• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ : కట్నం

కేశవ్ గోపాల్ by కేశవ్ గోపాల్
December 11, 2025
in అనువాద కథలు
0
రష్యన్ కథ : కట్నం

రష్యన్ మూలం : అంతోన్ చేహొవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్

 

నేను నా జీవితంలో చాలా ఇళ్లు చూశాను. పెద్దవీ, చిన్నవీ, ఇటుకతో, కలపతో  నిర్మించినవీ, పాతవీ, కొత్తవీ. కానీ, ప్రత్యేకించి ఒక ఇల్లు నా స్మృతిపథంలో గాఢంగా నాటుకపోయింది. నిజానికి అదొక ఇల్లు కాదు. కుటీరం.

ఆ కుటీరం చిన్నది. మూడు కిటికీలుండేవి. గూని వున్న ఒక మహిళ రాత్రిపూట పెట్టుకునే టోపీతో వున్నట్టు భయంకరంగా కనిపించేది. తెల్లగా గచ్చు వేసి, పెంకుల పైకప్పుతో, శిథిలమైన పొగగొట్టంతో, ప్రస్తుత యజమానుల తాతలు, ముత్తాతలు నాటిన మల్బరీ పొదలు, అకేషియా, పాప్లర్ చెట్ల పచ్చదనం మధ్య మునిగిపోయి వుండేది. వాటి ఆకుల గుబురు మధ్య కనిపించేది కాదు. కానీ అదొక పట్టణ గృహంలా వుండేది. దాని విశాలమైన లోగిలి; మరొక- అంటే విశాలమైన హరిత ప్రాంగణం దానికి దగ్గర్లో వుండేది. అదంతా ఒక చిన్నవీధిలో భాగం. ఆ వీధిలో వాహనాల రాకపోకలు, మానవ సంచారం వుండేవి కావు. 

ఆ కుటీరం లోపలికి వెళ్లే దారులను శాశ్వతంగా మూసేశారు. అందులో కాపురం వుండేవాళ్లకు వెలుతురు అక్కర్లేదు. కిటికీలు మూసివుండేవి. ఎందుకంటే వాళ్లకు స్వచ్ఛమైన గాలి ఇష్టం లేదు. శాశ్వతంగా మల్బరీ, అకేషియా, బర్డాక్ చెట్ల మధ్య నివశించేవాళ్లు. ప్రకృతి పట్ల నిర్లక్ష్యం వహించేవారు. ప్రకృతి అందాలను ఆస్వాదించే సామర్థ్యం దేవుడు పట్టణ వాసులకు మాత్రమే ఇచ్చాడు. తక్కిన మానవులంతా ఈ అందాల గురించి ఏమీ తెలీని అజ్ఞానంలో మునిగిపోయారు. తమకు పుష్కలంగా అందుబాటులో వున్నవాటికి మనుషులు విలువివ్వరు. మనకు వున్నవాటిని మనం ఖాతరు చేయం. చెప్పాలంటే, మనకున్న దాన్ని మనం ప్రేమించం. ఆ కుటీరం చుట్టూ వున్నదంతా భూమ్మీది స్వర్గతుల్యమైనది- పచ్చదనం, ఉల్లాసభరితమైన పక్షులున్నాయి. కానీ, ఆ ఇంటిలోపల ఏముంది? వేసవిలో ఉక్కిరి బిక్కిరి చేసే ఉక్కపోత, శీతాకాలంలో ఆవిరిస్నానాల గదిలో వున్నంత వూపిరి సలపని వేడి, విసుగు తప్ప…

నేను పనిమీద ఆ కుటీరంలో అడుగుపెట్టి ఇప్పటికి చాలా కాలమైంది. ఆ ఇంటి యజమాని కర్నల్ చికమసోవ్ తన భార్యకు, కూతురికి పంపిన శుభాకాంక్షలు మోసుకెళ్లాను. ఆ రోజు ఇప్పటికీ మనసులో హత్తుకపోయింది.

నేను ముందుగదిలోంచి హాల్లోకి వెళ్లేసరికి పొట్టిగా, బొద్దుగా వున్న సుమారు నలభైయేళ్ల మహిళ భయంగా, ఆశ్చర్యపోతూ కనిపించింది. నేనొక ‘‘పరాయి వ్యక్తిని’’, అతిథిని, ‘‘యువకుణ్ని’’ కావడం చాలు- ఆమెను భయానికి, దిగ్భ్రాంతికి గురిచేయడానికి. నా చేతిలో దుడ్డుకర్ర, గొడ్డలిగానీ, తుపాకీ గానీ లేదు… స్నేహపూర్వకమైన చిరునవ్వు నా పెదాల మీద వుంది. కానీ, నన్ను చూసి ఆమె భయపడింది. 

ఆ ఇంటి యజమానురాలైన చికమసోవాగా ఆమెను గుర్తుపట్టాను. ఆమె వణుకుతున్న స్వరంతో ‘‘ఎవరిని కలుసుకునే గౌరవం ఆనందం నాకు దక్కాయో తెలుసుకోవచ్చా?’’ అని నన్ను అడిగింది. 

నన్ను నేను పరిచయం చేసుకుని నా రాకకు కారణమేమిటో వివరించాను. భయం, ఆశ్చర్యం స్థానంలో ఆమె ముఖంలో చెప్పలేనంత ఆనందం చోటు చేసుకుంది. ‘‘ఆహ్!’’ అనేది ఒక ప్రతిధ్వనిలా ముందుగదిలోంచి, హాల్లోకి, హాల్లోంచి డ్రాయింగ్ రూంలోకి, అక్కడినుంచి వంటగదిలోకి.. అక్కణ్నించి నేల మాళిగలోకి పయనించింది. తర్వాత కుటీరమంతా ఆనందం నిండిన అనేక స్వరాలతో ‘‘ఆహ్!’’ ప్రతిధ్వనించింది. ఐదు నిముషాల తర్వాత డ్రాయింగ్ రూంలో మృదువైన వెచ్చని సోఫాలో నేను కూర్చుని వుండగా మొత్తం మాస్కోలోని వీధి వీధంతా ‘‘ఆహ్!’’ అంటున్నట్టు అనిపించింది.

నా కుర్చీ పక్కన ఒక రూమాలులో చుట్టిపెట్టిన కొత్త చర్మపు బూట్లు, కలరా వుండల వాసన వేసింది. కిటికీల్లో జెరానియం పూలమొక్కలు, పరదాలకు వాడే మజ్లిన్ గుడ్డముక్కలు, వాటిపై పొట్టలు వుబ్బిన ఈగలు వున్నాయి. గోడమీద ప్రధాన మతాచార్యుని తైలవర్ణ చిత్రపటం వేలాడుతోంది. అద్దం ఒక మూల విరిగిపోయి వుంది. దాని పక్కన పసుపు వన్నె దేరిన జిప్సీ ముఖాలతో యజమాని పూర్వీకుల చిత్రపటాలు వరసనగా వున్నాయి. మేజా మీద ఒక అంగుస్తాన్, దారపురీలు, సగం అల్లిన మేజోడు వున్నాయి. నేలమీద వస్త్ర డిజైన్ల నమూనాలు, నల్లరంగు జాకెట్ ముక్కలు పడి వున్నాయి. పక్కగదిలో ఆశ్చర్యం, ఆందోళన కలగలిపిన ముఖాలతో ఇద్దరు మహిళలు నేలమీదినుంచీ డిజైన్లను, లైనింగ్ గుడ్డముక్కలను ఏరుతున్నారు.

‘‘దయచేసి క్షమించండి. ఇక్కడంతా గందరగోళంగా వుంది’’ అంది చికమసోవా.

ఆమె నాతో మాట్లాడుతూనే, ఆ మహిళలు ఏరుతూ వున్న గది తలుపు వంక కలవరపాటుతో చూస్తూ వుంది. తలుపు కొద్దిగాతెరుచుకొని మళ్లీ మూసుకుంది.

చికమసోవా తలుపువంక చూస్తూ ‘‘ఏంటి?’’ అని అడిగింది.

‘‘కూర్క్స్ నుంచి మా నాన్న పంపిన టై ఎక్కడుంది?’’ అంటూ ఫ్రెంచి భాషలో ఒక స్త్రీ స్వరం వినిపించింది.

‘‘అలాగా మరీయ?.. కానీ, నిజానికి.. ఇక్కడ ఒక అపరిచిత వ్యక్తి, వున్నారు.. లుకేరియాను అడుగు’’ (ఫ్రెంచి భాషలో).

‘‘కానీ మేము ఎంత బాగా ఫ్రెంచి భాష మాట్లాడుతున్నాం’’ అనే భావం చికమసోవా కళ్లలో ద్యోతకమయింది.

తర్వాత తలుపు తెరుచుకుంది. పొడుగ్గా, సన్నగా పందొమ్మిదేళ్ల అమ్మాయి కనిపించింది నాకు. పొడవాటి మజ్లిన్ దుస్తులు. వడ్డాణం ధరించివుంది. నాకు గుర్తున్నంత వరకూ, దానికి ముత్యాల హారం వేలాడుతోంది. ఆమె లోపలికి వచ్చి మర్యాదగా పలకరించి సిగ్గుపడింది. మొదట స్ఫోటకం మచ్చలున్న పొడవాటి ఆమె ముక్కు ఎర్రబారింది. ఆ ఎరుపు నెమ్మదిగా ముక్కునుంచి కళ్లదాకా, తర్వాత కళ్లనుంచీ కణతల దాకా వ్యాపించింది.

‘‘మా అమ్మాయి!’’ అంటూ నా వైపు తిరిగి ‘‘ఈ యువకుడు మాసెచ్కా..’’ అని చికమసోవా అంటూండగా

నన్ను నేను పరిచయం చేసుకుంటూ నాకు కనిపించిన అనేక డిజైన్ల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాను. తల్లీ కూతుళ్లు నేల చూపులు చూశారు. 

‘‘అసెన్షెన్ లో సంత జరిగింది’’ అంది తల్లి. ‘‘మేము ఎప్పుడూ ఆ సంతలో బట్టలు కొంటాం. తర్వాత మళ్లీ సంత జరిగేదాకా ఏడాది పొడుగునా దుస్తులు కుట్టుకుంటాం. మేమెప్పుడూ కుట్టుపని వేరేవాళ్లకు అప్పజెప్పం. మా ఆయన ప్యోత్ర్ సిమ్యోనవిచ్ మాకు డబ్బులు ఎక్కువ పంపించరు. అందువల్ల విలాసాలతో దుబారా చెయ్యలేం. మా దుస్తులను మేమే కుట్టుకుంటాం.’’

‘‘కానీ, అన్ని దుస్తులు ఎవరు వాడుతారు? వున్నది మీరిద్దరే కదా!’’

‘‘అవన్నీ వేసుకోడానికి కాదు! అది కట్నం కోసం!’’

‘‘అమ్మా! వూరుకో.. నువ్వు మరీను’’ అంది కూతురు సిగ్గుపడుతూ. ‘‘ఆయనేమనుకుంటారు.. నేనెప్పటికీ పెళ్లి చేసుకోను.. ఎప్పటికీ!’’

ఇవీ ఆ అమ్మాయి అన్నమాటలు. కానీ ‘‘పెళ్లి’’ అంటున్నప్పుడు ఆమె కళ్లలో మెరుపు కనిపించింది.

బిస్కెట్లు, వెన్న, జామ్ లతో పాటు టీ వచ్చింది. తర్వాత రాస్ప్‌బెర్రీలు, క్రీమ్ సేవించాం. సాయంత్రం ఏడు గంటలప్పుడు ఆరు వంటకాలతో విందుభోజనం ఏర్పాటుచేశారు. భోం చేస్తున్నప్పుడు బిగ్గరగా ఆవులింత వినిపించింది. ఎవరిదో పక్క గదిలోంచి. ఒక పురుషుడు మాత్రమే అలా ఆవులించగలడు.

‘‘అది మా ప్యోత్ర్ సిమ్యోనవిచ్ సోదరుడు ఈగర్ సిమ్యోనవిచ్’’ నేను ఆశ్చర్యపోవడం గమనించి చికమసోవా వివరించింది. ‘‘ఏడాదిగా ఆయన మాతో పాటు వుంటున్నారు. మీరు ఆయన్ను క్షమించాలి. మిమ్మల్ని కలవడానికి ఆయన బయటికి రాలేరు. ఆయనకు సిగ్గు ఎక్కువ…

సన్యాసుల మఠానికి వెళ్లాలనుకుంటున్నారు.. సైనిక సేవలో ఆయనకు నిరాశ ఎదురైంది. దీనికంతా కారణం ఆయన దుఃఖం. 

రాత్రి భోజనం అయిన తర్వాత ఈగర్ సిమ్యోనవిచ్ స్వహస్తాలతో కుడుతున్న ఉత్తరీయాన్ని చికమసోవా నాకు చూపించింది. తర్వాత ఆయన దాన్ని చర్చికి కానుకగా ఇవ్వదలచుకున్నట్టు చెప్పింది. మానెచ్క తన పిరికితనాన్ని కొంచెంసేపు పక్కన పెట్టి తన తండ్రికోసం ఎంబ్రాయిడరీ చేసిన పొగాకు చిత్తి నాకు చూపించింది. ఆమె పనితనం నచ్చినట్టు నేను నటిస్తూండగా తల్లి చెవిలో ఏదో గుసగుసగా చెప్పింది. తల్లి వెలిగిపోతున్న ముఖంతో తనతోపాటు నన్ను స్టోర్ రూంలోకి ఆహ్వానించింది. అక్కడ ఐదు పెద్ద భోషాణాలు, చాలా సూట్ కేసులు, పెట్టెలు కనిపించాయి.

‘‘ఇదంతా.. కట్నం కోసం!’’- తల్లి నాకు గుసగుసగా చెప్పింది. ‘‘ఇవన్నీ మేమే కుట్టినవి.’’

దిగులుగా వున్న ఆ పెట్టెలన్నీ చూసింతర్వాత అతిథిమర్యాదలు చేసిన వారి దగ్గర్నించీ సెలవు తీసుకున్నాను. మళ్లీ రావాల్సిందిగా వాళ్లు నాతో వాగ్దానం చేయించుకున్నారు.

తర్వాత ఏడేళ్లకు నా వాగ్దానం నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. ఒకానొక కోర్టు వ్యవహారంలో నేను ఆ చిన్నపట్నానికి వెళ్లాల్సి వచ్చింది. సుపరిచితమైన ఆ కుటీరంలోకి అడుగుపెట్టగానే ‘‘ఆహ్!’’ అంటూ పలకరింపులు ఎదురయ్యాయి. వాళ్లు నన్ను గుర్తుపట్టారు. అక్కడకి నా మొదటి సందర్శన వారి జీవితంలో మరపురాని ఘటన. అలాంటివి కొన్ని మాత్రమే వుంటే చాలాకాలం గుర్తుండిపోతాయి. డ్రాయింగ్ రూంలోకి అడుగుపెట్టాను. మునుపటి కన్నా లావుగా కనిపిస్తున్న తల్లి చికమసోవా తల బాగా నెరిసిపోయివుంది. మోచేతులు, మోకాళ్లపై దోగాడుతూ ఆమె ముదురు నీలం రంగు బట్ట కత్తిరిస్తోంది. కూతురు సోఫా మీద కూచుని ఎంబ్రాయిడరీ పని చేస్తోంది. అవే డిజైన్లు, కలరావుండల అదే వాసన. ఒకమూల అద్దం పగిలిన అదే చిత్తరువు. కానీ కొన్ని మార్పులు కనిపించాయి. ప్రధాన మతగురువు చిత్రపటం పక్కన ప్యోత్ర్ సిమ్యోనవిచ్ చిత్రపటం వేలాడుతోంది. తల్లీకూతుళ్లు సంతాపమగ్నులై వున్నారు. ప్యోత్ర్ సిమ్యోనవిచ్ జనరల్‌గా పదోన్నతి పొందిన వారం రోజుల తర్వాత మరణించాడు.

జ్ఞాపకాల పునశ్చరణ మొదలైంది… విధవరాలైన జనరల్ భార్య ఏడ్వసాగింది.

‘‘మాకు చాలా పెద్ద నష్టం జరిగింది’’- ఆమె చెప్పసాగింది. ‘‘ప్యోత్ర్ సిమ్యోనవిచ్ మీకు పరిచయమే కదా?- ఆయన ఇప్పుడు లేరు. మేము ఒంటరి వాళ్లమైపోయాం. ఇప్పుడు మా బాగోగులు మేమే చూసుకోవాలి. ఈగర్ సిమ్యోనవిచ్ సజీవంగా వున్నారు. ఇప్పుడాయన గురించి గర్వంగా చెప్పుకోదగినది ఏమీ లేదు. మతం ఆయన్ను తిరస్కరించింది. మద్యం సేవిస్తున్నందుకు. ఆయన తన దుఃఖాన్ని మర్చిపోవడానికి ఎన్నడూ లేనంతగా తాగుతున్నాడు. ఆయనపై మార్షల్‌కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. మా ట్రంకు పెట్టెలను చాలాసార్లు తెరిచాడు… మానెచ్కాకు చెందిన కట్నం సామగ్రి దుర్వినియోగం చేశాడు. కట్నం కోసం దాచిపెట్టినవన్నీ దేశద్రిమ్మరులకు ధారపోశాడు. రెండు భోషాణాలు ఖాళీ చేశాడు! ఇది ఇలాగే కొనసాగితే మానెచ్కాకి ఇవ్వడానికి కట్నం ఏమీ మిగలదు!’’

‘‘ఏమంటున్నావు అమ్మా!’’ అంది మానెచ్కా కలవరపడుతూ. ‘‘ఆయన ఏమనుకుంటారు? నేను పెళ్లి చేసుకోను… ఎప్పటికీ చేసుకోను!’’

మానెచ్క ఆవేశంతో, ఆశతో పైకప్పుకేసి చూసింది. తాను ఏమంటున్నదో తానే నమ్మలేకపోయింది. 

పక్కగదిలో సగం బట్టతలతో ఒక పొట్టి మనిషి అస్పష్టంగా కనిపించాడు. అతడు గోధుమరంగు ప్రాక్ కోటు ధరించి మోకాలిదాకా రబ్బరు బూట్లతో ఎలుకలాగా గునగునా నడిచి బయటికెళ్లాడు.

‘‘ఈగర్ సిమ్యోనవిచ్ అంటే ఈయనే కావచ్చు’’ అని మనసులో అనుకున్నాను. 

తల్లీకూతుళ్ల వంక చూశాను. వాళ్లు చెప్పలేనంతగా వయసు మీరిపోయారు. తల్లి జుత్తు వెండిబుట్టలా నెరిసిపోయింది. కూతురు ముఖంలో కళాకాంతులు లేవు. వాడిపోయిన పుష్పంలా వుంది. తల్లికీ కూతురికీ వయసులో పెద్ద తేడా లేనట్లు కనిపించింది. 

‘‘మార్షల్ ను కలవాలనుకుంటున్నాను’’ అంది తల్లి. అంతకుముందే ఈ విషయం చెప్పినట్టు మరచిపోయి. ‘‘ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. మేము కుట్టినవన్నీ ఈగర్ సిమ్యోనవిచ్ తీసేసుకుని తన ఆత్మవిముక్తి కోసం దానం చేస్తున్నాడు. మానెచ్కకు కట్నం వస్తువులేవీ మిగల్లేదు!’’

మానెచ్క సిగ్గుపడింది. కానీ ఈసారి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

‘‘మళ్లీ అన్నీ కుట్టడం మొదలెట్టాలి. మేము ధనవంతులం కాదని దేవుడికి తెలుసు. మాకు నష్టం జరిగింది.’’

‘‘మాకు నష్టం జరిగింది!’’ మానెచ్క వంత పలికింది.

గత ఏడాది సుపరిచితమైన ఆ ఇంటికి విధివశాత్తూ మళ్లీ వెళ్లాను. డ్రాయింగ్ రూంలోకి వెళ్లగానే పెద్దావిడ చికమసోవా కనిపించింది. సంతాపం పాటిస్తున్నట్లు ఆపాదమస్తకం నల్లరంగు దుస్తులు ధరించి వుంది. సోఫా మీద కూచుని కుట్టుపని చేస్తోంది. ఆమె పక్కన గోధుమరంగు ప్రాక్ కోటుతో, మోకాళ్లదాకా రబ్బరు బూట్లతో పొట్టిగా ఒక వృద్ధుడు కూచుని వున్నాడు. నన్ను చూడగానే గబుక్కున లేచి అక్కణ్నించీ బయటకు పరుగుతీశాడు. 

నా అభివాదానికి బదులుగా వృద్ధ మహిళ చికమసోవా చిరునవ్వుతో ‘‘మిమ్మల్ని మళ్లీ చూడడం చాలా ఆనందంగా వుంది మహాశయా’’ అంది. ఫ్రెంచి భాషలో.

కొంచెం ఆగి, ‘‘ఏం కుడుతున్నారు?’’ అని అడిగాను.

‘‘చొక్కా కుడుతున్నాను. పూర్తిచేసి దాచిపెట్టడానికి పూజారిగారికి ఇస్తాను. లేకపోతే ఈగర్ సిమ్యోనవిచ్ దీన్ని తీసికెళ్లిపోతాడు. ఇప్పుడు నేను ప్రతిదీ పూజారి దగ్గర దాచిపెడుతున్నాను’’ అని గుసగుసగా చెప్పింది. 

తర్వాత, ఎదురుగా మేజామీదున్న తన కూతురి ఫోటోవైపు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చి ‘‘మాకు చెప్పలేనంత నష్టం జరిగింది. చూశారా!’’ అంది.

మరి, ఆమె కూతురెక్కడ? మానెచ్క ఎక్కడుంది? నేను అడగలేదు. ప్రగాఢ సంతాపంలో మునిగివున్న వృద్ధురాలిని నేను అడగదలుచుకోలేదు. నేను అక్కడున్నంత సేపు గానీ, నేను బయలుదేరుతుండగా గానీ మానెచ్క నాకు కనబడలేదు. ఆమె స్వరంగానీ, మృదువైన తడబడే ఆమె పాదాల సవ్వడి గానీ వినిపించలేదు.. నాకు అర్థమైంది. నా మనసు తీవ్రంగా కలతబారింది.

(1883లో ప్రచురితం)

కొన్ని వివరణలు 

– అసెన్షెన్ : క్రైస్తవులకు ముఖ్యమైన పన్నెండు పర్వదినాల్లో ఒకటి. ఈస్టర్ తర్వాత 40వ రోజున జరుపుకుంటారు.

– మార్షల్ : జారిస్టు రష్యాలో అత్యున్నతమైన సైనిక పదవి.

 

కేశవ్ గోపాల్

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.

అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం

Previous Post

జపాన్ కథ : నేను కన్న కల – 3

Next Post

ఆఫ్రికన్ కథ : దంతపు గాజులు 

Next Post
ఆఫ్రికన్ కథ : దంతపు గాజులు 

ఆఫ్రికన్ కథ : దంతపు గాజులు 

Discussion about this post

ఈ సంచికలో…

  • కన్నడ కథ: బేలా
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ
  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను !
  • గుజరాతీ కథ : వైట్ హార్స్
  • తొలి ప్రేమ
  • కన్నడ కవిత : నవ్వు
  • 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • కన్నడ కథ: ఆ ఒక విధంగా …
  • రష్యన్ కథ : మాస్క్
  • తమిళ కథ : పుష్పించని చెట్టు
  • యుగోస్లేవియా కథ : కాప్టెన్
  • అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం
  • ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 
  • కన్నడ కథ :  అంతర్వాహిని

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com