ఒరియా మూలం: శ్రీ మనోరంజన్ బెహురా
ఆంగ్లం: జెహారా జబీన్ (The Rootless Creeper, Published in ‘Indian Literature’, Sahitya Akademi’s Bimonthly Journal, Nov-Dec 2025)
తెలుగు: కొల్లూరి సోమ శంకర్
ఆ రాత్రి ప్రమీలకి, వ్యాకులత వల్ల నిద్ర పట్టలేదు. తాను తీసుకున్న అనివార్యమైన నిర్ణయం వల్ల ఆమె మనసు బరువెక్కింది. పునర్వివాహం చేసుకునే అవకాశం లభించినా, సమాజపు కనికరం లేని చూపు ఆమె మనస్సాక్షిపై భారంగా ఉంది. భారతదేశంలోని ఈ ప్రాంతాలలో, ఎవరికైనా, సమాజపు బాణీకి అనుగుణంగా నాట్యం చేయక తప్పదు, దాని శ్రావ్యత నచ్చకపోయినా సరే, ఎంత పాతదైనా సరే! ఈ హద్దుల నుండి బయటకు అడుగు పెట్టడం అంటే అంతులేని గుసగుసలను, తిరస్కారాలను ఆహ్వానించడమే.
భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో ప్రేమ వివాహాలకు ఆధునిక ఆమోదం ఉన్నప్పటికీ, ప్రమీల అలాంటి స్వేచ్ఛను స్వీకరించలేకపోయింది. వర్షాకాలంలో వానని తట్టుకోలేని, బలహీనమైన చిరుమొలకలా తనని తాను భావించుకుంది ప్రమీల. పూర్తిగా నేలకూలినా, సరైన మద్దతు లభిస్తే తిరిగి నిలదొక్కుకోగలదు వేప చెట్టు; కానీ ఆ మద్దతు లేకపోతే, ఆ చెట్టు గతి – అక్కడ సంచరించే పశువుల దయపై ఆధారపడి ఉంటుందని ఆమెకు తెలుసు. నిస్సహాయంగా, నిరాశ్రయంగా నేలకూలడం కంటే మద్దతుతో నిలబడటం మంచిది.
ఆమె ముసలి తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచారు, ఆమె సంక్షేమం కోసం అన్నీ త్యాగం చేశారు. కానీ ముప్పై ఏళ్ళ వయసులో, ఆమె వారి నుండి మరిన్ని అడగలేనని ఆమెకు తెలుసు. స్వయం సమృద్ధిగా ఉండటం నేర్చుకోని ఆమె ఇక తనకంటూ సొంతంగా ఓ ఆధారాన్ని కనుక్కోక తప్పదు. ‘మీ మెడపై ఏదైనా పడితే అది మీరు భరించాల్సిన భారంగా మారుతుంద’నే కఠినమైన పాఠాన్ని జీవితం ఆమెకు నేర్పింది.
ఉన్నట్టుండి కొడుకు కును నిద్రలో ఏడవడంతో ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి. ఆమె బిడ్డని ఒడిలోకి తీసుకుని, వాడు తిరిగి నిద్రలోకి జారుకునే వరకు సున్నితంగా జోకొడుతూ ఓదార్చింది. నిద్రతో ఆమె కనురెప్పలు బరువెక్కినా, అవి తెరుచుకునే ఉన్నాయి. ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది.
‘నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే కును పరిస్థితి ఏమవుతుంది?’ ఈ ఆలోచన ఆమెను వెంటాడుతోంది. ఎప్పుడో వదిలివేసిన మార్గంలో తను తిరిగి నడవగలదా? మాతృత్వాన్ని రెండో పెళ్ళితో ఎలా సర్దుబాటు చేసుకోవాలి? ఒక బిడ్డ తల్లికి గొప్ప నిధి; ఏ స్త్రీ కూడా తన సంతానం కోసం త్యాగాలకు వెనుకాడదు. కానీ మాతృత్వాన్ని, పునర్వివాహాన్ని కలపడం అసాధ్యమైనదిలా అనిపిస్తోంది. సాయంత్రపు నీడల వలె ప్రశ్నలు పెరిగాయి: తన రెండో పెళ్ళి కునుపై ఏ ప్రభావం చూపిస్తుంది? తన కొడుకు కళ్ళ ముందు గాజులు, సిందూరంతో వధువుగా అలంకరించుకోగలదా? తల్లి, వధువు పాత్రలు రాజీపడలేని విధంగా ఘర్షణ పడతాయా? సమాజం ఇప్పుడు వివిధ రకాల కలయికలను ఆమోదిస్తున్నప్పటికీ, వారి సమూహంలో మాత్రం – వితంతు పునర్వివాహం అనేది ముళ్ళబాటగానే మిగిలిపోయింది. అలాంటి అజమాయిషీని కొద్ది మంది మహిళలు మాత్రమే – ముఖ్యంగా చిన్న వయస్సులో ఒంటరైన వారు మాత్రమే – తట్టుకోగలరు. ప్రమీల ఆలోచనలు ఇంకా పెళ్లికాని తన పాఠశాల సహచరుల వైపు మళ్లాయి. వివాహితగా ఉండటం తనకు సురక్షితమైన స్థితి కావచ్చని ఆమె భావించింది.
వంతెన కింద నీరు లాంటి గత సంఘటనలు సంభాషణలలో అరుదుగా దొర్లుతాయి. అయినప్పటికీ ప్రపంచం దృష్టిలో దాగి ఉన్న భావోద్వేగపు గాయాలు నిశ్శబ్దంగా రక్తం చిందిస్తునే ఉంటాయి. ఇలాంటి దాగి ఉండే వేదనను ప్రమీల మోస్తోంది, ఆమె మనస్సులో జ్ఞాపకాలు, సదవకాశం మధ్య యుద్ధం జరుగుతోంది. ఆమె ఆలోచనలు – పదేళ్ళ క్రితం తను పెళ్ళి చేసుకున్న సిపాయి సంజయ్ పైకి మళ్ళాయి. కళాశాల చదువు ముగించి కొత్త జీవితంలోకి ప్రవేశించిన వారు పదేళ్ళపాటు సుఖదుఃఖాలను పంచుకున్నారు, కునుకి జన్మనిచ్చారు. సంజయ్ అకాల మరణం అన్నింటినీ ముక్కలు చేసేవరకు వారి ప్రపంచం సంపూర్ణంగా ఉన్నట్లు అనిపించింది. కునుతో ఒంటరిగా మిగిలిపోయిన ఆమె హృదయం తండ్రి లేకుండా పెరుగుతున్న తన కొడుకు గురించి ఆలోచించి బాధపడుతోంది.
అయినప్పటికీ, ఆశ, మొండి విత్తనంలాగా, ఆమె దుఃఖంలో వేళ్ళూనుకుంది. కును భవిష్యత్తును కాపాడాలనే దృఢ సంకల్పంతో, ప్రమీల మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంది. సంజయ్ మరణం తర్వాత, ఆమె చిన్నప్పటి స్నేహితుడు బినోద్ ఆమె జీవితంలోకి వచ్చాడు. ఆమె ఊరివాడే అయిన అతను ఆమెకు కష్టాలలో ఓదార్పునిచ్చాడు, కునుకి సాయం చేశాడు, ఆమె పక్కన స్థిరంగా నిలబడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికను బినోద్ వ్యక్తం చేసినప్పుడు – అతని సహనం, మద్దతు – ప్రమీల జీవనగమనంలో కొత్త బాట వేసింది. ఇప్పుడామె జీవితపు కూడలిలో నిలబడి, తాను ఎంచుకున్న ఎంపిక భారాన్ని మోస్తోంది. కును కోసం, తన కోసం, ఆమె తన జీవితాన్ని పునర్నిర్మించుకుని, సమాజపు గుసగుసల సద్దుని ఆపగలదా?
సంజయ్ మరణించిన పది నెలల తర్వాత, ఒక మధ్యాహ్నం పూట, బినోద్ తమ మధ్య ఉన్న ఓ రకమైన సౌకర్యవంతపు నిశ్శబ్దాన్ని ఛేదించాడు. “ప్రమీలా,” అంటూ చెప్పుకొచ్చాడు, “నేను నిన్ను మన స్కూల్ రోజుల నుండి ప్రేమిస్తున్నాను. అప్పుడు నీకు చెప్పే ధైర్యం నాకు రాలేదు.” అతని మాటలు ఆమె గాయపడిన హృదయంలో వణుకు పుట్టించాయి. ఆమె శరీరం చల్లబడింది, చర్మం ముడతలు పడింది. ఉక్కిరిబిక్కిరి అయి, అతని చూపులను ఎదుర్కోలేక ఆమె ముఖాన్ని కప్పుకుంది. ఆమె అసౌకర్యాన్ని గ్రహించిన బినోద్ ఏదో సాకు చెప్పి, చెదిరిన భావోద్వేగాలతో ఆమెను ఒంటరిగా వదిలి అక్కడ్నించి తొందరగా వెళ్ళిపోయాడు.
వివాహానికి ముందు, ప్రేమ అనేది కేవలం పుస్తకాలలోని వాక్యాలు లేదా సినిమాల్లోని క్షణిక దృశ్యాలకు చెందినదై – సుదూరమైనదిగా, అవాస్తవికమైనదిగా, ఇతరుల జీవితాలకు సంబంధించినదిగా అనిపించేది. ఇప్పుడు, ఆమె దుఃఖం మధ్య, బినోద్ చేసిన అనూహ్య ప్రకటన ఆమెను ఎప్పుడూ లేనంతగా గందరగోళానికి గురిచేసింది. ఆమె మానసికంగా, భావోద్వేగపరంగా లేదా ఆధ్యాత్మికంగా – మరొక సంబంధానికి సిద్ధంగా లేదు. అయినప్పటికీ ఆ రోజు తర్వాత, బినోద్ భావాలు మరింత స్వేచ్ఛగా ప్రవహించాయి, అతని అనురాగం ఆమె శిథిల ప్రపంచంలోకి అల్లుకుంది.
ప్రేమ, దాని ప్రారంభ దశలో, రాతిపై చెక్కిన రాత లాంటిది – శాశ్వతమైనది మరియు లొంగనిదిగా అనిపిస్తుంది. బినోద్ ప్రదర్శించే విశాలమైన ఆప్యాయత ప్రకటనలు ప్రమీలను మౌనంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆమె అతన్ని దూరం పెట్టాలని అనుకున్నప్పటికీ, ఏదో ఆమెను వెనక్కి నెట్టింది. ఏకాంతంలో, అలసిపోయేంత వరకు ఆమె ఏడ్చింది. ఆమె తన భావాలను అణచివేయడానికి ప్రయత్నించినప్పటికీ, బినోద్ గురించి ఆలోచనలు తొలగడం లేదు. అతని ప్రేమ నిజమైనదా, ఇన్ని సంవత్సరాలు జీవించి ఉందా?
కాలం గడిచిపోవడం ఆమె మనసును బరువెక్కించింది. వారి పాఠశాల రోజుల నుండి పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. కాలేజీ చదువు పూర్తయిన ఐదు సంవత్సరాల తర్వాత ఆమె సంజయ్‌ను వివాహం చేసుకుంది. ఆ కాలమంతా బినోద్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? కొన్ని క్షణాలు, గ్రహించలేనంత వేగంగా కరిగిపోతాయని ఆమె గ్రహించింది. కోల్పోయిన తర్వాత వాటిని తిరిగి పొందలేము.
ఇప్పుడు, సూర్యాస్తమయం సమీపిస్తుండగా, కాసేపట్లో బినోద్ వస్తాడని ప్రమీలకు తెలుసు. అతను ఎప్పుడూ కుర్చీని సరిచేసింది, ఆమె మనసు వేగంగా పరుగెడుతోంది. తాను ఒక బోను నుండి తప్పించుకుని మరొక బోనులోకి వెళ్తున్నానేమోనని ఆమెకు అనిపించింది. ఈ కొత్త సంబంధం తన కుటుంబానికి – లేదా తనకు ఇబ్బంది కలిగిస్తుందా? జనాలు ఏమంటారు? వంటగదిలో కును కోసం నీళ్లు మరిగించేటప్పుడు ఈ ప్రశ్నలు ఆమెను వేధించాయి. సుపరిచితమైన అడుగుల శబ్దం, కుర్చీని బయటకు తీయడం ఆమెకి వినిపించింది. నీరు మరిగిన తర్వాత కూడా, ఆమె వంటగదిలోనే ఉండిపోయింది, బినోద్ ముందుకు వెళ్ళడానికి చాలా సిగ్గుగా అనిపించింది. ఆమె అనిశ్చితంగా ఉంది.
కొన్ని క్షణాల తర్వాత, బినోద్ వంటగదిలోకి ప్రవేశించాడు. ప్రమీల సహజంగానే వెనక్కి తగ్గింది, ఆమె నిల్చున్న తీరు దృఢంగా, అనిశ్చితంగా ఉంది. ఆమె సంకోచాన్ని గ్రహించి, అతను కొద్దిగా వంగి, తన స్వరం తగ్గించి, శ్రద్ధగా “ప్రమీలా,” అని పిల్చాడు గుసగుసలాడుతున్నట్లు. “నేను ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. ఇంత చిన్న వయసులో నువ్వు ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కోగలవా? మరి నీ కొడుకు సంగతేంటి? అతనికి తండ్రి కావాలి.” అన్నాడు.
ప్రమీల స్పందించలేదు. ఆమె కళ్ళలో నీళ్ళు కారసాగాయి, బుగ్గల మీద క్రిందకి జారసాగాయి. ఆమె మౌనంగా ఉండిపోయింది, కానీ ఆమె తరఫున ఆమె కన్నీళ్లు మాట్లాడాయి, మాటల్లో చెప్పలేని, హృదయంలో చెలరేగుతున్న భావోద్వేగాలను వ్యక్తపరిచాయి. ప్రేమ నుండి పెళ్ళి వరకూ సాగే ప్రయాణం ఎప్పుడూ సాఫీగా ఉండదు, పైగా పెళ్ళి తర్వాత ప్రేమను నిలబెట్టుకోవడం లెక్కలేనన్ని పరిస్థితుల మధ్య ఎదురయ్యే పెద్ద సవాలు. ప్రమీలను వివాహం చేసుకునే వ్యక్తి దయ, సహనం అసాధారణ స్థాయిలో కలిగి ఉండాలి. బినోద్ అలాంటి వ్యక్తేనా, లేదా అతను కేవలం భావోద్వేగపు నిర్ణయం తీసుకుంటున్నాడా? ముప్పై ఏళ్ళ వయసులో, పరిపక్వత తరచుగా అపక్వ భావోద్వేగాలను అణచివేస్తుంది. అర్హతగల బ్రహ్మచారి అయిన బినోద్, సామాజికంగా ఆమోదయోగ్యమైన జోడీని సులభంగా కనుగొనగలడు. అయితే, అతను – వితంతువైన ప్రమీలను – సామాజిక అంచనాలకు కట్టుబడి ఉండే స్త్రీని, ఎన్నో సందేహాలున్న మహిళని పెళ్ళి చేసుకోవాలని ఎందుకంతగా అనుకుంటున్నాడు? అతని ప్రేమ నిజంగా అంత నిస్వార్థమైనదా, లేక అతను కూడా నెరవేరని భావోద్వేగాల మత్తులో చిక్కుకున్నాడా? ప్రేమ, ఒక శక్తివంతమైన విషం లాగా, బుర్రని తినేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఒకసారి ప్రేమంటూ పుట్టాకా, అది స్త్రీ పురుషులిద్దరినీ మారుస్తుంది, వారికి సామాజిక సరిహద్దులను అధిగమించే స్వేచ్ఛని, ఉద్దేశాన్ని కల్పిస్తుంది. ముందుకు అడుగేయాలా లేక వెనక్కి తగ్గాలా తెలియక, ప్రమీల ఈ పరివర్తన అంచున నిలబడింది.
బినోద్ ప్రవర్తన, అతని స్థిరమైన మాటలు, ప్రేమ పట్ల అతని పద్ధతి ఒక పరిణతిని ప్రతిబింబిస్తున్నాయి, ఆ ప్రేమ తిరుగులేనిదిగా అనిపించింది. అయినప్పటికీ, ప్రమీల మనస్సుని ఒక ప్రశ్న.. పెద్దదే.. తొలుస్తోంది; అతని కుటుంబం, ముఖ్యంగా గంగాభాగీరథీసమానురాలైన అతని ముసలి తల్లి, ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా? అతను ఒక చిన్న కుటుంబం నుండి వచ్చాడు. అతని తల్లి చాలా కాలంగా అతనికి – తమలాంటి చిన్న, అనుకూలమైన కుటుంబం నుంచి అమ్మాయిని తేవాలనుకుంటోంది. కానీ కుదరలేదు. అతని తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ఇంట్లో ఇప్పుడు ఇద్దరు సోదరులు, కుటుంబ పెన్షన్ మీద జీవించే తల్లి ఉన్నారు. అలాంటి కుటుంబంలో అంచనాల బరువు ఎంతగా మోయాలో, నిశ్శబ్ద తీర్పుల వలె వెలువడే వారి నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రమీలకు తెలుసు.
వంటగది కిటికీ దగ్గర నిలబడి, బయటకు చూస్తున్న బినోద్ ఆలోచనలో మునిగిపోయాడు. కొద్ది సేపటి తర్వాత ప్రమీల వైపు తిరిగి, నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆశ్చర్యపోయిన ప్రమీల సహజంగానే వెనక్కి లాక్కోడానికి ప్రయత్నించింది, కానీ బినోద్ ఆమె చేతులను గట్టిగా, అయినా, మృదువుగా పట్టుకుని, ఆమె దృష్టిని ఆకర్షించాడు.
“మీ అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంటుందా?” ప్రమీల అడిగింది చాలా నెమ్మదిగా. ఆమె గొంతు గుసగుసలాడుతూన్నట్లుగా, చింతల భారాన్ని మోస్తున్నట్లుగా పలికింది.
బినోద్ క్షణంపాటు సంకోచించాడు కానీ తర్వాత దృఢమైన స్వరంతో సమాధానమిచ్చాడు. “అమ్మకి ఒంట్లో బావుండడం లేదు,” అన్నాడు. “త్వరగా పెళ్లి చేసుకోమని పోరుతోంది.”
ప్రమీల కాస్త ముఖం చిట్లించుకుంది, ఆమెలో ఆందోళన పెరుగుతోంది. “కానీ సమాజం అంగీకరిస్తుందా?” అంది.
“నేను సమాజం గురించి పట్టించుకోను,” బినోద్ దృఢంగా సమాధానం చెప్పాడు. “సమాజం నన్ను పట్టించుకుందా? అది నిన్ను చూసుకుందా?” అన్నాడు.
ప్రమీల స్పందించేలోపే, మరో గది నుండి ఆమె తల్లి గొంతు వినబడింది, “నీ కొడుకు లేచాడు ప్రమీ” అంటూ.
ప్రమీల త్వరగా బినోద్ పట్టు నుండి తన చేతులను విడిపించుకుని బెడ్ రూమ్ వైపు వేగంగా వెళ్ళింది. బినోద్ ఆమె వెంటే వెళ్ళాడు, అతని ముఖంలో ఆశ, ఆందోళన ఒకేసారి ప్రతిఫలించాయి. సాయంత్రం చిక్కబడుతున్న కొద్దీ, చెప్పని మాటలతో అక్కడి గాలి నిండిపోయింది. బినోద్ ఆ మౌనాన్ని ఛేదిస్తూ, “నేను మార్కెట్‌కి వెళ్తున్నాను,” అన్నాడు. స్థిరమైన, నిర్ణయాత్మక స్వరంతో “అయితే వెళ్ళే ముందు, నేను నీకు ఒక విషయం చెప్పాలి.” అన్నాడు.
గుండె వేగంగా కొట్టుకుంటుండగా, ప్రమీల అతని వైపు తిరిగింది.
“ఎవరైనా ప్రేమలో పడినప్పుడు,” బినోద్ ఆమె కళ్ళలోకీ చూస్తూ, చెప్పసాగాడు, “వారు ప్రేమించే వ్యక్తి నుండి దూరంగా ఉండటమనేది.. ఊపిరాడక పోవడం లాంటిది. ఇది చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగల బాధ. ప్రతిఫలం ఆశించని ప్రేమలోని వేదన.. అది మనిషిని లోతుగా కోస్తుంది. నీకు తెలుసా, ప్రసవ వేదన క్రమంగా తగ్గుతుంది, అది బాధాకరమైనదే అయినా తాత్కాలికం. కానీ ప్రేమలో నిండా మునిగిన హృదయపు వేదన, నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. అది రాత్రింబవళ్ళు మనస్సును వెంటాడుతుంది. అందుకే చాలా విషాదాలు, ఆత్మహత్యలు కూడా ప్రేమ నుండి పుడతాయి. ఇది కేవలం భావోద్వేగం కాదు; ఇది నయం కాని గాయం.”
ఆ మాటలతో, ప్రమీలను ఆమె ఆలోచనలలో ఒంటరిగా వదిలేసి, అతను మార్కెట్‌కి బయలుదేరాడు.
మసకబారుతున్న వెలుగులో కూర్చుని ఉండగా, ఆమె మనస్సు ప్రసవం జ్ఞాపకాల వైపు వెళ్ళింది. భరించలేని వేదనను, శుభ్రమైన ఆసుపత్రి గదిలో ఊపిరి పీల్చుకుంటూ ఏడుస్తూ అనుభవించిన నిర్భరమైన తీవ్రతను ఆమె గుర్తుచేసుకుంది. ఆ క్షణంలో, ఆమె ఇకపై అలాంటి బాధను అనుభవించనని ప్రతిజ్ఞ చేసింది. అయినప్పటికీ, కాలక్రమేణా, ఆ జ్ఞాపకాలు మెత్తబడి, చాలా కాలం క్రితం నాటి తుఫానులా, దూరమయ్యాయి.
ఇప్పుడు తన బాధ విషయంలో కూడా అదే జరుగుతుందా అని ఆలోచిస్తోంది. కోల్పోయిన ఆలంబన, మనసులోని సందేహాలు ఆమెని అస్థిమితపరుస్తున్నాయి. ఆమె అంతరంగాన్ని వేధిస్తున్న ప్రశ్నల అపరిపక్వతని కాలం పరిపక్వం చేస్తుందా? బినోద్ చెప్పేది నిజమేనా – ఆ ప్రేమ, ఎంత బాధాకరమైనది అయినా, ఒక రకమైన విముక్తిని అందించగలదా? లేదా అది ఆమె ఇప్పటికే గాయపడిన హృదయంలో మరో మచ్చను సృష్టిస్తుందా?
నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో ప్రమీల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి, బినోద్ మాటల ప్రతిధ్వనులు – ఆమె కొడుకు పిలుపు, ఆమె స్వంత భయాల నీడలతో అల్లుకుపోయాయి.
బినోద్‌కి నిజంగా తన వేదన అర్థమవుతోందా? బహుశా అర్థమవుతోందేమో. అతన్ని పెళ్ళి చేసుకోవడానికి అనేకమంది అమ్మాయిలు ఆసక్తిగా ఉండగా, తను ఒక వితంతువును పెళ్ళి చేసుకోవాలని ఎందుకు అంత గట్టిగా నిశ్చయించుకుంటాడు? అది ప్రేమ అయి ఉండాలి. అతని పట్టుదల, అతని అచంచలమైన నిబద్ధత, ఫెవికోల్ లాగా ఆమెను అంటిపెట్టుకుని ఉండటాన్ని ఏది వివరించగలదు? అర్హతగల మహిళల కొరత ఉన్నట్లు కాదు. అతను భారీ కట్నంతో సులభంగా పెళ్ళి చేసుకోగలడు. కానీ ఒక వితంతువును పెళ్ళి చేసుకోవడం ద్వారా అతను ఏం సాధించగలడు?
ప్రమీల ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది. పెళ్ళి తర్వాత, భర్త దృష్టిలో ఒక స్త్రీ ఆకర్షణ క్రమంగా మసకబారుతుంది, ఇక తల్లి అయిన తర్వాత, అతని అనురాగం కూడా తగ్గిపోతుందంటారు. ఆమె దివంగత భర్త ఆమెను ప్రేమించాడు. అవును, కానీ ఆమె ఇప్పుడు బినోద్ వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ ప్రేమలో తీవ్రమైన వెచ్చదనం, అభిరుచి లేవు. అతని ప్రేమ ఆమె ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని విధంగా ఆమెపై పూర్తిగా కేంద్రీకృతమై ఉంది.
ముప్పై ఏళ్ళ వయసులో, ఒకరు పరిణతి చెందాలి, కుటుంబ బాధ్యతలలో స్థిరపడి, హేతువు ఆధారంగా నడుచుకోవాలి. కానీ బినోద్ ప్రేమ ఈ అంచనాలను ధిక్కరించింది.
బహుశా ఇది ఊహించని వరం కావచ్చు. జీవితంలో, అదృష్టం దురదృష్టం రెండూ ఒకసారి మాత్రమే వస్తాయి. పైగా ఆమె ఇప్పటికే తన దురదృష్టాన్ని భరించింది. సంజయ్ మరణం ఆమె కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసి, ఆమెను దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేసింది. బహుశా ఈ అవకాశం, ఈ ఊహించని మలుపు, ఆమె అదృష్టం కావచ్చు. ఆమె తల్లిదండ్రులు అంగీకరించి ఆశీర్వదించారు; కానీ ఆమె మనస్సు కొడుకు కును పైనే తిరుగుతోంది.
ఆమె తన కొడుకు కోసం తన ఆనందాన్ని త్యాగం చేసి జీవితాంతం ఒంటరిగా ఉండాలా? సమాజం మారుతోంది. కును పెరిగే సమయానికి అది మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ముందడుగు వేసినందుకు కును తల్లిపై కోపం ప్రదర్శిస్తాడా లేదా అర్థం చేసుకుంటాడా?
ప్రమీలకు ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ తరచుగా సమాజంలో భావోద్వేగ, సామాజిక మద్దతు చాలా అవసరం. ఒక స్త్రీ ఎంత శక్తివంతురాలైనా, పురుషుడు లేకుండా ఆమె నిజంగా ఒంటరిగా జీవించగలదా? ఒక పురుషుడు తరచుగా స్త్రీ జీవితంలో స్థిరమైన శక్తిగా పనిచేస్తాడు – సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, ఇంకా మతపరమైన సందర్భాలలో కూడా. పురుషుడు అవసరం లేదని చెప్పుకునే స్త్రీలు తమ స్థితి పట్ల గర్వంతోనో, లేదా పరిస్థితుల ప్రభావం వల్లో అలా మాట్లాడుతుంటారు. తమ భర్తను విడిచిపెట్టినప్పుడు కూడా చాలామంది మహిళలు తమ జీవితాల్లో తండ్రులు, సోదరులు, మామలు వంటి పురుషులపై ఆధారపడతారు.
చాలా ఆలోచించిన తర్వాత, ప్రమీల గట్టి నిర్ణయం తీసుకుంది – అది జీవితంలో అత్యంత కష్టతరమైనది. ఆమె ఆనందంతో తీసుకున్న నిర్ణయం కాదు, కానీ ఆమె దానిని దృఢ సంకల్పంతో అంగీకరించింది. బహుశా పూర్తి ఆనందం ఆమె తలరాతలో లేకపోవచ్చు. ఆమె హృదయంలో, ఎల్లప్పుడూ ఒకే ఒక వ్యక్తి, ఎప్పటికీ భర్తీ చేయలేని ఒక ప్రేమ ఉంటుంది. సంజయ్ ఎల్లప్పుడూ ఆమె ఆత్మలో ఆ పవిత్ర స్థానాన్ని కలిగి ఉంటాడు.
కానీ జీవితం ఆమెను ముందుకు సాగమని కోరుతోంది, అది మరొక పురుషుడిని అంగీకరించడమే అయినప్పటికీ. ఆమె గతాన్ని పూర్తిగా మరచిపోలేకపోయినా, తన ఎంపిక తనకు మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి కూడా అవసరమని ఆమె అర్థం చేసుకుంది.
పెళ్లికి సిద్ధమవుతూ, హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీ చిహ్నాలైన సిందూరం, గాజులను అలంకరించుకుంది ప్రమీల. ఆమె తన బాధను చుట్టూ ఉన్న ప్రపంచానికి వదిలి ముందుకు సాగుతున్నట్లు అనిపించింది. కానీ ఆమె హృదయంలో, ఆమెకు నిజం తెలుసు. ఆమె మొదటి ప్రేమ జ్ఞాపకాలు నివురు కప్పిన నిప్పుకణికలా నిశ్శబ్దంగా, శాశ్వతంగా ఉంటాయి.
అయితే, ఆ జ్ఞాపకాలు తన వర్తమానంపై నీడల్లా మారకూడదని ఆమె నిశ్చయించుకుంది. ఆమె జీవితంలోని ఈ కొత్త దశలోకి అడుగుపెడుతున్నప్పుడు, ఆమె తన గత భారాన్ని, మరో భవిష్యత్తు ఆశను మోసుకెళ్తోంది.
బినోద్ సూచనల ప్రకారం, తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన తన పదవ తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఇంకా పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మొదలైనవి తీసి జాగ్రత్త చేసింది ప్రమీల. ఆమె హృదయం ఆ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవించనప్పటికీ, తనకు వేరే మార్గం లేదని ఆమెకు తెలుసు.
ఆమె తల్లి, ఎంతో పట్టుదలతో ఉంది. ‘మా బృందాబతి’ ఆశీర్వాదం కోరుకోమని, ఉన్నవాటిలో చక్కని పట్టు చీర కట్టుకోమని కూతురికి చెప్పింది. ఈ సన్నాహాలు ప్రమీల కంటే ఆమె తల్లిదండ్రులకు ఎక్కువ ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. నిర్ణీత సమయం ఆసన్నమయ్యే కొద్దీ, ఆమెలో మౌనం అధికమైంది, ఆమె నిశ్శబ్దం ఆమెలోని సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. వివాహం యొక్క ఆనందం ఆమె ముఖంలో ప్రతిబింబించలేదు, వారి ముఖంలో మాత్రమే గోచరిస్తోంది.
నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ బయట వాహనం శబ్దం వినిపించింది. బండి ఇంటి ముందు ఆగగానే, తెలియని భయం ఆమెను చుట్టుముట్టింది. కొన్ని క్షణాల తర్వాత, బినోద్ అడుగులు స్థిరంగా వేస్తూ, ప్రశాంతమైన ప్రవర్తనతో లోపలికి ప్రవేశించాడు. “అన్ని పత్రాలు సిద్ధంగా ఉన్నాయి కదా?” అంటూ ఆచరణాత్మక స్వరంతో అడిగాడు.
ప్రమీల స్పందించలేదు. ఆమె మౌనం లోని బరువు ఆమె ముఖంలో వ్యక్తమైంది. మరో మాట మాట్లాడకుండా, ఆమె తన పర్సు తీసుకుని బయటికి అడుగు పెట్టింది. బినోద్ ఆమెను అనుసరించాడు.
“వెళ్దాం,” అంది, కానీ ఆమె గొంతులో ఎటువంటి భావోద్వేగం లేదు.
ఆ వాహనం ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్డు వెంట కదులుతూ ఉంది, దాని కుదుపులు మరియు కంపనాలు జీవితపు అనూహ్య ప్రయాణానికి అద్దం పడుతున్నాయి. బినోద్ మాటలను ఇంజిన్ శబ్దం, అసమాన భూతలం మింగేసాయి, అయినప్పటికీ అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రమీల మౌనంగా ఉండిపోయింది, ఆమె ఆలోచనలలో – సుడిగుండం లాంటి అనిశ్చితి.
కొంతసేపటి తర్వాత, వారు బని స్క్వేర్ చేరుకున్నారు, బినోద్ వాహనాన్ని ఆపి ఆమె వైపు తిరిగి. “కొంచెం చాయ్ తాగుదాం” అన్నాడు.
ప్రమీల తల అడ్డంగా ఊపింది. “వద్దు,” అని ఒకే మాట చెప్పి ఆమె గొంతు మూగబోయింది.
“నువ్వు ఏదైనా తినాలి. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు తినలేదు?” అడిగాడు, అతని ఆందోళనలో తేలికపాటి నింద ఉంది.
తను టిఫిన్ తినలేదన్న విషయం అతనికి చెప్పినందుకు ప్రమీల తల్లిని కోపగించుకుంది, లోలోపల మురిసిపోయింది.
“నేను తినను,” కాస్త కఠినంగా చెప్పింది.
“ఓ, పెళ్లికి ఉపవాసం ఉన్నావా?” అని తేలికగా ఆటపట్టించాడు.
ప్రమీల పెదవుల మీద ఒక మందమైన, అయిష్టతతో కూడిన చిరునవ్వు మెరిసింది.
బినోద్ వెంటనే గమనించాడు. “చాలా కాలం తర్వాత, చివరికి నువ్వు నవ్వడం నేను చూశాను,” అని ఆప్యాయంగా అన్నాడు. “దానికి కారణం నేనైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది.”
ఆమె ఏమీ మాట్లాడలేదు, మౌనం ఆమె కవచం, మరో భాష కూడా.
బినోద్ తన గడియారం వైపు పదే పదే చూసుకుంటూ మళ్ళీ వాహనం స్టార్ట్ చేసాడు. వాళ్ళు ముందుకు వెళ్తుండగా, ప్రమీల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, “కోర్టు ఎదురుగా ఉంది. మనం ఎందుకు ఈ వైపు వెళ్తున్నాం?” అంది.
కొన్ని క్షణాలు ఆగి, “నీకు దారి తెలియకపోవచ్చని అనుకున్నాను, కానీ నీకు అది బాగా తెలిసినట్లుంది – ఈ దారి, కోర్టుకు వెళ్ళే దారి రెండూనూ” అంది.
ఆమె గొంతు పదునుగా మారింది. “మనం ఎక్కడికి వెళ్తున్నాం? కోర్టు తెరవడానికి ఇంకా రెండు గంటల సమయం ఉందిగా.”
బినోద్ ప్రశాంతంగా స్పందించాడు. “నాకు వేరే ఆఫీసులో కొంత పని ఉంది. ఓ పది నిమిషాలు మాత్రమే పడుతుంది. నేను వెంటనే తిరిగి వస్తాను.”
ఆమె ఇంకేమీ అడగకముందే, వాహనాన్ని ఒక పెద్ద కార్యాలయ భవనం ముందు ఆపాడు బినోద్. వారిద్దరూ దిగి, ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానే, అతను ఆమె వైపు తిరిగి “బయట కూర్చో. నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను.” అన్నాడు.
ప్రమీల మౌనంగా తల ఊపింది, ఆమె ముఖం నిశ్చలంగా ఉంది. బినోద్ భవనంలోకి అదృశ్యమవుతుండటం, తెలియని ప్రదేశంలో తనని ఒంటరిగా నిలబెట్టడం, తన ఆలోచనలు – చుట్టూ ఉన్న నగరంలా భారీగా, అల్లకల్లోలంగా ఉండటం ఆమె గ్రహించింది.
ఒక అందమైన ఉద్యోగిని డెస్క్ దగ్గర బినోద్ నిలబడి ఉండటం గమనించింది ప్రమీల. ఇద్దరు వ్యక్తులు సమీపంలో నిలబడి ఉన్నారు, వారి ఉనికి – అక్కడి స్థితి సాధారణమే అన్నట్టుంది. వారిద్దరూ అక్కడ్నించి వెళ్ళాకా, బినోద్ ఆ ఉద్యోగినితో మాట్లాడటం ప్రారంభించాడు. సంభాషణ సాధారణంగా అనిపించింది, కానీ ఆ దృశ్యానికి సంబంధించి ఏదో ప్రమీలను కలవరపెట్టింది. తమ మాటలు ముగియగానే, బినోద్ తలుపు వైపు తిరిగాడు, కానీ అక్కడ ప్రమీల లేదు.
అతను బయటకు అడుగు పెట్టాడు, అతని కదలికలలో స్వల్ప ఉద్రిక్తత కనిపించింది, ఆమె కోసం వెతుకుతున్నాడు. ప్రమీల సమీపంలోని రావిచెట్టు కింద, ఆఫీసు దగ్గర కుర్చీలో కూర్చుని ఉండటం గమనించాడు, ఆమె భంగిమ నిటారుగా ఉంది, ఆమె ముఖం అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత తీవ్రంగా ఉంది. జాగ్రత్తగా దగ్గరకు వచ్చి, అతను వాహనాన్ని స్టార్ట్ చేసి,
“ప్రమీలా, వచ్చి కూర్చో.” అంటూ పిలిచాడు.
ఆమె కదలలేదు, ఆమె చూపు మరెక్కడో నిలిచిపోయింది. బినోద్ హారన్ మోగించాడు, కానీ ఆమె కదలలేదు. చివరికి, ఈసారి మళ్ళీ బిగ్గరగా పిలిచాడు: “ప్రమీలా, ప్రమీలా, రా, వెళ్దాం.”
ఆమె దగ్గరికి రాగానే, “ఏమైంది? నీకు ఏమైంది?” అడిగాడు.
ప్రమీల వెంటనే స్పందించలేదు, ఆమె మౌనం భారంగా, ఉద్దేశపూర్వకంగా ఉంది. అతను ఆమె చేతిని అందుకోవడానికి చేయి చాపినప్పుడు, ఆమె తన చేతిని వెనక్కి తీసుకుంది, ఆమె చర్యలు ఆమె ముఖ కవళికల వలె పదునుగా ఉన్నాయి.
“ఆఫీసులో ఆమెతో ఏం మాట్లాడావు?” ఆమె హఠాత్తుగా అడిగింది, ఆమె గొంతు ప్రశాంతంగా ఉంది కానీ కఠినంగా ఉంది.
బినోద్ ఆశ్చర్యపోతూ ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు. “నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను ఆమెతో ఎఫైర్ నడుపుతున్నానని అనుకుంటున్నావా?”
ప్రమీల ఘాటుగా నవ్వింది. “ఆమె, ‘నిర్మూలీ లత’ (వేర్లు లేని తీగ) ను పెళ్ళి చేసుకునేంత తెలివితక్కువది కాదు. అర్హత ఉన్న స్త్రీకి ఈ ప్రపంచంలో సరైన వరుడు దొరకడని అనుకుంటున్నావా?”
“వేర్లు లేని తీగనా?” బినోద్ మళ్ళీ అన్నాడు, అతని గొంతులో బాధ.
ప్రమీల దృష్టి చలించలేదు. “నేను అక్కడే ఉన్నాను, బినోద్. నేను అన్నీ విన్నాను. ఆ సంభాషణ ద్వారా నీ నిజస్వరూపం నాకు తెలిసింది.”
“ప్రమీలా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు!” అన్నాడు, ఇప్పుడు అతని గొంతు బతిమాలుతోంది.
“నటించడం ఆపు,” ఆమె చల్లబడిన స్వరంతో అంది. “నువ్వు నన్ను ప్రేమించలేదు. నీకు సౌకర్యంగా ఉండటం వల్లే నటించావు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే, పెళ్లికి ముందు కూడా ఇక్కడికి వచ్చి ఉండేవాడివి కాదు – నా నెలవారీ పెన్షన్, బీమా డబ్బులు, ఓ దివంగత సైనికుడి భార్యకి ఇచ్చిన ఖరీదైన ఫ్లాట్ గురించి అడుగుతూ ఉండేవాడివి కాదు. ఆ ఉద్యోగిని నీకు ఏం చెప్పింది? నా ఆర్థిక విషయాల గురించి నువ్వు ఎంత సమాచారం సేకరించావు?”
“నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు,” బినోద్ తడబడ్డాడు, ముఖం పాలిపోయింది.
ప్రమీల గొంతు పదునుగా ఉంది, ఆమె మాటలు గుచ్చుతున్నట్టుగా ఇన్నాయి. “ఇందులో ఎలాంటి అపార్థం లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి నీ తల్లి పెన్షన్ మీద బతికావు, ఇప్పుడు నా పెన్షన్‌తో బతకాలని అనుకుంటున్నావు. నీ ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి.”
బినోద్ కళ్ళు దించుకుని, మౌనంగా ఉండిపోయాడు.
“నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు,” అని ప్రమీల స్థిరంగా, దృఢంగా చెబుతూనే చెప్పింది. “నీకు ఆర్థికంగా ఆసరా ఇచ్చే వ్యక్తి కావాలి. కానీ నేను పెళ్లి చేసుకుంటాను. మర్యాద, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిని, తన కాళ్లపై నిలబడగల వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను.”
బినోద్ ముఖం చిట్లించి పైకి చూశాడు, కానీ ప్రమీల మాటలు ఇంకా పూర్తి కాలేదు. “బలహీనంగా ఉండి నిరంతరం మద్దతు కోరుకునేవారు నిజంగా ప్రేమించలేరు. వారి అనురాగం కేవలం నటన. బలమైన, స్వతంత్రమైన వ్యక్తి మాత్రమే నిజంగా పెళ్ళికి అర్హుడు.”
ప్రమీల ముందుకు అడుగు వేసి, అటుగా వెళ్తున్న ఆటోని ఆపడానికి తన చేతిని పైకెత్తింది. ఆటో ఆమె ముందు ఆగగానే, ఆమె చివరిసారిగా బినోద్ వైపు తిరిగింది.
“థాంక్యూ బినోద్,” ఆమె మృదువుగా కానీ దృఢంగా గొంతుతో అంది. “నువ్వు నాలో – మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే కల లాంటి ఒక ఆలోచన కల్గించావు. నువ్వు ఎప్పటికీ నాకు మంచి స్నేహితుడివి మాత్రమే. ఇంకేమీ కాదు.”
సమాధానం కోసం వేచి ఉండకుండా, ఆమె ఆటో ఎక్కింది. అది కదిలి వెళ్ళిపోతుండగా, బినోద్ ఆ ప్రదేశంలోనే కదలలేని స్థితిలో ఉండిపోయాడు, ఆమె మాటల బరువు గాలిలో ప్రతిధ్వనిస్తోంది, వాటిలోని నిశ్చయత్వాన్ని కాదనలేము.
![]()
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్‍పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.



Discussion about this post