైపు
మనల్ని నడిపిస్తుంది.
మనమే నిర్మించుకున్న
ఒక గూటినే
శాశ్వత నివాసంగా భావిస్తే,
పరిచయం
నెమ్మదిగా జడత్వంగా మారుతుంది.
అందుకే
విడిపోవడం నేర్చుకోవాలి;
వీడ్కోలు చెప్పడం అలవాటు చేసుకోవాలి.
లేకపోతే
శాశ్వతత్వమనే భ్రమకు
బానిసలమైపోతాం.
మన మరణ ఘడియ కూడా
మనల్ని
ఇంకా కొత్త విశాలతల వైపు
వేగంగా తీసుకెళ్లవచ్చు.
జీవితం
ఇంకా కొత్త జీవన దశల వైపు
మళ్లీ మనల్ని పిలవవచ్చు.
అలా జరగనీ,
ఓ హృదయమా—
వీడ్కోలు చెప్పడం
ఎన్నటికీ మరువకు.
![]()
హెర్మన్ హెస్సే
హెర్మన్ హెస్సే (1877–1962) జర్మన్ మూలాలున్న స్విస్ రచయిత, కవి, వ్యాసకర్త, చిత్రకారుడు. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప సాహితీవేత్తలలో ఒకరైన ఆయన రచనలు వ్యక్తి ఆత్మాన్వేషణ, జీవిత పరమార్థం, ఆధ్యాత్మిక వికాసం, స్వేచ్ఛ, ప్రకృతి, ఒంటరితనం, నిరంతర మార్పు వంటి అంశాల చుట్టూ తిరుగుతాయి. మతపరమైన కుటుంబంలో జన్మించిన హెస్సే చిన్నప్పటి నుంచే సంప్రదాయ విశ్వాసాలకూ, వ్యక్తిగత స్వేచ్ఛకూ మధ్య సంఘర్షణను అనుభవించాడు; అదే ఆయన సాహిత్యానికి జీవం పోసింది. భారతీయ ఉపనిషత్తులు, బౌద్ధ తత్వం, తూర్పు ఆధ్యాత్మిక చింతన ఆయన ఆలోచనా ప్రపంచాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. సిద్ధార్థ, డెమియన్, స్టెప్పెన్‌వుల్ఫ్, నార్సిసస్ అండ్ గోల్డ్‌మండ్, ది గ్లాస్ బీడ్ గేమ్ వంటి రచనలతో ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన ఆయన, మానవ అంతరంగాన్ని అసాధారణమైన సున్నితత్వంతో ఆవిష్కరించినందుకు 1946లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని అందుకున్నాడు. జీవితం అనేది నిరంతర పరివర్తన; ప్రతి ముగింపు మరో ఆరంభానికి నాంది అనే ఆయన తాత్విక దృష్టి నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పాఠకులను ఆలోచింపజేస్తూనే ఉంది.
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.
సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.
ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.































