• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉర్దూ కథ : మొజెల్

పి. శ్రీనివాస్ గౌడ్ by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
in అనువాద కథలు
0
ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ మూలం : సాదత్ హసన్ మంటో
తెలుగు : పి.శ్రీనివాస్ గౌడ్, 9949429449

నాలుగేళ్లలో మొదటిసారిగా త్రిలోచన్ రాత్రి ఆకాశం వైపు చూశాడు. అందుకు కారణం, ఆరుబయట విషయాల గురించి ఆలోచించుకోవడానికి అతను అద్వానీ ఛాంబర్స్ డాబా మీదకు రావడమే.

ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉన్నప్పటికీ, బొంబాయి అంతటా ఒక భారీ బూడిద రంగు గుడారంలా కప్పబడి ఉంది. అతనికి కనిపించినంత దూరం వరకు, రాత్రంతా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఆకాశం నుండి లెక్కలేనన్ని నక్షత్రాలు రాలిపడి, ఆ రాత్రి చీకటిలో భారీ వృక్షాల లాగ నిటారుగా నిలబడిన భవనాలకు అంటుకున్నట్లుగా, వాటి చుట్టూ రాలిన నక్షత్రాలు మిణుగురు పురుగుల వలె మెరుస్తున్నట్లుగా త్రిలోచన్‌కు అనిపించింది.

రాత్రి ఆకాశం కింద ఉండటం త్రిలోచన్‌కు పూర్తిగా కొత్త అనుభవం. నాలుగేళ్లుగా తాను ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరాలలో ఒకదానిని గ్రహించకుండా, తన అపార్ట్‌మెంట్‌లో ఒక పంజరంలో బంధించబడినట్లు బతికానని అతడు గ్రహించాడు. అప్పటికి సుమారు మూడు గంటలయింది. గాలి ఆహ్లాదకరంగా, తేలికగా వీస్తోంది. అతను తన ఫ్యాన్ నుంచి వచ్చే ఉడుకు గాలికి అలవాటుపడిపోయాడు. ప్రతి ఉదయం, రాత్రంతా ఎవరో తనను మోదుతున్నట్లుగా అతనికి అనిపించేది. కానీ ఇప్పుడు, ఉదయపు తాజా గాలి తన శరీరాన్ని తాకడంతో అతడు నూతనోత్తేజం పొందినట్లుగా భావించాడు. అతడు ఆందోళనతో మేడమీదకు వచ్చాడు. కానీ కేవలం అరగంటలోనే ఆ ఆందోళన తగ్గిపోయింది. ఇప్పుడు అతడు స్పష్టంగా ఆలోచించగలుగుతున్నాడు.

కిర్పాల్ కౌర్ తన కుటుంబంతో కలిసి మతోన్మాద ముస్లింలకు పేరుగాంచిన ఒక ప్రాంతంలో నివసించేది. అప్పటికే చాలా ఇళ్లు తగలబడిపోయాయి. చాలా మంది మరణించారు. ఇకపై అక్కడ నివశించడం వారికి మంచిది కాదని త్రిలోచన్‌కు అనిపించింది. కానీ కర్ఫ్యూ అమల్లో ఉంది. అది ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. బహుశా ఇంకో నలభై ఎనిమిది గంటలు. అత్యంత హింసాత్మకమైన ముస్లింలు తన చుట్టూ ఉన్నందున తాను ఏమీ చేయలేనని అతనికి అనిపించింది. ఇంతలో, సిక్కులు ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పంజాబ్ నుండి ఒకదాని తర్వాత ఒకటిగా కలవరపరిచే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా, ఏ ముస్లిం అయినా అమాయక కిర్పాల్ కౌర్‌ను చాలా సులభంగా చెరపట్టి, ఆమెను మరణానికి కారణం కావచ్చు.

ఆమె తల్లికి కళ్ళు కనిపించవు. ఆమె తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆమె సోదరుడు అక్కడ తనకు కొత్తగా లభించిన నిర్మాణ కాంట్రాక్టులను పర్యవేక్షించడానికి డియోలాలిలో ఉంటున్నాడు.

కానీ ఆ చల్లని పొద్దునపూట గాలిలో, ఆ చుట్టూ వున్న పరిసరాలు అస్సలు సురక్షితం కాదని త్రిలోచన్‌కు స్పష్టంగా కనిపించింది. కిర్పాల్ కౌర్, ఆమె తల్లిదండ్రులు అప్పటికే హత్యకు గురయ్యారని ఉదయపు వార్తాపత్రికలలో చదవడానికి కూడా అతను మానసికంగా సిద్ధమవుతున్నాడు. త్రిలోచన్‌కు నిజానికి కిర్పాల్ కౌర్ పక్షవాతంతో ఉన్న తండ్రి గురించి, గుడ్డిదైన ఆమె తల్లి గురించి ఏమాత్రం పట్టింపు లేదు. ఒకవేళ వాళ్ళు చనిపోయి, కిర్పాల్ కౌర్ తప్పించుకుంటే, అది అతనికి ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇక డియోలాలీలో నిరంజన్ చచ్చిపోతే ఇంకా మంచిది. ఎందుకంటే అప్పుడు ఏ అడ్డంకీ మిగలదు. ఆ సమయంలో నిరంజన్ తన దారికి అడ్డంకిగా, ఒక బండరాయిలా కూర్చున్నాడు. అందువల్ల త్రిలోచన్‌కు కిర్పాల్ కౌర్‌తో మాట్లాడే అవకాశం దొరికినప్పుడల్లా, అతన్ని నిరంజన్ సింగ్ అని పిలవకుండా ‘బండరాయి’ సింగ్ అని పిలిచేవాడు.

ఉదయపు గాలి త్రిలోచన్ క్షవరం చేయించుకున్న జుట్టుపై మెల్లగా వీస్తూ, ఆహ్లాదకరమైన చల్లదనాన్ని ఇచ్చింది. కానీ అతని చింతలు తగ్గలేదు. కిర్పాల్ కౌర్ ఇప్పుడే అతని జీవితంలోకి ప్రవేశించింది. తన సోదరుడిలా కాకుండా, ఆమె చాలా సౌమ్యంగా, సున్నితంగా ఉండేది. ఆమె పల్లెటూరిలో పెరిగినప్పటికీ, జీవితాంతం ఒక కష్టమైన పని నుండి మరొక కఠినమైన పనికి మారుతూ ఉండే సిక్కు పల్లెటూరి అమ్మాయిలలో సాధారణంగా కనిపించే ఆ కఠినత్వాన్ని, ఆ అలసటను, ఆ పౌరుషాన్ని ఆమె పుణికిపుచ్చుకోలేదు.

ఆమె శరీరం సన్నగా ఉండేది. ఆమెకు చిన్న రొమ్ములు ఉండేవి. అవి కొంచెం నిండుగా ఉంటే మరింత అందంగా ఉండేవి. సగటు సిక్కు పల్లెటూరి అమ్మాయిలతో పోలిస్తే, ఆమె చర్మం పచ్చి పత్తి రంగులా తెల్లగా ఉండేది. ఆమె శరీరం మేలిమి నూలు బట్టల నునుపులా నిగనిగలాడుతూ ఉండేది. ఆమె చాలా సిగ్గరి.

వారు ఒకే గ్రామానికి చెందినవారే, కానీ త్రిలోచన్ అక్కడ ఎక్కువ కాలం గడపలేదు. అప్పటికి అతని కళాశాల రోజులు ఒక మరుగునపడిన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. అతను తన కళాశాల హాస్టల్‌ను చివరిసారి చూసి పదేళ్లు గడిచాయి. ఆ సమయంలో త్రిలోచన్ జీవితంలో ఎన్నో వింత, ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. బర్మా-సింగపూర్-హాంకాంగ్-ఆ తర్వాత బొంబాయి, అక్కడ అతను నాలుగేళ్లపాటు నివసించాడు.

ఈ నాలుగేళ్లలో, అతను నిర్మలమైన రాత్రి ఆకాశాన్ని చూడటం ఇదే మొదటిసారి. వేలాది దీపాలు వెలుగుతున్నాయి, గాలి ఆహ్లాదకరంగా, తేలికగా వీస్తోంది.

కిర్పాల్ కౌర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, త్రిలోచన్‌కు అద్వానీ ఛాంబర్స్‌లో నివశించిన మొజెల్ అనే యూదు అమ్మాయి గుర్తుకు వచ్చింది. త్రిలోచన్ ఆమెతో గాఢంగా ప్రేమలో పడ్డాడు. తన ముప్పై ఐదు సంవత్సరాల జీవితంలో తను ఎన్నడూ అనుభవించని ఒక రకమైన ప్రేమ అది.

తన క్రైస్తవ స్నేహితులలో ఒకరి సహాయంతో అద్వానీ ఛాంబర్స్‌లోని రెండవ అంతస్తులో అపార్ట్‌మెంట్ పొందిన రోజే అతనికి మొజెల్‌ ఎదురుపడింది. మొదట ఆమె భయంకరమైన పిచ్చిదానిలా కనిపించింది. ఆమె కత్తిరించిన గోధుమ రంగు జుట్టు ఎంతమాత్రం సరిచేయలేనంతగా చెదిరిపోయి ఉంది. అక్కడక్కడా పగిలిపోయిన ఆమె లిప్‌స్టిక్ గడ్డకట్టిన రక్తంలా పెదవులకు అతుక్కుని ఉంది. ఆమె వదులుగా ఉన్న తెల్లటి గౌను ధరించింది. దాని తెరిచి ఉన్న మెడపట్టీ వల్ల నీలి సిరలతో స్పష్టంగా కనిపించే పెద్ద వక్షోజాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె చేతులు ఏ అచ్ఛాదన లేకుండా ఖాళీగా ఉన్నాయి. వాటిపై అత్యంత సన్నని వెంట్రుకలు ఉన్నాయి. బహుశా ఆమె బ్యూటీ పార్లర్ నుండి ఇప్పుడే వచ్చిందేమో..అక్కడ జుట్టు కత్తిరించుకునేటప్పుడు ఆ వెంట్రుకలు రాలి, మిఠాయిలపై వేసే నలిపిన పప్పుల్లా ఆమె చేతులకు అతుక్కుని ఉండవచ్చు. కానీ అన్నింటికన్నా ఎక్కువగా, ఆమె పెదవులు అతని దృష్టిని ఆకర్షించాయి. అవి అంత లావుగా ఏమీ లేవు. కానీ ఆమె వాటికి ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను పూసిన తీరు వల్ల, అవి గేదె మాంసపు ముక్కల్లా లావుగా, ఎర్రగా కనిపించాయి.

త్రిలోచన్ అపార్ట్‌మెంట్ మొజెల్ అపార్ట్‌మెంట్‌కు సరిగ్గా ఎదురుగా ఉండేది. వారి ఇళ్ళ మధ్య ఒక ఇరుకైన నడవా మాత్రమే ఉండేది. త్రిలోచన్ తన తలుపు వైపు నడుస్తుండగా మొజెల్ చెక్క చెప్పులు వేసుకుని ఆమె తన అపార్ట్‌మెంట్ నుండి బయటకు వచ్చింది. వాటి చప్పుడు విని త్రిలోచన్ ఆగిపోయాడు. చెదిరిన జుట్టులోంచి మొజెల్ అతని వైపు చూసి నవ్వింది. అది త్రిలోచన్‌ను కలవరపరిచింది. అతను తన జేబులోంచి తాళం తీసి తన ఇంటి వైపు వేగంగా తిరిగాడు. కానీ వారు ఒకరినొకరు దాటేటప్పుడు మొజెల్ జారి నునుపైన నేల మీద పడిపోయింది.

త్రిలోచన్ తేరుకునేలోపే, మొజెల్ పొడవాటి గౌనును నడుము వరకు లేచిపోయి, తన నగ్నమైన, బొద్దుగా ఉన్న కాళ్లను అతనికి ఇరువైపులా ఉంచి, అతని మీద పడిపోయింది. త్రిలోచన్ లేవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ సిగ్గులో ఆమె శరీరం సబ్బు నురుగుతో పూసినట్లుగా, అతనికి పట్టు దొరకలేదు. అతను మొజెల్‌‌ను మరింతగా కరుచుకుపోయాడు.

త్రిలోచన్ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు. మొజెల్ తన గౌనును సర్దుకుని నవ్వి “ఈ చెప్పులు పూర్తిగా పనికిమాలినవి” అంది. తర్వాత ఆమె పోగొట్టుకున్న తన చెప్పును తిరిగి తీసుకుని, దాన్ని తన బొటనవేలుకు, దాని పక్కనున్న వేలుకు మధ్య ఇరికించి, లేచి, నడవాలోంచి వెళ్లిపోయింది.

మొజెల్‌తో పరిచయం పెంచుకోవడం అంత సులభం కాదేమోనని త్రిలోచన్ అనుకున్నాడు, కానీ ఆమె చాలా తొందరగానే అతనితో కలిసిపోయింది. ఆమె చాలా స్వార్థపరురాలు. అతను చెప్పిన లేదా చేసిన వాటికి ఆమె ఏమాత్రం విలువ ఇవ్వలేదు. అతను ఆమెకు తిండి, పానీయాలు కొనిపెట్టాడు, సినిమాలకు తీసుకువెళ్ళాడు. ఆమె జుహు బీచ్‌లో ఈతకు వెళ్ళినప్పుడు రోజంతా ఆమెతోనే ఉన్నాడు. కానీ అతని చేతులు లేదా పెదవులు హద్దులు దాటినప్పుడల్లా, ఆమె అతన్ని తిట్టింది.

త్రిలోచన్ ఎప్పుడూ ప్రేమలో పడలేదు. లాహోర్, బర్మా, సింగపూర్‌లలో అతను వేశ్యల వద్దకు వెళ్ళాడు. కానీ బొంబాయికి రాగానే ఒక పట్టింపులేని, స్వార్థపూరితమైన యూదు అమ్మాయితో గాఢంగా ప్రేమలో పడతానని అతను ఎప్పుడూ ఊహించలేదు. అతను ఆమెను సినిమాకు రమ్మని అడిగినప్పుడల్లా, ఆమె వెంటనే సిద్ధమయ్యేది. కానీ థియేటర్‌లో వారు తమ సీట్లలో కూర్చున్న తర్వాత, ఆమె ప్రేక్షకుల వైపు చూడటం మొదలుపెట్టి, తన పరిచయస్తులు ఎవరైనా కనిపిస్తే, త్రిలోచన్ అనుమతి అడగకుండానే ఉత్సాహంగా చేయి ఊపి, లేచిపోయి వారి పక్కన కూర్చునేది. కొన్నిసార్లు వారు రెస్టారెంట్‌లో ఉన్నప్పుడు, త్రిలోచన్ కేవలం ఆమె కోసమే భారీ విందును ఆర్డర్ చేసేవాడు. కానీ తన ప్రాణ స్నేహితులలో ఎవరైనా కనిపిస్తే, ఆమె భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోయేది. త్రిలోచన్ అదంతా చూస్తూ కోపంతో రగిలిపోయేవాడు.

మొజెల్ తన ప్రాణ స్నేహితులతో బయటకు వెళ్లడానికి అతన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి, రోజుల తరబడి తిరిగి రాకుండా ఉండేది. కొన్నిసార్లు తలనొప్పి అని, కొన్నిసార్లు కడుపునొప్పి అని చెప్పేది. కానీ ఆమె కడుపు ఉక్కులాంటిదని త్రిలోచన్‌కు తెలుసు. ఆమె అతన్ని మళ్ళీ కలిసినప్పుడు

“మీరు సిక్కులు. మీకు ఈ సున్నితమైన విషయాలు అర్థం కావు” అని అనేది.

త్రిలోచన్ కోపంతో రగిలిపోయాడు. “ఏ సున్నితమైన విషయాలు? నీ మాజీ ప్రేమికులా?”

మొజెల్ తన విశాలమైన తుంటిపై చేతులు పెట్టుకుని, తన కాళ్ళను ఎడంగా చాపి నిలబడి “వాళ్ళ ప్రస్తావన ఎందుకు పదే పదే తెస్తున్నావు? అవును, వాళ్ళు నా స్నేహితులు. వాళ్ళంటే నాకిష్టం. నీకు అసూయగా ఉంటే, అసూయ పడు” అని చెప్పేది.

త్రిలోచన్ బ్రతిమాలుతున్నట్లుగా “’మనం ఇలా ఎంతకాలం ఉంటాం..?” అని అడిగేవాడు.

మొజెల్ గట్టిగా నవ్వి.” నువ్వు నిజంగా సిక్కువేనా! వెధవ! మనమిద్దరం కలిసి ఉన్నామని నీకెవరు చెప్పారు? నీకు ఒక ప్రేయసి కావాలనే ఆలోచన అంతగా ఉంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్లి, ఏవరైనా సిక్కు అమ్మాయిని పెళ్లి చేసుకో. నువ్వేం అన్నా నాకు పర్వాలేదు, నేను మారను.” అనేది.

మొజెల్ అతనికి పెద్ద బలహీనతగా మారింది. అతను ఎల్లప్పుడూ ఆమెతోనే ఉండాలని కోరుకునేవాడు. ఆమె తరచుగా పనికిమాలిన క్రైస్తవ కుర్రాళ్ల ముందు అతన్ని అవమానించినప్పటికీ..అవమానానికి, అపమానానికి సాధారణ ప్రతిచర్య ప్రతీకారమే అయినా, త్రిలోచన్ విషయంలో అది అలా కాకుండా పోయింది. చాలాసార్లు ఆమె అన్న మాటలను మరచిపోయి, ఆమె ప్రవర్తనను క్షమించేవాడు. ఎందుకంటే అతను ఆమెను ప్రేమించాడు. కేవలం ప్రేమించడమే కాదు, అతను తన స్నేహితులకు పదే పదే చెప్పినట్లుగా, అతను ఆమె ప్రేమలో తలమునకలుగా మునిగిపోయాడు. ప్రేమ అనే ఊబిలో తన సర్వస్వాన్ని అర్పించడం తప్ప అతనికి మరో మార్గం లేదు. రెండు సంవత్సరాలు త్రిలోచన్ ఈ విధంగా బాధపడ్డాడు. చివరికి ఒక రోజు, మోజెల్ ఉల్లాసంగా ఉన్నప్పుడు, అతను ఆమెను కౌగిలించుకుని, ‘మోజెల్, నువ్వు నన్ను ప్రేమించడం లేదా?’ అని అడిగాడు.

మొజెల్ తనను తాను విడిపించుకుని, ఒక కుర్చీలో కూర్చుని, తన గౌను అంచు వైపు చూడసాగింది. తర్వాత ఆమె తన పెద్ద యూదు కళ్ళను పైకెత్తి, దట్టమైన కనురెప్పలను రెపరెపలాడించి “నేను ఒక సిక్కును ప్రేమించలేను” అంది.

ఎవరో తన తలపాగాలో మండుతున్న నిప్పుకణికెలని కుక్కినట్లు త్రిలోచన్‌కు అనిపించింది. అతడు తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యాడు. “మొజెల్, నువ్వు ఎప్పుడూ నన్ను ఆటపట్టిస్తావు. కానీ నువ్వు ఆటపట్టిస్తున్నది నన్ను కాదు, నా ప్రేమను!” అన్నాడు బాధగా

మొజెల్ లేచి, తన ఆకర్షణీయమైన శైలిలో, చక్కగా కత్తిరించిన తన గోధుమ రంగు జుట్టును విదిలించింది. “నీ గడ్డం గీసుకుని, జుట్టు విరబోసుకో. నువ్వు ఇలా చేస్తే, అబ్బాయిలు కూడా నిన్ను చూసి కన్ను కొడతారు – నువ్వు చాలా అందంగా ఉంటావు.”

దీంతో త్రిలోచన్ ముందుకు గంతు వేసి, మొజెల్‌ను హఠాత్తుగా తన వైపుకు లాక్కుని, ఆమె పెదవులపై తన పెదవులను వుంచి నొక్కాడు.

‘వద్దు!’ అని మొజెల్ అసహ్యంగా అతన్ని తోసేసింది. “మోజెల్!” త్రిలోచన్ ఆక్రోశించాడు.

మొజెల్ తన పర్సులోంచి ఒక చిన్న అద్దం తీసి, దట్టంగా రంగు పూసుకున్న తన పెదవులపై గీతలు చూసి, “ఒట్టు, నీ గడ్డాన్ని ఎలా సరిగా ఉపయోగించుకోవాలో నీకు తెలియదు. ఇది నా ముదురు నీలం రంగు స్కర్ట్‌ను నిజంగా శుభ్రం చేయగలదు. కొద్దిగా డిటర్జెంట్ వేస్తే సరిపోతుంది.”

త్రిలోచన్‌కు చాలా కోపం వచ్చినా, ఊరకున్నాడు. అతను ప్రశాంతంగా సోఫాలో కూర్చున్నాడు. మొజెల్ వచ్చి అతని పక్కన కూర్చుంది. ఆమె తన పళ్ళ మధ్య వున్న ఒక్కొక్క పిన్నును అతని గడ్డానికి గుచ్చుతూ కిందకి అనింది.

త్రిలోచన్ అందంగా ఉండేవాడు. అతనికి గడ్డం పెరగక ముందు, ప్రజలు ఎప్పుడూ అతన్ని ఒక ఆకర్షణీయమైన యువతిగా పొరబడేవారు. కానీ ఇప్పుడు ఆ గుబురు గడ్డం అతని ముఖ కవళికలను కప్పివేసింది. అది తన అందాన్ని మరుగుపరుస్తోందని అతనికి తెలుసు. కానీ అతను తన మతానికి విధేయుడు. తన మతాన్ని గౌరవించేవాడు. తనది సంపూర్ణమైన విశ్వాసమని నిరూపించే విషయాలను అతను వదిలిపెట్టుకోలేడు.

మొజెల్ తన గడ్డంతో చేస్తున్న పనయ్యాక త్రిలోచన్ ఆమెను “నువ్వేం చేస్తున్నావు?” అని అడిగాడు.

పళ్ళ మధ్య గుండుసూదులు పెట్టుకుని ఆమె నవ్వింది. “మీ గడ్డం చాలా మృదువుగా ఉంది. అది నా ముదురు నీలం రంగు స్కర్ట్‌ను శుభ్రం చేయగలదని చెప్పడం నా పొరపాటే. త్రిలోక్, దాన్ని గొరిగేసి, వాటిని నాకివ్వండి. వాటితో ఒక ఫస్ట్-క్లాస్ నాణేల సంచిని అల్లుతాను.”

త్రిలోచన్‌కు తన గడ్డం వెనుక కోపంతో తన ముఖం ఎర్రబడుతున్నట్లు అనిపించింది. అతను నిదానమైన స్వరంతో అన్నాడు “నేను మీ మతాన్ని ఎప్పుడూ ఎగతాళి చేయలేదు, మరి మీరెందుకు నా మతాన్ని ఎగతాళి చేస్తున్నారు? చూడండి, అలా చేయడం మంచిది కాదు. నేను ఎప్పటికీ అలా చేయను. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను కాబట్టి దీన్ని సహిస్తున్నాను. ఈ విషయం నీకు తెలియదా?”

మొజెల్ తన తలతో ఆడుకోవడం ఆపేసి “నాకు తెలుసు.” అంది.

“మరి..?”

త్రిలోచన్ తన గడ్డాన్ని చక్కగా సరిచేసుకుని, మొజెల్ పళ్ళ మధ్య నుండి పిన్నులను తీశాడు. “నా ప్రేమ వట్టిది కాదని నీకు తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.”అన్నాడు.

“నాకు తెలుసు.” అని తన జుట్టును తేలికగా సవరించుకుని, ఆమె లేచి గోడకు వేలాడుతున్న ఒక పెయింటింగ్‌ను చూడటం మొదలుపెట్టింది. “నేను అవునని చెప్పాలని సుమారుగా నిర్ణయించుకున్నాను.” అంది.

త్రిలోచన్ గంతేసి లేచాడు. “నిజంగానా?”

మొజెల్ ఎర్రని పెదవులు విశాలమైన చిరునవ్వుగా మారాయి. ఆమె తెల్లని పలువరస ఒక్క క్షణం పాటు మెరిశాయి. “అవును.”

త్రిలోచన్ తన గడ్డాన్ని సగం మడిచి, ఆమెను తన ఛాతీకి హత్తుకుని “అయితే-అయితే-ఎప్పుడు?” అని ఆత్రుతగా అన్నాడు.

మొజెల్ దూరంగా వెళ్ళి. “నువ్వు జుట్టు కత్తిరించుకుని, గడ్డం చేసుకున్నప్పుడు.”

త్రిలోచన్ ఆలోచించకుండానే తన తలరాతకు తలొగ్గాడు “రేపు కత్తిరించుకుంటాను” అన్నాడు.

మొజెల్ అరికాళ్ళతో నృత్యం చేయడం మొదలుపెట్టింది “నువ్వు పిచ్చోడిలా మాట్లాడుతున్నావు త్రిలోక్.. నీకంత ధైర్యం లేదు.”

అకస్మాత్తుగా మతం అనే ఆలోచన అతని మనసులో చివరి స్థానంలోకి పడిపోయింది. “నువ్వే చూస్తావుగా..” అన్నాడు

“చూస్తాను” అని మొజెల్ మళ్ళీ చెప్పింది. ఆమె వేగంగా త్రిలోచన్ వద్దకు వచ్చి, అతని గడ్డం మీద ముద్దుపెట్టి, ముఖం చిట్లించి వెళ్ళిపోయింది.

ఆ రాత్రి జుట్టు కత్తిరించుకోవడం గురించి ఆలోచిస్తూ త్రిలోచన్ ఎంత బాధపడ్డాడో వర్ణించడం అసాధ్యం. మరుసటి రోజు కోటలోని ఒక మంగలి దుకాణంలో అతను జుట్టు కత్తిరించుకుని, గడ్డం గీసుకున్నాడు. ఆ తతంగమంతా పూర్తయ్యేంత వరకు అతను కళ్ళు గట్టిగా మూసుకునే ఉన్నాడు. చివరకు ఆ పని పూర్తయ్యాక, అతను కళ్ళు తెరిచి చాలా సేపు అద్దంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు అతను బొంబాయిలోని అత్యంత అందమైన అమ్మాయిల దృష్టిని సైతం ఆకర్షిస్తాడు!

మంగలి దుకాణం నుండి బయటకు వచ్చిన తర్వాత తనకు కలిగిన అదే వింత చల్లగనాన్ని త్రిలోచన్ ఇప్పుడు మళ్ళీ అనుభవించాడు. అతను డాబా మీద అటూ ఇటూ తిరుగుతూ, అక్కడున్న అనేక నీటి పైపులు, ట్యాంకుల వైపు వెళ్ళసాగాడు. అతనికి మిగిలిన కథను గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు. కానీ తనను తాను ఆపుకోలేకపోయాడు.

జుట్టు కత్తిరించుకున్న తర్వాత మొదటి రోజు, త్రిలోచన్ తన అపార్ట్‌మెంట్ నుండి బయటకు వెళ్ళలేదు. రెండవ రోజు అతను తన సేవకుడి ద్వారా మొజెల్‌కు ఒక ఉత్తరం పంపాడు, అందులో తనకు ఒంట్లో బాగోలేదని, ఒక్క క్షణం వచ్చి వెళ్ళగలవా అని అడిగాడు. మొజెల్ వచ్చింది. త్రిలోచన్‌ను చూడగానే ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. “నా ప్రియమైన త్రిలోక్”’ అని కేక వేస్తూ అతనిపైకి దూకి, ఆమె లిప్‌స్టిక్‌తో అతని ముఖమంతా ఎర్రబడేంతగా ముద్దు పెట్టుకుంది.

ఆమె త్రిలోచన్ యొక్క మృదువైన, శుభ్రమైన బుగ్గలను నిమిరింది. అతని కురచైన ఇంగ్లీష్ తరహా జుట్టులో దువ్వెనలా వేళ్లను పోనిస్తూ, అరబిక్‌లో ఏదో గొణుగుతూ మాట్లాడసాగింది. ఆమె ఎంత భావోద్వేగానికి లోనైందంటే, ఆమె ముక్కు కారడం మొదలైంది. ఇది గమనించిన ఆమె, తన లంగా అంచును పైకి ఎత్తి రుమాలుగా ఉపయోగించింది. దీనివల్ల త్రిలోచన్‌కు ఇబ్బంది కలిగి, అతను ఆమె లంగాను కిందకి లాగి “నువ్వు అక్కడ కచ్చితంగా ఏదైనా వేసుకోవాలి” అని మందలించాడు.

అతని మాటలు మొజెల్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. పాతబడి, అక్కడక్కడా చెదిరిన లిప్‌స్టిక్‌తో ఉన్న పెదవులతోనే ఆమె నవ్వి, ఆ తర్వాత “ అవి వేసుకోవడం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. ఇలా ఉండటమే బావుంది” అంది.

మొదటిసారి ఆమెను అనుకోకుండా కలిసిన ఆ రోజున జరిగిన గందరగోళం అతని మదిలో మెరుపులా మెరిసింది. అతను నవ్వి, ఆమెను తన ఛాతీకి హత్తుకున్నాడు. “రేపే పెళ్లి చేసుకుందాం.”

“తప్పకుండా” మొజెల్ అతని మెత్తటి గడ్డం మీద తన చేతి వెనుక భాగంతో రుద్దుతూ అంది.

పెళ్లి పూణేలో చేసుకోవాలని నిర్ణయించారు. అది రిజిష్టర్ మ్యారేజ్ కాబట్టి, వారు పది నుంచి పదిహేను రోజుల ముందుగా తెలియజేయాల్సి వచ్చింది. ఇది చట్టపరమైన నిబంధన. పూణే బొంబాయికి దగ్గరగా ఉండటం, అక్కడ త్రిలోచన్‌కు స్నేహితులు ఉండటంతో, పెళ్లికి అదే ఉత్తమమైన ప్రదేశంగా భావించారు. వారు మరుసటి రోజే పూణేకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు.

మొజెల్ కోటలోని ఒక దుకాణంలో అమ్మాయిగా పనిచేసేది. ఆమె దుకాణం దగ్గర ఒక టాక్సీ స్టాండ్ ఉంది. అక్కడ ఆమె అతడిని వుండమని కోరింది.

త్రిలోచన్ అనుకున్న సమయానికి వచ్చి గంటన్నర సేపు ఎదురుచూశాడు, కానీ మొజెల్ రాలేదు. మరుసటి రోజు, అప్పుడే సరికొత్త కారు కొన్న తన పాత స్నేహితుడితో కలిసి ఆమె డియోలాలికి వెళ్ళిందని, అక్కడ కొంతకాలం ఉండబోతోందని అతనికి తెలిసింది.

త్రిలోచన్ ధైర్యం కూడగట్టుకుని ఆమెను మర్చిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత కొద్దికాలానికే, అతను కిర్పాల్ కౌర్‌ను కలుసుకుని ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పుడు అతనికి మొజెల్ ఒక పక్షిలా ఇక్కడ నుండి అక్కడికి ఎగిరే, కఠినమైన మనసున్న మోటు అమ్మాయి తప్ప మరేమీ కాదని అర్థమైంది. కనీసం, ఆమెను పెళ్లి చేసుకునే తప్పు చేయలేదని అతను తనను తాను ఓదార్చుకున్నాడు.

అయినప్పటికీ అతను అప్పుడప్పుడు మొజెల్ గురించి ఆలోచించేవాడు. అవి తీపి, చేదు కలగలిసిన క్షణాలు. ఆమె ఎవరినీ పట్టించుకోదు. కానీ త్రిలోచన్‌కు ఆమె అంటే ఇంకా ఇష్టమే. అందుకే ఆమె డియోలాలిలో ఏం చేస్తోందో..ఆమె ఇంకా కొత్త కారు ఉన్న ఆ అబ్బాయితోనే ఉందా.. లేక తనను వదిలేసి వేరొకరితో ఉందా అని అతను ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ఏది ఏమైనప్పటికీ, ఆమె తనను కాకుండా వేరొకరితో జీవిస్తోందని అనుకోవడం త్రిలోచన్‌కు బాధ కలిగించినప్పటికీ, అదే సమయంలో అలాంటి ప్రవర్తన అతని స్వభావానికి పూర్తిగా సరిపోయేది కూడా కాదు.

అతను ఆమె కోసం వందల్లో కాదు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. కానీ అతను అలా ఇష్టపూర్వకంగానే చేశాడు. అంతే కాకుండా మొజెల్ అభిరుచులు ఖరీదైనవి కావు. ఆమెకు చవకైన వస్తువులంటే ఇష్టం. ఒకసారి త్రిలోచన్ ఆమె కోసం తను ఎంచుకున్న కొన్ని చెవిపోగులు కొనివ్వడానికి తీసుకువెళ్ళాడు. కానీ వాళ్ళు దుకాణానికి వెళ్ళాక, అక్కడ ఉన్న ఒక జత చవకైన నకిలీ చెవిపోగులను చూసి మోజెల్ ముగ్ధురాలైంది. త్రిలోచన్‌కు ఇష్టమైన వాటిని వద్దని చెప్పి, వాటికి బదులుగా అవి కొనివ్వమని అతన్ని బ్రతిమాలింది.

త్రిలోచన్‌కు మొజెల్ అస్సలు అర్థమయ్యేది కాదు. వాళ్ళు గంటల తరబడి ముద్దులు పెట్టుకునేవారు. అతను ఆమె శరీరం అంతా తన చేతులతో నిమిరేవాడు. కానీ ఆమె అతన్ని ఎప్పుడూ ముందుకు వెళ్ళనిచ్చేది కాదు. అతనికి చిరాకు తెప్పించడానికి, ఆమె “నువ్వు సిక్కువి. నువ్వంటే నాకు అసహ్యం” అని అనేది.

మొజెల్‌కు అతనిపై ద్వేషం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ ఆమెకు ద్వేషం ఉండి ఉంటే, అతనితో సమయం గడపడానికి ఆమె ఒప్పుకునేది కాదు. తనకు నచ్చని విషయాలను ఆమె సహించదు. కాబట్టి అతనితో రెండు సంవత్సరాలు గడిపి, అందులోని ప్రతి నిమిషాన్ని ద్వేషిస్తుందనే ఆలోచన హాస్యాస్పదంగా ఉంది. మొజెల్ కొన్ని విషయాల గురించి తన సొంత నిర్ణయాలు తీసుకునేది. ఉదాహరణకు లోదుస్తులు బిగుతుగా అనిపించడం వల్ల ఆమెకు అవి నచ్చేవి కావు. చాలా సందర్భాలలో త్రిలోచన్ వాటి ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. వాటిని తొడగమని ఆమెను సిగ్గుకలిగేలా చెప్పడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఆమె తన పద్ధతులను ఎప్పుడూ మార్చుకోలేదు.

త్రిలోచన్ ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడల్లా, ఆమె చిరాకుపడి ” ఈ అవమానించడం, నిందించడం లాంటివన్నీ పనికిమాలినవి. మీకు కోపం వస్తే కళ్ళు మూసుకోండి. చెప్పండి, మీరు బట్టల కింద నగ్నంగా ఉన్నారు కదా, మరి దాన్ని కప్పుకోవడానికి బట్టలు ఎక్కడున్నాయి? లోపల ఏముందో ఊహించుకోకుండా మిమ్మల్ని ఆపగలిగే బట్టలు ఎక్కడ? ఆ చెత్త వాగుడు నాకు వద్దు. మీరు ఒక సిక్కు. మీరు ఆ వెర్రి వదులైన లోదుస్తులు వేసుకుంటారని నాకు తెలుసు. అవి మీ గడ్డం, జుట్టు లాగే మీ మతంలో ఒక భాగం. మీరు పెద్దవాళ్ళే అయినా, మీ మతం మీ లోదుస్తుల్లో దాగి ఉందని ఇంకా అనుకుంటున్నారు. అందుకు మీరు సిగ్గుపడాలి.” అని గట్టిగా అనేది.

వారు మొదట్లో కలుసుకున్నప్పుడు మొజెల్ ఇలాంటి మాటలు అనడంతో, త్రిలోచన్‌కు కోపం వచ్చేది. కానీ కాలం గడిచేకొద్దీ అతను ఆమె చెప్పేదాన్ని పరిగణనలోకి తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అతని పక్షపాత భావాలు కూడా సడలాయి. ఆ తర్వాత, జుట్టు కత్తిరించుకున్నాక, తన గజిబిజి గుబురు జుట్టును మోస్తూ ఎంత సమయం వృధా చేశాననే భావన అతన్ని ఆవరించింది.

త్రిలోచన్ నీటి ట్యాంకుల దగ్గర ఆగాడు. అతను మొజెల్‌ను తిట్టుకుని, ఆమె గురించి ఆలోచించడం బలవంతంగా ఆపుకున్నాడు. తాను ప్రేమించిన స్వచ్ఛమైన, అమాయకురాలైన కిర్పాల్ కౌర్ ప్రమాదంలో ఉంది. ఆమె అత్యంత హింసాత్మక ముస్లింలు నివసించే ప్రాంతంలో నివసిస్తోంది. ఇప్పటికే రెండు మూడు సంఘటనలు జరిగాయి. అసలు సమస్య ఏమిటంటే, అక్కడ నలభై ఎనిమిది గంటల కర్ఫ్యూ అమలులో ఉంది. అయినా దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? ఆమె నివసించే భవనంలో ఉన్న ముస్లింలు ఏ క్షణంలోనైనా ఆమెను, ఆమె తల్లిదండ్రులను చాలా సులభంగా చంపేయగలరు.

దాని గురించే ఆలోచిస్తూ, త్రిలోచన్ ఒక పెద్ద నీటి పైపు మీద కూర్చున్నాడు. అతని జుట్టు బాగా పెరిగిపోయింది. ఏడాదిలోపు అది అసలు కత్తిరించనట్టే కనిపిస్తుందని అతనికి నమ్మకం కలిగింది. అతని గడ్డం కూడా వేగంగా పెరిగింది. అయినప్పటికీ, అతను దానిని మునుపటిలా పొడవుగా పెంచడం లేదు. కోటలో వుండే ఒక మంగళి దానిని ఎంత చక్కగా కత్తిరించేవాడంటే, అది అస్సలు కత్తిరించనట్టే కనిపించేది.

అతను తన పొడవాటి, మెత్తటి జుట్టును నిమురుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు. అతను లేవబోతుండగా, పెద్ద శబ్దంతో చెక్క చెప్పుల చప్పుడు విన్నాడు. ఆ భవనంలో చాలా మంది యూదు స్త్రీలు ఉండటం, వాళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు అవే చెక్క చెప్పులు వేసుకోవడం వల్ల, అది ఎవరు అయి ఉంటారా అని అతను ఆలోచించాడు. ఆ శబ్దం దగ్గరవుతూ వచ్చింది. అప్పుడు అతను పక్కనే ఉన్న నీటి ట్యాంక్ దగ్గర మొజెల్‌ను చూశాడు – ఆమె యూదు స్త్రీలు ప్రత్యేకంగా వేసుకునే వదులైన గౌను ధరించి, రెండు చేతులూ తల మీదకు ఎత్తి, ఒళ్ళు విరుచుకుంటోంది.

ఆ శృంగారభరితమైన తీరుకు, గాలి కూడా బద్దలవుతుందేమో అని త్రిలోచన్‌కు అనిపించింది.

త్రిలోచన్ నీటి పైపు పైనుంచి లేచి, ‘అసలు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏం చేయబోతోంది?’ అని తనలో తాను అనుకున్నాడు.

మోజెల్ మళ్ళీ ఒళ్ళు విరుచుకోగా, త్రిలోచన్ బొమికలు వాంఛతో కొట్టుకున్నాయి. మోజెల్ వదులుగా ఉన్న గౌను కింద ఆమె పెద్ద వక్షోజాలు పైకి కిందికి కదులుతుండగా, అకస్మాత్తుగా వాటిలోని సున్నితమైన నరాలున్న దృశ్యం త్రిలోచన్ మనసులో మెదిలింది. అతను గట్టిగా దగ్గాడు. మొజెల్ వెనక్కి తిరిగి అతని వైపు చూసింది, కానీ ఆమెలో ఏమాత్రం ఆశ్చర్యం కనపడలేదు. ఆమె అతని దగ్గరికి వెళ్ళింది. ఆమె చెప్పులు నేలను తాకుతూ టకటకమన్నాయి. అతని దగ్గరికి చేరాక, ఆమె అతని చిన్న గడ్డాన్ని చూసి “త్రిలోచన్, నువ్వు మళ్ళీ సిక్కుగా మారిపోయావా?” అని అడిగింది.

అతని ముఖం పాలిపోవడం ప్రారంభించింది. మొజెల్ ముందుకు వచ్చి, తన చేతి వెనుక భాగంతో అతని గడ్డాన్ని రాసింది. తర్వాత ఆమె నవ్వి “ఈ బ్రష్ నా ముదురు నీలం రంగు స్కర్ట్‌ను శుభ్రం చేయగలదు! కానీ నేను దాన్ని డియోలాలిలో వదిలేశాను.”అంది

త్రిలోచన్ స్పందించలేదు. మొజెల్ అతని చేయి గిల్లింది. “ఏం మాట్లాడరేంది, సర్దార్ సాహిబ్?” అంది

త్రిలోచన్ మళ్ళీ వెర్రోడులా అవకూడదనుకున్నాడు. కానీ ఆమెను పరిశీలనగా చూడకుండా ఉండలేకపోయాడు. ఆమె కొంచెం బలహీనంగా కనిపించడం తప్ప, మరే ప్రత్యేక మార్పూ లేదు.

“మీకు జబ్బు చేసిందా?”

“లేదు” అని మొజెల్ తన కత్తిరించిన జుట్టును మెల్లగా విదిలిస్తూ చెప్పింది.

“మీరు మునుపటి కంటే బలహీనంగా కనిపిస్తున్నారు.”

“నేను ఆహారం తగ్గిస్తున్నాను” మొజెల్ నీటి పైపు మీద కూర్చుని తన చెప్పులను నేలకేసి కొట్టడం మొదలుపెట్టింది. “అంటే మళ్ళీ సిక్కులా మారడానికి ప్రయత్నిస్తున్నావన్నమాట?” అంది

“అవును” త్రిలోచన్ నింపాదిగా అన్నాడు.

“అభినందనలు!” మొజెల్ తన చెప్పులలో ఒకటి తీసి నీటి పైపుకు కొట్టింది.

“నువ్వు వేరే ఏ అమ్మాయితోనైనా ప్రేమలో పడ్డావా?” అడిగింది.

“అవును” త్రిలోచన్ నిక్కచ్చిగా అన్నాడు.

“అభినందనలు. ఆమె ఈ భవనంలోనే ఉందా..?

“లేదు.”

“అది చాలా తప్పు.”తన చెప్పు సరిచేసుకుంటూ మొజెల్ లేచింది. “మీరు ఎప్పుడైనా మీ పొరుగువారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.”

త్రిలోచన్ మౌనంగా ఉండిపోయాడు. మొజెల్ లేచి తన ఐదు వేళ్ళతో అతని గడ్డాన్ని దువ్వింది. “గడ్డం పెంచమని ఆమె నీకు చెప్పిందా?”

“లేదు.”

త్రిలోచన్ తన గడ్డాన్ని దువ్వెనతో సరిచేయడం అసౌకర్యంగా భావించాడు. అతను ‘లేదు’ అని చెప్పినప్పుడు, ఆ మాటలో ఒక కటువైన ధ్వని వినిపించింది.

మొజెల్ పెట్టుకున్న ఎర్ర లిప్‌స్టిక్ వల్ల ఆమె పెదవులు ముతక మాంసంలా కనిపించాయి.

ఆమె నవ్వినప్పుడు, ఏదో పల్లెటూరి కసాయివాడు అప్పుడే దట్టమైన నరాలున్న మాంసపు ముక్కను రెండుగా కోసినట్టుగా, తాను ఆ కసాయి దుకాణంలోకి ప్రవేశించినట్లు త్రిలోచన్‌కు అనిపించింది.

అప్పుడు ఆమె నవ్వింది. “ఇప్పుడు నువ్వు గడ్డం గీసుకుంటే.. ఒట్టు.. నిన్ను పెళ్లి చేసుకుంటాను.”

త్రిలోచన్, తాను కిర్పాల్ కౌర్‌ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆమెను ఎలా పెళ్లి చేసుకోబోతున్నాడో, ఆమెతో పోలిస్తే మొజెల్ ఎంత దుర్మార్గురాలో, అందవిహీనురాలో, విశ్వాసఘాతుకురాలో, దయలేనిదో చెప్పాలనుకున్నాడు. కానీ అతనిది కక్ష కాదు. “మొజెల్, నేను మా ఊరిలో మా మతాన్ని పాటించే ఒక సామాన్య అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ఆమె కోసం జుట్టు పెంచాలని నిర్ణయించుకున్నాను.”

మొజెల్ సాధారణంగా వివరాల గురించి ఆలోచించడానికి సమయం కేటాయించదు. కానీ ఆమె ఒక క్షణం ఆలోచించి, ఆమె తన చెప్పులలో ఒకదానిపై దృష్టి మరల్చి “ఆమె మీ మతాన్ని పాటిస్తే, మిమ్మల్ని ఎలా అంగీకరించగలదు? మీరు ఇప్పటికే జుట్టు కత్తిరించుకున్నారని ఆమెకు తెలియదా?”అని అడిగింది.

“ఆమెకు ఇంకా తెలియదు” అని త్రిలోచన్ ఒప్పుకున్నాడు. “నువ్వు డియోలాలీకి వెళ్ళిన వెంటనే, నిన్ను ఇబ్బంది పెట్టడానికే నేను గడ్డం పెంచడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కిర్పాల్ కౌర్‌ను కలిశాను. నేను జుట్టు కత్తిరించానని ఒక్కడు కూడా కనిపెట్టలేనంతగా తలపాగా కట్టుకుంటాను. ఏదేమైనా, అది చాలా త్వరగానే మళ్ళీ పెరుగుతుంది.” త్రిలోచన్ తన జుట్టులో వేళ్లు పోనిచ్చాడు.

మొజెల్ తన పొడవాటి గౌనును పైకి ఎత్తి, తన లేత, నిండు తొడను గోక్కుంది. ‘బాగుంది. కానీ ఈ వెధవ దోమను చూడండి! నన్ను ఎంత గట్టిగా కుట్టిందో.!”

త్రిలోచన్ ఆమె వైపు నుండి తన చూపును తిప్పుకున్నాడు. మొజెల్ తన వేలితో దోమ కుట్టిన చోట ఉమ్మిని రాసుకుని, ఆ తర్వాత తన గౌనును వదిలి నిలబడింది. “పెళ్లి ఎప్పుడు?”అంది

“నాకు ఇంకా తెలియదు” అని చెప్పి, త్రిలోచన్ అకస్మాత్తుగా ఆలోచనలో పడ్డాడు.

కొన్ని క్షణాల పాటు మొజెల్ మాట్లాడలేదు. తర్వాత అతని ఆందోళనను గమనించి, ఆమె చాలా గంభీరంగా “త్రిలోచన్, నువ్వేం ఆలోచిస్తున్నావు?” అని అడిగింది.

ఆ క్షణంలో త్రిలోచన్‌కు మాట్లాడటానికి ఎవరో ఒకరు అవసరమయ్యారు. దానికి మొజెల్ అయినా పర్వాలేదు. అతను కిర్పాల్ కౌర్ ఎదుర్కొంటున్న ప్రమాదం గురించి ఆమెకు చెప్పాడు, అప్పుడు మోజెల్ నవ్వి, “నువ్వొక పెద్ద మూర్ఖుడివి! వెళ్లి ఆమెను తీసుకురా! అందులో కష్టమేముంది?’ అంది.

“కష్టమా? మొజెల్! ఈ పరిస్థితిని గానీ, ఏ పరిస్థితిలోని విషయం అయినా గానీ నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నువ్వు చాలా అజాగ్రత్తగా ఉంటావు. అందుకే మన బంధం నిలవలేదు. ఆ విషయాంలో నేను నా జీవితాంతం విచారిస్తాను.”

మోజెల్ తన చెప్పును నీటి పైపుకు కొట్టి “నీ పశ్చాత్తాపం నరకానికెళ్ళా..! తెలివితక్కువ వెధవా.. నువ్వు ఆలోచించాలి..ఆవిడని అక్కడినుంచి ఎలా బయటకు తీసుకురావాలా అని నేను మాట్లాడుతుంటే, నువ్వేమో పాత రోజులను తలుచుకుని ఏడవడానికి కూర్చున్నావు. మన బంధం ఎప్పటికీ నిలవలేకపోయేది. నువ్వొక తెలివిలేని పిరికివాడివి, నాకు భయం లేని మగాడు కావాలి. సరే అయిన తతంగం చాలు. పద, వెళ్లి ఆ అమ్మాయిని రక్షిద్దాం.” అంది

ఆమె త్రిలోచన్ చేయి పట్టుకుంది. “ఎక్కడికి?” అతను భయంగా అడిగాడు.

“ఆమె వుండే చోటుకి..ఆ ప్రాంతమంతా నాకు అంగుళం అంగుళం తెలుసు. పదండి.”

“కానీ విను..! కర్ఫ్యూ ఉంది.”

“కానీ నాక్కాదు..రా..”

ఆమె త్రిలోచన్ చేయి పట్టుకుని మెట్ల వైపు వెళ్లే తలుపు వైపుకు లాగింది. ఆమె తలుపు తెరిచి మెట్లు దిగబోతుండగా ఆగి, త్రిలోచన్ గడ్డం వైపు చూసింది.

“ఏమిటి?” అని త్రిలోచన్ అడిగాడు.

“నీ గడ్డం. కానీ పర్వాలేదు. అది అంత పెద్ద విషయమేమీ కాదు. ఆ తలపాగా తీసేస్తే.. నిన్నెవరూ సిక్కు అనుకోరు.”

‘తలపాగా తీసేయాలా..?’ త్రిలోచన్ ఆశ్చర్యపోయి, వెనక్కి తగ్గాడు.

“నేను తలపాగా లేకుండా రాను.”

“ఎందుకు?” అని మోజెల్ ఏమీ తెలియనట్టు నటిస్తూ అడిగింది.

త్రిలోచన్ చెదిరిన కొన్ని జుట్టును వెనక్కి నెట్టుకున్నాడు. “నీకు అర్థం కాదు. నేను దాన్ని అక్కడ వుంచుకోవాలి.”

“ఎందుకు?”

“నీకెందుకు అర్థం కావడం లేదు? ఇప్పటివరకు ఆమె నన్ను తలపాగా లేకుండా చూడలేదు. నేను జుట్టు కత్తిరించుకున్న విషయం కూడా ఆమెకు తెలియదు. ఆ విషయం ఆమెకు తెలియకూడదని నేను కోరుకుంటున్నాను.”

మోజెల్ తన చెప్పుతో గడపకు తట్టింది. “నువ్వొక పెద్ద వెధవవి.. మూర్ఖుడా..! ఇది ఆవిడకి జీవన్మరణ సమస్య”

“మొజెల్ చాలా భక్తిపరురాలైన అమ్మాయి. నేను తలపాగా లేకుండా కనిపిస్తే, ఆమె నన్ను ద్వేషిస్తుంది” అని త్రిలోచన్ వివరించడానికి ప్రయత్నించాడు.

దీంతో మొజెల్‌కు చిరాకు వచ్చింది. “ఛీ, నీ ప్రేమ పాడుగాను..! సిక్కులందరూ ఇంత మూర్ఖులేనా? ఆమె ప్రాణానికి ప్రమాదం ఉంటే, నువ్వేమో తలపాగా కట్టుకోవాలని పట్టుబడుతున్నావు – బహుశా నీ పనికిమాలిన లోదుస్తులు కూడానా?’

“నేను దాన్ని ఎప్పుడూ ధరిస్తాను.”

“మంచిదే! కానీ మనం వెళ్తున్న ప్రాంతంలో ఒకరి తర్వాత ఒకరు ముస్లింలే ఉంటారు. వాళ్లతో పెట్టుకోవడం మంచిది కాదు. ఒకవేళ నువ్వు తలపాగా కట్టుకుంటే, అక్కడికి వెళ్ళిన వెంటనే నిన్ను చంపేస్తారు.”

త్రిలోచన్ కటువుగా బదులిచ్చాడు “నాకేం పర్వాలేదు. నేను వెళ్తే తలపాగా ధరించే వెళ్తాను. ఆమె ప్రేమను కోల్పోయే ప్రమాదం నేను తీసుకోదలుచుకోలేదు.”

దీంతో మొజెల్‌కు కోపం నషాళానికి అంటింది. ఆమె కోపంతో ఊగిపోయింది. ఆమె వక్షోజాలు అదిరి వణికాయి. “ఓరి గాడిద.. నువ్వు చస్తే ఆమెని ప్రేమించి ఏం లాభం..? ఆ ముండ పేరేంటి? ఆమె చచ్చాక-ఆమె కుటుంబం కూడా చచ్చాక-అప్పుడు నువ్వు నిజంగా ఒక సిక్కువే.. దేవుడి మీద ఒట్టు. నువ్వు ఒక సిక్కువి..అదీ ఒక మహా తెలివి తక్కువ సిక్కువి!” అని తిట్టింది

త్రిలోచన్‌కు తీవ్రంగా కోపం వచ్చింది. “ చెత్త వాగుడు ఆపు!” అన్నాడు

మొజెల్ గట్టిగా నవ్వింది. ఆమె త్రిలోచన్ మెడ చుట్టూ చేతులు వేసి మెల్లగా అటూ ఇటూ ఊపింది. “సరే, నాన్న, నీ ఇష్టం. వెళ్లి నీ తలపాగా కట్టుకో. నేను బయట నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.”

ఆమె మెట్లు దిగడం మొదలుపెట్టింది. త్రిలోచన్ “నువ్వు వేరే బట్టలు వేసుకోవా?” అని పిలిచాడు.

మోజెల్ తల అడ్డంగా ఊపింది. “లేదు, నేను ఇలాగే వుంటాను.”

ఆమె మెట్ల మీద తన చెప్పులు చప్పుడు చేస్తూ కిందకి దిగుతూనే ఉంది. ఆమె చివరి మెట్టు చేరే వరకు త్రిలోచన్ విన్నాడు, ఆ తర్వాత తన పొడవాటి జుట్టును సరిచేసుకుని, తన అపార్ట్‌మెంట్ వైపు తిరిగాడు. లోపల అతను త్వరగా బట్టలు మార్చుకున్నాడు. అతని తలపాగా అప్పటికే కట్టి ఉంది. అతను దాన్ని జాగ్రత్తగా సరిచేసుకున్నాడు. తలుపుకు తాళం వేసి, కిందకి వెళ్ళాడు.

బయట ఫుట్‌పాత్‌పై, మొజెల్ తన దృఢమైన కాళ్ళను వెడల్పుగా చాపి, అచ్చం మగాడు దమ్ము కొట్టినట్లే సిగరెట్ తాగుతోంది. త్రిలోచన్ దగ్గరికి రాగానే, ఆమె అల్లరిగా నోటి నిండా పొగను అతని ముఖం మీదకు ఊదింది. “నువ్వు నిజంగా చాలా దారుణంగా ఉన్నావు” అని త్రిలోచన్ కోపంగా అన్నాడు.

మొజెల్ నవ్వి “అదేం అంత కొత్త విషయం కాదు. నాకు ఇదివరకే తెలుసు.” అంది. తర్వాత ఆమె త్రిలోచన్ తలపాగా వైపు చూసింది. “మీరు దాన్ని చాలా బాగా కట్టుకున్నారు. మీ జుట్టంతా ఇంకా ఉన్నట్టే వుంది.”

బజారు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. గాలి ఎంత నెమ్మదిగా వీస్తోందంటే, అది కూడా కర్ఫ్యూకి భయపడుతున్నట్లుగా అనిపించింది. దీపాలు వెలిగించారు కానీ వాటి వెలుగు బలహీనంగా ఉంది. సాధారణంగా ఆ సమయంలో ట్రామ్‌లు బయలుదేరి, జనం రాకపోకలు మొదలుపెట్టడంతో వీధులు కళకళలాడతాయి. కానీ ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉందంటే, ఈ దారిని ఎవరూ ఎప్పుడూ ఉపయోగించలేదేమో, ఇక ఎప్పటికీ ఉపయోగించరేమో అన్నట్లుగా వుంది.

మొజెల్ ముందు నడుస్తోంది. ఆమె చెప్పులు నేలమీద టకటకమని శబ్దం చేస్తూ ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పనికిమాలిన చెప్పులు మార్చుకోనందుకు త్రిలోచన్ ఆమెను మనసులో తిట్టుకున్నాడు. వాటిని తీసేసి చెప్పులు లేకుండా నడవమని ఆమెకు చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె వినదని అతనికి తెలుసు.

త్రిలోచన్ ఎంతగా భయపడ్డాడంటే, ఒక ఆకు కదిలినా అతని గుండె ఒక్కసారిగా కొట్టుకుంటోంది. మొజెల్ మాత్రం ఏమీ ఆలోచించకుండా, రోడ్డు మీద షికారు చేస్తున్నట్లుగా సిగరెట్‌ను తాగుతూ నిర్భయంగా ముందుకు నడిచింది.

వారు ఒక కూడలికి చేరుకోగానే, ఒక పోలీసు అధికారి గొంతు ఒక్కసారిగా వినిపించింది “ఏయ్.. ఎక్కడికి వెళ్తున్నారు?”అని

త్రిలోచన్ ఉలిక్కిపడ్డాడు. మొజెల్ పోలీసు వద్దకు వెళ్లి, తన జుట్టును మెల్లగా విదిలించింది.

“ఓహ్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను మోజెల్.” అని చెప్పి, తర్వాత ఆమె ఒక సందు వైపు చూపించింది. “అక్కడ, అటు..మా అక్క అక్కడ ఉంటుంది. ఆమెకు ఒంట్లో బాగోలేదు. నేను డాక్టర్‌ని తీసుకువస్తున్నాను.”

ఆ అధికారి మొజెల్‌ను గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఆమె ఎక్కడినుంచో ఒక సిగరెట్ల ప్యాకెట్ తీసి “ఇదిగో, ఒక సిగరెట్ తీసుకో “అంటూ అతనికి ఒకటి అందించింది.

అధికారి అంగీకరించాడు. మోజెల్ తన నోటి నుండి సిగరెట్‌ను తీసి అధికారి వైపు అందించింది.

ఆ అధికారి ఒక దమ్ము పీల్చాడు. మోజెల్ ఒక కన్నుతో అధికారికి, మరో కన్నుతో త్రిలోచన్‌కు కనుసైగ చేసి, తన చెప్పులను నేలకేసి కొడుతూ, కిర్పాల్ కౌర్ నివసించే ప్రాంతానికి దారితీసే సందు వైపు బయలుదేరింది.

కర్ఫ్యూను ధిక్కరించడంలో మోజెల్ ఒక విచిత్రమైన ఆనందాన్ని పొందుతున్నట్లు త్రిలోచన్‌కు అనిపించింది. ప్రమాదకరమైన ఆటలు ఆడటం ఆమెకు ఇష్టమనేది కూడా వాస్తవమే. వారు జుహు బీచ్‌కు వెళ్ళినప్పుడల్లా, అతనికి ఆమె ఒక పెద్ద తలనొప్పిగా ఉండేది. ఆమె సముద్రపు భారీ అలలను తోసుకుంటూ, మునిగిపోతుందేమోనని భయం వేసేంత దూరం ఈదుకుంటూ వెళ్ళేది. ఆమె తిరిగి వచ్చినప్పుడు, ఆమె శరీరం నిండా ఎప్పుడూ గాయాలే ఉండేవి. అయినా ఆమె పట్టించుకునేది కాదు.

మొజెల్ ముందుకు దూసుకెళ్లింది. కత్తి పట్టుకున్న దుండగుడు తనపై దాడి చేస్తాడేమో అన్నట్టుగా భయపడుతూ, త్రిలోచన్ బెదురుగా అటూ ఇటూ చూస్తూ ఆమెను అనుసరించాడు. మొజెల్ ఆగింది. త్రిలోచన్ ఆమెను చేరుకున్నప్పుడు, ఆమె “త్రిలోక్, నాన్నా. ఇలా భయపడటం ఏమాత్రం ఉపయోగపడదు. నువ్వు భయపడితే, కచ్చితంగా ఏదో చెడు జరుగుతుంది. నన్ను నమ్ము, నేను అనుభవంతో చెబుతున్నాను.” అని ఉపదేశించింది.

త్రిలోచన మౌనంగా ఉండిపోయాడు.

ఒక సందును వదిలి, వారు నేరుగా కిర్పాల్ కౌర్ నివసించే ప్రాంతంలోకి దారితీసే మరో సందులోకి వెళ్లారు. మొజెల్ హఠాత్తుగా ఆగిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళాక, జనం ఒక మార్వాడీ దుకాణాన్ని దోచుకుంటున్నారు. ఆమె ఆ దృశ్యాన్ని చూసి “ఏమీ లేదు. పదండి వెళ్దాం”అంది.

వారు బయలుదేరారు. అకస్మాత్తుగా, తలపై ఒక పెద్ద ఇత్తడి గిన్నెను మోస్తున్న ఒక వ్యక్తి త్రిలోచన్‌ను ఢీకొట్టాడు, దాంతో ఆ గిన్నె కింద పడిపోయింది. ఆ వ్యక్తి త్రిలోచన్‌ను పైనుంచి కింద వరకు చూసి, అతను ఒక సిక్కు అని గ్రహించాడు. వెంటనే, అతను తన నడుము పట్టీలోంచి ఏదో తీయబోయాడు. కానీ మొజెల్ తాగిన మత్తులో ఉన్నట్లుగా ముందుకు తూలి, అతన్ని ఢీకొట్టింది. “ఏయ్, ఏం చేస్తున్నావ్?” అని ఆమె తాగుబోతు గొంతుతో అడిగింది. “నీ సొంత తమ్ముడిని కొట్టాలనుకుంటున్నావా? నేను అతన్నే పెళ్లి చేసుకోబోతున్నాను.” అని, ఆ తర్వాత ఆమె త్రిలోచన్ వైపు తిరిగి “కరీం! ఆ గిన్నెను తీసి ఈ మనిషి తలపై పెట్టు” అని చెప్పింది.

ఆ వ్యక్తి తన నడుము పట్టీలోంచి చేతిని తీసేసి, మొజెల్ వైపు కామంతో కూడిన చూపుతో చూశాడు; తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి తన మోచేతితో ఆమె వక్షోజాలను పొడిచాడు. “బాగుండమ్మా..నువ్వు బాగుండు..” అని అతను ఆ గిన్నెను తీసుకుని, రోడ్డు వెంబడి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.

“ఎంత మొరటోడు, ఆ నీచుడు” అని త్రిలోచన్ గొణుక్కున్నాడు. మోజెల్ తన రొమ్ములను రుద్దుకుంది. “ ఏం పర్వాలేదు. ఇలాంటివి జరుగుతుంటాయి. పద, వెళ్దాం.” ఆమె వేగంగా బయలుదేరగా, త్రిలోచన్ ఆమె వెనుకే హడావిడిగా వెళ్ళాడు.

ఈ సందు గుండా వెళ్ళాక, వారు కిర్పాల్ కౌర్ నివసించే ప్రాంతానికి చేరుకున్నారు. “అది ఏ సందు?” అని మొజెల్ అడిగింది.

“మూడవ సందు..మూలనున్న భవనం.”

మొజెల్ ఆ దిశగా బయలుదేరింది.. ఆ దారి పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. భవనాలు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. కానీ ఒక పసికందు ఏడుపు కూడా వినిపించడం లేదు.

వారు సందు దగ్గరకు వెళ్ళినప్పుడు, వారికి ముందు ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. ఒక వ్యక్తి ఒక భవనం నుండి వేగంగా బయటకు వచ్చి, ఎదురుగా ఉన్న మరో భవనంలోకి అదృశ్యమయ్యాడు. కొంతసేపటి తర్వాత, ఈ భవనం నుండి ముగ్గురు పురుషులు బయటకు వచ్చారు. వారు ఫుట్‌పాత్‌పై అటూ ఇటూ చూసి, ఆపై మొదటి భవనంలోకి వేగంగా దూసుకెళ్లారు. మొజెల్ ఆగింది. ఆమె త్రిలోచన్‌ను నీడలోకి వెళ్ళమని సైగ చేసింది. తర్వాత అతని చెవిలో, “ప్రియమైన త్రిలోక్, నీ తలపాగా తీసేయ్,” అని గుసగుసలాడింది.

“దాన్ని తీయను, అస్సలు తీయను.”

మోజెల్ కోపంతో ఉలిక్కిపడింది. “ఏదయినా కానీ ఏం జరుగుతుందో నీకు కనిపించడం లేదా?” అంది. అక్కడ జరుగుతున్నది చూస్తుంటేనే ఏదో తేడాగా ఉందని స్పష్టంగా అర్థమైంది. తన కుడి వైపున ఉన్న భవనం నుండి ఇద్దరు మనుషులు వీపు మీద గోనె సంచులు మోసుకుంటూ రావడం చూసి మొజెల్ భయంతో వణికిపోయింది. ఆ సంచుల నుండి చిక్కటి ద్రవం కారుతోంది. ఆలోచిస్తూ మొజెల్ పెదవులు కొరుక్కుంది. ఆ ఇద్దరు మనుషులు సందులోకి మాయమయ్యాక, ఆమె త్రిలోచన్‌తో “సరే..నేను ఆ మూల భవనం వైపు పరుగెడతాను. నువ్వు నన్ను తరుముతున్నట్లుగా నా వెనుక రా, సరేనా? కానీ మనం ఇది చాలా వేగంగా చేయాలి” అని చెప్పింది.

మొజెల్ త్రిలోచన్ సమాధానం కోసం వేచి ఉండకుండా మూల భవనం వైపు పరుగెత్తింది, త్రిలోచన్ ఆమె వెనుకే పరుగెత్తాడు. క్షణాల్లోనే వాళ్ళు భవనం లోపలికి చేరుకున్నారు. మెట్ల పక్కన త్రిలోచన్ ఆయాసపడ్డాడు.

“ఏ అంతస్తు?” అడిగింది.

త్రిలోచన్ తన పొడిబారిన పెదవులపై నాలుకను ఆడించాడు. “రెండవది.”

“వెళ్దాం పదండి.”

అప్పుడు ఆమె మెట్లు ఎక్కింది. త్రిలోచన్ ఆమెను అనుసరించాడు. మెట్లపై రక్తం మరకలు వున్నాయి. అది చూసి త్రిలోచన్ నిశ్చేష్టుడయ్యాడు.

అతను రెండవ అంతస్తుకు చేరుకున్నాక, త్రిలోచన్ నడవాలో ముందుకు వెళ్లి, ఒక తలుపు ముందు ఆగి, నిశ్శబ్దంగా తట్టాడు. మొజెల్ మెట్ల పక్కనే ఉండిపోయింది. అతను తలుపు తట్టాడు. తన నోరు తలుపు దగ్గరగా పెట్టి “మహంగా సింగ్జీ! మహంగా సింగ్జీ!” అని పిలిచాడు.

“ఎవరు?” లోపలి నుంచి ఒక పీల గొంతు..

“త్రిలోచన్..”

తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. త్రిలోచన్ మొజెల్‌కు సైగ చేసాడు. ఆమె త్వరగా వచ్చింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మొజెల్ తన పక్కన సన్నగా, భయపడిపోతున్న ఒక అమ్మాయి నిలబడి ఉండటాన్ని చూసింది. ఒక్క క్షణం పాటు మొజెల్ ఆమె వైపు తదేకంగా చూసింది. ఆమె చాలా సన్నగా ఉంది, ఆమె ముక్కు చాలా అందంగా ఉంది. కానీ ఆమెకు జలుబు చేసినట్లు అనిపించింది. మొజెల్ ఆమెను తన విశాలమైన ఛాతీకి హత్తుకుని, తన వదులుగా ఉన్న గౌను అంచుతో కిర్పాల్ కౌర్ ముక్కును తుడిచింది.

త్రిలోచన్ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. మొజెల్ కిర్పాల్ కౌర్‌తో ఆప్యాయంగా “భయపడకు. త్రిలోచన్ ఇక్కడే ఉన్నాడు” అని చెప్పింది.

కిర్పాల్ కౌర్ భయంతో కూడిన కళ్లతో త్రిలోచన్‌ను చూసి, ఆపై మొజెల్ నుండి విడిపోయింది.

“మీ నాన్నని, మీ అమ్మని కూడా త్వరగా సిద్ధమవ్వమని చెప్పు” అని త్రిలోచన్ ఆమెకు ఆదేశించాడు.

అప్పుడే.. పై అంతస్తు నుండి వారికి పెద్ద పెద్ద మాటలు.. ఏదో గొడవలో చిక్కుకున్నట్టుగా ఎవరో అరుస్తున్న శబ్దం వినిపించింది.

“వాళ్ళు ఆమెను తీసుకువెళ్లారు” అని కిర్పాల్ కౌర్ గొంతు అణచిపెట్టుకుని అరిచింది.

“ఎవరు?”అని త్రిలోచన్ అడిగాడు.

కిర్పాల్ కౌర్ సమాధానం చెప్పబోతుండగా, మొజెల్ ఆమె చేయి పట్టుకుని ఒక మూలకు లాక్కెళ్లింది. “ఇప్పుడు నీ బట్టలు విప్పేయ్.” అంది

కిర్పాల్ కౌర్ తేరుకునేలోపే, మొజెల్ ఆ అమ్మాయి బ్లౌజును వేగంగా లాగి పక్కన పెట్టేసింది. అవమానంతో కుంగిపోయిన కిర్పాల్ కౌర్, చేతులతో తనను తాను కప్పుకోవడానికి ప్రయత్నించింది. త్రిలోచన్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. మొజెల్ తన వదులుగా ఉన్న గౌనును తీసి కిర్పాల్ కౌర్‌కు తొడిగింది. ఇప్పుడు మోజెల్ పూర్తిగా నగ్నంగా వుంది. ఆమె చాలా వేగంగా కిర్పాల్ కౌర్ ప్యాంటు నడుము పట్టీని వదులు చేసి..దాన్ని తీసేసి.. ఆ తర్వాత త్రిలోచన్‌తో “వెళ్ళు.. ఆమెను ఇక్కడి నుండి బయటకు తీసుకువెళ్ళు! వద్దు, ఆగు!” అంది. ఆమె కిర్పాల్ కౌర్ జుట్టును విప్పి, ఆ తర్వాత, “వెళ్ళు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళు.”అంది.

“రా..”అన్నాడు త్రిలోచన్. కానీ ఆ తర్వాత అతను హఠాత్తుగా ఆగి, సిగ్గుపడకుండా నగ్నంగా నిలబడి ఉన్న మొజెల్ వైపు తిరిగాడు. చలికి ఆమె చేతుల మీద ఉన్న వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

“నువ్వెందుకు వెళ్లడం లేదు?” అని మొజెల్ చిరాకుగా అడిగింది.

“మరి ఆమె తల్లిదండ్రుల సంగతేంటి?”

“వాళ్ళ సంగతి వదిలేయండి. ఆమెను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి”

“మరి నువ్వు?”

“నేను వస్తున్నాను”

అకస్మాత్తుగా, వారికి పై అంతస్తు నుండి కొంతమంది మనుషులు మెట్లు దిగి వచ్చారు. వారు తలుపు దగ్గరకు వచ్చి, దాన్ని పగలగొట్టేటట్లుగా బాదడం మొదలుపెట్టారు.

పక్క గదిలో కిర్పాల్ కౌర్ అంధురాలైన తల్లి, పక్షవాతంతో ఉన్న తండ్రి మూలుగుతూ పడుకున్నారు.

మొజెల్ ఒక క్షణం ఆలోచించి, తన జుట్టును తేలికగా విదిలించి, త్రిలోచన్‌తో ఇలా అంది, ‘విను.. ఒకే ఒక విషయం.. నేను తలుపు తెరవబోతున్నాను.”

కిర్పాల్ కౌర్ పెదవుల నుండి అణచిపెట్టుకున్న ఆక్రోశం వెలువడింది.

“నేను తలుపు తెరిచి బయటకు వెళ్తాను. నా వెనుక పరిగెత్తు.. నేను మెట్లు ఎక్కుతాను.. నువ్వు కూడా రా.. తలుపు దగ్గర ఎవరున్నా అంతా మర్చిపోయి మనల్ని అనుసరిస్తారు” అని మొజెల్ త్రిలోచన్‌కు సూచించింది.

“అప్పుడు..?”

“ఆవిడకి ఇదే తప్పించుకోవడానికి దొరికిన అవకాశం. ఈ వేషంలో ఉన్న ఆమెను ఎవరూ ఏమీ అనరు.”

త్రిలోచన్ ఇదంతా కిర్పాల్ కౌర్‌కు త్వరగా వివరించాడు. మొజెల్ గట్టిగా అరిచి, తలుపు తెరిచి, బయటకు పరుగెత్తింది. ఆమె బయట ఉన్న మనుషుల మధ్య పడిపోయింది. వాళ్ళు ఎంతగా ఉలిక్కిపడ్డారంటే..వాళ్ళు ఏమీ చేయలేక బిగుసుకుపోయారు. దాంతో ఆమె వెంటనే లేచి మెట్లు ఎక్కింది. త్రిలోచన్ ఆమె వెనుక పరిగెత్తడంతో, ఆ మనుషులు దారి ఇచ్చారు.

మొజెల్ కళ్ళు మూసుకుని మెట్లపైకి పరుగెత్తింది. ఆమె అప్పటికీ తన చెక్క చెప్పులనే ధరించే ఉంది. ఆ పురుషులు తేరుకుని వారి వెనుకే పరిగెట్టారు. అప్పుడు మొజెల్ జారిపోయింది. ఆమె మెట్లపై నుండి జారి కింద పడిపోతూ.. ప్రతి మెట్టును గట్టిగా ఢీకొంటూ..ఇనుప కటకటాలను బలంగా గుద్దుకుంటూ..కింద ఉన్న నడవాలో పడిపోయింది.

త్రిలోచన్ వెంటనే మెట్లు దిగి వచ్చాడు. అతను వంగి చూడగా ఆమె ముక్కు, నోరు, చెవుల నుండి రక్తం కారుతోంది. వాళ్ళందరూ చుట్టూ గుమిగూడారు. కానీ వారిలో ఎవరూ ఏం జరిగిందని అడగలేదు. ఒళ్లంతా గాయాలతో ఉన్న మొజెల్ పాలిపోయిన, నగ్న శరీరాన్ని చూస్తూ అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

త్రిలోచన్ ఆమె చేయి పట్టుకుని కదిలించాడు. “మొజెల్! మొజెల్!”

మొజెల్ రక్తంతో ఎర్రబడిన తన యూదు విశాలమైన కళ్ళను తెరిచి, నవ్వింది.

త్రిలోచన్ తన తలపాగాను తీసి, దానిని విప్పి, ఆమె నగ్న శరీరాన్ని కప్పాడు. ఆమె నోటి నుండి రక్తం బుడబుడలాడుతుండగా, మొజెల్ నవ్వి త్రిలోచన్‌ వైపు కన్నుగీటింది.

“వెళ్లి నా లోదుస్తులు అక్కడ ఉన్నాయో లేదో కనుక్కో, అంటే…”

త్రిలోచన్‌కు అర్థమైంది, కానీ అతను లేవడానికి ఇష్టపడలేదు. దీంతో మోజెల్‌కు కోపం వచ్చి “నువ్వు నిజమైన సిక్కువి! వెళ్లి చూడు” అంది.

త్రిలోచన్ లేచి కిర్పాల్ కౌర్ అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చాడు. మసకబారుతున్న తన కళ్ళతో మొజెల్ జనసమూహం వైపు చూసి, “అతను ముస్లిం, కానీ అతను చాలా ధృడంగా ఉంటాడు కాబట్టి, నేను అతన్ని సిక్కు అని పిలుస్తాను” అంది.

త్రిలోచన్ తిరిగి వచ్చాడు, అతని చూపును బట్టి కిర్పాల్ కౌర్ అప్పటికే వెళ్లిపోయిందని మొజెల్‌కు అర్థమైంది. మొజెల్ ఊరటగా నిట్టూర్చింది, ఆమె నోటి నుండి రక్తం ధారగా కారింది.

‘అయ్యో, ఛత్!’ అంటూ, ఆమె తన మణికట్టు వెనుక భాగంతో నోరు తుడుచుకుంది. తర్వాత ఆమె త్రిలోచన్ వైపు తిరిగి “సరేలే..ప్రియతమా..బై బై..”అంది.

త్రిలోచన్ ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ ఆ మాటలు గొంతులోనే ఇరుక్కుపోయాయి.

మొజెల్ త్రిలోచన్ తలపాగాను తీసివేసింది. “నీ ఈ మతాన్ని తీసేయ్..తీసేయ్..“ అని చెప్పి, ఆమె తన ఉన్నతమైన ఛాతీపై తన చేయిని నిర్జీవంగా జారవిడిచింది.

పి. శ్రీనివాస్ గౌడ్

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.

రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

Previous Post

Bonus Varieties At Smokos: How Our Offers Work

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ కథ : మొజెల్

by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
0

...

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • buchireddy gangula on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply