• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

The Out sider నవలా పరిచయం

ఎడిటర్ by ఎడిటర్
September 10, 2026
in సమీక్షలు
0
The Out sider నవలా పరిచయం

– మణి వడ్లమాని

20వ శతాబ్దపు అస్తిత్వవాద సాహిత్యంలో ఒక మైలురాయిగా పరిగణించబడే ది అవుట్‌సైడర్ (The Outsider / The Stranger) అనే నవలను ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కామూ (Albert Kamus)రచించారు.
ఈ నవల దాదాపు డెబ్బై భాషల్లోకి అనువదించబడింది తెలుగు భాషలో కూడా ఇది అనువాదమైంది.

ఆల్బర్ట్ కామూ రచించిన ఈ అస్తిత్వవాద నవల ఆధారంగా ఫ్రాంకోయిస్ ఓజోన్ దర్శకత్వంలో రూపొందిన ఫ్రెంచ్ చిత్రం కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నలుపు-తెలుపు ఛాయాచిత్రణతో రూపొందిన ఈ చిత్రం, వలస పాలిత అల్జీర్స్ నేపథ్యంలో దుఃఖం, కోరిక, హింస, తీర్పు వంటి అంశాల మధ్య మెర్సాల్ట్ సాగించే కలవరపరిచే ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. పుస్తకం చదివినప్పుడు కలిగే అనుభూతికి దగ్గరగానే సినిమా కూడా అనిపిస్తుంది. సన్నివేశాలను జాగ్రత్తగా ఎంపిక చేసి, కథలోని అంతర్గత నిశ్శబ్దాన్ని దెబ్బతీయకుండా చిత్రీకరించడం ఈ సినిమాకు ప్రత్యేకత.

సాహిత్యం ఒక సమాజానికి అద్దం పడితే, ప్రపంచ సాహిత్యం మానవజాతి మొత్తానికి ఒక వారధిగా నిలుస్తుంది. కేవలం మన ప్రాంతీయ లేదా జాతీయ పరిధులకే పరిమితం కాకుండా, ఇతర దేశాల కథలను, కవిత్వాన్ని, నవలలను చదవడం వల్ల మన దృక్పథం విశాలమవుతుంది.

అందుకే ప్రాంతీయ సాహిత్యాన్ని ప్రేమిస్తూనే ప్రపంచ సాహిత్యాన్ని కూడా ఆస్వాదించాలి. ప్రపంచ సాహిత్యాన్ని చదవడం కేవలం విజ్ఞానాన్ని పెంచుకోవడమే కాదు; మన ఆలోచనా సరళితో పాటు ప్రపంచం పట్ల మనకున్న అవగాహనను కూడా సమూలంగా మార్చగలదు. ఒక రచయితకు గానీ, సాహిత్య ప్రేమికుడికి గానీ ప్రపంచ సాహిత్యం సరికొత్త ద్వారాలను తెరుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

రష్యన్ రచయితల రచనల్లోని గాఢత, ఫ్రెంచ్ కథల్లోని సున్నితత్వం, లాటిన్ అమెరికన్ సాహిత్యంలో కనిపించే ‘మేజికల్ రియలిజం’ వంటి విభిన్న ప్రక్రియలను, భిన్నమైన ఆలోచనా విధానాలను ప్రపంచ సాహిత్యం మనకు పరిచయం చేస్తుంది.

1942లో వెలువడిన ది అవుట్‌సైడర్ ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవం. అస్తిత్వవాదానికి, అబ్సర్డిజానికి నిలువుటద్దంలా నిలిచే ఈ నవల, మనిషికి అతను జీవిస్తున్న సమాజానికి మధ్య ఉన్న అగాధాన్ని అత్యంత సూటిగా చూపిస్తుంది.

నిజానికి కొన్ని ప్రశ్నలకు సమాధానమే ఉండదు.

మనిషి వాటికి సమాధానాలు తెలుసుకోవాలనుకునే కొద్దీ మరింత గందరగోళంలో పడతాడు. అక్కడి నుంచే ‘అబ్సర్డ్’ మొదలవుతుంది.

జీవితం ఎప్పుడూ అర్థమవుతున్నట్టే కనిపిస్తుంది. కానీ, ఒక్క క్షణంలో ఆ అర్థం కరిగిపోతుంది — దీపం కాంతిలోని నీడలా.

ఈ నీడలను చూపించడమే అబ్సర్డ్ కథల పని. అక్కడ లాజిక్ కంటే లోపలి మాయ బలంగా ఉంటుంది. సత్యం కంటే భ్రమ ఎక్కువ సజీవంగా ఉంటుంది. మనిషి కంటే అతని ప్రతిబింబమే కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తుంది.

కొన్ని కథలు సమాధానాలు ఇవ్వవు. పద్ధతులను, సంప్రదాయాలను, సిద్ధంగా ఉన్న సందేశాలను అనుసరించవు. వాటి ముగింపులు కూడా ఎప్పుడూ కచ్చితంగా ఉండవు. కానీ అవి ప్రశ్నలను మేల్కొలుపుతాయి. అంతర్మథనాన్ని రేకెత్తిస్తాయి. మనిషి నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న గుసగుసలను వినమని చెబుతాయి.

ఇది అంతర్ముఖుడైన మెర్సాల్ట్ కథ. అతని జీవితం ఊహించని మలుపులు తిరిగే క్రమంలో అతని మానసిక స్థితులను కామూ అత్యంత నిశితంగా చిత్రించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కథకు కర్త, కర్మ, క్రియ అన్నీ మెర్సాల్ట్ పాత్ర చుట్టూనే తిరుగుతాయి.

ఈ నవల ప్రధానంగా రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి భాగం మెర్సాల్ట్ స్వేచ్ఛా జీవితాన్ని, అతని అలవాట్లను, అతని తల్లి మరణాన్ని, ఆ తరువాత అనుకోకుండా జరిగిన హత్యను వివరిస్తుంది. రెండవ భాగం కోర్టు విచారణ, జైలు జీవితం, మరణశిక్ష, చివరకు అతనిలో సంభవించే అంతర్మథనం చుట్టూ తిరుగుతుంది.

కథ ప్రారంభంలోనే —

“అమ్మ ఈరోజే చనిపోయిందా, లేక నిన్ననేమో నాకు సరిగ్గా తెలియదు.”

అనే వాక్యంతో కామూ పాఠకుడిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తారు.

అది కేవలం తల్లి మరణం పట్ల మెర్సాల్ట్‌కు ఉన్న నిర్లిప్తతను మాత్రమే తెలియజేయదు. అతని నిక్కచ్చితనాన్ని కూడా తెలియజేస్తుంది. మరణం సహజమైన విషయమే కదా అన్నట్టుగా అతను స్పందిస్తాడు. తనకు కలగని దుఃఖాన్ని నటించడం అతనికి చేతకాదు; అంతకంటే ముఖ్యంగా, అలా నటించాలనే అవసరం కూడా అతనికి కనిపించదు.

సమాజం ఆశించే కృత్రిమ భావోద్వేగాలు అతనికి కృతకంగా అనిపిస్తాయి.

తన తల్లిని దూరంగా ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉంచి, నగరంలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటాడు మెర్సాల్ట్. వృద్ధాశ్రమం నుంచి తల్లి మరణించినట్టు టెలిగ్రామ్ వస్తుంది. కానీ ఆ వార్త విని అతను కుప్పకూలిపోడు. కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోడు.

సెలవు ఇవ్వడానికి పైకి కనిపించకుండా విసుగుచూపుతున్న తన బాస్‌కు అతను ‘సారీ’ చెబుతాడు. రెస్టారెంట్‌లో భోజనం చేసి, బస్సెక్కి ఒక పూటంతా ప్రయాణించి సాయంత్రానికి వృద్ధాశ్రమం ఉన్న ఊరికి చేరుకుంటాడు.

తల్లి మృతదేహాన్ని చూడడానికి కూడా అతనికి ఆసక్తి ఉండదు. ఆశ్రమం వాచ్‌మన్‌తో కలిసి శవజాగరణలో కూర్చున్న సమయంలో సిగరెట్ కాలుస్తాడు. కాఫీ తాగుతాడు. చెప్పాలంటే, మిగతా రోజుల్లాగే చాలా మామూలుగా ప్రవర్తిస్తాడు.

ఆశ్రమం అధికారి మొదలుకొని, తల్లి స్నేహితుల వరకూ అందరికీ అతను ఒక పజిల్‌గా మారతాడు.

అలాగని అతనికి తన తల్లిపై శత్రుత్వం ఏమీ లేదు. ఆమె సౌకర్యం కోసమే వృద్ధాశ్రమంలో చేర్చాడు. నగరంలో తన దగ్గర ఉంచుకుని చూసుకునేంత స్తోమత లేకపోవడం వల్లే అక్కడ ఉంచాడు.

తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక నగరానికి తిరిగి వచ్చిన అతను అనుకోకుండా తన పాత సహోద్యోగి మేరీని కలుస్తాడు. ఆ వారాంతంలో వారిద్దరూ కలిసి బయటకు వెళతారు. సినిమా చూస్తారు. అతని ఇంట్లో సన్నిహితంగా గడుపుతారు.

మెర్సాల్ట్‌కు స్నేహితులు కూడా చాలా తక్కువ. ఉన్నవారిలో అదే భవనంలో నివసించే రేమాండ్ అతనికి సన్నిహితుడు. వారిద్దరూ తరచూ మద్యం సేవిస్తూ ఉంటారు. ఆ పరిసరాల్లో రేమాండ్‌కు మంచి పేరు ఉండదు. అతని గురించి రకరకాల వదంతులు ప్రచారంలో ఉంటాయి. అయితే, ఇవేమీ మెర్సాల్ట్‌ను ప్రభావితం చేయవు.

ఇదే సమయంలో పారిస్‌లో ప్రారంభించబోయే కార్యాలయ శాఖకు వెళ్లి పనిచేయమని అతని బాస్ సూచిస్తాడు. సరిగ్గా అదే సమయంలో మేరీ అతని ముందు పెళ్లి ప్రతిపాదన పెడుతుంది.

మెర్సాల్ట్‌కు మేరీపై ప్రేమ ఉందా?

అతనికి స్పష్టంగా తెలియదు.

అయితే పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదని మాత్రం చెబుతాడు.

పెళ్లి చేసుకుని, ఆ తరువాత పారిస్ వెళ్లేలా ఇద్దరూ ప్రణాళిక వేసుకుంటారు.

అంతా సాఫీగా జరిగిపోతే చెప్పుకోవడానికి ఏముంటుంది?

ఒక ఆదివారం మేరీ, రేమాండ్‌తో కలిసి సముద్రతీరానికి వెళ్లినప్పుడు పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయి. అక్కడ జరిగిన సంఘటనల క్రమంలో మెర్సాల్ట్ ఒక వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపుతాడు.

ఆ హత్య తన చేతుల మీదుగా ఎలా జరిగిందో అతనికే ఒక రకమైన అస్పష్టత. తీవ్రంగా మండుతున్న ఎండ, శరీరాన్ని ఇబ్బంది పెట్టే వేడి, క్షణికమైన అసహనం — ఇవన్నీ కలిసి ఆ చర్యకు దారితీశాయని అతను భావిస్తాడు.

అతని సమాధానం వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది. కానీ మనుషులు చేసే కొన్ని పనులకు మనం తరువాత ఎంత తర్కబద్ధమైన కారణాలు వెతికినా, ఆ క్షణంలో అవి ఎంత అర్థరహితంగా, ఎంత ఆకస్మికంగా జరిగిపోతాయో ఈ సంఘటన గుర్తుచేస్తుంది.

కేసు కోర్టుకు వెళుతుంది.

అక్కడి నుంచే నవల అసలు శక్తిని ప్రదర్శిస్తుంది.

కోర్టు అతను చేసిన హత్యను మాత్రమే విచారించదు. అతని మొత్తం వ్యక్తిత్వాన్ని విచారణకు నిలబెడుతుంది.

తల్లి చనిపోయినప్పుడు అతను ఎందుకు ఏడవలేదు?

అంత్యక్రియల సమయంలో ఎందుకు సిగరెట్ కాల్చాడు?

ఎందుకు కాఫీ తాగాడు?

మరుసటి రోజే మేరీతో కలిసి ఎందుకు సినిమా చూశాడు?

అతని వ్యక్తిగత జీవితంలోని ప్రతి చిన్న సంఘటన కూడా అతనిపై సాక్ష్యంగా మారుతుంది.

నిజానికి అతను చేసిన హత్య కంటే అతని వ్యక్తిత్వంపైనే కోర్టులో ఎక్కువ చర్చ జరుగుతుంది. ప్రాసిక్యూషన్ అతన్ని ‘రాయిలాంటి మనిషి’గా చిత్రిస్తుంది. తల్లి మరణించినప్పుడు కన్నీళ్లు పెట్టుకోని వ్యక్తి మానవత్వం లేనివాడని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది.

సమాజం దృష్టిలో తల్లి చనిపోయినప్పుడు ఏడవని వ్యక్తి, హంతకుడికంటే కూడా ప్రమాదకరమైనవాడిగా మారిపోతాడు.

ఇక్కడే కామూ సమాజపు నైతిక ప్రమాణాలను ప్రశ్నిస్తారు.

దేవుడిపై తనకు నమ్మకం ఉందని చెబితే శిక్ష తగ్గే అవకాశం ఉందని తెలిసినా, మెర్సాల్ట్ తనకు నమ్మకం లేదని ఖచ్చితంగా చెబుతాడు. తనకు లేని విశ్వాసాన్ని కేవలం ప్రాణం కోసం నటించడానికి అతను సిద్ధపడడు.

ఒక రకంగా సమాజం అతని చర్యలను చూసి అతని స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అతను చేసిన నేరానికి మించి, అతను సమాజం నిర్దేశించిన భావోద్వేగాల భాషను మాట్లాడకపోవడమే అతని పెద్ద నేరంగా మారుతుంది.

ఇక్కడే ‘అవుట్‌సైడర్’ అనే పదానికి అసలు అర్థం తెలుస్తుంది.

సమాజం మనకు కొన్ని ముద్రలు ఇస్తుంది — మంచి కొడుకు, నమ్మకమైన ప్రేమికుడు, భక్తి గల వ్యక్తి, బాధ్యతగల పౌరుడు.

ఇవన్నీ సమాజం ఆమోదించిన పాత్రలు.

ఒక వ్యక్తి ఆ పాత్రలను పోషించడానికి నిరాకరిస్తే?

అతను వెంటనే సమాజానికి ‘అపరిచితుడు’ అయిపోతాడు.

మెర్సాల్ట్ కూడా తనకు తాను నిజంగా ఉండటానికి ప్రయత్నించినందుకే సమాజానికి అపరిచితుడవుతాడు.

అతనికి గతం మీద పశ్చాత్తాపం ఉండదు. భవిష్యత్తు మీద ప్రత్యేకమైన ఆశలు కూడా ఉండవు. అతను ప్రధానంగా ప్రస్తుత క్షణంలోని ఇంద్రియ అనుభూతులకు స్పందిస్తాడు — గాలి, నీరు, సూర్యుడు, సముద్రం, శారీరక సుఖం.

అతని ప్రపంచం ఆ క్షణంతోనే మొదలై, ఆ క్షణంతోనే ముగుస్తుంది.

అయితే, అనుకోని ఒక సంఘటన అతన్ని హత్యకు దారితీస్తుంది. దానికి అతను చెప్పే కారణం చాలా భౌతికమైనది. దాదాపు అర్థరహితమైనది.

అక్కడే కామూ ‘అబ్సర్డ్’ అనే భావనను మన ముందుకు తెస్తారు.

మానవ జీవితం సహజంగానే ఏదో ఒక అంతిమ అర్థాన్ని కలిగి ఉందని మనిషి నమ్మాలనుకుంటాడు. కానీ ప్రపంచం మాత్రం మనం కోరుకున్న అర్థాన్ని మనకు హామీ ఇవ్వదు. అయినప్పటికీ మనిషి నిరంతరం జీవితానికి అర్థాన్ని ఆపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు.

ఈ విరోధమే ‘అబ్సర్డ్’.

మెర్సాల్ట్ ఈ అర్థరహిత ప్రపంచాన్ని అంగీకరించిన వ్యక్తి.

అతను ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడు. ప్రపంచం తనకు ఏదో ఒక అర్థాన్ని ఇవ్వాలని కూడా కోరుకోడు. అందుకే అతని జీవితం సమాజానికి అసహజంగా కనిపిస్తుంది.

చివరికి అతనికి మరణశిక్ష ఖరారవుతుంది.

జైలు గదిలో అతను తన జీవితాన్ని, మరణాన్ని, దేవుడిని, తన భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు. మత గురువు అతన్ని దేవుడిని నమ్మమని, పశ్చాత్తాప పడమని ఒత్తిడి చేస్తాడు. కానీ మెర్సాల్ట్ తన అస్తిత్వాన్ని వదులుకోడు.

తనకు నమ్మకం లేని విషయాన్ని ఒప్పుకోడు.

మరణం తప్పదని గ్రహించిన తరువాత, అతనిలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది.

ఈ ప్రపంచం తన పట్ల ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ చూపదని అతను గ్రహిస్తాడు. ప్రపంచానికి తన మరణం వల్ల ప్రత్యేకమైన అర్థం ఏర్పడదని అర్థం చేసుకుంటాడు.

ఆ గ్రహింపే అతని భయాన్ని క్రమంగా తొలగిస్తుంది.

అదే అతనికి ఒక రకమైన స్వేచ్ఛను ఇస్తుంది.

చివరి క్షణాల్లో తనను చూసి జనం ద్వేషంతో అరవాలని కూడా అతను కోరుకుంటాడు. ఎందుకంటే ఆ ద్వేషం ద్వారా అయినా తాను ఈ సమాజానికి పూర్తిగా వెలుపల ఉన్నాననే నిజాన్ని అంగీకరించగలుగుతాడు.

అతను ఒక ‘అవుట్‌సైడర్’గానే తన జీవితాన్ని ముగించబోతున్నాడు.

ఇక్కడ కామూ మన ముందు ఒక అసౌకర్యమైన ప్రశ్నను ఉంచుతారు.

మనిషి నిజంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాడా?

లేక సమాజం తన కోసం తయారు చేసిన పాత్రను మాత్రమే పోషిస్తున్నాడా?

మన సమాజంలో ఒక మంచి కొడుకు ఎలా ఉండాలో, ఒక భర్త ఎలా ఉండాలో, ఒక తండ్రి ఎలా ఉండాలో, ఒక భక్తుడు ఎలా ఉండాలో, ఒక దుఃఖితుడు ఎలా ఉండాలో కూడా మనకు నేర్పిస్తారు.

అయితే ఆ పాత్రలన్నింటినీ పక్కన పెట్టి ఒక మనిషి తనకు తాను నిజంగా ఉండాలనుకుంటే?

అతను సమాజానికి ఎంతకాలం ఆమోదయోగ్యంగా ఉంటాడు?

ఇదే ప్రశ్న ది అవుట్‌సైడర్ మనలో మిగులుస్తుంది.

కామూ ఈ నవలలో చాలా సరళమైన, అందరికీ అర్థమయ్యే భాషను ఉపయోగించారు. ఎక్కడా అనవసరమైన వర్ణనలు కనిపించవు. కానీ ఆ సరళత వెనుక అసాధారణమైన తాత్విక లోతు ఉంది.

ఈ నవల ఒక మనిషి ఉనికిని, అస్తిత్వాన్ని మాత్రమే విశ్లేషించదు. మనిషికి, సమాజానికి మధ్య ఉన్న అగాధాన్ని కూడా చూపిస్తుంది. జీవితం పట్ల ఉండే ఉదాసీనతను, మనిషి తన జీవితానికి అర్థం వెతుక్కునే తపనను, ఆ అర్థం దొరకనప్పుడు కలిగే శూన్యతను అత్యంత లోతుగా చర్చిస్తుంది.

ఈ నవలను అర్థం చేసుకోవడం అంటే, ఒక విధంగా మానవుని అంతరంగంలో దాగి ఉన్న శూన్యతను అర్థం చేసుకోవడమే.

మెర్సాల్ట్ హీరో కాదు. విలన్ కూడా కాదు.

అతను ఒక అద్దం.

సమాజం ధరించే ముసుగులను తీసివేసి, మనిషి తన అసలు ఉనికితో ఎలా ఉంటాడో చూపించే అద్దం.

ఈ నవల మన జీవితాన్ని మరోసారి మనకే చూపిస్తుంది.

మనం సమాజం మెప్పు కోసం ఆడే నాటకాల్లో ఎంతవరకు నిజాయితీగా ఉన్నాం?

మనకు నిజంగా కలగని భావోద్వేగాలను కూడా కలిగినట్టుగా నటిస్తున్నామా?

మేరీ లాంటి నిష్కల్మషమైన ప్రేమను కూడా గుర్తించలేని నిర్లిప్తత మనలో ఎక్కడైనా ఉందా?

కోర్టులో సమాజం మెర్సాల్ట్‌ను వేలెత్తి చూపినట్టుగా, మనకంటే భిన్నంగా ఆలోచించే వారిని మనం కూడా ‘అవుట్‌సైడర్స్’గా ముద్ర వేస్తున్నామా?

మనం సమాజం మెప్పు కోసం ఎన్ని ముసుగులు వేసుకుంటున్నాం?

మనలోని నిజమైన మనిషిని దాచిపెట్టి, సమాజం కోరుకునే మనిషిగా మారడానికి ఎంతవరకు రాజీ పడుతున్నాం?

మెర్సాల్ట్ లాంటి నిజాయితీ పరులు ఈ కృత్రిమ సమాజంలో ఎప్పటికీ అపరిచితులుగానే మిగిలిపోతారా?

ది అవుట్‌సైడర్ మనకు సమాధానాలు ఇవ్వదు.

అది మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది.

బహుశా గొప్ప సాహిత్యం చేయాల్సింది కూడా అదే.

సమాధానాలను ఇవ్వడం కాదు…

మనలో నిద్రిస్తున్న ప్రశ్నలను మేల్కొలపడం.

ఆ ప్రశ్నలతో మనల్ని కొంతకాలం ఒంటరిగా వదిలిపెట్టడం.

ది అవుట్‌సైడర్ చదివిన తరువాత మనలో మిగిలిపోయే ఆ శూన్యతే, కామూ సృష్టించిన అతి పెద్ద సాహిత్య అనుభూతి.

-ఆకాశవాణిలో ప్రసారమైన వ్యాసం

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

హిందీ కవిత: అడవిలో వర్షం

Next Post

హిరోషిమా బిడ్డ 

Next Post
హిరోషిమా బిడ్డ 

హిరోషిమా బిడ్డ 

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది
  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె
  • కొల్లూరి సోమ శంకర్ on ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply