మూలం : గై ది మాపాసా
తెలుగు అనువాదం : ఉషారాణి
అతడు ఇదివరకు గ్రామం బయట రహదారి పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆ గ్రామంలోనే బండి చక్రాలు బాగు చేసే చిన్న వ్యాపారం చేసేవాడు. ఆ ప్రాంతానికి చెందిన ఒక రైతు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కష్టపడి పనిచేయడం వల్ల కాస్తంత సంపద పోగేసుకున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. అది వాళ్ళని చాలా బాధించేది. చివరికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి జోన్ అని పేరు పెట్టారు. ఇక వాళ్ళిద్దరికీ వాడంటే ప్రాణం. వాళ్ళ కనుచూపు దాటి ఎక్కడికీ పోనిచ్చేవారు కాదు.
వాడికి దాదాపు 5 ఏళ్ళ వయసులో గారడీలు చేసేవాళ్ళు, ఇంటి ముందు నుంచి వెళ్లడం చూశాడు. ఇంట్లోంచి పారిపోయి వాళ్లతో కలిసిపోయాడు. తండ్రి వాడి కోసం వెతకగా వెతకగా, విన్యాసాలు చేసే మేకలతో, రకరకాల ఆటలాడే కుక్కలతో కలిసిపోయి కేరింతలు కొడుతూ, ముసలి హాస్యగాడి ఒడిలో కూర్చొని నవ్వుతుండడం చూశాడు.
మూడు రోజుల తర్వాత, వాళ్లు రాత్రి భోజనానికి కూర్చునే ముందు, బండ్లు బాగు చేసే వాడు, అతని భార్య, కొడుకు ఇంట్లో లేకపోవడం గమనించారు. వాడి కోసం తోట అంతా వెతికారు. కానీ కనిపించలేదు. తండ్రి రోడ్డున పడి ‘జోన్’ ,’జోన్’ అంటూ కేకలు వేసుకుంటూ వెతికాడు.
చీకటి పడింది. రాగి రంగు పొగలు పైకి లేస్తూ ఉండడం వలన, వస్తువులేవి సరిగ్గా కనిపించడం లేదు. దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. స్పష్టంగా కనిపించడం లేదు. దగ్గరే ఉన్న మూడు పొడుగాటి పైన్ చెట్లు కన్నీరు కారుస్తున్నట్టు ఉన్నాయి. ఎంత పిలిచినా ఎక్కడి నుంచీ సమాధానం లేదు. గాలంతా అస్పష్టమైన వస్తువులతో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. తండ్రి కాసేపు చెవులు రిక్కించి విన్నాడు. ఒక వైపు నుంచి కాస్తంత శబ్దం వినిపించినట్టు అనిపించేది. మరి కాసేపటికి మరోవైపు నుంచి శబ్దం వచ్చినట్టు అనిపించేది. ఆ శబ్దం దరిదాపు తన దగ్గరే ఉన్నట్టు అనిపించేది. రాత్రంతా శబ్దం వచ్చినట్టు అనిపించిన వైపల్లా ‘జోన్ జోన్’ అని కేకలేసుకుంటూ పరుగులు పెడుతూనే ఉన్నాడు
పొద్దున సూర్యోదయం అయ్యేవరకు వెతుకులాడుతూనే ఉన్నాడు. అతని అరుపులు చీకట్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి; అవి తప్పిపోయిన జంతువులను భయపెట్టాయి. అంతులేని ఆందోళనతో భయంతో మానసిక స్థైర్యాన్ని కోల్పోయాడు. అతని భార్య ఇంటి అరుగు మీద కూర్చొని తెల్లారే వరకు ఏడుస్తూనే ఉంది. కొడుకు దొరకలేదన్న బాధ వారిని తొందరగా ముసలి వారిని చేసింది. చివరికి వాళ్లు ఇద్దరూ ఉన్న ఇల్లు అమ్ముకొని, కొడుకును వెతుక్కుంటూ బయలుదేరారు.
కొండల మీదున్న గొర్రెలు కాపరులను అడిగారు. వ్యాపారులను కనుక్కున్నారు. గ్రామంలో ఉన్న రైతులను, నగరాలలో ఉన్న అధికారులను వాకబు చేశారు. కొడుకు తప్పిపోయి చాలా రోజులైంది. ఎవరికీ అతని జాడ తెలియలేదు. చాలాకాలం అయిపోవడం వల్ల వాడు పేరు కూడా మర్చిపోయిఉంటాడు అనుకున్నారు. వాడు పుట్టిన గ్రామం పేరు కూడా గుర్తు ఉండిఉండదు. ఇక దొరుకుతాడన్న ఆశలేక తల్లిదండ్రులు మౌనంగా రోదించారు.
కొద్ది రోజుల్లో వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. పగలంతా హోటళ్లలోనూ పొలాలలోనూ కూలి పనులు చేసుకుంటూ, సంపాదించిన నాలుగు డబ్బులతో రోజు గడుపుకుంటూ, తుడిచిన టేబుల్ ల కింద పడిన రొట్టెముక్కలతో కడుపులు నింపుకుంటూ, చలికి వణుకుతూ కాలక్షేపం చేస్తున్నారు. కొన్ని రోజులకి వాళ్లలో ఉన్న శక్తి అంతా ఉడిగిపోయింది. ఇక ఏమాత్రం పని చేయలేనంత బలహీనులు అయ్యారు. అప్పుడిక వారిని ఎవరూ పనిలో కూడా పెట్టుకోవడం మానేశారు. గతిలేక రోడ్డు పక్కన కూర్చొని అడుక్కోవడం మొదలుపెట్టారు. దారిన పోతున్న వాళ్ళందర్నీ విచారంగా దానం ఇవ్వమని అడిగేవారు. పొలాలలో పని చేస్తున్న రైతులు చెట్ల కింద కూర్చొని తింటుంటే, వాళ్లని ఓ రొట్టెముక్క వేయమని అర్థించేవారు. ఏదో ఒక నీటి గుంట పక్కన కూర్చుని మౌనంగా తినేవారు. ఒకరోజు వాళ్లు బసచేసిన ఇంటి యజమానికి తమ కథను వివరిస్తే, “నాకు కూతుర్ని పోగొట్టుకున్న ఒక జంట గురించి తెలుసు. వాళ్లు తమ అమ్మాయిని ప్యారిస్ లో కనుగొన్నారు” అన్నాడు.
వెంటనే వాళ్లు పారిస్ బయలుదేరారు.
అంత పెద్ద నగరంలోకి ప్రవేశించగానే ఆ హంగు ఆర్భాటానికి కంగారు పడిపోయారు. జనాల గుంపులను చూసి బెదిరిపోయారు. కానీ వాళ్లకి ఎందుకో జోన్ ఆ గుంపుల మధ్యనే ఉంటాడని అనిపించింది. అయితే అతనిని ఎలా కనుక్కోవాలో తెలియలేదు. తాము వాడిని గుర్తించలేమేమో అని భయం కూడా పట్టుకుంది. ఎందుకంటే వాడు తప్పిపోయింది ఐదేళ్ల వయసులో.
ఎన్నో ప్రదేశాలు సందర్శించారు. వీధులన్నీ తిరిగారు. ఎక్కడ ఒక చిన్న గుంపు జనాలు పోగయి మాట్లాడుకుంటున్నా, లోపలికి దూరి వెతికారు. అదృష్టవశాత్తు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని ఆశపడ్డారు.
ఒకరి భుజానికి ఒకరు తలానించుకొని రోడ్లెమ్మట వంకర టింకరగా, విచారంగా నడుస్తుంటే, పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆ వృద్ధ దంపతులకు అడగకుండానే చాలామంది ముష్టి వేశారు.
ప్రతి ఆదివారం చర్చి తలుపుల దగ్గర కూర్చునే వాళ్ళు. చర్చి లోపలికి వెళుతున్న వాళ్ళని బయటికి వస్తున్న వాళ్ళని గమనిస్తూ ఉండేవారు. ఏదైనా పరిచయమైన మొహం కనిపిస్తుందేమో అని ఆశగా చూసేవాళ్ళు. ఎన్నోసార్లు వారికి తమ కొడుకుని గుర్తుపట్టినట్టు అనిపించేది. కానీ అది ఎప్పుడూ తప్పే అయ్యేది.
ఒక చర్చి వాసారాలో వాళ్లు సర్వసాధారణంగా నిలబడేవారు. అక్కడ పవిత్ర జలాన్ని జల్లే ఒక ముసలతనితో వీరికి స్నేహం ఏర్పడింది. అతనికి కూడా ఒక విషాద చరిత్ర ఉంది. ఇద్దరికీ కష్టాల గత చరిత్ర ఉండడంతో వారి మధ్య స్నేహబంధం బలపడింది. అదెంత బలపడిందంటే, వాళ్లు ముగ్గురు కలిసి ఒక ఇంటి మేడపైన ఉన్న ఒక పేద లాడ్జిలో కలిసి ఉండడం మొదలుపెట్టారు. అది ఊరికి దూరంగా ఉండేది. దాదాపు వూరి బయటే. మన బండి చక్రాలు రిపేరు చేసేవాడు చర్చిలో పవిత్ర జలాన్ని జల్లే అతను జబ్బున పడితే, స్నేహితుడికి సహాయం చేయడానికోసం, ఇతడే పవిత్రజాలాన్ని జల్లడం మొదలుపెట్టాడు.
చలికాలం ప్రవేశించింది. చలి చాలా తీవ్రంగా ఉంది. ఒక రోజు పవిత్ర జలాన్ని జల్లే ముసలాయన చనిపోయాడు. బండి రిపేరు చేసే వాడి కథ తెలిసిన చర్చి వారు అతనినే ఆ పనికి వినియోగించారు. ప్రతిరోజు పొద్దున్నే అక్కడికి వెళ్లి, అదే చోట, అదే కుర్చీలో,అక్కడున్న స్తంభాన్ని ఆనుకొని కూర్చునేవాడు. లోపలికి వెళుతున్న ప్రతి మనిషిని జాగ్రత్తగా పరిశీలించేవాడు. ఆదివారం కోసం ఎదురుచూస్తున్న బడి పిల్లవాడి లాగా, మళ్లీ వచ్చే ఆదివారం కోసం ఎదురుచూసేవాడు- ఆదివారం చర్చి జనాలతో కిటకిటలాడుతుంటుంది కదా!
అతడిప్పుడు మరింత ముసలివాడు అయ్యాడు. చర్చిలోని చెమ్మ ను పీల్చి మరింత బలహీనుడు అయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్ది ఆశ ఆవిరవడం మొదలైంది.
కొన్నాళ్ళు గడిచిన తర్వాత చర్చికి వస్తున్న వాళ్ళందరి మొహాలు గుర్తుపట్టగలుగుతున్నాడు. ఏ సమయంలో ఎవరొస్తారో అతనికి తెలిసింది. ఎవరి ఆచార వ్యవహారాలేంటో కనిపెట్టగలిగాడు. చర్చి గుమ్మం రాతి అడుగు మీద అడుగు పెట్టంగానే అందర్నీ గుర్తుపట్టేవాడు.
అతని ఆసక్తులు ఎంత సంకుచితమైపోయాయంటే, ఎవరైనా కొత్త వాళ్లు చర్చిలోకి అడుగుపెట్టడమే ఒక గొప్ప సంఘటనగా అనిపించడం మొదలైంది. ఒకరోజు ఇద్దరు ఆడవాళ్లు చర్చిలోకి కొత్తగా వచ్చారు. అందులో ఒకరు వయసు మళ్ళిన ఆమె. మరొకరు యువతి- బహుశా అమ్మ, కూతురు అయి ఉండవచ్చు. వారి వెనకే ఒక యువకుడు వచ్చాడు. వచ్చిన వెంటనే వారికి నమస్కరించాడు. పవిత్ర జలం ఇవ్వగానే, ముసలామె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు.
“ఆ యువతి అతను పెళ్లి చేసుకోబోయే ఆమె అయి ఉంటుంది” అనుకున్నాడు బండి చక్రాలు రిపేర్ చేసే వాడు. సాయంత్రం వరకు, ఇటువంటి మనిషినే తాను ఇదివరకు ఎక్కడ చూశానా అని జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ తనకు గుర్తొచ్చిన మొహం ఉన్నవాడు ఇప్పటికే చాలా పెద్దవాడై ఉంటాడు. ఈ యువకుడుని చూస్తే తనకి చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవాడి లాగా అనిపిస్తున్నాడు.
ఆ యువకుడు, ఆ ఇద్దరు మహిళలతో కలిసి మళ్లీ వచ్చాడు. అతడి అస్పష్టమైన, సుదూరమైన, బాగా పరిచయమైన పోలికలు ముసలాయన్ని ఎంతగా కలవరపాటుకు గురిచేసాయంటే, అతను ఒక రోజు తన భార్యను కూడా తనతో రమ్మని అడిగాడు- క్షీణించిన తన జ్ఞాపక శక్తిని ఆమె జ్ఞాపక శక్తి తోడు అవుతుందని.
ఆ రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత, ఆ ముగ్గురు కొత్తవాళ్లు మళ్ళీ కలిసి చర్చికి వచ్చారు. ముగ్గురూ ముసలాయన్ని దాటుకుంటూ ముందుకెళ్లారు.
“నీకు ఇతను తెలుసా?”
భార్య తన జ్ఞాపకాలను ఆందోళనపడుతూనే తవ్వడానికి ప్రయత్నించింది. ఉన్నట్టుండి చిన్న గొంతుకతో:
“తెలుసు, తెలుసు. కానీ, చిన్నప్పటి కన్నా అతని ఛాయ తగ్గింది. పొడుగయ్యాడు. బలంగా ఉన్నాడు. పెద్దమనుషుల లాగా ఉన్నాడు. నిజానికి నీ మొహం కూడా ఒకప్పుడు అలాగే ఉండేది!”
ముసలాయనకి ఆనందంతో పిచ్చెక్కినట్టు అయింది.
అవును, అది నిజమే. ఇతగాడు కూడా చిన్నప్పుడు తనున్నట్టే ఉన్నాడు. చనిపోయిన తన తమ్ముడిలాగే ఉన్నాడు. యవ్వనంలో ఉన్న తన తండ్రి లాగే ఉన్నాడు. ఆ ముసలి దంపతులు ఎంతగా చలించిపోయారంటే వారికి నోట మాట రాలేదు. కొంతసేపటికి లోపలికి వెళ్ళిన ముగ్గురు బయటికి వచ్చారు. చర్చి నుండి బయటికి వెళ్ళబోతున్నారు.
ముసలాడు పవిత్రజలంలో వేలు పెట్టాడు. వారిపై జల్ల బోయాడు. అప్పుడు ముసలాయన చేతులు వణుకుతుండగా, పవిత్ర జలాన్ని నేలమీద జల్లుతూ, “జోన్!” అన్నాడు.
యువకుడు కూడా ఆగి, ముసలాయన వైపు చూశాడు.
అతడు మళ్ళీ, ” జోన్”అన్నాడు
పక్కనున్న ఇద్దరు ఆడవాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా నిలుచుని చూస్తున్నారు.
అతడు మూడోసారి కూడా కన్నీరు కాలుస్తూ మళ్లీ “జోన్!” అన్నాడు.
యువకుడు వంగి ముసలి ఆయన మొహం పక్కనే మొహం పెట్టాడు. అతని చిన్ననాటి జ్ఞాపకాలు మనసులో మెదిలాయి.
“పప్పా పేర్, మమ్మా యాన్!”
అతడికి ఇంకేమీ గుర్తులేవు. తన తండ్రి ఇంటి పేరు గానీ, తన గ్రామం పేరుగాని. కానీ ఎప్పుడూ రెండు పదాలు మాత్రం గుర్తుకొస్తుండేవి “పప్పా పేర్, మమ్మా యాన్!”
అతను నేల మీదికి జారిపోయాడు. ముసలాయన మోకాళ్ళ దగ్గర వరకు. కన్నీరు కార్చాడు. ఇప్పుడు తన తల్లిదండ్రులని గుర్తించాడు. ముద్దులు పెట్టుకున్నాడు. ముసలి దంపతుల ఆనందానికి హద్దే లేదు. సంతోషంతో వాళ్లకు ఊపిరాడలేదు.
ఆడవాళ్లు ఇద్దరు కూడా కన్నీరు కార్చారు. ఏదో ఒక సంతోషకరమైన విషయం జరిగిందని గ్రహించారు.
ఆ తర్వాత వాళ్లు యువకుడి ఇంటికి వెళ్లారు. అతడు జరిగిన విషయాలన్నీ వివరించాడు. సర్కస్ వాళ్ళు తనని తీసుకెళ్లారు. మూడేళ్లు వాళ్లతో పాటు తిరిగాడు. అనేక దేశాలు చూశాడు. ఆ తర్వాత ఆ ట్రూప్ కాస్తా చెల్లా చదరైపోయింది. ఒకరోజు మహల్ లో ఉన్న ముసలామె కుర్రాడిని తనతో పాటు ఉంచుకోవడానికి వారికి కొంత సొమ్ము చెల్లించింది. వాడంటే ఆమెకి వల్లమాలిన అభిమానం ఏర్పడింది. కుర్రాడు తెలివి గలవాడు, కాబట్టి వాటిని బడికి పంపించింది. ఆ తర్వాత కాలేజీకి. ముసలామెకి పిల్లలు లేరు. అందువల్ల తన ఆస్తి నంతటిని పెంచుకున్న వాడికే అప్పచెప్పింది. అతడు కూడా తల్లిదండ్రుల కోసం చాలా వెతికాడు. కానీ వాళ్ళ పేర్లు సరిగ్గా గుర్తులేవు. కేవలం “పప్పా పేర్ మమ్మా యాన్”అని మాత్రమే గుర్తున్నాయి. అందువలన సరిగ్గా వెతికే ప్రయత్నంలో సఫలం కాలేకపోయాడు. తాను పెళ్ళి చేసుకోబోయే అందమైన, మంచి అమ్మాయిని తల్లిదండ్రులకు పరిచయం చేశాడు.
ముసలివాళ్ళిద్దరూ తమ కథని చెప్పడంతో, యువకుడు వాళ్ళిద్దరికీ మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టాడు. రాత్రి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకున్నారు. తాము ఇన్నేళ్లుగా వెతుక్కుంటున్న సంతోషం, నిద్రపోతే ఎగిరిపోతుందేమో అని భయంతో మేలుకొనే ఉన్నారు.
వారిపై ఇన్నాళ్లు దురదృష్టం చెలాయించిన ఆధిపత్యం అంతమైంది. మిగిలిన జీవితమంతా వాళ్లు సంతోషంగా గడిపారు.
![]()
జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.































