ఒడియా మూలం అరవింద్ రాయ్
అనువాదం- బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
‘తర్వాతి గోస్వామి ఎవరు?’
ముకుంద మహాపాత్ర అడగనే అడిగేశాడు. అందరినీ బాధించే ప్రశ్న అది. అడిగి అక్కడ గుమిగూడిన జనాలవైపు దృష్టి సారించాడు.
ఊళ్ళో ఎప్పుడూ అందరికన్నా ముందుగా మాట్లాడే గతనాథ్ పరిజా, ‘మహాపాత్ర గారూ, మీ మాటమీద ఊరందరికీ గురి. మీరే చెప్పండి.’ అన్నాడు
నితాయీ తివాడీ, కల్పించుకొని, ‘గోస్వామి వెళ్ళిపోయి రెండు రోజులైపోయింది. చూస్తుండగానే ఇరవైఒక్క రోజులు కూడా గడచిపోతాయి. ఇక రాధామాధవుని పూజా అర్చనలు ఎలా జరిపేది అనేదే ప్రశ్న.’ అన్నాడు. ముకుంద మహాపాత్ర కళ్ళు మూసుకొని పైకి చూశాడు. తిలకం పెట్టుకున్నట్టు నాలుగు వేళ్ళతో నుదుటిమీద రాసుకున్నాడు. తర్వాత గంభీరంగా, ‘గోస్వామి కావడం చాలా గొప్పపని. మనస్సుతో హృదయం లోతుల్లో నుంచి పిలుపు రానంతవరకూ ఈ మామూలు మనుషులు గోస్వాములు ఎలా అవుతారు?’ అన్నాడు.
‘అంటే?’ గడ్నాథ్ పరిజా అమాయక విద్యార్థిలా అడిగాడు. లలాట లేఖ అంటే ఏమిటి? లలాట లేఖ అనేదుందా? ఎవరి నుదుటిరాతలో విధాత దేవుని సేవ రాశాడో వాడిలో శూన్యపురుషుడు హుంకరిస్తాడు. వాడు మదపుటేనుగు లాగా పిచ్చిపట్టినట్టు ఆడతాడు. శరీరపు అష్టాంగాల్లో పులకలు కలుగుతాయి. హరినామ మహామంత్ర కీర్తనలో మునిగిపోతాడు. హర్షము, వణుకు, చెమట, మూర్ఛ, భూమిపై పడిపోవడం, తల కొట్టుకోవడం అనే లక్షణాలు కనిపిస్తాయి అతనిలో. వాడు పిచ్చివాళ్ళలాగా రాధాభావంలో మూర్తి వంక ఆకర్షితుడవుతాడు.
పీతేయీ గ్రామమంతా స్తబ్ధమై ముకుంద మహాపాత్ర మాటలు వింటోంది. మహాపాత్ర అలా మాట్లాడుతూనే ఉండిపోయాడు. ఆహా! ఆ భావము, ఆ ప్రేమ! ‘అయితే రాధామాధవులు పూజలందుకోలేరా?’ కూడిన జనాల్లోంచి ఒకడు అడిగాడు.
అప్పటికంతా ఆవుపొదుగులా దట్టమైన నల్లని మబ్బులు అలముకున్నాయి. వాన పడబోతుందనే సూచనలనూ ఇస్తున్నాయి. ముకుంద మహాపాత్ర ఒక క్షణం ఆకాశం వంక చూశాడు. ‘నల్లని కాటుకవంటి మబ్బులను చూసి నెమలి ఆడినట్లు, రాధామాధవుల సేవకై తపించి ఆడేవాడే మఠం యొక్క కొత్త గోస్వామి’ అన్నాడు.
మహాపాత్ర మాట విని అందరూ స్తబ్ధులైపోయారు. ఎవరి నోటా మాట పెగల్లేదు. ఒకరిముఖాలొకరు చూసుకున్నారు.
నెమలిలా ఆడేదెవరు?
హరినామం పాడుతూ మూర్ఛపోయేవాళ్ళెవరు?
ఎవరిలో ఆ శూన్యపురుషుడు హుంకారం నింపుతాడు? ఎవరు అతడు? ఆకాశంలో మబ్బులు వర్షించసాగాయి. ఉండుండి పడుతున్న ఒలిపిరి నుంచి, పిడుగుల నుంచి రక్ష కోసం దేవుని కోసం తయారైన కొమ్మల గొడుగులో ఎంతమంది తలదాచుకోగలరు? చుట్టుపక్కల ఇళ్ళు, వరండాల వైపు పరిగెట్టసాగారు. కొందరు పూర్తిగా, కొందరు సగం తడిశారు. కొందరిపైన పూర్తిగా బురద. ఆకాశం మెరుపులు, ఉరుములుగా ఉంది. వాన ఆగే ప్రసక్తే లేదంటోంది. వానతో పాటు ఆ రాత్రిపూట చీకటి కూడా చిక్కనౌతోంది. ఇప్పుడేమవుతుందో!
ఏడుతరాల రాధామాధవ మఠమిది! ఈ మఠానికి ఉత్తరాధికారి ఎవరు అనే ప్రశ్న ఈ వాననీటిలో కొట్టుకుపోయే గడ్డిపరకలా అపశబ్దమై కొట్టుకుపోతుందా? ఈ మబ్బుల ఉరుముల్లో ముకుంద మహాపాత్ర వికలమైన స్వరంతో గట్టిగా, జై రాధామాధవ్ జై రాధామాధవ్ అని అరిచాడు. మఱ్ఱిచెట్టు కింద వెన్నెల నుంచి, తివారీ బస్తీలో డాబా, పరిడా బస్తీ లోని ఢంకీశాల, నితియా మిఠాయివాలా అంగడి ఇలా అన్నివైపుల నుంచి ఒకే స్వరంలో బదులొచ్చింది. జై రాధామాధవ్ కీ జై అని. మళ్ళీ ముకుంద మహాపాత్ర శోకార్తుడై, ‘ ఓ రాధామాధవా! ఈ మహా విపత్తు నుంచి గట్టెక్కించు’ అని అన్నాడు. ఆ వెనువెంటనే ఒక్కుమ్మడిగా ‘రక్షించు ప్రభూ రక్షించు’ అని ఆ గొంతులు పలికాయి.
నిర్విరామంగా అంత వానలోనూ జనాల గొంతులు గ్రామ సరిహద్దు దాటి ధాన్యపు గిడ్డంగులు, కేవడే, స్మశానవాటిక వరకూ వినిపించాయి.
అంత వర్షంలో , చిక్కటి చీకటిలో ఎవరో, ‘చూడు, చూడు, ఆ బురదలో పొర్లుతున్నాడు’ అన్నాడు. ఇంకొకడన్నాడు, ‘అవును కదా! ఛాతీ మీద కొట్టుకుంటున్నాడు. వానంటే లెక్కే చేయడం లేదు. పిడుగుల భయం లేదు. పూలశయ్య మీద హాయిగా పడుకున్నట్టు మోకాలి వరకున్న నీటిలో ఆ బురదలో పడుకున్నాడు. ఊరికే పడుకోలేదు. ఏదో స్వరబద్ధంగా ఏడుస్తున్నాడు. అలాంటి బురదలో పడుతూ లేస్తూ, సప్నా తివారీ వాళ్ళ డాబా మీదికి చేరి, సప్నా తివారీ, ‘ఒరేయ్ ఎవరు నువ్వు?’ అనడిగింది.
‘నేను గోస్వామినవుతాను.’ ఇంతసేపు మట్టి బురదలో ఉన్న వాడు నోరు తెరిచి పలికాడు.
ఇంకా మబ్బులు కురుస్తున్నాయి. ముకుంద మహాపాత్ర పరుగుపరుగున వచ్చాడు. ఆ బురదలో పితోయి పురం వాళ్ళు ఈ వానను లెక్క చేయలేదు. ఆ కొత్త మనిషి మొగం చూడ్డానికి పరుగున వచ్చారు.
మట్టిలో పడుకుని ఆ మనిషిదగ్గర వంగుతూ మొదటగా గడనాథ్ పరిజా, ‘ఒరేయ్ అభి నువ్వా?’ అన్నాడు.
అభి! అభయ్ మహాపాత్ర! సుధాకర్ నడిపి కొడుకు. పదిహేడేళ్ళు కూడా నిండలేదు. ఈ ఏడు మెట్రిక్ రాశాడు. వీడు తప్ప ఊళ్ళో అందరు పిల్లల్లు పాసయ్యారు. రిజల్ట్ వచ్చినప్పుడు సుధాకర్ వీడ్ని బాగా కొట్టాడు. ‘బద్మాష్ గాడా, తినడం తాగడం తిరగడం తప్ప చదువులో గుండుసున్నా! బద్మాష్! ఎప్పుడూ చెరువులో మునగడం, చేపలు పట్టడం. ఎప్పుడు చూసినా పాములు పట్టేవాళ్ళ పిల్లలతో తిరగడం, కంజీర కొట్టే కచేరి జేయడం. పుస్తకం ముట్టుకోవు.’ అంటూ బాగా దెబ్బలు తగిలించాడు. మళ్ళీ మళ్ళీ కొడుతూ, ‘అయిందేదో అయింది. ఈరోజు నుంచీ పుస్తకాలు పట్టుకో. రెండు నెలల్లో సప్లిమెంటరీ’ అన్నాడు. అభి ఏడుస్తూనే ‘నేను చదవను’ అన్నాడు. అభి మాటలు విని సుధాకర్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ‘వెధవా! చదువుకోకేం జేస్తావురా? సత్రంలో దిని మఠంలో పడుకుంటావా? దరిద్రుడా! కూలోళ్ళతో కలిసి కోళ్ళు పడ్తావా?’ అని అరిచాడు. అభి మాత్రం ఒకే రాగం పట్టుకున్నాడు. ‘నేనింక చదవను. అస్సలు చదవను.’ అని బురదలో దొర్లుతున్నాడు. మదపుటేనుగులా పిచ్చెక్కినట్టు జేస్తున్నాడు.
ముకుంద మహాపాత్ర, ‘ఒరే అభి, లేరా!’ అన్నాడు.
‘ఊహూఁ.. నేను గోస్వామినవుతా. గోస్వామినే’ బురదలో కూలబడి చెప్పాడు. అందరూ ముకుందుని ముఖం చూశారు. మహాపాత్ర అందరినీ చూశాడు. తక్షణం ఒక్క పరుగుతో అభి వాళ్ళ నాన్న సుధాకర్ మహాపాత్ర దగ్గరికి వెళ్ళాడు.
ఊరి దార్లో బురదలో చెట్టుకొమ్మ విరిగి పడినట్టు పడిన తన కొడుకును చూసి అతన్ని లేపడానికి తగ్గాడు. ‘నాయనా, లేరా! లే. నేనింక కొట్టనులే. చదువుకొమ్మని కూడా చెప్పను. నీ ఇష్టం. పద ఇంటికెళ్దాం.’
‘వద్దు. నన్ను ముట్టుకోవద్దు. నేను గోస్వామినవుతా. రాధామాధవుడు నన్ను పిలుస్తున్నాడు. నేను గోస్వామినవుతా. తాకొద్దు.’ అని అభి అనడం విన్న సుధాకర్ వెనుకంజ వేశాడు.
ఏమన్నాడు అభి? ఇది అభి గొంతేనా? లేక ఇంకెవరైనా మాట్లాడుతున్నారా?
ముకుంద్- సుధాకర్ వీపు తడుతూ, ‘చిన్నబుచ్చుకోకు సుధాకర్! నీ కొడుకుగా ఉన్నంత కాలం ఉన్నాడు. ఇప్పుడు ఆ లీల ముగిసింది. ఇప్పుడు మహాభావ లీల మొదలైంది.’ సుధాకర్ ఏమీ అర్థం కానట్టుగా మహాపాత్ర వైపు చూశాడు. అంతలో అక్కడున్న జనాలంతా ఒక్క పెట్టున ‘జై రాధామాధవ్ కీ జై! కొత్త గోస్వామికీ జై! అని అరిచారు.
ముకుంద మహాపాత్ర వంగి బాలుడ్ని లేవనెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. వాన ఆగింది. మృదంగము, తాళాల ధ్వని పెద్దగవుతోంది. ముకుంద మహాపాత్ర, ‘నాయనా, ఈ మార్గము చాలా కఠినమైనది.’ అని అభి చెవిలో చెప్పాడు. అందుకు సమాధానంగా అభి, ‘జై రాధామాధవ్! జై రాధామాధవ్’ అని ఊరుకుండిపోయాడు.
‘నాయనా! ఈ మార్గములో చాలా సంయమనం పాటించాల్సి ఉంటుంది. తల్లి, తండ్రి, ఇల్లు-వాకిలి, అన్న- వదిన అందరినీ అన్నిటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది.’ చాలా అనునయంగా ముకుంద్ చెప్పి, అభి ప్రతిస్పందన కోసం చూశాడు. అభి ఏడ్చేశాడు. రెండు చేతులనూ పైకి చేతన ముద్రలో ఎత్తి ‘నేను గోస్వామినవుతాను. గోస్వామినవుతాను’ అంటూ చిలుక పలుకుల్లా పలికాడు.
రఘు తివారీ, ‘మహాపాత్ర గారూ, ఇంకాలస్యం చేయడం తగదు. దేవుని ఇచ్ఛ ఏదో అదే జరుగుతుంది. పదండి. కొత్త గోస్వామి అభిషేకానికి సిద్ధం చేద్దాం.’ అన్నాడు.
అప్పుడు వచ్చింది అభి వాళ్ళమ్మ, అంతవరకూ ఎక్కడుండిందో గానీ తుఫాన్లా వచ్చి పడింది. కాయస్థుల ఇంటి కోడలు కదా ఆమె! ఎప్పుడో గానీ బయటకు రాదు. ఆమె బయట తిరగడం ఎవరూ చూడలేదు. కాయస్థుల బస్తీ అంటే ఊరంతటికీ ఎంతో ఆదరం. వరదల్లో ఇల్లూ వాకిలీ కొట్టుకుపోయినా, కాయస్థ ఇండ్ల ఎత్తైన వరండా దిగలేదు అభి వాళ్ళమ్మ. ఆరోజు అన్ని కట్టుబాట్లు తెంచుకొని మట్టీగారల నేల మీదికి ఇంతమంది మధ్యలోకి వచ్చింది. ఎంతగా పరుగెత్తి వచ్చిందంటే ఆమె చీరకంతా బురద అంటుకుంది. మనిషి వికలమై ఆరుస్తోంది. ఎవరిదో లాంతరు వెలుగుతోంది. ఆ వెలుతురులో ఆమె ముఖంలోని క్షోభ కనిపిస్తోంది. చిన్నపిల్లాడిలా అభిని ఒడిలోకి తీసుకొని ఏడ్చేసింది. ‘నా తండ్రీ! అలా అనకురా. పద ఇంటికి పద.’ అభి ఒక క్షణం అమ్మ ముఖంలోకి చూశాడు. అందరూ స్తబ్ధులయ్యారు. ఇక ఇప్పుడు ఆ పిల్ల వాడు గోస్వామి కావడం కుదరదేమో అనుకున్నారు. వాడి లోపలి శూన్యపురుషుడేమయ్యాడు? పైకి చేయెత్తి వాడు పిచ్చివాడైపోయాడా? అమ్మ స్పర్శలో ఏ మాయ ఉందో! పిల్లవాడు ఇప్పుడే బంధనాలు తెంచుకొని మహాభావంలో లీనమై పోయాడనుకునేంతలో మాయావి జీవిలాగా అందర్నీ ఎగాదిగా చూస్తున్నాడు. అభి వాళ్ళమ్మ పిలుస్తోంది, ‘రారా నాయనా! మనకేం వద్దులే చదువులు. చదువులకు అగ్గి బెట్ట! దేవుని దయతో మనకున్నది చూసుకుంటే భుక్తికి లోటుండదు.’ అంటోంది.
అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడేం జరుగుతుంది? ఇక మఠానికి గోస్వామి అయ్యేదెవరు?
ఉన్నట్టుండి విషసర్పాన్ని చూసినట్లు వాళ్ళమ్మని చూస్తూ అభి దూరం జరిగాడు. ‘నీవెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్పానుగా గోస్వామినవుతానని’ అంటూ గట్టిగా అరిచాడు. వాళ్ళమ్మ కూర్చున్న చోటే బురద పడిన ఆ వరండాలోనే తలబాదుకుంది. చేతులు పట్టుకుని అభిని ఎంతో వేడుకుంది. అయినా సరే అభి తన మాటమీద దృఢంగా ఉండిపోయాడు. ఏమాత్రం చలించలేదు. పైగా ఇంకా గట్టిగా అరిచాడు.‘నేను గోస్వామినవుతాను’ అని ఉరిమినట్టే పలికాడు. అందరూ జై రాధామాధవ్ జై జై కొత్త గోస్వామి మహరాజ్ జయజయధ్వానాలు చేశారు. రథయాత్రలో పల్లకీనెత్తినట్టు జనాలు కొత్త గోస్వామిని భుజాలకెత్తుకొని ఊరేగించారు.
వాన ఆగింది.కానీ ఊరి దారులంతా నీటిమయంగానే ఉన్నాయి. గాలి హోరున వీస్తోంది. చీకట్లు అలముకుంటున్నాయి. పితేయి పూర్ గ్రామంలో ఒక విచిత్ర వాతావరణం నెలకొని ఉంది. అదే రాత్రి ధనమహారాణా కొత్త గోస్వామికోసం ఒక కొత్త జత పాదుకలు చేయించి ఇచ్చి వెళ్ళాడు. పొద్దున్నే లేపి అతడికి ముండనం చేయించారు. మృదంగము, కరతాళ ధ్వనుల మధ్య హరిభజనలతో ఊరు ఊరంతా దద్దరిల్లింది. ద్రోందువా మఠంనుంచి మహంత్ మహరాజ్ వచ్చాడు. కొత్త గోస్వామికి గురుమంత్రం ఉపదేశించాడు. కౌపీనము, మాల, తిలకము బహూకరించాడు. ధ్యానము, భజన నియమాలను ఉపదేశించాడు. తర్వాత, ‘అనుకున్నట్టుగా రాధామాధవుని ఇచ్ఛాపూర్తి అయింది’ అన్నాడు. గుమిగూడిన జనాలతో ప్రసన్నవదనంతో ‘జై రాధేశ్యామ్ సుందర్’ అని అనగానే జనులంతా జై జై శ్రీ నితాయీ గౌర్ కూ జై, జై శ్రీ వృందావన ధామ్ హరినామ సంకీర్తనకూ జై అని జయజయధ్వానాలు చేస్తుండగా గోస్వామి అభిషేకం పూర్తయింది.
అభి కొత్త గోస్వామిగా రూపాంతరం చెందాడు. ఇదిగో మఠం తాళంచెవుల గుత్తి. ముకుంద మహాపాత్ర లెక్కల చిట్టా పుస్తకాలు కొన్ని గోస్వామి పాదాల వద్ద పెట్టి సాష్టాంగప్రణామం చేసినప్పుడు కొత్త గోస్వామి మెల్లగా నిష్క్రమిస్తూ, అభి మేలుకోసాగాడు. ముకుందుడిని పట్టుకొని, ‘మీరు నాకు తాతగారు. నాకు మీరు నమస్కరించడం ఏమిటి?’ అని అడిగాడు.
ముకుందుడు చేయి నోటి మీద పెట్టుకొని, ‘అహ, అలా అనవద్దు. ఇప్పుడు మీరు ఎవరి కొడుకు కాదు. ఎవరూ మీ తల్లిదండ్రులు కాదు. ఎవరికీ మీరు మనవడు కాదు. తాత ఎవరూ లేరు. ప్రపంచంతో మీకు ఎటువంటి పార్థివ సంబంధం లేదు.’ అన్నాడు.
అభి ఉలిక్కిపడ్డాడు. ఏంటి తాత ఇలా అంటున్నాడు! నేనెవరినీ అమ్మా నాన్న అని పిలవకూడదా? నీరూ బావను బావ అనకూడదా? నిజంగా ఇక ఇంటి గడప దాటి లోపలికి వెళ్ళకూడదా? తులసీమాల మెళ్ళో పడిందంటే మెడ బిగుసుకున్నట్టేనా? తానిక ప్రపంచంతో సంబంధమే లేనివాడినైపోవాలా? ముకుంద్ మామ కంట ఎక్కడ పడుతుందో అనే సిగ్గుతో ముఖం దాచుకోడానికి తన తెల్లని ధోవతితో ముఖం తుడుచుకున్నాడు. ముకుందుడు అభికి ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. ఊళ్ళోనుంచి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. అభి పాదాలకు నమస్కారం చేశారు. ఒక్కొక్కరూ పాదాలు తాకేకొద్దీ అభికి మెడలో లావాటి పాములా చుట్టుకున్న మాలను తుంచి పారేయాలనిపించింది. నొసటిపైన ఉన్న తిలకం కూడా బరువుగా అనిపిస్తోంది. ఇంత పెద్ద ప్రపంచంలో తను ఏకాకిగా అనిపించడం మొదలైంది. ఇటూ అటూ, ఇల్లు, చెట్టూ చేమా, మనుషులు, తోటలు అన్నీ అపరిచితంగా కొత్తగా కనిపించాయి. గోయిపూర్ హైస్కూల్ ప్లేగ్రౌండ్ గుర్తొచ్చింది. ఆ పెద్ద మైదానంలో స్కూల్ అయిపోయాక ఫుట్ బాల్ ఆడిన రోజులు గుర్తొచ్చాయి. తర్వాత వానలో ఎవరికీ తెలీకుండా సహారా చెరువులో చేపలు పట్టడం గుర్తొచ్చింది. కోతలైపోయిన పొలాల్లో గాలిపటాలెగరేస్తూ పరుగెత్తే దృశ్యాలు కళ్ళముందు ఆడుతున్నాయి.
గతాన్ని తలచుకోవాలని అనిపిస్తోందెందుకో అభికి. ఎప్పుడైనా ఓ సాయంకాలం చెరువు గట్టున కూర్చొని చిట్వా ఫలహారం గురించి మాట్లాడుకుంటూ తింటుంటే పత్తి అగ్గికి అంటుకున్నంత వేగంగా కలియా లేచి నిలబడేవాడు. రేపు చెరువులో చేపలు పడతారు. లేదా ఎవరి తోటలోంచైనా కోడిని ఎత్తుకొచ్చేస్తారు. వీటికంతా సరైన ప్లాన్ వేస్తారు. ఒకసారి దొంగతనంగా కోడినెత్తుకొచ్చి వండుకొని తింటుంటే సోరీ వాళ్ళమ్మ వాసన గుర్తుపట్టి అక్కడికొచ్చేసింది. సాహూ తాత కనుమూశాక సోరీ వాళ్ళమ్మ గురించి తలోరకంగా అనుకున్నారు. అవ్వకు ఉపవాసం ఉండాలని లేనే లేదు. జిహ్వచాపల్యం ఎక్కువ. తాత పోయాక ఆమె ఎవరికీ తెలీకుండా కోళ్ళు, చేపలు తింటుందని చెప్పుకుంటారు జనాలు. కళ్ళంలో ఉండే పశువుల కొట్టంలో వేయించుకొని తింటుందంట. ఒక మాట అభికి బాగా గుర్తుంది. అప్పట్లో బస్తీ పిల్లాడొకడు ఎందుకో బాగా ఏడుస్తుంటే, జనాలు సోరీ వాళ్ళమ్మ దయ్యం దృష్టి తగిలిందని చెప్పుకున్నారు. సోరీ వాళ్ళమ్మ దయ్యం ఎలా అయిందో మాత్రం అభికి అర్థంకాలేదు. అసలేం గుర్తుందంటే, ఎండాకాలంలో పేకాడుతూ హాకుందా హాకుందా అంటూ ఒక విల్లులాగా బాంకే వెదురు మీద కూర్చుని ఎగరడమే. కుదు కుదు తిను కుదు తిను అంటూ వెదురు గుఱ్ఱం బొమ్మకు ఉత్తుత్తి మట్టి తినిపించేవాడు. వాడి నెత్తిమీద, ఎండుటాకులు, పక్షిఱెక్కలతో తయారైన టోపీ ఉండేది. ముక్కు వరకూ మామిడాకుల గుచ్ఛం. గుఱ్ఱంలా ఎగిరేదది. పేకాట కాల్ బేలియా. రాజో మంత్రో అనుకునేటట్టుంది పేరు. తల క్రిందికి కాళ్ళు పైకి చేసి ఒకరోజు చెప్పాడూ, ‘చూడు దయ్యం ఇలాగే మలం తింటుంది అని.’
వినగానే అభి ఆరోజు ఉలిక్కి పడ్డాడు. సోరీ వాళ్ళు ఎందుకు మలం తినేది? ఛీ! సోరీ వాళ్ళమ్మ గుర్తురాగానే అభి కండ్లలో నీళ్ళు తిరిగాయి. కళ్ళు తిప్పి చుట్టూ చూశాడు. ఈ కొత్త గోస్వామి కండ్లను ఎవరూ చూడడం లేదుగా? అభి మనసులో ఆలోచించాడు. ఆరోజు సోరీ వాళ్ళమ్మ కోడి రసం తాగడానికి ఎన్ని సాకులు చెప్పింది! సోరీ వాళ్ళమ్మ సంగతిలాగే ఇంకెన్నో సంగతులు అభి మనసులోకి వస్తున్నాయి. అప్పుడు మనసులోనే అనుకున్నాడు. ‘ఊహూ నేనిప్పుడు ప్రపంచం త్యాగం చేసిన సన్యాసిని. ఈ జనాలతో నాకేం పని? వీళ్ళను గుర్తు చేసుకునే పని లేదు. కన్నీళ్ళు పెట్టుకునే అవసరమేంటి? ఇవన్నీ మనసులోకి రావడం పాపం కాదూ!’
ఒక సారి కాదు చాలా సార్లు పాపము- పుణ్యము అనే ఈ ఎండానీడా ఆటలో పుష్యమాసపు ఎండలా ఐదేళ్ళు ఎలా చప్పున గడచిపోయాయో తెలీనేలేదు. ఊరి దారిలో బురదలో దొర్లిన మొండి అభి ఎప్పుడు కొత్త అభిలా మారిపోయాడో తెలీనే లేదు. పొద్దున్నుంచీ సాయంత్రం దాకా మఠం నాలుగ్గోడలు, మఠం సామాన్ల గది, దుమ్ము-ధూళి లో వేలాడే సాలీడు గూళ్ళవాసన, ఆ పాత పెట్టె, పెట్టెకు ఉన్న ఉన్ని బట్టలనుంచి మొలిచినట్టు రెండు చిన్న పెట్టెలు అటూ ఇటూ. కుడివైపున ఉన్నవి భజన తాళాలు, గుడ్డలో చుట్టి ఉంచిన మృదంగం తాళాలు, ఎడమ వైపున దేవుని పాత్రలు, కూరల గిన్నెలు. రోజూ చూసే ఇవే వస్తువులు, గంటల గణగణలు, మధ్యలో తులసి, చందనంతో పాటు సంపెంగల పరిచయమైన వాసనలు. ఇంతకన్నా కొత్త సంగతేమీ ఉండదు. ఇక్కడ సుఖదుఃఖాలు మాట్లాడుకోవాలంటే ఉండేది ఒక కార్తీకే.
నాలాగే కార్తీక్ జీవితం కూడా విచిత్రమే అని కొత్త గోస్వామి గుర్తు చేసుకున్నాడు. మంగలి ఇంట్లో పుట్టాడు. ఎఱుపు రంగులో ముఖ ఛాయ, భావము భంగిమ చూస్తే బ్రాహ్మణుల పిల్లవాడిలా ఉంటాడు. యాభై ఏళ్ళొచ్చినా గడ్డాలు, మీసాలు రాలేదు. చిన్నప్పుడు కొత్త గోస్వామి విన్నదేమిటంటే కార్తిక్ చేసుకున్న పిల్ల పువ్వులా సుకుమారంగా ఉండేది. చూసినవాళ్ళంతా కార్తిక్ కు దేవకన్య దొరికిందనేవాళ్ళు. కానీ మొదటి రోజు రాత్రే దేవకన్య ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెట్టింది. గడపకు తల కొట్టుకొనికొట్టుకొని స్పృహ తప్పి పడిపోయింది. కార్తిక్ సంసారానికి పనికిరాడని తెలిసిన మరుసటిరోజే వాళ్ళన్న వచ్చి పిల్లను తీసుకెళ్ళిపోయాడు. ఆ పిల్ల మళ్ళీ ఇక తిరిగిరాలేదు. చచ్చిపోవాలని కార్తిక్ దేవీనదిలో దుంకాడు. ఆవులు మేపే కుర్రవాళ్ళు అతడిని కాపాడారు. ఆ తరువాత మళ్ళీ లుంగీతో ఉరివేసుకుందామని ఇంటి చూరుకు వేళ్ళాడాడు. వాళ్ళ పెదనాన్న గడియ పగులగొట్టి కాపాడారు. అప్పుడే మఠంలోని గోస్వాములు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. దేవుడు నిన్ను రెండు సార్లు చావునుంచి తప్పించాడు. రా ఇప్పుడిక్కడే ఉండు. దేవుని సేవ చేయి. ఈ నర దేహానికి ముక్తి లభిస్తుంది. అని చెప్పారు. తర్వాత గోస్వామి మెడలో తులసిమాల వేశాడు. అప్పట్నించీ కార్తిక్ ఇక్కడే మఠంలో ఉన్నాడు.
కార్తిక్ రంగు హంగు అలాగే ఉంది. ఛాతీ మీద ఎప్పుడూ పలచటి పోగుల తుండు వేసుకునే ఉంటాడు. ఉన్నట్టుండి ఏ గాలికో అది పక్కకు జరిగితే వెంటనే లాగి ఛాతీని కప్పి వేస్తాడు. మెడలో తులసీమాలతో పాటు బంగారు దండ ఖచ్చితంగా ఉంటుంది. ధోవతిని ఆడవాళ్ళు చీర కట్టినట్టు చుట్టి చుట్టి కడతాడు. అభి ఈ మఠంలో గోస్వామి అయినప్పటి నుంచి అతని దగ్గరే ఉంటాడు.
సాయంకాలం కావస్తోంది. మఠం ప్రాంగణంలో కార్తిక్ దేవుని గంటలు, రెండు మూడు గిన్నెలు రుద్ది రుద్ది తోముతున్నాడు. కొత్త గోస్వామి చెక్క కుర్చీలో కూర్చుని శూన్య దృక్కులతో మఠంలో సంపెంగ చెట్టును చూస్తున్నారు. అప్పుడు కార్తీక్ ఏవో కూనిరాగాలు తీయసాగాడు.
‘రేయ్! ఏం పాట పాడుతున్నావురా?’ గోస్వామి నోటి నుంచి మాట బయటికి వచ్చిందో లేదో అతడు ఉలిక్కిపడి వెంటనే తుండు తీసి ఛాతీ కప్పుకుంటూ చిన్నగా నవ్వాడు. ‘లేదు గోస్వామీ.. అలాంటిదేమీ లేదు.’ అన్నాడు.
గోస్వామి నవ్వేశాడు. మళ్ళీ సంపెంగ చెట్టు చుట్టూ అలముకుంటున్న చీకటివైపు చూశాడు.
‘అర్థమైందా గోస్వామీ! ఈ లోకమే ఎంతో లోతైన ఒక విద్య.’
కార్తీక్ మాటకు గోస్వామి బదులు పలకలేదు.
‘ఇక్కడ తల్లీ బిడ్డా ఎవరికి ఎవరూ కారు.’ గోస్వామి దృష్టి మరల్చడానికి కొంచెం స్వరం పెంచి అన్నాడు కార్తీక్.
‘ఎందుకు? ఏమైంది?’ నిరాసక్తంగా అడిగాడు గోస్వామి.
‘ఈ పవనాలు మాటే తీసుకోండి.’
గోస్వామి విననట్టే ఊరుకున్నాడు.
‘కలకత్తాలో ప్లంబరుగా ఉన్నాడు కదా!’ కార్తీక్ తన మాటకు కోటింగ్ ఇస్తూ అన్నాడు.
గోస్వామి అయిష్టంగానే ‘ఊ’ అన్నాడు.
‘ఇంటికెప్పుడూ రాడు. పిల్లా గోడూ పట్టదు. ఇదేమైనా బాగుందా?’ పవనాలు ఎదురుగా ఉంటే చెంపకీడ్చి ఒక్కటిచ్చేలానే మాట్లాడాడు.
అప్పటికీ గోస్వామి అలాగే నిరాసక్తంగా, ‘పనిలో మునిగి తేలుతుంటాడులే’ అన్నాడు.
‘పనా! ఛ ఛ మీరెఱుగరు గోస్వామి గారూ!’
‘ఏమిటి సంగతి?’
కార్తీక్ మెల్లగా చెప్పాడు.‘పవనాలు ఒక బెంగాలామెను ఇంట్లో పెట్టుకున్నాడట.’
ఇప్పుడు గోస్వామి సంపెంగ చెట్టు మీది నుంచి దృష్టి మళ్ళించి కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ కొంచెం ఉత్సాహంగా ‘మీ ఇంటామె బాగుంటుందా, బాగుండదా?’ అని అడిగాడు.
గోస్వామి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. కార్తీక్ ఈ మాటలన్నీ నాకెందుకు చెప్తాడు? నాకూ పవనాలుకూ ఏంటి సంబంధం?’ మనసులో అప్పుడే పవనాలు, ఆ బెంగాలామె ఇద్దరూ ఉన్న ఒక అవాంఛిత కల్పిత దృశ్యం మెదిలింది.
‘ఇది సంపర్కం గోస్వామీ! పరస్త్రీ గురించి ఆలోచించడం కూడా పాపమే.’
గోస్వామి ఉలిక్కిపడ్డాడు. కార్తీక్ తన మనసులో మాట చదివేశాడా? దీర్ఘమైన నిట్టూర్పుతో మనసులో కదలాడే పవనాలు చెడు సంపర్కం సంగతిని తొలగించడానికి ప్రయత్నించాడు. యాతన పడిపోతూ పదే పదే ‘ఓ రాధామాధవా! రక్షించు. రాధామాధవా ఉద్ధరించు.’ అంటున్నాడు. కార్తీక్ ఏదో చెప్తున్నాడు. గోస్వామి లేచి వెళ్ళిపోయాడు.
రాత్రి గోస్వామి ఏదో బాధలో ఆహా ఓహ్ అంటుండడం కార్తిక్ చూశాడు. నిద్రపోలేకపోతున్నాడు. ‘గోస్వామీజీ, కాళ్ళు పట్టనా?’ అని అడిగాడు కార్తిక్. అదేం వద్దులే అన్నాడు గోస్వామి. కార్తీక్ వెళ్ళిపోయాక గోస్వామికి పాపం పుణ్యం అనే భూతం మళ్ళీ పట్టుకుంది. ఒక్కోసారి పాపం కాళ్ళమీద పడి ఉంటే, ఒక్కోసారి పుణ్యం అదే పని చేస్తోంది. తలాన్చి చూస్తోంది. ఒకసారి పుణ్యం చెదరిన సువాసనలా పనికి రానిదిగా కనిపిస్తోంటే పాపం ఎత్తున నిలబడి నవ్వుతోంది. గోస్వామికి ఆరోజు కూడా ఇలాగే అనిపించిందని గుర్తొచ్చింది.
మఠంలో గోస్వామిగా వచ్చిన చాలా రోజుల తర్వాత ఆరాత్రి సంగతి చాలా గుర్తొస్తోంది. అమ్మ చేసిన తరవాణి అన్నం, గుమ్మడి పూల కూర గుర్తొస్తున్నాయి. పొద్దున్నే దేవుని పూజ పూర్తిచేసి పాదుకలు టకటకలాడించుకుంటూ అనుకోకుండా అలా బయటి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. అక్కడ ఆగి, ‘ఇప్పుడు అమ్మ పరుగెత్తి వస్తుంది. నుదుట పట్టిన చెమట తుడుస్తుంది. నా తండ్రీ! వచ్చావా! రా! ఆకలయ్యుంటుంది. కొంచెం తరవాణి తినరా! రా’ అన్నట్టుగా తోచింది. కానీ కొంత కాలంలోనే అంతా మారిపోయింది. అమ్మ రానైతే వచ్చింది. కానీ తల నిమరలేదు. మిగతా అందరిలా కాళ్ళ మీద పడింది. భూమి మీద తలవాల్చి దండ ప్రణామం చేసింది. తల మీద కొంగు కప్పుకొని లోపలికెళ్ళిపోయింది. గోస్వామి లోపలికొచ్చాడు. రాత్రి మళ్ళీ పాపం పుణ్యం దోబూచులాడాయి. కంటి నీళ్ళు ఎప్పుడు పాపపు ఛాయగా మారాయో, తల్లి దిగులు ముఖం ఆ సముద్రాన్ని రెండు చుక్కల నీటిలా ఉఫ్ మని ఊదేసింది. గోస్వామి రాత్రంతా ఒకే బాధలో అశాంతిగా గడిపాడు. సన్యాసి అయిపోయి అమ్మకన్నీళ్ళను ఒక చిన్న విషయంగా తీసుకొని మరిచిపోవడం సరైనదో కాదో తేల్చుకోలేకపోయాడు. ఇంత అశాంతినిచ్చే ఈ బాధ ఎక్కడినుంచొస్తుందో? ఎందుకొస్తుందో?
కొన్ని రోజులకు బాధ తగ్గుతుండగానే కార్తీక్ ఇంకో సమాచారం తీసుకొచ్చాడు. ఆరోజు గోస్వామి మంచం మీద నడుం వాల్చి ఉన్నాడు. కార్తీక్ వచ్చి, ‘గోస్వామి గారూ, పరిడా కోడలు దర్శనానికి వచ్చింది.’ అన్నాడు. గోస్వామికి తల నుంచి పాదాల దాకా కరెంట్ తగిలినట్టైంది. పరిడా కుటుంబంలో వసంత్ గత వారం పెళ్ళి చేసుకున్నాడు అనే వార్త తెలుసు. వసంత్ చిన్ననాటి స్నేహితుడు. అంతే కాక కలిసి ఆటలాడేవారు. చెట్లెక్కి పిట్టల్ని పట్టుకునేవారు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్ళి సంగతి విన్నాక ఆ రోజంతా అశాంతిగా ఉండింది. ఇప్పుడు ఆ పెళ్ళికూతురు వచ్చిందంటే అశాంతి ఇంకా ఎక్కువైంది.
‘ఎక్కడ? ఎవరు?’ అని గోస్వామి కంగారు పడ్డాడు. ధోవతి సరిచేసుకున్నాడు. నుదుటి మీద చెమట తుడుచుకోడానికి చేతితో గట్టిగా రుద్దేసరికి ముక్కునుంచి నుదుటి వరకు పెట్టుకున్న తిలకం చెదిరిపోయింది. గోస్వామి ఒక శాలువా కప్పుకుని కూర్చున్నాడు. కార్తీక్ తలుపు వంక చూసి,’రా అమ్మా రా!’ అని పిలిచాడు.
ముందుగా వసంత్ తల్లి వచ్చి పాదాలు తాకింది. ఆమె వెనుక కోడలు తలమీద కొంగు కప్పుకొని వినయంగా వంగి నమస్కరించింది. ఆమెను పరిచయం చేశాక కార్తీక్ ప్రసాదం తేవడానికి లోపలికెళ్ళాడు. వసంత్ తల్లి పద్మాసనం వేసుకొని మంచం మీద కూర్చుంది. దగ్గరగా కోడలు కూడా కూర్చుంది. చీరలోంచి హంసపాదాల్లా రెండు పాదాలు కనిపించాయి. ఎఱ్ఱని అందమైన పాదాలు. పూరెక్కల కన్నా మృదువుగా అందంగా తోచాయి. పాదం చుట్టూ పారాణి ఉంది. మెడిమల మీద మువ్వలు మెరుస్తున్నాయి. వేళ్ళకు మెట్టెలు! కోడలు ఎంతో ఒద్దికగా కూర్చుంది. కానీ చీరలో రెండు పాదాలు దాగకున్నాయి.
కార్తీక్ అరిటాకులో తెచ్చిన ప్రసాదాన్ని వారిద్దరికీ ఇచ్చాడు. వాళ్ళు లేచారు. వెళ్ళిపోయారు. ఆ సాయంకాలం కార్తీక్, ‘వసంత్ బాబు గొప్ప భాగ్యవంతుడు.’ అన్నాడు. గోస్వామి, ‘ఆ మాట నిజమే.’ అన్నాడు.
‘లేకుంటే ఆ బేకారోణ్ణి ఎవరు పట్టించుకుంటారు?’ అన్నాడు కార్తీక్. గోస్వామి, ‘ఒరే కార్తీక్! ఎవరి తలరాతలో రాధామాధవుడు ఏమి రాశాడో అది.’ అన్నాడు.
‘గోస్వామి గారూ, భలే చెప్పారండి.’ అని సమర్థిస్తూ అన్నాడు కార్తీక్.
‘చూడు, ఈ మఠం నాలుగ్గోడల మధ్య బందీ కమ్మని మన తలరాత. తల్లి, తండ్రి, కుటుంబం అందరికీ దూరంగా ఉండమని, ఈ రాధామాధవునికి సేవ చేయమని ఉంది.’ గోస్వామి గొంతులో పశ్చాత్తాపస్వరం పలికింది.
‘ఇందులోనే మనకు శాంతి ఉంది’ కార్తీక్ దార్శనికుడిలా చెప్పాడు.
‘ఏం శాంతి రా కార్తీక్! వసంత్ మనకన్నా ఎక్కువ శాంతిగా ఉండడా?’ గోస్వామి ప్రశ్నించాడు.
‘అదే చెప్తున్నాను. లోకమంతా బంగారు, నగలు, బండ్లతో పాటు అందమైన స్త్రీ కూడా దొరికింది.’
‘అందమైన స్త్రీ’ అనే మాట వినగానే గోస్వామి గారు ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డారు. మాట మారుస్తూ ‘ఒరే కార్తీక్, ఏం దొరుకుతుందిరా ఆ అందంతో? లోకోక్తి వినలేదా?’
‘చిత్రంలా ప్రతిమలా అందంగా ఎంత కనిపించినా, చీల్చి చూస్తే మనిషి గాడిద ఒకటే’ అంటారు కదా’ అని చెప్పాడు గోస్వామి.
కానీ మనసులో పాపం పుణ్యం దోబూచులాట మొదలైంది. మళ్ళీ లోపల ఏదో తెలీని బాధ మొదలైంది. ఆ బాధలో అల్లాడిపోయాడు. రాత్రంతా కళ్ళు మూస్తే కళ్ళ ముందు హంసపాదాల్లాంటి ఆ పాదాలు కనిపిస్తున్నాయి. జై రాధామాధవ్ జై రాధామాధవ్ అంటూ ఆ పాదాల మీది మోహాన్ని మనసులో నుండి మళ్ళించే ప్రయత్నం చేస్తుండిపోయాడు. కానీ మనసు మరుక్షణంలోనే ఆ పాదాల చిత్రం మీదికే మరలుతోంది. ఉఫ్ ఎంత కష్టం! గోస్వామి ఆలోచిస్తూ ఉండిపోయాడు.
కూజాలోంచి నీళ్ళు తీసుకుని తాగి నిద్రపోడానికి ప్రయత్నించాడు. కానీ కళ్ళల్లోనే నిలిచి ఉంది పాదాల బొమ్మ. పరుపు మీద నుంచి లేచి ముంగిట్లోకి వచ్చాడు.
‘గోస్వామీ, ఏమయింది?’
వెనుక నుంచి కార్తీక్ ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో తెలీలేదు. కార్తీక్ మనసు గ్రహించాడు. నీళ్ళు నములుతూ గోస్వామి, ‘ఏమీ లేదు’ అన్నాడు. కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు.
రాత్రంతా మఠంలో ఈ మూల నుంచి ఆ మూలకు తిరుగాడుతూ ఉండడంలో రాత్రి ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు.
పొద్దున గోస్వామి ముఖం మీద రాత్రి తాలూకు ఉదాసీనత కనిపిస్తోంది. కార్తీక్ చురుకైన కళ్ళు ఆ విషయం పసిగట్టాయి. అడగాలనుకుని కూడా ఊరుకుండిపోయాడు.
గోస్వామి గారు దేవుని మంటపంలోకి వచ్చాడు. పూల బుట్ట తీసి కార్తీక్ మనసులో అనుకుంటున్నట్టుగా, ‘ఏమయింది గోస్వామిగారికి? ఎందుకు ఇలా శోకంతో ఉన్నట్టు కనిపిస్తుంది ముఖం? పూజలో కూడా మనసు లగ్నం కాలేదు వారికి. స్తుతులు పలుకుతూ చాలా సార్లు తడబడ్డారు. రాధారాణి మీది పూలు తీసేటప్పుడు ఒక ఘడియ పాటు అలా చూస్తుండిపోయారు. మాటిమాటికీ గట్టిగా ఊపిరి విడుస్తున్నారు. నీళ్ళు నములుతున్నారు. ఏమయిందో తెలీట్లేదు.’ అన్నాడు.
గంధం తీసి కార్తీక్ లోపలికి వచ్చాడు. దేవునికి టెంకాయ వలిచి ఇవ్వాలేమో. హండీలోంచి బొరుగులు తీయాలి.
కార్తీక్ వెళ్ళాక గోస్వామి మాధవుని మూర్తి మీద అలంకరించిన వస్త్రాలు తీసి తుడిచాడు. గంధం నీటితో అభిషేకించాడు. మళ్ళీ కొత్త వస్త్రాలతో అలంకరించాడు. మయూర చంద్రిక అలంకరించాడు. చేతిలో వెండి వేణువును ఉంచాడు. మెడలో కార్తీక్ కట్టిన పూలమాల అలంకరించాడు. ఇప్పుడు రాధామాధవుని అలంకరించాక గోస్వామి రాధారాణి పాదాల నుంచి మెల్లగా వస్త్రాలు తీస్తూ ఉలిక్కి పడ్డాడు. అరె ఇదేమిటి? ఇవి రాధారాణి పాదాలా లేక ఆ రెండు పాదాలా? గోస్వామి మళ్ళీ మళ్ళీ కళ్ళు నులుముకొని చూశాడు. వికలుడై జై రాధామాధవ్ జై రాధామాధవ్ అంటూ ఉండిపోయాడు. కానీ ఈ పదద్వయం మాత్రం అచ్చం వసంత్ వధువు హంసపాదాల్లాగే కనిపిస్తున్నాయి.
గోస్వామి చుట్టూ చూశాడు. ఎక్కడా ఎవరూ లేరు. అతని కాళ్ళు వణికాయి. ఊపిరి వేగం పెరిగింది. నుదుటన చెమటలు పట్టాయి. చేతులు వణుకుతున్నాయి. ఇదేమిటి? రాధారాణి పాదాలు ఇంత కోమలంగా మనిషి పాదాలలా వెచ్చగా తగులుతున్నాయి. ఆ పాదాలను మళ్ళీ మళ్ళీ తాకాడు. పెదవులు తాకించాడు. తర్వాత భయంతో బాధతో గట్టిగా, ‘కార్తీక్! ఓ కార్తీక్’ అని అరిచాడు.
ఉన్నట్టుండి వినిపించిన ఆ అరుపులు విని దేవుని గది లోకి పరిగెత్తుకొచ్చాడు కార్తీక్. గోస్వామి పిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఆయనను లేపబోతే, ‘నన్ను తాకకు’ అంటూ గట్టిగా అరిచాడు గోస్వామి. కార్తీక్ కు ఎందుకు ఏమి అనేది ఏమీ అర్థం కాలేదు. సందేహిస్తూ దేవుని గద్దె వైపు చూశాడు. ఉలిక్కి పడ్డాడు. దేవుడా! ఏమి జరుగుతోంది? ఏ తరంవారూ ఇలా చూసి ఉండని విషయం. ఈ రోజు రాధారాణి దేహం వివస్త్రగా ఉంది. ఎవరు చేశారిలా? దేహం మీద ఒక్క నూలుపోగు లేదు. గోస్వామి దేవుని సేవ చేస్తూ రాధారాణిని ఇలా చేశారా? కార్తీక్ ఏమాలోచించాడో విచిత్రంగా అరుస్తూ అక్కడే పడిపోయాడు.
![]()




Discussion about this post