పంజాబీ కవయిత్రి : అర్విందర్ కౌర్
అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్
రచయిత్రి, అనువాదకురాలు,కవయిత్రి అర్విందర్ కౌర్ పంజాబ్ లోని డెర బస్సి ప్రభుత్వ కళాశాల నుండి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు.చండీఘర్ లోని PGGCG – || లో ఇంగ్లిషు సాహిత్యం, మీడియా స్టడీస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవలు అందించడమే గాక దగ్గరదగ్గర 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ కళాశాలలో పని చేసారు.ఆమె చిన్న వయసులోనే జాతీయ ఆంగ్ల భాషా దినపత్రికలకు రాయడం ప్రారంభించారు. ఆమె మొదట ప్రచురించిన పుస్తకం పంజాబీ కవితల’ Kujh Kasoiley Supney ‘.
ఆమె హైకు విషయంలో విశేషంగా పని చేసారు. హిందీ , ఇంగ్లిషు హైకు లోకానికి ఎక్కువగా దోహద పడ్డారు.ఆమె ప్రచురించిన పుస్తకాలలో రెండు హైకు పుస్తకాలు , Nimolian ( పంజాబీ హైకు ) మరియు పంజాబీ,ఇంగ్లిషు భాషలలో ప్రచురించిన Dandelion Seeds వున్నాయి. ఇటీవల Cherita అనే ఒక లఘు కవితా రూపాన్ని పంజాబీ,హిందీ కవిత్వ పాఠకులకు పరిచయం చేస్తూ Under Rain Trees అనే అనువాద పుస్తకాన్ని ప్రచురించారు.ఆమె హైకులు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పత్రికలలో ముద్రితమైనవి.పంజాబీ అనువాదం లో ఆమె చేసిన కృషి గుర్తింపు పొందింది.ఆమె అనువాదం చేసిన Amrita and Imroz : In the times of Love and Longing పుస్తకం ఫుల్ సర్కిల్ ఢిల్లీ వారు ప్రచురించారు. ప్రముఖ పంజాబీ కవయిత్రి పాల్ కౌర్ కవిత్వాన్ని ఇటీవల The Wild Weed : Selected Poems పేర ఇంగ్లిషులోకి అనువదించి ప్రచురించారు. ఆమె తన కుటుంబంతో చండీఘర్ లో నివశిస్తున్నారు.
ఈ లఘురూప కవితలు ప్రముఖ ముద్రణా సంస్థ Red River ప్రచురించిన అర్విందర్ కౌర్ Fireflies in the Rubble ( March 2022 ) అను హైకు పుస్తకంలోనివి. చదివి ఆస్వాదించండి :
***
దిగంతంలో
ఒక చుక్కలా అయేదాకా
చూస్తూనే వున్నా..
నేను ఎక్కలేకపోయిన రైలుని
![]()
హృదయవిదారకమైన నొప్పి
తెలిసినట్లుగా
ఈ పికిలి పిట్ట
నా కిటికీ వద్ద
విచారంగా అరుస్తూ వుంది.
![]()
సముద్రతీరంలో సూర్యాస్తమయం
కలిసి పరికిస్తూ..
నీలో కొంత
నాలో కొంత
క్రమంగా మసకబారాయి.
![]()
నా చేతిలో నీ చేయేసి
ఎండమావుల గుండా
ఎడారి పయనం..
భ్రమలు నిలుపుకోవాలని
ప్రగాఢ కోరిక
![]()
వాన చినుకులు
కిటికీ మీద జారుతున్నాయి.
మనం ఎందుకు తరచుగా
కన్నీళ్ళను ఆపుకుంటామోనని
ఆశ్చర్యపోతాను.
![]()
అతను లేకుండా
ఒంటిగా వున్నాను.
మబ్బుల్లో ఏ ఆకారంలో వున్నాడో
ఏ నక్షత్రమై వున్నాడోనని
అబ్బురపడతాను.
![]()
అతను ఇచ్చిన గులాబీలు
ఇప్పుడు ఎండిపోయాయి.
కానీ అవి వుంచిన సొరుగులో
ఒక బాధావీచిక
అలాగే తాజాగా వుంది.
![]()
తుఫాను
నా గూడు చెదరగొట్టింది.
ప్రియ జీవితమా !
నేను పక్షిని కాదు కానీ
అలానే ఉండాలనుకుంటున్నాను.
![]()
ఒకరి ఊపిరి ఒకరికి
వినపడేంత నిశ్శబ్దంగా
వుంది గది.
ఎంత కృతజ్ఞతలో
కీచురాయి పాటకి
![]()
బీచ్ ఇసుకలో
కొన్ని జ్ఞాపకాల గింజలు..
ఇసుకగూడులు ఎందుకు మెరుస్తాయో
ఎవరికీ తెలియకపోతే
అది ఎలా ముఖ్యమవుతుందిక.
![]()
అల్జీమర్స్
ఆ రోజు అమ్మ
నా పేరు మర్చిపోయింది.
అయినా గానీ
ఆమె కౌగిలిలో వెచ్చదనం
![]()
మరణించిన తల్లిని
అతను కోల్పోయాడు.
నేను నా తల్లిని.
మాకు లాలిపాట పాడుతోంది
మృదు వర్షం.
![]()

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.
రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.




Discussion about this post