• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

శివ చల్లా by శివ చల్లా
November 19, 2026
in అనువాద కథలు
0
ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

తెలుగు అనువాదం : శ్రీ శివ చల్లా

అనగనగా ఒక దట్టమైన అడవి. దానికి చివర్లో ఒక చిన్న ఇంట్లో అటవీ కాపలాదారుడు తన భార్యతో కలిసి నివసించేవాడు. వారికి పండిన బెర్రీ పళ్ళలాంటి ముగ్గురు అందమైన కూతుళ్లు, గోధుమరంగు కళ్ళతో మిసమిసలాడిపోయే శరీరఛాయతో ఒక కొడుకు!

ఆ కుటుంబం ప్రేమ, అనురాగం, ఐకమత్యంతో తొణికిసలాడుతూ ఉండేది. అటవీ కాపలాదారుడు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేవాడు. అతనికి తన భార్య, పిల్లల మధ్య సంతోషంగా బీరపువ్వులా కనిపించేది.

కానీ కష్టం అడవిలోని చెట్లెక్కి రాదు కదా. అది మనుషులను వెతుక్కుంటూ దారుల వెంట నడుచుకుంటూ వస్తుంది. ఒక రోజు కష్టం ఆ కుటుంబాన్ని కూడా అలాగే చేరుకుంది.

అటవీ కాపలాదారుడు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు.

మరణం అతని ఇంటి చుట్టూ వల వేసింది. అతన్ని కాపాడే మార్గమే కనిపించలేదు.

చివరికి అతడు తన పిల్లలందరినీ దగ్గరకు పిలిచి “ఇక నేను ఈ భూమిపై ఎక్కువకాలం ఉండను. నా సమయం దగ్గర పడింది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి — ఆరోగ్యం, ఐకమత్యం కంటే గొప్ప సంపద మరొకటి లేదు. ఒకరినొకరు ప్రేమించండి, ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయకండి” అని చెప్పాడు.

మరికాసేపటికి ఆ కాపలాదారుడు కన్నుమూశాడు.

అతనితోపాటే ఆ కుంటుంబంలో సుఖసంతోషాలు కూడా సమాధి అయిపోయాయి.

అతని భార్య కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

“ఇక నేను ఈ చిన్న పిల్లలను ఎలా పోషించగలను?” అని ఆమె ప్రతిరోజూ బాధపడేది.

పిల్లలు ఆమెను ఓదారుస్తూ “అమ్మా, బాధపడకు. మేము ఎలాగోలా జీవిస్తాం. అడవికి వెళ్లి బెర్రీ పండ్లు, పుట్టగొడుగులు ఏరుకుని జీవనం సాగిస్తాం” అన్నారు.

రోజులు గడిచాయి.

దుఃఖం, కన్నీళ్లు ఆ తల్లిని పూర్తిగా బలహీనురాలిని చేశాయి.

ఒక రోజు ఆమె కూడా తన పిల్లలను పిలిచి “నేను చనిపోయిన తర్వాత ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అడవిలో చాలా లోపలికి వెళ్లకండి. అక్కడ ఒక దుష్ట మంత్రగత్తె ఉంటుంది. ఆమె పాముకన్నా ప్రాణాంతకమైనది. చిన్న అమ్మాయిలను అపహరించి బంధిస్తుంది” అని చెప్పింది.

పిల్లలు వెంటనే “సరే అమ్మా. మేము అడవిలో బాగా లోపలకి వెళ్ళము” అన్నారు.

కొద్దికాలానికే తల్లి కూడా మరణించింది.

అలా ఆ పిల్లలు నలుగురూ అనాథలు అయిపోయారు.

వారు చాలాకాలం ఆమె కోసం దుఃఖించారు.

ఆ తర్వాత అబ్బాయి ఒక విల్లు తయారు చేసుకుని వేటకు బయల్దేరాడు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు అడవిలో బెర్రీ పండ్లు ఏరుకునేవారు.

అప్పటి నుంచి గ్రామస్థులు ఆ ముగ్గురు అమ్మాయిలను “బెర్రీ-అక్కచెల్లెళ్ళు”, ఆ అబ్బాయిని “పుట్టగొడుగు-అన్నయ్య” అని పిలిచేవారు.

సంవత్సరాలు గడిచిపోయాయి.

చిన్నపిల్లలు పెద్దవారయ్యారు.

బెర్రీ అక్కచెల్లెళ్ళు అందాన్ని మాటలతోనూ, కలంతోనూ, చిత్రకారుడి కుంచెతోనూ కూడా వర్ణించడం అసాధ్యం. వాళ్ళు ముగ్గురూ అంత అందగత్తెలు మరి!

పుట్టగొడుగు-సోదరుడు కూడా ఎంతో బలవంతుడిగా, అందగాడిగా ఎదిగాడు. అతడు అడవిలో నడుస్తుంటే పక్షులు ఆనందంగా కిలకిలారావాలు చేసేవి.

కానీ ఆ దుష్ట మంత్రగత్తె మాత్రం రాత్రింబవళ్లు వారినే గమనిస్తూ ఉండేది.

బెర్రీ-అక్కచెల్లెళ్ళను తన వశం చేసుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నేది.

అయితే ఆ అడవిని కాపాడే అరణ్యదేవుడు (Forest Spirit) ఆ అమ్మాయిలను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకునేవాడు.

అతడు వారిని హెచ్చరిస్తూ “ఎప్పుడూ ఆ దట్టమైన అడవిలోకి వెళ్లకండి. మీ అమ్మ చెప్పిన చివరి మాటలను గుర్తుంచుకోండి.” అని చెప్పేవాడు.

ముగ్గురు సోదరీమణులు ఆ మాటను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఉండేవారు.

ఒక రోజు మాత్రం వారికి ఆ చిన్న అడవిలో సరిపడా బెర్రీ పండ్లు దొరకలేదు.

వారు ఇంటికి తిరిగి వెళ్లబోతుండగా, ఆ దుష్ట మంత్రగత్తె తన మాయా పొడిని చల్లింది.

క్షణాల్లో నేలంతా ఎర్రటి బెర్రీ పండ్లతో నిండిపోయింది.

అది చూసి ముగ్గురు సోదరీమణులు ఎంతో సంతోషించారు.

మొదటి సోదరి – “ఇవి మూడు రోజులకైనా సరిపోతాయి!”

రెండవ సోదరి – “మన పుట్టగొడుగు-సోదరుడూ చాలా సంతోషపడతాడు.”

మూడవ సోదరి – “వీటిల్లో కొన్నింటిని అమ్మి, మనం తలకు చుట్టుకునే తెల్లని వస్త్రాలను కూడా కొనుక్కోవచ్చు.”

ఆనందంలో మునిగిపోయిన ఆ ముగ్గురు సోదరీమణులు ప్రమాదాన్ని పూర్తిగా మరిచిపోయారు. బెర్రీలు ఏరుకుంటూ అడవిలో చాలా లోపలకు వెళ్లిపోయారు.

అప్పుడే ఒక్కసారిగా దుష్ట మంత్రగత్తె ఒక పొద వెనుక నుంచి బయటకు దూకి పెద్ద అక్కను పట్టుకుని క్షణాల్లోనే దట్టమైన పొదల్లోకి మాయమైపోయింది.

మిగిలిన ఇద్దరు చెల్లెళ్లు భయంతో విలపించారు.

“అక్కా! ఎక్కడ ఉన్నావు? మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లిపోయావు?” అంటూ అరిచారు.

కానీ అటు వైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

అదే సమయంలో దగ్గరలో వేటాడుతున్న పుట్టగొడుగుల అన్నయ్య తన చెల్లెళ్ల అరుపులు విని పరుగెత్తుకుంటూ వచ్చాడు.

అతడు తన అక్క పేరు పిలుస్తూ ప్రతీ పొదలో గాలించాడు. దారులన్నీ వెతికాడు. కానీ దుష్ట మంత్రగత్తె జాడ మాత్రం కనిపించలేదు.

ఆ సమయంలో ఒక చిన్న అడవి మేక (చామోయిస్) గుబురైన పొదల మధ్య నుంచి బయటకు వచ్చి వారివైపు ఎంతో విషాదంగా చూసి వెంటనే కనుమరుగయిపోయింది.

సోదరుడు, ఇద్దరు సోదరీమణులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

చివరికి, భారమైన హృదయాలతో ఇంటి ముఖం పట్టారు.

రోజులు గడిచాయి.

నెలలు గడిచాయి.

కాలక్రమేణా వారి బాధ కొంత తగ్గింది.

ఒకసారి ఇద్దరు అక్కాచెల్లెళ్లు అడవిలో పుట్టగొడుగులు ఏరడానికి బయలుదేరారు. గంటల తరబడి వెతికినా ఒక్క పుట్టగొడుగు కూడా కనిపించలేదు. దుష్ట మంత్రగత్తె వాటన్నింటినీ దట్టమైన గడ్డితో కప్పి దాచేసింది.

నిరాశతో ఇంటి దారి పట్టబోతుండగా, ఒక్కసారిగా వారి ముందున్న నేలంతా పుట్టగొడుగులతో నిండిపోయింది.

అప్పుడే అడవి ఆత్మ “అమ్మాయిలూ! ఆ పుట్టగొడుగుల దగ్గరకు వెళ్లొద్దు. అవి మీకు కీడు చేస్తాయి” అని హెచ్చరించింది.

కానీ అంత మంచి సంపదను వదిలి వెళ్ళడానికి వాళ్ళకు మనసొప్పలేదు.

ఒక పుట్టగొడుగు కోస్తే, దాని పక్కనే ఇంకో రెండు మొలిచేవి. వాటిని తీస్తే మళ్లీ మరికొన్ని కనిపించేవి.

అలా ఏరుకుంటూ పోతూ ప్రమాదాన్ని పూర్తిగా మర్చిపోయారు.

తెలియకుండానే అడవి లోపలకి వెళ్లిపోయారు.

బుట్టలు నిండిపోయినా, ఇంకా ఏరుతూనే ఉన్నారు.

“ఈ వేగంతో ఏరేస్తే చలికాలానికి సరిపడా పుట్టగొడుగులు దొరుకుతాయి!” అని రెండవ అక్క ఆనందంగా అంది.

చిన్న చెల్లెలు ఒక్కసారిగా నిట్టూర్చింది.

“మన పెద్ద అక్క కూడా మనతో ఉంటే ఎంత సంతోషపడేదో……..!”

ఆ మాట నోటినుంచి రావడమే ఆలస్యం, పొదల లోపలి నుంచి దుష్ట మంత్రగత్తె ఒక్కసారిగా బయటికి దూకింది.

మధ్య చెల్లిని భుజాన వేసుకుని పొదల్లోకి మాయమైపోయింది.
చీకటిలో నుంచి ఒక ఆర్తనాదం వినిపించింది.

“బెర్రీ చెల్లెలా! పుట్టగొడుగుల అన్నయ్యా! నన్ను రక్షించండి!”

చిన్న చెల్లెలు గుండెలు పగిలేలా ఏడవసాగింది.

ఆమె రోదన విని అడవిలోని పక్షులు కూడా మూగబోయాయి.

చెట్ల ఆకులు సైతం కదలకుండా నిలిచిపోయాయి.

దగ్గర్లోనే వేటాడుతున్న పుట్టగొడుగుల అన్నయ్య ఆ కేక విని పరుగెత్తుకుంటూ వచ్చాడు.

కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

దుష్ట మంత్రగత్తె గాలిలో కలిసిపోయినట్టుగా ఎక్కడా కనిపించలేదు.

ఆ సమయంలో రెండు చిన్న చామోయిస్‌లు అదే – అడవి మేకలు మెల్లగా బయటకు వచ్చాయి.

వాటి కళ్లలో చెప్పలేని విషాదం ….

కొద్దిసేపు వారివైపు చూసి, మళ్లీ అడవి లోపలికి పరుగెత్తుకుపోయాయి.

అన్నాచెల్లెళ్లు దుఃఖంతో ఇంటికి తిరిగి వెళ్లారు.

ఒక సంవత్సరం గడిచింది.

ఒక రోజు పుట్టగొడుగుల అన్నయ్య వేట కోసం అడవిలో చాలా దూరం వెళ్లాడు.

అతన్ని దారి తప్పించేందుకు దుష్ట మంత్రగత్తె అడవిలోని అన్ని దారులనూ కలగాపులగం చేసేసింది.

ఇక ఇంట్లో చిన్న చెల్లెలు భోజనం సిద్ధం చేసి అన్న కోసం ఎదురుచూస్తూ ఉంది.

కానీ అతడు తిరిగి రాలేదు.

చివరకు ఆమె ఆందోళనతో అడవిలోకి వెళ్లి”పుట్టగొడుగుల అన్నయ్యా! ఎక్కడ ఉన్నావు?”అని గట్టిగట్టిగా అరుస్తూ పిలవసాగింది.

అప్పుడు అడవి ఆత్మ ఆమెతో “నీ అన్న త్వరలోనే వస్తాడు. వెంటనే ఇంటికి వెళ్లిపో. దుష్ట మంత్రగత్తె నీ గురించి వెతుకుతోంది”అని చెప్పాడు.

కానీ చిన్న చెల్లెలు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు.

అన్నను పిలుస్తూ ముందుకు సాగిపోయింది.

అప్పుడే పొదల చాటు నుంచి మంత్రగత్తె మెరుపులా దూసుకొచ్చి ఆమెను ఎత్తుకుపోయింది.

అడవిలో కలిసిపోతూ ఆ అమ్మాయి “అన్నయ్యా! నన్ను రక్షించు! దుష్ట మంత్రగత్తె నన్ను తీసుకెళ్తోంది!” అని గట్టిగా కేకలు వేసింది.

ఆ అరుపులు పుట్టగొడుగుల అన్నయ్య చెవినపడ్డాయి.

అతడు తన శక్తికొద్దీ పరుగెత్తాడు.

కానీ అప్పటికే మంత్రగత్తె జాడ లేకుండా పోయింది.

అతడు నిలువెత్తు శిలలా అక్కడే నిలిచిపోయాడు.

చెల్లిని పిలిచాడు.

మళ్లీ పిలిచాడు.

ఎటు చూసినా నిశ్శబ్దమే.

అప్పుడే మూడు చిన్న అడవి మేకలు పచ్చిక బయలును దాటుకుంటూ పరుగెత్తాయి.

అవి చూసిన చూపులు అతని హృదయాన్ని చీల్చేశాయి.

ఇంట్లో ఉండడం ఇక అతని వల్ల కావట్లేదు.

కొన్ని రోజులు అలాగే విచారంగా గడిపిన తరువాత – “ఏం జరిగినా నా అక్కాచెల్లెళ్లను వెతికి తీసుకొస్తాను!” అని గట్టిగా నిర్ణయించుకుని అడవిలోకి బయలుదేరాడు.

అప్పుడు అడవి ఆత్మ మెల్లగా అతని చెవిలో “ఆ దారిలో వెళ్లొద్దు. నీవూ నాశనం అవుతావు. నీ అక్కాచెల్లెళ్లను కూడా నేను హెచ్చరించాను. కానీ వారు వినలేదు” అని చెప్పింది.

పుట్టగొడుగుల అన్నయ్య ప్రశాంతంగా “మీ మాట తప్పకుండా వింటాను. కానీ నా హృదయం మాత్రం నా అక్క-చెల్లెళ్ల దగ్గరికే నన్ను తీసుకెళ్తోంది. వారిని వెతకకుండా నేను చేతకానివాడిలా ఇలా చేతులు కట్టుకుని కూర్చోలేను” అని జవాబిచ్చాడు.

అడవి ఆత్మ కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ బాలుడి ప్రేమ, పట్టుదల చూసి చివరకు ఇలా అంది –

నీ చెల్లెళ్లపై నీకున్న ప్రేమ నిజమైనదే అయితే నేను నీకు సహాయం చేస్తాను. నా మాట జాగ్రత్తగా విను.

ముందుగా నాలుగు దారులు కలిసే కూడలికి వెళ్లు. అక్కడి నుంచి అడవిలో అన్నింటికంటే బాగా దట్టమైన పొదల్లోకి ప్రవేశించు. రోజంతా పొదలను తొక్కుకుంటూ ముందుకు సాగితే, ఒక పెద్ద తుమ్మ చెట్టు మొద్దుపై నిలబడి ఉన్న చిన్న గుడిసె కనిపిస్తుంది.

అక్కడ నా అక్క డ్రీమీ–డ్రౌసీ – అదే ‘నిద్రమ్మ’ నివసిస్తోంది. ఆమె ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచీ బ్రతికిఉన్న వృద్ధురాలు. నిన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తుంది. రకరకాల వంటకాలు పెట్టి తినమంటుంది. ఆ తర్వాత మెత్తని పరుపు వేసి నిద్రపోమంటుంది.

కానీ జాగ్రత్త! ఆమె పెట్టే ఆహారాన్ని తినవద్దు. ఆమె ఇచ్చే పానీయం తాగవద్దు. కంటిమీద కునుకు కూడా తీయవద్దు. ఒకవేళ అలా చేస్తే నీ లక్ష్యమంతా మరిచిపోతావు. జీవితాంతం ఆమె కొడుకుగానే అక్కడే ఉండిపోతావు.

నా మాటలను గుర్తుంచుకో. ఆ తర్వాత ఏం చేయాలో నీకే తెలుస్తుంది – అన్నాడు.

పుట్టగొడుగుల అన్నయ్య ఆ ఆత్మకి కృతజ్ఞతలు చెప్పి వినయంగా నమస్కరించి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

రోజంతా దట్టమైన ముళ్లపొదలను బలంగా తొక్కుకుంటూ నడిచాడు.

సాయంత్రం అవుతుండగా అతనికి తుమ్మచెట్టు మొద్దుపై నిలిచిన ఒక చిన్న గుడిసె కనిపించింది.

గుమ్మం దగ్గరకు వెళ్లి “ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఇస్తారా?” అని పిలిచాడు.

అంతలో తలుపు తెరుచుకుని నిద్రమ్మ బయటకు వచ్చింది.

పుట్టగొడుగుల అన్నయ్య మర్యాదగా నమస్కరించగా, ఆమె కూడా చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది.

అతడు బెంచీపై కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.

నిద్రమ్మ తన చేతిని ఊపగానే ముందున్న బల్ల నిండా రుచికరమైన వంటకాలు ప్రత్యక్షమయ్యాయి.

“రా బాబూ! ఇలా వచ్చి భోజనం చేయి” అంది.

పుట్టగొడుగుల అన్నయ్యకి అప్పటికే ఆకలి కరకరలాడుతోంది. కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి.

ఆ వంటకాల సువాసనకి నోట్లో నీళ్ళూరుతున్నాయి.

అయినా అడవి ఆత్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది.

అతడు చిరునవ్వుతో “ధన్యవాదాలు అవ్వా! నాకు ఆకలి లేదు” అన్నాడు.

కొద్దిసేపటి తర్వాత నిద్రమ్మ మృదువైన పరుపు పరచింది.

“బాబూ! పడుకో. ఎంతో అలసిపోయి ఉంటావు. కాసేపు విశ్రాంతి తీసుకో.”

అలసిపోయిన ఆ పుట్టగొడుగుల అన్నయ్య కళ్ళు నిద్రతో వాలిపోతున్నాయి. అతనికి నిద్ర ముంచుకొస్తోంది.

ఎవరో మంత్రం వేసినట్టుగా నిద్ర అతన్ని ఆవరించబోతోంది.

అయినా ధైర్యంగా “ధన్యవాదాలు అవ్వా! నాకు నిద్ర రావడం లేదు. ఇక్కడే కూర్చొంటాను. నన్ను ఇక్కడ కూర్చోనివ్వు, చాలు.” అన్నాడు.

నిద్రమ్మ ఎన్నో రకాలుగా అతన్ని నిద్రపుచ్చాలని ప్రయత్నించింది.

ఆమె మాటలు తియ్యగా వినిపిస్తున్నాయి.

ఆ స్వరం నిద్రను ఆహ్వానిస్తున్న సంగీతంలా అనిపించింది.

అయితే అన్నయ్య ఒక్కమాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

చివరకు అతని పట్టుదల చూసి నిద్రమ్మ సంతోషించింది.

“నువ్వు నిజంగా మంచి బాలుడివి. నీ చెల్లెళ్లను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమైంది. ఇప్పుడు వాళ్లను ఎలా రక్షించాలో చెబుతాను, విను.

ఇక్కడి నుంచి మూడు పగళ్లు, మూడు రాత్రులు ప్రయాణిస్తే దుష్ట మంత్రగత్తె నివాసం చేరుకుంటావు. కానీ లోపలికి వెళ్లకూడదు. కిటికీ బయట పొదల్లో దాక్కో.

రాత్రి భోజనం చేసిన తర్వాత మంత్రగత్తె బోన్ల తలుపులు తెరుస్తుంది. వాటిలో బంధించి ఉన్న అడవి మేకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి.

ఒకే బోనులో నుంచి బయటకు వచ్చే మూడు అడవి మేకలే నీ అక్కాచెల్లెళ్లు.
వాళ్లు పచ్చిక పైకి వచ్చిన వెంటనే మంత్రగత్తె తిరిగి ఇంట్లోకి వెళ్తుంది.

అప్పుడు నీ విల్లు తీసి, ఒక్కో మేకపై ఒక్కో బాణం సంధించు.

నీ గురి తప్పకపోతే, ఆ మూడు మేకలు మళ్లీ నీ అక్కాచెల్లెళ్లుగా మారిపోతారు.

వాళ్ల చేతులు పట్టుకుని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపో.

అని చెప్పి నిద్రమ్మ ఎండబెట్టిన పుట్టగొడుగులతో చేసిన ఒక దండను అతనికి ఇచ్చింది.

“ప్రయాణంలో ఆకలి వేస్తే ఇందులో ఒక పుట్టగొడుగు తింటే చాలు. ఇక ఆ రోజు మొత్తం ఆకలి వేయదు.”

తర్వాత ఒక సూది, ఒక చిన్న కూజా, ఒక జాడీను కూడా అతని చేతిలో పెట్టింది.

“వీటిని జాగ్రత్తగా దాచుకో. సమయం వచ్చినప్పుడు ఇవే నీ ప్రాణాలను కాపాడుతాయి” అని చెప్పింది.

పుట్టగొడుగుల అన్నయ్య ఆమెకు కృతజ్ఞతలు తెలిపి పడమటి దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

మూడు పగళ్లు, మూడు రాత్రులు నడిచిన తర్వాత చివరకు దుష్ట మంత్రగత్తె నివాసానికి చేరుకున్నాడు.

ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కుని కిటికీలోంచి లోపలకి చూశాడు.

మంత్రగత్తె రాత్రి భోజనం సిద్ధం చేస్తోంది.

ఆ వంటల సువాసనకి అతగాడు ఆకలి మరింత ఎక్కువయింది.

ఒక్క క్షణం లోపలికి వెళ్లి కొంచెం ఆహారం అడగాలనిపించింది.

కానీ వెంటనే నిద్రమ్మ ఇచ్చిన ఎండిన పుట్టగొడుగులు గుర్తొచ్చాయి.

ఒకటి నోట్లో వేసుకున్నాడు.

వెంటనే బాలుడికి విందు భోజనం చేసినంత తృప్తి కలిగింది.

రాత్రి భోజనం ముగిసిన తర్వాత దుష్ట మంత్రగత్తె బయటకు వచ్చి వరుసగా పంజరాల తలుపులు తెరవసాగింది.

మొదటి పంజరం నుంచి రెండు చామోయిస్‌లు బయటకు వచ్చాయి.

రెండో పంజరం నుంచి నాలుగు వచ్చాయి.

మూడో పంజరం నుంచి ఒక్కటి మాత్రమే వచ్చింది.

పుట్టగొడుగుల సోదరుడు ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నాడు.

చివరకు మంత్రగత్తె ఇంకో పంజరం తెరిచింది.

అందులో నుంచి మూడు చామోయిస్‌లు బయటకు వచ్చాయి.

మిగతా వాటిలా అవి అడవిలోకి పరుగెత్తలేదు.

పచ్చికపై నిలబడి, పుట్టగొడుగుల సోదరుడు దాక్కున్న వైపే ఎంతో విషాదంగా చూస్తూ నిలిచిపోయాయి.

మంత్రగత్తె పాత్రలు కడగడానికి ఇంట్లోకి వెళ్లగానే, పుట్టగొడుగుల సోదరుడు విల్లు ఎక్కుపెట్టి మొదటి చామోయిస్‌పై బాణం వదిలాడు.

క్షణంలోనే ఆ బాణం వెళ్ళి చెమోయిస్ కు తగిలింది. అంతే, అది పెద్ద బెర్రీ సోదరిగా మారిపోయింది.

రెండో బాణాన్ని మరో చామోయిస్‌పై సంధించాడు.

అది మోకాళ్లపై వాలి మధ్య సోదరిగా మారింది.

చివరిగా మూడో బాణం వదిలాడు.

మూడో చామోయిస్ తల వంచి చిన్న బెర్రీ సోదరిగా మారిపోయింది.

పుట్టగొడుగుల సోదరుడు ఆనందంతో పరుగెత్తి వెళ్లి తన ముగ్గురు అక్కచెల్లెళ్లను కౌగిలించుకున్నాడు.

చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు చూసుకుని ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు.

అప్పుడే అరణ్యదేవుడు “త్వరగా పారిపోండి! ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండి! మీ శక్తి మేరకు పరుగెత్తండి!” అని హెచ్చరించాడు.

పుట్టగొడుగుల సోదరుడు, బెర్రీపళ్ళ అక్కచెల్లెళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని అడవిలోకి పరుగెత్తసాగారు.

ఇంతలో దుష్ట మంత్రగత్తె పాత్రలు కడిగి బయటకు వచ్చింది.

పంజరాల్లో ఉన్న జంతువులను లెక్కపెట్టింది.

మూడు చామోయిస్‌లు కనిపించకపోవడం గమనించి కోపంతో ఊగిపోయింది.

వెంటనే వారిని వెంబడించడం ప్రారంభించింది.

ఆమె అడుగులకు భూమంతా కంపించింది.

ఆ శబ్దం విని నలుగురూ భయంతో మరింత వేగంగా పరుగెత్తసాగారు.

మంత్రగత్తె అడుగుల గర్జన క్రమంగా దగ్గరపడుతుండగా అన్నాచెల్లెళ్ల గుండెల్లో భయం నిండిపోయింది. ఇక తప్పించుకోలేమేమో అనిపించిన ఆ క్షణంలో అరణ్యదేవత స్వరం మళ్లీ పుట్టగొడుగుల సోదరుడికి వినిపించింది.

“బాబూ! నిద్రమ్మ ఇచ్చిన సూదిని వెంటనే నేలపై పడవేయి!”

అతడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సూదిని వెనక్కి విసిరేశాడు.

అది నేలను తాకగానే అద్భుతం జరిగింది. క్షణాల్లోనే వారి వెనుక దట్టమైన అరణ్యం మొలిచింది. ఆ చెట్లు అంత ఎత్తుగా, దట్టంగా పెరిగాయి కాబట్టి వాటిని దాటి నడవడం గానీ, గుర్రంపై వెళ్లడం గానీ అసాధ్యమైంది.

కానీ మంత్రగత్తె అంత తేలికగా ఓడిపోయే రకం కాదు. ఆమె వద్ద మూడు గొడ్డళ్లు ఉన్నాయి—ఒకటి చెక్కతో చేసినది, మరొకటి గాజుతో చేసినది, ఇంకొకటి ఇనుముతో చేసినది.

ముందుగా చెక్క గొడ్డలిని తీసుకుని చెట్లను నరకడం మొదలుపెట్టింది. ఎంత బలంగా కొట్టిందో, చివరకు ఆ గొడ్డలి ముక్కలైపోయింది. వెంటనే గాజు గొడ్డలిని తీసుకుంది. అది కూడా కొంతసేపటికి తునాతునకలైంది.

చివరికి ఇనుప గొడ్డలిని చేతబట్టి, ఆ దట్టమైన అడవిలో దారిని చేసుకుంటూ ముందుకు నడిచింది. ఆమె అడవిని దాటేసరికి అన్నాచెల్లెళ్లు చాలా దూరం వెళ్లిపోయారు.

అయినా ఆమె తన పంతం వదల్లేదు.

“ఎక్కడికి పారిపోతారు? మిమ్మల్ని పట్టుకుని తీరుతాను!” అంటూ తుఫాను వేగంతో మళ్లీ వారిని వెంబడించడం మొదలుపెట్టింది.

అంతలో అన్నాచెల్లెళ్లు అలసటతో నడవలేని స్థితికి చేరుకున్నారు. కానీ వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేకపోయింది. తమను రక్షించేది ధైర్యం, ఐక్యత మాత్రమేనని భావిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు.

ఆ నలుగురూ ఎంత వేగంగా పరుగెత్తినా, మంత్రగత్తె అడుగుల శబ్దం మరీ దగ్గరయిపోతోంది. అడవంతా ఆమె ఆగ్రహ గర్జనతో దద్దరిల్లిపోయింది. చెట్ల కొమ్మలపై కూర్చున్న పక్షులు భయంతో ఎగిరిపోయాయి. అడవి జంతువులు పొదల్లోకి పరుగులు తీశాయి.

పుట్టగొడుగుల సోదరుడు వెనక్కి తిరిగి చూడగా, మంత్రగత్తె మళ్లీ వారికి దగ్గరగా వచ్చేస్తున్నట్టు కనిపించింది. అప్పుడు అరణ్యదేవత చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. నిద్రమ్మ తన చేతిలో పెట్టిన చిన్న కూజా ఇంకా అతని సంచిలోనే ఉంది.

వెంటనే అతడు ఆ కూజాను వెనక్కి విసిరేశాడు.

అది నేలను తాకిన మరుక్షణమే భూమి కంపించింది. చిన్న కూజా క్షణాల్లోనే ఒక మహా పర్వతంగా మారిపోయింది. ఆ పర్వత శిఖరాలు మేఘాలను తాకేంత ఎత్తులో నిలిచాయి. నిటారుగా ఉన్న రాళ్లు, లోతైన అగాధాలు దాటలేని అడ్డుగోడలా మారాయి.

మంత్రగత్తె పర్వతం దిగువ భాగాన ఆగిపోయింది. కోపంతో ఆమె కళ్లలో నుండి నిప్పులు కురిసాయి. వెంటనే తన మంత్రశక్తిని ప్రయోగించి, బండరాళ్లను పగలగొట్టడం మొదలుపెట్టింది. గంటల తరబడి శ్రమించి చివరకు పర్వతాన్ని దాటి మరోవైపు చేరుకుంది.

అప్పటికే అన్నాచెల్లెళ్లు చాలా దూరం వెళ్లిపోయారు.

“మీరు ఎంత దూరం పారిపోయినా ఏం ప్రయోజనం లేదు,” అని మంత్రగత్తె భయంకరంగా అరిచింది. “నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు!”అని ఘీంకరించింది.

ఆమె మళ్లీ వారి వెంట పరిగెత్తింది.

ఎన్నో గంటలు పరుగెత్తిన తరువాత సోదరీమణులు పూర్తిగా అలసిపోయారు. వాళ్ళు నలుగురూ ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని స్థితికి చేరుకున్నారు. అయినా పుట్టగొడుగుల సోదరుడు“ఇంకొంచెం ఓపిక పట్టండి. మనం ఆగితే అంతే. ముందుకు సాగితేనే బ్రతికి బట్టకట్టగలం” అని వారికి ధైర్యం చెప్పాడు.

వారు మళ్లీ ధైర్యం కూడగట్టుకుని నడవసాగారు.

కొంతసేపటికే మంత్రగత్తె మళ్లీ వారికి దగ్గరపడింది. ఆమె ఊపిరి శబ్దం వారి చెవులకు వినిపించేంత దగ్గరకు వచ్చేసింది.

అప్పుడు పుట్టగొడుగు సోదరుడికి నిద్రమ్మ ఇచ్చిన చివరి వస్తువు—చిన్న జాడీ—గుర్తొచ్చింది. ఇక మిగిలింది ఇది ఒక్కటే.

“ఇది మన చివరి ఆశ,” అని మనసులో అనుకుని, ఆ జాడీని తన వెనుకకు బలంగా విసిరేశాడు.

జాడీ నేలను తాకగానే అది పగిలిపోయింది. దాని నుంచి ఉప్పొంగిన నీరు క్షణక్షణానికీ విస్తరిస్తూ, ఒక ఉద్ధృతమైన నదిగా మారింది. అలలు ఉరకలు వేస్తూ ప్రవహించాయి. కొద్దిసేపట్లోనే ఆ నది విశాలమైన జలప్రవాహంగా మారి, అన్నాచెల్లెళ్లకు మంత్రగత్తెకు మధ్య దాటలేని అడ్డంకిగా నిలిచింది.

మంత్రగత్తె నది ఒడ్డున నిలబడి కోపంతో గర్జించింది. ఆమె ఎన్నో మంత్రాలు జపించింది. నీటిని చీల్చడానికి, దాటడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. కానీ నదీ ప్రవాహం మరింత ఉద్ధృతంగా మారింది. ఆమె ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి.

ఆగ్రహంతో ఊగిపోతున్న మంత్రగత్తెకు చివరకు ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఆమె శాపనార్థాలు పెడుతూ వెనక్కి తిరిగింది.

అన్నాచెల్లెళ్లు మాత్రం ప్రమాదం తప్పిందని సంతోషిస్తూ, అలసట తీర్చుకోవడానికి కాసేపు ఆగారు. ఒకరినొకరు చూసుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో పరీక్షలు దాటి చివరకు వారు స్వేచ్ఛను పొందారు. ఇక తమ ఇంటి దారి పట్టి, కొత్త ఆశతో ప్రయాణం కొనసాగించారు.

శివ చల్లా

శివ చల్లా 5 జూలై 1997న నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఫిసికో-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎం.ఎస్‌.సి., డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఇంపైర్‌మెంట్‌లో స్పెషల్ బి.ఎడ్. పట్టాలను పొందారు.
గత పదేళ్లుగా గుజరాత్, హైదరాబాద్‌లలోని పలు పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ అధ్యాపకులుగా సేవలందించారు. ప్రస్తుతం ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రదేశాలను సందర్శించడం, పుస్తక పఠనం, బేకింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం వీరి అభిరుచులు.

Previous Post

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

Next Post

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

Next Post
కన్నడ కథ : తల్లీ సాకీబాయి

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ: చెరసాల

కన్నడ కథ: చెరసాల

by చందకచర్ల రమేశబాబు
November 19, 2026
0

...

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

by రంగనాధ రామచంద్రరావు
November 19, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

by శివ చల్లా
November 19, 2026
0

...

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

by విఎల్ నరసింహం శివకోటి
November 19, 2026
0

...

ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ కథ : మొజెల్

by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
0

...

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • buchireddy gangula on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply