సాహిత్య ప్రియులకు శుభాభివందనం..
అనువాద సాహిత్యానికి ప్రత్యేకించిన మంత్లీ వెబ్ మేగజైన్ ‘కథావసుధ’ను ఆదరిస్తున్న మీ అందరికీ 2026 కొత్త సంవత్సరాది- సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. అనువాద సాహిత్యాన్ని ఇష్టపడే వారందరికీ కరువుతీరా విందుభోజనం లాంటి అద్భుత రచనలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం అనువాద కథలకే ఉద్దేశించిన మాసపత్రిక ‘విపుల’ మూతపడిన తర్వాత.. ఆ లోటును భర్తీ చేయడానికి ‘కథావసుధ’ పుట్టింది. అప్పటికే పరిమితసంఖ్యలో ఉన్న అనేక వెబ్ మేగజైన్లు అడపాదడపా అనువాదాలకు అవకాశం కల్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అనువాద సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్నారు కూడా. వెబ్ మేగజైన్లలో క్రమం తప్పకుండా అనువాద రచనలకు అవకాశం ఉంటోంది. దినపత్రికల ఆదివారం అనుబంధాల్లో కూడా గతంతో పోలిస్తే అనువాద రచనలు పెరుగుతున్నాయి. ప్రతివారం అనువాద రచనను ఇవ్వడం కూడా ఒక పత్రిక చేస్తోంది.
సమకాలీన తెలుగు రచయితల సాహిత్య సృజనకు భిన్నంగా ఇతర ప్రాంతాలు, నేపథ్యాలు, భాషలకు చెందిన కథలు వైవిధ్యభరితంగా పాఠకులకు అందుతుండడం సంతోషకరం. నిజానికి, వస్తు-శిల్ప వైవిధ్యాన్ని అందిపుచ్చుకోవడంలో సమకాలీన రచయితలకు ఈ అనువాద సాహిత్యం ఎంతో మేలు చేస్తుంటుంది. తెలుగులో వస్తున్న అనువాద సాహిత్యానికి ముందుముందు ఇంకా మంచిరోజులు రానున్నాయి. ఒక ఏడాదిలో వచ్చిన ఉత్తమరచనలను సంకలనంగా ప్రచురించే కథ, కవిత సిరీస్ పుస్తకాలలాగానే, అనువాద కథ, అనువాద కవిత ప్రక్రియల్లో కూడా ఏడాదికి ఒక సంకలనాలు వెలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనువాద సాహిత్య ప్రియులకు గొప్ప విందు కాగలవని అనుకోవచ్చు.
మంచి సాహిత్యం ఎక్కడున్నా స్వీకరించాలి.. ఆ క్రమంలో ‘కథావసుధ’ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటుంది. కథావసుధను మీ పరిధిలోని ఇతర సాహిత్య ప్రియులందరికీ కూడా చేరవేయండి.
..మీ
కె.ఎ.మునిసురేష్ పిళ్లె,
సంపాదకుడు
Discussion about this post