మూలం : డొరథీ పార్కర్
అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు
నా ప్రేమ నిలకడగా ఉండదు.
ఒక క్షణం ఒకరి వైపు మొగ్గుతుంది;
మరో క్షణం మరొకరి వైపు మళ్లిపోతుంది.
అలాంటి నా మనసుతో
నేను చేసే ప్రమాణాలకు అర్థమేంటి?
దుఃఖపు చినుకులనైనా,
వేదనల ప్రవాహాలనైనా తట్టుకోవడంలో
నా హృదయం మొండిదే;
నా ఆత్మ మాత్రం నెమ్మదిగా స్పందిస్తుంది.
నా మనసులో క్షణక్షణం మొలిచే
చిన్న చిన్న ప్రేమలన్నింటినీ…
నువ్వు నా ముందుంచితే,
నా ప్రమాణాలకు విలువ ఏముంటుంది?
నేను చేయగలిగింది ఒక్కటే—
భుజాలు విదిలించి,
“అవును… అవి అంతే.”
అని ఒప్పుకోవడం.
కానీ నా మెడకు వేలాడుతున్న ఈ హృదయం
ఎంత బరువుగా ఉందో నీకు తెలియదు.
అది ఒక మొద్దుబారిన రాతిలాంటిది.
దానిమీద కాలం మూడు ముద్రలను చెక్కింది—
ఒక పుట్టుక,
ఒక మరణం,
ఒక పెళ్లిరోజు.
ప్రేమలో పడిన ప్రతిసారీ
ఈ హృదయాన్ని ఎవరికో అప్పగించి
దాని భారాన్ని దించుకోవాలని ప్రయత్నిస్తాను.
ఒకసారి ఆ యువకుడికి,
మరోసారి ఈ యువకుడికి…
కానీ ప్రతిసారీ
అది ఇంకా నాదేనని తెలుసుకుంటాను.
వదిలించుకోవాలని తపించే
ఆ భారమైన హృదయం
చివరికి
మళ్లీ నా దగ్గరికే తిరిగి వస్తుంది.
![]()
రూపరేఖ:
ఈ కవితలో కవయిత్రి తన ప్రేమ స్వభావాన్ని నిజాయితీగా ఆవిష్కరిస్తుంది. తన ప్రేమ స్థిరంగా ఉండదని, ఆకర్షణలు మారుతూ ఉంటాయని ఎలాంటి సంకోచం లేకుండా అంగీకరిస్తుంది. అయితే ఆ మార్పుల వెనుక ఉన్న హృదయం మాత్రం జీవితం మిగిల్చిన పుట్టుక, మరణం, వివాహం వంటి అనుభవాల చెరగని ముద్రలను మోస్తూ భారంగా మారిందని చెబుతుంది. ప్రతి ప్రేమలో ఆ హృదయాన్ని ఎవరికో అప్పగించి దాని భారాన్ని దించుకోవాలని కోరుకున్నా, చివరికి అది మళ్లీ తనకే చెందుతుందని గ్రహిస్తుంది. ప్రేమలోని అస్థిరత, మానవ హృదయపు సంక్లిష్టత, జీవితానుభవాల బరువు, స్వీయ అవగాహనలను సున్నితమైన వ్యంగ్యంతో, అంతర్ముఖ దృష్టితో ఈ కవిత ఆవిష్కరిస్తుంది.
డొరథీ పార్కర్ (Dorothy Parker, 1893–1967) అమెరికన్ కవయిత్రి, కథారచయిత్రి, వ్యంగ్య రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు. పదునైన హాస్యం, చమత్కారమైన వ్యంగ్యం, మానవ సంబంధాల సంక్లిష్టత, ప్రేమలోని విరుద్ధ భావాలు ఆమె రచనలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా ప్రేమ, ఏకాంతం, నిరాశ, స్వీయపరిశీలన వంటి అంశాలను సరళమైన భాషలో గాఢమైన భావవ్యక్తీకరణతో చిత్రించడం ఆమె కవిత్వ విశిష్టత. ఇరవయ్యో శతాబ్దపు అమెరికన్ సాహిత్యంలో ఆమె ఒక ప్రముఖ స్వరంగా గుర్తింపు పొందారు.
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.
సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.
ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.































