• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

గుజరాతీ కథ : వైట్ హార్స్

పాలెపు బుచ్చిరాజు by పాలెపు బుచ్చిరాజు
February 10, 2026
in అనువాద కథలు
0
గుజరాతీ కథ : వైట్ హార్స్

గుజరాతీ మూలం: సుధీర్ దలాల్
అనువాదం: పాలెపు బుచ్చిరాజు

రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తరవాత మాంచెస్టర్ యునివర్సిటి నుంచి టెక్స్ టై ల్సులో మొదటి డిగ్రి తీసుకున్న వాళ్ళం మేమే. 1947 వ సంవత్సరంలో పదిమంది మాత్రమే టెక్స్ టైల్సు తీసుకున్నారు. వారిలో నేను, ధీరుభాయ్  ఉన్నాము. ఫలితాల పట్టిక బోర్డుమీద అంటించారు. అందరు ఎవరిదారిన వాళ్ళు పోయి ఫలితాలు చూసుకుంటున్నారు. 

నేను మధ్యాహ్నం టైములో వెళ్ళాను. కాలేజీ కారిడార్ లోనే ధీరుభాయ్ కలిశాడు. యునివర్సిటి యూనిఫాం లో ఉన్నాడు. డార్క్ బ్లూ కలర్ కోటు. టై, మఫ్లర్ ఇదీ వేషం. అసలే ఒడ్డు  పొడుగు ఉన్న మనిషి. అదీకాక చక్కని మిసిమి ఛాయగల శరీరం. ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడగలడు. చూపులకి ఆంగ్లేయుడిలాగే ఉంటాడు

“ఏమిటి? పాసా? ఫెయిలా?” అడిగాడు.

“నేనూ ఇప్పుడే వచ్చాను. పద. వెళ్లి చూద్దాం. నీకేం అనిపిస్తోంది?” అడిగాను.

“నువ్వెలాగు పాసవుతావు. నాదే ప్రశ్నార్ధకం. నేను ఫెయిలు కూడా కావచ్చు. అయినా ఫరవాలేదులే.”

మేము బోర్డుమీద మా పేర్లు వెదికాము.  

“కంగ్రాట్స్! నీకైతే ఫస్ట్ క్లాసే వచ్చింది “ అన్నాడు ధీరుభాయ్.

“నువ్వు కూడా పాసయ్యావు కదా! కంగ్రాట్స్!” అన్నాను నేను, లిస్టులో అతని పేరు చూపిస్తూ.

“ఆఁ! పాసయ్యానులే. జనతా  క్లాసులో.” అతనైతే చాలా ఆనందంగా ఉన్నాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కొంపదీసి వీడు ప్రేమలోగానే పడలేదుకదా అనుకున్నాను.

“పద. సెలబ్రేట్ చేసుకుందాం.” అన్నాడు.

“ఎక్కడికి వెళ్దాం?” అడిగాను.

“ముందుగా ఇక్కడి నుంచి బైట పడు. అప్పుడు చూద్దాం.” అన్నాడు.

మేం బైటికి వచ్చాం. కాలేజికి ఒకప్రక్కన సిటీ  ఉంది. రెండో ప్రక్కన ‘వైట్ హార్స్’

ఇంగ్లండు పబ్. అదే పబ్లిక్ బార్. మిగతా పబ్ ల గురించి అంతగా చెప్పలేను. కానీ ‘వైట్  హార్స్’ బీరు మాత్రం  ప్రశంసా పాత్రం.  మన అహమ్మదాబాదులో అయితే ఇదేమంత గొప్ప కాదు. కాని మాంచెస్టర్ లో మాత్రం చాలా ముఖ్యం. 

“నడు. వైట్ హార్స్ కి వెళదాం” అన్నాడు ధీరుభాయ్. అటుగా కొంత దూరం నడిచి ఒక భవనం ముందు ఆగాం. మెట్లెక్కి పైకి వెళ్లాం. గదిలో నాలుగు గోడలకి వుడ్ పేనలింగు ఉంది. బ్లేక్ లేబిల్, గోల్డ్ లేబిల్, త్రికోయిన్ లాంటి చిన్న పెద్దా బాటిల్సు అక్కడ అమర్చబడి ఉన్నాయి. కాళ్ళ క్రింద మెత్తటి తివాసి. కూర్చోవడానికి ముఖమల్ పరచిన సోఫాలు, బీరు తాగడానికి అనువుగా కార్నర్ లు. ఇంక…..ఇంకా…బార్ మెయిడ్ లు….

నేనైతే అలవాటుగా తాగేవాడిని కాదు. ధీరుభాయ్ మాత్రం బాగా లాగిస్తాడు. ఒళ్ళు మరిచి పోయే వరకు…అక్షరాలా. అతనే ఆర్డరిచ్చాడు. “టు బిట్టర్స్ ప్లీజ్!” 

బిట్టర్ నిండిన మగ్ పట్టుకుని, ఒక గుక్కెడు తాగి అన్నాడు. “ Babu! I am in love.”

అదీ కేపిటల్ అక్షరాల్లో అన్నాడా అనిపించేలా. 

మనం మాములుగా గుజరాతీలో “నేను ప్రేమలో పడ్డాను.” అంటే చాలా పేలవంగా నీరసంగా ఉంటుంది. హిందీలో అయితే ఫరవాలేదు అనిపిస్తుంది. ధీరుభాయికి హిందీ రాదు. అన్నిటికంటే ఫ్రెంచ్ లో అయితే బాగుంటుంది.

ఏమైనప్పటికీ ధీరుభాయ్ ప్రేమలో పడ్డాడు. అతి కష్టం మీద అతనన్నాడు.” నీకు తెలుసుకదా! అహమ్మదాబాదులో నాకు ధర్మిష్ట తో వివాహం అయింది.”

 “అవును.” అన్నాను నేను.

“మరి ఇక్కడ నేను ఇప్పుడు ‘బెట్టి’-అదే-బెట్టిస్ ని ప్రేమించాను. నువ్వే చెప్పు. ఇప్పుడు నేను ఎలా తిరిగి వెళ్ళగలను? నాకిక్కడ చాలా నచ్చింది. I am happy here. అందుకే నువ్వు అహమ్మదాబాదు వెళ్ళినప్పుడు మా యింటికి వెళ్ళు. అక్కడ వాళ్లకి అంతా విడమర్చి చెప్పు. ఇక్కడి నా పరిస్థితి వాళ్లకి తెలియజేయి. ధర్మిష్ట కుడా చాలా బాధ పడుతుంది. కాని,నేనేం చేయగలను? మన సమాజంలో రెండో పెళ్లి సామాన్యమే కదా. నువ్వు ధర్మిష్టని ఎరుగుదువు కదా. ఆమెకి నువ్వే నచ్చ జెప్పు. ఇక్కడి నా అవస్థ గురించి వివరంగా చెప్పు. ఇక్కడ బెట్టి అయితే నన్ను పిచ్చిగా ప్రేమిస్తోంది. నా గురించి నా తలిదండ్రులు….కాని… ఏం చేయగలను?”

  ధీరుభాయ్ ఏదేదో చెప్పుకుంటూ పోతున్నాడు. ఏం చేస్తాం. అతను ప్రేమలో పడ్డాడు.ఎలాగో భరించాలి. నాకంతా అర్థం అయింది. సగం సగం మాటలతో సహా. 

“కాని, నీ ప్లాను ఏమిటి? నువ్వు మొహం చూపించడానికైనా అహమ్మదాబాదు వస్తావా? ఒకసారి వచ్చి అక్కడ అన్నీ సర్దుబాటు చేసుకుని …..” నేను అనబోయాను. 

“టు మోర్ బిట్టర్ లవ్!” ధీరుభాయ్ ఆర్డరు ఇచ్చాడు. 

“నాకింక వద్దు.” నా మగ్గు సగానికి పైగా ఉంది. అతనెప్పుడో ఖాళి చేశాడు. 

“అదేం కుదరదు. నా కోసం. మరొకటి….అహమ్మదాబాదు రావడం అయితే వస్తాను. కాని అక్కడి వాళ్ళు నన్ను విడిచి పెడతారా? అక్కడి పరిస్థితుల్ని చూసి నా గుండె పగిలి పోతుంది. అది మరీ ఆక్వర్డ్ గా ఉంటుంది.”

“నిజమే! పోనీ…. ఇంటికో ఉత్తరమైనా రాసి పడేస్తే?…”

“ఉత్తరాల్లో ఇటువంటి విషయాలు వివరంగా రాయలేం. నువ్వెలాగూ వెళ్తున్నావుగా నీ మీద ఆమాత్రం నమ్మకం ఉంది నాకు. “

“సరే! నేను చేయగలిగినంత చేస్తాను. నువ్వునాకు చాలా సున్నితమైన పని అప్పగించావు. నా గుండెలు నీ గుండెలకి ఏజంట్లుగా పనిచేయాలి అన్నమాట. కాని ధర్మిష్టని మాత్రం కలవను.” అన్నాను అతని వైపే చూస్తూ.

“ఆల్ రైట్! విషయం ఆమెకి తెలియకుండా ఉండదు కదా! ఏదో విధంగా ఆమె చెవిని పడనే పడుతుంది. “ అతను రెండోది కూడా లాగించేశాడు. ఇప్పుడతను మరో ప్రపంచంలో ఉన్నాడు. 

క్రిందికి దిగాక అన్నాడు. “ ఆఁ! చెప్పడం మరిచాను. నాకు ఉద్యోగం దొరికింది. ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నాను. మరో వారం రోజుల్లో అక్కడికి మారాలి. నువ్వు వెళ్ళే ముందు ఒకసారి కలుద్దాం. మనం ‘రాయల్ ‘లో భోజనం చేద్దాం. ఆఖరిసారిగా సూప్ , స్టిక్  లాంటివి తిని ఆనందిద్దాం. అప్పటి వరకు నువ్వు వెజిటేరియన్ గానే ఉండు. “ 

అప్పుడు విడిపోయిన వాళ్ళం విడిపోయినట్టే ఉండిపోయాము. అహమ్మదాబాదు వెళ్ళే ముందు నాకు రాయల్ లో అతన్ని కలిసేందుకు అవకాశం లేకపోయింది. అహమ్మదాబాదు వెళ్ళాక వాళ్ళింటికి వెళ్ళాను. విషయాలన్నీ వివరంగా చెప్పి, అక్కడ ఉండలేక పరుగులాంటి నడకతో బైటికి వచ్చేశాను. అయినవాళ్ళ రియాక్షన్సు నేను ఫేస్ చేయలేను. తరవాత ఏడుపులు,  పెడబొబ్బలూ చాలాజరిగాయని విన్నాను.

నలభై ఏడులో ఇంగ్లండు వదిలాక తిరిగి ఆ గడ్డ మీద అరవై రెండులో అడుగు పెట్టాను. వ్యాపార రీత్యా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నాకు ఉన్నట్టుండి ధీరుభాయ్ గుర్తుకు వచ్చాడు. ఎలాగూ నేను ఇంగ్లాండులో నెలరోజులపాటు ఉండాలి. అందువల్ల అహమ్మదాబాదులో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర ఎడ్రసు తీసుకున్నాను. మాంచెస్టర్ కి కొంచెం దూరంలో ఉంటున్నాడు. 

ఒకనాడు టేక్సి తీసుకుని అతన్ని చూడడానికి వెళ్ళాను. సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాను. ఇంటిముందు బోర్డు చదివాను.  Mr. D. SHAW. ఆ బోర్డు చాలా పాతది అయిపోయింది. ఒరిజినల్ గా అతను D. SHAH.  కాని అక్కడ బెర్నార్డ్ షా ని అందరూ గుర్తిస్తారు. అందువల్ల అతను తన పేరు SHAW గా మార్చుకున్నాడేమో అనిపించింది. నేను కాలింగ్ బెల్ నొక్కాను. లోపల డింగ్…. డాంగ్….మంటూ బెల్ మ్రోగింది. 

కాస్సేపటికి Mr. SHAW వచ్చి తలుపు తెరిచాడు. Good old ధీరుభాయ్ ముసలి వాడు కూడా అయిపోయాడు. చెంపల వెనక జుట్టు నెరిసింది. అంత తెల్లగా కాదు, కాని కాస్త నలుపు తెలుపుగా. మరిచాను. మిగిలిన జుట్టు కూడా ఆ మాత్రమే. అతను కాస్త ఒళ్ళు చేశాడు. పిక్ విక్ పేపర్లు పాత ఎడిషన్ లో పిక్ విక్ లా. ఏ నిముషంలోనైనా ముందుకి దూకేస్తుందా అన్నంతలో  ముక్కు చివరన కళ్ళజోడు. కళ్ళజోడు పైనుంచి చూపు సారించి నన్ను చూశాడు. ఒక్క సారిగా అరిచాడు.

“Babu?…Babu. Of course Babu. What a surprise! కమాల్ చేసేశావు. ఐ లవ్ యూ బాబూ!” అంటూ వచ్చి నన్ను కౌగలించు కున్నాదు. భార్యని పిలిచి “ Betti! It is Babu. Come and see.” అని చెప్పాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. 

“అలాగే ఉన్నావు.” అన్నాను.

“మరెలా ఉండాలి?” అడిగాడు. 

“ఇలా కాదు. ముసలాడివి అయిపో లేదూ! నా లాగా హిందుస్తాన్ లో కాయకల్ప చికిత్స ఇక్కడ దొరుకుతుందా? ఏం? నేను చూడు ఎప్పటిలాగే ఉన్నాను.” అంటూ అతని గుండు మీద చేత్తో రాస్తూ. అతను ఏదో చెప్పుదాం అని నోరు తెరిచాడు. “అదేం కాదు. ….” అని తెల్లని పళ్ళు కనిపించేలా ఒక హైక్లాస్ నవ్వు నవ్వాడు. 

“లోపలి రా! లోపలి రా! My dear Babu!…” అతను, ముందుకి నడుస్తూ అన్నాడు. 

ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది. కుడి ప్రక్కగా టోపీలు,రెయిన్ కోట్లు పెట్టుకునే స్టాండు. తరవాత మేడమెట్లు. ఎడం ప్రక్కగా దివాన్ ఖానా. దాని తరవాత డైనింగ్ రూమ్ కం లివింగ్ రూమ్. వెనక వైపు వంట గది. మేడ మీద బెడ్రూమ్, బాత్ రూమ్ వగైరా….

లోపల అడుగు పెట్టగానే బెట్టి కనిపించింది. చాల అందగత్తే. నాకైతే విదేశీ వనితలందరు అందంగానే కనిపిస్తారు. అయినా ఈమె అలా కాదు. నిజంగానే అందంగా ఉంది. అందుకే మనవాడు ఆమె వలలో పడ్డాడు. 

“Pleased to meet you Mrs. Shaw.” 

“Pleased to meet you too. Diru talks a lot about you. “ ధీరుభాయ్ ని ఆమె ఎప్పుడూ డిరు అనే పిలుస్తుంది. మేం దివాన్లు ఉన్న దగ్గర కూర్చున్నాం. టి.వీ. నడుస్తోంది. 

కౌబాయ్‌స్ ఒకరి మీద మరొకరు తుపాకులు పేల్చు కుంటున్నారు. ఎదురుగా ఒక పిల్లవాడు కూర్చుని చేతిలో ఉన్న బొమ్మ పిస్తోలుని “ఢాం”, “ఢాం”, అని వాళ్ళని అనుకరిస్తూ పేలుస్తున్నాడు. 

” Veenu! See who has come. Uncle Babu.”

విను అంకుల్ బాబు వైపు ఒకసారి చూసి చిరునవ్వు నవ్వాడు. ఈ లోగా విలన్ ఎక్కిన గుర్రం పరుగెత్తుకుంటూ రావడం చూసి తన చూపులు అటువైపు త్రిప్పాడు. 

“వీడికి ఎప్పుడూ ఇదే ధ్యాస.” అన్నాడు ధీరుభాయ్.

“పిల్లలు అలాగే ఉంటారు మరి.!” అన్నాను. అహమ్మదాబాదులో ఇలాంటి దృశ్యాలు అనేకం చూశాను నేను. “వీడి పేరేంటి? అన్నారు?”  అడిగాను. 

“వీను.”

“అంటే… మన దేశపు వీను…. వినోద్ అనా లేక ఆంగ్ల…..?”

“మనదేశపు వీనుయే. ఇక్కడి వాళ్లకి పలకడానికి వీలుగా ఉంటుందని అలా పేరు పెట్టాను. భోజనానికి అన్నీ సిద్ధం చేసి బెట్టి వీడిని పిలుస్తుంది. అప్పడు జాగ్రత్తగా విను. ‘ఉవిను…ఉవిను..’ అని అంటుంది. ఆమెను అనుకరిస్తూ నాకు చెప్పాడు.

“ఒక్కడే సంతానమా?” అడిగాను. 

“కాదు. ఇద్దరు. పెద్దవాడు టూరు మీద వెళ్ళాడు. “

“వాడి పేరేం టి?”

“వాడి పేరు ‘పెట్ ‘

“ఇంగ్లీషు పేరా?”

“అవును. అప్పుడు బెట్టి ఇంగ్లీషు పేరే పెట్టాలని పట్టుపట్టింది. అందువల్ల వాడికి పెట్రిక్

 అని పేరు పెట్టాం. ఈ సారి నేను బలవంతం చేశాను. అలా వీడి పేరు విను అని పెట్టాం. అదీ వీళ్ళు పలకడానికి వీలుగా. 

ఇంతట్లోకి బెట్టి వచ్చింది. “మీరు టి తాగుతారా? లేక భోజనం చేసేస్తారా? డిన్నర్ రెడీగా ఉంది.” అంది. 

“బెట్టి! డిన్నర్ లోకి ఏం చేశావు? బాబూ నువ్వు అన్నీ  తింటావు కదా!” అన్నాడు. 

నేను తల అడ్డంగా ఊపాను. “don’t bother. Bread, butter ఉన్నా సరిపోతుంది.” అన్నాను. 

“Oh! You vegetarians, grass and leave eaters.” అంది బెట్టి నవ్వుతూ.

“కాని నేను బాయిల్డ్ కేరట్, కాలి ఫ్లవర్ చేశాను. ఇంకా టమాటో సూప్ డబ్బా ఓపెన్ చేద్దాం.” అంది. 

“I am sorry my friend. ముందుగా తెలిసి ఉంటే  నేను ఏదో ఒకటి తెచ్చే వాడిని. ఇంక ఇంత రాత్రప్పుడు ఏం దొరుకుతాయి? మాంచెస్టర్ అయితే ‘కోహినూర్’ కో, ‘బాంబే’ కో వెళ్ళేవాళ్ళం. సరే! మనం రేపు వెళ్దాం.” అన్నాడు ధీరుభాయి.

బాయిల్డ్ కేరట్, కాలిఫ్లవర్ కడుపులో పడ్డాక అతను మళ్ళి సంభాషణ ప్రారంభించాడు. 

“బాబూ! ఎన్నాళ్ళయింది మనం కలుసుకుని?”

“పద్దెనిమిది సంవత్సరాలు.”

“అబ్బ! పద్దెనిమిది సంవత్సరాలే! అహమ్మదాబాదు ఎలా  ఉంది? చాలా మారిపోయి ఉంటుంది. మా పోల్ – మామునాయక్ నీ పోల్ -ఇప్పటికీ అలాగే ఉందా? ఆ చబుతరాలు, ఇంకా…. శ్రీఖండ్ వాలా… ఓహ్ ! good old days! నాకిప్పటికీ గుర్తున్నాయి. బొంగరాలు, లంగడిలు ఆడుకునే వాళ్ళం. ఇంకా ఉత్తరాయణ్ ఎంత బాగుండేది! ఇప్పుడు కూడా అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారా? “

అతను నాకసలు మాట్లాడే అవకాశమే లేకుండా మాట్లాడుతున్నాడు. 

“గాలిపటాలు అప్పటిలా లేవు. అన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇక్కడ మీరంతా ఎలా ఉన్నారు? మాదేశంలో ….”

“What do you  mean? మాదేశంలో… నా పాస్ పోర్ట్ ఇంకా ఇండియాదే! తెలుసా?”

అన్నాడు అతను నన్ను మధ్యలోనే ఆపుజేసి. 

“నిజంగానే? ఇంకా మార్పించుకోలేదా?”

ధీరుభాయ్ జవాబివ్వలేదు. 

“అహమ్మదాబాదులో రేషనింగు ఇంకా అలానే ఉందా? 500గ్రాముల బియ్యం, కిలో పంచదార, 500గ్రాముల పప్పులు వగైరా…” అతని కళ్ళు కిటికిలోంచి భారతదేశాన్ని చూ స్తున్నట్టుగా ఉన్నాయి. అతని మనోఫలకం మీద చిత్రాలు వేగంగా కదులుతున్నాయి. 

“మా పోల్ లో మా యింటి ప్రక్కన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను క్రిందటి సంవత్సరం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి… అంటే… లండన్. నాకు తెలిసిన వెంటనే వెళ్లి అతన్ని కలిశాను. I was very glad to see him. మన వాళ్ళంటూ ఎవరో ఒకరు కలిశారు కదా అనే ఆనందం. “ 

అతని పరిస్థితిచూస్తే, ఇప్పటికీ అతను పడుకున్నపుడు ఇండియా గురించి తనలో తాను  మాట్లాడుకుంటూ ఉంటాడేమో ననిపించింది. 

బెట్టి ఒక ప్రక్కగా కూర్చుని స్వెట్టరు అల్లుతోంది. విను మాకు “గుడ్ నైట్” చెప్పి మేడ మీదికి వెళ్లి పోయాడు. రాత్రి పదకొండు గంటలయింది. అతని మాటలు అలా సాగుతూనే ఉన్నాయి. చాలా కాలం తరవాత కలిసిన స్నేహితుడనిపించాడు. ఎడ తెరిపి లేకుండా మాట్లాడుతూ, “అరె! మనం చాలా కాలం తరవాత కలుసుకున్నాం. చలో! ఒక్కొక్క డ్రింకు లాగిద్దాం.!  విస్కీ? బ్రాండి? జిన్ ? షాంపేన్… షాంపేన్ అయితే లేదు కాని, చాలు… నిజంగా  బిట్టర్ బీర్…” అన్నాడు హుషారుగా.

“నేను అహమ్మదాబాదు వెళ్ళాక తాగడం మానేశాను” అన్నాను. 

“ఓరీ! ఓదిలేసినవాడా! నా కోసం…. మన old times కోసం…ఒక్క పెగ్గు… “

అతన్ని నిరుత్సాహపరచడం మంచిదికాదని, “సరే! ఒక్కటంటే… ఒక్కటే…  “ అన్నాను. 

“అదీ friendship అంటే ! బెట్టి! డ్రింక్స్ తెచ్చిపెట్టు.” ధీరుభాయ్ చేతులు ఊపుతూ అన్నాడు. ఆనందంలో అతను లేచి గెంతులేస్తాడా అనిపించింది. 

బెట్టి ఎప్పటి నుంచో ధీరుభాయ్ ని పరీక్షగాచూస్తోంది. “ What has got into your head Diru?  నీ మనసెంతో ఆనందంగా ఉంది. ఎప్పటినుంచో చూస్తున్నాను. మీ యిద్దరు నేటివ్ టంగ్ లో మాట్లాడు కుంటున్నారు. నాకైతే ఒక్కముక్క కుడా అర్థం కావడం లేదు.” అంది. ఆమె కోపంగా లేదనిపించింది నాకు. “ You know Mr. Babu! He never talked like this before. ఈ రోజు ఇతనికి పిచ్చి పట్టిందా! అనిపిస్తోంది.” 

బెట్టి లోపలికి వెళ్లి బీర్ బాటిల్ తో తిరిగి వచ్చింది. ధీరుభాయ్ సంతోషం చెప్పనలవి కాదు. 

“మీరక్కడ  బాటాకా వడా, తింటారు కదా! ఇంకా … ఘారి, మగజ్, …. ఇంకా…. సాముహిక భోజనాల్లో ఫుల్ వడి, దుది-చనాని దాల్, లోచ పూరి…. ఇవన్ని ఉంటాయి కదా! నువ్వు వెళ్తూ ఉంటావా? అక్కడ… అదేం  ప్రదేశం?…. సరం…సారామ్….” 

“సారంగ్ పుర్ దౌలత్ ఖానా గురించా నువ్వు అంటూన్నది ?” అడిగాను.

“ Oh! Yes. Of course. పీటల మీద కుర్చుని భోజనాలు. విస్తట్లో వడ్డన. Oh! Boy! వాటితో పోల్చి చూస్తే… ఈ బాయిల్డ్ కేరట్,  కాలి ఫ్లవర్…”

“ఆమె మనల్నిgrass eaters అంది. వినలేదా నువ్వు.” అన్నాను.

“దాని మొహం. భోజనం సంగతి దానికేం తెలుసులే. రేపు మనం బాటాకా వడా వండు కుందాం. ఇంకా… పప్పులు అవి నేను మర్చంట్స్ నుంచి తెస్తాను. నువ్వు మసాలా సామాగ్రి తీసుకో. నీకు వంట వచ్చుకదా! ఎప్పుడూ నువ్వే వండుతూ ఉండేవాడివి, నలబై ఏడులో. అప్పుడే నేను నేర్చుకుని ఉండ వలసింది.” అన్నాడు. తరవాత అతను భార్యవైపు చూడకుండానే, “బెట్టి! రేపు బ్రేక్ ఫాస్ట్ కి we will eat bataka vada. “ అన్నాడు. “పోటెటో…పోటేటో… వడాని ఇంగ్లీషులో ఏం అంటారు?” అని నన్నడిగాడు, బెట్టికి అర్థం అయేలా చెప్పుతూ ధీరుభాయ్. అయినా ఈ తెల్లవాళ్ళకి బటాకా వడా రుచి ఏం తెలుస్తుంది లే! దీనికి చస్తే ఆ పేరు పలకడం కుడా రాదు. “

రాత్రి రెండు గంటల వరకు మేము అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. రోజంతా ప్రయాణం చేసి వచ్చిన నాకు ఆవులింతలు ముంచుకొస్తున్నాయి. ఆఖరికి ధీరుభాయ్ నాకు పడుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. 

మర్నాడు నేను వెళ్తానని చెప్పాను. ‘మధ్యాహ్నం వెళ్ళవచ్చును లే!’ అని నన్నాపుజేశాడు. మేం లండన్ వెళ్ళి మర్చంట్స్ లో శనగ పిండి, మసాలా దినుసులు, నూనే, బంగాళా దుంపలు కొని తెచ్చాము. నేను వంట మొదలు పెట్టాను. అన్నీ తయారు చేశాను. కాని, వేపుడుకి మూకుడు లేదు. ధీరుభాయ్ అప్పటికప్పుడు లోకల్ స్టోర్ లో బూరెలమూకుడు కొనడానికి వెళ్ళాడు. అతను ఇలా వెళ్ళగానే బెట్టి నాతో అంది. “ ఈ డిరూకు ఈరోజు నిజంగా నే పిచ్చి పట్టింది. ఈ నేటివ్ లు అతన్ని అంతగా  ప్రభావితం చేస్తారు.“ ఆ నేటివ్ అన్నమాటకు నేను నొచ్చుకున్నాను. కానీ ఇంతలోనే బొండాలకి శెనగ పిండి కలపడంలో అంతా మరిచిపోయాను. ధీరుభాయ్ మూకుడుతో తిరిగి వచ్చాడు. నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నన్ను డైరక్టుగా ముద్దు పెట్టుకుంటే బాగుండదనో ఏమో బెట్టిని ప్రోక్సిగా వాడుకుని ముద్దు పెట్టుకోసాగాడు. కబుర్ల మధ్యలో ఒకసారి ఆ పిండి చేత్తోనే నా చెంప మీద ఒక దెబ్బ వేశాడు. ఆ ఆనందంలో సారీ చెప్పడం కూడా మరిచిపోయాడు. తరవాత బెట్టి సారీ చెప్పింది. 

ఆఖరికి ఆ బొండాలు తిని నేను సూట్ కేసు బైటికి తెచ్చాను. ధీరుభాయ్ మాత్రం Wonderful ! Wonderful’ అంటూ లాగించేశాడు. అది చాలక, “తోడుగా పప్పు, అన్నం, బంగాళా దుంపల కూర, నెయ్యి వగైరా ఉంటే ఇంకా బాగుండేది.” అన్నాడు. 

నేను భయ పడుతూ అన్నాను,”నాకు అవన్నీ చేయడం రాదు.” 

“Don’t worry, don’t worry! నేను నిన్ను ఊరించడానికి అలా అన్నాను.” అన్నాడు. 

తరవాత బెట్టికి బై చెప్పి నేను బయల్దేరాను. ధీరుభాయ్ వెనకాలే వచ్చి కార్లో కూర్చున్నాడు. “నువ్వు మర్చంట్స్ మీదుగానే వెళ్తావు కదా! అక్కడి వరకు నేనూ వస్తాను.” అన్నాడు. 

“మరి వెనక్కి ఎలా వస్తావు?” అడిగాను. 

“బస్సులోనో, ట్రెయిన్ లోనో వస్తాలే. నీకు ఇంటి దగ్గరే వీడ్కోలు చెప్పుతానా? భలేవాడివే!” అన్నాడు. 

అక్కడికి మర్చంట్స్ సుమారు ముప్ఫై మైళ్ళ దూరం ఉంటుంది.  దారి పొడుగునా అతని  ఉద్యోగం గురించి, ప్రమోషన్ల గురించి అడిగాను. అన్నిటికి ముక్తసరిగా జవాబు చెప్పడం తప్ప ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. మర్చంట్స్ చేరుకున్నాం. 

“పద! వైట్ హార్స్ కి పోదాం” అన్నాడు. నేను అతన్ని అనుసరించాను. 

అదే పబ్. అదే బార్, అవే బాటిల్సు, కాని కర్టెన్లు మారాయి. కార్పెట్లు మారాయి. ఇంకా…బార్ మేయిడ్స్ మారారు.

“నీకు గుర్తు ఉందా? నువ్వు మనదేశం వెళ్ళిపోయే ముందు మనం ఇక్కడే కలుసుకున్నాం. ఆఖరి సారిగా.” అని అడిగాడు. 

“అవును.”

“ఇప్పుడు కూడా నువ్వు మన దేశం వెళ్తున్నావు.“ అతను అన్నాడు, బిట్టర్ గ్లాసులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ. క్షణ కాలం శాంతంగా ఉండి, అడిగాడు

“ధర్మిష్ట ఏం చేస్తోంది? “

“బాగానే ఉంది.”

“పెళ్లి చేసుకుందా?”

“ఆఁ!”

“పిల్లలా?”

“ముగ్గురు.”

“కలుస్తూ ఉంటుందా?”

“అప్పుడప్పుడు.”

“ఎలా ఉంది? అప్పటిలాగానే….”

“ఆహా! అలాగే!”

అతను రెండు క్షణాలు శాంతంగా ఉండి, అన్నాడు.”You know! అప్పుడామె చాలా అందంగా ఉండేది.”

నేనేమీ మాట్లాడలేదు. అతను బిట్టర్ పూర్తి చేశాడు. మేము క్రిందికి దిగాము. నేను అతన్ని బస్ స్టాండులో దింపడానికి వెళ్లాను. బస్సు కదలబోతుండగా అతను అన్నాడు.”నువ్వు వెళ్ళు. ఆ తరవాత నేను వెళ్తాను.”

“మళ్ళీ ఎప్పుడు కలుస్తావు?” అడిగాను.

“ఎప్పుడో ఒకప్పుడు కలుద్దాం.” అన్నాడు. 

“నేను వెళ్ళగానే అప్పడాలు పంపుతాను. అక్కడ దిగిన వెంటనే నేను చేసే పని అప్పడాలు పంపడమే”

అతనేమీ అనకుండా మొహం అటు తిప్పేసుకున్నాడు. నేను బయల్దేరాను. నా కారు బేక్ వ్యూ అద్దంలో నేను అతన్ని బస్సు దిగి, చేయి ఊపుతూ ఉండగా చూశాను. ప్రక్క నుంచే బస్సు వెళ్ళిపోవడం గమనించాను. 

నాకు తెలుసు. అతని తిరుగు ప్రయాణం ‘వైట్ హార్స్’ కే అని.

పాలెపు బుచ్చిరాజు

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.

Previous Post

తొలి ప్రేమ

Next Post

నేను నిన్ను ప్రేమిస్తున్నాను !

Next Post
నేను నిన్ను ప్రేమిస్తున్నాను !

నేను నిన్ను ప్రేమిస్తున్నాను !

Discussion about this post

ఈ సంచికలో…

  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ
  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను !
  • గుజరాతీ కథ : వైట్ హార్స్
  • తొలి ప్రేమ
  • కన్నడ కవిత : నవ్వు
  • 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • కన్నడ కథ: ఆ ఒక విధంగా …
  • రష్యన్ కథ : మాస్క్
  • తమిళ కథ : పుష్పించని చెట్టు
  • యుగోస్లేవియా కథ : కాప్టెన్
  • అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం
  • ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 
  • కన్నడ కథ :  అంతర్వాహిని
  • అనువాద కవిత : ఒక సంవత్సరం

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com